Archive for June, 2019

Jun 19 2019

యశస్వి|| గుడి దీర్ఘం||

Published by under my social views

గాలిలో ఉన్న తలకట్టుతో వంకర తిరిగిన కుంటి అక్షరం ఒకటి 
తనవర్గం కన్నా ముందు అక్షరానికి దీర్ఘమిచ్చి జతకట్టి..
దాని ముందు వర్గం చివరి అక్షరాన్ని ముచ్చటగా పక్కన పెట్టుకుంది

విశ్వం త్వకారం పురుషం అనుకునేకదా
నాలుగో ది పూర్ణంతో చేరి సమానత్వం ఐంది!

ఎక్కడా గుడి లేకుండా..
..

సమానత్వమెలా పుట్టింది

ఎప్పుడో తప్పు జరిగింది
గుడి లేకుండా సమానత్వం ఎక్కడ!
..
..

దేవుడి జెండర్ ఏమిటో తేలాలిక.
=5.1.19=

RTS Perm Link

No responses yet

Jun 19 2019

||Parkinson’s Fallacy||

Published by under my social views

నేను నీ తీరంలోనే ఉన్నా, పడుతూ లేస్తూ
మరణానికి రుణానికి ఊగిసలాడుతూ 
నిన్ను నా అవసరాలకి కలవరిస్తున్నా 
నడుస్తూ అదుపుతప్పిపోతున్నా వయసులోలానే

నిన్నుతన్నిన రోజుల్లానే ఎన్నోసారి పడ్డానో గుర్తులేదు, 
అడుగేస్తే తేలిపోతుంది, నడుంలేవనంటోంది
కోతిలా మారింది నారూపు, చొంగకారిపోతుంది
నువ్వు నాకు చేసే సేవ బదులుగా మిగిలిపోతుంది

నా చేతిలోకి నిన్ను తీసుకున్నప్పుడు, 
నీ కన్నీటి తడి
ఇప్పుడు నీ చేతిలో నేనున్నా.. పొడారి
నీ ఆశల సువాసనలు ఎండిపోయి
నా గుమ్మానికి ప్లాస్టిక్ దండలా ఉండిపోయాయి

అప్పుడు నీ జీవితం నుంచి జారిపోయాను, 
ఇప్పుడు నా జీవితం లోంచి

నేనో మంత్రగాడిని, క్రూరుడ్ని 
నీ ఊరును మాయంచేశాను, 
నీ మనసుకు గాయం చేశాను
నేను కట్రాడ్ని నా పంచ నిను కట్టిన బందెలదొడ్డి

నువ్వు నువ్వుగా బతికి యాభై ఏళ్ళు
నీ కాలిడడుగన నేను వేసిన ముళ్ళు
మారిన ఊళ్ళూ, ఇళ్ళు
కలలు కాలిన ఆనవాళ్ళు

ఒకప్పుడు అడిగావు,, చచ్చేవరకూ తిరుగుళ్ళు ఇంతేనాని.. 
తెలియలేదు ఇలాంటి రోజు ఉంటుందని
అవునన్నాను, ఆ రోజే పోయాను కదా నేను, 
ఇప్పుడు నా శవానికి సేవలు చేస్తున్నావు

ఎక్కడో దొర్లి వచ్చిన గుడ్డలు ఉతికేటప్పుడు
నువ్వో ఏడుపుపాట నాకు, 
నీ గొంతు ఎప్పుడూ వినబడలేదు

ఇప్పుడిలా మలమూత్రాలు ఎత్తిపోస్తున్నప్పుడూ
ప్రాణం ఇంకాపోలేదుగానీ, 
నేనింకా ఎక్కడ బ్రతికున్నాను!

వయసు కావరాన్ని కాలంతీర్చేసింది
నీ కాళ్ళుపట్టుకుందామనుకుంటున్నా
ఇదిగో పడిపోతున్నా,

నీ ముందు ఎప్పుడూ వంగలేదు, 
ఇప్పుడు వంగలేను..

నాకు తగిలే దెబ్బలకు ఏడుపు ఆగదు
ఎప్పట్లానే నువ్వేదో చెబుతున్నావు
ఇప్పటికీ వినడం నాకు చేతకాలేదు

ఇది నరకమే అయినా నయం
నాలాంటోడికి పెళ్ళాంగా మాత్రం పుట్టలేను

=9.1.19=
=అమ్మలకు దణ్ణం=

RTS Perm Link

No responses yet

Jun 19 2019

యశస్వి||నవమి కబుర్లు||

Published by under my social views

కిక్కిరిసిన నెలవారీ కూలీల బస్
చలువగదుల అడ్డాలకి తరలుతుంది
లంచ్ బాక్సుల్ని ఆగి ఆగి ఎక్కించుకుంటూ
పండగలకి సెలవుల్లేవు

కార్బైడ్ గోదాంల ముందు వరుసల్లో రైతు ఆశలబళ్ళు
ఎండుగడ్డిలోకి తరలిపోతున్నాయి
నోటితీపి ఎన్ని జేబులకి చిల్లుపెడుతుందో
తిన్నా ఆరోగ్యం సున్నా

టిఫిన్ బళ్ళ ముందు సాగిలపడుతున్న 
బ్యాచిలర్ బతుకులు చిల్లర లెక్కపెట్టుకుంటూ
ఎండన పడ్డాక ఏ సెంటర్ ఇరానీ చాయ్ బన్ను ప్రాప్తో
ఏరోజుకారోజే బాజా

రంగుబట్టల్లో బడికెళ్తున్న పిల్లకాయలు 
పరీక్షలు ఐపోయినా కస్టడీ లో ఉన్న ముద్దాయిలు
రెండో పూటకి జామీను దొరికితే బంతిని చితక్కొట్టాలని బ్యాటు
బాల్యం అంటే ఉచితం కాదు నిర్బంధమే

రామదండులు కానరాక దిగాలైన తాతల ఊళ్ళు
పీజా బర్గర్ రోజుల్లో వన్ డే ఆఫర్- వడపప్పు పానకాలు
ఒంటి మిట్టలో బ్రాంచి ఆఫీస్ ఓపెన్ చేసిన భద్రాద్రి రాముడు్
ఈ రోజు పెళ్ళి హెడ్డాఫీసులోనే

=12.4.19=

RTS Perm Link

No responses yet

Jun 19 2019

||ఏడాదికీ.. అన్న||

Published by under my social views

యశస్వి…

కట్టా శ్రీనివాసు ఏమైనా చుట్టమా? నేస్తం… అంటే – కేవలం ఇష్టమేనా? అంటే.. ఏమో! అంతకు మించి ఎంతంటే ఏం చెప్పగలను!

కవిత్వాన్ని తల్లి లీలావతి అనుకునే లెక్క లేని పద్యం సోదరుడు, 
అమ్మ గిరిజావతి వల్లె వేయించిన పాదాల్ని పట్టుకుని ఇంతదూరం నడిచొచ్చి కవిసంగమంలోనే కలిసాను, సూఫీఘర్ ములాకాత్ లు మావి. సారమున్న మనిషి తనం తనది..

బంధుత్వాలు లేకున్నా సోదరుడు అనుకోవడం వెనుక క్విడ్ ప్రోకో ఏం లేదు, నిండుగా నవ్వేందుకు, తనివిదీరా ఏడ్చేందుకు. 
నేను ఏడుపును మాటల్లో పెడతా, తను నవ్వేసి నను తేలిక చేస్తాడు.

“నువ్వూ, నేను ఏకవచనమై దూరంగా వున్నా, మనమనేది నిజమే ననే దీపపు వెలుగుల ఓ చిర్నవ్వునివ్వు.. తన పద్యాన్నే అప్పజెప్పాను ఓనాడు అలాగే సోదరా అంటూ. .. నవ్వేశాడు. 
అప్పుడు కట్టుకున్న రాఖీ రోజు రోజుకీ ముడి బిగిసింది గానీ వదులు కాలేదు.

గుద్దులకు రోడెక్కుతారుగానీ, ముద్దులకు మదగ అవసరం కదా. ఎంత ఇష్టమైనా ఇలా ఓ మాట చెప్పుకోవడానికి ఈ రోజు కొత్తసంవత్సరం తెర ఎత్తాక గానీ కుదరలేదు. అందునా నాకన్నా ముందే ఏడాదికి అన్న,…

జనవరి ఒకటో తారీకునే..! ఈ పండగనాడే పుట్టేశాడు. పండుగంటేనే తలచుకునే ఒక సందర్భం, దేవుడ్నీ సంతోషాన్ని. ఇదిగో ఇలాంటోడ్ని, లేదా పాపం తగిలి లావైపోనూ!

కంట్రోల్‍ – వీ మాటల్లో చెప్తున్నాననే అనుకోండి, కొత్తదనం కోసం ఐ లవ్ యూ ని మార్చి చెప్పలేం, మనసు వెచ్చదనం కోసం హత్తుకోవడానికి ప్రత్యామ్నాయాలు నియమాలు ఒప్పుకోవు. కవితాకేళి లేకపోతే విడివిడిగా ఎగురుతున్న ఇద్దరి మధ్య దారపు బంధం కనిపించదు ఎవరికీ.

ఎన్నింటికి రుణపడిపోవాలో ఈ వేదికకి! అన్న యాకూబ్ కీ. బంధాలనూ, స్నేహాన్ని, వృత్తిని భాద్యతగా కాకుండా ప్రాణంగా చూసుకునేవాళ్ళెవరు కనిపించినా అదికూడా అమ్మే అనిపిస్తుంది అంటాడు ఈ నాన్నపేగు.

అనుక్షణం అండగా ఉండడం, ఆలోచనలో తోడుండడం, తన జ్ఞాపకం తడిగా ఉండడం ఎక్కడ ఉన్నా నా నీడని పలుకరించే వెలుగుతోడు నీ అంతర్లోచన వాక్యాలు. మనుషులర్ధం కావాలంటే లోపటి లోకాల ఊసులు తెలియాలి. గుండె లోపలికి ప్రేమను ఒంపుకుని చాపే చేతులతో హృదయాల్ని అందుకోవాలి. అది నీకు తెలిసిన విద్య కట్టన్నా. అందుకే నువ్వు చానా ఇష్టం.

నీరోజును నువ్వు నీలానే గడిపేస్తుండేటప్పుడు, లోకం మొత్తం ఆనందంగా ఉండడానికి ఆరాటపడుతున్న ఘడియల్లో ఈ తాటాకు చప్పుళ్లెందుకు అంటావా.. అది నా ఇష్టం.

నిలిచిపోయిన మురికినీళ్ళ సాగరం మధ్యలో కవిగా నా బొమ్మ ఉండటం కంటే, పరుగులెత్తే లక్షల కళ్ళ వాకిళ్ళున్నమెట్రో ప్రవాహపు గోడలపై నావి నాలుగక్షరాలు అంటిస్తే సంతోషపడతాను. ఇదేమాట నువ్వు కాకుండా ఇంకెవ్వడన్నా అనుంటే ఈ పాటికి ఓ విగ్రహం నిలబెట్టి దానికి ముందు అభ్యుదయం పేరెట్టి.. కింద ఈ మాటల్ని చెక్కిపెట్టేవారు. లేదా ఆ మెట్రో పిల్లరుకే గ్లోసైన్ బొర్డు వేలాడదీసేవారు. సదరు పేరు మీద ఓ అవార్డు కూడా పెట్టుండెవారేమో!

మామిళ్ళపల్లి వారి పందిరికింద పూసిన నీ సుమమే అమృత లతై 
గగనానికి తొంగిచూస్తున్నప్పుడు ఏ కొలతకు దొరుకుతావు నువ్వు! కౌగిలింతకు తప్ప.. అందుకే ఈ బంధనం.

నా పేరు పలికితే రుచి ఏం తెలుస్తుంది! కళ్ళారా అనుభవించు.. నా పిలుపును ఏడాదంతా.. ఎడదంతా.

వీలైతే నాలాంటోడ్ని జీవితాంతం. ఇలానే.

Katta Srinivas 
=01.01.19=

RTS Perm Link

No responses yet

Jun 19 2019

|| కవి వాక్కు ||- ఖలిల్ జిబ్రాన్

Published by under my social views

1.
దాతృత్వ మహిమ నా హృదయాంతరాళాన విత్తుకుంది. ధాన్యాన్ని రాసులుగా పోగేసి అన్నార్తులకు అందిస్తాను.
నా ఆత్మ ద్రాక్షతీగెకు జీవాన్నిచ్చింది, దాని గుత్తులను చిదిమి దాహార్తిలకు అందిస్తాను.

నాదీపాన్నిఆకాశం నూనెతో నింపింది. బాటసారికి వెలుగునివ్వాలని నేను దానిని కిటికీలో ఉంచాను
నేను వారిలో జీవిస్తున్నందునే ఇవన్నీ చేస్తున్నాను; విధి నా చేతుల్ని కట్టివేసి నిరోధిస్తే, మరణమే నేనాశించేది.

నేను కవిని; ఇవ్వలేని పక్షాన పొందడాన్ని నిరాకరిస్తాను

**

మానవత్వం ఓ గాలివాన నేను మౌనంగా నిట్టూరుస్తాను, నా నిట్టూర్పు దేవుని చేరేలోగా తుపాను తెరదించాల్సిందే.

ప్రాపంచిక విషయాలేక్ మనుషులు వేలాడతారు, నేను ప్రేమకాంతిని పొందాలనుకుంటాను; 
అది తన జ్వాలతో నన్ను పునీతుడ్ని చేసి, 
నా లోపలి అమానవీయతను దగ్ధం చేస్తుంది

గణనీయమైనవిషయాలన్నీ మనిషికి నొప్పి తెలియకుండా అంతం చేస్తాయి. నెప్పుల్ని రంజింపజేసి ప్రేమ అతడ్ని జాగృతం చేస్తుంది.

**

మానవులు వేర్వేరు వంశాలుగా తెగలుగా విభజించబడి, దేశాలు పట్టణాలకు చెందిన వారయ్యారు. 
నేను ఏవర్గానికీ, ప్రాంతా నికీ, చెందనివాడ్ని. ఈ విశ్వమే నా దేశం, మానవతే నా తెగ

మనుషులు దుర్బలులు, 
అయ్యో! వారిలో వారు విభజించుకుంటున్నారు, 
ఈ లోకం ఇరుకైనది, 
రాజ్యాలు, పరగణాలు దేశాలు గా విడగొట్టుకోవడం తెలివితక్కువదనం

ఆత్మ దేవాలయాలు నాశనం చేయడానికి మనుషులు కలిసి ఉంటున్నారు. 
ప్రాపంచిక జీవితం కోసమే మహా ప్రాసాదాలు నిర్మించుకుంటున్నారు. 
నాఆత్మ ఆశల్ని వినాలని ఒంటరిగా నిలుచుంటాను. ప్రేమ మనిషిని బాధతో రంజింపజేస్తుంది.. అనుకుంటాను.

అజ్ఞానమే నాకు జ్ఞానమార్గాన్ని బోధిస్తుంది. బాధ, అజ్ఞానం గొప్ప ఆనందాన్ని, జ్ఞానాన్ని కలుగచేస్తాయి. 
పరంధాముడు పనికిరానిదానెనెపుడూ సృష్టించలేదు.

2

నా దేశం పట్ల ఆపేక్ష ఉంది, అది దురవస్థలో ఉన్నందున నా ప్రజలపట్ల వాత్సల్యం ఉంది.

నా ప్రజలు కొల్లగొట్టే సొమ్ముతో ఉత్తేజితులై దేశభక్తి తత్వంతో ప్రేరణపొంది పరాయి దేశం పై దండెత్తి హంతకులైననాడు వారు చేసే అకృత్యాలకు 
దేశాన్ని, ప్రజలనూ తప్పక ఏవగించుకుంటాను

నా మాతృభూమి కీర్తిగానం చేస్తాను, 
నా పిల్లల నివాసాన్ని చూడ ఉవ్విళ్ళూరతాను. 
కానీ ఆ ఇంటిలోనివారు బాటసారికి ఆశ్రయం, అన్నపానీయాలు అందించకపోతే, నా కీర్తనను కోపంగానూ, నా కాంక్షను ఉపేక్షగానూ మార్చుకుంటాను

’అవసరాలకు ఓదార్పు ఇవ్వని ఇల్లు ధ్వంసమై చెడిపోవడానికైనా అర్హమ”ని నా అంతరాత్మ ప్రబోధం

**

నా సొంత ఊరిని ప్రేమిస్తాను, అందులో దేశానికి భాగం ఉంది.
నా దేశాన్ని ప్రేమిస్తాను అందులో కొంత ఈ భూమి కీ చెందుతుంది. ఇవన్నీ నా దేశభాగాలే;

నేను ఈ భూమిని ప్రేమిస్తుంటే 
వీటన్నింటినీ అనే. 
ఈ నేల మానవతకు స్వర్గధామం. 
పరమాత్మకు ప్రతిరూపం.

**

మానవత ఈలోకాన పరమోన్నతమైనది, శిధిలాల నడుమ నిలబడి చీలికపీలికల వెనుక
తన నగ్నత్వాన్ని కప్పుకుంటూ 
వడలిన చెంపల మీదుగా కన్నీరు కారుస్తూ, దయనీయంగా తన బిడ్దల్ని పిలుస్తుంటే..

పిల్లలు తమ వంశగీతాన్ని ఆలపిస్తూ పరాకుగా కత్తులు పదను పెట్టుకుంటూ తల్లి రోదనను గమనించడం లేదు

మానవత ఈ మనుషుల విన్నపమే కానీ 
ఎవరూ వినడం లేదు ; ఎవరన్నా విని, తల్లి కన్నీరు తుడుద్దామనుకున్నా, వాడు దుర్బలుడని, సంవేదనాపరుడని మనలో మరొకరంటారు

మానవత ఈలోకాన పరమోన్నతమైనది, 
ఆ ఉన్నతి ప్రేమను, మంచితనాన్ని ప్రబోధిస్తుంది జనులు ఆ బోధనలను పరిహసిస్తారు.

క్రీస్తు ఆ మాటలు విని శిలువనెక్కాడు; సోక్రటిస్ మరణం బారిన పడ్డాడు 
క్రీస్తు, సోక్రటిస్ అనుయాయులు దైవారాధకులు. దైవానుయాయులను వారు చంపలేరనే వీరు హేళనగా ‘ 
చంపడం కన్నా చిన్నచూపే చేదైనది’ అని అనుకున్నారు,

జెరూసెలం దైవకుమారుడ్ని, ఏథెన్సు సోక్రటిస్ నూ చంపలేకపోయింది వారింకా అలౌకింగా జీవించే ఉన్నారు 
దైవ అనుయాయులను ఎవ్వరూ చిన్నచూపు చూడలేరు.
వారు నిరంతరం జీవిస్తూ ఎదుగుతారు

3

నువ్వు మనిషి కాబట్టే నా సోదరుడవు, మనం పరమాత్మ బిడ్డలం, ఇద్దరం ఈ మట్టినుంచి పుట్టిన సమ ఉజ్జీలం

రహస్య సత్యాలను అర్థం చేసుకోవడం లో జీవితమార్గమంతా నా తోడుండే సహచరుడివి నువ్వు.

నువ్వు మనిషన్నది వాస్తవం, అదే నా సంతృప్తి.
సహోదరుడిగా నిన్ను ఇష్టపడతాను 
నా గురించి నువ్వేమన్నా మాట్లాడవచ్చు 
రేపన్నది మనల్ని వేరు చెయ్యవచ్చు 
అప్పుడు నీ మాటల్ని విధాత తన తీర్పుకు సాక్ష్యాలుగా అంగీకరిస్తాడు, 
నీకు న్యాయం జరుగుతుంది.

నా లాలసకు నువ్వు నన్ను వంచించవచ్చు. 
నా సంపద నిన్ను తృప్తి పరచగలిగితే నీ హక్కుగా అనుభవించవచ్చు. 
నస్నేమి చెయ్యాలనుకుంటున్నావో అది చేయి,
నా సత్యాన్ని మాత్రం తాకలేవు.
నా రక్తాన్ని చిందించగలవు, దేహాన్ని దగ్ధం చేయగలవు, నా ఆత్మ చైతన్యాన్ని గాయపరచలేవు

నన్ను సంకెళ్ళు తొడిగి చీకటి కుహరం లో బంధించగలవు, 
నా అలోచనలను వశపరచుకోలేవు.-
అవి విశాలగగనంలో స్వేచ్ఛగా చరించే 
తెమ్మెరల సాటి.

**

నువ్వు నా సోదరుడవు, నువ్వు ప్రార్థనా మందిరంలో పూజించడాన్ని, నీ దేవాలయంలో ప్రణమిల్లడాన్ని, మసీదులో దైవ ప్రార్ధననూ ఇష్టపడతాను.

మనం మన అభిమతాల వారసులం, భిన్నమతావలంబికులం. మనల్ని కరుణించే పరమాత్మ చేతి వేళ్ళం.

వాటితోనే అందరినీ దరిచేర్చుకుంటూ ఎల్లరకూ పరిపూర్ణత్వాన్ని సిద్దింపజేస్తాడు

నా అజ్ఞానం చూడలేని నీ జ్ఞానం నుంచి ఉద్భవించే సత్యం కొరకు నిన్ను నేను ప్రేమిస్తాను; 
అదొక దైవికమైన క్రియగా దానిని నేను గౌరవిస్తాను. రాబోయే ప్రపంచాన మన ఇరువురి సత్యాలు పూల తావివలె విడదీయలేనట్టుగా ప్రేమానందాల శాస్వతత్వంలో కలసిపోవాలి.

నిన్ను అణగదొక్కే బలశాలి ముందు దుర్బలుడవని, ధనికలోభుల ముందు అల్పుడవనీ నిన్ను నేను ప్రేమిస్తాను, 
ఈ కారణానే నీకై కన్నీరు కార్చి సాంత్వన చేకూరుస్తాను. 
నా కన్నీటి వెనుక నుంచే ధర్మాన్ని నువ్వు పొదవిపట్టుకోవడం, 
మతోన్మాదులను మన్నించి చిరునవ్వు నవ్వడం చూస్తుంటాను. 
నువ్వు నా సోదరుడివి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను.

4

నువ్వు నా సోదరుడివి, నాతో నీ తగవులేల! అధికారాన్ని వైభవాన్ని పొందుతున్న వారికోసం నా రాజ్యం పైకి దండెత్తి నన్ను ఎందుకు అణచాలని చూస్తావు!

నీ రక్తం తో కీర్తినీ, నీ తల్లి కన్నీరుతో గౌరవాన్ని కొనుక్కునే వారి కోసం, 
చావును అనుసరిస్తూ భార్యా పిల్లలి వదలి సుదూర ప్రాంతానికి నువ్వెందుకు పయనమవుతావు?

సాటిసోదరుడ్ని చంపడం గొప్ప గౌరవమా!!
అదే నిజమైతే దాన్ని భక్తిగా చేయి. 
సోదరుల్ని చంపిన అశోకుడికి ఓ మందిరాన్ని నిర్మించు

స్వీయ రక్షణ ప్రకృతి మొదటి ధర్మమా? ఐతే నీ సోదరుల్ని దుఃఖపెట్టాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చడం లో పేరాస నిన్ను ఎందుకు త్యజించమని కోరుతుంది?

జాగ్రత్త, సోదరా, 
“ప్రేమ ఉనికి కోసం ప్రజల హక్కులను అణగదొక్కాలన్న నాయకునిమాటల మీద మీతో నేనంటాను!” ఇతరుల హక్కులను రక్షించడం గొప్ప అంద్దమైన మానవ చర్య. 
ఇతరులను చంపడమే నా ధ్యేయమైతే మరణమే అంతకన్నా గౌరవం నాకు. నా గౌరవాన్ని కాపాడేందుకు నన్ను చంపే వ్యక్తి కనబడని నాడు నా చేతులతో నన్ను అంతమొందించుకోవడానికి వెనుకాడను. 
శాశ్వతత్వం కోరి ముందుగానే శాశ్వతత్వం పొందుతాను

**

ఓ సోదరా!

స్వార్థపరత ఆధిక్యాన్ని పెంపొందిస్తుంది. ఆధిక్యం వంశప్రతిష్ఠల్ని పుట్టిస్తుంది, వంశప్రతిష్ఠ అధికారాన్ని పాదుకొల్పుతుంది. అవే అసమ్మతి, అణచివేతలకు కారణాలౌతాయి.

ఆత్మ జ్ఞానప్రాభవాన్ని అంగీకరిస్తుంది, దుష్ట నిర్లక్ష్యాన్ని అధిగమిస్తుంది. అజ్నానాన్ని, అణచివేతను బలోపేతం చేసేందుకు కత్తుల్ని పంచిపెట్టే అధికారాన్ని ధిక్కరిస్తుంది.

ఆ అధికారమే బాబిలోన్ ను ద్వంసం చేసి జెరూసెలం పునాదుల్ని కుదిపివేసి రోమ్ ను నాశనం చేసింది.
అదే తుచ్చంగా మనుషుల్ని నేరస్తులన్నది, కవులు తమ పేరు కాపాడుకునేట్టు చేసింది, 
చరిత్రకారుల్ని అమానవీయ కథల కల్పనలకు ఉసిగొల్పింది.

సహజ న్యాయానుసారం జ్ఞానానికి సమతి తెలిపే అధికారానికే నేను తలొగ్గుతాను.

**

హంతకుడ్ని హతమారిస్తే, దొంగను బంధిస్తే ఆ అధికారం ఏ న్యాయం చేసినట్టు!
పొరుగుదేశాన్ని కబళించి జనుల్ని ఊచకోత కోస్తే!! ఆ అధికారాన్ని చూస్తూ న్యాయమేమనుకోవాలి! ఓ హంతకుడు ఇంకొక హంతకుడ్ని శిక్శించడం!, ఓ దొంగకి మరో దొంగ శిక్షవేయడం!

నువ్వు నా సహోదరుడువి నిన్ను ప్రేమిస్తున్నాను, గాఢమైనదీ గౌరవమైనదీ అయిన ప్రేమే న్యాయం.
నీ జాతి, తెగలకు అతీతంగా న్యాయం నీ పట్ల నా ప్రేమను ఆమోదించనప్పుడు ప్రేమ యొక్క దుస్తుల వెనుక స్వార్థపు వికారత్వాన్ని దాచిపెడుతున్నట్టే

ముగింపు:

నా ఆత్మే నాకు ఓదార్పునిచ్చేది తన ఆత్మతో స్నేహం చేయని వాడూ మానవత్వానికి బద్ద శత్రువు. తనలో మానవత మార్గదర్శకత దొరకనివాడు తప్పనిసరిగా నశిస్తాడు. జీవితం లోనుంచే మొలకెత్తుతుంది, పరిసరాలనుంచి కాదు

నేనొక మాట చెప్పాలని వచ్చాను కాబట్టి చెప్పి తీరతానిప్పుడు. 
ఒకవేళ మరణం ఆటంకపరిస్తే మరునాడు చెబుతాను. 
అమరత్వపు పుటల్లో రేపన్నది ఏ మాటనూ రహస్యం గా వదలదు.

**
నేను ప్రేమ ప్రకాశంలో, అందపు వెలుగులో జీవించాలని వచ్చాను, అవి దేవుని ప్రతిబింబాలు.. 
నేనిక్కడ జీవించాలనే ఉన్నాను ప్రజలు నన్ను జీవన పరిధి నుంచి దూరంగా బహిష్కరించలేరు, 
ఎందుకంటే నేను మరణం లోనూ జీవిస్తానని వారికి తెలుసు.

వారు నా కనులను పెకలించి వేస్తే ప్రేమ గుసగుసలనూ సౌందర్య గీతాలనూ పాడతాను
వారు నా చెవులు మూసి వేస్తే, ప్రేమ మాధుర్యాన్ని , సౌందర్య సువాసనలనూ వెదజల్లే గాలి తెమ్మెరలను స్పృశిస్తాను

నన్ను శూన్యం లో బంధిస్తే ప్రేమ, సౌందర్యాల బిడ్డడిగా నాఆత్మతో కలసి జీవిస్తాను

నేను అందరికోసం అందరితోనూ ఉందామని వచ్చాను నా ఏకాంతాన నే చేసే పనులన్నీ రేపటి రోజున జనులందరికీ ప్రతిధ్వనిస్తాయి

నేనొక హృదయం తో అనే మాటలు రేపు అనేక హృదయాలు పలుకుతాయి.

ఒకానొక హృదయం- యశస్వి 
=23.3.2019=

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa