Archive for June, 2016

Jun 30 2016

యశస్వి || మనోగతం ||

Published by under my social views

IMAG1540

భలే ఉంటాయి నిశ్శబ్ద సాంగత్యాలు
పెద్దగా పరిచయం లేదే అని ఎవరికి వారై
ఇద్దరం అనుకుంటున్నప్పుడు.. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాలు

మాట్లాడుకోవడానికి అవకాశాలు వెతుక్కుంటున్నప్పుడు
చూపులు కలబడడాలు, లేని మాటలకు పెదాలు విడివడడాలు
తిరగబడి చూడడాలు, తప్పుకుని తిరగడాలు
ముసు ముసిగా నవ్వుకోవడాలు,అంతలోనే నొచ్చుకోవడాలు
చూపులతో చెప్పుకోవడాలు,మనసుని చిక్కబెట్టుకోవడాలు
తలచుకుంటుంటే..
భలే ఉంటాయి కొన్ని నిశ్శబ్ద సాంగత్యాలు

ఓమారు చెయ్యి అందించాల్సి వస్తే
పట్టుకుని గట్టు మీదనుంచి దింపాల్సివస్తే
నీకు ఒల్లు ఝల్లుమనడాలు, నాకు గుండె గుభేలుమనడాలు
మొహాలు కందడాలు, మోహాలు చూపుల్లోంచి చిందడాలు
ఊహల ఉయ్యాలల్లో మనసులూగడాలు, విరహాలలో రేగడాలు
ఊసుల వెంట జారడాలు ఆరాటమై బయటపడడాలు
పెద్దల ముందు తొణకడాలు వారేమో బెణకడాలు
ఒప్పుకునే దాక ఆకలి పోరాటాలు, ఎదురుచూపులకై అల్లాడటాలు
తలచుకుంటుంటే..
భలే ఉంటాయి ఆ నిశ్శబ్ద సాంగత్యాలు

ఈలోపున పెళ్ళవ్వడం,
ఎల్లలు లేని ప్రేమను ఇద్దరూ కుదించి ఓ ఇల్లవ్వడం,
ఒకరికొకరు గువ్వలవ్వడం నుంచి పిల్లల్నివ్వడం
ఒకరి కోసం ఒకరు బతకడం నుంచి కన్నవారికోసం కలసి బతకడం
సరదాలు పరదాల చాటుకెళ్ళి బాధ్యతలు భుజాలకెక్కిపోవడం..

మళ్ళా ఇన్నాళ్ళకి,
మూతి ముడిచినా, నాలిక మడిచినా,
చూపు కలపకున్నా, మాటల్ని వినిపించుకోకున్నా
విసురుగ తప్పుకున్నా, దురుసుగ కసురుకున్నా
ఒకరికొకరమని తేలిపోయాక
ఎవరిని ఎవరు ఏమన్నా, చూసేవారేమనుకున్నా
ఇచ్చుకునేవి పుచ్చుకున్నవి లెక్కతేలిపోయినా సరే,
చెప్పాలనుకున్నవన్నీ ఎప్పుడో చెప్పుకున్నాక
ఈ రంగస్థలం మీద నీకూ నాకూ రోజులెన్ని మిగిలున్నా
రాలిపోయేదాక.. జీవితం లోంచి తూలిపోయేదాక
అనుభవిస్తుంటే..
భలే ఉంటాయి ఈ నిశ్శబ్ద సాంగత్యాలు
=30.6.2016=

RTS Perm Link

No responses yet

Jun 27 2016

యశస్వి|| వాడూ- గోదారి C/o నరసాపురం||

Published by under my social views

s copy

16 డిగ్రీల 26 మినిట్ల 6 సెకన్ల ఉత్తర రేఖాంశాలను
81 డిగ్రీల 42 మినిట్ల 29 సెకన్ల తూర్పు అక్షాంశాలు
గూగుల్ పటాల్లో ఖండించే శీర్షిక కింద
ఆ ఊరి లలితాదేవి గుడికి ౩౦ అడుగుల దూరంలో
లాంచీలు ఆగే ఓ అరుగు ఉంది

ఓ కుర్రాడు ఎప్పుడన్నా ప్రపంచంలో ఎక్కడున్నా
గుండెత్తు రాయిని జీవితం ఎత్తి పెట్టినప్పుడు
బాగా అలసి ఉన్నప్పుడు కళ్ళు ముసుకుని
అక్కడే కూర్చుని ఉన్నట్టు ఊహించుకుంటాడు

నలుగు తానాలవేళ నెలల బిడ్దడిగా
అమ్మమ్మ నుదురుని కాలితో ముద్దాడినట్టే
గోదారమ్మ మెళ్ళో దండ వేసినట్టు కాళ్ళకి బంధమేసి
ఎంత సేపు నీళ్లలో వెళ్ళాడేవాడో! గుర్తు చేసుకుంటాడు

బతుకు తెరువుకై గోదారి దాటి
రాజమహేంద్రి చేరుతున్నప్పుడు
ఆ గోదారితోనే కదా వీడు రోజూ స్నేహం చేసింది
ఓ ప్రేమగోదారి ఆ ఒడ్దున కలిస్తేనే కదా
ఆ మట్టిని మోసుకొచ్చి ఇంట దీపం పెట్టుకున్నాడు!

వాడికి గోదారి అమ్మ కాదు, అమ్మలగన్నమ్మ
అమ్మను మళ్ళా మళ్ళా కనిచ్చినమ్మ
ఓ మారు గోదారినే కడుపులో పెట్టుకోమని అతడి అమ్మే కోరుకుంటే
పిల్లల మొహాలు చూస్తూ బతికేయమని
వెనక్కి పంపించిందట అచ్చం కన్నతల్లిలా

మొన్నటికి మొన్న ఓ కాలవ ఒడ్డున ఆ గోదారమ్మే
చెవిలో ఏదో చెప్పేటందుకు మరో సారి పిలిస్తే
కాలు జారి పడిపోయిందనుకున్నారట
అప్పుడు రావద్దన్నది ఇప్పుడు రమ్మంటుందా!
అమ్మను వెనక్కి పంపినందునే
గోదారమ్మను ఈరోజు అక్షరాలతో తలుస్తున్నాడు

గుండెని గోదారి చేసి అమ్మ ప్రేమను ఎత్తిపోసినట్టు
మోయలేని అలసటని ఒడిసి పట్టి
ప్రవహించలేక, గుండెల్లోని ఇసుక నదిని
ఈ అక్షరాలతో నింపుకుంటున్నాడు ఇప్పుడు

తడపడం మించి గోదారేమీ ముంచలేదు వీడిని ఏనాడూ
అమ్మని గోదారి తనలో కలుపుకున్నా
తను వరద గోదారిగా మారడం తప్ప మరేమీ చెయ్యలేడు

కన్నీట తడవడం తప్ప గోదారికి వేరే దారిలేదు
ఉప్పెన సముద్రాన్ని ముంచెత్తినప్పుడూ
వాడు ఆ ఒడ్డునే కూర్చుని ఉన్నాడు.

కన్నీటి ఉప్పెన..
మనిషిని కమ్ముకొచ్చినప్పుడూ..
ఆటు పోటులను కాళ్ళతో కొలుస్తూ..
వాడక్కడే.. ఉంటాడు..

అప్పుడు వాడొక్కడే..
గోదారికి తక్కువేం కాడు

=24.6.2016=

RTS Perm Link

No responses yet

Jun 20 2016

యశస్వి|| ఓ పంది గోల..|| ఫాదర్’స్ డే స్పెషల్

Published by under my social views

maxresdefault

ఓ పంది పిల్ల పొద్దున్నే వాళ్ళమ్మని అడిగింది.
ఫాదర్స్ డే అంటే ఏంటమ్మా.. ఎవరో అంటుంటే.. విన్నా.. అని..
చెప్పిందిలా తల్లి..

పిల్లా.. పిల్లా.. మనుషులకో రోగం
ఈ లోకంలో ఎక్కడ మరిచిపోతారోనని
ఓ రోజు నాన్నని తలుచుకుంటున్నారని..

కన్నది ఆమ్మ నాన్న కలిసి ఆయితే
నాన్నని విడిగా ఈ ఒక్కరోజే ఎందుకు తల్చుకోవాలమ్మా!
మళ్ళా అడిగింది. ప.పి.

అమ్మ పంది కి ముచ్చటేసి..
మనుషుల కధ చెప్పడం మొదలెట్టింది.

మనలానే తినీ-తిరిగే మనుషులలో..
ఎద్దుల్లా ఉండే ఒకరకముంటుంది.
వాటిలో చాలా వాటికి పెళ్లాడడం అన్న తప్పనిసరి పని ఒకటుంటుంది.

ప్రేమించడానికి అవసరం లేని డబ్బు
పిల్లల్ని కన్నాక పెంచడానికి అవసరమౌతుంది..
అది సంపాదించే వాడ్ని నాన్నంటారు..మనుషులంతా

సంతు కోసం సంతోషాన్ని ఖర్చు చేసే బలహీనత
మగమనిషికి ఉందని తెలిసిన ఆడ మనిషి..
ఓ అరగంట కష్టాన్ని సంతోషంగా మార్చి
ఏడాదిలోగా వడ్డీతో జమకడుతుంది.. దాన్ని మనుషులు బిడ్డ.. అంటారు.

ఏడుస్తున్న బిడ్డని పొత్తిళ్ళలోకి తీసుకుంటుంటే
నాన్న నవ్వే కనిపిస్తాది కాని..ఆ రోజునుంచే
ఏడుపు ని నవ్వుగా మార్చే ఉయ్యాల జీవితం నాన్నదవుతుంది.

అమ్మ ఆ తరువాత నాన్నకి ఏదన్నా ఇచ్చి సంతోషపెట్టిందంటే..
అది బిడ్డ బాగోగులు చూస్తున్నందునే..
ఈ రహస్యం ఆ ఇద్దరికే తెలుస్తుంది.
బిడ్డంటే భర్తకు భార్య చెట్టుకి కాసే తినలేనిపండు.

ఇలా నాన్న అడ్డంగా దొరికిపోయి
తన రెక్కల కష్టంతో ప్రేమ నూనెని పిండిచ్చే గానుగెద్దులా మారిపోతాడు.
ఆ నూనెతో అమ్మలు చెయ్యలేని పనులేం లేవు.
నూనె సరిపోయిందా నాన్న హీరో అవుతాడు లేదా హిరణ్యకశపుడు అవుతాడు.

ఇంత నూనె తియ్యమని అడక్కపోయినా.. నాన్నలు నూనెని తీస్తూనే ఉంటారు.
పిల్లలు..వారి తల్లులు ఎంత నూనె కావాలో అంత ప్రేమా కురిపిస్తూనే ఉంటారు.

కొందరు నాన్నలుంటారు..
మధ్యలో కాడి వదిలేసి పారిపోతారు.
కొందరు జీవన ప్రవాహంలో జారిపోతారు.
కొందరు మెడలు ఒరిసి నీరసంగా వాడిపోతారు.
అప్పుడు తిట్టుకున్నా ఉపయోగం ఉండదు కాబట్టి..

ఏడాదిలో ఓ రోజు బొట్టుపెట్టి
సంతోషంగా ఉంచాలని మనుషులు కనిపెట్టారు.
అని చెప్పింది తల్లిపంది.

అయితే భలే.. నేను నాన్న పందికి రోజు కాకుండా ఏడాదికి ఒక్కరోజే ముద్దెడతాను..
పైకి అనేసింది.. పి. ప.
ఈ మనుషులున్నారే.. తిట్టుకుంది. తల్లిపంది.. తలపట్టుకుని..
=19.6.16=

RTS Perm Link

No responses yet

Jun 14 2016

యశస్వి|| ఒట్టు..||

Published by under my social views

rape-4121
||Rape was raped in Telugu already I will not rape it again||

విషాదమేమంటే ..
మానభంగమన్న పదం అవసరం నాకు వచ్చింది
నిఘంటువులలో దాని అర్థం
కాలానుగుణంగా మారినట్టు తెలియవచ్చింది

తెలిసో తెలియకో మానభంగాలు చేస్తున్న వారు
మనలోనే చాలమంది ఉన్నారు
నే తప్పుగా ఏమీ చెప్పలేదు..
మీరు సరిగ్గానే విన్నారు

మానమంటే గౌరవమని విడమర్చి చెప్పడానికి
మీకన్నా నాకు ఎక్కువేమీ తెలిసుండక్కరలేదు
కొన్ని సందర్భాలు కధల్లోవి.. వాస్తవాల్లో నివి
అంతకు మించి మనం వాదించుకోనక్కరలేదు

సీతకు రావణుడితో జరిగింది మానభంగమే
అందుకే రాక్షస సంహారానికి ధనుష్టంకారం చేయాల్సి వచ్చింది
అంబకు జరిగింది మానభంగమే
అజేయుడైన భీష్ముడి అంతు చూడాల్సి వచ్చింది
ద్రౌపదికి దుశ్శాసనుడితో జరిగిందీ మానభంగమే
గుండెలు చీల్చి రక్తాన్ని జుట్టుకు పట్టించాల్సివచ్చింది

నందరాజు కొలువులో చాణుక్యుడికి జరిగింది మానభంగమే
అందుకే దేశ చరిత్రను తిరగరాయాల్సి వచ్చింది
ఎన్టీఆర్ కి జరిగింది ఒట్టి అవమానమైతే
చైతన్యరధమెక్కేవాడు కాదు
తెలంగాణ సామాన్యుడు కేవలం అవమానమనుకుంటే
పోరుబాట పట్టి రాష్ట్ర రధాన్ని లాగడానికి తన గుర్రాలనే కట్టేవాడు కాదు

అవమానానికి మానభంగానికీ
తేడా గమనించావా! ఎప్పుడన్నా
తన తప్పుకి తలవంచి
కంటినీరు ఒలికించి కుదేలయ్యే మనిషిది అవమానం
తనకీ తనలాంటి వారికీ పదే పదే అదే జరుగుతున్నప్పుడు
నీరు ఉప్పెనై ముంచేసే సునామీ పుట్టుకకు కారణం మానభంగం

చెడ్డా..వాడిమీదకాదు చెడగొట్టిన వాడి మీద దృష్టిపెట్టు
ఎవరినైనా ఎప్పుడైనా అవమానించావో లేదో గుర్తు తెచ్చుకో
తప్పు అటువైపునే అన్న నీ అవగాహన నిజమో కాదో ఇప్పుడైనా సరిచూసుకో
లేదా.. నువ్వూ మానభంగం చేసిన వారి జాబితాలో చేరిపోతావు

చట్టం నీ చుట్టమై నువ్వోమెట్టు పైనున్నట్టుగా బెట్టు చూపించకు
ఇక్కడ నిన్ను మట్టుపెట్టేది నువ్వు చేసే పరాభవమే

కట్టుకున్న ఆలినో, పుట్టిన పిల్లాడినో,
ఆదుకునేపనోడినో,పడని పరాయోడినో
నీ అహం కాలినంత మాత్రాన
అవతలివారు ఎవరైనా నీకెంత లోకువైనా
అమ్మనా బూతులు తిడుతున్నావా!
నీకు శృంగభంగమే…
మట్టిగొట్టుకుపోతావ్!! ఎప్పటికైనా
మళ్ళా.. చెప్పనా!!
ఏం!!!

( నేను నాకు ఓ ఒట్టుపెట్టుకుని మరీ…)
=08.06.2016=

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa