Apr 05 2013

విజిగీషువై వస్తాడొకడు.. ఈ లోకానికి.

విజిగీషువై వస్తాడొకడు..
ఈ లోకానికి..

ఏడ్చి గెలిచే పాపడిలా..
ఆక్రందనో, ఆలాపనో
అవసరమనే చెబుతాడు
నేరుగా వచ్చినోడు.. అబద్దమెలా ఆడతాడు!!

మూగ జీవాలూ బాసలు చేస్తాయి
బుక్కమెత్తి తలాడిస్తాయి
మనిషన్నవాడు పసివాడికి పశువుకీ మధ్యే ఊగుతుంటాడు
వాడి పరిధిని ఈ లోకం దాటిపోదు..

ద్రావకంలాంటి లోకాన్ని
రకరకాల పాత్రల్లోకి ఒంపుకుంటాడు
అందుకే..అలసినవేళ ఉగ్గుపాల పాటౌతాడు
కథల్లో జంతువై, మనుషులకు నీతి చెబుతాడు

నేర్చేవేళ పద్యమో పాఠమో అవుతాడు
భుజం కాస్తాడు.. తడతాడు.. తిడతాడు

గుసగుసల వయసుల్లో కూనిరాగమౌతాడు
పలుగోపారోఎత్తినప్పుడు .. చెలియో.. చెల్లకో.. పద్య మౌతాడు
కుప్పనూర్పేటప్పుడు .. కూనలమ్మ పదాలౌతాడు
కదం తొక్కేటప్పుడు ..జెండాపాటై రెపరెపలాడతాడు

లోకం పొడారినప్పుడు
హృదయాకాశాన్ని కవిత్వం తడిపెయ్యాలంటాడు
కళ్ళు చెమిరిస్తే .. నిరాశని తుడిచెయ్యాలంటాడు
వీడి కోరికల చిట్టా అనంతం

కడుపు కాలినోడికి బువ్వ అవ్వాలి..
చిందిన చమట చుక్క నేల చిందేలోగా
అంబలో చల్లనో వాడి నోటికి అందివ్వాలని…

మనిషి బతుకే ఘాటైనప్పుడు
నంజుడు జీవితాన చద్దన్నమవ్వాలి..
తాటి ముంజవ్వాలి..కొబ్బరిగుంజవ్వాలి అని…

ఒకరికొకరం ఎదురైనప్పుడు
కలయిక కౌగిలవ్వాలి..
ఈ లోకం తన లోగిలవ్వాలి…
మనుషుల్ని గెలవాలి, మనసుల్లో నిలవాలి.. అనీ..

ఇలా ఎన్నెన్నో కోరికల మధ్య
కొన్ని తీరకపోయినా..
ఏడుస్తూనే వస్తాడు పిల్లడిలా

గెలిచీ ఏడుస్తాడు వస్తాదులా
ఎవడోడినా బాధ వీడిదన్నట్టు..
చీకట్లపై వెలుగులు చిమ్మే టట్టు
విజిగీషువై వస్తాడు కవి ఈ లోకానికి

|| విజిగీషువు: He is desirous of Victory ||
==5.4.2013==

RTS Perm Link

One response so far

One Response to “విజిగీషువై వస్తాడొకడు.. ఈ లోకానికి.”

  1. కనిష్టon 06 Apr 2013 at 1:41 PM

    ఏడ్చి గెలిచేది చిన్న పాపడు
    పాపని గెలిచి ఏడ్చేది పెద్ద పాపడు
    చిన్నప్పుడు జీవితం మసాలాపాపడు
    పెద్దయ్యాక జీవితం పాడుపడు

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa