Archive for August, 2018

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-40

Published by under my social views

నిదురపో హాయిగా
నేనేం రాస్తానో నీకు ఆసక్తి ఎందుకుండదో అని అనుకుంటూ ఉంటాను. ఏదో చెప్పాలని నేను, నీతీరున లో నువ్వూ. నడుమ కాగితాలు చిరుగుతున్నాయి అక్షరాలబలం చాలక. కలంనెప్పులు పడుతుంది నన్ను ఈరీతిన కనలేక. పుట్టినప్పుడు లేని కలతను జీవితాంతం మొయ్యలేక అమాయకత్వాన్ని మిగుల్చుకోలేనితనం ఆపసోపాలు పడుతుంది. ఉన్న కొద్దిరోజుల్లో మంచిని పంచలేక ముసిరిన భావకాలుష్యంలోంచి మిగిలిఉందనుకుంటున్న మానవత్వం రాలేక మల్లగుల్లాలు పడుతుంది. చుట్టుముట్టిన చీకటిలోంచి, చేతికందనంత ఎత్తున వేలాడే నక్షత్రాల్లా మిణుకు మిణుకుమంటూ స్వచ్ఛత అరకొరగా అగుపడుతుంది. బురదలోనే కూరుకుని నుంచున్నా, నీ వదనోదయం కోసం మనసు మొరెత్తి కలువలా ఎడబాటు గాలులతో కలబడుతోంది. ఏదో చెప్పాలని ఉన్నా, ఏమి లేదన్న నిజం జీవితాన్ని దిశమొలతో నలుగురిముందు నిలబెడుతుంది. ఎవరన్నా నిశ్శబ్దాన్ని పసిగెడతారేమోనని కొట్టుకుంటున్న గుండె ఘడియ ఘడియకు తడబడుతోంది. నేనేమి చెబుతాను! నువ్వేమి వింటావు!! లడ్డూ పాపా! నిద్దురపో! హాయిగా. రేపన్నది మనకు మిగిలుండాలి. కేరింతల పసిపాప నవ్వై నువ్వున్నప్పుడు పంచుకుందామనుకునే ఈ మాట నిద్రలోను వినపడుతూనే ఉంది.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-39

Published by under my social views

14. పదాలతోటదడి
అందరూ అడుగుతున్నారు ఇలా ఎందుకు రాసుకోవడం అని.. ఏం చెప్పను! పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా. పూలతావి తాకిన తుమ్మెద ఎద చేసే ఝంకారం నీ నామజపమైన వేళ. చెదిరేతూనీగల్లా నా భవభావాలు గడికోమాటున బరి దాటుతున్నా.. పదాల తోటదడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా. నీలో నన్ను వెతికి వెతికి వగచి తలవంచి నిలువలేక ఈ భావావేశపు గింగిరులు. జారిపడ్డ ఆలోచనల కంపన కంటి కొలనింట. కదిలే పిట్టలా కనుచూపు మింటివెంట.. అందుకే పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా. ఎండిన ఆకులా నా మాట రాలి తేలి నిన్ను చేర ముద్దాడ.. పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా. మాట తేరుపై మనసు చేసే ఓ సంధ్యా రాగం మనప్రణయం. అందుకే పదాల తోటదడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా. ఉక్కిరిబిక్కిరిలో కదలాడే కలువనీడలా వణికిస్తున్న నీటి పొర. తడుస్తున్న కనురెప్పలను పొడుస్తున్న వెన్నెల కిరణాల తుంపర. మనసుతో వేడుతున్నా.. నీ రాకచూడని కాలాన్ని నీ మాట వినిపించని రాగాన్ని యుగాల ఎడబాటుని నన్నొదిలి వెళ్ళమని. పెదాల పరదాల తెరదీసి పలవరిస్తున్నా పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా.. మూస్తున్నా.. వెనక్కి వచ్చి నా కళ్ళన వేలాడే నీకోసం కన్నీరుగా మారి నిరీక్షిస్తున్నా.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-38

Published by under my social views

మాటలు లేని కాలాన..
ఏకారణంగానైనా ఆలస్యంగా ఇంటికొస్తే పలకరించేదానివి కావు, గంటలు గడిచేవి, గుండెలను కరిగించి పోసిన గంట కాలమై కాలుస్తుందో.. రవమై మోగుతుందో! నీ మేనిగంధాల పలకరింతలు నను దాటివెళ్ళిన జాడలను మరుగుపరచలేక నిలువనీయనివ్వవు. నీ ఊహే లోపలా-బయటా మంచుని కరిగిస్తుందే! నిట్టూర్పుల్లో మనప్రేమ వెచ్చదనం మంచుబిందువులను ఆవిరి చేసినా గతించడాన్ని మాపలేని కాలాన్నడుగు నా మనసేంటో. ఆనాటి మనసంగమాన్ని నిరంతరతను నింపుకున్న మన స్నేహాన్ని అడుగు. నిన్ను-నన్నులను దాటిన మన భావననడుగు. వేర్లు వేరైనా ఒకటైన మన జీవితాలని అడుగు. మనంలేని నాడూ ఒకరికొకరిని చూపించడం నేర్పమన్నావా కళ్ళకి. మన అందాలు నింపుకున్న లోకంలో అనవరతం ప్రేమై శ్వాసించనీ హృదయాన్ని. చెవులకు నిశ్శబ్ద నిలయాల్లో పారవశ్యపు పదనిసనలను వినిపించనీ. సాయాన్ని స్పృశించనీ చేతులను.. ఆర్తిగా ప్రార్థనలో పెదవి పలుకనప్పుడూ నా గళాన్ని విను. కన్నీళ్ళను నీ పెదవులతో చెరిపెయ్యరాదూ.. నా ప్రమేయం లేకుండా రాలుతున్నాయి పూలై. పొదవిపట్టుకో నన్ను ఊహవై.. నీకు దగ్గరగా ఉన్నప్పుడూ. నన్ను చూస్తే ఒంటరితనానికి జాలేస్తుంది, అన్నమైనా పెట్టరాదూ! నీ చేతుల్తో..

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-37

Published by under my social views

మాట వినని మనసా!
నువ్వు అర్థం కాని ఆరోజుల్లో నీ అలకలు నన్ను నీళ్ళను చేసి కుదిపేవి. నన్ను, నారాతల్నీ తప్పు పట్టేదానివి. నీ స్థానాన్ని ఎక్కడ సృజన ఆక్రమిస్తుందో అన్నభయం. జీవితంపట్ల నీ భయాలు నేనెరుగుదును. నిన్ను వదిలి రోజూ కొంత సమయం బయట ఉండే అవసరం నా దృషిని ఎక్కడ మరలుస్తుందో అన్న నీ దిగులు. అప్పటి మన ఘర్షణలే గాయాలు. వేదనే గేయాలు. గాయాలు నాకు గేయాలై వినిపిస్తున్నప్పుడు గేయాలు గాయాలై సలిపేస్తున్నప్పుడు, గాయం నేనైనప్పుడు ఎవరు గాయపడ్డట్టూ!! కోల్పోయేది స్నేహ సౌహార్దమో కుటుంబ క్షేమమో, నా ముగింపు ప్రజావినోదమో, స్వీయ విషాదమో. నా కళ్ళకు నీ కలల భయమెందుకో! ఎందుకిలా నమ్మకాల తరాజు చీకటితో పాటు మొగ్గుతుంది! ఎందుకో గడిచిన రోజుల జీవితం ఒంటరి ఆలోచనలను కుదుపుతుంది. వాలినపొద్దు మరునాటికి వెన్ను పొడుస్తుంది. ఏవిషాదాలు మెదులుతున్నాయి తలపుల్లో నాకెందుకు ఒంటరి నేనంటే భయం? పలుకని నిజాలు నను బేరీజు వేస్తున్నాయా! నేనుండని రేపటి వెలుగుల గుట్టు ఈరోజే విప్పిపోనీ. అలకల రాణీ! నువ్వొప్పుకున్న నెప్పేగా మన అనుబంధం ఏళ్ళు గడచినా మళ్ళీ నీతో మనసువిప్పి చెప్పుకోనీ. నిన్ను ఎప్పటికీ ప్రేమించిన మాటొకటి ఈరోజు ఇప్పుడే చెప్పిపోనీ.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-36

Published by under my social views

నిను చేరాలనే..
గాలివాటుకి అనిపిస్తుంటుంది ఒంటరితనమే నా చిరునామా కదా అని. అప్పుడు ఈనేలపై నా అడుగుల తడబాటు. తలపుల్లో నిలిచిఉన్నది నీవైనప్పుడు ఎడబాటుకు అర్థమేముంది! అడుగుఅడుగులో మెదిలే సవ్వడై ఎద ప్రతిధ్వనిస్తుంది. పగలైనా రేయైనా నీ ఊహే నన్ను నాకు వివరించేది, నను నిలువరించి వరించేది. యుగాల విరామంలో క్షణాలు గడుస్తున్నాయి. అంతరంగాల్లో మనోభావాలే జ్ఞాపకాల కూనిరాగాలై నిలుస్తున్నాయి. ఆకాశం చలికాగుతుంది నాతో, నాఊపిరిలో వెచ్చదనానికి మంచులా కరుగుతావన్న ఆశ. నిలకడ వదిలిన నీ మునివేళ్ళను మునిమాపు వేళల్లో సందెపొద్దు సూరీడు ముద్దాడివెళ్లేలోగా కలవిడిచి అనుకుంటున్నా. ఇలనైనా నిను చేరాలంతే.. శీతలపవనాలు ప్రేరేపించే నాదాలై పక్షుల కువకువలు స్వరజతులై ఉత్తేజితం చేసేవేళ నిశీథిని వీధుల విషాద ఛాయల్లో నువ్వు విశ్రమించవని, అంబరవీధుల పహారా మాని నీకై నిలవనా! మేఘాల వీవెనలతో చెమిర్చిన మోహనాన్నే తడమనా!! మంచుబిందువులు నీ పెదవిపై వాలేలోగా నిను చేరాలంతే. నిను జీవితంలా శ్వాసించనీ. నీ ఊహల్లో నేను నేనుగా ఉండాలనే ఆవిర్లు విరజిమ్మే ఈ గుండె చప్పుడు. ఆగేలోగా నిను చేరాలనే. వెన్నెల కిరణాల దాడిలో నే ఓడేలోగా..

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-35

Published by under my social views

వద్దంటే వినవే
నీ మనస్తత్వం పట్టుబడని నాడు, ఇలా తలపోసుకున్న.. ఇంటికొస్తానో లేదో ఆపాదమస్తకం అవలోకనాలింగనాలు. ఖాళీ చేతుల్ని తడిమె నీ కళ్ళు దిగులుగా వాలిపోతాయి. అంకురాన్ని మొలకెత్తించిన దర్పం నీది. క్షమయా ధరిత్రీ అని ఆ క్షణం మరుస్తావు. ప్రేమని పిల్లల పాలు చేసిన మమకారం ఏకపక్ష నిర్ణయంతో సామరస్యాన్ని ఏమారుస్తుంది. ఆ మూడుగుళ్ళాటలో ఇల్లు న్యాయస్థానం అవ్వడం నే దోషినవ్వడం.. రూఢీ అవుతుంది.
అభ్యంగన స్నానాలలో తడిసి మెరిసాక.. శిక్షకు తలవంచి.. చూపులంటిన కాళ్ళూ నాలిక కరచుకొన్న చెప్పులు గుమ్మం పహారాలో బజారున పడతాయి. డబ్బుల తోలుతిత్తి నాకన్నా నయం సన్నబడడానికి కష్టంగానైనా ఆరాటపడుతుంది. సివంగి వేటాడి తెస్తే విందారగించే మృగరాజులా నా దర్పం ఎందుకో! కాఫీ కప్పు అడగకుండా అందుకునే నా ఆనందం నీకెన్ని సింహావలోకనాలకైనా అంతుచిక్కదు. పశు ప్రవృత్తి నుంచి ఇంకా బయటపడని మగాడు ప్రేమను పండించుకోవడం ముందు విధివంచితుడే. ఎందుకంటే ప్రేమ నిత్య చైతన్యశీలి ఎన్నిరంగులైనా మార్చగలదు. మగాడి కామమే జీవితసత్యం. ఒక్క ఒప్పందానికి ఎన్ని అవసరాలైనా తీర్చగలదు. – ఎప్పుడో రాసుకున్న ఈ మాటలతో నాకు పేచీ లేదుగానీ, భామా! కామాన్ని కామనతో మార్చి చదుకోమని కామన.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-34

Published by under my social views

చల్తే చల్తే.. హైదరబాద్
అప్పటికీ, ఇప్పటికీ ఈ నగరంలానే నీలో మార్పులు, సిటీ బస్సులు కూడా ఎక్కేవాళ్ళం అన్ని హాల్స్ కీ, మాల్స్ కీ, హొటెల్స్ కీ. లుంబినీలో బాంబు పేలకముందు శనివారాలు అక్కడేకదా నే వచ్చేదాక తచ్చాడేవాళ్ళు, ఆదెబ్బ దాదాపు ఏడాది మీ కాళ్ళను కట్టేయలేదూ! లక్కీని నీళ్ళల్లో ఆడించడానికి కదూ, లుంబినికి, జలవిహార్ కీ వెళ్ళేవాళ్ళం! మనమిద్దరమే తిరిగేరోజుల్లో యల్లారెడ్డిగూడా హైదరాబాద్ రెస్టరెంట్, క్రిష్ణకాంత్ పార్కు కబుర్లు ఆ అనుభూతులే వేరు. మీఠాపాన్ వేసుకున్నప్పుడు కావాలంటే సిగరెట్ తాగొచ్చని సూచించేదానివి. ఇప్పుడు రోడ్ మీద ఎవరు కాల్చినా మొదటి అంతస్తు బాల్కనీలోకి వాసనొస్తుంది. ఇప్పుడు ఐమాక్స్ లో సినిమా, స్వాగత్ పెబుల్స్ లో బఫె అది కూడా నెలకొక్క తూరి. నాకు తెలుసు ఆదివారమొస్తే నీ మనసు ఐమాక్స్ కి పరిగెడుతుందని, ఫుడ్ కోర్ట్ లో గంటలకొద్దీ గడపాలని ఉంటుందని. మెక్ డోనాల్డ్ లో చికెన్ నగ్గెట్స్ తిని కోక్ తాగాలని ఉంటుందని. నీ ఒళ్ళు చూశావా కోవా బిళ్ళలా ఎంతలా గుల్లిరిగిపోయిందో, గణేష్ దగ్గర గుంజీలు తీసేదానివి, కిందకూచోలేక పూజల్నీ మానేశావు. వాకింగ్ చెయ్యమంటే ఉదయాన్నే వరండాలో తిరుగుతున్నా కదా అంటావ్! మంచే కదా చెబుతున్నా, ఎప్పుడు నా మాట వింటావ్!

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-33

Published by under my social views

రహస్య సమాచారం
నీపై నా ప్రేమ, కలసి జీవించాలన్న ఆలోచన జీవితాన్ని గొప్ప ఆకర్షణవైపు పారించింది. నిన్ను మళ్ళీ చేరడానికి వీటిని మించిన తరంగశక్తి దొరకనే లేదు. ప్రేమను మించిన అనుభూతి భావన నేను పొందలేదు. పాటలకు లయబద్దంగా అడుగులు కదుపుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో, వంట చేస్తున్నప్పుడూ అంతే ఆనందంగా కనిపిస్తావు. తెరమీద కనిపించే ప్రేమ సన్నివేశాల్ని భలే లోనికి తీసుకుంటావు. నీ పక్కనే కూర్చుని సినిమా చూద్దామనుకుంటానా! నీ వదనపు రంగులు వెండితెరపై వాటికన్నా గొప్పగా అనిపించవు. నిన్ను తదేకంగా చూస్తున్న నన్ను గమనించి నవ్వేస్తావు; ఓ గుద్దు గుద్దినంత పనిచేసి తెరవైపు నా చూపులు మరలేలా చేస్తావు. సినిమా చూస్తున్న ఆ కాసేపూ కేరింతలు కొడతావు, తుళ్ళిపడతావు, కన్నీరై ఒలికిపోతావు. నన్ను కదిలించేస్తావు. కనుల ముందర కదిలే బొమ్మల కథ నిజం కాదు అన్న విశ్వాసాన్ని తొలగించుకుని లీనమైపొతావు, నేను ఈ సన్నివేశం మరపురాక మౌనమైపొతాను, నాకు పదేళ్ళప్పుడు వంశీ అన్వేషణ సినిమా ఇంత విహ్వలతకు లోనుచేసింది. వేదనలో ప్రాణేశని చూడడం సినిమా చూసినంత తేలికకాదు. అందునా నాయదలో లయ నువ్వైనప్పుడు, నీ మనోవయస్సు పదేళ్ళున్నప్పుడు, ఇప్పుడు. కొద్దిగా నొప్పి, నీ నవ్వులో నేలేనప్పుడు.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-32

Published by under my social views

సాహిత్య సంస్కారం
మీది సినీరంగ నేపధ్యమని మీ భాషలో మాట్లాడుతున్నా; కొన్ని సినిమాప్రేమలపై విముఖత నాకు. పద్మాకుమారి అక్క ఏక్ తారా గ్రూపు వార్షికోత్సవసభకు నన్ను అధ్యక్షుడ్ని చేసిన సందర్భం. ఆసభ సాక్షిగా ఇదే మాట చెప్పా. గాలి, నేల, వెలుగు, చినుకులతో పోల్చుకుని తాను చితిలోకన్నా నడిచొస్తానని గొప్పలు చెప్పుకున్న మగధీరుడు ఈ కాలం ప్రేమకి నిదర్శనం కారాదు, రోమాంచితం అవ్వడం స్వీయానుభూతికి ఎన్నడూ కొలమానం కాదు, మూత్రశాలకు వెళ్ళి బరువుదించుకున్నప్పుడూ ఒళ్ళునిక్కబొడుచుకుంటుంది, భయపడ్దప్పుడూ, వాటికి ఉదాత్తత ఏముంటుంది! హోవర్డ్ ఫాస్ట్ ’ స్పార్టకస్ లో ఓ సన్నివేశం-ప్రేయసి వరీనియాతో స్పార్టా – “నన్ను నువ్వు ప్రేమించినట్లైతే, నేను దూరంగాఉన్నా, చచ్చిపోయినా చచ్చిపోతాననవు. “ఏం” జీవితమే లేకపోతే మరేమీ ఉండదు కనుక”. ఒండరులు ప్రేమపంచుకునే కార్యాలన్నీ భయాన్ని జయించినందునే సాకారమౌతాయి. ప్రేమంటే భయాన్ని జయించడమే. ప్యార్ కియాతో డరనా క్యా- కన్నా గొప్పసారం ఉందంటావా! జీవనసహచరితో ప్రేమంటే రతిక్రియ కాదు; రత్యానంతర అనుభూతి, ఆనందవిభూతి. భయాల్ని నువు చుట్టుకున్న ఈవేళ కూడా నీతోడు నేనున్నాను. ఏనాటి కైనా ఈ చీకటి విడిపోయేను.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-31

Published by under my social views

ఇంతకీ ఏంటంటాను!
సాహిత్యం సంస్కారాన్ని నేర్పుతుంది. అదేంటో తెలియని అమాయకత్వం నీది. ఎలా పెంచాలో తెలియక మీ భవిష్యత్తు తలుపులు మూసేసింది ముందుతరం. జీవితమంటే షాపింగ్ మాల్ సంస్కృతి కాదు, డాబుగా కనబడడం కాదు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం. ఒద్దికగా సర్దుకోవడం. నేను చెప్పినా నువ్వు వినిపించుకోవు, చనువు ఎంత పని చేస్తుందో చూశావా! అందుకే ఇలా నా మాటామనసూ పరుస్తున్నా. యుగధర్మం ఒకటుంటుంది. త్రేతాయుగాన రాముడు చీకటి పడిందని చెప్పి విశ్రాంతి తీసుకుని మరునాడు యుద్ధానికి రమ్మని రావణుడిని వెనక్కి పంపేశాడట. ద్వాపరలో రథమెక్కితే నిలువరించలేమని రాధేయుడ్ని కృష్ణుడు నిరాయుధుడిగా ఉన్నప్పుడే వధించమన్నాడు. కలియుగంలో తనను వదిలివెళ్లిన లక్ష్మిని వెతుక్కుంటూ వచ్చి వేరే పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాసుడు. కాలమహిమ. ఎవరితో ఏ పనిని ఎలా చేయిస్తుందో! ఎవరెలా ఉంటే మనకెందుకు అంటావా! నా మాట నువ్వు వినిపించుకుంటే నేనూఅదే అంటా. నువ్వూనేను ఈ యుగానికి చెందినవాళ్ళం మాత్రమేనా! మనకథ బ్లాక్ బస్టర్ జోనర్ కానీ, కాకపోనీ. ఇది సీరియస్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్. కొన్ని సీన్లు తొలగిస్తే.. క్లాసికల్ రొమాంటిక్ మెలోడ్రామా. నాకు నువ్వు-నీకు నేను సీక్వెల్ రెండు.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-30

Published by under my social views

5. ….గుర్తుకొస్తున్నాయి.
అమ్మ హిందీ భాషా ప్రవీణ్ పూర్తయ్యింది. హైస్కూల్ చదువుతో పాటు నాతో పరీక్షలు కట్టించడం సమాంతరంగా మొదలైంది. హిందీ సాహిత్యం చదవాల్సిన అవసరం. అప్పుడే క్రికెట్టు కూడా చూడడమూ ఆడడమూ. గవర్నమెంట్ బడుల్లో తెలుగు మీడియం, ఆటపాటలతో రోజులు దొర్లిపోవడం. పెదనాన్నగారు క్లాస్ టీచరుగా పెద్దమ్మ(అమ్మ అక్క) సంరక్షణ లో పది చదవడం, చిన్నాన్న(నాన్న తమ్ముడు) కాలేజీలో పీజీ చెయ్యడం ఇవన్నీ తీపి గుర్తులు, ఇంటర్ రెసిడెన్షియల్ జీవితం ఓ చేదు గుళిక. డిగ్రీ చదువు నల్లేరు పై నడక.. అప్పట్లో డాన్సు ప్రదర్శనలు నే వేసిన తప్పటడుగులు. డిగ్రీలో శ్రీకాంత్ అడ్డాల సావాసం వెచ్చని తలపు. కొప్పర్తి మాష్టారి పరిచయం ఓ మేలుమలుపు. అప్పుడేది చేతికి అందితే అది చదివా. వెక్కెక్కి ఏడుస్తూ సహవాసి రక్తాశ్రువులు, ఊహల్లో విహరిస్తూ.. బొమ్మదేవర నాగకుమారి ఆంధ్రభూమి సీరియల్ పయనమయే ప్రియతమా. యండమూరి ఓ పజిల్, షాడో మధుబాబు ఓ విజిల్. కొన్ని పదుల కవిత్వ పుస్తకాలను ఆశ్వాదిస్తూ. పుస్తకాలు నాకు ప్రేమను పంచసాగాయి. పుస్తకం తీస్తేనే నిద్రొచ్చేసే నీకు.. ఎంత చదివినా తరగని పుస్తకంలా దొరికావు. తరిచేకొద్దీ కొత్తగా అనిపించే మస్తకం నువ్వే. చూసేకొద్దీ నచ్చే సినిమా మనదే. ఎలా చెప్పేది! నువ్వంటే ఎంత ఇష్టం నాకు!!

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-29

Published by under my social views

4. ….గుర్తుకొస్తున్నాయి..
అమ్మ నాకు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చింది. దాని చుట్టూ క్రమశిక్షణ అనే పెద్ద పంజరాన్ని నిర్మించింది. వేరే ప్రపంచం మీద దృష్టి లేకుండా పెంచింది. ఆమె జీవనానుభవసారం నేను. కథలు, చదివిన పుస్తకాలు ఊహాలోకంలో విహరింపజేశాయి. చందమామలు, బాలమిత్రలు, బుజ్జాయిలు నేస్తాలు నాకు. ఆపై ఇతిహాసాలు, ఎన్టీఓడి పౌరాణిక సినిమాలూ ఆసక్తిరేపాయి. ఐదోక్లాసప్పుడు ఐభీమవరం గ్రామంలో ఉండేవాళ్ళం. సైకిల్ తొక్కుతూ లైబ్రరీకి వెళ్ళబోయి కనుమూరి బాపిరాజు గారి కారుకు అడ్డంగా పడ్డాను. మోకాళ్ళు కొట్టుకుపోయిన నన్ను చేతులమీద ఎత్తుకుని తెచ్చి అప్పగించారు. దెబ్బలు తగ్గేవరకు పుస్తకాలు, కాసెట్లు ఇంటికి తెచ్చిచ్చే ఏర్పాటు చేశారు. వాటితోపాటు చదివా, కెనెత్ ఆండర్సన్ వేటడైరీ- శివానిపల్లి నల్ల చిరుత, భారతదేశపుటడవుల్లో ఇతర సాహసాలు. ఒక వైపు పులిపిల్లలతో ఆడుకున్న బాలభరతుడి సారస్వతం, మరోవైపు మనుషుల్ని తినే మృగాల భరతం. పచ్చిపాలలో కోడిగుడ్డు కలుపుకుని కథల్ని తాగినరోజులు… నీకొంగుకు కట్టుకున్నాక నామానాన నేను కొట్టుకుపోకుండా ఒడిసిపట్టుకున్నావు. నీ అవసరాలకు నా స్వేచ్ఛని ముడిపెట్టి గంపకింద కోడిలా దాపెట్టావు. రాసే అలవాటును రాజిల్లేట్టు చేశావు. ఎలా కృతజ్ఞత తీర్చుకోను!

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-28

Published by under my social views

3. …గుర్తుకొస్తున్నాయి..
మొదటి ఏడేళ్ళూ ఊహ తెలియనిహాయిలో, తరువాత ఇరవై నేర్చుకునే తపనలో. ఎదగడం ఎంతసేపు! కొవ్వూరు, తణుకు, ఆకివీడు, ఖమ్మం, నారాయణపురం-కాన్వెంటు-హైస్కూలు చదువులు; విజయవాడ, తణుకు, కాకినాడ-ఇంటర్ డిగ్రీ పీజీలు, ఉజ్జోగం రాజమహేంద్రి, అక్కడే కలిసాగా నిన్ను, ఆగింది ఎక్కడ! ఆయాసం తగ్గనే లేదు. చదువు చెడకుండానే డాన్సు, డ్రాయింగు. చుట్టాలింటికి ఎన్నడూ వెళ్ళిందిలేదు. ఉక్రోషానికి కొదవులేదు, డిక్టేషన్ లో మార్కు తగ్గినా, ఎలక్యూషన్ లో మెట్టుదిగినా, రికార్డుబుక్కులో బొమ్మెయ్యమన్నప్పుడు అన్నయ్య బెట్టు చేసినా తన్నుకొచ్చేది కన్నీరు. అమ్మ నా హిందీ ట్యూషన్ టీచరు, ఫస్ట్ ఎయిడ్ డాక్టరు. అపాహిజ్ లా మిగిలిపోవడమో, తునక్ మిజాజ్ లా ఊగిపోవడమో కూడదనే చెప్పేది సుద్దులు గాయాలకి కట్లుకడుతూ. వంట పట్టించుకునే వయసొచ్చేటప్పటికి చాలా దెబ్బలు తగిలాయి లడ్డూ పాపా! దెబ్బతిన్నవాడ్ని కొట్టి ఏడ్చే ఆమ్మలే లోకమంతా. గారం కొంత చెడగొట్టింది. పోగొట్టుకున్నా సున్నితత్వం కొంత, మాట మెత్తదనం మారలేదు, మొండితనం మిగిలిఉంది ఉంది కొంత. జీవితంపరీక్ష ఓ కవ్వింత, గెలవాలని నీకోసం నా ప్రయాసం. పట్టు చిక్కుతుందన్న ఆశ రవ్వంత. చాలమందికి ఉప్పూ నిప్పూ కాపురం చేయడం వింత.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-27

Published by under my social views

..గుర్తుకొస్తున్నాయి..
అదిగో అప్పుడు నాకు ఊహ రాలేదు, పసికాళ్ళకు వేసిన సాక్సులు ఒరుసుకుపోయి గుక్కపట్టాను, నొప్పి గుర్తులేదు; మిగిలిపోయిన మచ్చ ఓ జ్ఞాపకం. నాన్న కొట్టాడని అమ్మ ఒకతె గోదారి ఒడ్డుకు వెళ్ళి కూర్చోడం, పక్కింటి వెంకట్రావు మామయ్య చూసి తీసుకురావడం. తిరిగి రాకపోతే మాగతేమయ్యేదో; అమ్మా! ముందెప్పుడన్నా ఇలా పోవాలనిపిస్తే మమ్మల్ని మాత్రం మమ్మల్ని చంపొద్దమ్మా.. అన్న అన్నమాట ఎప్పటికీ జ్ఞాపకం. వరదాయని నదికి వరదవచ్చి శివలింగాన్ని చుట్టినరోజు, గట్టుతెగి కొట్టుకుపోతామేమో అన్న భయం, అమ్మ గుండెచిక్కబెట్టుకుని పసుపూకుంకుమలు సమర్పించుకుంటున్న దృశ్యం ఓ జ్ఞాపకం. ఇంటిముందున్న సైకిల్ రిక్షా కడ్డీతొక్కబోయి జారినప్పుడు తొడ ఇరుక్కుపోయి విలవిల్లాడుతుంటే అమ్మవచ్చి విడిపించిన జ్ఞాపకం. పిల్లి బయట పరిగెడుతుంటే నేను బెదిరి కిటికీలోంచి జారి గడ్డం బద్దలుకొట్టుకున్నప్పుడు చెరోచంకన బిడ్దల్నెత్తుకుని అమ్మ ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిన జ్ఞాపకం. రెండేళ్ళకోసారి ఊరు మారిన జ్ఞాపకం, ఊరుమారిన ప్రతిసారీ దూరమైన స్నేహితులు జ్ఞాపకం. చెమరింతల నీ కళ్ళతడిజారిన బంగారు చెక్కిళ్ళు, నిద్రలేని రాత్రుళ్ళలో తీరని దిగుళ్ళు.. రెండేళ్ళ ఎడబాటుకు ఆనవాళ్ళు. ప్రతీసందర్భమూ తీపి బాధల జ్ఞాపకమే.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-26

Published by under my social views

1. గుర్తుకొస్తున్నాయి..
ఎందుకింత ఆలస్యంగా పరిచయమయ్యావని నిలదీసావుగా! మరో జన్మంటూ ఉంటే వేరే వారెవరి కంటాపడకుండా ఇద్దరం బావామరదళ్ళుగా కలసి పెరగాలని, కబుర్లెన్నో చెప్పుకోవాలని ఉబలాట పడ్డావే! కాసేపు నాతోపాటు చిన్నపిల్లవై నడిచొస్తావా, గుర్తున్నవన్నీ చూపిస్తా. కొన్నితలపుల్ని కాలం చెరిపేసినా మిగిలున్నవన్నీ నువ్వెవ్వరో తెలియని కాలంలో నీకై నా ఆరాటాలే. – చిన్నోడ్ని కదా అమ్మకి, చేరిక వల్లో గారం వల్లో చురుకెక్కువ. అమ్మ తప్ప ఇంకెవ్వరూ కనపడని కాలం లో తన నా దేవత, ఇదే మాట కనిపించిన చోటల్లా రాసుకున్నా. చెక్కలపై బలపాలతోనో, గోడలపై పెన్సిళ్ళతోనో. నాన్నతో పని ఉండి గుమ్మం తొక్కిన ప్రతి ఒక్కరూ, అమ్మను కని ఈమాట పైకి అన్నవాళ్ళే. పెట్టుపోతల్లో లోటెప్పుడూ చూడని కళ్ళకి ఇప్పటికీ ఆ కదిలే దృశ్యాల ఆనవాళ్ళే కంటి ముందర. ఒళ్ళు నలగకుండా ఉండాలంటే ఏదో నేర్పుతూ కూర్చోబెట్టాలని కళలన్నింటిలోనూ వేలు పెట్టించింది, దొరికిన చోట దొరికినంత అవేమైతే ఇప్పుడేమి, ఆడపిల్లలానే పెంచింది. చెరోముద్దా తినిపిస్తూ పురాణేతిహాసాలు వినిపించింది. అమ్మ కధలన్నీ ఆణిముత్యాలే. నాన్న ఉద్యోగం నిమిత్తం ఊళ్ళట్టుకు తిరుగుతున్నప్పుడు పక్కన వేసుకుని వినువీధిన చందమామను చూపించింది. ఇప్పుడు నా చందమామ నువ్వే, వెన్నెలమ్మా నువ్వే

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-25

Published by under my social views

నారికేళ సలిలము భంగిన్
ఏమండీ, లక్కీ, చిన్నిబాబు కదా నేనొక్కద్దాన్నే చూసుకోలేను; సిరిని కూడా తెచ్చుకుంటానే! పన్నెండేళ్ళనాటి మాట. సతీష్! లక్కీబాబుకి చపాతీ, నాకూ- సిరికీ ఇడ్లీ ఇంకా మసాల దోశ.. నిన్నరాత్రి మాట. లడ్డూ! నువ్వేమడిగినా వద్దనలేను. కాదన్న కారణమేమన్నా ఉందంటే అది సిరి ఉన్నందున కాదు; సంపద లేనందునే. మెతుకు పోతే బతుకు పోయే నేపథ్యం నుంచి నేను, బ్రతికిచెడినజీవితం లోంచి నువ్వూ వచ్చి ఒకచోట కలబడ్డాం. ఒక్కసారిగా నీకూనాకూ నడుమ పిల్లాడు-పిల్ల. నీకు ఇద్దరూ, నాకు ముగ్గురూ పిల్లలై కొత్తకాపురం కాస్తా కుటుంబరావు సంసారమైంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. లోకం మొత్తాన్ని ఓ పక్కకు నెట్టేసి ఈ పిల్లలిద్దరూ మన ఏకాంత సమయాల్ని ఆక్రమించాక, మనది నాలుగు స్తంభాలాట. ఆటలన్నీ ఆహ్లాదంగానే ఉంటాయి. జీవితం ఓ గాలి దుమారం. దూరం నుంచి భయపెడుతుంది. గడ్డిపోచలం మనకేం భయం! నీ అల్లరి కెరటాల తాకిడికి నిత్యం తడుస్తున్న వాడ్ని. నీ ఆనందాలు, తాపాల వెనుక మెదడులోని న్యూరాన్ల అసమతుల్యత, ఆనువంశిక కారణాలు ఒకానొక ఒత్తిడి సందర్భాన బయటపడ్డప్పుడూ దేవుడు మనజట్టే. అందుకే ఈపసిమనసును నాతో ముడిపెట్టాడు. నన్నుచూసి నువ్వు నవ్వినప్పుడల్లా నీలోంచి దేవుడు తొంగిచూస్తూ పలకరిస్తున్న చప్పుడు.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-24

Published by under my social views

ఆకతాయి మాటలు
పసివాడ్ని చూడటానికి వచ్చారు చుట్టపట్టాలు, అమ్మలక్కలు కొందరు-ఇంకా గుండ్రంగా ఉంటాడనుకున్నాం అంటూ బుగ్గలు నొక్కుకున్నారని ఐదున్నరపౌన్లు పుట్టినవాడ్ని చూసి అనవసరంగా కన్నీరొలికావు, కడుపుతో ఉన్నప్పుడు పాలింకా తాగిఉంటేనా! అనికుమిలావు. తిండిఏం తక్కువ మనకు! అత్తగారింట సపోటాల పాలజ్యూస్ ముందు మొహంమొత్తి నువ్వు ఓడిపోలేదూ!, బాదంపాలు బలవంతాన నీకు తాగించలేదూ! బరువో పెరిగినంతనో, నేనింతలా కనబడ్డంతనో బిడ్డపుట్టడం తోనే పెద్దగా కనబడాలా! లోకం శుభకరే, కొండకచో మనతో ఆడేది సలిలకేళి కుదిపేసి తప్పుకుంటుంది కొన్నిసార్లు. మమత వల్ల కన్నీళ్ళు దృశ్యాన్ని మసకబారుస్తాయి. వాస్తవానికి మహావృక్షాల విత్తనాలు చిన్నగానే ఉంటాయి. సారవంతమైన క్షేత్రం నీది. మన చిన్నోడికేం తక్కువ. ముక్కుపచ్చలారేవరకూ నీరెండ కాపడంలో వాడెన్ని కబుర్లు చెప్పేవాడనుకున్నావ్, తీరా ఎదిగిపోయాక సరదాలన్నీ నీవేనా! దమ్ముంటే ఇంతకన్నా చక్కనోడ్ని ఎవరికన్నా కని చూపించమన్నావ్ గుర్తుందా! భూమ్మీద ఇప్పటి దాక ఇలాంటి మాట ఏ మగడన్నా విన్నాడా! మళ్ళా అబ్బాయెందుకు నాకు! చక్కని చుక్కని కని సాఫల్య అని పేరుపెడతానన్నాను. రాతల్ని మించి కనే సాఫల్యమేముంది ఈ లోకాన నాకు!

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-23

Published by under my social views

ఔరా అమ్మకు చెల్లా..
ఎదురుచూపుల నెప్పుల్ని ఏడాదిగా మోస్తున్న ఆ పిల్ల.. తీపికబురు విన్నాక తలారా స్నానం చేసి దీపం వెలిగించుకుని నీదగ్గరకు వచ్చింది. వాడ్ని దగ్గర్నుంచి చూసుకుంటూ నిలిచుంది. తనూ చిన్నపిల్లే కదా, ఇప్పుడు పిన్ని అనే పెద్దరికం. అప్పుడా కంటికీ, ఈ చంటికీ మధ్య త్రేతాయుగపు అనురాగపు జల్లు, ద్వాపరయుగపు పురాస్మృతులు, శబరి అనురాగం, యశోద పరవశం, మింటి వెలుగు విరుపున పటాపంచలైన మోక్షమార్గం, తీరా కోరుకున్న దరి చేరాక అంతర్యామి సాక్షాత్కారం లో అంతకు మించినదేమీ తోచక స్థాణువై నిలబడిన సుప్త చేతనావస్థ. చేష్టలుడిగి చిత్తరువైన వైనమో, సంభాషణో వారిరువురి బంధం జన్మాంతరాలుగా పెనవేసుకున్నదేమో అన్న సంశయాన్ని మోస్తూ నిశ్శబ్దం. నిజం చేస్తూ ఆ తరువాత కాలంలో సమస్తం వదిలిపెట్టి వాడి కోసమే కట్టుబడడం, వాడిని వదిలి తనూ, తనని వదిలి నువ్వూ పుష్కర కాలం గా ఉండలేనితనం లోకం ముక్కుమీద మనమే వేలు వేసి వెనక్కి నెట్టేయడం.. పురా శిలాజానికి చలనం వచ్చి కాలం కాని కాలం లో జీవంపోసుకున్న అమాయకపు రాజకుమారి మీ అమ్మగారు వెనుదిరిగి రాని మహారాజుని తల్చుకుంటూ ఒంటరిగా గడిపేస్తూ.. నువ్వు నాతో ఆడుతున్న తోడుబొమ్మలాట ఈ తోలుబొమ్మలాట యధాస్థితి అనివార్యమై. ప్రేమకు బందీనై నేను.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-22

Published by under my social views

ఇంట కాసిన పండువెన్నెల
పిల్లాడు పుట్టకుండానే రెండు కుటుంబాలకి వారధి గా మారతాడు. పుట్టాక కుటుంబాల మధ్య కనిపించని ప్రయాణాలు చేస్తాడు వాడ్ని తమవాడని ఒప్పించుకునేందుకు ఎవరిలెక్కలు వారివి. ఇంటిపేరు నిలబెట్టే వాడని తండ్రి తరుపు, తమపిల్ల ప్రాణాలొడ్డి రక్తం పంచామని తల్లితరుపు.. మావాడే అనుకుంటారు శిశువును. ఇక్కడన్నీ మురిపాలే. నా అన్న తనలా ముందుగా తన్నుకొచ్చిన తమ్ముడి కొడుకులో వారసత్వం చూసుకోవడం మురిపెం. తన సంజెరేవునే ఇంటికొచ్చిన తోటికోడలు ఆరిందాగా బాలింత ఐపోవడం, ఊహించినట్టే బువ్వాలాటల చెల్లి సరదా తీర్చేసుకోవడం; మరిదికాదు వీడు నీ పెద్దకొడుకని అప్పగిస్తూ పెళ్ళిపీటల మీదే తల్లిని చేసిన అత్తగారి వైనం గుర్తొచ్చి సంధ్య వదిన.. ఉక్కిరిబిక్కిరి మురిపంలో. ఇంటిపేరు లెక్కల్లో ఒకటి పెరిగిందన్న మురిపెంలో తన మానాన మా నాన్న. వెతలకీ, నలతలకి నలిగినా చిరునవ్వు వదలని చిద్విలాసి మీ డాడీ.. నునుపుకండల పిల్లవస్తాదులో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ పొందిన జీవితకాలపు చివరి మురిపెం. ఎప్పుడు ఎదుగుతాడో, ఎప్పుడూ చికెన్ ముక్క పెట్టుకుంటానో అనుకుంటూ నువ్వు. గుర్తు తెచ్చుకునేకొద్దీ గోదారి పొంగులా, వరదగుడి వెన్నెల మనసుని చుట్టబెడుతూ..

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-21

Published by under my social views

పెళ్ళిరోజు C/o లేబర్ రూం
ఏం లక్కీగాడో! పుడుతూనే పెద్ద ఇబ్బంది పెట్టేశాడు. నా పెళ్ళి రోజు సరదాలన్నీ చెడగొట్టేశాడు. లడ్డూపాపని ఆసుపత్రిలో అడ్డంగా పడుకోబెట్టేశాడు. రాజమండ్రి కంటే దుర్గ ఆసుపత్రిలో మధ్యాహ్నం మూడు గంటలకి వాడి ప్రయాణం కత్తెరకోతలతో మొదలైంది, పావుగంటలో నర్సు తెల్లని గుడ్డలో చుట్టిన బొమ్మను చూపించింది. నేను చూసినప్పుడు వాడు ధ్యానం లో ఉన్నాడు నన్ను చూశాకే కేర్ మన్నాడు. ఏం చెప్పాడు వాడు నాకు! ఇది నీ పెళ్ళీ రోజు కాదు, నా పుట్టినరోజు అనా! ఇక ముందు అమ్మకు నీకన్నా నేనే ముందనా! ఏదైనా వాడు కేర్ అన్నాడు, ఏవో జాగ్రత్తలు చెప్పాడు. నేనింకా నువ్వు సొమ్మసిల్లి ఉన్నావన్న బెంగలో ఉన్నాను. అక్కడ అత్తగారు, కానుపు అలసట తెలిసిన మనిషి, తల్లి మనసు.. కూతురి ధ్యాసలో ఉన్నారు. ఎవరో అంటున్నారు, మగపిల్లాడు పుట్టినా నేనేం గంతులెయ్యలేదేంటని, పిల్లాడ్ని చూపించిన ఆవిడ పేరు మాత్రం కనుక్కున్నాను.. మస్తానమ్మ. నా సమస్తాన్ని తొట్టతొలుత ఈ నేలమీద జాబిల్లిని చేసి చూపెట్టినమ్మ. నోరు తీపి చేస్తే సరిపోతుందా! అమ్మ వచ్చింది కోడలి కష్టాన్ని మురిపెంగా కందామని. అప్పుడూ నువ్వు ఆమంచిగంధం చీరలోనే అలానే తడిచిన నీ మేను. ఇప్పుడు వాడు నీలా నిద్దరపోతుంటే అప్పటి నా చూపుల్తో నువ్వు.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-20

Published by under my social views

పురుడు ముందరి పాట్లు
పిల్ల నీళ్ళోసుకుందంటే.. పుట్టేది ఎవరు! బొండుమల్లా, బూందీ లడ్డూనా! పిల్లల బొమ్మల్ని పొద్దస్తమానూ కనిపించేలా గోడకంటించ తెస్తే మీ అమ్మగారు వద్దంది. బొమ్మలో బాబుది చట్టిముక్కట, ఇంతకన్నా అందంగా ఉంటాడా మీ మనవడు! అడిగా, చూద్దురులెండీ అందావిడ. ఏమిటో అతిశయం అనుకుంటుంటే నువ్వు అన్నావూ.. మీ ముక్కు వాడికొస్తుందని మా అమ్మ ధీమా. అసలు పిల్లలంటేనే అందమైనవారు, అందులో అందమైన పిల్లలు వేరంటే ఏమంటాను! ఎవరి పరిధిలో వారి ఆలోచనలని సరిపెట్టుకుంటాను. ఆరోగ్యమే అందం కదా అనుకుని నడక మంచిదని నడిపించేవాడ్ని. సంఘీదేవాలయానికి మొదటిసారి వచ్చాక, మెట్లు చూసి వెనకడుగు వేయాలా, నీ నడుముకు చేయి ఊతం ఇచ్చి ఆరోనెలలో అన్నీ ఎక్కించానే, నాలుగేసి కాళ్ళు-చేతులూ, కళ్ళూ ఇంకా కనబడని వాడ్ని కనిపెట్టి ఉన్నాయన్న భరోసా. ఆపై నిత్యం మోస్తున్నవాడి నిండు ఆశీస్సులు. తొమ్మిది నెలలు నిండి తొమ్మిదో రోజున చక్రం సినిమా కి వెళ్ళామా! అక్కడే పుట్టేస్తే! జైల్లో పుట్టిన జ్ఞాని రాష్ట్రపతి అయాడు. మన జీవితచక్రాన్ని ప్రేమ చమురు తో తిప్పే ఇరుసును ముద్దుగా ఏమని పిలుచుకుందాం! రెండువారాలాగి మరీ పెళ్ళిరోజున దిగాడు మగపిల్లాడు, అన్నారందరూ లక్కీగాడని!

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-19

Published by under my social views

మెచ్చిన ముచ్చట్లు
అసలా వాన ఎలా మొదలయ్యిందో! ఓ కరెంటు పోయిన పగలు, మొరాయించిన కంప్యూటర్లను వదిలేసి, లాంజ్ లో మేగజైన్లను తిరగేస్తుంటే కనిపించిన సుష్మాస్వరాజ్ బొమ్మ, పోచమ్మ అన్నట్టుంది..‘ఇలానే ఉంటుంది సతీష్ గారి అమ్మ’. ఇంతలో సామవేదం శాస్తి; బావగాడికి నాలుక మీద మచ్చ.. అత్తా కోడళ్ళుగా సరిగ్గ సరిపోతారు అనేశాడు. నీ బుర్రలో తొలిచే పురుగును వదిలేశాడు. పెద్దల వాగ్దానాలన్నీ పిట్టలదొర ప్రేలాపనలుగా మార్చిన కాలం నన్ను నీ మనసున వరుడిగ కూర్చోబెట్టింది. నీ ఇష్టసఖి సౌజన్య అన్నయ్యకీ నచ్చావటగా, అప్పుడు కలవని జాతకాలు, మనిద్దరికీ ఎలా కలిసాయో తెలుసు. సినిమాతెరపై దేవుడు కనిపిస్తే దండం పెట్టుకునేదానివి, నీకు నచ్చిన చీటీ వచ్చేవరకూ దేవుడి బొమ్మ ముందు దోబూచులాడావ్, ఎంతఇష్టం లేకపోతే అట్లా చేస్తావ్. నిన్నిష్టపడ్ద శ్రీనివాసుడ్ని నువ్విష్టపడ్ద శ్రీనివాసుడ్ని ఇద్దరినీ తలచుకోవడం ఒక్కటే నాకు. ఆ మాటకొస్తే నిన్నిష్టపడ్ద వారెవరన్నా నీకన్నా ఇష్టం. బండి మీద మనం షికారుకెళ్ళే రోజుల్లో ఏ కుర్రచెయ్యో నీ నగుమోముని మెచ్చుకుంటూ సైగచేస్తే నేనూ నవ్వుకుంటాను, మనమిద్దరం ఒక్కటవ్వడం ఈ లోకం మొత్తం కోరుకుంది. ముగ్గురవ్వడం లో ముచ్చట్లు చెప్పడం ఇంకా మిగిలిఉంది.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-18

Published by under my social views

నచ్చని ఇచ్చకాలు
ముందొకలానూ, పెళ్లయ్యాక ఇంకోలానూ ఉంటారని ఈళ్ళని ఆళ్ళూ, ఆళ్ళని ఈళ్ళు ఆడిపోసుకుంటారు ఆడాళ్ళూ, మగాళ్ళు. అసలా ఒకేలా ఉండటం విసుగనిపించదూ. పెళ్ళి మంత్రాలకు అర్థాలు వెతకను నేను, భార్యవి కదా అని.. ప్రేమించడం నాకు చేత కాదు. పుట్టినప్పటినుంచీ అందరూ నన్ను ప్రేమించినవాళ్ళే; అందినదే ఇచ్చిపుచ్చుకుంటున్నాను. ఈ జిందగీ ఎంత వింతైనదో ఒకచోట వదిలితే మరో చోట పట్టుకోవాలి. పంచుకున్న చోట గిట్టుబాటు కానంతమాత్రాన నొచ్చుకునేది ఏముంటుంది! లక్ష నిరాకరణల నడుమ కలిసి జీవిద్దాం అన్న అంగీకారం పై గౌరవం నాకు, భౌతికప్రేమ మధురమైనదీ మోహం మొహం మొత్తేసేదనీ తెల్సు, నేల మీద నిలబడి జీవించేందుకు చేసుకున్న సర్దుబాట్లే అన్నీ. అసలు జీవించడమే ఓ ఉత్సవం ఐనప్పుడు కలిసి జీవించడం ఎప్పుడూ ఆనందమే. నా ప్రపంచాన్ని నీకు అందించడం, నీ ప్రపంచం లోకి నన్ను ఆహ్వానించడం, మన ప్రపంచాన్ని సృష్టించుకోవడం, ఎవరి ప్రపంచం లో వాళ్ళు మిగిలిపోవడం ఇది తనను తాను అద్దం లో చూసుకోలేని ప్రపంచపు పరిభాష. ఎవ్వరు ఈ లోకాన్ని ఎలా చూసినా ప్రతి చినుకులోనూ అదే తడి. మరి నిన్నే నా లోకమని అంటుందని ఎందుకంటే, నన్ను తడిపిన తడి చినుకువి, జడివానవి నువ్వేమరి.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-17

Published by under my social views

నేనేమో అమ్మరెమ్మ-తానేమో వెన్నెలకొమ్మ
మా అమ్మమ్మ ఊరేమో పొలమూరు, గోదావరి ఇవతలి పేరు బక్కరైతుకి అమ్మ ఐదో సంతు, తొమ్మిదో ఏడు బాలానందం కి వెళ్ళిందని తిట్లుతిప్పని ఇంటి పడికట్టు. ఎస్సెసెల్సీ చదివితే ఊరి బడిగట్టు దిగినట్టు.. చుట్టం చూపుకి వచ్చినోడు నచ్చిందన్నాడని చదువుకున్నాడని, కూడూ-గుడ్డా కొదవుండదని నాన్నకి కట్టబెట్టారు గానీ ఇక్కడ ఉద్యోగం లేక పక్క రాష్ట్రానికి వలసవెళ్ళిన వైనం. పాసింజరు రైలు ప్రయాణాల దూరాభారం. పేదరికానికి కొత్తరూపు దిగువ మధ్యతరగతి జీవితం. ఒంటి రెక్కల మీద ఇద్దర్ని కనిపెంచడం, కధలు చెబితే నీతి, చదువు చెబితే రీతి అలవడుతుందని నమ్మి ఆచరించడం. నాకు పాలు పట్టాలనో, కనిపెట్టుకునుండాలనో నా స్కూల్లో టీచరుగా చేరడం, తానే గురువై హిందీ పరీక్షలు కట్టించడం, సాహిత్యం ఆమె ఉగ్గుపాలు లలితకళలన్నీ నా నోటికందించిన పోతపాలు, నేనెన్ని చెప్పినా నన్ను ద్దిద్దితీర్చిన అమ్మ తపన చర్వితచర్వణం. ఎదగడంలో లోపమెక్కడ ఉందో వేళ్ళూనుకున్న నేలంతా సార్వంతమే, ఆకాశాన్ని అందుకోవడం లో సగందూరం లోనే ఆగిపోయాను. అప్పుడు కనిపించావు నువ్వు ఆకాశం లో సగమై, ఆశల తారకల నడుమ నీకై వికసించాను, నన్ను ఎల్లవేళలా వెలిగించి ఉంచేది నీనెలవంక నవ్వు; మనం కన్న తురాయి పువ్వు.

RTS Perm Link

No responses yet

Aug 01 2018

| ప రాం ప్రే య సీ..!|-16

Published by under my social views

అత్త అల్లం- కోడలు వెల్లుల్లి (ప్రాక్టికల్)
అత్తమ్మా! ఏం వండుకుందాం!!-ఇంతపొద్దున్న ఎందుకమ్మా, పన్నెండింటికి చూద్దాం. మీరుండండి అత్తమ్మా, నేను చేస్తాను-నీకెందుకమ్మా బండపని! కోడలుతో గ్లాసు కూడా కడిగించకూడదనుకున్నా మషాలాలు ఎక్కువైతే మీ మామయ్య తినలేరు, సాయం ఉండు చాలు. ఇంక చాలు అత్తమ్మా సపోటా జ్యూస్ తాగలేను- మనతోట పంట నీకిష్టమే కదా. బయటేమీ తిని రాకండి. మీకోసం పొడిపప్పూ, కొబ్బరిపచ్చడి చేశా. ఆమ్లెట్వేసుకుందాం- ‘అబ్బా! బిర్యానీ తినొద్దామనుకున్నా’.
ఇంతకు మించి సరిహద్దు తగాదాలేమైనా ఉంటాయా! అత్తా-కోడళ్ళకి! ఒకరు వేసవి మరొకరు వర్షరుతువు. వలయమై విస్తరిస్తున్న సందర్భాలు మబ్బులు. ఎంత ఎండ కాస్తే అంత వాన కురుస్తుంది. ఎండా- వానాలతో కలిసి నడవడం, ఏ సందర్భానికి ఆ గొడుగు పట్టడం ఇదే జీవనమకరందం. ఇది సరిగ్గా జరగనినాడు కష్టాలతో చలి కాచుకోవడం తప్పదు. అనివార్యమగు ఈ విషయముని గూర్చి అతిగా సోకింపతగదు.
కూర ఘుమఘుమలాడాలంటే అల్లంవెల్లుల్లీ పేస్టూ లా కలవాలి, కలబడాలి. విడివిడిగా ఏవీ బాగోవు, కలియబెట్టి ఉడికించే పనిలో ఎక్కువ తక్కువలు అనుభవాలు. వండుకు తినడమే ఆస్వాదన. రుచులన్నీ కలిసే ఉంటాయి రసాలూరిస్తూ.

RTS Perm Link

No responses yet

Next »

RTSMirror Powered by JalleDa