Archive for August, 2017

Aug 24 2017

యశస్వి ||నీతోనే..||

Published by under my social views

కళ్ళునులుముకుంటూనే కాంతిలా కనిపిస్తావు
రోజులోఇమడకముందే పలకరింపై వినిపిస్తావు
చదువుకుంటూనో, పనిచేస్తూనో యింపనిపిస్తావు
దారిని పరుస్తావు, తుడుస్తావు, పాడుచేస్తావు

ఏకకాలంలో ఎదురొస్తావు,
దాటేస్తావు ముందు వెనుక
దారిపక్క తేనీరు మరిగిస్తుంటావు
వెచ్చదనాన్ని నాలోకి నింపుతుంటావు

ఒక్కోసారి ఒద్దికగా తయారై బండి మీద
నాన్న బొజ్జ పుచ్చుకుని బడికెళ్లే పాపాయివి,
వయసుని సంచిలో దోపుకుని బస్సెక్కే అమ్మాయివి.
చూపులతోనే చిత్రలేఖనం గీసే అబ్బాయివి

అడ్డం వచ్చిన ఆకతాయివి కావచ్చు,
నువ్వే మరో బండి నడుపుతూ ఉండొచ్చు
దరి చేర్చాల్సిన బాధ్యతతో నిన్ను నువ్వే తిట్టుకుని
గమ్యానికి సాగిపోయే సారధివి

నోటితోనో, కళ్ళతోనో పలుకరిస్తూనే ఉంటావు,
చూపుల్ని కలుపుతావు, తిప్పుకుంటావు,
తప్పుకుని తిరుగుతూనే,
నాలెక్కేంటన్నట్టు వెళ్లిపోతావు

ఇంట్లోనైనా, కాంటీన్ లో నైనా వడ్డిస్తూ ఉంటావు
వెనక్కి తిరిగ్గానే ఎంగిళ్ళు ఎత్తుతావు,
నా బల్లను తుడుస్తావు నీరందిస్తావు,
పిలవగానే ఏంటన్నట్టు చూస్తావు

నవ్వుతావు, మొహమాట పడతావు,
మెచ్చుకుంటావు, తిట్టుకుంటావు,
సలహా ఇస్తావు, హెచ్చరిస్తావు,
ఇహలాభం లేదని మౌనం పాటిస్తావు

నన్ను పలకరించే స్నేహితుడివి
కొరకొరా చూసే ప్రత్యర్థివి
ఒక్కోసారి ఒక్కసారే కనిపిస్తావు,
కొన్నిసార్లు అన్నీ నువ్వే అయిఉంటావు

అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది,
నువ్వు ఉన్నాలేనట్టుగా, లేకున్నా ఉన్నట్టుగా
నా లోపల నీగురించి ఆలోచిస్తున్నానో లేదో
నీకు నేనెలా కనిపిస్తానో నాకెలా తెలుస్తుంది.

అనిపిస్తూ ఉంటుంది కవిత్వంలో ఎప్పుడూ
నువ్వు నాతో ఉంటే బాగుండు అని,
నా అక్షరాలతో కళ్లు కలిపి నడి చే వారంతా
కలుసుకుందామనే వస్తున్నారు

అక్కడ నువ్వో నేనో కాకుండా
వాళ్ళ కళ్ళతో చూసే ప్రపంచం కనిపిస్తే
మాటలతో తోనో, చేతులతోనో నన్ను పలకరించాలని చూస్తారు.
ఈ మాములు మాటల్నీ కవిత్వం అనుకుని మురుస్తారు

=24.8.2017=

RTS Perm Link

One response so far

Aug 19 2017

యశస్వి ||నా ముద్దు గోల..||

Published by under my social views

చిన్నప్పుడెప్పుడో అనడానికి ఇది అనగనగా కధ కాదు
ముద్దుల మధ్యన పెరిగాననడం అబద్దం లాంటి కల కాదు
ఏడుపు ఎందుకు వస్తుందో కారణం ఇప్పుడే అవగతం కాదు
ముద్దుపెట్టడమొక్కటే అప్పటికి ఇప్పటికీ అవసరం నాకు

పిల్లలందరూ ముద్దుగా ఉంటారంటే ఒట్టిమాట కాదు కదా
ముద్దుల్ని మూటకట్టి పగలంతా స్కూలు లో దాచిపెట్టినప్పుడు
తుళ్ళిపడే పూల తోటలో ఒద్దికైన పువ్వులా నేనుండడం
ఇంతముందుకు వచ్చాక తలచుకోవడమూ ముద్దే కదా

అమ్మకే కాదు క్లాసులో అమ్మాయిలకూ నేను ముద్దే
అమ్మాయిల కన్నా ముద్దుగా ఉండే టీచరమ్మకి మహాముద్దు
నా బుగ్గల మీద ముద్దుల ముద్దరలు చూడలేక
ఆమె కురులలో గులాబీ రోజూ ఎర్రబడి రెక్కలు వాల్చిన గుర్తు

అలా అలవాటైన ముద్దు ఎదుగుతున్న కొద్దీ ముద్దుగానే దూరమైంది
అమ్మ ముద్దు మినహాయింపు కాదు గానీ
నా బుగ్గలకీ ఊహల్లో పెదాలకీ మధ్య
ఆలోచనల గడ్డిమైదానమై గుబురుగడ్డం పెరిగింది

సినిమా హీరోల షేవింగులు, విలన్లకు గడ్డాలు
పెళ్ళయిన వాళ్ళ పెదాల ముద్దు ముందు మల్లెపూల మంచాలు
ఎవరినన్నా అలా ముద్దు పెట్టుకుంటే
ఆ తలంపే అయ్యబాబోయ్ అనిపిస్తూ ఉండేది

పొరపాట్న ముద్దుకే పిల్లలు పుట్టేస్తారేమో
ప్రేమిస్తే ఇంకేమన్నా ఉందా అన్న భయంతోనే
స్కూల్ చదువంతా గడచిపోయింది
కళ్ళు పెట్టె ముద్దులతోనే కాలం కరిగిపోయింది

తొమ్మిదోక్లాసు సైన్స్ పుస్తకం 53 వ పేజీ
బొమ్మల్ని చూసి అమ్మాయిలు అబ్బాయిలు నవ్వుకున్నామే
ప్రశ్నలకు జవాబు సరిగా రాసినా అర్థం కానిది
కాలేజీ కబుర్లలో ఎలా అర్థం అయ్యిందో!

ఊరించే శరీర మార్పులు కొత్తగా చూపించే లింగభేధాలు
ఆనాటి ఆలోచనలకి సరికొత్త చేర్పులు
అన్నీ అవగత మయ్యాకా అబ్బాయిది
ఓస్ ఇంతేనా అనుకునే ఆరిందాతనం

అబ్బాయి ఉద్యోగం సాధించి పెద్దమనిషి అవ్వాలి
అది మగాడికి తప్పని సరి కష్టం
దేవుడు అడోళ్ళ పక్షం
అన్నీ ఆడవాళ్లకి అడక్కుండానే ఇస్తాడనుకునే అమాయకత్వం

అయినా ఓ అనుమానం! మనకోసం పుట్టింది
కళ్ళముందుఎదురుపడితే గుర్తెలాపట్టాలి
మనక్కూడా జరుగుతుందా హీరోలకి జరిగినట్టే
అనుకున్నా గట్టిగా ఎవర్నీ అడగకుండా ఎప్పటికైనా కనిపెట్టాలి

ఉద్యోగమొచ్చి పెద్దమనిషయ్యాకే
పెళ్ళి చేసి చేతిలో పెట్టారు ఇష్టం అన్న అమ్మాయిని
అప్పుడు గుర్తొచ్చింది ఎప్పుడో ఊరించిన ముద్దు
అడిగితే అమ్మలా నవ్వి బుగ్గమీద ఒకటిచ్చింది

ముద్దు పెట్టడం వరకే గుర్తున్నందువల్ల
పిల్లాడు పుట్టడానికి ముద్దే కారణం అని బలంగా నమ్మాను
ముద్దే లేకపోతే అంత ముద్దుగా పిల్లలెలా పుడతారు
పుస్తకాలలో ఏదో పరీక్ష పాసవ్వడానికే అబద్దాలు రాస్తారు

పెళ్ళైన ఎంతో కాలానికి అప్పుడు పుచ్చుకున్నదేదో తిరిగివ్వమంటే
మరో పిల్లో పిల్లాడో పుట్టేస్తే ఎలా అనుకున్నంత ఆదుర్దాగా
ముద్దు కన్నా ప్రమాదకరమైనదింకేంలేనట్టు.. ఏదో అంటుంది నన్ను..
ఇప్పుడన్నీ నాకు ముద్దు ముద్దుగా వినబడతున్నాయి

=15.8.2017=

RTS Perm Link

No responses yet

Aug 09 2017

యశస్వి|| సానిదాని మాట..||

Published by under my social views

నేనారోజు ఫోన్ మాట్లాడుతుండగా
ఎగతాళిగా వినిపించిందా మాట
అవతలి నుంచి ’సానిదాన” అని..
అవమానానికి సంకరం చేసి జారిన నోరు
ఆ చోటున నన్ను నిలబెట్టింది.
ఏం జాగా ఈ జగాన నాకిది!
నీ సంకుచిత స్వభావంలో ఇమడలేని
అభద్రతా భావనలో ఒదగలేని ఉన్నతమైన స్త్రీలకు
నీ మందపుటాలోచనల రైలుబండి ఆఖరి బోగీలో
అట్టేపెట్టినదదే కదా!
(ఇప్పుడు తిట్టుగా బయటపెట్టావ్)
సాని అన్న మాట-
నీకు పంచడానికి వంపని తేనీటి గిన్నెనయ్యానని
చీత్కారంగా చిట్లించిన నీకళ్ళ బాష
కారణం- నీ పరమార్ధం స్వార్ధం, నీ జాతి వాంఛ
సానిదానా అని పిలచి బాధపెట్టొచ్చు అనుకుంటున్నావే!
కన్నా! నీకో విషయం చెబుతా విను
ఓ వ్యవస్థకు ఎదురొడ్డి నిలబడ్డ గురువు ఈ సాని అన్న మాట.
ఒకే సమయం లో ఎన్నో పనులు చక్కబెట్టే మనిషి,
సానికి నీ సంజాయషీలు వినే సమయం ఉండదు
సాని ది వేల కోట్ల వ్యాపారం అనుమానం మీదే నిలబడ్డ ఏర్పాటు
సానిది జీవకణాలు ప్రేరేపించిన స్వచ్చమైన ఆశయం
అవును నిను కన్న ఆ హార్మోనులే
సానంటే నిన్ను కాదని
చూపులను విదుల్చుకుని
తన చేతిసంచిలో దాచుకుని
భద్రంగా వెళ్ళిపోయే అమ్మాయి
ఈ సాని ఎంత దయగలదైనా
నీతో నిరంతరం సున్నితంగా ఉండలేనిది,
సానిది తనకోసం కలల్ని కంటూనే..
పిల్లలకోసం నిద్రమానుకునేది
నువ్వనే సానిది..
ఉద్యోగాన నిను వంచి జీతంపెంచే దొరసాని,
తనకోసమే లోదుస్తుల్ని కొనుక్కుని తొడుక్కునేది,తన ఇష్టమైన బట్టల్నే వేసుకునేది
గుండె పగిలేమాటలకి వెరవనిదీ,
ప్రేమించినప్పుడు చెప్పడానికి జంకనిదీనూ
సాని అంటేనే ఎందులోనూ తక్కువ కాని స్థనాలున్న పోటుగాడి లెక్క
(సప్తస్వరాలకూ మొదలూ తుదీ సానిదే)
సానిదానా!
సానిదానా!
సానిదానా!!
నిన్ను వదిలి వెళ్ళిన స్త్రీని
అంతకు మించేమి తిట్టగలవు!
నన్ను తిట్టే ఓ మగాడా!
మరోసారి ఎప్పుడన్నా..
నన్ను చూసేందుకు.. కలిసేందుకు..
పూలు పంపే ముందు..గుర్తుంచుకో!
నా మొహం చూసేటప్పుడు,
నాతో కళ్ళు కలిపేటప్పుడు
నా బట్టల మెరుపుని గమనించేటప్పుడు,
నా చర్మపు నిగారింపుని పసిగట్టేటప్పుడు,
నా చిత్తాన్నిఊహించేటప్పుడు,
నా కాళ్ళూ చెప్పులు దర్శించే టప్పుడు..
నా మాట,
నా దోషాలు,
నా త్యాగాలు,
నా ఇప్పుడుని, అప్పుడుని.. అంచనా వేసేటప్పుడు
నా పోరాటాన్ని,
నా కాలాన్ని,
నా ప్రకాశాన్ని,
నా అంతరంగాన్ని,
నా తప్పుల్నీ,
నా అస్తిత్వాన్ని.. చూసి మరీ
సంతకం చేసి ఈ సాని దానికి అందివ్వు.
( originally written and presented by Shruti Haasan in English)
=9.7.2017=

RTS Perm Link

No responses yet

Aug 09 2017

యశస్వి ||ఐ అమ్ నాట్ అ బోమాండ్ ఎనీ మోర్||

Published by under my social views

 
అద్దానికి నాకూ మద్దెన కత్తెర
ట్రిమ్మర్ కొనొచ్చుగా.. నాకెందుకీ రోజూ కష్టం అంది
నీతో ఖర్చు తక్కువ గా అన్నా
కట్ కట్ ల మధ్య ఓ చిమ్టా ఇచ్చింది
 
చేతికీ నెత్తికీ మద్దెన ఫాంపూ
బోర్ నీళ్ళెందుకు ఊడిపోతుంది చూడు
పని దండగ అన్నా;మరి నేనెందుకో అంది
నవ్వుకున్నా
 
ఫాంట్సేసుకున్నాక బెల్ట్ అడిగింది,
టక్ మానేశావ్ పొట్టపెరిగింది చూడు
పోనిద్దూ, నన్నెవడు చూసొచ్చాడు
వదిలేసినా నొక్కుతున్నావే! అనుకున్నా
 
ఆ చెప్పుల్ని వదలవా!
పాదం పెద్దదైతే రేపు నాతో నీకే ఇబ్బంది
బూటు పాటపాడింది
ఆ మూలే ఉండు, నీకిది మామూలేగా అన్నా!
 
సౌకర్యం గా ఉంటుందని టీ షర్ట్ వేసుకున్నానా!!
మూడూ మా ఆవిడలానే చూస్తున్నాయి నన్ను
చప్పుడు లేకుండా బయటికి జారుకున్నా
 
దారిలో మిత్రుడొకరు మాట కలిపారు
ఏంటి మాస్టారూ మరీ నల్లపూస అయిపోయారు.. అంటూ.
= 5.7.17=
 
{beau monde-French word of English Usage
=The world of high society and fashion}

RTS Perm Link

No responses yet

Aug 09 2017

యశస్వి-||RIP- freedom of Speech||

Published by under my social views

అది సిరియా కావచ్చు, ఇండియా కావచ్చు
గోదావరి జిల్లా గొంతు కావచ్చు
అతడు బాస్సిల్ సఫాది కావచ్చు, కన్నయ్య కుమార్ కావచ్చు
వీరమల్లుడే కావచ్చు
 
రాజ్యమే గొర్రె తోలు కప్పు కున్న తోడేలు కావచ్చు
దొంగలే కార్యకర్తల ముసుగుల్లో ఉండొచ్చు
మీడియా ముసుగులో తోలు కప్పుకున్న బ్రోకర్లు ఉండొచ్చు
ఏలికలే పరిపాలన వెనుక వ్యాపారం జరపొచ్చు
 
ప్రమాదం పొంచి ఉన్నవాడు పారిపోయి బయటపడలేడు
పారిపోయినోడు పూర్తిగా కాపాడబడబోడు
నోరు మూసినా మాట ని తప్పించుకు తిరగలేము
మాట ఇచ్చి మరచిన నోరు మట్టిని కరవక మానదు
 
ఎత్తిన చెయ్యి తప్పు చూపించొచ్చు, నొప్పి చూపించొచ్చు
నిజాన్ని విప్పి చూపించొచ్చు
గొంతెత్తినోడి మీద కత్తి వేటు అధ్యక్షుడిది కావచ్చు
ప్రధానిది కావచ్చు, ముఖ్య మంత్రిది కావచ్చు
 
రాజ్యమా! నోరు నొక్కకు!
పీక నొక్కినా నిజమే చెబుతా!
నే రాస్తున్న మాటలన్నీ వేల కళ్ళలోకి ఇంకిపొతాయి
నన్ను లేకుండా చేసినా రేగిన తేనెతుట్టలా తిరగబడతాయి
 
స్వేచ్ఛా నిషేధం ఎన్నటికీ అమలు కానిది
హక్కుల నిర్లక్ష్యం నిప్పై దహించి వేస్తుంది
విభజించి పాలించడం శత్రుత్వాన్ని రెట్టింపు చేస్తుంది
 
నిరసనలకే నిర్బంధాలేల!
నిరాశల చితి పేర్చితే హింసకు ఆజ్యంపోసినట్టే
పాదయాత్రల వంతెన స్థంభాలు ఏక్కటి విరిగినా,
వరద ముంచక వదలదు
 
నేలనీ నీటినీ నీతిగా బతికే జనాన్ని పణంగా పెట్టి
అభివృద్ధి ముసుగులో జూదమాడితే అంతర్యుద్ధం చెప్పిరాదు
 
ఎక్కడో సిరియా ఇక్కడ నా నరాలకెక్కినట్టే
నే గెలవలేకపోయినా నిన్ను నిలువనీయను
 
RIP- Bassel Khartabil

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa