Sep 01 2016
యశస్వి-|| మరో సుమతీ శతకం!||
అనగనగా ఓ రాజు గారు..
ఆ రాజు గారి కొడుకులు వేటకెళ్ళాలి
ఎందుకేంటి! ఆనందం కోసం కదా!
వేటాడి చేపలు తెస్తారంట..
అప్పుడు మొదలౌతుంది అసలుకధ
బాగా వెనకేసుకున్న ఆ రాజు గారు
పచ్చని పొలాల మధ్యన, ఓ చోటు చూసుకుని
ఎండబెట్టడానికీ అమ్ముకోడానికో చంపే చేపలకోసం
చంద్రుడ్నీ, మేఘాలని కాపుకాయమని వేడుకున్నారు,
అక్కడ నీరు నేలా పాడవతాయన్నా,
ఏం పట్టింపు లేదన్నారు.
రాజుగారు అడగాలే గానీ ఎవరు కాదంటారు!
వాళ్ళెప్పుడన్నా కిందకి దిగి వచ్చేవారా!!
కాలవల్లో నీళ్ళమీద బతుకుతున్న ప్రాణాలే అన్నీ
మినరల్ వాటర్ తాగేటోరికి అభ్యంతరాలు ఉండవు
అనుకోకుండా ఒకడొచ్చాడు కధలోకి
వాడో చీమ అన్నారంతా
నిజమే కదా! ఎంతబరువైనా ఎత్తుకునే చీమ
నలుగురినీ బతికించే చీమ,
చీకటిలో దారి చూపించే చీమ
పిల్లాడ్ని కుట్టే చీమ కాదు కానీ
దాహమేసినప్పుడు ఏంతాగాలి అని
గొంతెత్తి అడిగిందని అరెస్టు చేసారు
చీమ ధర్నాకి అనుమతి తీసుకోలేదంట,
అసలు చీమ ఊరుకీ ఈ గొడవకీ సంబంధమే లేదంట
రాజుగారి దివాణంలో బంట్రోతులు గొణుక్కుంటున్నారు
ఎవరూ పట్టించుకోని చోటుల్లో
చీమలు పుట్టలు పెడతాయని
అడొచ్చిన రాజాపాముల పనిపడతాయని
సుమతీ శతకం లో రాజుగారి కొడుకులు
చదువుకోలేదేమో!!
ఇప్పుడు పాలేరూ, అవ్వా నీళ్ళు కావాలంటు
చీమల బారు న నుంచున్నారు
గడ్డిమేటు కడుపు కాలితే
నష్టపోయేది చీమో పామో!
ఎలా తెలిపేది పాముకి!!
మరో సుమతి శతకం రాయాలేమో!!
చీమలు మాత్రం కొత్తదారి వెతుక్కుంటూ
బరువెత్తుకుంటూనే ఉన్నాయి..
ఈ లోకం లో ఎన్ని చీమలున్నాయో
తెలియని పాములు
ఈ పుట్టనాది.. ఆ పుట్టనాది..
అని అనుకుంటూనే ఉన్నాయి
in solidarity with Viswa Manava Vedika – విశ్వమానవవేదిక
to seek clarifications for the proposed Godavari Mega Aquar Food Park, in and around BhimavaraM, WGDt.
= 22.9.16=