Archive for March, 2018

Mar 27 2018

యశస్వి ||వెడలె.. విశ్వంధరుడు

Published by under my social views

ఎవరన్నా అనుకున్నామా!
నడవలేనోడు, మాట్లాడలేనోడు,
పళ్ళు తోముకోలేవడం కూడా చేతకాని వాడు
పాలపుంతల రహస్యాలను ఛేదిస్తాడని!

చొంగ కారితే తుడుచుకోలేనివాడు
చక్రాలకుర్చీ లో కూలబడ్దవాడు
మరణాన్ని మోసుకుతిరిగినోడు
కనబడని లోకాల అరలు తీసి సామాన్యుడికి చూపుతాడని

మోటార్ న్యూరాన్స్ వ్యాధి చుట్టబెడితే
నిలబడలేక కూలబడ్డా, మాటలు మూలబడ్డా
చచ్చుబడుతున్న మెదడు తోనే
సృష్టి సిద్దాంతాల్ని కొత్తగా ప్రతిపాదించాడు

కాల చరిత్రని రాస్తున్నవాడ్ని అవిటితనం ఆవహించుకుంది;
అగాధా క్రిస్టీ, హెల్న్ కిల్లర్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్,
ఫిడేలు నాయుడు గార్లను కలుపుకుని
గొప్పతనాన్ని తనకు అతికించుకుంది

ఇతడు కాల్పనిక సాహిత్యాన్ని సృజించలేదు
పుట్టు ఇబ్బందులు పడ్డాడో, లేదో
రాజనీతిజ్ఞుడా! కాదు;
సంగీత మయుడా! ఊహూ..
అయినా గొప్పతనాన వారి సరసన మెరిసాడు

మత కాల్పనికత నడ్డి విరగొట్టే నిజాలతో నిగ్గు తేల్చాడు
పుట్టుకతో చెప్పి ఒప్పిస్తున్న కథల గుట్టుని
ఈ శాస్త్రనీతిజ్ఞుడు బట్టబయలు చేశాడు
ఖగోళ విభావరిలో కనబడని వాటికీ దివిటీ పట్టాడు

సత్యం చెప్పిన వాళ్ళని మట్టుపెట్టిన చరిత్ర
చర్చల్లోంచి ఇంకా వైదొలగిపోలేదు
ఆర్కిమెడిస్ నుంచి గెలీలియో వరకూ హింసించిన మతమే
తమ మతాధిపతిని ఈ మేధ ముందు మోకాలి పై నిలిపింది

మనిషంటే మేధ.. అన్న ఐన్ స్టీన్ కి అక్షరాలా వారసుడు
న్యూటన్, చార్లెస్ బాబేజ్ ల పరంపరలో
లూసియన్ పీఠానికి వన్నెతెచ్చినవాడు
తప్పనిసరి మార్పును ఆకళించుకోవడం
తన తీరుగా లోకానికి చూపినోడు

ప్రళయం ముంచుకురాలేదు;
అయినప్పటికీ అతిశీతలం ఏర్పడింది
మేధో సాధన చేసిన కాయం
ఇక ‘పై’రోజున పూర్తిగా మ్రాన్పఁడిపోయింది

తనని చుట్టుకున్న వైకల్యాన్ని
మాటవరసకైనా తిట్టుకోని వింత జీవి

విశ్వాంతర విద్యాలయ శిక్షణలో
దీక్షాతపనల ఏకలవ్యుడు

అంతుపట్టని సృష్టి రహస్యాలను
అతికష్టం మీద కదిలే
తన చూపుడు వేలికోసలతోనే
సమాధానాల చమత్కారాలుగా మలచినవాడు

సిద్ధాంతీకరణలు కట్టిపెట్టి
ఇప్పుడే.. శరీరాన్ని వదిలిపెట్టి
కార్యరంగంలోకి దిగాడు..

అదిగదిగో..
అక్కడెక్కడో కృష్ణ బిలం కూడా మెరుస్తుంది.
నేలపై నక్షత్రం పేలిన శూన్యత
విశ్వమంతా వ్యాపిస్తోంది.

మరణం పై ఇతడి నిర్వచనాన్ని కాదని
ఈ ధ్రువతార స్ఫూర్తి ని శతాబ్దం అంతా కొలుస్తుంది

విశ్వ విజ్ఞానాన్ని సామాన్యుడికి చేరువ చేసిన వాడు
గ్రహాంతరాళాల రహస్యాలను ఛేదించి మరలివస్తాడని
దేవుడి ఎజెండా ను వెలికి తెస్తాడని
మరో రూపాన మలి రాకకై లోకం ఎదురుచూస్తుంది

స్టీఫెన్ హాకింగ్స్! నా విశ్వంధరుడు!!
విశ్వాన్ని వదిలి ఎక్కడికి పోతాడు!
కాల చరిత్ర రాసినవాడిగానే కాదు;
కాలానికిఎదురీది నిలిచిన సాహసిగా
నా హృదయ తరగతి గదుల్లో
నిత్య మననమై నిలుస్తున్నాడు

=15.3.2018=

RTS Perm Link

No responses yet

Mar 27 2018

యశస్వి||దిశ మొలతో తిరిగే వాడికి సిగ్గేసినప్పుడు..||

Published by under my social views

నిన్నటి రాత్రి కవిసంగమ సమాగమ స్థలాన
కొన్ని పలకరింతలు,
కొన్ని పులకరింతల అనుభవాలతో
బరువెక్కిన నా ఒళ్ళు తూలుతుంటే..

ఇంటిదారికి
తోడు వెతుక్కునే పనిలేకుండా
విల్సన్ రావు అనే కన్సర్న్ మిత్రుడు
తన వాహనం పైకి ఆహ్వానిస్తున్నప్పుడు..

ఎవరో ఇద్దరు మసకచీకట్లో..
నన్ను పోల్చుకుని
వాళ్ళు అనాలనుకున్న
నాలుగు మాటలూ అనేసారు.

ఓ నవ్వు నవ్వి బదులిచ్చి బయల్దేరాను గానీ
ఆ మిత్రుడి వాహనం
నాతో పాటు వారిరువురినీ నాలో మోస్తూ..
మా ఇంటి దగ్గర దింపేసింది.

గుమ్మంలో నన్నాపి
టిఫిన్ సెంటర్ కి పంపిన మా ఆవిడ గమనించ లేదు;
వారెవరో నాకన్నా ముందే
నా వంట్లోంచి ఇంట్లోకి చొరబడి నాపక్క ఎక్కేశారు.

పనులయ్యాక వారిపక్కనే నా కునికిపాట్లు..
వెధవ పిల్లలు..
చెప్పిందే మళ్లీ చెప్పినట్లు. చెవిలో హోరు
అప్పుడు వాళ్ళ కళ్ళలో మెరుపులు

హైదరాబాద్ ని అలెగ్జాండ్రియా గా తలచి
డయోజనిస్ లా బ్రతుకుతున్న నన్ను
అలెగ్జాండర్ లా వచ్చి
నా సూర్య స్నానానికి అడ్దు నిలిచినట్లు

పట్టపగలు పదాలదివిటీ పట్టుకుని
మనిషికోసం కవిత్వ పుర వీధుల్లో
వెతుకులాడుతున్న నన్ను
ఈ ఆకతాయిలే గుంపుగా వచ్చి చుట్టబెట్టినట్టు

గురితప్పిన విలుకాడు
ఎటో బాణం వదిలితే నా మీదకు వచ్చినట్టు
వీళ్ళెందుకు నన్ను చుట్టుకుని
ఇంకా వదిలిపెట్టట్లేదు!

దిశమొలగా తిరిగే నాకు
తెలంగాణా సారస్వత పరిషత్ ప్రాంగణాన
వారికి మాత్రమే కనిపించే విగ్రహాన్ని చేసి
శ్వేత వస్త్రాన్ని కప్పి నన్ను ఆచ్ఛాదనీయుడ్ని చేశారు

వారి పేర్లను కూడా గుర్తుపెట్టుకోలేని నన్ను
ఆ పిల్లలు ఎంత మాట అన్నారు!
ఆ మాటలు విన్నప్పుడు; నేనెవ్వరిదగ్గరా ఇంకా అననందుకు
నాకు డాబుసరి దుస్తులేసుకున్నంత సిగ్గేసింది

నా అక్షరాలలో
నచ్చిన వాటిని వారితో ఉంచేసుకుని
“నాకు పెద్ద ఫాన్స్”
అని చెప్పేసుకున్నారు

పిచ్చి పిల్లలూ!
మీరు రాస్తే నాలుగు ముక్కలు చదవాలనుకునే నన్ను
ఎందుకు ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తారు!
ఈ రాత్రికైనా దయచేసి.. నన్ను పడుకోనిస్తారూ!!!
=26.3.2018=

RTS Perm Link

No responses yet

Mar 27 2018

యశస్వి //కొంటె నా కొడకా!

Published by under my social views

గాలి
రయ్యిన తాకేట్టు బండి మీద
నిన్ను వెంటేసుకు తిరుగుతుంటానా,
ఎప్పట్నుంచో మోస్తున్న బరువు
మాటల్లోంచి జారి
నీ ముందు బండగా
భళ్ళు మంటుంది

తట్టుకోలేక నన్ను తిట్టుకుంటుంటే
పొట్ట వదలకుండానే
చిట్టిచేతులతో కొడుతుంటావు

అదే నిన్నంటే..
వులకవు..వేడెక్కవు
ఇది ఎక్కడి లెక్కో..

అడిగితే..
నన్నన్నది నా నాన్నే గా అంటావ్!!
=20.3.2018=

RTS Perm Link

No responses yet

Mar 12 2018

యశస్వి ||ఇబ్బంది గా ఉంది..||

Published by under my social views

బాదరబందీ కి వెరిచి కాదు గానీ
జీవితాన నే మెచ్చనిది
నిఘంటువులలో నాకు నచ్చినదీ ఇబ్బందే

ఇబ్బందిని ఇబ్బంది పెట్టకుండా
తిట్టాల్సిన అవసరం లేని గట్టి అర్థం ఉంది మరి

ఎవరన్నా ఓ పని చెప్పినప్పుడు
మంచి కన్నా మరేదో జరిగే అవకాశం ఉన్నట్టు అనిపించినప్పుడు
పర్యవసానం గొయ్యో- నుయ్యో అనిపిస్తున్నప్పుడు
ఇబ్బందిగా ఉంటుంది.

నలుగురు కలిసి మేకపిల్లను కుక్కను చేసి చూపినప్పుడు
అంతా ఒక అయ్యకి పుట్టినోరమైనా
ముగ్గురు నా ముందున్నారని
నా వెనుకన ఓ అన్న ఉన్నాడని
నలుగురి నడుమ నలుగుతున్నందుకు ఇబ్బందిగా ఉంటుంది

అన్నా!
పుట్టుకతో పొడుస్తూ తూలనాడడం
ఇంటిని తుడుస్తూ మూలాల్లోకి దుమ్మును దోసేయడం కదూ

ఇంతకాలం వాళ్ళు చేసారంటూ నువ్వూ
నీలెక్కేంటి అంటూ వాళ్ళూ అనుకుంటూ
అమ్మనీ నాన్ననీ అడ్డంగా అంటుంటే
చాల ఇబ్బందిగా ఉంటుంది

అలసిపోయి నే అమ్మ ఒడిలో కూచున్నప్పుడు
అమ్మనా బూతులు వినబడుతుంటే..
చాల ఇబ్బందిగా ఉంటుంది..
ఎంత ఇబ్బంది.. అంటే..
నువ్వే ఆ ఇబ్బంది అనేంత..
ఇబ్బందిగా ఉంటుంది..
విన్నావా!..
ఇబ్బందిగా ఉంటుంది..

=03.03.18=

RTS Perm Link

No responses yet

Mar 12 2018

యశస్వి౹౹||

Published by under my social views

కొట్టడమేనా, తిట్టడం కూడా తప్పే

పిల్లల్ని పొరపాటున కూడా మొట్టొద్దంటే అందరూ ఊ కొడుతున్నారుగా
మరి ఇంత ఎదిగాక నువ్వు నేను ఎందుకిలా!

ఏ దెబ్బా తగలకుండా ఎత్తుకు ఎదిగిందా చెట్టు
అడుగు నిజమేమిటో కొట్టని అమ్మను,
ఆకాశం అంచులు తాకే!..
కొట్టని కొమ్మను.. వెతికిపట్టుకో.
అని కదా అంటున్నారు..!

వాళ్ళకు తెలిసి కాదు గానీ అలాంటోళ్ళే..
గాంధీని కొట్టి రైల్లోంచి దోసేసిన తెల్లవాళ్ళూ..
భీమ్‌రావ్ ను కొట్టి నీరు త్రాగకుండా గెంటేసిన నల్లవాళ్ళూనూ..
వాళ్లంతా..
మహాత్ముల్ని తయారు చేసిన క్రెడిట్ కొట్టేశారు

ఎవరన్నా ఎందుకు కొడతారు
అంటే ఒక్క సమాధానం దొరకదు

బుద్దొస్తుందని మాస్టారు బుడ్డొడిని కొట్టినా
కిక్కెక్కుతుందని దొరబాబు మందుకొట్టినా ఒక్కటౌతుందా ఏంటీ!!

ఉట్టికొట్టిన కన్నయ్య, కెమెరా ముందే కన్నుగొట్టిన టోనీ టాల్బట్
ఒక్కటౌతారా అన్నిటా!

కొట్టుకోవాలంటే ఆకతాయిలే కానక్కర్లా,
కాలేజి స్టూడెంట్లు కావచ్చు, అస్సెంబ్లీ మెంబర్లూ కావచ్చు,

హీరోల అభిమానులు కావచ్చు, పార్టీల కార్యకర్తలు కావచ్చు

డిప్యూటీ కలెక్టరూ ఎమ్మెల్యేలు కూడా కావచ్చు

కోపమొస్తే కొట్టుకునేది మొగుడూ పెళ్ళాలు కావచ్చు
ఆస్తి తగాదాల్లో అన్నాతమ్ముళ్ళు కావచ్చు

మరి ఊరు వేరైనంత మాత్రాన..మనమెందుకు కొట్టుకోవాలి అన్నయ్యా!

చెయ్యెత్తితే మన బంధానికి జనం జై కొట్టాలి
ఎప్పుడో తిట్టానని
ఇప్పుడు నన్నో పట్టు పడతావా
నువ్వది-నేనిదీ అని డచ్చాలు కొట్టుకోవడం..
ఏమిటో కవిత్వ చోద్యం!

ఫేస్బుక్ సాక్షిగా..
అసలు కొట్టివేతల్లో మనమేం తీసికట్టు!
అనుకుంటూ ఉంటా

ఎవర్నో ఎవరో కొట్టారంటే లైక్ కొట్టడం
లేదని తెలిస్తే మసాలా తక్కువైందని తిట్టుకోవడం

నచ్చక పోతే పక్కకు నెట్టేయడం
తప్పదు కదా! మరి అన్నీ తలకు చుట్టేసుకోలేం

కానీ ఒక్కటి నిజం బాలయ్యా!

ఎవరో ఎపుడో ఏదో తిట్టారని
లంగోటీ బిగగట్టి మరీతొడగొట్టక్కర్లే..

ఆవేశాలు క్షణికాలు అనుబంధాలు శాశ్వతాలు

అన్నాతమ్ముళ్ళం మంచెక్కడున్నా పంచుకుందాం, వద్దనుకుని
వదిలేసినా, బుద్ది వచ్చేదాక
వేమననీ తలచుకుందాం
కలసినప్పుడల్లా
మనుషుల భాష లోనే మనం మాట్లాడుకుందాం

కల్లోల గౌతమీ వెల్లువల కృష్ణమ్మ ..
తప్పెవరిది అయినా మన్నించాలి మమ్మల్ని.
అన్ని అవసరాలకీ నీళ్లిచ్చి గౌరవించాలి.
..అన్నా!! నీళ్లు కొట్టావా సరిగ్గా!!..
=6.1.18=

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa