Mar 29 2013

||ఉదాత్తం నాకు కవిత్వం||

రాళ్ళు ఏరుతుంది అమ్మ బియ్యంలో మౌనంగానే..
అన్నం వండటం ఒక పవిత్ర కార్యం

పనిచేస్తాడు నాన్న ఇల్లుగడవాలని
సాలీడు శ్రధ్ధతో గూడుకడుతున్నట్టు.

సూదిమందు గుచ్చుతుంది నర్సమ్మ
రోగం నయమవ్వాలని అందరి ప్రార్థన

నేర్చేటప్పుడు పంతులుగారు ధ్యానంలోనే ఉంటారు

అదే అమ్మ ఇంటి శుభ్రంలో బల్లుల్ని తరుముతుంది
తప్పుచేసిన పిల్లలపై ఉరుముతుంది.

అదే నాన్న విసిగిస్తే కసురుతాడు,
చెయ్యీ విసురుతాడు

కుట్లేసే వేళ డాక్టరు మత్తిచ్చి మగతలోకి నెడతాడు
మాత్ర మింగకపోతే మరి కోప్పడడూ!!..

పాఠం చెప్పేటందుకు గొంతెత్తి వినిపిస్తారు మాస్టారు
విసిగిస్తే ఆకతాయికి ఒకటో రెండో అంటిస్తారు

ఎంత పనికి అంత బలమే చూపిస్తారెవరైనా..
మరి నువ్వేంటీ!..
కవిత్వం పేరు చెప్పి ఏమైనా చేస్తానంటావ్
ఉత్తర కుమారుని వేషం వేస్తావ్..

చీత్కారాలూ, దూషణలూ nostalgia నా నీకు!!
నాకంటే పెద్దే కావచ్చు అన్నిటా.. నువ్వు..
తమ్ముడ్ని చేరదీసినట్టు చెప్పరాదూ..

పక్కింటోడ్నే తిట్టచ్చు నువ్వు, మనసు నలిగి..
కడుపు మండే తిట్లెందుకు.. నీ నోరూ పాడవదూ!!

కవిత్వం నీకు తల్లే కాదనను
నాకో, మరెవరికో రంకంటగట్టడం
ఏపాటి మానవీయత!!

రగిలిపోయి కవిత్వం రాస్తున్నావా..
ఎవరి అమ్మను అపహాస్యం చేస్తున్నావు!!

హత్తుకునే మెత్తని మనసు నీకు లేనప్పుడు
కవిత్వం పసిపాపను కలనైనా తాకకు

కోయడం నీ అవసరమైనప్పుడు అది
ప్రసవానికో, రసాస్వాదనకో అన్నట్లుండాలి
కసాయి కత్తులతో తుత్తునియలు చేయకు

రత్యానంతరానుభూతి నీకు తప్పనిసరి ఐనప్పుడు
అది శృంగార పరమావధిగాసాగాలి..
మరోలా ఉండకూడదని మాటల్లో చెప్పాలా..

నీకు తెలియనిది కాదు మిత్రమా..!
మేడిపండులోనికి కవిత్వాన్ని చొప్పించకు
ప్రియతమా..ఆస్వాదనకు దూరమైపోతాం

==29.3.2013==

RTS Perm Link

2 responses so far

2 Responses to “||ఉదాత్తం నాకు కవిత్వం||”

 1. కనిష్టon 29 Mar 2013 at 5:35 PM

  ఎన్నో వసంతాలు గడిచిపోయాయి
  ఎన్నో నవరాత్రులు ముగిసిపోయాయి
  అయినా ఏదో ఆశ…
  గడిచిన కష్టాల్లా రాబోయే సుఖాలు ఆనందమయమే అని…
  ఆ ఆనందమే మనిషిని నిలబెట్టేది…
  ప్రాణం ఆశ… నిరాశే మరణం…
  ఇదే జీవితం….

 2. మద్దిరాల శ్రీనివాసులుon 03 Apr 2013 at 5:23 AM

  కష్టమన్నదెపుడు కనిపించకుండగా
  సుఖము వెనుక దాగి సూక్ష్మముగను
  యిమిడియుండుననుచు కమనీయమగు రీతి
  కవిత యద్భుతముగ గానవచ్చె

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa