Jun 07 2013

||అ-అమ్మ.. ఆ- ఆవు ||

Published by at 11:11 AM under my social views

ఇరకతరకల ఈ లోకంలో..
తిన్నగా నడిచే ఓ మనిషిని కలిసాను.

ఆడంబరాల మేడలు అంబరాన్ని తాకాలని
పునాదుల్లో గోతులు తీసుకున్న మాట మరచి
రాత్రుళ్ళు బోర్లా పడే పిచ్చోళ్ళ రాజ్యంలో..నేనూ సభ్యుడినేనని..
విడమర్చి చెప్పిన మనిషిని..మొదటిసారి కలిసాను.

పుబ్బకో..పుష్కరానికో మంచానపడ్డా..
అది ఆత్మహత్యా యత్నమేనని..
రైతు తెలిసీ.. మనం తెలియక
పురుగుమందులు తిని-తాగే
పరలోకం పయనమవుతున్నామని..
రోగాలు పైకి కనిపించే కారణాలని
విడమర్చి చెప్పినందుకు..

కొంత ముందే తెలిసినా..
ఇంతకాలం నమ్మనందుకు
నాకు తెగ సిగ్గేసింది

కొబ్బరిబొండంలో స్ట్రా లేకుండా తాగలేని నేను..
పేపర్ ప్లేట్‌లో ప్రసాదం తినే నేను..
సంప్రదాయాన్ని పాటిస్తున్నానని..
ఇంతకాలం.. భుజాలెగరేసినవాడ్ని
పళ్ళు తోమాలన్నా, ఒళ్ళురుద్దాలన్నా..
నీళ్ళు తాగాలన్నా, ఊరంతా ఊరేగాలన్నా ..
విదేశీ మోజు భుజకీర్తులై మోస్తున్నవాడ్ని

కమీషన్ల చేతివిదిలింపులే నా వాళ్ళకుతప్ప
నా కష్టార్జితమంతా
పరాయిదేశాలకే వలసపోతుందని..
తొలకరి వాన తడిపిన మట్టివాసన
నిజాల గుట్టువిప్పితే..
దిక్కులన్నీ ఒక్కసారి నాపై పడ్డట్టైంది
నాలుగురోడ్ల కూడలిలో నుంచోబెట్టిన్నట్టుంది

తన తపోఫలమే ఖర్చులేని సేద్యమైనప్పుడు..
తన ఆలోచనే..రైతుల బలవంతపు చావులను ..
ఆపే ..మంత్రమైనప్పుడు..
తన మాట లక్షల మందికి ఆచరణీయం అవుతునప్పుడు
ఓమాట పంచుకోవాలనీ అతని బాట చూపించే వేలవ్వాలని
ఈ అక్షరాలు కవిత కాకపోవనీ,
మత్తెక్కించని మాటల మూటని
చిత్తుగా తాగిన వాడికి మజ్జిగ లెక్కన తీసుకువచ్చా..

ఈ రోజే కలిసాను.. ఆ సామాన్యుడ్ని
నీరుకావి ఖద్దరు బట్టల మనిషిని..
పెద్ద దేశాలను పోషించరాక
పేస్టు-సబ్బూ వాడని వాడ్ని..
కొండ కోతల వ్యవసాయం తల్లి గుండెకోతని తలచి..
చాయ్ నీళ్ళు ముట్టని వాడ్ని..

రైతుని బలవంతపు చావునుంచి
తప్పించాలన్న సంకల్పం..
అమ్మకు ఇంటిపనుల్లో సాయం చేసే బిడ్డలా
నేలతల్లి సారాన్ని కాపాడి పెమ్చాలన్న బాధ్యత ..అతడిది
ప్రకృతి పులకరించే ఆ పేరు సుభాష్ పాలేకర్

శాస్త్రవేత్తల ముక్కున వేసుకున్న వేళ్ళు
అలానే ఉన్నాయి.. వందల్లో
ఒట్టిపోయినదైనా..ఒక్క దేశీ ఆవు వెంటుంటే..

౩౦ ఎకరాల పంట
పెట్టుబడి లేకుండానే పండించొచ్చన్న మాట..
అడవితల్లిని తడిమి చీడల్లేని పెంపకాన్ని
కొనకుండానే పంటలకు పంచాడంటే..
’పిచ్చాడు’ అనుకునేరు.. అన్నల్లారా!..అక్కల్లారా!!
40 లక్షల రైతులు పక్కరాష్ట్రాల్లో పక్కాగా నమ్మారు

ఆధునిక వ్యవసాయం అప్పులతో నలిపేస్తుంటే..
అసలు కారణాలను స్పృశించిన
మూలకణం ఇతడు..
చుక్కల్లో ఉన్న సాగుని చంకనెత్తుకుని ఆడిస్తున్నాడు.

బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు..
జీవామృత మిశ్రమాన్ని ఎరవేసి
వానపాముల్ని రప్పిస్తాడు..
ఈ కర్షకమిత్రుని రైతుమిత్ర ఆకర్షక మంత్రం..
గో మూత్రం తో సుద్ధి చేసిన దేశవాళి విత్తనం
ఇది పరిశోధనల్లో నిగ్గుతేలిన
కామధేనువు సహజాతం..

నమ్ము.. మిత్రమా ఈ మాట..
నిప్పులేని ఆలోచనలలో ఉన్నవాడి కంటికి
ఎండుటాకు ఎప్పటికీ మండదు.
పెట్టుబడి లేని వ్యవసాయం చేసేవాడి
పొయ్యి తప్ప చెయ్యి కాలదెన్నడూ..

తెలుసుకో !! తెలియజెప్పు నలుగురికీ..
ఈ పద్దతి భూసారం పెంచేదేకాదు..
ఎలా బతకాలో చెప్పే జీవనసారం..

ఇల్లు గుల్లవ్వడం నేల గుల్లవ్వడం..
ఒక్కటి కాదు నేస్తమా!!

బతుకు డొల్లవ్వడానికీ,
మొక్క మొలవడానికీ తేడా ఉంది.
అ ఆ లతో మళ్ళా మొదలెడదాం..
బ్రతికిస్తున్న దైవాలకు దణ్ణంతో మొదలుపెడదాం..

అ అమ్మ.. ఆ .. ఆవు..

(ప్రకృతి సేద్య పాలికాపు.. పాలేకరు కు పాదాభివందనాలతో..)

RTS Perm Link

One response so far

One Response to “||అ-అమ్మ.. ఆ- ఆవు ||”

  1. vijayabhaskaron 10 Jun 2013 at 6:29 PM

    ఆయన చేసేది ప్రకృతి సేద్యం…మీరు చేస్తున్నది అక్షరసేద్యం……నిజంగా ప్రేమించే మిత్రుడు ప్రతీక్షణం మాట్లాడకపోవచ్చు…కాని ప్రతీరోజు మీ శ్రేయస్సు, అభివృద్ధి గురించే ఆలోచిస్తాడు…అమ్మ చేసి తినిపించే కమ్మటి వంటలాగా…మీ ఆలోచన యజ్ఞం సాగాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa