Archive for June, 2018

Jun 01 2018

యశస్వి||భాగ్యలక్ష్మీ బంపర్ లాటరీ||

Published by under my social views

ఒక్క రూపాయితో ఏం కొనచ్చో చెప్పు
అగ్గిపెట్టో, చాక్లెట్టో, సాచెట్టో, టాబ్లెట్టో
ఏదొకటి అనకు, ఏం కొనచ్చో చెప్పు

నది దాటుతుంటే నీట్లోనో
ఆకలి చాచిన చేతిలోనో
నోరెత్తి అడగని వాడి హుండీ లోనో
వేస్తావు సరే, ఇంకా ఏం చెయ్యొచ్చో చెప్పు

బొత్తాం ఊడీతే పెట్టుకోడానికి పిన్నీసో,
జిప్పు విప్పడం కోసం టాయ్లెట్ కో,
సర్కారు వారూ అమ్ముకునే మంచినీళ్ళోకో
అది తాగడానికి కావాల్సిన ప్లాస్టిక్ గ్లాసో
దేనికోసం రూపాయిని వాడతావు చెప్పు

వెలిగించడానికి కొవ్వొత్తినో, చెరుపుకునేందుకు రబ్బర్నో

దేశ నైసర్గిక స్వరూపాన్ని చూపించే
భౌగోళీక పటాన్నో, గుండుసూదితో
గుండెలపై గుచ్చి ఉంచే త్రివర్ణ పతాకాన్నో
దేన్ని కొంటావు నువ్వు..
ఒక్క రూపాయితో!

ఒకప్పుడైతే..
నీ బరువుతూచి జాతకం చెప్పే టికెట్టో..
క్షేమ సమాచారాలు చెప్పడానికి రాసే పోస్ట్ కార్డో..
ఓ గంటకి దొరికే అద్దె సైకిలో
తీర్ధం లో చూసే కెలెడోస్కోపో, మరమరాలుండో, పాల ఐసో,
దేనినో కొనే ఉంటావు నువ్వు రూపాయితో..

ఇప్పుడు రోజుకి ఒక్క రూపాయి
రక్షణ సంక్షేమ నిధికి దాన మిచ్చి దేశభక్తినీ కొనుక్కోవచ్చు

అమరవీరుల కుటుంబాలను మనమే ఆదుకోవచ్చు

మరి ప్రభుత్వాలు ఎం చేస్తున్నట్టు!
రూపాయి బిళ్ళని ముద్రించి
చెమట చుక్కల్ని నాణాలుగా ప్రామాణీకరించాక..

వాటిని నోట్ల లోకి మార్చి చలామణి లోకి తెచ్చాక,
దొంగనోట్ల బూచిని చూపించి లాక్కుని మరీ వాటిని మార్చి
ఓట్లు కొనుక్కోవచ్చు.
మనల్ని మళ్ళి.. ఏమార్చవచ్చు.

అవును.. మనమింతే..
సానుభూతిని అమ్మకానికి పెట్టి పరిపాలన చేసే
దళారీలకి
GSTలు కట్టుకుంటూ..
చేతిలో మిగిలే రూపాయికి ఏమోస్తుందా, పోతే ఇక పోయే దేముంది లే..
అని లెక్కలు మానేసి ఎప్పటిలానే నోటితో.. సున్నాలు చుట్టొచ్చు.

=12.5.18=

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa