Archive for August, 2018

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-15

Published by under my social views

అత్త ఉల్లిపాయ- కోడలు మిరపకాయ (థియరీ)
ఉల్లికోసినా కన్నీళ్ళొస్తాయి, అత్త సుద్దులుచెప్పినా. కత్తి సాన పట్టేటప్పుడు నిప్పురవ్వలు, పోపు వేగేటప్పటి చిటపటలూ సహజం. ప్రాయాన్ని బట్టి మారే అభిప్రాయాలు తప్ప ఇద్దరూ ఒకే నాణేనికి రెండువైపులా ఉండి గోడున మగాడ్ని గిరగిరా తిప్పుతారు. అత్త స్టాండర్డ్ వర్షన్- ఓల్డ్ కోడలు అత్తకు లేటెస్ట్ వర్షన్-బీటా. అత్త ఊసులేకుండా కోడలు ప్రెషర్ కుక్కర్ తెరవదు, కోడరికం పరీక్షలో అత్తవేసేది అత్తెసరు మార్కులు. జీవితం వంట వండకముందు కత్తిపీటకు తప్ప కొత్తిమీరగాడికి ఈ ఘాటు అంతుచిక్కదు. అంతా మంచిగానే మొదలౌతుంది. అమ్మమీద బెంగ అత్తరికం మీదకి బదలాయింపు.. “అత్తమ్మ చేతిప్రేమ మీకు చేప పొట్టముక్క నాకు తోకముక్క”. “రోజంతా పడుకోవద్దని చెప్పరా అసలే ఒళ్ళు..” సారెలు, పెట్టుపోతలూలానే కారణాలూ తొందరగానే పాతబడిపోతాయి. “నేను కాకపోతే కోడలికి ఎవరు చెబుతారు!” “అయినా మీ అమ్మగారికి మీతర్వాతే నేను..” ఇదంతా సిద్ధాంత గ్రంధం. వాస్తవానికి ఇవే జీవనసాగరతీరాన్ని తాకే అసలైన ప్రేమకెరటాలు. తడిసి ముద్దయ్యే అదృష్టం అందరికీ ఉండొద్దూ! వెనకటికి సినిమా మిత్రుడు జనార్ధనమహర్షి చెప్పాడు. అమ్మా-ఆలీ నాకు రెండుకళ్ళు.. కళ్ళు ఒకదానికొకటి చూసుకోవు.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-14

Published by under my social views

ఇంకాస్త వెనక్కువెళ్ళి

మనమంటే ఈ నగరానికి వల్లమాలిన వాత్సల్యం. పెళ్ళిపీటల పై ఉండగానే హనీమూన్ కి రామోజీ తారానగరం నుంచి ఆహ్వానం. అన్న తోడల్లుడు కృష్ణారావు గారి పెళ్ళికానుక. వారంలోపున రెండ్రోజులు అక్కడ గడపమని. ఎన్ని చల్లని మనసుల దీవెనలో మన సాహచర్యం! ఈ నగరంలో నగరం ఆ తర్వాత ఉద్యోగానికి అక్కడికే రప్పించుకుంది. పుష్కర కాలంగా మూడు గ్రాసాల మృష్టాన్నాన్ని బిర్యానీల లెక్కన తింటున్నామంటే అది ఆ వేళావిశేషమే. మే 1, 2004 న ఐమాక్స్ లో నీకిష్టమైన నాగార్జున సినిమా. అధికారికంగా మనం చూసిన మొదటి సినిమా ‘నేనున్నాను’. అంత వరకూ ఎప్పుడు ఎక్కడ ఏ సినిమా చూసినా నా భుజం పై వాలిన తల నీ గుండె అదురును వినిపిస్తూనే ఉండేది! కాసేపట్లో నిన్ను ఒంటరిగా వదిలేసి మరలిపోతానన్న బెంగతో. సినిమా మధ్యలో నా చిట్టినుదురు చిలకమ్మ నాపై వాలి నిదురపోయింది. ఆనాటి పాట నా చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది.   జన్మకి ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావనీ, జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుకున్నామని, శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను.. నేనున్నానని, నీకేం కాదనీ.  – ఆ మంచిగంధం చమటకి తడిసి నన్నంటుకునే ఉందికా.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-13

Published by under my social views

ఈనగరం ఎంతో మంచిది

నీ బొజ్జలో బొజ్జున్న బుజ్జోడి సాక్షిగా భాగ్యనగరం మనకు ఎంతో ప్రేమను పంచింది. నీళ్ళోసుకున్నపిల్ల  మగని చేయట్టుకు చాయ్ కొట్టు దగ్గరకి వస్తే వేడి పాలయ్యింది, నువ్వు వద్దన్నా బ్రతిమాలి మరీ బాదంపాలై నీతో తాగించింది. నా పని ముగించుకుని వచ్చేవరకూ  ఎదురుచూసేందుకు బడా మాల్ కు వస్తే కూర్చోబెట్టి సేదతీర్చే చల్లని గాలయ్యింది. నువ్వు లేచి బరువుగా వెళ్తున్నప్పుడు తన బరువు దిగినంత సంబరపడిపోయేది. బసెక్కిన ప్రతీసారి బిడ్దను మోసే తల్లికి సీటయ్యింది. లైన్లో నుంచోకుండానే

చేతికి అందివచ్చిన సినిమా టికెట్టయింది. ఆగిన ఏ ఆటో ఐనా బేరమాడకుండానే ఎక్కించుకుంది, రోడ్డుదాటే సమయాల్లో  ట్రాఫిక్ పోలీసు నీకు అన్నో, బాబాయో అయ్యేవాడు. అన్ని వైపులా వాహనాల్ని ఆపేసి జీబ్రా క్రాసింగ్ ని ఏనుగు అంబారీ చేసేవాడు, నేను మావటివాడ్ని అయ్యేవాడ్ని. నీతో కలసి నడిచిన దార్లన్నీ ఎన్నెన్నిసార్లు నన్ను నీగురించి కళ్ళతో ప్రశ్నించేవో! ఎందరికి ఏమిచ్చినా నాకు నిన్ను అందంగా చూసుకునే అవకాశాన్ని, ఊరంతా తోడుందన్న భరోసాని ఎల్లవేళలా ఇచ్చింది ఈ భాగ్య నగరమే.  సఫల ప్రేమకధకు సాక్షిగా పుట్టిన ఈ నగరమే, తన దుమ్ము చేతులతో నిమిరి, వాన చినుకులతో తడిపి మనల్ని సాకింది. ఇప్పటికీ మన ఆలనాపాలనా చూస్తూంది ఈ నగరమే.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-12

Published by under my social views

వాడెలా వచ్చాడు

ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు గమనించలేదు. నల్లచుక్కల తెల్లచీర లో రిపోర్ట్స్ తో తిరిగొచ్చావు.  ఎప్పట్లానే నీ ముఖంలో నవ్వు, ఈపట్టు కొత్త కాంతితో. మీ అమ్మగారేదో చెప్పారు నా బయట చెవులకేమీ వినబడలేదు. చతురహస్తం తో నువ్వు అప్పుడే పొట్ట నిమురుకుంటున్నావు. అందమైన ఊహని నెమరువేసుకుంటూ నేను. వివాహం, కొత్త ఉద్యోగం, కొత్త బాధ్యత. ఆనందానికి ఆరోజు వడ్డీ ముడుపుగా కట్టబడింది. కాబోయే తండ్రి.. కొత్త పాత్ర. విషయం విన్నాక అమ్మ ఆదేశం-ఆనందంగా ఉంచాలి కోడలు పిల్లని. సాధన ఇప్పుడు అవసరం కదా! వివేకం, వైరాగ్యం, నిగ్రహం- ఇవే స్వస్వరూపానంద ఆవిర్భావానికి మోక్షమార్గాలు. హైదరాబాద్ బదలీ. ఒక్కడ్నే ఉందామని అమీర్ పేట్ లో బస, వసతి అనుకూలం గా ఉన్నా ఒక్కడినే అని వంటా-వార్పు పెట్టుకోలేదు.  వదిలి ఉండలేనని నా సాదాజీవితంలోకి సీదాగా  వచ్చేస్తే, చూలాల్ని నిండుగా ఎలా చూసేది!  ఊరే దిక్కయ్యింది. హర్ష మెస్, కాకతీయ పార్శిల్, హైదరాబాద్ సెంట్రల్  షికార్లు,  సత్యం థియేటర్ సినిమాలు, సారథి స్టూడియో  సినిమా షూటింగ్ లు, మేఘన  పార్శిళ్ళు.  బలవంతంగా బాదం మిల్క్, ఫలూదాలు, హైదరాబాద్! నీకు సలాం, నా పుట్టబోయే బిడ్డను వాడి అమ్మను నువ్వే అమ్మలా, ఆరోగ్యంగా ఉంచావ్. అప్పుడూ, ఎప్పుడూ.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-11

Published by under my social views

ఇద్దరు ముగ్గురయ్యేవేళ

ఎంత సాధన చేస్తే నైపుణ్యాలు అలవడుతాయి! కలల్నీ, పిల్లల్నీ కనడానికీ సాధన అవసరమే. వివేకం, వైరాగ్యం, నిగ్రహం, మోక్షం ఇవే సాధనామార్గాలు. మోక్షమంటే నా దృష్టిలో మనల్ని మనం తిరిగిపొందడమే. స్వస్వరూపానందా విర్భావమే. రెండు చిదానంద తనువులు మనువాడి ఓ నలుసుకి జీవం పోయడం ఓ తన్మయత, తాదాత్మ్యత. కేలండరు రెండువేలో సంవత్సరం దాటి నాలుగేళ్ల నాలుగు నెలల నాలుగో వారం లో అడుగుపెట్టినట్టు చూపిస్తున్న 22వ తారీకున అర్ధరాత్రి ముహూర్తానికి అనువుగా మధ్యాహ్నం రెండుగంటలు దాటాకా నీ చిటికెన వేలును కోరి గోదారి దాటాను. కాలం గిర్రున తిరిగి అదే రోజు అదే సమయం మనల్ని ముగ్గుర్ని చేసి చూపించింది. పెళ్ళిరోజుకి ఇంతకుమించిన పరమార్ధం ఏముంది! బిడ్ద పై మమకారం కలిగి మన ప్రాణాలురెండూ పెనవేసుకున్నాక నన్ను నీలో నిలిపి నవమాసాలూ ఎదురుచూశాను. ఆద్యంతాలూ నీవే. “మిమ్మల్నింకా ముందుగానే  కలవలేకపోయానన్న లోటు ఈ జన్మకు తీరదు, అత్తమ్మని ఇంకా ఎదురుచూడనివ్వొద్దు, వీలైనంత త్వరగా మనవడ్నివ్వాలి” అంటూ ఆలస్యాన్ని వద్దన్నావ్. ఆషాడం అడ్డురాకపోతే  కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పేవాడేమో. నా యశోధరవి నువ్వు. చిరునవ్వులతో చిరాయువై వర్ధిల్లు.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-10

Published by under my social views

ఇద్దరు ఒకటయ్యేవేళ

జంటగా ఒకటవ్వాలంటే ఎనిమిది చర్యలు జరపాలట. స్మరణ, కీర్తన కేళిలు– తలచి, కొలిచి, పిలిచి ఆడుకోవడం; ప్రేక్షణ, గుహ్య భాషణ, సంకల్పాలు-ఒకరినొకరు చూసుకుని, చనువైనవి మాటాడుకుంటూ, అనువైన దారి వెతుక్కోవడం; అధ్యయన సాయం, క్రియానిర్వృత్తులు– ఆదారిన పయనించి గమ్యం చేరడం. ఏది తక్కువ మన ఆరాటంలో! ఇవన్నీ తీరడానికి మనకి రెండేళ్ళు పట్టింది. ఇప్పుడు అవన్నీ ఏకరువు పెట్టను. ఇక్కడో మాట ఒప్పుకోవాలి. ఎలా మొదలైందో అలా ముగియాలని లేదు. జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా నీ మీద నా ప్రేమ తగ్గింది లేదు, అలకలూ, ఆవేశాలూ ఎవరికీ తక్కువేం లేవు. అన్ని జంటల్లానే అంతుచిక్కని అంతఃసూత్రమేదో మనల్నిద్దరినీ కలిపి ఉంచింది.

ఈ కధలోంచి కొంచం బయటకి వచ్చి నిన్నటి మాట ఒకటి చెప్పనా! నువ్వెప్పుడో రాసిన ఉత్తరం ఒకటి రాత్రి నీకు చూపించానా! అక్షరమక్షరం చదువుకుని నవ్వుకున్నావ్. ఇది రాసింది ఇప్పటి నేను కాదు, అప్పుడు అదో పిచ్చిది అని తప్పించుకోవాలనుకున్నావ్. అందుకే నిజం ఒప్పేసుకున్నావ్. పెళ్ళైన కొన్నాళ్ళకే మేడమీద మైమరచిపోయి ఓ మాట అన్నావ్, అన్నీతీరాయి నాకు పిల్లల్ని కనడం తప్ప.. ఆ ఒక్కటీ తీరితే ఇక చచ్చిపోయినా పర్లేదు అని. నువ్వు నిజంగానే..!!

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-9

Published by under my social views

మన పరవళ్ళు..

రమ్మని  పిలుపు; నీకు ఒంట్లో బాగోలేదని, ఆసుపత్రిలో సెలైన్ ఎక్కించేటప్పుడు వచ్చాను, తోటకూరకాడలా వాలిపోయి, నిర్వేదంతో సోలిపోయి.. అర్థం అయ్యింది మేనరికానికి మొగ్గు చూపమంటే   నిరశనదీక్ష చేసినట్టు. ఆపై తప్పక, నన్ను పిలచి మరీ నీభరోసాని పెంచినట్టు, దీక్ష విరమింపజేయడానికి కదలి వచ్చిన నాయకుడ్ని నేను,  ఆనాటి నుంచి మీఇంట  నా పలకరింపులకి ఆక్షేపణేం లేదు. మీఇంట మీచెల్లి ఒకతె వందమంది పెట్టు, దానికి నేను తెచ్చే జున్ను తో పోలిస్తే పెద్దగా నచ్చినట్టు లేను. అక్కకోసం రెక్కలగుర్రం మీద రాలేదని కాబోలు కొట్టేట్టు దాని చూపు. చనువిస్తే గొడవ పడేనో, గొడవపడితే చనువు పెరుగుతుందో దాని విషయం లో చెప్పడం కష్టమే, ముసలమ్మ మూడో కాలు కూర్చున్నాలేచే, నుంచున్నాలేచె అన్నట్టు. మీ తాతయ్య బాలకృష్ణతో కత్తులకొండయ్య సినిమా తీస్తున్నప్పుడు  ఓమారు ‘ఒసే! అన్నాడని మాట్లాడితే ఒట్టు’ అని మీ అమ్మగారు గొప్పగా చెప్పుకున్నట్టు.. అది నిజంగానే తట్టొరసల పిట్ట, నీకన్నా బాగా గుట్టు. ఓ పట్టాన ఏదీ నచ్చబెట్టుకోలేదు కదా, అన్నీ నువ్వే సరిపెట్టుకోవాలా. నిన్ను పెళ్ళాడాలంటే నీ చెల్లికి నచ్చడమేంటే పిచ్చి మొహమా! అందరు అక్కచెల్లెళ్ళూ ఇట్టాగే ఉంటే  కాపురాలు ఐనట్టేనా.  ఎట్టెట్టా!

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-8

Published by under my social views

మన తిరుగుళ్ళు..

చెవికి ఇల్లు కట్టుకోవడమంటే నీతో  బండి మీద దూరప్రయాణం చెయ్యడమే. గట్టమ్మట రోడ్డు, రయ్యిమని ఢీకొట్టే గోదారినాదం. చెవిలో నీ మాటలసంగీతం.  ఓసారి పట్టిసీమకి వెళ్ళాం. మరోసారి లాంచీ మీద పేరంటాల పల్లి. నా పుట్టిన్రోజుకు  పేద్దకేకు  పట్టుకుని మా ఊరే వచ్చేసావ్, గుర్తుందా! అప్పుడు నువ్వేసుకుని ఉన్నది..   కోబాల్ట్ బ్లూ గాగ్రా చోళీ. నువ్వలా రైలు దిగుతుంటే.. ఐసా.. లగా ఐసా లగా అని అనలేను ఎందుకంటే.. నీలా మరెవ్వరూ లేరు; రారు. నను చూసి నువు నవ్వుతుంటే పేరు తెలీని పాపాయివి, మోరెత్తి  తుళ్ళుతుంటే నువ్వు తువ్వాయివి. వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఏపెళ్ళిలోనో, బువ్వాలబంతిలోనో అదాటుగా కనిపించిన అభావంగా చూసే అపరిచిత అమ్మాయివి. నీకు కోపం ఇట్టే వస్తుందో, నేను నీకు తెప్పిస్తానో ఎలా ఒప్పుకునేది! ఎవరైనా అందంగా ఎదురొస్తే బాగుంది కదా అని కూడా అనకూడదా నీతో! ఓసారి కుక్కపిల్లతో నడుస్తున్న ఓ పిల్లని అన్నాను, అలాంటి సందర్భాలలో అప్పుడొక్కసారే నవ్వావు తెరలు తెరలుగా, ఎవరిని అన్నానో తెలియక. నువ్వే నా ఇష్టసఖివి ఐనప్పుడు మనసులో మాట నీతో చెప్పకుండా ఎలా ఉంటాను!  నిష్కల్మష మనసు ముందు కపటంగా ఎలా ఉండగలను!

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-7

Published by under my social views

గడుసరి లాహిరీ..

పీటలెక్కేటందుకు నీ పాట్లు నీకుంటాయని ఉద్యోగం మానేసావు. అన్నదమ్ములు లేని ఇల్లు, చెల్లేనెచ్చెలి. నాన్నని కాపాడుకుంటూ ఈదురుగాలుల్లో నుంచున్న అమ్మ. బయట సంబంధంవద్దని శాస్త్రం చెప్పే మేనమామ. అప్పట్లో నీకెన్ని ఇక్కట్లో! నన్ను చీకటిపరం చేసి రేపు మనమిద్దరం కలిసుండాలని నీ యుద్ధం ఒంటరిగా మొదలెట్టావు, చీకటిని చీల్చుకువస్తేనే కదా రేపటి బాలుడు కనపడేది!! నీ చూపుల వెచ్చదనం కనుమరుగైన  కాలంలో  నా  పనులు కొన్ని.. ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం, బెంగటిల్లినవేళల్లో నిన్నూరడించడం, నువ్వు  ఉండబట్టలేక బెదిరిస్తే చేతక్ ఎక్కి నీ చెంత చేరడం, ఆశల్ని సజీవంగా ఉంచుకునేందుకు ఒకరికొకరం సర్దిచెప్పుకోవడం. అసలు సమస్యేంటి! మీ ఆస్తి కరిగిపోవడం, అంతస్తు తరిగిపోవడం. ఏం తెచ్చుకోనక్కరలేదన్నా, వడ్డాణం అరవంకీ అడ్డం పెట్టుకుని  ఏర్పాట్లూ.. అంటూ ఆలస్యం చేసేశావు.

పెళ్ళంటే ఎంత కష్టమో అందరికీ ఆ అదృష్టం ఉండొద్దూ!  పెళ్ళికూతురే  కళ్యాణమండపం మాట్లాడుకుని రావడం. అది అవసరం మాత్రమే అయితే సరే; ఒంటరి ఈదులాట అలవాటుగా మారితే.. బలాన్ని బలహీనతగా మార్చుకోవడమే కదా! తోడు నీడలా ఉండాలా! నీడతోడుగ నిలుచుండాలా! ప్రియురాలా!!

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-6

Published by under my social views

భోజనాలమ్మ..

“ఏమండీ నాకు ఆకలి ఎక్కువ; వండి పెట్టడం అంటే చాల ఇష్టం..” ఆ తరువాత ఏమేమి చెప్పావో నాకు గుర్తు తెచ్చుకోవడం కష్టం. ఆ మేడమెట్ల మీదే రోజుకి అరగంట పాటు మాట్లాడుకుంటూ రెండు నెలలు గడిపేశామా! అన్న పెళ్ళికి   ప్రత్యేక అతిధిగా నువ్వు  ప్రత్యక్ష్యం ఐతే.. పెళ్ళికూతురేంటి పీటలమీద లేకుండా హాలంతా తిరుగుతుందని అందరూ అనుకున్నా, రంగడు మామయ్యే భోళా గా అడిగి బయటపడ్డాడు.

హమారా బజాజ్ మీద కలిసి తిరుగుతూ తిన్న   మరమరాల మిక్చర్లు, టమాటా బజ్జీలు, గౌతమీఘాట్ కబుర్ల కన్నా మధురం కాదు. నీకు తెలిసినవన్నీ చెప్పడానికి ఈ రాతలెందుకు పిల్లా!

నీ వేలు పట్టుకుంటే అలల నవ్వొకటి నీ పెదవుల పై ఎగసి పడేది, నీ చూపులోంచి నీటి కెరటాల పై తరలి వచ్చిన సూర్య కిరణం నా గుండెల్లో దిగబడేది. అంతకు మించి ముందు కెళ్ళే ప్రయత్నానికి ఒకళ్ళకొకళ్ళం పాతవాళ్ళం కామన్న నిజం ఎప్పటికప్పుడు తుళ్ళిపడడమే. ఇంకా మీఇంట పెళ్ళి విషయం లో మల్లగుల్లాలు, జీవన చంద్రబింబంపై  వాలిపోతున్న మేఘమాలికలు. ఒకరి కన్నీళ్ళని తుడిచే మరొకరి మునివేళ్ళు..  అదరకుండా బిగబెట్టిన పంటి కింద నలిగే అధరం.  కొంత తడి, కొంత అలజడితో లోకం రుమాలు. చీకటితోపాటు గమ్యాన్ని చూపే రహదారులు.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-5

Published by under my social views

మొరాలకించిన అమ్మ..

అన్నయ్య పెళ్ళి కుదరడం తెలిసె.  అమ్మతో నాపై నీ ఇష్టాన్ని చెప్పా..  నవ్వేసుకుంది. అందులో ఆనందం ఉంది, చిన్నోడికి మార్గం సుగమం అయ్యిందో లేదో అన్న శ్లేష ఉంది. పెద్దోడి పెళ్ళి వరకూ ఆగుతాడో లేడో అన్న సంశయం ఉంది. ఇచ్చగీడుని మెచ్చిన పిల్లని చూడాలని ముచ్చటపడి మా అమ్మ తన కన్నతల్లినీ   పెనిమిటిని వెంటేసుకుని గోదారిదాటి నా కచేరీ దగ్గర కారు దిగిందా! నీతోకలసి కూర్చున్నాక కదిలి వచ్చిన కర్బన పానీయాల బుసబుసల నడుమ కలిసి పనిచేసే వారి గుసగుసలు.. ఇప్పుడిలా పరివారం పరిగెత్తుకొచ్చి   మెచ్చి నా పరువుదీసె! నీ చేతి గుత్తులకు అమ్మమ్మ ముద్దులేమిటో, బుద్దిలేదు.   నా సావు నన్ను సావమన్నట్టు అక్కడ జరిగినది చూపుల తతంగమని చూచాయగా అందరికీ చెప్పే్సిందీ! ఎదురుకళ్ళ నవ్వుల్ని తప్పించుకుంటూ చేతిని నుదురుకడ్దంపెట్టుకు ఎంతకాలం నడచిపోతాను! అమ్మ తన సంతోషాన్ని దాచుకునే ప్రయత్నం చేయలేదు. నాన్న  పెద్దవాళ్ళని పంపమన్నట్టు చెప్పాడనుకుంటా.. అప్పుడు నీ ముఖం పట్టపగ్గాలు లేకుండా వెలిగే పిట్రమాక్సు లైటు. నిజం చెప్పినా నమ్మరిప్పుడు.. అప్పటికి మనమిద్దరం మూడోసారి కూడా మాటాడుకోలేదు. పెళ్ళిమాటతో మొదలైన ప్రేమ కథ మనది.

 

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-4

Published by under my social views

4. విరహితవై ..

ఇప్పుడేమైననా అంటావు నువ్వు;   ఒప్పుకోలుకి  తెగువ ఉండొద్దూ! వద్దనడానికి   సాకు చెప్పాననుకోవచ్చు; ఏదో అన్నానే అనుకో! వెంటనే ఎలా నమ్మేస్తావు!  వారం తరువాత వచ్చి కనిపించాను, అప్పటికింకా ఉబ్బిఉన్న నీ కళ్ళు. తెచ్చిపెట్టుకున్న అరనవ్వు.

గుండెనెంత పిండేసావు.  మనసుని   తలపులపైన ఆరేశావు

ఉద్వేగాల ఉయ్యాలవూపు     మనిద్దరకీ అనుభవైకవేద్యమే కదా..

ఒకరికోసంఒకరు బ్రతకలేకపోతే ఏకాంతంగా జీవితాన్ని గడిపేద్దామనుకున్నావా! ఎంతచింతని   రగిల్చిందో నా  మాట!

ఓ జీవితకాలపు సంభాషణ రాయడానికి అర్హుడ్ని చేశావు. ఆనందపు కొలబద్దకు అందని జీవితాలు మనవి; ఐతేనేం! మన కధ మనదే కదా!

ఓస్పర్శ లేపిన అలజడి అంతరంగాన్ని అతలాకుతలం చేసి ఆడిస్తుందని ఇంకాస్త ముందుగా తెలిస్తే ఎంతబావుండు!  కాస్త పద్ధతిగా నన్ను  సమర్పించుకునే వాడినికదా. నే మాట్లాడుతున్నది హృదయ స్పర్శ గురించి. ఎందుకో రాతి ఫలకంలా అవే శిలాక్షరాలను నీ దగ్గర  ఆనాడు ఎలా వల్లెవేసానో! నీ ప్రేమధారతో నన్ను కరిగించి మనో మైదానాన్ని చదును చేసి ఆడుకున్నదానివి. నీ పేరు శైలజ అవ్వడం లో ఆశ్చర్యం ఏముంది!

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-3

Published by under my social views

3. స్పర్శానుభూతి

రంపచోడవరపు అడవుల్లో వన భోజనాల విహారం.. రోడ్డుదిగి వాలుపుంతలోకి గుంపుగా నడక.. ఒక్కొక్కరికీ సాయంగా నా చేతి ఆసరా. అందరినిలాగే జారకుండా నడిపించాలని కదా నీ చేయీ పట్టుకున్నా! అసూర్యంపశ్యవనీ, అరవిందవనీ అవగాహన ఉన్నా, అయితేనేంలే.. అవసరంకదా అని సరిపెట్టుకున్నా. ఆపట్టుకే నీ గుండె గరగరమంటుందని, నీ మనసు మెరమెరలాడుతూనే ఉండిపోతుందని, ఎరుపెక్కిన బుగ్గలు బరువెక్కిన కనురెప్పల ఒప్పులకుప్పకు నాతలపే నెచ్చెలియై వెచ్చ పరుస్తుందని తెలిసుంటే ముందుగానే పక్కకు తప్పుకునేవాడ్నేమో,  ప్రకృతి రహస్యమేదో విడమర్చిచెప్పినట్టు.. ఇంటికెళ్ళి నువు చేసిన చన్నీళ్ళస్నానం, జ్వరంతో మూడురోజుల సావాసం..

అసలు ఎన్నోరోజులు మనం ఒకరికొకరం కనిపిస్తూ ఉన్నా  అప్పటికింకా పలకరించుకోకపోవడం నాకెప్పటికీ ఆశ్చర్యం. ఆ మౌనసందర్భాలు వేళ్ళూనిన ఊహలు కోకొల్లలుగా ఓ రోజు నిశ్శబ్దపు గట్టు తెగింది; నీ గుట్టు విప్పింది..

నాతో నీ మొదటి మాట.. “మీకిష్టమైతే.. మా పెద్దవాళ్ళని మీ ఇంటికి పంపిస్తాను”

హమ్మా! ఓ చేతి స్పర్శ ఎక్కడో మనసుల్ని సుతారంగా తాకింది   గానీ, ఇది శరీరాలకి చెందిన స్పందన మాత్రమేనా!

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-2

Published by under my social views

2. నీతో నాకు బంధముందని..

“ఇంత ఒళ్ళేంటీ పిల్లకి! ఏపుగా ఎదిగిన  చెరకు గెడలా ఉందని..”..

నా చూపుల్లో  వినిపించే కదా!!.. నిను కన్న వస్తాదు బొమ్మ చూపించి
నా నోరు తెరిపించి మరీ మూయించింది!

లడ్డూ పాపా!!

పెళ్ళిపుస్తకం పేజీల్లో కొన్ని పన్నీటితోనూ, కొన్ని కన్నీళ్ళతోనూ ముగ్గులేసుకున్నాక ఇన్నేళ్ళకి మళ్ళా నీతో పరాచికాలూ.. పలకరింపులు.  ఈ మురిపెం.. నువ్వు అవునన్నా కాదన్నా..
నువ్వే నా గుండెనిండిన మనిషివని నీతోనే చెప్పాలని

నువ్విప్పుడు నా ముందే ఉన్నా, నా చేతికి అందని ఆకాశానివి

నీ చిరాకులు చీకటిలో మెరుస్తున్న మెరుపులు,

నీ కేరింతలు నా కంటి కొలకులలో వణికే నీటిగోళాలు
అందుకే .. నీకై రాస్తున్న నా సమస్తం..

నువ్వే నా..

పరాం ప్రేయసివి

అన్న…నిజాన్ని.

 

 

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-1

Published by under my social views

1. నిన్నారోజున నేను చూసినప్పుడు..

ఉద్యోగానికి మొదటిరోజు. కొలువుకి వచ్చాననుకున్నా.. కన్నె కనకాంబరాన్ని కలవడానికి అనుకోలేదు; మాటీలకింద ముంగురులతో అల్లలాడే జూకాలు, విచ్చిన జుట్టు మీద తారాడే పూల మూరలు, పసిడి పరువాలను చుట్టిన పట్టు పరికిణీ పై మెరిసే పతక హారం, మేనిమెరుపు ముందు వెలవెల బోయే మువ్వల పట్టీలు, విరిసిన పెదాల విరుపులు.. ప్రేమ లోకం లోకి నా మేలుకొలుపులు.
ఎవరీ అమ్మాయి! ఈ రోజేమైనా తన పుట్టిన రోజా!! లేక రోజూ ఇలానే వస్తుందా! దానవాయి పేట పార్కు పక్కన జెట్టీవారి భవంతే .. ఇది నాలుగో అంతస్తులో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కానీ, నగలకొట్టు కాదే? అడగని ప్రశ్నకి “కోర్సు చేద్దామని వస్తే.. కుర్చీలో కూర్చోబెట్టారట..” ఎవరిదో సమాధానం. ఇకముందు తనతో కలిసి పనిచెయ్యాలన్న మాట.. నన్ను నేను సమాధాన పరచుకోవడం. రోజులెలా దొర్లుతాయో ఎప్పుడైనా చెప్పడం కష్టం..
ఓపిక ఉన్నప్పుడే ఓ కధ చెప్పేసుకోవాలి. స్వాతిముత్యం సినిమాలోలా ఏ మనవరాలో అప్పుడు అడిగితే, చెప్పుకునే తీరికున్నా, జ్ఞాపకాలు మిగిలుండాలి కదా! నాది నాకు మాత్రమే ప్రత్యేకమా! నా జీవితమా!!
నచ్చడాలు, మెచ్చడాలు పక్కనపెట్టి స్వచ్ఛంగా మాట్లాడుకుందామా..!

RTS Perm Link

No responses yet

« Prev

RTSMirror Powered by JalleDa