Archive for October, 2018

Oct 26 2018

పరాం ప్రేయసీ.. ముగింపు

Published by under my social views

నమ్మకమీయరా..

నీకు తెలియడం లేదు గానీ, నువ్వెంత పొంకంగా ఉన్నా జీవితం నిన్ను భయపెట్టింది. ఏదో అభద్రతాభావం నీతో జతకట్టింది. నీకు భరోసా కలిగించని వర్తమానం-సహచరుడిగా ఇది నా వైఫల్యం. మన్నించు, మన్నించు.. నిన్ను నిన్నుగా స్వీకరించని పెద్దరికాల్ని, నీకనుగుణంగా లేని లోకాన్ని క్షమించు. దయచేసి సాటిమనుషుల అవసరాన్ని గుర్తించు. బిడ్డను ఒద్దికగా సాకుతున్నావు సరే, వాడు ఎదిగాక నిలబడేందుకు సమూహాన్ని గుర్తించు. వసుధైకకుటుంబాన్ని నిర్మించు.

కోరికల కీరవాణి కొసరికొసరి ఊరిస్తూన్నవేళ నేనే నీ శారిక. నదీమతల్లులఎదలపై సోలి అల్లుకుపోవాలని ఆశపడే వేళ నువ్వే జలనిధి. సుధాంశుతూలికల మొనలతో మేనెల్ల జల్లుమనేలా నిమిరించు కోవాలని ఉబలాట పడే వేళ నువ్వే నా వెన్నెల. మవ్వంపు పువ్వుల చిరునవ్వు, తళుకు, చురుకు, తావి నావే కావాలని తపించేవేళ నాపూబోణి. మబ్బుదిబ్బల అబ్బురాలలో కలిసిపోయి అల్లరి చేయాలన్నా… అరుణకిరణాల జడిజాలులు ముక్కులతో చురుక్కు మనిపించుకోవాలన్నా అది నీతోనే. నువ్వు మాత్రమే నా ప్రియసఖి. సఖ్యతకు దూరంగా ఉన్నా నీకన్నా నాకు దగ్గరెవరూ లేరు లడ్డూ!.. నువ్వు నా ‘పరమ ప్రేయసీ’.

నా మనోగతం.. నీకు నీనుండి తరలిపోయిన నమ్మకం మరలిరావాలని. నీతో నా జీవితాన్ని స్నేహంగా మొదలుపెట్టాలని. రెక్కలిప్పిన గువ్వవై నువ్వు నాతో కలసి మళ్ళీ ఎగరడం చూడాలని ఎదురుచూసే నీ క్షేమపిపాసి…  సతీష్- యశస్వి.

RTS Perm Link

No responses yet

Oct 26 2018

| ప రాం ప్రే య సీ..!|-49

Published by under my social views

చరణ వాంగ్మూలం

సఖ్యం సాప్తపదీనాం అంటారే పెద్దలు. వేల అడుగులు కలిసి ప్రయాణించాం! ఇప్పుడన్నా నా మొరాలకించవా!!

నీ మీగాలును ఆటల్లో తొక్కినప్పుడు నువ్వు విలవిలలాడడం, ఆనాడు నిన్నలా అదే చూడడం. ఎంత బతిమాలితే మాలిమి అయ్యావు ఆ రోజు. అది గుచ్చుకున్న పలుకేదో గుండెల్లో ఇప్పుడూ కలుక్కుమంటుంటే నిద్రవేళ నీ కాలిదరికి మెత్తగా ఒత్తాలని సంజాయించుతూ  చేరతానా, నా చేయి తగలగానే తాబేలు లెక్కన దుప్పట్లోకి ముడుచుకుపోతావు. ఒత్తిగిల్లినవేళ నీ మడమ దొరుకుతుంది అదిమితే నీకు ఊరటని అప్పటికి ఆదమరచి ఉంటావు, ఆ కాసేపే నీ స్పర్శానుభవం. చెయ్యి కాలకుండా కాఫీకప్పును పట్టుకుని చిరుచెమటతో మునివేళ్ళ మీద చిట్టిచిట్టి అడుగులు వేసుకుంటూ గబగబా వచ్చి నవ్వులతో అందించే కొత్త పెళ్ళికూతురి వేలు తగిలినట్టే మురుస్తాను. ఇప్పుడంటే సరదాకైనా దరిచేరనీవు. ఉద్యోగానికి  బయల్దేరేటప్పుడు షేక్ హాండ్ ఇమ్మంటే నో..నో.. అంటూ నీ మెటికలు నా పిడికిలికి సుతారంగా తాటిస్తావే, అప్పుడు ఉషోదయపు వెచ్చదనం తాకిన తుషారాన్ని .

 “ఈ జగాన అతి సుందరమైన వాటిని చూడలేం, తాకలేం. కేవలం అనుభూతి మాత్రమే చెందగలం” అన్న హెలెన్ కెల్లెర్ మాట.. సగం అబద్దంగా తోస్తుంది.

నీ చేతిలో సబ్బు అవసరాన్ని మించి అరిగినప్పుడల్లా, నా మనసుపాత్ర లో మరుగుతున్న కన్నీళ్లు. ఆపై నీకు ఎప్పటీకీ  వినిపించని  వెక్కిళ్లు.

RTS Perm Link

No responses yet

Oct 26 2018

| ప రాం ప్రే య సీ..!|-48

Published by under my social views

నిశ్శబ్ద సాంగత్యాలు

జీవితం నుంచి పెద్దగా ఆరోపణలేం లేవు! నీకు నయమవడం, నాకు సంయమనం కోరుకోవడం తప్ప. అప్పుడప్పుడు తొంగిచూసే  నిశ్సబ్దసాంగత్యాలు చాలు, ఆనందాన్ని ప్రోది చేసుకోవడానికి. పెళ్ళవ్వడం, ఎల్లలు లేని ప్రేమను ఇద్దరూ కుదించి ఓ ఇల్లవ్వడం,  ఒకరికొకరు గువ్వలవ్వడం నుంచి పిల్లల్నివ్వడం,  ఒకరికోసం ఒకరు బతకడం నుంచి  కన్నవారికోసం కలసి బతకడం, సరదాలు పరదాల చాటుకెళ్ళి  బాధ్యతలు భుజాలకెక్కిపోవడం, ఇవి ఎవరికైనా తప్పవు కదా! మళ్ళాఇన్నాళ్ళకి,  మూతిముడిచినా, నాలికమడిచినా, చూపుకలపకున్నా, మాటవినిపించుకోకున్నా విసురుగ తప్పుకున్నా, దురుసుగా కసురుకున్నా, ఒకరికొకరమని తేలిపోయాక ఎవరిని ఎవరు ఏమన్నా, చూసేవారేమనుకున్నా ఇచ్చుకునేవి, పుచ్చుకున్నవి లెక్క తేలిపోయినా, చెప్పాలనుకున్నవన్నీ ఎప్పుడో చెప్పుకున్నాక ఈ రంగస్థలం మీద నీకూ నాకూ రోజులెన్ని మిగిలున్నా రాలిపోయేదాక, జీవితంలోంచి తూలిపోయేదాక అనుభవిస్తుంటే భలే ఉంటాయి, నిశ్శబ్దసాంగత్యాలు.

మనం పిల్లలం లడ్డూ! పొరపాటున పెద్దవాళ్ళైపోయాం. ఒకరికి ఒకరప్ప, ఒంటిగ లేమప్పా..అని పాడాలని ఉంది. ఇది నిన్నింకాస్త మెరుగ్గా చూడాలన్న తపనలో గుండె లయతప్పుతుంది. నువ్వు మాత్రం నవ్వుతూనే ఉంటావు. నీ నవ్వులో నేను కనపడ్డప్పుడల్లా నీకూనాకూ ఉన్నాడప్ప, ఆపై ఉన్నప్ప. ఎప్పటికీ నువ్వే నేనప్పా అని చెప్పాలనే. ఇలా చూడు.

RTS Perm Link

No responses yet

Oct 26 2018

| ప రాం ప్రే య సీ..!|-47

Published by under my social views

పొసగని కాలంలో

సమాధానం చెబుతాను. అడిగింది నువ్వే. నమ్మడం మాట దేముడెరుగు వినిపించుకోవు. మరి అడగడమెందుకో అర్థం కాదు రోదిస్తావ్! మనో ఆకాశాన్ని చిందరవందర చేస్తావ్. నేను మరనై ధ్వనికాలుష్యాన్ని, పదకాలుష్యాన్ని ఆశ్రయిస్తాను. ఒకరికి పట్టిన దయ్యాన్ని వేరొకరు వదిలించాలని చూస్తాం. సమాధానపడడం సాధ్యం కాదు. పరిస్థితి విషమిస్తుంది.  కొన్నిక్షణాలు మరణిస్తాయి. మనమధ్య చీకటి పరుచుకుంటుంది. నువ్వు అంతఃపురంలో విశ్రమిస్తావు. నేను సమాధిలోకి దారి వెతుకుతుంటాను. కీచురాళ్లు రొదపెడుతూనే ఉంటాయి. కాలం అకాలంలో శమిస్తుంది. మరో నిమిషానికి శపిస్తుంది. ఏదోశక్తి ఇద్దరినీ పరీక్షిస్తుందని ఎవరో ఒక్కరికే అనిపిస్తుంది. ప్రాణం పాతరోజులకై పరితపిస్తుంది. అందని ఏకాంతం పరిహసిస్తుంది. దిండు తడుస్తుంది. రాత్రి గడుస్తుంది.. నిట్టూర్పు విడుస్తుంది. పొద్దు పొడుస్తుంది. ఇద్దరిమధ్య ప్రేమ.. మౌనంగా పురుడుపోసుకుంటుంది. అహం ఊపిరి తీసుకుంటుంది.

ఇచ్చిపుచ్చుకోవడంలో మాట.. తీరాలు దాటిస్తుంది. అంతరాలు పాటిస్తుంది. చేతల్లో కసిదీర్చుకుంటుంది. రాతల్లో ఓదార్చుకుంటుంది. ప్రేమ అమరం.. కదా! తను మాయమై.. మనసుల్ని నలిపేస్తుంది..  మనుషుల్నిమాత్రం  కొన ప్రాణాలతో నిలిపే ఉంచుతుంది. ‘కలసి జీవించడం కావాలి’ కదా!!  అంటుంది.

RTS Perm Link

No responses yet

Oct 26 2018

| ప రాం ప్రే య సీ..!|-46

Published by under my social views

నీకో మాట చెప్పాలి..

అల్లంత దూరాన నను చూస్తూ ఓ మాట చెప్పినా, పని అప్పజెప్పినా.. గట్టిగా హత్తుకుని చెప్పినట్టే..  ఆలకించడానికి నువ్వే నా నిండా నిండి ఉన్నప్పుడు నా బుర్రనెక్కడ ఖాళీ!! – నీమాట.. మొహంమొత్తిన దినమన్నదే లేదు. నాకేదీ గట్టిగా గుచ్చుకున్న గుర్తులేదు. నీ తలపు మరచిన క్షణమన్నది ఉన్నదో లేదో!! బంధం.. ఎంతపనిచేసిందో లాలిత్యమూ.. మాధుర్యమూ తగ్గిందని అబద్దాలు చెప్పను.. పాకం గట్టిపడిందంతే.. పంచదార చిలకల్లాంటి మాటలు కొరుకుడు పడడంలేదు. నాకే సొంతమైపోయిన నీ మనసు మాటల్లోంచి తొంగి చూడడం లేదు.  రేపటిరోజుల ఆలోచనల్లో తప్ప పెళ్ళిబంధానికి-వర్తమానంతో సంబంధం లేదు. కాలంసానపై గంధపుచెక్క జీవితాలను అరగదీసుకుంటూ వెళ్ళదీస్తున్నాం. లోకానికి సువాసనలు వెదజల్లుతూ కరిగిపోతున్నాం. అరిగిపోయి ఒకరికొకరం దూరంగా జరిగిపోతున్నాం. ఇద్దరం పూర్ణంగా ఉండలేక విడివిడిగా ఒక్కటౌతున్నాం. సాన్నిహిత్యానికి దూరంగా కలిసి ఉంటున్నాం.

నువు ఎదురుగా లేనప్పుడు నీకోమాట చెప్పాలి.. నువ్వంటే  బోలెడు ఇష్టమని..  నిన్ను విసిగించడమంత ఇష్టమని నిను దూరం నుండే ముద్దాడడం ఎంతో కష్టమని.. అయినా సరే నువ్వు వద్దన్నాక నీ మాట వినక తప్పుతుందా! 

నేనలా ఉండలేను కానీ, నువ్వు నామాట వినకపోతే అని నీకెదురువస్తే మన మధ్య ఉప్పెనే కదా! మరి, నువ్వు నాతో లేనిదెప్పుడు!! చనువు ఎంత పనిచేస్తుందో చూస్తున్నావా!!

RTS Perm Link

No responses yet

Oct 26 2018

| ప రాం ప్రే య సీ..!|-45

Published by under my social views


మనోవైకల్యానికి మూలకారణం

మంకుపట్టులన్నీ పెంపకం లోపాలని సరిపెట్టుకున్నా, ఇంట్రడక్షన్ టు సైకాలజీ ఏడో ఎడిషను చదవడం మొదలుపెట్టా. క్లిఫొర్డ్ టి మోర్గాన్, రిచర్డ్ ఎ కింగ్ ల వల్ల నాకు అవగాహన వచ్చినా, నీ ఆరోగ్యం చక్కబడేనా!  టాబ్లెట్ మనసును దారిలోకి తెస్తుందని  విశ్వసించలేను కానీ, అవసరానికి ఔషధం కన్నా దారిమళ్ళింపు  కనపడలేదు. ‘ఆశ’ ని ఆశ్రయించాను. తిమ్మరాజు కథలో తోకపోయి కత్తి వచ్చె అన్నట్టు స్క్రిజో తగ్గి ఓసీడీ వచ్చింది. నీకేమి అర్ధమైందో ఏమో, మాటతీరు మారి పసితనం హెచ్చింది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నీ పిల్లాణ్ని చెల్లినీ సాకుతూ నాతో సామీప్యత వద్దనుకున్న ధోరణే రుగ్మతకు మూలం అని. బలోపేతమైన నీ కాల్పనిక భావనల్ని  తుంచివేయడానికి నా ముందుచూపు చాలదు. ‘వేలికొసలు తాకనిదే వీణ పాట పాడేనా, చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా’ అని కృష్ణశాస్త్రి గారిలా పాడుకోలేకపోయా, మంచిరోజులొస్తాయని ఎదురుచూస్తూ ఉండిపోయాను. అప్పుడప్పుడు నీకు అనిపించినట్టే నాకూ అనిపిస్తూ ఉంటుంది.. డబ్బు ఇబ్బడిముబ్బడిగా ఉంటే జీవితం ఈ తీరున ఉండేదా అని. అసలా ఆలోచనే రుగ్మతనీ మనసూ,  ఏమిఇచ్చి ప్రసన్నతను కొనగలమని మెదడూ  పోట్లాడుకుంటుంటాయి. నీకివేమీ పట్టవు, నీ ఆలోచనల్ని నేను జోకొట్టలేను.

నిన్ను విసిగించనంతవరకూ నీకన్నా మంచిపిల్ల ఉంటుందా! నువ్వుమాత్రం కడిగిన ముత్యమల్లే.. బాబుగాడితో ఆడుకుంటూ పాడుకుంటూ.. నీ ఆలోచనల్లో నువ్వై.. ఈ లోకానికి ఏమీ కాకుండా విడిగా ఉండిపోతూ…

RTS Perm Link

No responses yet

Oct 26 2018

| ప రాం ప్రే య సీ..!|-44

Published by under my social views

నిన్ను చూడకుంటే.. నాకు బెంగ

నలుడి నుంచి రాముడి వరకూ సహచరి ఎడబాటుని తట్టుకున్నవారే. వారంతటవారే వదిలిపెట్టినందున మాటపడ్డవారే. లోకం ఇప్పటికీ మగవార్ని మహారాజుల్ని చేసి తిట్టుకుంటూనే ఉంటుంది. కలి ప్రభావాన ఒకరు, కాలం కలసిరాక మరొకరు విధికి వశమయ్యారు, వారి కష్టాలకు నేను తోడు! నా వేలికి దురదెక్కి నీ కళ్ళకింద పరచుకున్న  నల్లమబ్బులని తుంటరిగా ఓ చీకటి దినాన ఎత్తిచూపితే, నిను పోల్చి పలుచన చేసినట్టు నాపై నీ కుంభవృష్టి. అక్కవానకు తోడు చెల్లిగాలి. చిలికిన గాలివాన అబద్దాన్ని నిజమని నమ్మిస్తూ చక్రవాతమై కూర్చుంది. ఊహనైనా చేయని తప్పుకు తలవంచలేక, తీరం దాటించడానికి పూనుకుంటే కలసిరాని వాతావరణం, గొడవ నన్ను గడపదాటించింది. అల్పపీడనదిశగా నా అజ్ఞాతవాసం. ఏ ఇబ్బందైనా ముగిసేదే! ఎడబాటు దాటాక, ఏమని ఆక్రోశించావు! ‘ఎవరోవచ్చి కలపాల్సిన అవసరం ఉందా నిన్నూ నన్నూ! కలసి జీవిద్దామని ఒట్టేసుకున్నప్పుడు వీళ్ళెవరు ఉన్నారు!  నిలదీసి అడిగితే వెళ్ళిపోవటమేనా!’ చివరిప్రశ్నకి సమాధానం నీ విషణ్ణవదనాన్ని చూడలేకనే. అపోహలు ఏనాటికైనా తొలగేను గానీ, నిన్నలా నిత్య శోకాగ్నిలో దగ్దం చేయలేకనే. కంటి నలుపెందుకంటెనో అని కొంటెగా అడిగినందునే ఇంత మంటపెట్టినావే! నువ్వు ఖండితవు కావని, విరహోత్కంఠితగా గడిపిన క్షణాలన్నీ మన్వంతరాలపాటు నే నీతోడు ఉండేందుకు చేసుకున్న వెసులుబాటు అని నీకు చెప్పాలని.

ఆకాలాన నిన్ను కనిపెట్టుకు ఉండడానికి ఇంటిచుట్టూ వేషం మార్చి తిరిగానని నీకెన్నటికైనా నే చెప్పగలనా! ఇంటిని వదిలివెళ్ళింది ఈ  శరీరం మాత్రమేగా!! మనసెక్కడ దాచిపెట్టానో, నీకెలా తెలుపను!!

RTS Perm Link

No responses yet

Oct 26 2018

| ప రాం ప్రే య సీ..!|-43

Published by under my social views

నువు లేని ఇంట.. నా అస్తిత్వం ఎక్కడ!

అన్నిరోజులూ ఒకేలా మొదలౌతాయి.. నా శరీరం తప్ప వేరొక ప్రాణేదైనా కనిపిస్తుందేమోనని తేరిపార చూస్తాను. అద్దంలాంటి ఇంటిని చిందరవందర చేయలేని జేబుసామాన్లు విడిచిన బట్టలు పక్కకి లాగితే ఆక్రమించుకున్నంత జాగాకాదు, ఈఏకాంతం.. నా జీవితాన. చీమ కూడా కానరాని అంతస్తుల అద్దెఇంట నా అస్తిత్వం అప్పుడో వస్తువేగా!. మౌనం మూర్తీభవించిన పనిపిల్ల వచ్చినట్టు తలుపుచప్పుడో.. వెళ్ళినప్పటి సూచనో నన్ను అప్రమత్తం చేసే రెండు క్షణాలు ప్రాణమున్న జీవాన్నని గుర్తుచేస్తాయి. ఇక రోజంతా  నాదికాదు. ఇక ఇల్లుచేరే వరకూ… నేను నాలో ఉండను. నేనే నావనైనట్టు జనసంద్రాన్ని చీల్చుకుంటూ కనిపించని గమ్యం వైపు సాగిపోతాను. బంధాలు తోడున్నప్పటి ఆకతాయి మనసుకు, ఆనాటి ఉడికించే మాటలకు అసలు అర్థాలు ఇప్పుడే తేటతెల్లమవుతాయి.  ఎటుచూసినా ఒక తెలియనితనం, నాదికాని పరధ్యానంలో లోకుల లోకం. 

అప్పుడే తెలుసుకుంటాను నాలోకం వేరొకచోట ఉన్నదని. నన్నే కలవరిస్తున్న  నేస్తాలకు నేను  అందను. మాటల్లో ఒలికేవి, పనుల్లో పలికేవి ఎన్నున్నా నీ ధ్యానంలో నిలిచేవి జన్మబంధాల అనుభుతులేనని.. నిమిషాలు యుగాలుగా మారే రోజుల్లో నేనో తాపసిని. తపస్సు ఏమిటో   ఎరుగవా!!  ఏతోడు కావాలి నాకు నువ్వు తప్ప! స్నేహపు పలకరింపుల నడుమ నీ రాక కై ఎదురుచూస్తూ ఉండడం తప్ప!!

RTS Perm Link

No responses yet

Oct 26 2018

| ప రాం ప్రే య సీ..!|-42

Published by under my social views

అదే.. నీవు అదే.. నేను, అదే..మాట.. పదే పదే

ఎందుకంటావు నీకీ సతమతమని నాతో,  ఎక్కడన్నా రెండు నిముషాలు అదనంగా ఉన్నట్టు అనిపిస్తే అనుకుంటాను కదా!, జంటపక్షి గూట్లో ఎదురుచూస్తుంటుందని. తలచుకోకుంటే స్తిమితంగా ఉండలేను. మనిషి కన్నా ముందు మనసక్కడ వాలిపోతుంది. ఎందుకన్నా! అంత బెదురు!! ఇబ్బందైతే వదినని వదిలేయరాదూ, ఓ అనుజుడి కాందిశీకత్వపు పైత్యం. మీరింకా కలిసే ఉన్నారా! రాశిచక్రం చూసిన ఓ జ్యోతిశ్శాస్త్ర ప్రవర్తకుని విస్మయం. తరచిచూస్తే ఇవన్నీ అల్పజ్ఞతలు. విజ్ఞత ఏదైనా ఉందీ అంటే అది మనం ఒకే నాణేనికి ఇరు తట్టులం. జిబ్రాన్ చెప్పినట్టే మనం కలిసి పుట్టాం. ఊసులు కలబోసుకునే మళ్ళా ఈ నేలమీద కలుసుకున్నాం. నువ్వు మగబిడ్డ అయిఉంటే చెయ్యాల్సిన మీ తండ్రి అంతిమ సంస్కారాలు విధి నాతో  జరిపించడం దీనికి తార్కాణం. భద్ర జీవిత శకలాల్ని కాలదన్నిన తర పరంపర తామర ఐనా తంపరలోనున్నా పురస్సరుడిగా కలశాలెత్తడం నా విపశ్యన. అందుకే నేనెక్కడున్నా చీకటి పడ్డాక, నాగుండె నీకై కొట్టుకునేది. నీ గట్టుకే నేచేరి నన్ను గుట్టుగా చిక్కబెట్టుకునేది.

నువ్వెంతలా ఆకట్టుకోకపోతే నే ఇట్లా అయిపోయానని ఊరు ఊరికే అనుకుంటుందా!  నీ అవసరాల నడుమే నా మనుగడ. ఏనాడైనా నువ్వు నా గడపలో లేనప్పుడు నే ఒక్కడినే ధీమాగా గడపగలిగానా?  స్తంభించిన కాలం ఇక నా ఎదపై నీ చిత్తరువై. నేను తొలకరికై వేచిచూసే మొలకనై నీకై.

RTS Perm Link

No responses yet

Oct 26 2018

| ప రాం ప్రే య సీ..!|-41

Published by under my social views

వలపుల కిసమసలు

పరిపరితపనల యవ్వనకాలాన అగ్నిపరీక్షలా వచ్చావు.  ప్రేమంటే పరీక్షని, అది దాటడం తేలికకాదని తెలియని వాణ్నే. కాలం గడిచే కొద్దీ అనుభవం అయ్యింది..  ప్రేమంటే  రుచి తెలిసిన కమ్మని కూర, అమ్మ పట్టిన ఆవకాయ పచ్చడి, జీవన రసధుని. మధుర భావనా లాహిరి. జీవితం ఆ ప్రేమ కోరే మనసు చేసే సాగర ఘోష. ఆంక్షలపై సంధ్యాకిరణాలు ప్రతిఫలించినా, కాంక్షలపై వెన్నెలగాలులు ప్రసరిస్తున్నా, కాలం కొత్తగాయాల్ని- గేయాల్నీ రచిస్తున్నా, మనమెప్పటికీ విడిపోము. నాలో నిన్ను నింపుకుని నేనూ, నువ్వూ  ఎప్పటికప్పుడు.. విడివిడిగా కనిపిస్తూ ఉంటాము. నా ఎద మలుపుల్లో నీ గలగలల  హోరు వినిపిస్తూనే ఉంటుంది.  నీ రూపం నిండిన కళ్ళకు లోకం కనపడదు. ఎందుకింత ఆలస్యమన్న మన తొలి పరిచయానికి సమాధానం  దొరకనేలేదు. 

నా రోజా పువ్వా! ఇంకేమి చెయ్యగలను నీకోసం. నువ్వు కోరినట్టే ఉండాలని గుండె గువ్వ..  నీ ముల్లుకే గుచ్చుకుని వేలాడుతోంది చూడు.  నెత్తురు పారితేనేమిలే. నా కన్నీరుని చులకన చేయకు. చిలికిన గుండెలో చిందేదేదైనా, చివరకు మిగిలేదేదో నీకు మాత్రం తెలియదా. ఎన్నిసార్లు పలికినా అది నిన్నేకదా! ఇప్పుడీ నిశీధివీధిన ఒంటరిగా నిలబెట్టి పసిపాపవై తుంటరిగా నవ్వుతున్నావే! నా తపన తలపులను తాకలేదా!

నిలబడ్డ నిజమే మన ప్రేమ కధ. కొద్దిగా నా వేదనని ఆలకించు. నీకై ఆగిన యానాన్ని కలిసి మళ్లీ కొనసాగించు.

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa