Archive for July, 2016

Jul 23 2016

యశస్వి|| నెప్పి.. గొప్పదే.||

Published by under my social views

Plymouth

భలే ఉంటుందీ నొప్పి..
ఇదీ.. దీని ఎక్కసెక్కాలూనూ!!
ఎదవది, సంపేతున్నట్టే ఉంటాది గానీ
ఇది లేపోతే జీయితమే లేనట్టుంటాది

కంటానికి దిగముక్కిన అమ్మ సోలిపోయాక
ఏ నొప్పొచ్చి ఏడుత్తా పుడతామో,

ఒకడి నొప్పి ఇంకొకడిది మాయం సేసేసినట్టు
ఏమో! సూసీ.. సూడంగానే నవ్వేత్తాడు నాన.

పెళ్ళాడిన సరదా
అమ్మకి పురిట్లోనే తీర్సెయ్యదూ!! నెప్పి!!

ఏ నొప్పొచ్చి ఏడుత్తామో గడిగడికీ
గబుక్కున ఎత్తుకుని లాలిత్తాది, పాలిత్తాది
నెప్పిలేకుండానే ఉంటాదా తల్లి తీపుల్లో

ఎవరడితే ఎవళ్ళకి నెప్పో కాలమే నిర్ణయిత్తాది
ఎవర్ని కొడితే ఎవరికి నొప్పో.. బంధమే అనుభవిత్తాది

నిండుకుండలా ఉంటే ఏముండదుగానీ
ఏమీ లేనోడికి లేదనుకుంటేనే నొప్పి
అన్నీ ఉన్నోడికి ఏదిలేకున్నా నెప్పే

ఒక్కోమారు పెట్టే సేయే.. కొడతాది
ముందూ ఎనకా నెప్పులూ అదే పడతాది..
అయినా, నెప్పెట్టడానికి దెబ్బే కావాల్నా.!
కనపడని దెబ్బల బలం తెలుత్తాది
ఇయాల్న గాపోయినా ఆనకెపుడో

ఒక్కోనెప్పి మాటలెక్కన ఇనపడి
సెవుల్లోంచి గుండెల్లోకి దిగబడతాది
పేనాల్ని తోడెస్తా.. మనసుతో కలబడతాది
ఒక్కోమారు నెప్పే కలుపుతాది..
ఎవరికెవరమో అదే తెలుపుతాది

ఒక్కోసారి బరువు నొప్పి, బంధం నొప్పి,
కరువు నొప్పి పరువు నొప్పి

ఒక్కోమారు అరుపూ నొప్పే , కురుపూ నొప్పే,
అడగాలన్నా, తీర్సాలన్నా.. అరువూ నొప్పే
అన్నీ ఉన్నోడికి అప్పుడప్పుడు పరుపూ.. నొప్పే

ఒక్కో ఏల సూత్తే నొప్పి..
ఓఏల సూడకపోతే నొప్పి..
ఎవురూ ఎవల్లకూ సెప్పేది సేసేదీ లేకున్నా,
కన్నుగప్పిన నెప్పి మన ఎన్నంటే ఉంటాది

“…ఒరే నువ్విలా ఉండిపోమాకురా…
అంటాది నొప్పి మనల్నిపలకరిత్తా
“…..నీతోపాటే ఉంటాగానీ
నువ్ బలంగా ఉంటే దాక్కునే ఉంటా…..సలపరిత్తా అంటది..

నెప్పెవడికైనా ఒహటే గానీ
ఏదైనా నెప్పీ- నువ్వూ ఒహటి కాదని తెల్సుకోవాల

తలొగ్గి నెగ్గడమెలానో నేర్సుండాలి
బయటపడ్డోడికి ఉన్నట్టు కనిపిత్తాది,..
పడలేనోడిని లోపలే తినేత్తాది

కొందరి నవ్వుని నెప్పి తినేత్తాది..
కొందరి నెప్పిని నవ్వు మింగేత్తాది

మనిసి నెప్పున్నా నవ్వగలగాల
నవ్వుల్లో నెప్పుల్ని కొలవగలగాల

ఎవడి బతుకు నిచ్చెన ఎంతెత్తున ఉంటదో
ఎవడి కట్టాల బావుల లోతెంతుంటదో
నెప్పికేం ఎరుక!; అదెక్కినోడికి గడవడమే.. ఓ ఘట్టం

ఎప్పుడన్నా నెప్పుల్ని మరిసిపోవాలనుందా
లోకం నెప్పులన్నీ నీ నెత్తిమీదేసుకో..
నీ తప్పులన్నీ దేవుని ముందైనా ఒప్పేసుకో

దాసుకోలేనియన్నీ మనసులో రాసుకో
నువ్వే నెప్పయ్యే ఏళా.. నెప్పేంజేత్తాది నిన్ను!

దాసుకోడానికి ఏమీ లేనేల
దోసుకోడానికి నెప్పికేమీ మిగలదెహే!
జీయితం నిన్ను దూసేసినా, కోసేసినా
నెప్పి తెలీకుండానే పోతావ్ ల్ఏదా వుండిపోతావ్

చెప్పెప్పెప్పుడూ నొప్పిరాదు; చెప్పీ పోదు,
భలే ఉంటుందీ నొప్పి..
ఇదీ.. దీని ఎక్కసెక్కాలూ!!
ఓపిగ్గా దీని పనిపట్టాల

ఎదవది, సంపేతున్నట్టే ఉంటాది గానీ
ఇది లేపోతే జీవితమే లేనట్టుంటాది.

ఒరెరేయ్! సత్తిపండూ!!
ఇదంతా ఎందుకంటెరోయ్
నొప్పంటే తెలిత్తేనే కదరా..
సుకానికి ఇలువుంటాది!!
ఒప్పేసుకోరా!
=20.07.2016=

RTS Perm Link

No responses yet

Jul 16 2016

యశస్వి||అలా గుద్దేసి వెళ్ళిపోతే…||

Published by under my social views

RT_nice_france_body_doll2_cf_160714_16x9_992
1
అవసరం..
=
ఏంటో అన్నింటికీ
స్పందించకూడదనుకున్నా
కంటి చెమ్మ ఆరడానికైనా
రాసుకోవాల్సిన సమయమొస్తుంది

2
ప్రేరకం..
=
నిన్నటివరకూ పేరన్నా వినని నీస్ నగరం
పక్కనున్న సముద్రపు ఉప్పదనం చాలక
ప్రపంచపు కన్నీటినంతా అరువు తెచ్చుకుంది

3
సందిగ్ధం..
=
అసలెందుకిలా జరుగుతుంది!
మతమొక్కటే కారణమంటే ఒప్పుకోలేక
మనసు మూలన ఎక్కడో కలుక్కుమంటుంది

4
గుణపాఠం:
=
చివరికి ఏం తేలుతుందో! అదే..

5
అనుభవం..
=
నేనే రోడ్డు మీద నడుస్తున్నా ను
కళ్ళెదుటే నిబంధనలను ఎవరో అతిక్రమిస్తారు
నరాలలో ప్రవాహాన్ని కట్టడి చేయలేక
గుండెలయతప్పుతుంది

6
ఫలితం..
=
మనిషిని కదా! అబద్దం చెప్పలేను
ఓ తప్పుని తప్పించలేని అసహాయతలో
ఓ ఉప్పెన కి లోనైపోతాను

7
ఆవేశం…
=
“లారీతో గుద్దెయ్యాలి నాకొడుకుని..”
అటు-ఇటుమారినా ఈ పదావేశమే
మరికొన్ని బూతులతో కలిసి
పర్యావరణాన్ని లోనా బయటా కలుషితం చేస్తుంది

8
అనుమానం..
=
మరి లారీతో గుద్దేసినోడ్ని, తనతోపాటుచావుని
ఉదారంగా పంచినోడికి ఏ పదాలు వాడాలి!

9
వాస్తవం..
=
అదిగో! నిద్రాణంగా ఉన్న కొన్ని కాన్సర్ కణాలు
నాలో జూలు విదుల్చుకుంటున్నాయి
నలమహారాజు లాంటి వాడ్నే
ఇప్పుడు శనికి అదను ఇచ్చి
సైతాన్ ను తలచుకుంటున్నాను

10
ఏంజరుగుతుంది..!
=
ద్వేషం ఓ దెయ్యం
ప్రస్తుతం
మతాన్ని ముడిపెట్టి నా తోనే నీ కన్ను పొడిపిస్తుంది
మానవత్వాన్ని మట్టుపెట్టించి
చివరికి దేవుడినే తుదముట్టించాలని చూస్తుంది
అబద్దానికి మతంముసుగేసి
సైతాను దేవుడి స్థానానికి పోటీ చేస్తుంది

=
మనిషి రూపంలో ముంచుకువచ్చే
అమానుష వ్రణాలు ఆత్మాహుతి దళాలై
సైతాన్ ని నీ ద్వేషంగా మార్చి
చావగా మిగిలిన నీకూ నాకూ
వద్దన్నా పంచుతున్నారు..

11
నమ్మకం!!
=
ఉన్నాడనుకో, లేడనుకో దేవుడు
పోయేదేంలేదు;
మతమే తప్పనకు
దారీ తెన్నూ తెలీదు
పాటించూ, పాటించకపో
లోకానికి నష్టమేం లేదు

=
సత్యం ఒకటి ఉంటుంది
ఈ నేలమీద నీకూ నాకూ చోటుందని
మనకి ప్రేమించే అవకాశం ఇంకా మిగిలుందని

12
తెలిసినా వదులుకోలేని బలహీనత:
=
ఏంచేద్దాం!!
ద్వేషిద్దామా ????

=16.7.2016=

RTS Perm Link

No responses yet

Jul 16 2016

యశస్వి|| ఆగి…..||

Published by under my social views

11957596835_d1d61e5ae8_b
ఆగాలి..
అప్పుడప్పుడు ఆగాల్సిందే..
గమనం ఎంత అవసరమో
విరామం అంతే అవసరం

పడిపోకుండా ఉండేందుకు ఆగాలి
నడక నడకకి నడుమ నిలబడడం
నిలబడడాల మధ్య కూర్చోవడం
కూర్చోవడాల మధ్య పడుకోవడం.. కోసం

దొంగ పరుగులు పెట్టే కొంటె వయసులో
అమ్మ ఆగమన్నప్పుడు ఆగావో లేదో
తగిలిన దెబ్బేమైనా నేర్పిందో లేదో
పెద్దయ్యాక ఆగాల్సిన సందర్భాలెన్నో

నిద్రమత్తు వదిలించుకోకుండా నేలన కాలుని ఆంచి
పరిగెత్తాలనుకుంటే
పడతామో లేదో చెప్పుకోవాలా!
కంగారు పడ్డట్టే

పదహారు గంటల మెలకువకి
ఎనిమిది గంటల విశ్రాంతి మాత్రమే కాదు
పదానికి పదానికి మధ్య అర్ధమయ్యేందుకు
నిశ్శబ్దాన్ని పలకడం కోసం..
అప్పుడప్పుడు ఆగాల్సిందే

పనిలో నిమగ్నమైఉన్నప్పుడు పై అధికారి వచ్చాడని
కాపీని దాయలేక ఇన్విజిలేటర్ కి దొరికిపోయిన కుర్రాడిలా
తత్తరపాటు పడి నిలబడ్డామా!
మనపై, మన పనిపై తేలికభావాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే

అదే క్షణంలో సగం కాలమైనా
ఆ రాకను గమనించినట్టు ఒద్దిక చూపామా
ఆగడం తనకున్న మరో అర్ధాన్ని
తిరగేసి చూపిస్తుంది

అసలా ఉద్యోగమే ఏం చెప్పాలో తెలియని వేళ
మాటలాపి నవ్వినందుకే వచ్చుంటుంది
ఇంటర్వ్యూ గది ముందు అడుగాపి
గుండెలనిండా గాలిపీల్చినందుకే వరించి ఉంటుంది

సహచరితో సాన్నిహిత్యపు సమాగమం లో
ఆగాల్సిన అవసరాన్ని సూచించినప్పుడు
ఎంత కాగి ఉన్నా ఆగక తప్పదు
అశనాన్ని నివారించేందుకైనా ఆగాల్సిందే

ఆగడం మనం మర్చిపోతున్న బాల్యం
పరిగెట్టడం తెచ్చిపెట్టుకున్న లంపటం
నడవడం ఈ రెంటిమధ్య పేరుకున్న పరధ్యానం
ఆయాసమొచ్చి ఆగడం కాదు
అవసరమైనట్టూ ఆగడం ఎట్లానో గుర్తు తెచ్చుకోవాలి

ఆగడమంటే పరికించడం, పరిశీలించడం
మన ఉనికిని నిర్ధరించడం
రక్తప్రసరణని క్రమబద్దం చేయడం
స్వవ్యవహారాన్ని నిర్వహించడం

రోడ్డున నడుస్తున్నప్పుడు
పాదచారుల సౌకర్యం కోసమే కాదు
ఊడ్చే పనివారి వెసులుబాటు కోసమైనా ఆగాలి
రోడ్డు దాటుతున్నప్పుడు
వాహనాల నుంచి రక్షణ కోసమే కావచ్చు
అవసరమైతే వారిని ఆపి మనం ముందుకు సాగాలి

నువ్వే వాహన దారుడి వైతే
ఎర్ర సిగ్నల్ దగ్గరేనా!
మనవల్ల ఇబ్బంది కలగకూడదని ఆగాలి
లిఫ్ట్ దగ్గర ఆడవారికోసం
టాయ్లెట్ దగ్గర ఆపుచేసుకోలేనివారి కోసమో
రైలో బస్సో ఆగినప్పుడు దిగేవారికోసమో
ఆగాలి; అందరి ప్రయాణం సాగాలి

మాట్లాడేముందు
పర్యవసానాలు బేరీజువెయ్యడానికో
పని మొదలెట్టేముందు
సాధ్యాసాధ్యాలు అంచనావెయ్యడానికో
చెప్పేముందు పాటించడానికో
ఇచ్చేముందో, పుచ్చుకునేముందో
ఇరువైపులా గుర్తుండేటట్టు
ఓ అత్మీయ క్షణాన్ని ఆస్వాదించడానికో ఆగాలి

ఆగకపోతే వచ్చే పర్యవసానాల్ని
చర్చించుకోకుండా ఉండాలంటే..
ఒక లెక్కగా ఆగాలి..
ఆగి సాగాలి.

=15.7.2016=

RTS Perm Link

No responses yet

Jul 13 2016

యశస్వి|| నీతోనే.. ||

Published by under my social views

138258

ఏయ్! నిన్నే!!..
నా మెహర్బానీ ఏమీ లేదు..
నువ్వే నేను నిజంగా బ్రతుకుతున్న సమయాన్ని
వడ్డీ తో జమకడుతున్నావ్

మెచ్చుకోలు కొన్నిసార్లు, నొచ్చుకుని కొన్నిసార్లు
ఇచ్చకాలు కొన్నిసార్లు, నచ్చబెట్టుకుని కొన్నిసార్లు
అచ్చంగా మనిషిలానే నువ్వు స్పందించడం వల్ల
కొన్ని సంవేదనల్ని చవి చూస్తున్నా

మోసే వాళ్ళను, గేలి చేసేవాళ్ళను కాసేపు వదిలేయ్
ఈ రంగస్థలం మీంచి కదా
మేలిముసుగులో నీకు నేను కనిపించేది
లొసుగుల్లేనివేళల్లో ఒకరిదొకరం తొలగించుకొంది..

ఏవో పదాల వెంట నడుస్తూ
నచ్చిన భావాలను పోగేసుకుంటున్ననీకు
ఏ గడ్డిపూవుగానో, గులకరాయిగానో
గాలికో, కాలికో తగిలుంటాను

ఏయ్! నిన్నే!!
అని అనకుండానే
నీకోసమే నేనున్నానని ఓ చూపు
నాకు అందించి నడుస్తావా!..
(ఎంతానందం! ఎంతానందం!!)

నాకప్పుడు నువ్వు నా సమస్తానివి కాకపోయినా
నా అస్తిత్వానివి అనిపిస్తావ్
ఇది చాలదా నాకు
ప్రాణశక్తిని ప్రోది చేసుకోడానికి

నీమునివేళ్ళతో మనసుని తాకుతున్నావే!
కరాలలోనూ స్వరాలలోనూ
కరుకుదనం దాచుకోవాలనుకునే నా తపన
నీ నరాలకు ముందే చేరుతుంది

నీ కళ్ళలోకి చూస్తానా!
ప్రతిఫలిస్తూ రంగుల వనం పలుకరిస్తుంది
ఏంటిలా ఇంత మెత్తగా ఉండిపోయాను
రేకలు జారిన ఉమ్మెత్త పువ్వులా

నీ పెదాలు తడిగా నా పదాలను
పలుకుతుంటే…
నన్నద్దుకున్న నీ వేలిముద్ర
నిన్ను హత్తుకున్న నా వ్రాలై
మనసు కాగితంపై వాలుతుంది

నా మెహర్బానీ ఏమీ లేదు..
నువ్వే నేను నిజంగా బ్రతుకుతున్న సమయాన్ని
వడ్డీ తో జమకడుతున్నావ్
ఏయ్! నిన్నే!!
7.7.16

RTS Perm Link

No responses yet

Jul 13 2016

|| టామీ!.. యువర్స్ ట్రూలీ|| యశస్వి

Published by under my social views

1387_n

రోజూ వెలగబెట్టే కొలువే
ఐదు నిముషాలముందు తెమలడం ఇప్పటికీ చేతకాలేదు
ఉదయాన్నే పరుగులూ- ఉరుకులూ ఇంట్లోనే
పులిసిపోయి పడుకున్న ఒళ్ళు ప్రభాత వాహ్యాళికి లేవలేదు

ఈదడానికి ఏరూ లేదు, మేసేచోటు లంకా కాదుగానీ
లంగరేయని జీవితానికి ఆ పోలికతో పెద్దతేడా లేదు

జారే పాంట్లని రింగులట్టుకుని ఎగలాక్కుంటూ
ఎండెక్కేకొద్దీ కంగారెక్కి బస్సుకోసం పరిగెడిదామనుకుంటానా
ఎదిరింటి కుక్క అది కబ్జా చేసిన వీధిలోకి
జొరబడిన అంగతుడిగా ఖరారు చేసేసి గుర్రుగా దూసుకొస్తుంది నాపైకి

ఆ ఇంటావిడ, నా ప్రాణదాయినిలా దాన్ని అదిలిస్తూ అంటుంది..
“మరేంలేదండీ! మీకు కుక్కలంటే మక్కువని దీనికీ తెలిసిందిలెండి”
దాన్ని వదిలించుకుని, ఓ నిజంతో నేను బయటపడతాను
అదే! టామీ!! నువ్వింకా నాలోపలే ఉండిపోయావని

టామీ! మనమేదైనా చెప్పుకోవడం ఇంకా మిగిలుందా నేస్తం
నిను కలిసిన ప్రతిపట్టూ వాస్తవంగా
నన్ను నేను నిమురుకున్న కవిత్వ సందర్భాలే
నే మొదలు పెట్టకముందే తలాతోకా ఊపేవాడివి నువ్వే

ఓనాడు నువ్వెక్కడని అడిగితే చనిపోయావని చెప్పారు
ఎక్కడికి పోయుంటావ్! కుక్కల స్వర్గమేమైనా ఉండుంటుందా
అట్లాంటిదేదైనా ఉండుంటుంటే అది ఈ భూమ్మిదే; ఎందుకంటే
రంభా ఊర్వశిల్లాంటి అమ్మాయిల ఒళ్ళోనే మీ జాతి వైభోగమంతా

అయ్యో! అని ఒకరికొకరం అనుకున్నా ఏం ఉపయోగం లే!
నా లోపలే ఉండిపోయిన నీకు ఈ నాలుగు మాటలూ! మరి వింటావా!!
ఎన్నోసార్లు యాకూబ్ అన్న ప్రేమగా రమ్మనా
నువ్వు లేని ఆ గుమ్మాన్ని తొక్కలేకపోతున్నా

నాలుగు పాదాల పసివాడిగా నువ్ తారాడే ఆ ఇల్లు
బయల్దారిగా చేసుకుని విహరించే ఆ వీధి
నీ రాజసాన్ని కనలేక ఇప్పుడు బోసిపోయాయి

మూడేళ్ళ కిందట సూఫీ ఘర్ లో పరిచయమైన నాలుగో ప్రాణివి
నా పంచేంద్రియాలతో పెనవేసుకున్న నీ స్మృతులన్నీ కల్లలై
అప్పుడే ఆరునెలలు ఎట్లా గడచిపోయాయి!

గాజునది గారాలపట్టీ!
నదీమూలం లాంటి ఆ ఇంటిలో ధర్మంలా నడయాడే వాడివి
కాలభైరవుడి కౌగిలిలో ఎలా ఒదిగిపోయావ్!

సక్తుప్రస్తుడి దాతృత్వం ఆ ఘరానా అన్నట్టు
ఏ పేలపిండిలో పొర్లాడి పెరిగావో
బంగారువర్ణంలో మెరిసిపోయావ్

అక్షయపాత్రకు అంటిన ఆఖరి మెతుకుని కతికిన కృష్ణుడివేమో!
నిండుగ నిను చూడగానే, కళ్ళూ, కడుపూ నిండినట్టుండేది
మనసు నిండే ముషాయిరా సదా నీతోడుండేది

పులిని చూసి భయంతో సగం చెట్టెక్కినట్టు
దూరం నించే ప్రేమించాలనే బెట్టుతో నీ జట్టుకొచ్చి
నా వెనక నక్కి.. నిను నిక్కించి చూసే లక్కీ నాన్నకి ఎరుకే
నువ్వెంత మంచివాడివో!

అమ్మ నిన్ను అదిలించిందా ఎంత కుక్కవైనా కుక్కిన పేనువే
స్కాట్లాండ్ గోల్డెన్ రిట్రీవర్ జాతి కి ఇంగ్లాండ్ దేశపు
ఆంతరంగిక సిపాయిల వ్యవహారిక నామాన్ని ఎందుకు పెట్టారో
ఇప్పుడు నాకు బాగా అర్ధమైంది
నువ్వు నాన్న లాలన కన్నా అమ్మపాలనకే విలువిస్తావ్

యాకూబ్ భాయ్ నీకు నాకూ కవిత్వం వినిపించడం తెలుసు
మేమిద్దరం నీకు కవిత్వమై కనిపించడం తెలుసు
నువ్వు మంచీ- చెడూ చూసే అవకాశం మాకిచ్చావో లేదో;
నువ్వెప్పుడూ చెప్పలేదు, నాకడిగే హక్కు లేదు
అయినా నాకెక్కడో నిను మేం సరిగా చూడలేదని గుర్రు

నువ్వు బట్టలేసుకోలేదు, బండెక్కి తిరగలేదు
మేటింగ్ అవసరాల నిమిత్తం ఏ డేటింగ్ కోసమూ అడగలేదు
అర్ధం కాని భాషలో ఎప్పుడన్నా మొరిగావేమో
నీ సంస్కారం ఉన్నతమైనది; అందుకే
మేమెవరం నీ అవసరాలు గ్రహించలేదు
కోపమొచ్చి వెళ్ళావేమో, మమ్మల్ని మన్నించు

నీ అయ్య, నా భయ్యా
మనుషుల్నే పట్టించుకుంటాడు!
అయినా నీకై తను పుట్టినూరులో స్మారకం కట్టాడు

ఇప్పుడు టామీ అంటే.. ఏంటో తెలుసా!
ప్రతి రంజాన్ కి పెద్దలసరసన పూలందుకునే సమాధి దిమ్మ మాత్రమే కాదు
తోటమట్టి సారంలోంచి తొంగిచూసే కాగితపు పూల మొక్క కూడా
=8.7.2016=

RTS Perm Link

No responses yet

Jul 13 2016

యశస్వి ||ఏదో చెప్పాలని||

Published by under my social views

baby-115a

కాగితాలు చిరుగుతున్నాయి..
అక్షరాల బలం చాలక..
కలం నెప్పులు పడుతుంది
నన్ను కవిగా కనలేక..

పుట్టినప్పుడు లేని కలతను
జీవితాంతం మొయ్యలేక
అమాయకత్వాన్ని మిగుల్చుకోలేనితనం
ఆపసోపాలు పడుతుంది.

ఉన్న కొద్ది రోజుల్లో మంచిని పంచలేక
ముసిరిన భావకాలుష్యం లోంచి
మిగిలి ఉందనుకుంటున్న మానవత్వం
మల్లగుల్లాలు పడుతుంది

చుట్టుముట్టిన చీకటిలోంచి,
చేతికందనంత ఎత్తున వేలాడే నక్షత్రాల్లా
మిణుకు మిణుకుమంటూ స్వచ్ఛత
అరకొరగా అగుపడుతుంది.

బురదలోనే కూరుకుని నుంచున్నా,
ఏ చంద్రోదయం కోసమో
మనసు మొరెత్తి కలువలా
ఎడబాటు గాలులతో కలబడుతోంది.

ఏదో చెప్పాలని ఉన్నా,
ఏమి లేదన్న నిజం
జీవితాన్ని దిశమొలతో
నలుగురిముందు నిలబెడుతుంది

ఎవరన్నా నిశ్శబ్దాన్ని పసిగెడతారేమోనని
కొట్టుకుంటున్న గుండె
ఘడియ ఘడియకు తడబడుతోంది

ఈ రాత్రి నేనేమి చెబుతాను!
నువ్వేమి వింటావు!!
మిత్రమా! నిద్దురపో! హాయిగా

రేపన్నది మిగిలుంటే
పంచుకుందామనుకునే ఓ మాట
కేరింతల పసిపాప నవ్వయి..
నీకు నిద్రలోను వినపడుతుంది.

= 03.07.16=

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa