Apr 18 2013

|| నెలకోసారి నేను తప్పుచేస్తాను.. ||

అది జీతాలరోజు కాదు..
మందో మగువో నాకు అలవాటు కాలేదు
చిల్లర తడమలేక చాయ్ నీళ్ళు వద్దనుకునే నాకు..
ఆన్ లైన్ పేమెంట్ల చిట్టాలో పై రెండూ లేవు
సాకులు కుంటుకుంటూ ఆడే తప్పుని
నెలకోసారి మాత్రం తప్పకుండా చేస్తాను..

ధర్మరాజు నడిగి ఒక అబద్ధాన్ని ఆ రోజుకి అప్పుతెస్తాను
నాలో చావని శ్రోత అశ్వథ్థామై ఒక్కసాయంత్రమైనా జీవించాలని
నేనెక్కడని ప్రశ్నించే ఫోను కాల్ కు మీటింగులో హతః అని ..
కుంజరః ఏమిటంటే.. సభ కవిత్వానిదని..

రెండో శనివారం..
ఇంటికెళ్లకుండా దారి తప్పుతాను..
నా కార్యాలయానికి వర్షపాత సూచనలందకుండా ;
భార్యాలయాన్ని డబ్బింగ్ సీరియళ్ళ విధ్వంసంలో వదిలేసి
ఎల్లలు లేని ఇంటిని రెండు గంటలైనా అంటిపెట్టుకోవాలన్న కాంక్ష
ఇల్లుచేరడాన్ని ఆరోజుకి రెండుగంటలు దూరం చేస్తున్నా..
కర్కోటకుడిలా బంజారాహిల్స్ బస్సెక్కుతాను

తప్పొప్పుల కుదుపులలో ముందుకురకలేక, వెనక్కు మరలలేక మనసు
ట్రాఫిక్ జాముల్లో అంగుళ మంగుళం జరుగుతూనేఉంటుంది
మరచిన పని ఒకటి ఆలోచనల లైన్లోనికి వచ్చి.. గుర్తుకొచ్చి..
ఎండతో పాటు నన్ను చిటపటలాడిస్తుంది.

అయినా.. కెరీర్ గ్రాఫ్ సిటీబస్సుతో పోటీపడుతున్నప్పుడు
నా జీవితానికీ, జీతానికీ కొత్తగా వచ్చిన ముప్పేముంది!!
ఇలా అంటున్నానని నిరాశలో నిజాలను చూడలేననుకోకు..
జి.వి.కె మాల్ సౌధం కన్నా..లామకానే నాకు ఎక్కువ ఎత్తులో కనిపిస్తుంది.
వీలైనంత త్వరగా సిగ్నలన్నీ దాటేస్తే.. గుర్రమెక్కినట్టే అనిపిస్తుంది

తీరా తీరం చేరేలోగా
గుమ్మం బయటే.. ఏ గాలి తోనో కొట్టుకుపోతా..
కాశీ నుంచి పిలుపొస్తుంది..కాలం సమీపించిందని

గాలిపోసుకున్నాక గుమ్మం బయటే కాసేపు ఊసులు
పలకరింతలే కొత్త ..మేమంతా ఒకరికొకరం పాత చుట్టాలమే..
కవిత్వ దేవత మాకేమవుతుందో..
ఎవరో షరాబుతో వాదం పెదవుల వంపుల్లోంచి వలికిపోతుంది..
చివరకి మామధ్య సామ్యవాదం మిగిలిపోతుంది
ఎగరేసిన తెల్లకాగితంలా నేను లామకాన్ లోపల వాలతాను

మనుషుల మధ్య నిశ్శబ్దాల అస్థిత్వాన్ని పలకరింపులు ప్రశ్నించినప్పుడు
రాతలకు రూపం వచ్చినట్టు .. పులకరింతలు నా ఎదపై సంతకాలవుతాయి
తరాల మధ్య అంతరాల్ని తొలగించే వేదిక మీద ఓ బుల్బుల్ కూతకూస్తుంది
అంతరంగపు లోతుల్ని నింపడానికి గాలీబ్, మీర్, సౌదా, ఖుస్రూ, దాగ్ లు
రూపం మార్చుకుని వేదికనెక్కుతారు, నేను ఆకాసేపూ బేదర్ద్ నవుతాను

ఓ సూఫీ పాట మాటతో వేడుక మొదలౌతుంది
లామకాన్ నాపాలిట పానశాల అవుతుంది.
కాలంమారి హుక్కా స్థానాన్ని మైకు ఆక్రమించినా
కవిత్వం కైపెక్కించడం ఎన్నడూ ఆగలేదు.

కవి ఎవరైతేనేం!.. కవిత్వమొక్కటే నన్ను హత్తుకుంటుంది
అలౌకికానందాన్ని ఏకాంతంగా అనుభవించడంలో..
ఆ నెలకు సరిపడా తప్పు నాతో జరిగిపోతుంది..
నాలో చావని శ్రోత అశ్వథ్థామై మరో సాయంత్రం జీవించాలని
కేలండరు రెండో శనివారాన్ని ముందుకు దోస్తుంది.
నేను.. ముందస్తు మత్తులో తేలిపోతాను
ఇంటి కోకిల హేంగోవర్ లో మునిగిపోతుంది.

కలిసి జీవించడం అలవాటు అయ్యాకా..
తప్పుతుందా..నాతో.. కవిత్వానికైనా.. అర్థాంగికైనా

==18.4.2013==

RTS Perm Link

2 responses so far

2 Responses to “|| నెలకోసారి నేను తప్పుచేస్తాను.. ||”

 1. nagasai suri paravasthuon 15 May 2013 at 12:17 AM

  నీ కవితను చదవను నేను….

  ఇష్టం లేక కాదు…. ఆలోచించలేక….
  అర్థం కాక కాదు… ఆచరించలేక….
  మనసు లేక కాదు… మరిచి పోలేక…
  విషయం లేక కాదు… వ్యధను భరించలేక…

  నీ కవితను చదవను నేను…

  అందులో వేలాది విమర్శలు….
  ప్రతి ఒక్కటీ నన్నే ప్రశ్నిస్తుంటాయ్…
  సమాధానాలు ఎక్కడ వెతకను…
  ఎంత వరకూ వెతకను….

  నీ కవితను చదవను నేను…

  అవి నన్ను నగ్నంగా నిలబెడతాయి…
  సిగ్గుతో చచ్చిపోతున్నాను…
  ఆచ్ఛాదన లేక అల్లాడి పోతున్నాను…
  నిలువునా దహించుకుపోతున్నాను….

  నీ కవితను చదవను నేను…

  నా కళ్ళన్నీ అటే వెతుకుతున్నా….
  నా మనసంతా అటే కదులుతున్నా…
  నా ఆలోచనలు అటే మెదులుతున్నా…
  నా భావాలు అక్కడే సంచరిస్తున్నా….

  నీ కవితను చదవను నేను….

 2. sateeshon 22 Jun 2013 at 10:02 AM

  https://www.facebook.com/yasaswisateesh/posts/10200914774693947
  to hear the poem..

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa