Archive for December, 2018

Dec 03 2018

సాహిత్య విమర్శ- పరాం ప్రేయసీ..!

Published by under my social views

-పోతగాని సత్యనారాయణ

అలౌకిక ప్రేమానంద పూర్ణ కలశి- యశస్వి ‘పరాం ప్రేయసీ..!’

 1. *ప్రస్తావన*

మానవసమాజం లో ఒక అంతస్సూత్రం దాగిఉంది. ఇతరులను స్వచ్ఛంగా ప్రేమించే వ్యక్తికి ప్రేమానురాగాలు లభిస్తాయి. సాటిమనిషి అవసరాలను గుర్తించి ఆలోచించేవారే సృజనాత్మకంగా వ్యవహరించగలుగుతారు. నూతన ఆవిష్కరణలకు తెరతీయగలుగుతారు. ఏ వ్యాపకాన్ని చేపట్టినవారికైనా ఈ మూలసూత్రమే అనువర్తిస్తుంది. తోటి మనుషుల శ్రేయస్సును గురించి ఆలోచించేవారికి సాధారణ విజయాలు లభించడమే కాక వారి జీవితమే అర్థవంతంగా రూపొందుతుంది. ఈ మాటలకు సార్థకత చేకూర్చినవాడు యశస్వీసతీష్. ఇతడు మనిషిని ప్రేమించడం తెలిసినవాడు. “ప్రేమంటే భయాన్ని జయించడమే” అని వాకృచ్చినవాడు. ఆప్రేమలోని అద్వైత యోగాన్ని ఆవాహన చేసుకున్నవాడు. ఇంతటి పరిపక్వతను సాధించాడు కనుకనే ప్రేమకు పరిభాష కాగలిగాడు. ప్రేమంటే కామించడమేననుకుంటే ఈ ఉదాత సుదీర్ఘ ప్రేమ లేఖాకావ్యం ఉద్భవించేదే కాదు. కవిసంగమం ఫేస్ బుక్ గ్రూపులో యశస్వి సతీష్  లేఖల పరంపర-పరాం ప్రేయసీ..! పుస్తకరూపంగా వస్తున్న క్రమంలో పూర్వరంగం  అనుశీలన ఇది.

నీలోని ఒక రాగలీలా రవము నేను

నీ నుండి ఎగసి, ఈ నింగిలో విరిసేను

నా వెలుగు నీదర్శన ప్రాప్తి కోసమే

నా బ్రతుకు నీ స్పర్శన స్ఫూర్తి సౌఖ్యమే! -(డా. బోయి భీమన్న వచన గ్రంథాలు; రాగవైశాఖీ పుట: 304)

అని విశ్వశించిన ప్రేమమూర్తి. అందుకే సహధర్మ చారిణిని కూడా ప్రేయసీ! అనే సంబోధనతో నిత్య నిర్మలానురాగ సుధావర్షాన్ని కురిపించగలిగాడు. తన ప్రాణేశ్వరి లోనే తానూ లీనమైనట్టు, అసలు తన బ్రతుకు ప్రేయసి స్పర్శ చేత స్ఫూర్తి పొందుతున్నట్టు తాదాత్మ్యం చెందుతున్నాడు.

–        యశస్వీసతీష్ ప్రేమలేఖల ప్రణయకావ్యం వెనుక ఆయన వాస్తవిక జీవితానుభావాలు ఉన్నాయి. ఇది కేవలం ప్రమోదకావ్యం మాత్రమే కాదు; కరుణ రసార్ధ్ర ప్రణయకావ్యం కూడా. ఈ లేఖల నిండా జన్మ జన్మలకూ సరిపోయే ప్రణయానురాగ సుధాసౌరభాలున్నాయి. నోరు పట్టనంత విస్తారమైన స్వీయానుభవాభివ్యక్తి ఉంది. దీనిలో వచనాన్ని, కవిత్వాన్ని రెంటినీ కలిపి పొడుగుకురుల పిల్ల జడ అల్లుకున్నట్టు సుతారంగా తీర్చిదిద్దిన శైలీశిల్ప విన్యాసాలున్నాయి. గుండె పట్టనంత వేదనను, గొంతుపట్టనంత  ఆర్తిగా మార్చి, ఆర్ద్రంగా ఆలపించిన సాంద్ర జీవన గీతికలున్నాయి.

 • *#లేఖా సాహిత్యం*

–        ఈ పరాం ప్రేయసీ!  లోని కవనమంతా లేఖాసాహిత్య విభాగానికి చెందుతుంది. కవి తన ప్రియసఖి పైగల నిర్మలప్రేమను గుండె విప్పి చెప్పుకోవడానికి అవకాశాలున్న లేఖాప్రక్రియను ఎంపిక చేసుకోవడం లో మెలకువను పాటించాడు. ఇంతకు ముందే ఈ లేఖా సాహిత్యం అనువాద రూపం లో ఐతేనేమి, తెలుగు భాషలో వెలువడిందైతేనేమి.., సంవృద్ధిగానే లభిస్తున్నది.

–        తమ ఆత్మీయతను ఇష్టమైన వారికి లేఖల రూపం లో రాసిన కవులు, రచయితలు, నాయకులు, వ్యాసకర్తలూ తెలుగు సాహిత్యం లో ఎంతోమంది కనిపిస్తారు. తమ ప్రతిభా పాటవాలతో సాంఘిక, రాజకీయ, ఆర్థిక, చరిత్ర, విజ్ఞానం, కళలు సాహిత్యం మొదలైన అనేక విషయాలను లేఖల్లో పొందుపరచి సాహితీ సారస్వతాలలో ప్రత్యేక శాఖగా రూపుదిద్దారు.అటువంటి వాటిలో గుడిపాటి వెంకటాచలం (ప్రేమ లేఖలు), సిపి బ్రౌన్ (బ్రౌన్ లేఖలు), కందుకూరి వీరేశలింగం ( వీరేశలింగం లేఖలు), శ్రీశ్రీ (శ్రీ శ్రీ లేఖలు), వంగూరి సుబ్బారావు (వసంత లేఖలు), కనుపర్తి వరలక్ష్మమ్మ (శారద లేఖలు), గోపీ చంద్ (పోస్టు చేయని ఉత్తరాలు), చిరంతనానంద స్వామి (వివేకానంద లేఖలు), రెంటాల సుబ్బారావు (కళామామణి లేఖలు) కాటూరు వెంకటేశ్వరరావు (చిరంజీవి ఇందిరకు-నెహ్రూ లేఖలు), పురాణ రాఘవ శాస్త్రి (శరశ్చంద్ర చటర్జీ లేఖలు), డా. బోయి భీమన్న (జానపదుని జాబులు, రాగ వైశాఖీ), సన్నిధానం నరసింహశర్మ ( ఆరుద్ర లేఖలు, మధునాపంతుల లేఖలు), రాచమల్లు రామచంద్రారెడ్డి, సంజీవదేవ్, దోర్నాదుల సుబ్బమ్మ, బండి గోపాల రెడ్డి, మాగంటి అన్నపూర్ణాదేవి, కొడవటిగంటి కుటుంబరావు, కేవీ రమణారెడ్డి,.. మొదలైన వారు రాసిన లేఖలు ప్రస్తావన చేయాల్సిన వాటిలో కొన్ని. ఇప్పుడు యశస్వి సతీష్ వారి సరసన చేరాడు.

–        పరాంప్రేయసిలో కవి తన మనసులోని ఊసులను కవితాత్మకంగా ఉత్తరాల రూపం లో మనకు అందించాడు. ఈ లేఖల్లో తడిమిన అంశాలన్నీ దైనందిని (డైరీ) లో రాసుకోవలసినవి. అయినా ఇలా పంచుకోవడం తన వ్యక్తిగత జీవితానికి భంగకరం కాదని భావించాడు.(తన విశ్వాసాన్ని సాహితీ లోకం కూడా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లేఖల్లోని వస్తువు కవి తన నిజ జీవిత జీవన సహచరికి సంబంధించినవి.  ఈ రచనకు సంబంధించిన స్పందనలు, ప్రతిస్పందనలూ ఆ సౌభాగ్యవతి ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేసేవిగా ఉండటం, సాహిత్య జీవులు పాటించవలసిన మర్యాద) వాటికి కవిత్వ సుగంధాన్ని అద్ది తన ప్రేమ ప్రపంచాన్ని పాఠకుల ముందు లేఖలుగా పరచాడు. వీటిని యాభై పోస్టు కార్డులపై ముద్రించి నివేదించాడు కూడా.

ఈ లేఖల్లో తన జీవితం లోని అత్యంతప్రాధాన్యత గల ఘట్టాలను తీసుకుని అనుభూతులను, అనుభవాలను, బాధనూ, ఆవేదననూ సానుకూల దృక్పథం తో మలచుకుని ప్రేమ సూత్రతతో ఏకం చేసి పరిపక్వ ఫలంగా అందించాడు.

–        తన వ్యక్తిగత జీవితాంశాలను పాఠకులతో లేఖల రూపంలో పంచుకోవడం సానుభూతి కోసమో, జాలి చూపడం కోసమో కానేకాదు. ప్రేమించిన వ్యక్తి జీవనాస్వాదనకు దూరమౌతున్న సందర్భాన, కారణాలు మనో వైకల్య సంబంధమైనప్పుడు, మూలాలు ఆనువంశిక కారణాలై ముప్పేట సంసార నౌకను కుదిపిన నేపథ్యంలో జరిగే పరిణామాలు పాఠకులు ఊహించలేనివి కావు, పర్యవసానాలు ఊహకందనివేంకావు. బంధం విడివడడమో,  నిర్లక్ష్య వ్యవహారమో, భౌతికావసరాలకై బయట చూపో ఏ కథైనా వీటిల్లో ఎటోకటు పోతుంది. కానీ ఈ మనిషి వాస్తవిక జీవితం లోని అనూహ్య పరిణామాలను హృదయ వైశాల్యాన్ని మించి అర్థం చేసుకున్నాడు.

 • *#సమస్య _ విచక్షణ _ అవగాహన*

–        అకస్మాత్తుగా ఎవరన్నా మనమీద కోపంగా మాట్లాడుతుంటే ఏమనుకుంటాం మనమేం చేయాలి? పరిస్థితిని అంచనా వేసుకుంటాం. ముందు మన అసంకల్పిత స్పందనలకి ఆలోచనని జోడించుకొని మనమూ ఉద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాం. మనవల్ల పొరపాటు జరిగిందేమోనని వెనుకాముందూ ఆలోచిస్తాం.  తగ్గి ఉంటే తప్పు లేదనుకొని ‘క్షమాపణ’ చెప్పడమో, పక్కకు తప్పుకోవడమో చేస్తాం. విజ్ఞత, వివేకం పని చేస్తే ఇలా. లేకపోతే మనమూ స్వరం పెంచి ఘర్షణకు దిగుతాం. కోపానికి కారణమేంటో తెలిశాక పరిస్థితిని చల్లబరచడానికి దారులు వెతుకుతాం.  మొహాన నవ్వు పులుముకొని నచ్చజెప్పడానికో, బుజ్జగించడానికో ప్రయత్నిస్తాం. అదే పసిపిల్లలైతే గడ్డం పట్టుకొని బతిమాలుతాం. చుట్టేసుకొని చల్లబరచాలని చూస్తాం. ‘యశస్వి’కి తన శ్రీమతితో ఇలాంటి పరిస్థితే ఎదురౌతుంది.

–        భర్తమీద ఉన్న చనువుకొద్దీ ఏదో తినుబండారమో, రుచికరమైన ఆహారమో తెచ్చిపెట్టమని అడుగుతుంది. తనకు తెలుసు నిన్న అలాగే అడిగిందని. తినాలన్న ఆత్రం ఒక రుగ్మతని పాపం ఆ అమ్మాయికి తెలియదు. చెప్పినా నమ్మదు. ఈ రోజు వద్దులే… అన్నామంటే కోపం వస్తుంది. ఆరోగ్యానికి మంచిది కాదు అంటే, ‘ఏం కాదు ఈ ఒక్క రోజుకి’ అంటుంది. కొంత స్థిరంగా చెబితే తట్టుకోలేని అసహనం. తనకు తాను సృష్టించుకుంటున్న అలజడి, ఆందోళన. అలాగే తనంత పరిశుభ్రంగా ఇతరులెవరూ ఉండరని, ఒకరు ముట్టుకున్న వస్తువును మనం చేతులతో ముట్టుకుంటే ఏమవుతుందోననే అభద్రత. పదిమందిలో నిలబడినప్పుడు చుట్టుపక్కల వారి ముఖ కవళికలను చూసి స్పందించడం, ఆలోచనల్లో మెదులుతున్న మాటల్ని పైకి అనేయడం, తాను ప్రాధాన్యతనిచ్చేవి తప్ప మిగతావాటిపట్ల విముఖత, బంధు మిత్రులమీద ఆలోచనల్లో సృష్టించుకున్న వాస్తవ బాహ్యమైన అభిప్రాయాల వల్ల కనీస మర్యాదలను పాటించడానికి వెనుకాడడం, కుటుంబ సభ్యులను సైతం శరీరాన్ని తాకనివ్వకపోవడం, వాసనల పట్ల, శుభ్రత పట్ల అతిగా స్పందించడం, అవసరం అనుకున్న పని పూర్తయ్యేవరకూ పదేపదే అడగడం,… ఇవన్నీ తనకు తెలిసీ తెలియకుండా  జరిపే ప్రతిస్పందనలు. ఇవి నిన్న మొన్నటి వరకూ చక్కగా ప్రవర్తించిన మనిషిలో అనూహ్యంగా వచ్చిన మార్పులు.

–        అకారణ ప్రకోపాలకీ, చిరాకులకీ మెదడులో న్యూరాన్ల అసమతుల్యత కారణం. అది అనువంశికంగా మధ్యలో పొడచూపడం వల్ల జీవన విధానమంతా అతలాకుతలమయింది. దీనిని మనోవిజ్ఞాన పరిభాషలో ‘స్క్రిజోఫ్రేనియా’ అంటారు. ఇది రోగం కాదు, మనోరుగ్మత. దీనికి గురైన వారందరికో లక్షణాలు ఒకేలా ఉండవు. వైద్యానికి  స్క్రిజో లక్షణాలు ఉన్నవారు ఆసక్తి చూపరు. కారణం, వారి దృష్టి కోణంలో ఎవరికి వారు తమలో ఏ లోపమూ లేదనుకుంటారు. లోకమే సరిగా లేదనుకుంటారు. మన చుట్టూ ఉన్న ప్రతి వేయిమందిలో ముగ్గురికి ఈ లక్షణాలు ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవం అంతకన్నా ఎక్కువగానే ఉండే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సహచరిని ఎలా సముదాయించాలో తెలియక పదేళ్ళ పిల్లను చేసుకొని లాలనగా కథ చెప్పడం ప్రారంభించాడు యశస్వి. 

–        తను ఇప్పుడు వింటుందని నమ్మకం లేదు. తన అవసరం కాదు కాబట్టి, బుద్దిగా కూర్చోదు. ఎప్పుడైనా వింటానంటే ఓ కథ, చదువుఇతానంటే గుప్పెడు ఉత్తరాలు ఇవే యశస్వి ప్రోది చేసుకున్నవి.

–        కవి తన జీవిత భాగస్వామికి కలిగిన రుగ్మతకు కదిలిపోయాడు. ఆమె ఇక ఎప్పటికీ ఒక బిడ్దకు తల్లి ఐనా పసిపాపగానే ఉంటుందని తెలిసీ, తనను తానే సముదాయిమ్చుకున్నాడు. మానవ మాత్రుడైన ఒక సాధరణ వ్యక్తి ఇటువంతి సందర్భాలలో ఏం చేస్తాడు! నామమాత్రమైన వైవాహిక జీవితాన్ని భవిశ్యత్ అంతా గడపవలసి  వస్తే, జీర్ణించుకోగలడా? యుక్త వయస్సులో మనసిచ్చి జీవిత భాగస్వామిని చేసుకున్న వ్యక్తిని రుగ్మత కారణంగా ఉపేక్షించగలడా? అలాఅని మానవ సహజమైన వాంచల్ని నిగ్రహించుకుంటూ ఆమెను పసి పాపగా జీవితకాలం ఆదరించగలడా.. ఎన్నో ఆశలతో ఎన్నెన్నో ఆశయాలతో సాకారం చేసుకున్న బొమ్మరిల్లు లాంటి జీవన సౌధం ఒక్కసారిగా రంగు వెలసిపోతుంటే భరించడం అంత తేలికైన విషయమా?

–        సమాగమం లో ప్రతి వ్యక్తికి కొన్ని కోరికలు ఆశలు కలలు తప్పక ఉంటాయి. స్వయం కృషితో నిర్మించుకున్న అందమైన జీవితాన్ని ఎవరూ కళావిహీనం చేసుకోరు, కానీ యశస్వి ఆలోచనా విధానం వేరు. ఆయన ఇక్కడే విచక్షణను మేలుకొలుపుకున్నాడు, నిండైన మానవత్వాన్ని ప్రకాశింపచేసుకున్నడు. స్వ్చ్ఛమైన ప్రేమకు నిర్వచనాన్ని చెప్పుకుని ఆచరణాత్మకం గా రుజువు చెయ్యాలని గట్తిగా సంకల్పించుకున్నాడు. ఆదర్శ ప్రేమకు తొలగని బాధ్యతకూ సాదృశ్యంగా లోకం ముందు తనను తాను నిలబెట్టుకోవాలనుకున్నాడు.

 • *సాహిత్య సాంత్వన*

–        ఎంతటి నిబద్దుడికైనా ఏదో ఒక రూపం లో సాంత్వన లభించనిదే స్థితప్రజ్ఞత చేకూరదు. ఈ విషయం పై బాగా ఎరుక ఉన్నవాడు యశస్వి. తనలోని సృజనాత్మకతే తనకు సాంత్వన చేకూర్చే తోడని కవిత్వాన్ని అశ్రయించాడు. సాహిత్య అధ్యయనాన్ని విస్తృతం చేసుకున్నాడు. కవిత్వమర్మాలను అవపోశన పట్టాడు. భాషపై సాధికారతను సాధించాడు. నూతన పదసృష్టికి శ్రీకారం చుట్టాడు. ఆసక్తికర అభివ్యక్తిని సాధన చేశాడు. మనసులోని భావాలను తటిల్లతలా మెరిపించే మెళకువను పట్టుకున్నాడు.

–        ప్రపంచంలో సాహిత్యాన్ని మించిన హితమెవ్వరు చేకూర్చగలరు! పుస్తకాలను మించిన మిత్రులెవరుంటారు, సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసిన వాడికి స్వవిషయాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు.

–        పరిష్కారాన్ని అన్వేషించి సాధించడం సమస్యే కాదు. సంక్షోభాన్నే సవాలు చేశాడు. ప్రేమపక్షికి జీవితాన్ని అంకితం  చేసి నిష్కల్మషమైన ప్రేమతో జీవితాన్ని అర్థవంతం చేసుకోడానికి పూనుకున్నాడు. శరీరాన్ని మనసును వశం చేసుకుని సహచరికి తనకు మధ్యన అబేధాన్ని సృష్తించుకున్నాడు. అలా అద్వైతస్థితిని పుణికి పుచ్చుకుని సాహిత్యమే ఆసరాగ జీవనయాత్ర సాగిస్తున్నాడు.

–        వైరాగ్యము, తాత్వికచింతన అలవడడానికి వయస్సుతో నిమిత్తంలేదు. దానికి దార్శినికత అంతఃచేతనలే మార్గం చూపిస్తాయి. పెంచుకున్న మమతానురాగాలే అలసట తీరుస్తాయి. అచంచలమైన ప్రేమ, విశ్వాసాలే చైతన్యాన్ని కూడగడతాయి.

బైట.. సృష్టిలో.. లోపల భావమందు

వెలయు పరమ పదార్థ వైవిధ్యమెల్ల

ఎడద గొనివచ్చి నీ పూజనిడితి, దేవి !

స్వీకరింపుము నను ధన్యు జేయు కొరకు –(డా. బోయి భీమన్న రాగవైశాఖీ పేజి: 122)

అని తనను తాను ప్రాణేశ్వరికి సమర్పించుకున్నాడు. ఇక ఆమె, అతనికెప్పటికీ భువనమోహిని, ఆనంద పూర్ణ కలశి.

జవాబులు రాయని ఈ జాబులన్నీ అతని తక్షణ హృదయ స్పృక్కు. కవి హృదయ జ్వలనం లోంచి వెలువడిన రసభావ సంగీతానికి తారస్థాయి. అతని దర్శించిన సత్య, శివ సుందరాలను ఆత్మాశ్రయ రీతిలో అభివ్యక్తి చేశాడు. ఈ పద్దతిని ఎంచుకోవడం లో కవికి ఒక ఎరుక ఉన్నట్లు తోస్తున్నది. ఈ రీతి వివిధ సన్నివేశాలలో హఠాత్ఘటనలలో కవి గుండెలో కలిగిన ఒరిపిడిలు, రాపిడిలు, కల్లోలాలు, పోటుపాట్లు, లోక వృత్త ప్రదర్శన మొదలైన విషయాలను వ్యక్తీకరించడానికి సౌకర్యంగా ఉంటుంది. కవి భావాభివ్యక్తికి లేఖా రూపాన్ని, ఆత్మాశ్రయరీతిని ఎంపిక చేసుకోవడం అనాలోచితమేమీ కాదు.

ఈ లేఖలను పరిశీలిస్తే ప్రేమికుడు-ప్రేయసి (భర్త-భార్య) ఒకే కప్పు కింద జీవిస్తుంటారు. కానీ ప్రేమికుడిది మాత్రం ఏకపక్ష సంభాషణగానే ఉంటుంది. ఇక ప్రేయసి లభ్యమైన అలభ్య. ప్రాప్తమైన అప్రాప్య. ఇదే కవి జీవన కావ్యం లో వైచిత్రి. కవి జంటకోసం వెతికిన రోజులనుంచి, జంటగా మారి, ఒకరు ఇద్దరై, ఇద్దరు ముగ్గురైన రోజుల వరకూ ప్రస్తావించబడ్డాయి. ఆ తరువాత ఒక్కరే ముగ్గురై, ముగ్గురైన ఆ ఒక్కరే ఒంటరైన ఆ విధానమంతా ఆవిష్కరించబడింది.

“ఈ ఉత్తరాలు, తనచుట్టూ గిరిగీసుకుని జీవితాన్ని గడిపేస్తున్న నెచ్చలితో నా తలపోతలు. వినడం తన పని కాదు, చెప్పుకోవడం నా అవసరం. ఎండన నడిచే నాలాంటి కొందరిని కాసేపైనా ఇది ఊరడిస్తుంది. దుఃఖవర్షాన్ని దాచుకోలేకే ఇలా దిగదుడుచుకుంటున్నా.. వసివాడిన మనసుఊసుల్ని   కలబోసుకుంటున్నా.  ఇలా పంచుకోవడం నచ్చకపోతే ఇచ్చకాలని సరిపెట్టుకోండి.” (పరాం ప్రేయసీ-ప్రారంభ వాక్యాలు.. ఏంటిదంతా అంటే.. పుట:4)

వేదనను తుడిచేసి సాంత్వన కూర్చేది సాహిత్యమేనని నమ్మిన ఈ కవి ఆత్మ నివేదనలో ఎంతటి వేదన ధ్వనిస్తున్నదో “దుఃఖవర్షాన్ని దాచుకోలేకే ఇలా దిగదుడుచుకుంటున్నా..” అనడంతో అర్థమౌతున్నది. ఎవరు విన్నా వినకపోయినా చెప్పుకోవడం తన అవసరమన్ని విన్నవించుకోవడం లోని ఆర్ధ్రత పాఠక హృదయ తంత్రులను మీటుతుంది. “వసివాడిన మనసు ఊసుల్ని   కలబోసుకుంటున్నా”నని నిర్వేదయుక్తమైన ఆశావాదాన్ని ప్రకటించుకుంటున్నాడు. ఇవన్నీ కవి తనలోని దుఃఖ జలధిని ఎంతగా అణచిపెట్టినా నియంత్రించబడక ఎగసిపడే ఆవేదనా కెరటాలకు ఆనవాళ్ళు.“పెళ్ళిపుస్తకం పేజీల్లో కొన్ని పన్నీటితోనూ, కొన్ని కన్నీటితోనూ బొమ్మలేసుకున్నాక, ఇన్నేళ్ళకి నీతో పరాచికాలూ-పలకరింపులు.”-( నీతో నాకు సంబంధముందని పుట: 26)

–        తన పెళ్ళిపుస్తకం లో కన్నీటితో బొమ్మలేసుకున్నా సందర్భాలను తలచుకుని కాదు, కవి హృదయం ఇంతలా మధన పడుతున్నది! ఇక ఎప్పటికీ పన్నీటితో బొమ్మలేసుకోలేని కాలాన్ని ఎదుర్కోవలసి వస్తున్నందుకు.

“నువ్వు కనులముందే ఉన్నా, చేతికి అందని ఆకాశానివి. జంట పక్షులం మనం, మనది కలసి ఎగిరిన గతం వలపన్నిన జీవితం లో నీ ఊతం లేకుండా నే సాగలేను”

అంతరంగ కల్లోలం నుంచి వుబికి వచ్చిన పంక్తులివి. కనులముందే ఉన్నా చేతి కందనంత దూరాన్ని అనుభవించడం ఎంత దుర్భరం! అనుభవమైన వారికే అర్థమయ్యే,.. ఇదొక తెమలని బాధకు అక్షర సాక్ష్యం.

“వలపన్నిన జీవితం లో నీ ఊతం లేకుండా నే సాగలేన”ని ఒక్క ప్రేమికుడైన భర్త మాత్రమే అనగలిగే బరువైన వాక్యాలివి. ఇవే కవిలోని ఉదాత్తమైన భావావేశానికి పునాదులు వేశాయని చెప్పవచ్చు.

 • *#భవ్యావేశం, జీవన వాస్తవికత*

కారణమేమైనా కవి కి భవ్యావేశం కలిగితే అది రసావేశ స్థితికి దారితీస్తుంది. “మహా ప్రతిభావంతునికి  కలిగే దర్శనం కూడా ఒకానొక దివ్యావేశ స్థితిలోనే కలుగుతుంది. మేధ వల్ల ఆలోచన ఎన్నో అంచెలతో సాగగా సాగగా, తుట్టతుదకు లభించే ఫలం సత్యదర్శనం. అదే ఫలితం సాధకుడికి ఒకానొక దివ్యావేశస్థితిలో క్షణకాలంలో సిద్ధిస్తుంది. చరిత్రను పంకిస్తే శాస్త్రజ్ఞుల, తత్వవేత్తల, కవుల జీవితాలలో ఇది కనిపిస్తుంది. మేథను వేగవంతమొనరించే అతీంద్రియతతో మైత్రిని నెరిపే స్థితే భవ్యావేశం” ( ప్రాచీన సాహిత్య విమర్శ; చరిత్ర సిద్ధాంతాలు, పుట: 14)

ఎన్నోరోజులుగా సమీపాన్ని అనుభవిస్తూనే మౌనం భాషగా సాగిన ఊసులు, ఒక్క స్పర్శతో సాకారమౌతాయి. ఓ చేతి స్పర్శ శరీరానికే చెందిన స్పర్శ కానప్పుడు అది రెండు మనసులకూ విడదీయరాని బంధం వేస్తుంది. “ స్పర్శానుభూతి” లేఖలో మూడుముళ్ళ బంధానికి మూలరాయి పడిన విధానపు దృశ్యీకరణ ఉంది. పిల్లల ప్రేమల్ని పెద్దలంత తొందరగా అంగీకరించలేరు కదా! అప్పుడిక ప్రేమికుల కళ్ళల్లో కన్నీరుబికి కళ్ళు ఉబ్బిపోయిన ఆనవాళ్లు, ఉద్వేగాల ఉయ్యాలఊపులు సరేసరి…“

ఆనందం కొలబద్దకు అందని జీవితాల్లో ఓ స్పర్శ లేపిన అలజడి అంతరంగాన్ని అతలాకుతలం చేసి, అఖరికి ఓ జీవితకాల సంభాషణ రాయడానికి అర్హత కలిగించింది” అంటాడు కవి. ‘మొరాలకించిన అమ్మ’ అంగీకారంతో పెళ్ళి మాటలతో ప్రేమ కథ మొదలౌతుంది. ఇక్కడే కవి హృదయంజరిగిన గతాన్ని వర్తమానంలోకి లాకొచ్చి “మన ప్రేమ కథ పెళ్ళితో ముగిసేదేం కాదు… మరి నిన్నూ నన్నూ కలిపి ఉంచేదేది? అంటూ భవిష్యత్తును తలచుకుని బాధగా నిట్టూరుస్తుంది.

“ ప్రతివ్యక్తి తను నిర్మించుకున్న లోకం లోనే నివసిస్తాడు. ఆవ్యక్తి కవి అయితే, అతని సృజనలో తను ఆవాహన చేసుకున్న లోకాన్నే దర్శింపజేస్తాడు. దీనినే వ్యక్తిగతానుభావాభివ్యక్తి అంటాం. ఇది వస్త్వాశ్రయ వర్ణన కన్నా ఎంతో సత్యమైనది. వస్తు  వర్ణన ఒక్కోసారి వాస్తవదూరమైనది కావచ్చు. అది కేవలం వస్తువు ఉన్నతిని ఎరుకపరచడానికి ఉద్దేశిమ్చినదై ఉండవచ్చు, ఒక్కోసారి కవి వస్తువు ప్రాధాన్యత గుర్తించడానికి అతిశయొక్తి జోడిస్తాడు. కానీ వ్యక్తిగతానుభవంతో చేసే అభివ్యక్తి నిజాయతీతో కూడుకుని ఉంటుంది. ఈ లేఖలన్నింటిలోనూ నిజాయతీ తో చేసిన అభివ్యక్తితో పాటు జీవన వాస్తవికత గోచరిస్తుంది.

 “నీకు తెలిసినవన్నీ చెప్పడానికి ఈ రాతలెందుకు పిల్లా!- నీ వేలు పట్టుకుంటే అలలనవ్వొకటి ఆ పెదవులపై ఎగసిపడేది, నీటికెరటాలపై తరలి వచ్చిన సూర్యకిరణం నీచూపులోంచి నా గుండెల్లో దిగబడేది.”- బువ్వాలాటల బొమ్మ, పుట: 30

కవి జ్ఞాపకాల మూట విప్పి అనుభూతులను పరిమళాలుగా ఆస్వాదిస్తున్నాడు. గతాన్ని స్మరించుకోవడమంటే జ్ఞాపకాల తేనెతుట్టాను కదిలించడమే. జ్ఞాపకం కాలాన్ని రికార్డు చేసిన ఉదంతం.

నేnu ఘనీభవిస్తే నామరూపాత్మకం, ద్రవీభవిస్తే జ్ఞాపకాల ప్రభావం అంటారు శేషేంద్ర.

నీకు తెలిసినవన్నీ చెప్పడానికి రాతలెందుకంటూనే తన అనుభూతులను, సన్నివేశాలను, సంఘటనలను, మనస్సును ప్రతిస్పందింప జేసిన ప్రతీ అంశాన్ని జ్ఞాపకం గా మార్చుకుని, ఏకపక్ష సంభాషణగా స్వేచ్ఛా పునఃస్మరణం చేసుకుంటాడు కవి

“ నీ వేలు పట్టుకుంటే అలల నవ్వొకటి ఆ పెదవులపై ఎగసి పడేది” అనే వాక్యాన్ని చదువుతుంటే ఉర్దూ ఘజల్ కవి ఇస్రార్ అన్సారీ షేర్ గుర్తొస్తుంది.

హమేతో అబ్ భీ వో గుజరా జమానా యాద్ ఆతా హై|

తుమ్హే భీ క్యా కభీ కోయీ దివానా యాద్ ఆతాహై ||”

నాకైతే ఇప్పటికీ గడచిపోయిన కాలమంతా గుర్తుకొస్తున్నది.

నీకెప్పుడైనా, ఎవరైనా పిచ్చివాడు గుర్తొస్తున్నాడా అన్నది భావం.

ఈ సందర్భాన ప్రేమికుడు గతాన్ని మరువని వాడు. ఆమె గతాన్ని మరచిపోయిందేమో అని భావిస్తూ, నువ్వు నన్ను గుర్తించకపోయినా నా గాఢమైన ప్రేమ నీకు పిచ్చిగ కనిపించినా, నన్ను గతం వెంటాడుతూనే ఉంది అంటాడు ఘజల్ కవి. సంకల్పం దృఢమైనదైతే కార్యం తప్పక సిద్ధిస్తుంది. ప్రేమలో నిజాయతీ ఉంది కనుకనే అవరోధాలు వేటికవే తొలగిపోయాయి. ఇద్దరు ఒక్కటయ్యే వేళ రానే వచ్చింది. కన్నకలలు సాకారమై ఏడడుగులతో జంట ప్రయాణం మొదలయ్యింది.

 • *# తాత్విక దృష్టి *

 “నువ్వు నిజంగా పిచ్చిపిల్లవు జీవితం ఊహించనివి తెస్తుందని ఊహించలేక ఏమరుపాటుగా ఉండిపోయావు. “

పై వాక్యాలను పరిశీలిస్తే కవిలోని తాత్విక దృష్టి మెరుపులా పలకరిస్తుంది. నిజమే జీవితం ఊహించిన వాటినే కాదు, అనూహ్యమైన పరిస్థితులను కల్పించి ఆశ్చర్యపరుస్తుంది. అదేవిధంగా దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. జీవించడం అంటే ఒక కళ అని తెలుసుకుంటే దాన్ని మరింత అందంగా మలచుకోవడాని అవకాశముంటుంది.ఆశావాదం తొ ముందుకు సాగితే ఆశిమ్చిన ఫలితాన్ని అందుకోవచ్చు. జీవన గమనం లో కేవలం ముళ్ళబాటేకాదు పూలు పలుకరించే దారులూ ఎదురవుతాయి. ఏ బాటలో నడచినా ఆనందాలను కోల్పోకోడదనే ధ్వని కవి మాటల్లో గమనించదగినది.

 • *#శైలీ- శిల్పం*

ఉద్దేశించిన భావాన్ని వ్యక్తపరచడానికి కొందరు అలంకారాలను, మరికొందరు వర్ణనలనూ, ఇంకొందరు మార్మికతనూ ఇలా పలు పద్దతులు అవలంబిస్తారు. ఎవరికి వారే తమ అంతరాత్మ నిర్దేశాన్ని సొంతగొంతున వినిపిస్తారు. సంక్షిప్తత, ఘాఢత, గూఢత ఇవన్నీ కవిలోని అభివ్యక్తి ప్రత్యేకతకు సహకరిస్తాయి.ఈ అభివ్యక్తి ప్రత్యేకతనే ‘శైలి’ అనవచ్చు.ఈ లేఖల్లోనూ ఒక ప్రత్యేకమైన శైలి పఠిత మన్స్సును ఆకట్టుకుంటుంది. విషయమంతా కవితావచనంగా సాగిపోతుంటుంది. అక్కడక్కడ చక్కని కవితాపంక్తులతో ఆలోచింపజేస్తుంది. క్లుప్తతత, గాఢత మెదడుగు పదును పెడుతుంది. ముగింపులో కవిత్వం తాత్వికతను దేదీప్యమానం చేస్తుంది.

“ శిల్పమనగానే కేవలం ఆవేశమేకాక ఆలోచనాపూర్వక కావ్య నిర్మాణం అనే విషయం గమ్యమానం. ఆవేశమూ, శిల్పమూ ఈ రెండూ ఉన్నవాడు మాత్రమే ఉత్తమకవి కాగలడు” అంటారు అద్దేపల్లి. (శ్రీశ్రీ కవితా ప్రస్థానం- అద్దేపల్లి రామ్మోహనరావు, పుట: 54)

“ఎంత సాధన చేస్తే నైపుణ్యాలు అలవడుతాయి…” అంటూ ఒక ఆసక్తికరమైన ఎత్తుగడతో మొదలైన లేఖ.. “ రెండు చిదానంద తనువులు మనువాడి ఓ నలుసుకి జీవం పోయడం ఓ తన్మయత, తాదాత్మత” అనే కవితా వచనంతో ముందుకు సాగుతుంది. “ నామార్గం తొక్కని యశోధరవి, నిన్ను వదలని బుద్ధుడ్ని నేను అంటూ కవిత్వ ధ్వనితో ముగుస్తుంది. దాదాపుగా పరాం ప్రేయసీ లోని ప్రతి లేఖలోనూ ఈ శిల్పమే కనిపిస్తుంది.

“ భావాన్ని సూటిగా వెలువరించేటప్పుడు అలంకారాలు అవసరం లేదు అని కొందరివాదం. కానీ భావాన్ని సూటిగా చెప్పటమొక్కటే కవితాపరమార్థం కాదు. కొన్ని చోట్ల సూటిగా చెబితే అందం, కొన్నిచోట్ల వ్యంగ్యం గా చెబితే అందం. కొన్ని చోట్ల అలంకార సమేతమైతే అందం. ఎక్కడ అలంకారం కవి ఉద్రేకం లో లీనమౌతుందో అక్కడ ఆ అలంకారం సార్ధకమే అవుతుంది. (శ్రీశ్రీ కవితా ప్రస్థానం-పుట: 56)

వాస్తవం చెప్పేటప్పుడు కూడా అలంకారిత అవసరమని ఈ కవికి బాగా తెలుసు. అందుకే ఈ టెక్నిక్ ను కవి ఎక్కడా విడిచిపెట్టినట్టు కనిపించదు. లేఖను కొన్ని పంక్తులుగా విరిచి వరుసలుగా పేర్చితే అది ఒక కవితలా భాషిస్తుంటుంది. లేఖలలో కథనాత్మక శైలి ఉండడం ఈ రచన ఉత్తమమైనదనడానికి మరో అదనపు అర్హత.

 • *# ధ్వన్యాత్మకత *

ఏ భావాన్నైనా కవి వాచ్యంగా చెప్పరాదు. ధ్వని పూరితంగా అభివ్యక్తి చేయాలి. అనుభూతి ఆ విధంగా అందీఅందనట్లు రచనను నిర్మించడమే ఉత్తమ మార్గం. ఈ లేఖల్లో ధ్వని ప్రతి కవితా పంక్తిలోనూ మారుమ్రోగుతుంటుంది.

”నా మార్గం తొక్కని యశోధరవి, నిన్ను వదలని బుద్దుణ్ణి నేను” (ఇద్దరు ముగ్గురయ్యే వేళ)

ఈ వాక్యాలలో ధ్వని పరిశీలించదగినది. యశోధర మాత్రం భర్త తలపులతో తన కుమారుడైన రాహులుడితో రాజమందిరంలోనే ఉండిపోతుంది. ఆమె అతనితో వెళ్ళకపోవడాన్ని కవి తన కథలో ‘నా మార్గం తొక్కని యశోధరవి’  అంటూ అన్వయిస్తాడు. ఇక్కడ మరో ధ్వని గమనించదగినది. అది ‘ ఎంతకీ నీ మాట నేను వినడమే గాని, నీవు మాత్రం నా మాట విన్నదేలేదని” సహచరిని ఉద్దేశించి కవి చెబుతున్న మాటలోని శ్లేషగా అర్థం చేసుకోవచ్చు. ”నిన్ను వదలని బుద్దుణ్ణి” అనడంలోనూ మరో వైచిత్రి ఉంది.

బుద్దుడు భార్యను విడిచి సత్య శోధనకై వెళ్ళిపోయాడు. కాని ‘నేను మాత్రం నిన్ను ఎప్పటికీ ఎడబాయని బుద్దుణ్ణి’ అనడంతో ఆ వాక్యాలు ఒక్కసారిగా కవిత్వమై ధ్వనిని ఆత్మగా నింపుకున్నాయి. బుద్దుని తపస్సు సత్యశోధన కోసమైతే నా తపస్సు మాత్రం నీ ప్రేమను పొందడం కోసమే” అనే ధ్వనితో ప్రకాశిస్తున్నాయి. ఓ సత్యం సాక్షాత్కారమయిన బుద్ధుడే ఇలా చెప్పగలడు.

లేఖల ముగింపు వాక్యాలలో కవి వర్తమాన జీవితంలోని వాస్తవికతను ధ్వనింపజేయడం తరచుగా కనిపిస్తుంది. అయితే ఇది కవి హృదయ ‘ని’వేదనను దిగదుడుచుకోవడానికేనని అవగతమవుతున్నది. దీనికోసమే కవి కవిత్వాన్ని ఆశ్రయించడం కూడా.

”మనకు జీవితమంటే ఏమిటో వివరించేదీ, మనలని ఓదార్చేదీ, మనకు బలాన్నిచ్చేదీ కవిత్వమేనని ముందు ముందు మానవాళి గుర్తిస్తారు. కవిత్వం లేకపోతే విజ్ఞాన శాస్త్రమంతా అసంపూర్ణంగా కనబడుతుంది. నేడు మనం మతమూ, తాత్వికతా అనుకొన్నవాని స్థానాన్ని ముందు ముందు కవిత్వం ఆక్రమిస్తుందంటాడు ‘ఆర్నాల్డ్ ‘.

 • *#భావకవిత్వ ఛాయలు*

ఆశల తారకల నడుమ నీకై వికసించాను.  నన్ను ఎల్లవేళలా వెలిగించి ఉంచేది నీ నెలవంక నవ్వు; మనం కన్న తురాయి పువ్వు.

యుద్ధాన్ని వలచి వచ్చిన సిపాయిని నేను. నువ్వు దానిమ్మ మొగ్గవు కావు. నా మనసు పై పాకిన మల్లికవు”- (నేనేమో అమ్మ రెమ్మ _ తానేమో వెన్నెల కొమ్మ _ పుట 41)

పై పంక్తులలో భావ కవిత్వం వన్నెలీని  కనిపిస్తుంది. ప్రేయసీ పూజ్యత అక్షరాక్షర సదృశ్యమై తారస పడుతుంది. ఈ కవికి భావ కవుల వలె తన ప్రణయిని అంతరంగ శాంతి దేవత, ఆశాపథాంతరాళ పారిజాతం, తపః కల్పవల్లి, నీలి గగనాంతవిక స్వర తారకా సుమవ్యా ప్రియమాణ దేహ తన సౌందర్య తృష్ణకు తగినట్లు ఆమెను వర్ణించుకొని చిత్తశాంతిని పొందుతున్న సౌందర్యారాధన తత్త్వము గోచరమవుతున్నది. ఈ భావనా పరంపరనే కృష్ణశాస్త్రి ఊర్వశిలోను చూడవచ్చు.

నీవు తొలిపొద్దు నునుమంచు తీవ సొనవు

నీవు  వర్షాశరత్తుల నిబిడ సంగ

మమున బొడమిన సంధ్యాకుమారి (ఊర్వశి- కృష్ణశాస్త్రి)

ఇలా కవి తన ఆశా నిరాశలను, వేదనను, వేడుకను ఆమె పేర వెలిబుచ్చుకోవడం వలన ఈ లేఖల్లో భావ కవిత్వం మనోహరంగా అలరిస్తుంది.

 1. *#కవిత్వం _ కవితత్వం:

”ఈ జిందగీ ఎంత వింతైనదో! ఒక చోట వదిలితే, మరోచోట పట్టుకోవాలి. పంచుకున్న చోట గిట్టుబాటు కానంత మాత్రాన నొచ్చుకునేది ఏముంది. లక్ష నిరాకరణల నడుమ కలిసి జీవిద్దాం అన్న అంగీకారంపై గౌరవం నాకు. భౌతిక ప్రేమ మధురమైనదీ, మోహం మొహం మొత్తేదనీ తెలుసు. నేలమీద నిలబడి జీవించేందుకు చేసుకున్న సర్దుబాట్లే అన్నీ. అసలు జీవించడమే ఉత్సవం అయినప్పుడు కలిసి బతకడం ఆనందమే! (నచ్చని ఇచ్చకాలు _ పుట 42)

పై కవితా వచనంలోని కవిత్వము _ కవితత్వాన్ని పారదర్శకంగా చూపిస్తున్నది. ‘కవిత్వం విశ్వజనీన సత్యముల నత్యంత సుందరముగా ప్రకటించు కళారూపం. తత్వ శాస్త్రము (philosophy) కేవలం స్థూల సత్యము (abstract precept) ను మాత్రమే తర్కబద్ధంగా బోధిస్తుంది. తత్వశాస్త్రము బోధించేది  సత్యమే కానీ దానిలో స్పష్టత లేదు. అది రసవంతం కాదు. కటుకౌషధము లాంటిది. కవిత్వం ఔషధప్రాయమైన సత్యమును తేనె అనుపానముగ జేసి  అందిస్తుంది. వేదాంతి చేసెడు బోధలు సుగ్రాహ్యముగా ఉండవు. వానిని పండితులు మాత్రమే గ్రహించగలరు. కవి అల్పబుద్ధులకు గూడ అందునట్లు బోధించగలడు. కావున కవులే జనరంజకులైన తత్వవేత్తలని ”సిడ్నీ” అభిప్రాయ పడినాడు. (ఆధునికాంధ్ర కవిత్వము _ సంప్రదాయములు, ప్రయోగములు. పుట 79)

సామాన్యులకు అంత తేలికగా అర్థంకాని తత్వాన్ని కవితాత్మకంగా సులభతరం చేసిన పంక్తులను జీవన వాస్తవికత నుంచి వ్యాఖ్యానించడం ఈ కవి ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. భౌతిక ప్రేమకు, అలౌకిక ప్రేమకు మధ్య ఆంతర్యం తెలిసినప్పుడే నేలమీద నిలబడి జీవించడానికి చేసుకున్న సర్దుబాట్లను గౌరవించడం, జీవించడాన్ని ఉత్సవంగా భావించి బతకడం సాధ్యపడుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే, ‘పంచుకున్న చోట గిట్టుబాటు కానంత మాత్రాన నొచ్చుకునేది ఏముంది, లక్ష నిరాకరణల నడుమ కలిసి జీవిద్దాం’ అన్న అంగీకారంపై గౌరవం నాకు” అనే పంక్తులు మరో ఎత్తు. ఈ వాక్యాలలో తొంగి చూస్తున్న ధ్వనే ఈ కవితా వచన లేఖా కావ్యానికి సారాంశ భూతమైనది. కవిలోని ఆత్మ ‘ని’వేదనకు ప్రేరకమైనది కూడా. ఇదే లేఖలో ‘ఎక్కడ ఏది ప్రాప్తో;  తృణమో పణమో ఇచ్చి పుచ్చుకుంటున్నాను” అనే పంక్తులు కవి వేదాంత ధోరణిని, నైరాశ్య భావనలు, విషాద ప్రణయాన్ని అంకుర ప్రాయంగా పట్టి చూపుతున్నది.

ఈ లేఖలోని ప్రతీ అక్షరం కవి అంతరంగాన్ని ఆవిష్కరించే మణిపూస వంటిది. ఇలా అక్షరాక్షరాన్ని ఏర్చి కూర్చి చెప్పడానికి కవిలోని నిష్కపటత్వము, నిజాయతీలు ఒక కారణమైతే, చెప్పుకుంటే, బాధ తొలగుతుందనే అభిప్రాయం మరో కారణంగా తెలుస్తున్నది. మనసుకు ముసుగు వేసుకుని, మాటలకు రంగు పూసుకుని, అభివ్యక్తిని వంకర్లు తిప్పేవారికిది ఎప్పటికీ సాధ్యం కాజాలదు. అందుకే ఈ ఉత్తరాలలోని ప్రతి అక్షరానికి ఒక ఆత్మ ఉంది. అది కవి అంతరంగాన్ని దీపం లా చూపిస్తుంది.

ఈ లేఖ చివరిలో “ నిన్నే నా లోకమని అంటున్నది ఎందుకంటే నన్ను తడిపిన చినుకువి, జడివానవి నువ్వేమరి. అమ్మను తలపించే బొమ్మవు, నా బొమ్మను కన్న అమ్మవు, నా గుండె గట్టు తెగేటట్టు ప్రవహిస్తున్నావు” అంటాడు. చినుకు జడివానగా మారడం అనేది,.. గుండెగట్టు తెగేటట్టు ప్రవహించడం అనే ముగింపుకు చక్కని ఔచిత్యవంతమైన ప్రయోగం.

ఈ సందర్భం లో “ తన ప్రేమతో తడిపేసిందని” ‘పేయసి’ భావనతోనూ, “ నాబొమ్మకు అమ్మవు” అనే వాక్యం తో ‘సహచరి’ భావం తోనూ, “అమ్మను తలపించే బొమ్మవు” అంటూ మాతృమూర్తి భావనతోను సంభావించి ఒక్క స్త్రీలో ముమ్మూర్తులనూ దర్శించాడు కవి. ఇది కవి ఆత్మౌనత్యానికి నిదర్శనం.

ప్రేమ లభించేవరకూ వేచి ఉండడమే స్థితప్రజ్ఞత. అది లభించనప్పుడు సాహసం తోనైనా పొందడమే కర్తవ్య ధర్మం….

అందాన్ని చూడలేనివాడు ఆనందానికి నోచుకోడు.ముళ్ళే కనిపించేవాడికి పువ్వులు సుఖాన్నివ్వవు.

జన్మాంతర స్నేహ పునీతమైన ప్రేమకు అందంతో నిమిత్తం లేదు.

అట్టివాళ్లు శుచులైనా అశుచులైనా ధనులైనా, నిర్ధనులైనా,

యవ్వనులైనా, వృద్ధులైనా, రూపులైనా, కురూపులైనా

శరీరాలతో సంబంధం లేకుండా ఒకరినొకళ్లు తెలుసుకోగానే

ఆత్మైక్యం పొంది అమృతమూర్తులైపోతారు.

ప్రేమకు శాసనం లేదు

పెళ్ళికే ఏ గోలైనా!

సంసారజీవితం సుఖంగా గడచిపోవడానికే కదా పెళ్ళి

బుద్దిమంతురాలైన ఏ యువతైనా చాలు అందుకు. ఆరోగ్యవంతమైన యవ్వనమే అందం.”(డా. బీయి భీమన్న వచన గ్రంథాలు- రాగవైశాఖీ, పుట: 214) అంటారు భీమన్న గారు.

ఈ ఉదహరించిన వాక్యాలు యశస్వి జీవితనికి అన్వయించబడుతున్నవి. నిజంగా జన్మాంతర స్నేహపునీతమైన ప్రేమ యశస్వి దంపతులది. అందుకే ఒకళ్ళనొకళ్ళు చూసుకోగానే ఆత్మైక్యం పొందారనిపిస్తుంది.

ఆత్మసంయోగమే ఆనంద యోగమే

అది లభించెను కదే హృదయమిచ్చిన చోట!

పొంగ నేలను కనులు పుబ్బ చెరువులు వోలె?

ఆర్మరతి కంటే దేహాలింగనము ఘనమె?”

అంటారు భీమన్న గారు. అచ్చంగా ఈ పద్య భావము కవికి అన్వయార్థముగా గోచరిస్తుంది.

 1. *#అనుభూతి- కవితా ప్రియత్వం*

పెళ్ళిరోజే తల్లిదండ్రులయ్యే భాగ్యం యాదృచ్ఛికం. అది పెళ్ళి పుస్తకంలో తీపి జ్ఞాపకంగా భద్రపరచుకోవలసిన అంశం. ‘పెళ్ళిరోజు C/o లేబర్ రూం’ అనే లేఖలో కవి జ్ఞాపకాలు అనుభూతి ప్రధానంగా సాగాయి. బిడ్డకు జన్మనిచ్చి, సొమ్మసిల్లిన తల్లిని, ప్రయాణ బడలికో, బయటి ప్రపంచాన్ని చేరుకున్న సంతోషమో తెలియని స్థితిలో ధ్యానం చేస్తున్నప్పుడు మౌనం వహించిన సాధకుడిలా కనిపించే బిడ్డను చూచి ‘అప్పుడు నేనొక్కడినే నాతో ఉన్నాను’ అంటూ ఆ ప్రత్యేకమైన సందర్భాన్ని అనుభూతికి తెచ్చుకుంటాడు. ఈ ఒక్క మాటే ఆ పైన వచనాన్నంతటినీ కవిత్వపు వెలుగుతో ప్రకాశింపజేసింది. ఇది అనుభూతిని కవిత్వం చేసే కవి మెలకువను సూచిస్తున్నది.

ఒక మంచి కవి వచనాన్ని, కవిత్వం చేసే ఏ ఒక్క అవకాశాన్నీ చేజార్చుకోడు. లేఖలోని ముగింపు వాక్యాలు కూడా ప్రస్తావించదగినవిగానే ఉన్నాయి. ‘బిడ్డ  నీలా నిద్దురోతుంటే, మగతలోంచి బయటపడ్డాక నిన్ను నిత్యం చూసుకునే నా చూపులతో నువ్వు వాణ్ణి చూసుకుంటూ..’ అంటూ ముక్తాయింపునివ్వడం ఆమే తానైన వైనాన్ని దర్శింపజేస్తున్నది.

‘ఇంటకాసిన పండు వెన్నెలలో బిడ్డ పుట్టిన తరువాత దంపతుల ఇరువురి తరుపు బంధువులూ ఎవరికి వారు వీడు మావాడే అనుకునేందుకు ఎవరూ విశ్లేషించుకొని కారణాలను చూపిస్తాడు. ‘నునుపు కండల పిల్ల వస్తాదులో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ లక్కీ!  లక్కీ!  అంటూ చిటికెలు వేస్తూ పొందిన మురిపెం. ఆ జీవితం మన మనసు గోడకు వేలాడదీసిన ఆఖరి జ్ఞాపకం’ అనడంలో ఇక ఆ తరువాత ఆ తరహా ఆనందానికి అవకాశంీ రాలేదని, అది ఇరువురికీ ఏకైక చివరి తీపి జ్ఞాపకమవుతున్నదని చెప్పడం ఉంది. తమకు ఆ ఒక్కడే సంతానమనే ధ్వని వెల్లడవుతున్నది.

‘ఔరా అమ్మకు చెల్లా!’ అనే లేఖలో అక్కకు తోడుగా తన ఇంటికి వచ్చిన మరదలు తన అస్థిత్వాన్నే మరిచి, అక్క కొడుకు కోసమే కట్టుబడటం, ముగ్గురికి నలుగురు కావడం సంక్షిప్తంగా వ్యక్తీకరించబడింది. అక్కను వదిలి చెల్లి, పిన్నిని వదిలి పిల్లాడు పుష్కర కాలంగా ఉండలేని తనం ఆవిష్కృతమైంది.

 1. *#ప్రతీకలు _ ప్రయోగాలు*:

‘నువ్వు నాతో ఆడుతున్న తోడు బొమ్మలాట, ఈ తోలు బొమ్మలాట యథాస్థితి అనివార్యమై నేను ఉద్ధారకుని పాత్రలో ఇమడలేకపోయినా, ఆత్మ బంధువు ప్రేమకు బందీనై… నీ గుంజకే నన్ను కట్టుకుని గింజుకుంటూ ఉండిపోయాను’.

పై పంక్తుల్లో ‘తోడు బొమ్మలాట’ అనే పదం కవిలోని ప్రయోగ దక్షతను నూతన పదసృష్టి చేసే మెలకువను నిరూపిస్తున్నది. అవును కదా! దాంపత్యం అనేది ఇరువురి మనసులతో హరివిల్లులోని వర్ణాల్లో కలిసిపోయి సాగేది. ఇంద్ర ధనుసులోని రంగులు విడివిడిగా కనిపించవు. కవి తన కాపురమనే హరివిల్లులో ప్రధానమైన్ రంగుతో కలవాలని కలుస్తూ, కలువలేక కరిగిపోతున్న రంగు. తోడుగా ఉన్న బొమ్మే తోలు బొమ్మలాట లాంటి జీవితాన్ని గడుపుతున్న వైనం. ‘తోడు బొమ్మలాట’ అనే ప్రయోగంలో అభివ్యక్తి చేశాడు. ఆత్మబంధువు ప్రేమకు బందీనై’ అనడంతో…ఆ తోడు బొమ్మలాట కేవలం అనాసక్తిగానో, అయిష్టంగానో అన్నది కాదని, అది తరగని ప్రేమ విరాగిగానే అన్నట్లు స్పష్టమవుతున్నది.

సాధారణంగానే ‘యశస్వి’ కవిత్వం ప్రతీకాత్మకంగా సాగుతుంటుంది. అభివ్యక్తి పరిణితి చెందిన అతీంద్రియతతో సంవేదనలను (sensations) భావముద్ర (Impresions)లను ప్రకటిస్తాడు. అయితే వస్తువును చూపడం వల్లనే దాని స్పృహ కలగడంవల్లనే అతీంద్రియత, అభివ్యక్తి ఏర్పడుతుందనే మూస ధోరణికి లోబడని వాడు. అందుకే వస్తువుపై పరిపూర్ణమైన అవగాహనతో, ప్రతీకాత్మకంగా భావాభివ్యక్తికి పూనుకున్నాడు.

ఆ వస్తువుకు పేరుపెట్టి చూపడంలో పద్యంలోని మూడువంతుల అందం హారించుకుపోతుంది. ఆ వస్తువేదో క్రమక్రమంగా అవగాహనలోనికి రావడానికి ఊహిస్తుండడంలోనే మనసుకొక తృప్తి, ఒక ఆనందం కలుగుతుంది. విషయాన్ని చూపడం కాదు ధ్వనింపజేయాలి. చర్మ చక్షువులకందని జీవిత రహస్యాన్ని (Mystery) నిర్దుష్టంగా కచ్చితంగా నిర్వహింపజేయడంలోనే ప్రతీకాత్మకత ఉంది. ఒకానొక మానసిక స్థితిని ఆవిష్కరించడానికి సంబంధించిన వస్తువులు క్రమోన్మీలనమయ్యేటట్టు దానిని ఆవాహన చేయడంలోనూ విపర్యంగా వస్తువునెన్నుకొని దాని నుండి సంబంధిత మానసిక స్థితికి క్రమంగా విడగొట్టడంలోనూ ఈ కవి కర్మ ఇమిడి ఉంది. (Literary Criticism, A short history- Malarmay, P:52)

ఇంత రాయడం వెనుక కవి తన కావ్య సృష్టికి కంటికి కనిపించని సూత్రాలను కొన్నింటిని పాటించిన అనుభవం తప్పక ఉండి ఉండాలి. ఇది కేవలం ఆవేశం, ఆవేదనల ద్వారా సాకారమయ్యింది కాదు. యువకులు కవిత్వానికి ఎట్టి పరిశ్రమ అవసరం లేదనుకుంటారు. సర్కస్ లో ఆశ్చర్యపరిచే అద్భుతమైన విన్యాసాలను చేసి చూపించే కళాకారుడు అంతకు ముందే ఎన్నోసార్లు ఎముకలు విరిచేటట్టు సాధన చేసి ఉంటాడు. కవికీ అటువంటి సాధనే అవసరం. అంతే కాని ఆవేశమో, ఆవేదనో కావ్య సృష్టికి కారణాలు కాజాలవు. కవితావేశం నిత్యాభ్యాసానికి పరిశ్రమకు ఫలితం అవుతుంది అంతే. దీనికి నిదర్శనంగా ఈ కవి రచించిన ‘తెల్లకాగితం’ ‘వేలికొసన’ కవిత్వ సంపుటాలు, ఒక్కమాట, రెండు మాటలు కవిత్వత్త్వాలను చూపించవచ్చు. ఇంతటి అభ్యసనం, సాధన మూలధనంగా ఉంది. కనుకనే రావూరి భరద్వాజ (ఐతరేయం), బోయి భీమన్న (రాగ వైశాఖి) వంటి ఉత్తమ రచనల సరసన చేర్చదగిన ”పరాం ప్రేయసిని” మనకందించ గలిగాడు. ఇంతటి ఉదాత్తమైన సృజన రావడానికి కవిలోని సమస్త మానసిక శక్తులను కూడదీసుకొని సమస్యను సంవిధానంతోను, తాత్వికతతోను ముడివేసి ప్రతీకాత్మకంగా కవితా నిర్మాణం చేయడమే ప్రధాన కారణం.

‘యశస్వి’ కలంలోని ధ్వన్యాత్మకత శుద్ధ వచనాన్ని కూడా విడిచి ఉ‍ండదు. దీనికి ఉదాహరణగా ‘నారికేళ సలిలము భంగిన్ ” అనే లేఖ నుండి చూడవచ్చు.

”వేరు వేరు నేపథ్యాల నుండి వచ్చి ఒక చోట కలబడ్డాం. మనం కన్నది ఒకడ్నే అయినా ఒక్కసారిగా నీకూ నాకూ నడుమ పిల్లాడు పిల్ల, నీకు ఇద్దరు, నాకు ముగ్గురూ పిల్లలై కొత్త కాపురం కాస్తా కుచేలమయింది’… జీవితం ఓ గాలి దుమారం. దూరం నుండి భయపెడుతుంది. గడ్డిపోచలం మనకేం భయం”

బిడ్డకు తల్లైన అక్కకు, చెల్లి తోడుగా రావడం వల్ల కవితో సహా నలుగురైన కుటుంబ సభ్యుల సంఖ్య, ఆర్థిక భారం పెరగడం, గాలి వీచిన వైపునకు గడ్డి పోచ కొట్టుకుపోయినట్టు జీవితం గడిచిపోవడం అనేది పై పంక్తులలోని భావం పైన కనిపించేవి కేవలం వచనంతో రాసిన వాక్యాలు కావు. అవి కవితా వచనం. ధ్వనిని, శ్లేషను అంతర్వాహినిగా ప్రవహింప జేస్తున్న కవి ప్రజ్ఞకు భౌతిక రూపాలు.

 1. *#జీవితం _ కవి నిర్వచనాలు*

ఈ కవి జీవితాన్ని నిర్వహించిన ప్రతీసారీ, అతనిలోని తాత్విక చింతన పదేపదే తొంగి చూస్తుండటం విశేషం. ‘జీవితం ఒక కళ’ (ఏంటిదంతా అంటే) జీవితం ఒక గాలి దుమారం (నారికేళ సలిలము భంగిన్ ), జీవితం పరీక్ష గుర్తుకొస్తున్నాయి. జీవితం అసాకారమైన నిజం (నిదురపో హాయిగా), జీవితమంటే షాపింగ్ మాల్ సంస్కృతి కాదు (ఇంతకీ ఏమిటంటానూ), జీవితం (నచ్చని ఇచ్చకాలు) మొదలైనవన్నీ జీవితానికి కవి పేర్కొన్న నిర్వచనాలు.

జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన లేనివారు ఇచ్చే నిర్వచనాలు కావివి జీవితాన్ని ఆత్మీయంగా అనుభవించే తాదాత్మ్యతను పొందిన వారికే ఇవ్వడం సాధ్యపడేవి. ఇంకా ఈ జీవితానికి తృణమో, పణమో, దొరికిన చోట దొరికినంత అంటూ సంతృప్తిని, సర్దుబాటును కూడా అలవాటు చేయాలని చెప్పుకుంటాడు. జీవితాన్ని సాధ్యమైనంత సానుకూలంగా మలుచుకొని ఆనందాన్ని పొందాలని ఉవాచిస్తాడు.

 1. *#పిలుపులు _ వలపులు*

పిలుపులోనే నిర్మల ప్రేమ ప్రతిధ్వనిస్తుంది. ఈ రచన ప్రారంభమే పిలుపుతో మొదలవుతుంది. లడ్డూ పాపా! అనే సంభోధన కవి మనస్సులో ఆ సౌభాగ్యవతిపై గల అనురాగాన్ని సూచిస్తున్నది. ఇలాంటివే ఆయా సందర్భాల్లో ప్రయోగించినవి ఉన్నాయి.

పిల్లా!; ప్రియురాలా!; అలక చిలకా!; చందమామా!; వెన్నెలమ్మా!; బండుమల్లీ!; అలకల రాణీ!; నా రోజాపువ్వా!, లడ్డూ! మొదలైనవి. ఈ సంభోధనలన్నీ కవిలోని అనురాగ మూర్తిమత్వానికి ప్రతీకలు. ఒక భర్త భార్యను ఇంత గోముగా, ఇన్నిన్ని తీరుల పిలిచి మురిసిపోవడం అరుదు. ఈ సంభోధనలు  లేఖను ప్రారంభిస్తూనో, ప్రేమను ప్రకటించాలనుకున్నప్పుడు సన్నివేశాన్ని కల్పి‍ంచుకున్నప్పడో  సందర్భం తారసపడినప్పుడు తన్మయత్వం చెందుతూనో కవి ఇష్టపూర్వకంగా చేసినవి. ఈ ప్రతి సంభోధనలోనూ మనసుపెట్టి చూసిన వారికి పవిత్ర దాంపత్య రక్తి గోచరమవుతుంది.

ఇలా ప్రేమ ప్రకటన కొరకు హృదయ సమర్పణ భావనతో చేసిన సంభోధనలు బోయి భీమన్న గారి ‘జానపదుని జాబులు’, రాగ వైశాలి వంటి రచనల్లోనూ కనిపిస్తాయి. జానపదుని జాబులలో ప్రియసఖిని ఉద్దేశించి చేసిన వాటిలో నెచ్చెలీ!, ప్రియతమా!, చెలీ, ప్రియసహృద్దీ! మొదలైనవి ప్రస్తావనీయమైనవి ‘రాగవైశాఖి’లో

–        కళామయీ! ఆనందరమా! వైశాఖీ! ప్రణయ పరంజ్యోతీ! రాగోన్మనీ! దేవీ! పూర్ణకళా సమభిజ్ఞా! పూర్ణేందు మనోజ్ఞా! రాగపూర్ణజ్యోత్స్నా! రాగరమాపూర్ణీ! ఆమ్రవల్లరీ! రసాలీశ్వరీ! బ్రహ్మానంద కాదంబరీ! వంటివి కనిపిస్తాయి.

–        రాయప్రోలు సుబ్బారావు గారి ‘లలిత’ కావ్యం లోనూ కావ్య నాయికా గుణగణాలను తెల్పుతూ శీలవర్ణన చేసే పద్యం లోనూ ఇటువంతి ప్రియా సంబోధనలున్నాయి.

నా ప్రియ సఖీ! అనురూప గు

ణ ప్రచుర! ప్రసన్నశీల! నవనీత శిరీ!

ష ప్రణయ మృదుల హృదయ (లలిత- రాయప్రోలు)

షేక్స్పియర్ కూడ తన ప్రేయసిని దేవీ! అంటూ సంబోధించడం గమనించండి..

I grant I never saw goddess go-

`My Mistress’ when she walks, treads on the ground (sonnets, cXXX)

దేవులపల్లి కృష్ణ శాస్త్రి తన ప్రేయసి ‘ఊర్వశి’ని మఘవ మస్తక మకుట మాణిక్య రాజ్ఞి గా సంబోధించారు.

 1. కుల పాలికా ప్రణయము*

పరిశీలనగా పఠిస్తే ‘పరాం ప్రేయసి’లోని ప్రతి లేఖా ఖండికలోనూ కులపాలికా ప్రణయము నిండుదనంతో తొణికిసలాడుతూ గోచరమవుతుంది. ఇటువంటి కులపాలికా ప్రణయాన్ని రమ్యంగా చిత్రించిన వారిలో విశ్వనాథ, నాయని, అగ్రేసరులు, విశ్వనాథ ‘గిరికుమారుని ప్రేమ గీతాలు’, నాయని సుబ్బారావు ‘సౌభద్రుని ప్రణయ యాత్ర’, ఫలశ్రుతి’ అను కావ్యములు ఈ ప్రణయ చిత్రణకు ప్రతినిధి కావ్యాలు. కులపాలికా ప్రణయ చిత్రణలో వీరిపై పాశ్చాత్య ప్రభావం లేదు. ఇది మనగడ్డలో పుట్టి పెరిగిన సంప్రదాయమే. భారతీయుల గృహస్థాశ్రమ ధర్మము ఇంద్రియాతీతమైన అనురాగ రజ్జువులతో పెనగొన్నది’ (ఆధునికాంధ్ర కవిత్వము, సప్ర దాయములు, ప్రయోగములు _ పుట 333)

మన పూర్వీకులు భార్య ఎట్లుండవలెనో, భర్త ఎట్లు వ్యవహరించవలెనో శ్లోకాల్లో నిక్షిప్తం చేసి మనకందించారు. అటువంటి శ్లోకాలను పరిశీస్తే, ఈ కృతికర్త భర్తగా ఎలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడో తన రచనలోని సారాన్ని బట్టి అంచనా వేయవచ్చు.

భార్య:

”కార్యేషుదాసీ కరణేషుమంత్రీ

భోజ్యేషు మాతా శయనేషు రంభా

రూపేచాలక్ష్మీ క్షమయా ధరిత్రీ

షట్కర్మ యుక్తా కులధర్మ పత్నీ” (చాటువు)

పనులు చేయుటలో దాసివలె, సలహాలివ్వడంలో మంత్రివలె, భోజనం వడ్డించేటప్పుడు తల్లివలె, సంసారిక సుఖాన్ని అందించేటప్పుడు  అనుకూలవతివలె, రూపంలో లక్ష్మిలాగ, సహనంలో భూమాతలా ఉండటం కులపత్ని కర్తవ్యమని భావము.

భర్త:

”కార్యేషు యోగీ కరణేషు దక్షఃర

భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం

రూపేచ  కృష్ణః క్షమయాతు రామః

షట్కర్మ యుక్తః ఖలుధర్మ నాధః” (కామందజ నీతి శాస్త్రం)

పనులు చెయ్యడంలో ఒక యోగివలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరించాలి. సమర్థుడైన యుండాలి. రూపంలో కృష్ణునివలె మానసికంగా ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. ఓర్పు వహించడంలో రామునిలా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. వడ్డించిన పదార్థాన్ని సంతృప్తిగా భుజించాలి. సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రునివలె అండగా ఉండాలి. మంచి చెడుల్లో పాలు పంచుకోవాలి. ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మ వర్తనునిగా కొనియాడబడతాడు.

ఈ పై ఆరు విధాలైన కర్మలను భర్తగా సక్రమంగా నిర్వర్తించడమే గాక ప్రేమ తాదాత్మ్యమును పొంది కవి చేసిన కావ్యరచన ఇది. ఇంద్రియాతీతమైన నిర్మల ప్రేమలో సమాధినొంది ఆనంద పీయూషను సాధించడానికి దీని పరమ లక్ష్యంగా ఉన్నది. దీనికి కవి అడుగడుగునా ప్రదర్శించిన అద్వైత దృష్టి దిక్సూచి.

 1. *#కవనంలో కవి జీవనం*

”కవి జీవితాన్ని అధ్యయనం చేయడమే కావ్య రహస్యాన్ని తెలుసుకునేందుకు ఏకైక మార్గమన్నది సరైనది కాదు. కొన్ని వాక్యాలు ఆత్మాశ్రయమైన రచనలుగా ఉండగా కొన్ని వస్తువాశ్రయమైనవై ఉంటాయి. ఆత్మాశ్రయమైన రచనలలో కూడా ‘నేను’ అన్నది సరిగ్గా కవి వ్యక్తిగత జీవితాన్నే ప్రతిఫలిస్తోందని నిర్ధరించడం కష్టం. కవి దర్శనం స్వీయమైన లౌకికానుభవ పరిధిని దాటే ఉంటుంది. కీట్సు  అన్నట్టు కవికి ప్రత్యేకమైన మూర్తిమత్వం లేదు. అతడు అత్యుత్తమ దేవతలా కనబడే పాత్రను సృష్టంచడంలో ఎంతటి ఉత్సాహాన్ని చూపుతాడో, పరమకిరాతకుడైన ‘ఇయాగో’ ను సృషించడంలోనూ అంతటి ఉత్సాహాన్ని చూపుతాడు. అన్ని పాత్రలలోను అతడు తాదాత్మ్య భావాన్ని భజిస్తాడు. (పాశ్చాత్య సాహిత్య విమర్శ _ చరిత్ర సిద్ధాంతాలు. పుట _ 171)

ఈ రచనలో కవి జీవితంలోని యదార్థ ఘటనలే కవిత్వం చేయబడ్డాయి. అయితే కవి జీవిత విశేషాలు అతని రచనల్లో తప్పక పొందుపరచబడతాయనే విషయంలో అర్థ సత్యమే ఉంది. కవి రచన అతని జీవితాన్ని ప్రతిఫలింపజేయడమనేది అరుదుగానే జరుగుతుంటుంది. కవి ఎన్నెన్నో ఉదాత్తమైన భావాలు రచనల్లో ఆవిష్కరిస్తాడు. అంతమాత్రాన ఆ కవి ఉత్తముడని నిర్ధారించడం సమంజసం కాదు. ఆ మాటకొస్తే, ప్రతీ కవి సమాజాన్ని ఉద్ధరించే విషయాలనే ప్రకటిస్తాడు. అటువంటప్పుడు కవులంతా మహోన్నతులే కావాలి కదా! వాస్తవం దానికి భిన్నంగా ఎందుకు ఉంది? అంటే కవి రచనలను బట్టి ఆ కవి జీవితాన్ని అంచనా వేయడవరకే చేయగలమని అర్థం చేసుకోవాలి. ఈ రచన విషయంలో కవి జీవితంలోని కొన్ని యధార్ఘటనల ద్వారా రచనలోని వాస్తవికత మూలంగా కవి వ్యక్తిత్వము, వ్యవహార శైలి, జీవన విధానము ఆత్మౌన్నత్యమూ తెలుస్తాయి.

ఇది తన మనసులోని ఊసులను, నిజ జీవితంలోని అనుభవాలను జీవన సహచరితో నివేదించుకునేందుకు ఉద్దేశించినవని కవే స్వయంగా చెప్పుకున్నాడు.”ఇవి నాకు నేను చెప్పుకుం టున్న మాటలు… ఈ ఉత్తరాలు తనచుట్టూ గిరిగీసుకొని జీవితాన్ని గడిపేస్తున్న నెచ్చెలితో నా తలపోతలు”.. అని ఈ లేఖలన్నింటిలోను, తను ఓపిక ఉన్నప్పుడే చెప్పాలనుకుని చెప్పుకున్న యధార్థ గాథ. జ్ఞాపకాలను, స్వీయానుభవాలను సహచరికి గుర్తుచేసుకున్న విరహవ్యథ, అనురాగ సుధ, తియ్యని బాధ.

”కవి జీవితాన్ని తెలుసుకుంటే కావ్యంలో పేర్కొనబడిన కొన్న్ని అంశాలను అర్థం చేసుకోవడానికి వీలు కలుగవచ్చు. అతడొకానొక సాహిత్య సంప్రదాయంలో ఎలా పెరిగాడో, అతనిని ప్రభావితం చేసిన అంశాలేవో తెలుసుకోవడానికి అవకాశం ఉండవచ్చు. కాని టేన్ (Taine) ఒకానొక చోట అన్నట్టు ‘డికెన్స్ ‘ రాసిన నలభై సంపుటాలు ఆయనను గురించి తెలుసుకోవడానికి చాలు. రచయిత ప్రజ్ఞ (Talent) అంతా అతని రచనల్లోనే ఉంటుంది” (Forty valumes, more than suffice to know a man… his talent it in his work – Taine: A History of Modern Criticism. Vol. IV Rane Wellek)

ఒక కవి ఎదిగి వచ్చిన, సాహిత్య, సాంస్కృతిక, సంdప్రదాయాలు ఆ కవి రచనల్లో కనబడతాయి. ఈ రచనలోను అటువంటి సందర్భాలు ఉటంకించబడ్డాయి. ఇవే కవి నేపథ్యాన్ని తెలుసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. పరిశీలనగా చదివితే ఈ కవి మధ్యతరగతి జీవన విధానం, సంప్రదాయాలకు విలువ నిచ్చి సంస్కారం, క్రమ శిక్షణలను నేర్చుకున్న వాతావరణం బోధపడుతుంది.

“అమ్మ దేవత, ఇదేమాట కనిపించిన చోటల్లా రాసుకున్నా… అమ్మ కథలన్నీ ఆణిముత్యాలే. నాన్న ఉద్యోగార్ధం ఊళ్ళట్టుకు తిరుగుతున్నప్పుడు పిల్లలిద్దర్నీ చెరో పక్కన వేసుకొని వినువీధిన చందమామను తన వేలికు వేలాడదీసి చూపించేది” (గుర్తుకొస్తున్నాయి. పుట 50)

”అమ్మ నాకు కావలసినంత  స్వేచ్ఛనిచ్చింది. చుట్టూ క్రమశిక్షణ అనే పంజరాన్ని నిర్మించింది. ప్రపంచం దృష్టి పడకుండా పెంచింది. ఆమె జీవనానుభవసారం నేను” (గుర్తుకొస్తున్నాయి. పుట 53)

”అమ్మ తాను చదువుకుంటూ మాకు చదువు చెప్పేది…సర్కారు బడుల్లో తెలుగు మీడియం చదువులు.. పెదనాన్న గారు క్లాస్ టీచర్. పెద్దమ్మ సంరక్షణలో పదవ తరగతి చదివించడం, చిన్నాన్న బోధించే కాలేజీలో పి.జి. చెయ్యడం ఇవన్నీ తీపి గుర్తులు” (గుర్తుకొస్తున్నాయి. పుట 54)

”డబ్బు ఇబ్బడి ముబ్బడిగా ఉంటే జీవితం ఈ తీరున ఉండేగా”… (మనోవైకల్యానికి మూల కారణం _ పుట. 69)

ఈ పై పంక్తులను బట్టి కవి నేపథ్యం కొంత కళ్ళముందు కదులుతుంది. ఉన్నంతలో సంతోషంగా, సంస్కారవంతంగా, గుంభనంగా సాగుతూ, సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబంలో పుట్టి పెరిగినట్లు తెలుస్తుంది.

”ఆస్తి నాస్తైనా అంతస్తు దిగకపోవడం, వెంట ఏమీ తెచ్చుకోనక్కరలేదన్నా అమ్మ పెడతానన్న వడ్డాణం, అరవంకీ వంక అడ్డం పెట్టుకొని ఏర్పాట్లు (గడుసరి _ లాహిరి . పుట 31) అనడంతో తన జీవన సహచరిదీ ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమని తెలుస్తుంది. ఇలా ఏ కవి రచనలోనైనా ఆ కవి నేపథ్యం ఎంతో కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది.

 1. *లతలు, కలతలు- అత్తాకోడళ్ళు*

వివాహంతో ఒక్కటైన జంట, ఆకుటుంబానికి మరో వ్యక్తిని అనుబంధంగా జతచేస్తుంది. పుట్టీపెరిగిన నేపథ్యాలు, ఆచరించిన సాంప్రదాయాలు, అలవాట్లు మెట్టినింటికి వచ్చేసరికి మార్పులకు చేర్పులకు గురికావలసి ఉంటుంది.

సాధారణంగా ఇటువంటి సందర్భాలలోనే ప్రత్యేకించి అత్తాకోడళ్ళ మధ్య విభేధాలకు అవకాశం ఉంటుంది.  ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోతే సమస్యే లేదు. అహంభావాలు, ఐశ్వర్యాలు, అంతరాలు అడ్డుతగిలినప్పుడు వైరుధ్యాలు వస్తుంటాయి. అయితే అన్నికుటుంబాలలోనూ ఈ అంశాలే సమస్యలకు కారణాలు కాకపోవచ్చు. అవి మరో రూపంలో పొడచూపవచ్చు. ఈ రకమైన సందర్భాలను, సన్నివేశాలను సూచన ప్రాయంగా కవి ఈ రచనలో ప్రస్తావించడం కనిపిస్తుంది.

“ఉల్లినికోసినా కన్నీళ్లొస్తాయి, అత్త సుద్దులు చెప్పినా. కత్తి సానకు నిప్పురవ్వలు, పోపు వేగినపుడు చిటపటలూ సహజం. ప్రాయాన్ని బట్టి మారే అభిప్రాయాలు తప్ప అత్తాకోడళ్లిద్దరూ ఒకేనాణానికి రెండు వైపులాఉండి, గోడున నుంచున్నవాడ్ని గిరగిరా తిప్పుతారు. అత్త స్టాండర్డ్ వెర్షన్- బట్ ఓల్డ్; కోడలు అత్తకు లేటెస్ట్ వెర్షన్–బీటా. అత్త ఊసు లేకుండా  కోడలు ప్రెషరుకుక్కరు తెరవదు, కోడరికంలో అత్త వడ్డించేది అప్పుడప్పుడు అత్తెసరు మార్కులు. జీవితం వంట వండకముందు కత్తిపీటకు తప్ప కొత్తిమీరగాడికి ఈ వివరం అంతుచిక్కదు.” (అత్త ఉల్లిపాయ- కోడలు మిరపకాయ, పుట: 39)

అత్త పెద్దరికం తో కోడలు అనుభవలేమి కలబడితే వచ్చే పేచీలు సాధారణంగా జరిగేవే! అందుకే “కోడరికానికి అత్త వడ్దించేది అత్తెసరు మార్కులు” కోడలికి వివరం చెప్పవలసినది అత్తగారేనాయే. కోడలేమో తల్లి మీద బెంగతో తన “తిక్క”ను అత్తరికం మీదకే తప్ప ఎవరి మీద చూపించగలదు! అందుకే ఇరువురూ లౌక్యంగా వ్యవహరించాలని, భేషజాలను పక్కనపెట్టి స్నేహశాలను నిర్మించుకోవాలని సూచన కూడా చేస్తాడు కవి. ఇంకా “ఇటువంటి సందర్భాలే జీవన సాగర తీరాన్ని తాకే ప్రేమ కెరటాలని” సకారాత్మక భావజాలాన్ని పంచిపెడతాడు.

“ఇంతకుమించి సరిహద్దు తగాదాలేమైనా ఉంటాయా! అత్తా-కోడళ్ళకి! ఒకరు వేసవి మరొకరు వర్షరుతువు. వలయమై విస్తరిస్తున్న సందర్భాల మబ్బులు. ఎంత ఎండకాస్తే అంత వాన కురుస్తుంది. ఎండా- వానాలతో కలిసి నడవడం, ఏ సందర్భానికి ఆ గొడుగు పట్టడం ఇదే జీవనమకరందం.” (అత్త అల్లం- కోడలు వెల్లుల్లి, పుట 40) ఈ వాక్యాలలో అత్తకీ కోడలికి నడుమ కథానాయకుడి ప్రవేశం అత్యావశ్యకం అన్నట్లు ధ్వనిస్తుంది. వారి నడుమ కొడుకూ భర్త పాత్ర ప్రవేశం పలాయనత్వమే. ఇంకా చూస్తే ఏ పొరపచ్చాలలోనైనా వారే సర్దుకుపోతారని చెప్పడం ఉంది. అందుకే ‘ఎంత ఎండకు అంత వాన’ అంటున్నాడు. ఇంకాస్త ముందుకువెళ్ళి ’ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం జీవన మకరందం’ అంటున్నాడు. ఒకే కుటుంబ సభ్యుల మధ్య ఈ వ్యవహార శైలి సమంజసమేనా! కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు, అనుమానాలకూ, అపోహలకూ తావివ్వకుండా అద్దం ముందు ముఖంలా అన్నీ అర్థవంతంగా ఉండాలి. అవసరమైనప్పుడు తల్లితో కొడుకుగా, భార్యతో భర్తగా ఉన్న వ్యక్తి కల్పించుకుని సమస్య పరిష్కారానికి సమర్థమైన పాత్ర పోషించాలి. అయితే కవి ఉద్దేశం ఇది కాకపోవచ్చు. ఎవరి మనస్సులను నొప్పించకుండా సంయమనం పాటిస్తే కొంతకాలానికి అవి సర్దుబాటు అవుతాయని అభిప్రాయం కావచ్చు. ఒక్కోసారి వాస్తవం మాట్లాడినా తన రెండు కళ్ళలాంటి వారి కంట నీరు కారడానికి కారణం కావచ్చు. మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల సమస్య పెద్దది కావచ్చు. చిన్నచిన్న విభేధాలను పెద్దవి చేయడం ఇష్టం లేకనే కవి ఈవిధంగా ప్రస్తావించి ఉండవచ్చు. అందుకే ఏ సందర్భానికి ఎలా వ్యవహరించాలో తెలిసి ఉండాలన్న భావం వ్యక్తమౌతుంది.

విద్యావంతులు, విజ్ఞులు అయిన అత్తాకోడళ్ళ మధ్య అలసట బెంగల ఫలితంగా…అసహనాలు, విసుర్లు తప్పవైరుధ్యాలకు పెద్ద కారణాలు ఉండవని చెప్పడం కవి భావన. అవి గాలి వీచినప్పుడు తొలగిపోయే తెల్లమబ్బులవంటివి. అలా అప్పుడప్పుడు విబేధాలు పొడచూపడం, వాటీని సామరస్యంగా పరిష్కరించుకుని అప్పటికప్పుడు కలసిపోవడం జీవితాన్ని అందగింపజేస్తుందని కవి అభిప్రాయంగా ఉంది. ఈ విషయానే కవితాత్మకంగా లేఖ చివర్లో.. : “కూర ఘుమఘుమలాడాలంటే అల్లం-వెల్లుల్లిముద్దలా కలవాలి.. విడివిడిగా ఘాటు, కలియబెట్టి ఉడికించే పనిలో ఎక్కువ తక్కువలు అనుభవాలు. వండుకు తినడమే ఆస్వాదన. రుచులన్నీ కలిసే ఉంటాయి రసాలూరిస్తూ.” అంటాడు.

అత్తగా మారిన అమ్మకు కొడుకూ కోడలు అన్యోన్యంగా సుఖ జీవనం చేయాలని ఆశించడం తప్ప వేరే స్వార్థమేముంటుంది! ఆ ఇరువురి కలయికని తల్లి మనసుతో దీవించింది కనుకనే వారి సాంసారిక జీవనంలో అనూహ్యంగా ఏర్పడిన అంతరాయానికి చింతించడం.

విషయానుభవభోక్తమయినవారు అవగాహన చేసుకుంటారు. ఆత్మీయులు చనువుకొద్దీ మంచికోరి అసంతృప్తినీ, అసహనాన్ని ప్రదర్శిస్తారు. ఇక్కడ అత్త బాధ అర్థవంతం. ఈ ప్రాయం లో కోడలికి అర్థం కాదు. నడి వయసుకుకూడా రానికొడుకు తన కోడలిని పసిపాపలా లాలించవలసి రావడం ఏ కన్నతల్లి సంతోషంగా స్వీకరించగలదు! అదే అమ్మ మనసు ఔన్నత్యం. అయితే దీనికి కారణాల్ని వెతికి కోడలిని దోషిగా నిలబెట్టలేం. ఎవరూ కావాలని రుగ్మతల బారిన పడరు, అనుకోనివికూడా మంచికో- చెడుకో సంభవిస్తూనే ఉంటాయి.

 *నగరం- ఆశ్రయ గోపురం*

పుట్టి పెరిగింది ఏ ప్రాంతమైనా పెట్టి పోషించే ఊరే కన్నతల్లి అంటారు. అలా ఉద్యోగం నిమిత్తం హైదరాబాదు వచ్చినప్పుడు వారిని ఆ నగరం ఎంత ఆదరంగా ఆహ్వానించిందో, ఎలా ప్రేమాభిమానాలను కురిపిస్తూ అక్కున చేర్చుకున్నదో తెలియజేయడం ఈ రచనలో మరో ప్రత్యేకాంశంగా ఉంది. నగర వర్ణన చేసిన ఆధునిక కవులలో అలిశెట్టి ప్రభాకర్, శేషేంద్ర, కుందుర్తి, విరించి వంటి వారు ముందు వరుసలో ఉన్నారు.

‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ ‘ అంటాడు గురజాడ. అటువంటి మంచి మనుషులున్న నగరం హైదరాబాదు అని కవి భావన. అనేక సందర్భాల్లో నగర సంబంధమైన అనుభవాలను గుర్తు చేసుకోవడం  ఈ లేఖల్లో ఒక పాయగా దర్శనమిస్తుంది. కవి ఆ నగరానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కనబడుతుంది.

‘హైదరాబాదు బదిలీ అయింది. అమీరుపేటలో బస. కోరుకున్న ఏకాంత వాసం”… ”హైదరాబాదు నీకు సలాం! పుట్టబోయే బిడ్డను, వాడి అమ్మను నువ్వే అమ్మలా కాపాడావు ఎప్పుడూ.. (మనవాడెలా వచ్చాడు పుట _ 36)

”నీ బొజ్జలో బజ్జున్న బుజ్జోడి సాక్షిగా భాగ్యనగరం మనకు ఎంతో ప్రేమను పంచింది. నీళ్ళోసుకున్న పిల్ల భర్తతోపాటు చాయ్ కొట్టుకు కూడా వస్తే వేడి నురగల పాలయ్యింది. వద్దన్నా బుజ్జగించి మరీ తాగించింది.. కూర్చోబెట్టి చల్లగాలయింది… రోడ్డు దాటే సమయాల్లో ట్రాఫిక్ పోలీస్ నీ అన్నో, బాబయ్యో అనిపించేవాడు. .. ఎందరికి ఏమిచ్చినా… నాకు నిన్ను అందంగా చూసుకునే అవకాశాన్ని ఊరంతా తోడుందన్న భరోసాని ఎల్లకాలం ఇచ్చింది ఈ భాగ్యనగరమే…

సఫల ప్రేమకథకు సాక్షిగా పుట్టిన ఈ నగరమే, తన దుమ్ము చేతులతో నిమిరి, వాన చినుకులతో తడిపి మనల్ని బిడ్డల్లా సాకింది. అక్కున చేర్చుకుంది. ఇప్పటికీ మన ఆలనాపాలనా చూస్తుంది ఈ నగరమే” (ఈ నగరం ఎంతో మంచిది. పుట 37)

”మనమంటే ఈ నగరానికి వల్లమాలిన వాత్సల్యం. పెళ్ళి పీటలపై ఉండగానే హనీమూన్ కి రమ్మని రామోజీ తారానగరం ఆహ్వానించింది. ఆ పై కాలాన ఈ నగరం రోజువారీ ఉద్యోగానికి అక్కడికే రప్పించుకుంది”. (ఇంకాస్త వెనక్కు వెళ్ళి. పుట 38)

ప్రేమకు సాక్షీ భూతంగా వెలిసిన భాగ్యనగరంపై కవికి ఎటువంటి ఫిర్యాదు లేదు. పైగా ఎంతో కృతజ్ఞత ఉంది. ఈ నగరంలో తోటివారికి సహాయపడే మంచి మనుషులను చూశాడు. స్వపర భేదం లేకుండా సహకారాన్నందించిన ఆప్యాయతల్ని దర్శ్ంచాడు. ఒడిలో లాలించి, పోషించిన మాతృత్వ మాధుర్యాలను అనుభూతించాడు. ప్రేమల్ని ప్రేమికుల్ని విజేతల్ని చేసే ఔదార్యాన్ని గ్రహించాడు. ఇదంతా కవిలోని సానుకూల మనస్తత్వానికి నిదర్శనం. దృష్టిని బట్టి సృష్టి అంటారు కదా! ఈ నగరంలో ఇరుకు జీవనాలు, మురికి మనస్తత్వాలు కనిపించలేదందుకే. ప్రేమే జీవన వేదనమైన వ్యక్తికి మంచితనం తప్ప వంచన కనిపించదు. మధుమాసం తప్ప శిశిర‍, తారస పడదు. విశ్వప్రేమ తత్వం ఈ పనికిరని పంపకిలాన్ని సమర్ధిస్తుందని కాదు. ఇక్కడ కవికి తన ఎడల నగరం ఎలా వ్యవహరించిందన్నదే ఇక్కడ ప్రస్తావించబడినది గనుక కవి నిందార్హుడు కాదు.

 1. *#ప్రేమంటే*

ఆదర్శవంతంగా మనుషుల్ని, మనసుల్ని ప్రేమించిన ఈ కవి నిజమైన ప్రేమంటే ఏమిటో, అదెలా ఉంటుందో తన శ్రీమతిని ఉద్దేశించి చెప్పిన మాటలు ఒక అద్వైత వాదిని, రససిద్ధిని పొందిన తాత్వికుణ్ణి స్ఫురింపజేస్తాయి.

”ప్రేమంటే పరీక్ష.. ప్రేమంటే రుచి తెలిసిన కమ్మని కూర. అమ్మ పెట్టిన ఆవకాయ  పచ్చడి, జీవన రసధుని. మధుర భావనా లాహిరి, జీవితం ఆ ప్రేమకోరే మనసు చేసే సాగర ఘోష. (వలపుల కిసమసలు. పుట 65)

”ప్రేమంటే భయాన్ని జయించడమే. ప్యార్ కియాతో డర్నాక్యా… ఈ పాట కన్నా గొప్ప జీవితసారం ఉంటుందంటావా! జీవన సహచరితో ప్రేమరతి క్రియ కాదు. నిత్యరత్యాంతర అనుభూతి. ఆనంద విభూతి (సాహిత్య సంస్కారం. పుట 56)

ఈ భౌతిక లోకాతీతమైన  భావనను కవి అనుభూతించినట్లు తెలుస్తున్న వాక్యాలు ప్రేమను నిర్వచించిన ప్రముఖులైన వారి కంటే ప్రత్యక్షంగా నిలబెడుతున్నాయి.

“నీపై నాప్రేమ, కలసి జీవించాలన్న సంకల్పం, జీవితాన్ని గొప్ప ఆకర్షణవైపు పారించింది. నిన్ను చేరడానికి  వీటిని మించిన తరంగశక్తి దొరకలేదు. ప్రేమనుమించిన అనుభూతి భావన నేనెన్నడూ పొందలేదు.” అంటాడు.

ఇటువంటి అనుభూతిని తన జీవిత భాగస్వామి తనతో పాటు పొందలేక పోతున్నందుకు, తన అనురాగాన్ని ఆమె ఆస్వాదించే పరిస్థితి దూరమైనందుకు”జీవనతంత్రి తెగిన చప్పుడు” ను అదే స్థితిలో వినగలుగుతున్నాడు.

“వేదనలో ప్రాణేశ్వరిని చూడడం సినిమా చూసినంత తేలికకాదు. నా ఎదలయ నువ్వైనప్పుడు, నీ మనోవయస్సు పదేళ్లున్నప్పుడు, నీ నవ్వులో నేలేనప్పుడు నా జీవన తంత్రి తెగిన చప్పుడు.” (రహస్య సమాచారం, పుట: 57)

ఇంకా ప్రేమ ఏమేమి చేస్తుందో,  దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుపుతూ..

“పశుప్రవృత్తి నుంచి ఇంకా బయటపడని మగాడు ప్రేమను పండించుకోవడం ముందు విధివంచితుడే. ఎందుకంటే ఏం చెప్పను!! ప్రేమ  నిత్యచైతన్యశీలి  ఎన్నిరంగులైనా మార్చగలదు. మగాడి కామమే జీవితసత్యం. ఒక్క ఒప్పందానికి జీవితాన్ని తాకట్టుపెట్టి ఎన్ని  అవసరాలైనా తీర్చగలదు.” అంటాడు(వద్దంటే వినవే, పుట: 59). చదువుతుంటే, తరచి చూడగలిగితే, ఈ పంక్తుల సారాంశానికి తన జీవితాన్ని నిదర్శనంగా నిలబెట్టినట్టు కనపడుతుంది కదూ!

ప్రేమటే కామించడం కాదు, ప్రేమంటే రెండు శరీరాలు కలవడం కాదు. ప్రేమంటే ఒక అద్భుత అపుర్వ అవ్యక్త ఆనంద వేదన; అలౌకిక ఆత్మానుభూతి. రెండు మనసుల మధ్య రవళించే రాగమోహన మధుర నాదం, రాగరంజిత లోచనకాంతి, రాగ రోచిర్నిత్య నిర్మలధర స్మితం. ఇంతా చదివి ఈ కవి ప్రజ్ఞను, ఆదర్శ ప్రేమను, తాత్విక భావనా శక్తిని అతిశయోక్తులనుకోనూ వచ్చు.

“ అపూర్వ లోకాలలో, లోకోత్తర సౌందర్యాలను దర్శించి, దివ్య మాధుర్యాలను అనుభవించి, తన అనుభవ పీయూషాన్ని పంచిపెట్టవచ్చిన కవి.. సామాన్యుడికి  సహజోక్తి లో అర్థం కాడు; పైగా అనుమానించబడతాడు కూడా! ఏ కోణం నుంచి చూసేవాడికి ఆ కోణం నుంచి కనపడేది సత్యం. మరో దృక్కోణాన్ని ఆదరించలేడు తన అనుభవం లో లేనిది నమ్మనీయదు. అర్థం చేసుకోలేడు సామాన్యుడు.. గుర్తించ లేడు పండితుడు, సహించలేడు నాయకుడు.(డా. బోయి భీమన్న రాగవైశాఖి, పుట: 233)

ఇలా ప్రేమను నిరవచించడం లో, ప్రేమకై తపించడంలో ఈ కవి చెబుతున్నదేమంటే.. ప్రతి ప్రాణి ప్రేమించబడాలి, తనకు తానుగా ప్రేమించాలి. ఆ ప్రేమలో స్వార్థం ఊహలో కూడా ఉండకూడదు. కేవలం శారీరిక అవసరానికై బంధాలను నెలకొల్పుకోవడం కామంతప్ప ప్రేమ అనుకోవడాం అమాయకత్వం అవుతుంది. ప్రేమ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. ప్రేమకోసం శారీరక సుఖాలనైనా త్యజించగలగాలి. తాను ప్రేమిస్తున్న వ్యక్తి తనను ప్రేమించాల్సిందే అని  శాశించకూడదు, అలా శాసన బద్ధమైన అనురాగమేదన్నా కానీవండి, అది ప్రేమ అనిపించుకోదు. అలాంటిది అసలు ప్రేమగా పరిగణించకూడదు. ఒక్కసారి ప్రేమిస్తే అది అమృతతుల్యమూ, దివ్యమూ, ఆనంద పరమమూ అయ్యుండాలి. అదే ఆనంద లబ్ది.. పరమామృత రససిద్ధి అది పొందిన వాడెవరైనా పరాం ప్రేయసీ వల్లభుడే. అదే ఈ కావ్య లక్ష్యమై గోచరిస్తుంది.

ఇదే ప్రవచనాన్ని రాగ వైశాఖిలో భీమన్న గారు పలవరించి, పరితపించిన విధం చదివితీరవలసినదే!

ఇద్దరమే!

మనమిద్దరమే!

సంయోగమో, వియోగమో

సంతోషమో, విరహవ్యధో

బ్రతుకేమైననూ గాని!

మనసుకున్న స్వేచ్ఛా రతి

తనువుకు లేకున్న గాని

తనువుకున్న పొలిమేరలు

దాటరానివైనగాని!

విరహాగ్నులలో తనువులు

కరిగి బూదియే యైననూ

మన బూదియే విబూధిగా

మహియే శైవము కాగా

మన మనసులు జోడు కట్టి

మబ్బులు మెరుపులు కాగా

మన ఆత్మలు కలసిపోయి

మధురామృతమే కాగా! –-( రాగవైశాఖి, డా. బోయి భీమన్న)

 1. *#అలకలు-అల్లికలు*

ప్రేమ పారవశం తో ప్రకటించిన కవి పెళ్ళీ పుస్తకం లో అలకలకూ, విసుర్లకూ, అనుమానాలకూ, అపోహలకూ, అల్లికలకూ తావే లేదా అంటే.. ఆ పేజీ సిద్ధంగా ఉంది. అవి లేకపోతే ఆస్వాదనకు రుచి ఎక్కడిది?

“నా వేలికి దురదెక్కి నీ కళ్ళకింద పరచుకున్న  నల్లమబ్బులని తుంటరిగా ఓ చీకటి దినాన ఎత్తిచూపితే, నిను పోల్చి పలుచన చేసినట్టు నాపై నీ కుంభవృష్టి. అక్కవానకు తోడు చెల్లిగాలి. చిలికిన గాలివాన అబద్దాన్ని నిజమని నమ్మిస్తూ చక్రవాతమై కూర్చుంది. ఊహనైనా చేయని తప్పుకు తలవంచలేక, తీరం దాటించడానికి పూనుకుంటే కలసిరాని వాతావరణం, గొడవ నన్ను గడపదాటించింది. అల్పపీడనదిశగా నా అజ్ఞాతవాసం. ఏ ఇబ్బందైనా ముగిసేదే! ఎడబాటు దాటాక, ఏమని ఆక్రోశించావు! ‘ఎవరోవచ్చి కలపాల్సిన అవసరం ఉందా నిన్నూ నన్నూ! కలసి జీవిద్దామని ఒట్టేసుకున్నప్పుడు వీళ్ళెవరు ఉన్నారు!” (నిన్ను చూడకుంటే నాకు బెంగ, పుట: 68)

దంపతుల నడుమ అప్పుడప్పుడూ సరదాకో, అపోహల వల్లనో జరిగే సంఘటనలు, గిల్లికజ్జాలు కూడా సద్దుమణిగాక భలే అనుభూతుల్ని మిగిలుస్తాయి. కవి ప్రస్తావించిన సందర్భమూ అటువంటిదే. కవి ప్రాణ సఖి అన్నట్లు చెప్పిన వాక్యం ఆ సౌభాగ్యవతి వివేచనకూ, వివేకానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ’ ‘ఎవరోవచ్చి కలపాల్సిన అవసరం ఉందా నిన్నూ నన్నూ! కలసి జీవిద్దామని ఒట్టేసుకున్నప్పుడు వీళ్ళెవరు ఉన్నారు!’ అనే మాట, నీవే నేనుగా ఒకరికోసం మరొకరం బ్రతుకుతున్నప్పుడు.. సహజంగా పొడచూపే మనస్పర్థలతో ఎడమొహం, పెడమొహం గా ఉంటాం. ఆతరువాత ఒకరినొకరం చూసుకుని, కోపం చల్లార్చుకుని పరిస్థితిని చక్కదిద్దుకుంటాం. అంతేకాని, ఎవరో వచ్చి మన ఇద్దరి మధ్యన సయోధ్య కుదర్చడం అవసరమా! ఇద్దరం ఒకరికొకరం ఒక్కటై జీవించాలని ప్రమాణాలు చేసుకున్నప్పుడు మధ్యవర్తులెవరూ లేరు కదా! (ఇక్కడ  నాయికా, నాయకులు ముందుగా ప్రేమించుకుని, ఆ పై పెద్దల ద్వారా ఒక్కటైయ్యారన్న మాట దృష్టిలో ఉంచుకోవడం సముచితం.) ఇప్పుడు మాత్రం మూడవ వ్యక్తి ప్రమేయమెందుకు! మన సమస్యను మనమే పరిష్కరించుకునే వారం కాదా! అని అడగడంలో సందర్భ శుద్ధి, వివేచన కనిపిస్తున్నాయి. ఆపై, వారిరువురే సయోధ్యకు ఒకరి వైపు మరొకరు జరిగి సర్దుకోవడం పరిష్కార క్రమాన్ని సూచిస్తుంది.

ఈ సందర్భం లో కూడాఆమె పైన ఇసుమంతైనా ప్రేమ తగ్గని అచంచలత అతనిది. ఇదే లేఖలో నిలదీసి అడిగితే వెళ్ళిపోవడమేనా? అని అడిగినప్పుడు ఇలా చెబుతున్నాడు కవి.

“చివరిప్రశ్నకి సమాధానం నీ విషణ్ణవదనాన్ని చూడలేకనే. అపోహలు ఏనాటికైనా తొలగేను గానీ, నిన్నలా నిత్య శోకాగ్నిలో దగ్దం చేయలేకనే. కంటి నలుపెందుకంటెనో అని కొంటెగా అడిగినందునే ఇంత మంటపెట్టినావే! నువ్వు ఖండితవు కావని, విరహోత్కంఠితగా గడిపిన క్షణాలన్నీ మన్వంతరాలపాటు నే నీతోడు ఉండేందుకు చేసుకున్న వెసులుబాటు అని నీకు చెప్పాలని.”

నిజమైన ప్రేమికులు దాంపత్య జీవనం లో తల్లిదండ్రులు గా మారి, వయసు గడిచి పెద్దవారైనా ప్రేమించుకుంటూనే ఉంటారు. వీరికి వయసు, ముసలితనం, బాధ్యతలూ అడ్డురావు. వారి విసురు లోనూ కసురులోనూ, విరహం లోనూ, తిట్టులోనూ, తట్టులోనూ ప్రేమే ప్రదర్శితమౌతుంది. రెండు మనసుల్లోనూ ప్రేమే నిండి ఉంటుంది. అందుకే ఒకరినొకరు సత్వరం అర్థం చేసుకున్నారు. ఆ సందర్భం లో ఎడబాటునుకోరి అనుబ్భవించిన కవి,  ఆమెను కనిపెట్టుకుని ఉండడానికి ఇంటి చుట్టూ  తనని గమనించకుండా జాగ్రత్తలు పడుతూ తిరిగాడట. వేషం మార్చి తిరిగాననడం లో ఔచిత్యమిదే. ఇది ప్రేమకున్న విశిష్ట బలం. అప్పుడు శరీరం మాత్రం వెళ్ళింది గానీ మనసును నీ చెంత విడిచి వెళ్ళానంటాడు.

 • *# ప్రక్రియ- నామౌచిత్యం* 

మనసులోని ఊసులకు అక్షర రూపమిచ్చి, కాగితం పై రాసి ఆత్మాశ్రయ రీతిలో తన మనోహరికి అందించినందువల్ల ఇవి ప్రేమలేఖలు. ప్రణయ వీచికలు, మృదుమధుర భావ వాటికలు. వీటిలో ఉన్నదంతా.. కొంత కవితావచనం, మరికొంత శుద్ధవచనం. సంక్షిప్తత, సూటిదనం, వేగం, మార్మికతల కలయిక. ఈ రచనని అనేక ఉపశీర్షికలతో ఉన్న దీర్ఘ కావ్యమనవచ్చును. కవే స్వయంగా తన సహచరికి జ్ఞాపకాలను, ప్రణయాన్ని,విరహాన్ని వ్యక్తం చేస్తూ రాసుకున్న లేఖలు అని చెప్పడం వల్ల ఇవి కచ్చితం గా లేఖలు.  కవిత్వ లేఖలు, కమనీయ తేనెవాకలు.

ఈ రచనకు పరాం ప్రేయసీ అని పేరు పెట్టడం లో కవి ఉద్దేశం తేటతెల్లమౌతుంది. ఈ పదానికి సామాన్య అర్థం నువ్వే నా ప్రియసఖివి అని. ఈ పదానికి వ్యుత్పత్తి చూస్తే పరాం అపి ప్రేయసీ. అని అంటే, ఇప్పటికీ ఎప్పటికీ నీవే నా ప్రేయసివని శ్లేష బోధపడుతుంది. (శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్‌స్వామి రచించిన వేంకటేశ్వర ప్రపత్తి లో వినిపించే ‘పరాం ప్రేయసీం’ మూలమైనా, ఉత్తరపదం విశేషణం బదులుగా సంబోధన అయ్యి శీర్షిక స్వతంత్రమైనది.)  కనుక ఈ రచనకు పరాం ప్రేయసీ సరిగ్గా సరిపోయింది, నామౌచిత్యమూ ఇనుమడించింది.

 • *#రచనా వైశిష్ట్యం, భాషాప్రయోగం*

వచనం రాసినా, కవిత్వం రాసినా చదువరికి విసుగు కలిగించకుండా  చదివించాలి. వాక్యం వెంట వాక్యం పఠిత చూపును పరుగులు పెట్టించాలి. మనస్సును మథనానికి గురిచెయ్యాలి. వాక్యాన్ని ఆసక్తికరంగా నడిపించాలి. భావగ్రాహ్యతకు యోగ్యంగా మలచాలి. ఇలా చదివించే వాక్యాన్ని రాయడానికి కవులు అనేక పద్దతులు అవలంబిస్తుంటారు. కొందరు అక్షరరమ్యతను, మరికొందరు ప్రాసవాక్యప్రయోగాలు, యతులు ప్రాసయతులు, నుడులు, నానుడులు, లోకోక్తులు, సామెతలు మొదలైన వాటిని ప్రయోగిస్తారు.

ఇలా చదివించే వాక్య నిర్మాణానికి సరంజామా చేసుకున్నాడు యశస్వి. అందుకే ఈ లేఖల్లోభాషా సౌందర్యం తొణికిసలాడుతుంటుంది. అలాగే చదివించే గుణం మెండుగా ఉంది.

కొన్ని ఉదాహరణలు:

•        నచ్చకపోతే ఇచ్చకాలని సరిపెట్టుకోండి (ప్రాస యతి)

•        వసివాడిన మనసు ఊసుల్ని కలబోసుకుంటున్నా ( వృత్యానుప్రాస- సకార ఆవృత్తి)

•        నచ్చడాలు, మెచ్చడాలు పక్కనబెట్టి స్వచ్ఛంగా మాట్లాడుకుందామా!

•        నీకై రాస్తున్న నా సమస్తం- అస్తవ్యస్తంగా ప్రస్తావించేది

•        అసూర్యంపశ్యవనీ అరవిందవనీ అవగాహన ఉన్నా అయితేనేం అవసరం కదా అని..

•        ఎరుపెక్కిన బుగ్గలు బరువెక్కిన కనురెప్పలు ఒప్పులకుప్పకు నా తలపు నెచ్చలియై వెచ్చబరుస్తుందని

•        ఓనాడు నిశ్శబ్దం గట్తు తెగింది.. నీ గుట్టు విప్పింది

•        అలజడి అంతరంగాన్ని అతలాకుతలం చేసి ఆడిస్తుందని

•        కలిసి కూర్చున్నాక కదలి వచ్చిన కర్బనపానీయాలు

•        తోడు నీడలా ఉండాలా! నీ నీడ తోడుగ నిలుచుండాలా!

•        అది తట్టొరసల తుర్రు పిట్ట, నీకన్నా గుట్టు, ఓ పట్టాన ఏదీ నచ్చబెట్టుకోదుకదా!, అన్నీ నువ్వే సరిపెట్టుకోవాలి.

•        నాలుగేళ్ల నాలుగు నెలల నాలుగో వారం లో

•        మన ప్రాణాలు రెండూ పెనవేసుకున్నాక నన్ను నీలో నిలిపి నవమాసాలూ ఎదురుచూశాను

•        నల్ల చుక్కల తెల్లచీరలో చుక్కలే ఆనావు.

•        నా తపన తలపులను తాకలేదా!

•        ఆస్తి నాస్తైనా అంతస్తు దిగకపోవడం

•        జీవితం ఊహించనివీ తెస్తుందని ఊహించలేక ఉండిపోయావు.

•        అమ్మను తలపించే బొమ్మవు, నా బొమ్మ అమ్మవు

యతి ప్రయోగం తో వాక్య నిర్మాణం:

•        అమ్మ కథలన్నీ ఆణిముత్యాలే

•        ఎడబాతు దాటాక, ఏమని ఆక్రోశించావు

•        ఆనందం కొలబద్దకు అందని జీవితాలు

యమకాలంకార వాక్య ప్రయోగాలు:

•        అరవంకీ వంక అడ్డం పెట్టుకుని

•        ఎంత బతిమాలితే మాలిమి అయ్యావు

•        ప్రాయాన్ని బట్టి మారే అభిప్రాయాలు

•        నాగోల ఎలాగోలా నీకు చేరాలని

కొత్త పదప్రయోగాలు

•        తోడు బొమ్మలాట, అక్కవాన, చెల్లిగాలి, తలపుల దండెం,, దుమ్ముచేతుల నగరం, అల్లరి కెరటాలు, కాలం సాన, వెన్నెలగాలుల ప్రసారం, మబ్బుదిబ్బలు, పెదాల పరదాలు, పదాలతోటదడి, మనసు పాత్ర.. మొదలైనవి

నుడి నానుడుల ప్రయోగం:

•        తృణమో పణమో, దొరికినచోట దొరికినంత, ఏ ఎండకాగొడుగు, ఎంత ఎండకు అంతవాన, ఒకే నాణేనికి రెండు వైపులు, పోపులో కరివేపాకు, కష్టాలతో చలికాచుకోవడం

•        అడపాదడపా, మల్లగుల్లాలు, ఆఘమేఘాలు, తట్టొరసల తుర్రుపిట్ట, నా మానాన నేను, ఆలనాపాలన, మొహంమొత్తడం, చుట్టపుచూపు, దూరభారం, గంపకిందకోడి, నల్లేరు పై నడక, తేటతెల్లం, కడిగినముత్యం, నిలబడ్డ నిజం, కొరుకుడు పడటం.. మొదలైనవి.

ముగింపు:

పరాం ప్రేయసీ కవితా వచనం తో నూతన పదప్రయోగాలతో, శైలీ శిల్ప నవ్యతతో కూడిన విశిష్ట రచన. స్వచ్ఛమైన ప్రేమతత్వాన్ని ఈ సమాజానికి ప్రవచించడం వల్ల ఈ లేఖలన్నీ ప్రత్యేకమైనవిగా  నిరూపించుకున్నాయి. లేఖా సాహిత్యం లో ‘పరాం ప్రేయసీ’ ది ప్రత్యేక ఒరవడి. తెలుగు సాహిత్య లోకం  ఈ రచన  విశిష్ట స్థానాన్ని సంపాదిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సాహిత్య పరంగా ఇది  ప్రత్యేకమైన శైలీ శిల్పరీతులతో ప్రణాళికాబద్ధంగా రాసిన ఉత్తమ రచన.

వాస్తవిజ సంఘటనల సమాహారాన్ని, అందునా స్వవిషయాన్ని కవిత్వం చేసి రాయడం, అందునా స్వవిషయాన్ని కవిత్వం చేసి రాయడం, అందులో సమాజం ప్రతిఫలించడం.. అదీ లేఖా సాహిత్యం లో విశిష్టంగా భాసిస్తుండడం సామాన్యమైన విషయం కాదు. వస్తువు పై సంపూర్ణ అవగాహనతో సృజించిన ఈ రచనను పాఠకుల మదికి చేర్చి కావ్య ప్రయోజనాన్ని సాధించాలనుకున్న కవి ప్రయత్నం నూరుపాళ్ళూ సఫలమైందని చెప్పవచ్చు.

ఇది ఈ రచన పై నా అవగాహన మేరకు పరిమిత జ్ఞానంతో  చేసిన విశ్లేషణ. ఇంకా అనేక దృష్టి కోణాలతో పరిశీలించి అనుశీలన చేయడానికి విస్తారమైన వనరులున్న కావ్యమిది. పాఠకులు అనుభవించగలిగినంత ఆలోచనామృతాన్ని అందిస్తుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు.

ఆధార గ్రంధాలు:

1.డా. బోయి భీమన్న వచన గ్రంధాలు (జానపదుని జాబులు, రాగవైశాఖి)

2.పాశ్చాత్య సాహిత్య విమర్శ, చరిత్ర, సిద్ధాంతాలు- వడలి మందేశ్వరరావు

3.ఉర్దూ సాహిత్యం- డా. సామల సదాశివ

4.ఊర్వశి- కృష్ణ శాస్త్రి

5.ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయము, ప్రయోగాలు డా. సి నారాయణ రెడ్డి

6.లలిత- రాయప్రోలు సుబ్బారావు

7.శ్రీ శ్రీకవితా ప్రస్థానం- డా. అద్దేపల్లి రామ్మోహన రావుపోతగాని సత్యనారాయణ 26.11.2018

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa