Archive for July, 2017

Jul 04 2017

యశస్వి||నిశ్శబ్ద వసంతం||

Published by under my social views


పోనీలే బాబాయ్,
గ్యాస్ లీకై.. పోయింది ఐదుగురేగా
ఆయుషు తీరిపోయింది అంతే..
మనకు కర్మ సిధ్ధాంతం ఉందిగా

మొన్న నెక్కంటి సీఫుడ్స్ లో
అరవైమంది పడిపోతే..
సత్తెమ్మ అమ్మవారు పూనింది అన్నారు
ఆ బాపతే.. అని రాసుకుందామా!

ఏక్స్ గ్రేషియా పాతికలక్షలట..
నోరు మూయించే ప్రయత్నమేమో
కంపెనీ పదిహేను, ప్రభుత్వం పది
తలో భాగం తిలాపిడికెడు..
ఎంతైతే ఏమిలే పోయినోడికేమైనా వస్తదా!

అదిగో వస్తున్నారు పరామర్శలకు మాటల్లో పెద్దలు
బంగళాఖాతం లో విసిరెయ్యడానికి వాక్బాణాలు సంధిస్తారు
అందుకు అవసరమైన పదవిలో వారు లేరు

ఇంకొకరు హీరోగారు, చిత్తశుద్దికి కొదవేలేదు,
పరిశ్రమల వ్యతిరేకి అని అంటారేమోనని అనుమానం
ఏదో చేద్దామనే అనుకుంటున్నారు
వీరి ఆలోచనలకి అందాల్సిందేదో ఇంకా అందలేదు

నిశ్శబ్దం వసంతం .. పునరావృతం
చచ్చిన చేపపిల్లలు నీళ్ళల్లో తేలుతున్నాయ్
” వేసవి కదా ఆక్సిజన్ అందలేదేమో…”
చేపలగురించేనా!!

=30.3.17=
(సురేష్ జైల్లో ఎందుకున్నాడో!
మొగల్తూరు లో ఐదుగురు ఎందుకు చనిపోయారో అందరికీ తెలుసు..
సమస్య పరిష్కారానికే.. దిక్కుండదు)

RTS Perm Link

No responses yet

Jul 04 2017

యశస్వి|| తాగాల్సిన కాలమిది||

Published by under my social views

​Drinking Water at the Right Time

తాగుతూనే ఉండాలి ఎల్లకాలం
ఇంకేమీ అక్కరలేనంతగా
తాగుతూనే ఉండాలి ఎల్లకాలం
కాలం నీ భుజాలమీద మోపిన బరువు
నేలలోకి నిన్ను అణగ దొక్కుతున్నా సరే
నిరంతరం తాగుతూనే ఉండు
మొలకెత్తే ప్రశ్న ఒక్కటే
ఏం తాగాలి!!
మధువా!
కవితా!
నువ్వు నమ్మిన ధర్మాన్నా!
ఏదైనా సరే తాగుతూనే ఉండాలి
కొన్నిసార్లు భవనాల వసారాల్లో
కొన్నిసార్లు కాలువ పక్క పరచుకున్న పచ్చదనంలో
నీ కిష్టమైన నీ ఏకాంతమందిరంలో
అన్నిసార్లూ తాగుతూనే ఉండాలి ఎల్లకాలం
మైకంలోంచి అరగానో, త్వరగానో
బయటపడ్డప్పుడు
వీచే పవనాన్ని అడుగు,
విరిగే కెరటాన్ని ఆడుగు
మెరిసే తారనో,
కూసే పిట్టనో,
తిరిగే గడియారాన్నో
నీ ముందు ఎగిరేదాన్నో,
తిరిగేదాన్నో,
ఆడేదాన్నో,
పాడే దాన్నో,
పలికేదాన్నో
దేనినైనాసరే అడుగు..
ఇదేకాలమో, ఏంచేసే సమయమో!
ఆ గాలో,
కెరటమో,
తారో,
పిట్టో,
గడియారమో
సమాధానం చెబుతాయి నీకు..
ఇది మనసారా తాగాల్సిన కాలమని
― Charles Baudelaire ని ఆవాహన చేసుకుంటూ…
–8.6.17–

RTS Perm Link

No responses yet

Jul 04 2017

యశస్వి ||ఒక ఝరి నిశ్చలయై చిత్తరువుగా మిగిలిన వేళ..||

Published by under my social views

ప్రవాహాలెన్నో! అందులో ఒకటి..
అలసి పరుగాపి మేటవేసింది

ఆ గట్టున మేస్తున్న మేకలు,
నీళ్ళు తమ పాలంత చిక్కగా లేవని
ఆ నీళ్ళని నింపుకున్న పిల్లకాల్వలు
తమని మించినవి ఇంక కానరావనీ బింకాలు పోయాయి.

వాటికీ తెలుసు.. ఏ ప్రవాహమైనా
ఏదోనాడు కాలగర్భంలో కలవాల్సిందేనని
ఏ పశువైనా ఏదోనాడు వట్టిపోవాల్సిందేనని
అయినా వాటి బాధ వాటిదే

ఏనాడో ఓ అమాయకపు మేకపిల్ల
ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండవచ్చు
వరదనీటి తో పిల్లకాల్వ ఉక్కిరిబిక్కిరి అయి ఉండవచ్చు
వాటి బాధ వాటిదే

ఈ అక్కసులన్నీ ఏ ఉక్రోషపు ఆనవాళ్ళో!!
గుర్తించుకోవాల్సినమాట –
అదే నీరు అన్నిటా కనిపిస్తుందని
ఇప్పుడు అందరిలోనూ ప్రవహిస్తుందని

ఒకప్పుడు తాగిన నీటితోనే
ఇప్పుడూ అవసరాలు తీరుతున్నాయని
ఏ పీఠాధిపతి ఐనా పేరుకే సరస్వతి కావచ్చు
ప్రవహించేదే నీరు; లోనికి ఇంకేదే అంతర్వాహిని

**

నువ్వు మేకవో పిల్లకాల్వవో, మహానదివో
నీవి నీరో పాలో కాలమే నిర్ణయిస్తుంది
ప్రవహించు, ప్రసరించు బుసకొట్టకు

అన్నిరుచుల మట్టినీ ఆస్వాదించు
నీ వాహక ప్రాంతాన్ని సారవంతం చేసుకో
ఆ పై నీ విరామ విలాసాన్ని
తీర్థస్థానం గా ప్రకటించుకో

=17.6.17=

RTS Perm Link

No responses yet

Jul 04 2017

యశస్వి||వెన్నలని కన్న కళ్ళకి.. ||

Published by under my social views

పాపాయి గా ఎవరు పుడతారని
ఓ బాబాయి సందేహం
అమ్మమ్మలు నానమ్మల కలల పంట
అమ్మలు అవునో కాదో, ఆడుకునే బొమ్మలు కాదు;

పుస్తకాలు తిరగేసినా ప్రపంచాన్ని తిరిగేసినా
పురాణాల్ని నెమరేసినా ప్రశ్న ప్రశ్న గానే మిగిలిపోయింది

అమ్మలగన్నమ్మైనా అబ్బాయిల్నే కన్నదంటారు
వడ్డీకాసులవాడి పిల్లల వూసే లేదు
రాముడ్ని కదిపినా భీముడ్ని కుదిపినా పూలు పూయనట్టే రాసారు
ముక్కంటికి కూడా కాయలే కాసాయట;

క్రీస్తు నడిగినా దోస్తునడిగినా దేవుడూ మగవాడే అంటారే
దేవతల్లో రాక్షసుల్లో ఆడవాళ్ళ లెక్కల్లేవు
ఎక్కడని వెతకాలి! అమ్మాయిల మూలాలు!!
కనలేని తనం లొ కానరాని లోకాలను

స్వర్గం నరకం ఉన్నాయో లేవో
అమ్మాయంటే నేలమీద విరిసిన జాబిల్లే కదా
ఈ నేలని సారవంతం చేసే నదుల లెక్కన
మానవత్వపు పరిమళాలు వెదజల్లే పువ్వులెక్కన

తలపుల్లో అనిపించింది..
మదిలోనైనా, మందిలోనున్నా
తెలియకుండా తడిపేసే వెన్నెలవాన
ఏ తనువు కైనా తనూజే కదా !!

అన్షూ!
ఆమెన్ ఇన్షాల్లా ల కలబోత నీ పేరు
సంధ్యాకాంతుల వడబోత నీ పుట్టిల్లు

చంద్రవంక మా వాకిలి లో కురిపించే
వెన్నెల వెల్లువ నీ నవ్వు
పంచిపెట్టుకునే మా పళ్ళతోటలో
విరిసిన మామిడి పువ్వు నువ్వు

అల్లరిపిల్లా!
నిన్ను చూస్తే అనిపించింది
ఏ దేవుడికీ లేని పదవి
ఆడపిల్లని కనడమే కదా అని

అన్న వెన్నెల్ని కని
జీవితం పరీక్ష పాసయ్యాడు;
చంద్రుడ్ని కన్నా కదా!
నే పాసవుతానా!

(అన్న కూతురు అన్షుపాప ఓణీ వేడుక 9.7.2017 సందర్భంగా)

RTS Perm Link

No responses yet

Jul 02 2017

యశస్వి|కంటీ శుక్రవారమూ కోడి లేదింట

Published by under my social views

..|

అనగనగా ఓ పాప; బొద్దుగా ఉన్నావే బొమ్మా!

అముల్ డబ్బాపాలు ఆపలేదా మీ అమ్మ..! అంటే..
జబ్బ చరచి మరీ నాది మా నాన్న పోలిక;.. చూడమంటూ
కోడిని తింటున్న ఓ కుస్తీ వస్తాదు ఫోటో ఆల్బం నా మొహాన కొట్టింది

హమ్మయ్య! మంచిదే, ఒడ్డూ పొడుగూ మాత్రమే వచ్చినట్టున్నాయ్ g
ఇంకా నయం, ఒడిసిపట్టి మరీ పడగొట్టేయలేదు నన్ను
మాటల దురదకి.. అరచేతుల్ని ఆరబెట్టుకుంటూ అనుకున్నాy
దడ పుట్టిన గుండెని చిక్కబెట్టుకుంటూ

ఆ పిల్ల ఆ రోజుల్లో నా కళ్లముందు వయ్యారంగా తిరిగే మూడు మూరల కనకాంబరం
నక్లెస్సు మీద మాటీలు పెట్టుకుని ఉయ్యాలలూగే జుంకాల జత
చూడీదార్లూ డ్రస్సుల మధ్య వెలిగే లంగా వోణీ
హెడ్ ఫోన్లు పెట్టుకుని పెదాల స్పీకర్లను తెరిచిపాడే జ్యూక్ బాక్స్

హైటెన్షన్ కరెంటు తీగకి బంగారు పూతపూసి మరీ
నా ఆఫీసులో ఎందుకు కలిపాడో ఆ దేవుడు

షాక్ కొడితే కొట్టిందనే ధైర్యం లేదు కానీ,
తప్పక ఓ మారు చెయ్యట్టుకుంటే
గట్టు దించడానికే కదా అనుకోక మనసు మెలిపెట్టేసుకుంది
ఒళ్ళు ఝల్లు మన్నందుకు చేసుకుంటే నన్నే నని ఒట్టేసుకుంది

కప్లింగ్ బాగానే కనెక్ట్ అయ్యిందని ప్రెండ్సూ
బండోడికి తగ్గ దొండపండని రెలెటివ్సూ
కోడి కూరలోపడ్డాడని కాంపిటీటర్సూ డిసైడ్ అయ్యారు.
ఆ కాలం పెద్దలతో కలిసి కసిదీరా కంపేనియన్ ని చేసేసింది

ఓ ముహూర్తాన నన్ను కణ్మణి కొంగుకి కట్టేసుకుంది
కోడికోసమని ఆ తర్వాతే తెలిసింది

కనిస్తావా పండుని అని అడిగా
కోడిని కొనిస్తే వండిపెడతా నంది
పుట్టిన పిల్లాడ్ని చూసుకుంటూనే
నా చేతి చికెన్ ముక్క ఎప్పుటికీ తింటాడో అనుకుంది

పెళ్లి పులిహోర తినిపించి పుష్కరం దాటినా
జీవితం ఎన్ని హాహాకారాలు చేయించినా
తన మనసున మారనిది కోడికూర మీద మమకారమే
తిని తినిపించి తరింపజేయాలన్న ప్రతీకారమే.

ఆదివారం నాడు ఓ కోడి సగం వేపుడై పోతుంది
మరికాస్త దమ్ములో మాగి బిర్యానీకి తోడవుతుంది
మధ్యలో ఓ సారి జలచరాలను నా జేబులో రూకలు పలకరిస్తే సరే
లేదా మరోకోడి కి మా ఇంట ఆ వారం నూకలు చెల్లినట్లే

మా ఆవిడ బువ్వలాటల సరదాలు ఇంకా తీరక
తన వంట గదిలో ఆడుకుంటూ ఉంటుంది
నా జేబుకు ఇంత చిల్లు ఎందుకు అని మొత్తుకున్నా,
నే ఒక్కత్తినే తింటున్నానా అని మూతి తిప్పుకుంటుంది

ఊరించే కోడి కూర తిన్నప్పుడల్లా
దాని రుచికి మైమరచి మా ఆవిడ తిట్లన్నీ మరచిపోతాను
వారానికి నాలుగురోజులు నీసు ముట్టనప్పుడు
దేవుడున్నాడేమో అనిపించి కోళ్లు, నేను కలిసి మురిసిపోతాము

ప్రతి ఆదివారం తొలి జాము కలలో
కోళ్లన్నీ కలిసి నన్ను తింటున్నట్టు.. అనిపిస్తూ ఉంటుంది.
ఇంకా పడుకున్నావ్! వెళ్లి కోడి తీసుకురా!
మా ఆవిడ పాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉంటుంది.

సార్ కి ఓ లైవ్ చికెన్ .. అరుపు
షాప్ దగ్గర కోళ్ళన్నిటికీ వినిపిస్తూ ఉంటుంది.
పొరపాటున కూడా వాటి వైపు చూడను
అప్పటికే నాఊహలో మధ్యాహ్నం కంచంలో ముక్క ఊరిస్తూ ఉంటుంది.

(ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు, శుక్రవారం కాబట్టి, నేను.. ఓ కోడి బతికిపోయాం)
-30.6.2017-

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa