Archive for March, 2016

Mar 29 2016

యశస్వి|| బావన్నకి ఓ ప్రేమలేఖ|| @Martin

Published by under my social views

10623598_860128170704618_2389800425257012699_o

ఎప్పుడో ఎవరో ఎవరితోనో ఓ యుద్దం చేసినప్పుడు
కాలకేయుల కిలికి భాష లాంటి ఇంగ్లీషులోకి
వాదాల అనువాద సాయానికై ఓ సైనికుడిలా సాయం అడిగా
జీవితగీత ను ఎన్నడో తర్జుమా చేసినోడిలా అభయమిచ్చావు

నా పలుకో, పడికట్టో మొదటి కలయిక నాడు బోల్తాకొట్టించలేదూ!!
మాటల్ని మించి ఎదగాల్సిన అవసరాన్ని గుర్తించే కదా
“మార్టీనేన స్వయం” అంటూ ఆడే అనగనగా ఆటలో
వందేమాతరం పాడించావు

” అన్న మానేసిన పెరుగన్నం ముద్ద!! ”
నీ నోట్లో పడ్డట్టు కధల కొలువు నాకిచ్చి
ఆ కుంకుడు చెట్టు కిందన
ఎంత తబ్బిబ్బయ్యాననుకున్నావ్!

నీ స్థాయి ఆలోచన నాకలవడకున్నా
నీ యాస నాకు కొరుకుడు పడదన్నా
ఒక్కమాటని గొప్పగా ఒప్పుజెప్పగలను..
తలారితో నీ జుగల్ బందీ ఉప్పెనని..

నీ కవిత్వం ఎడారిని చిగురింపజేయడం అని
ప్రాతఃకాల తుషార అవపాతాల లెక్క అని
నీ ఉద్యమం వెనక తరాల ఆత్మనినాదమని
స్వాప్నికుడి మరణానికి నువ్వు పడ్డ వేదనే చూపెట్టింది.

నువ్వాడే ప్రతి ఆటా ఎన్టీవోడి డబుల్ ఫోజు సినిమా
నాకన్నా ముందరే ఆపనిలో ఎందరో ఉన్నా
అక్షరాలతో నిను కొలవాలని అనుకున్నా
అందుకే ఈ ఉత్తరం రాస్తున్నా~!

వేణుగానలోలా! ఓ వంటల వలలుడా!
నువ్వెక్కడ ఎలా విహరిస్తున్నా..
నీ ఇంటి ఇరుసు పద్మలతక్క నీపాలిట వరమన్నా…
అందుకే నిన్నుబావన్నా! అంటున్నా
కన్నయ్యకు అన్నయ్యా!!

లెక్కెలు కడితే నీ ఫాన్లు వందల్లో తేలరా!!
మనిషికోసం పోరుబాట పట్టిన
లూథర్ కింగ్ పేరు పెట్టుకున్నాకే పుట్టావా!!
మందుగుండు దట్టించిన fb స్టేటస్ తూటా..

ది.. ఇండస్ సుందరా!
రాహుల్ సాంకృత్యాయన్ పథసంచారీ!!
విశ్వమానవ స్వేచ్ఛా పిపాసీ
ఓ బావన్నా! నామాట వింటున్నావా!!
==29.3.2016==

కుంకుడు చెట్టు* = గోల్డెన్ థ్రెషోల్డ్ లో వేదిక ఈ చెట్టు కిందనే..
ఈ పేరు మీదే మార్టిన్ కవిసంగమం పై కవిత రాసారు..
Pl watch: https://www.facebook.com/indusmartin/videos/10208025998221963/

RTS Perm Link

No responses yet

Mar 24 2016

యశస్వి.. ||ఓ జంటను చూసి…||

Published by under my social views

99343-96768

అనాది ఎడబాటును తట్టుకుంటూ
కొన్ని క్షణాలైనా జట్టుకట్టాలని
వారిద్దరూ మాటలతో గూడు కట్టుకున్నారు

ఆ ముచ్చట కోసమే కాలాన్ని పొదుపుచేసి
ఆ చోటున కూర్చోపెట్టారు

వలపుకై ఎదురు చూపుల్లో అతడు
బాధ్యతల మోతలో ఆమె..
తనని స్త్రీగా గుర్తించిన కళ్ళు ప్రశ్నించాయి!!
ఏమంటుందామె?

ఓ జీవన సాఫల్యానికై అణువణువు
తహతహలాడుతోందనా..

ప్రాయాన్ని పరిచి వెన్నెల చేసినా
ఎంగిలి చేసి కాటేసిన ఆ చీకటి వెన్నంటే ఉన్నందున..
ప్రేమించలేక పోయిందనా!

బాటన ముళ్ళు పరచుకున్నప్పుడు
అనుభవాలు ఆచి తూచి
అడుగులు వేయమని సూచిస్తుందనా!

కళ్ళెదురు పూలవనం చూపులకే తప్ప
ఆస్వాదన ఓనాటి మధురిమగా మిగిలిపోతుందనా!
మభ్యబెట్టిన కట్టుబాట్లు
మనసు మూలల్లో మెదలుతున్నాయనా!

ఇవన్నీ బహుశా అతడి ఆలోచనలు
ప్రశ్నార్థకాలై ఆమె చూపులను వేలాడేసాయి

రాటుదేల్చిన జీవితాన్ని సుతారంగా బుజ్జగిస్తూ
ఆమె మేను ఎన్నివసంతాలను శిశిరానికి పంచేసిందో
మనసున ఉబికి వచ్చే ప్రేమఊటలు లేకపోలేదు

వాటిని దిగుడుబావి మెట్ల కిందనే అణిచేసిన
కారణాలు అడుగడుగునా తారసపడుతున్నాయి

తన హృదయానికి అంటిన చూపులకు
సమాధానమై చెప్పకనే చెప్పింది
ఆ చేయి ఈ చేతిమీద వాలిన భరోసా
కాలాన్ని చిత్తరువు చేసే విద్య తెలిసింది ఇద్దరికీ

ఆ స్పర్శ అతడికి కొత్తే కానీ మొదటిది కాదు
ఆమె మేను ఎన్నోమార్లు పులకరించినా
ఇచ్చిపుచ్చుకోవడంలో మధురిమ
ఆనాటికి కానీ తెలియలేదు.

ఆ తడి స్పర్శ రెండు మనసుల్ని
గమ్మత్తుగా హత్తుకున్నప్పుడు
ఇక అతడు ఆశించాల్సింది లేదు
ఆమె పంచాల్సిందీ మిగిలిలేదు

ఆంక్షలపై సంధ్యాకిరణాలు ..ప్రతిఫలించినా
కాంక్షలపై వెన్నల గాలులు ప్రసరిస్తున్నా..
కాలం కొత్తగాయాల్ని గేయాల్నీ రచిస్తున్నా
వారెప్పటికీ విడిపోరు

కలిసుండడానికి నిర్వచనాలు వెతుక్కుంటున్న
నాలాంటి కొందరికి..
ప్రేమదారులలో ఒకరిలో మరొకరిని నింపుకుని
ఎప్పటికప్పుడు.. ఒక్కరుగా కనిపిస్తుంటారు.

= 23.3.16=

RTS Perm Link

No responses yet

Mar 21 2016

|| lex terrae ||

Published by under my social views

[c

Hungarian Prime Minister Viktor Orban delivers a speech during a ceremony celebrating the national holiday, the 168th anniversary of the outbreak of the 1848 revolution and war of independence against the Habsburg rule at the Hungarian National Museum in Budapest, Hungary, Tuesday, March 15, 2016. (Tamas Kovacs/MTI via AP)

Hungarian Prime Minister Viktor Orban delivers a speech during a ceremony celebrating the national holiday, the 168th anniversary of the outbreak of the 1848 revolution and war of independence against the Habsburg rule at the Hungarian National Museum in Budapest, Hungary, Tuesday, March 15, 2016. (Tamas Kovacs/MTI via AP)

వాళ్ళని విడివిడిగా పాలకులు, పాలితులు పశువులు అంటారు
పాలకులు పాలితుల్ని పశువులుగా చూసే దాన్ని
కప్పి పుచ్చడానికి ఏనేలనైనా ఓ చట్టం ఉంటుంది

ఆ శాసనం పాలకుల మాటై ఉంటుంది
కొందరు పాలితులు పాలకుల్లో చేరతారు
పాలకులు పశువుల్ని పాలితుల్లో కలిపేస్తారు
ఆకలి అనాదిగా ఉన్నదే

కొత్తగా చేరిన పాలకులు ఆకలి కేకల్ని పట్టించుకున్నటే ఉంటారు
పాలితులకీ, పశువులకీ కలిపి తాము తినగా మిగిలినది పెట్టాలని
ప్రతిపాదన చేస్తారు; దానికోసం చట్టం సవరిస్తారు.
కాగితాల మీద మాగ్నాకార్టా రూపుదిద్దుకుంటుంది

అంతా లోబడి ఉండాలన్న తీర్మానం
ఆనాటికి బాగానే ఉంటుంది. నేల అమ్మలా కనిపిస్తుంది.
ఆకలి ఉన్న జీవాలు కొన్ని అక్కడికి చేరుకుంటాయి
అవసరాలు పెరుగుతాయి. ఆకలి బహురూపమౌతుంది

కొందరు ఆకలి తీరడాన్నే స్వేఛ్చఅంటారు, స్వాతంత్ర్యమంటారు
ఆర్తనాదాలూ ఆక్రోశాలు ఎక్కువవుతాయ్
పంచేవాడికి నొప్పితెలుస్తుంది.
ముందూ వెనకా లెక్కలు మొదలవుతాయి

కాలం కదిలిపోతుంది.
ఆధారాలు అందుబాటూలో ఉండవు
ఎవరుముందో పట్టుచిక్కదు
పాలితుల్ని పాలకులు పశువులంటారు

పాలకుల్ని పాలితులు పశువులనుకుంటారు
పశువులు తామే పాలితులనుకుంటాయి
పరిపాలన సాగుతుంది
పైనున్నవాడు కిందవాడ్ని పశువుగానే చూస్తాడు

కిందవాడు పైవాడ్ని పశువుగానే తలుస్తాడు.
మనుషులుగా ఎవరూ మనలేరని అందరూ తీర్మానిస్తారు
కొత్త రాజ్యాంగం రచిస్తారు,
పాలకులు –పాలితులు భుజాలు మార్చుకుంటారు

ఆకలి తీరకుండానే పశువులు ఉండిపోతాయి.
అరుపులు వినిపిస్తూనే ఉంటాయి.
కొన్ని చోట్ల పశువులుగా చలామణిలో ఉన్నవారిని
కాందిశీకులు అని కూడా అంటారు.

కానీ..
పొట్టపట్టుకుని వచ్చినవారిని
ఉగ్రవాదులతో పోల్చడం
శాంతికి శత్రువులను చేయడం
ప్రధాని నోట ఒక్క హంగెరీలోనే అందరూ వింటారు

=21.3.2016=

RTS Perm Link

No responses yet

Mar 19 2016

యశస్వి || లోకాభిరామాయణం ఎందుకంటే..||

Published by under my social views

ECVPF

మిత్రా facebook లో friend అయిన ముస్తఫాని
అమాయకంగా అడిగింది..
మనల్ని పట్టి పీడిస్తున్న సమస్యలేమిటని!!

ముస్తఫా offline లోకి వెళ్ళీ..
internet refer చేశాడు.
కాసేపాగి ఇలా text చేసాడు

“ఎవర్ని అడిగినా ఒక్కోపదమే చెబుతారు..
ఆ పదం వెనక మర్మం మూలం కనుక్కోలేరు..
జనాభా సమస్యంటారు.. జనుల అహమని చెప్పరు
తప్పుల్ని దిద్దుకోలేని తనమని ఒప్పుకోలేరు,

రాజకీయమంటారు. రొచ్చుగుంట.. అని దూరముంటారు.
పులులన్నీ వెనకనుండితోడేళ్ళ పాలనని తిడుతూ ఉంటారు
సంప్రదాయాలమీద ప్రేమ పెంచుకుంటారు.
పిల్లుల్ని స్థంభానికి కట్టాకే ప్రవచనాల్ని వింటారు

గొప్పోడిమాటే వింటారు, అదే గౌరవమంటారు,
గద్దించినోడే గొప్పోడంటారు,
అజమాయిషీని ఎప్పుడూ అందిపుచ్చుకోకుంటారు
ఏ ఉపద్రావానికైనా ఉగ్రమైపోతారు,

కపటత్వపు ఆలోచనలకు దూరం పోలేరు.
సదాచారమన్నదాన్ని చేతల్లో పొందలేరు
కొందరంటారు నిరక్షరాస్యత ఓ సమస్యని;

ఆర్థిక నిర్లక్ష్యం అంతకన్నా పెద్దది,
అప్పులపాలై కుదేలవుతారు;తేరుకోలేక
రాలేని దారులలోకి ప్రయాణం సాగిస్తారు,

కపటానికి మొగ్గుతారు,
మోసంలో మగ్గుతారు
అపనమ్మకాన్ని హత్తుకుంటారు
ఆపదల్ని ఎత్తుకుంటారు.

సాగు పట్టుబడిందని కల్పనలో ఉంటారు,
అన్నం పుట్టించే కళని వృత్తి అనుకుంటున్నారు,
వాణిజ్యానికై వ్యవసాయాన్ని తాకట్టుపెడుతున్నారు.

చట్టాల్ని కాదంటారు, ఎవడి న్యాయం వాడిదంటారు,
కాలధర్మాన్ని బట్టి సవరణలు తప్పంటారు.
ఎందుకంటే వాడి గురించితప్ప ఎవడికీ ఏదీ పట్టదు,

కాలం కూడా కొత్త మనిషిని కనిపెట్టదు.
పైసలున్నవాడు ప్రజల మనిషినంటాడు,
సొషలిజం వల్లిస్తాడు.. వ్యాపారానికో వ్యవహారానికో రెంటినీ వాడేస్తాడు

నాయకత్వం నిద్రపోతుంది,
అధికారం అలసత్వాన్ని అలవరచుకుంటుంది
కూడెట్టని కులాన్ని,
ముద్దెట్టని మతాన్ని కప్పుకుని..
మానవత్వం మసుగుతన్ని నిద్దరోతుంది…”

మిత్రా అతని అవగాహనకి అబ్బురపడింది..
మనమే ఏదోకటి చేద్దాం ముస్తఫా! అడిగింది.
ముస్తఫా రొట్టె మిత్రా తేనెలో పడింది..

నే కలిసినప్పుడు Shake hand ఇస్తావా!!
ఆదివారం I max కి సినిమాకెళ్దాం రా! అన్నాడు..

=19.3.2016=

RTS Perm Link

No responses yet

Mar 17 2016

Yasaswi Sateesh || 2045 Initiative||

Published by under my social views

11

ఇప్పుడేదో గొప్పగా ఉన్నానని కాదు;
మనిషితనంలో తక్కువేం లేను.
అందరికీ ఉన్నట్టే కొన్ని నాకు…

చమట చుక్కలు, కన్నీళ్ళు
రూపాంతరం చెందిన
సంభోగానంతర రేతస్ఖలన కణాలు
ఇంకా ఈ నేలన మిగిలున్న ఋణాలు

మరి నా మెదడు మరమనిషితో అనుసంధానిస్తే
మరణించాక కూడా నే బ్రతికి ఉన్నట్టేనా!!
నా జైగోట్ తో ఉద్భవించిన క్లోనింగ్ ప్రతిరూపం
అసాధ్యంగాక సాకారమైతే ఆ సదరు స్వరూపుడు నేనన్నట్టేనా

మూలాల్ని మరచి విన్యాసం చేస్తున్న లోకంలో
నే మర్త్యుడినా కానా!
వంటబట్టిన సిద్దాంతాలను నమ్మకాలుగా మార్చి
ముందుతరానికి మనుధర్మంలా అందిస్తానా!

ఏతావాతా పోయాక పైనుండడం నిజమైనా
పుట్టబోయే క్లోనింగ్ ముద్రా రాక్షసుల;
ఆవిష్కరణ కాబోయే నియో మానవతామూర్తుల
తప్పులకి ఏ చిత్రగుప్తుడు చిట్టా తయారు చేస్తాడు
శాఖా కార్యాలయాల్ని ఎక్కడనుంచి నిర్వహిస్తాడు!

మిత్రులారా! మన్నించండి నన్ను
అర్థాంతరంగా కూత ఆపేసి
తొడగొట్టి బరిదాటడానికి రాలేదు
ఇక్కడ కూతలాగే ఎవడి ఆట వాడిదే

నేను నాతోనే ఇంకా జట్టు కట్టలేదు
బలవంతాన ఆడాల్సిన ఆటలో
బరిలోనా బయటా నాలాంటి నన్నే ఉంచితే
నాతో నేను ఎలా ఆడుకోవాలి

ఎవరు ఎవరికి ప్రతిక్షేపం
ఎవరిఓటమికి ఎవరి గెలుపు ప్రత్యామ్నాయం

నాకిపుడు నాతోనే మాట్లాడాలనిపిస్తుంది
నాకు నేను తర్ఫీదు ఇచ్చుకోవాలనిపిస్తుంది
ఏ కారణం చేతనైనా శాశ్వతంగా ఉండిపోతానేమో అని
భయమేస్తుంది.

జీవితేచ్చ ఇంకా మిగిలే ఉంది
అయినా సరే ఓ బ్రతుకు బ్రతికాక
అందరిలానే బంధాల్ని వదిలి వెళ్ళలేని బాధని
అనుభవిస్తూనే పోవాలి
తేలిగ్గా వదలలేని తెంపరితన్నాన్ని
చావు ముంగిట ప్రదర్శించాలి

నేనన్నవాడ్ని ఏలోకంలోనైనా నేనే ఉండాలి
నా తరువాత నేను నైరుప్యంగానే నిలచిపోవాలి
నన్ను తప్పొప్పుల చిట్టాగానో,
అనుభూతుల ఘాట్టాలుగానో గుర్తుంచుకోవాలి

పువ్వునూ, పిట్టనీ, పిల్లనూ, నవ్వునీ
ప్రేమించే మనసు అందరిలానే వీడికీ ఉందని
అందని ద్రాక్షల కన్నా..
అందుకున్నసీమసింతకాయలంటేనే మక్కువ చూపాడని
ఎవ్వడో ఒకడు నా గురించి రాయకపోడు

నా రాతల్లోంచి మీ మాటల్ని వెతుక్కుంటున్నప్పుడు
మరో యశస్వి రాకపోనూపోడు
అయినా సరే అక్షరాలతో పలుకరించే నాకు
అక్షరాలలోనే బ్రతికే జీవితం కావాలి

కవిత్వానికందని భావనేదో
తెమ్మరెలై నా తలపులను తరలించుకుపోవాలి
మనసు మిగిలిపోయి మనిషిగా..
ఏదో ఒకనాడు తెరమరుగైపోవాలి

=17.3.2016=
మనిషిని శాశ్వతంగా బ్రతికించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు పేపర్లో చదివి.. నవ్వుకుని..

RTS Perm Link

No responses yet

Mar 15 2016

యశస్వి ||అమ్మ చీర||

Published by under my social views

65_page1

ఏ వంటకో, ఇంటిపనికో అమ్మ అంకితమైనప్పుడు
నన్ను ఉయ్యాలలూగించిన నిద్ర భరోసా
నాన్నఆ చేతిని వదలకున్నా
మరోచేయితో కలిసి దూలానికి ఊగేది అమ్మచీర

నన్ను నేలమీద పడకుండా
కాపాడిన అమ్మచీరే
నా వెన్నుకు పరుపయ్యేది
తలకు దిండయ్యేది

పాలకక్కుల గుడ్డయ్యేది,
మొలకింద మెత్తని గోచీగా మారేది
నలుగు తానాల వేళ తడిచేది, మురిచేదీ,
తుడిచేది, మడిచేదీ అమ్మచీరే

శ్రమ చిందిన చుక్కలు ఆ వంటినుంచి
ఈ చీరకంటే సౌరభమయ్యేవి

ఆ మత్తులోనే నా శైశవం సుస్తుగా నిద్దరోయేది
అడుగుల తడబాటు రోజుల్లో
మోకాళ్ళకు మెత్తగా మారిన అమ్మచీరే

సైకిళ్ళాటల రోజుల్లో
కొట్టుకుపోయిన కాళ్ళ రక్తాన్ని పీల్చేసి
దూదిపింజగానూ, గాజుగుడ్దగానూ
మారిపోయేది

నెత్తుర్నీ రసినీ గాయాలతో ఎత్తుకుని
హత్తుకునేది అమ్మచీరే
నాకోసం ఏడ్చే కన్నుల్ని ముక్కునీ తుడిచేదీ అమ్మచీరే,

నాకు భయమేసినప్పుడల్లా
నను దాచేదీ, ఆకలేసినప్పుడల్లా ముడివిప్పేదీ
అవసరానికి డబ్బుముడిగా బొడ్డున దోపబడేదీ అమ్మచీరే.

నవరసాల్ని పండిమ్చుకున్న ఆ అమ్మచీరే
వందలమంది ముందర నే రంగస్థలమెక్కి వీరంగమౌతున్నప్పుడు
నా అడుగులకు లయబద్దంగా నాట్యం చేసింది
వంటి చెమరింతల్నిపీల్చుకుంది

నా వెన్ను కింద ఆహార్యమై
వడిసిపట్టింది అమ్మచీరే

చదువులకై ఇంటిని వదిలెళ్ళిన రోజుల్లో
నా రహస్య వేదననూ, నిశీధిరోదననూ తనలో ఇముడ్చుకునెందుకే
నా దిండు పైకి చేరుకుని
నా గుండె కింద పరచుకున్నదీ అమ్మచీరే

నాతో పెనవేసుకున్నరాగ బంధం
అది అమ్మ మేను సుగంధం
ఎప్పుడైనా అమ్మకు ఓ చీర కొందామనుకున్నా
అంగడి మొత్తం మీద అమ్మకానికి దొరకనిది
వెతికి పట్టుకోవడంనా వల్లకాదని తేలిపోయింది
అమ్మ చీరకు ప్రత్యామ్నాయం లేకపోయింది

చీరలు వాడినవి కొన్ని కనిపిస్తునే ఉన్నాయి
అవి మాత్రం అలుపెరని అమ్మలా
ఏ వంటగదిలో మసిగుడ్దగానో
కిటికీకి తెరగానో తమ పనిని చేస్తునే ఉన్నాయి

ఏదోనాడు ఓ చీరకొంగు కరుకుగా తగిలినా
అది నాకు అమ్మచీరనే జ్ఞప్తికి తెస్తుంది
నా కళ్ళ తడిని రహస్యంగా తుడుచుకుని
ఆ కొంగునూ మెత్తగా మారుస్తాను

నా తడిని పీల్చిన దేదైనా ఇట్టే అమ్మచీరైపోతుంది
అక్షరాలైనా, అమ్మడైనా అందమైన స్పందనైనా
అమ్మకాని అమ్మాయి నా జీవితాన లేదు
నచ్చిన ఏబొమ్మతోనైనా అమ్మచీరే పంచుకున్నాను

ఎవరేమనుకున్నా నేనెప్పటికీ
అమ్మచీరతోనే ఉంటాను
ఎదుట ఎవరున్నా
అమ్మచీరనే కళ్ళకు కట్టుకుంటాను

=15.3.2019=
ఓ వార్త చదివాక…
అమ్మాయిలే అమ్మచీర అనుభూతులు పంచుకోవాలా! నేను కాదా!! అనిపించి
‪#‎inmymotherssari‬

RTS Perm Link

No responses yet

Mar 14 2016

యశస్వి|| ఆఫ్రిదీ! I love you..!! ||

Published by under my social views

afridi-1

గుండె చప్పుళ్ళూ.. గీపెట్టే కీచురాళ్ళైన ఖండాంతరాల్లో
అదేదో ఆట మాత్రమే కాదు; మతం కూడా!
నువ్వటు, నేనిటు
అయినా నీపై నా ప్రేమ ఎన్నడు తగ్గదు

ఆటలో ఎప్పుడూ నాదేశమే గెలవాలనుకున్నా
నువ్వు పోరాడనిరోజు
గెలుపు మధురిమను
ఆస్వాదించిందీ లేదు.

ఏదో ఈనాడు అన్నీకుదిరిన విజయాలు ముందున్నా
నీతో తలపడనిరోజు
అసలు ఆట ఆడామా అని..
అనిపించకమానదు

భారతం లో లేనిది ఎక్కడ ఉన్నా లేకున్నా
దాయాదుల వైరం
ఆటలోనే అన్న సూత్రం
మనకు ఆదర్శనీయం కాకపోదు

భారత్ అంటే ఎందుకంత భేధభావమని
నువ్వడిగావే! మీ మీడియాని!! ♥
అది నేనూ ఇటువైపు
అడుగుతున్నాను.

వ్యాపారం రెండు దేశాల మధ్య ఎంత పెరిగితే
అంత శాంతీ- సుస్థిరత పెరుగుతాయని
లాహోర్ యూనివర్శిటీలో
హెన్నా రబ్బానీ! ఎంతందంగా అన్నది!

మా వాళ్ళకు తెలియని విషయాల్లో
ఒకటి జనపనార ధాన్యం సంచి
అది పెద్దమొత్తంలో
మీ నుంచేగా ఈ దేశానికి వచ్చేది!!

ఈనాడు వ్యాపార రంగంలో
మనమిద్దరం ఒకదానికొకటి
మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అని
ఎందరికి తెలిసేది!!

కొండదారి కైబర్ బోలాన్ ని
అత్తార్-వాఘా సరిహద్దు భర్తీ చెయ్యలేదా!
ఉల్లిపాయలే మీరిస్తే
ఆనాడు ప్రభుత్వాలే పడిపోయేవా!!

అప్పుడప్పుడు నాయకుల అలాయ్ బలాయ్ లు
టీవీల్లో ఆటలసందడి
కొండకచో ఉన్మాదఘటనలు
ఇవేగా ఇప్పటికి మా పాకిస్తాన్ అనుభూతులు

మీకేమో షాదీఖానాల్లోబాలివుడ్ పాటలు
అప్పుడప్పుడు క్రాస్ బోర్డర్ పెళ్ళిళ్ళు
మాకు దొంగదారిన వచ్చే
మీ కర్జూరప్పళ్ళూ

ఎన్నెన్ని కలగాపులగం మనకు
ఉగ్రవాదాన్ని వదిలేస్తే
ఎంత ప్రశాంతత ఇరుదేశాలకు
నీ మాటలు కొందరికైనా మేలుకొలుపు

నీ దగ్గరున్నదీ, నాదగ్గరున్నదీ
ఒకేరకం అణుబాంబు
ఒకర్ని ఒకరం చంపుకోలేమన్నది
లోకం వాక్కు

ఇంకెందుకు గొడవ! ఆటలో నీ తెగువ చూపించు
నీ జెండా నే ఎగరేసి జైల్లో కూర్చోలేను; కానీ
నీకు ప్రేమ పంచిన మా దేశం అమ్మాయి ఆర్షిఖాన్ లా
నీ ఆటకు సలాం చేసి నీ మాటకు ఐలవ్యూ చెప్తాను.
=09.03.2016=

Why Pakistan Always Against India.by Afridi

RTS Perm Link

No responses yet

Mar 03 2016

యశస్వి ||~~రెండు 54లు = వందేళ్ళ దీవెనలు ~~||

Published by under my social views

marasani yakoob

నాకిద్దరు స్నేహితులు
ఒకడు మరొకడు అంటానికిలేదు
ఇద్దరూ నా మనసు నింపారు
వాళ్లెప్పుడో వ్యక్తి పరిధుల్ని దాటి పోయారు

అయినా ఇక్కడ అనకతప్పదు
ఇద్దర్నీ ఓ గాటిన కట్టి జీవితాన్ని నెట్టేస్తున్నా
కాకతాళీయం ఏమిటంటే..
కట్టకట్టుకున్నట్టు.. ఇద్దరూ ఒక్కరోజునే పుట్టారు.

ఒకడు యాకూబ్ -ఒక యాభైనాలుగేళ్ళపిల్లాడు
(¯`•.¸.•°*°•.★.•°*°•.¸.•´¯)

ప్రవహించే జ్ఞాపకాల్లోంచి సరిహద్దు రేఖను దాటి
ఎడతెగనిప్రయాణం చేస్తూ కవిసంగమాన్ని కనుగొన్నాడు
నదీమూలంలాంటి ఇల్లుని చేరుకున్నాడు.
సూఫీఘర్ అనే కవితా పీఠానికి క్షేత్రపాలకుడు

భక్తుల కోలాటాలను ఓ కంట కనిపెట్టాలని
నిత్వకవితాయజ్ఞాన్ని మాపరంచేసాడు
పచ్చతోరణాన్ని బంగారు వాకిలికి కట్టి
మాసోత్సవాల్ని, సాహితీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటాడు

నల్లకలువల్లాంటి అక్షరాలతో ఆత్మకధల్ని నివేదిస్తాడు
వచనకవిత్వ దేవత కంఠాన్ని అలంకరించిన సంపెంగమాల
తోటిపూలతేనెచుక్కలతో కలిసి భవభావసాగర మధనం చేస్తాడు
కల్లోలకెరటాలతో చిందులేసినా, ఆనందతీరాల విందులు చేస్తాడు

ఒక్క తేనీరు చుక్కకే స్నేహం మత్తెక్కే మత్తేభం
కవిత్వపు చిట్టడివిలో తత్వగానాల శార్దూలము
తన కవితాపాదాలతో ప్రాణాల్ని కట్టిపడేసే మధ్యక్కర
ఛాందసత్వాన్ని కాదన్న కవిరాజవిరాజితం ఈతని జీవితం

తెలంగాణలో పల్లెలు సాహిత్య కేంద్రాలుగా ఎదగాలని
మనిషితనం చుట్టూ కవిత్వ కవచాన్ని తొడగాలని
ఎల్లలులేని సాహిత్యోపాసనకు తెలుగునేలన నడుంకట్టాడు
ఇప్పుడు బొడ్డూడిన బుడ్డోడు కూడా ఈదారినే నడుస్తున్నాడు.

*************************************************************
మరొకడు
మారసాని విజయ్ బాబు-మరో యాభైనాలుగేళ్ళపిల్లాడు
(¯`•.¸.•°*°•.★.•°*°•.¸.•´¯)

నాలో పొటమరించే సందిగ్ధాల సరిహద్దు రేఖలను చెరిపేసి
నాలో విశ్వమానవుడి ఆనవాళ్ళను కనుగొన్నాడు
ఎడతెగనిప్రయాణం చేస్తూ మంచితనాన్ని కలుపుకుని పోతున్నాడు
సమాజాన్ని ఊపిరి చేసుకుని సామాన్యుడి సంతోషానికై తపిస్తున్నాడు

ఒకానొకప్పుడు, అనుభవాన్ని మేధస్సును పణంగాపెట్టి
కొత్తగీతలు అన్న జీవితాన్ని కథరూపంలో కన్నాడు
తుపాకీ అవసరం రాని సురాజ్యం సాధ్యమే అన్న మాట విన్నాక
అరుణతారమీదొట్టు.. అన్నలు ఆ పుస్తకాన్నే చదవొద్దన్నారు

తెల్లకలువల్లాంటి ఆలోచనలతో స్నేహమయుల్ని ఆకర్షిస్తాడు
ప్రపంచ సాహిత్య సౌరభాలతో సంభాషణల్ని పరిపుష్టం చేస్తాడు
ఒడిదుడుకులకు లోనైన ఏ మనోసంద్రమేనా ఇతని కనుసన్నల్లో
ప్రశాంత స్మిత సమీరాల సాంత్వన ను అనుభవించ వలసిందే

ఈ నగుమోము నే నీజగాన ఒంటరినికాదని ఆశ వెలిగించింది
ఆ నిండైన రూపం నన్ను నేను కనుక్కునేందుకు దారి చూపింది
వ్యధకాదు ముందడుగు ప్రధానం అనుకున్న ఆచరణ ఇతనిది
పల్లె పల్లెనా వెలుగులు నింపే స్వయం ఉపాధి క్రతువితనిది

అవయవ దానం చేసాడనో, కొందరి బరువును దించాడనో మాత్రమే
ఈ ఒకేఒక్కడు గొప్పవాడు కాలేదు.

మేమేనాడూ వెలలేని సంతోషాల్నితప్ప పైసా సుఖాల్ని పంచుకోలేదు
నా మిత్రుడు విజయ్ బాబు అందరిలాంటోడు; అయినా కానీ
నా గుండె బరువెక్కినప్పుడు ఒక్క తలపుతోనే తేలిక చేస్తాడు.

*****************************************
ఓ పుట్టిన రోజు పిల్లలూ!
నా గుండెనిండిన అన్నలూ!!
ఈ ఒక్కరోజే మీ గురించి రాస్తున్నాను.

మీరు పరచిన బాటన క్షణక్షణం జీవిస్తున్నాను..
మీ ఆశయాలను మోసుకు పోవాలని తపిస్తున్నాను.

Kavi Yakoob Marasani Vijayababu
= 02.03.2016=

RTS Perm Link

No responses yet

Mar 01 2016

యశస్వి || ప్రేమాకాశాపు తలపుల్లో.. ||

Published by under my social views

girl graphy )

యశస్వి || ప్రేమాకాశాపు తలపుల్లో.. ||
(¯`•.¸.•°*°•.★.•°*°•.¸.•´¯).
మొట్టమొదటగా నన్నెత్తుకున్నది..
మిస్సమ్మ ఆసుపత్రిలో పనిచేసిన ఓ నర్సమ్మ,
చంద్రశేఖరుడే తన బిడ్ద కడుపున పండాడనుకున్న..అమ్మమ్మ
పొలమూరు తాడాల సత్యవతమ్మ,
నా అల్లరికి మురిసిపోయి అలసిపోయే గిరమ్మ ,
నను కని పెంచి భరిస్తున్న యశోదమ్మ

గుండ్రంగా ఉన్నానని చపాతిగాడంటూ దిష్టి తీసేది విద్యపిన్ని,
పుట్టగానే తన పాలు పట్టి ప్రాణాలు నిలబెట్టిన నరసాపురం బేబత్త,
చస్తే మోయాల్సినోడు వాడే నని నాదన్ను నిలబడి
చదివించిన నా పెద్దమ్మ సూర్యావతమ్మ,
కాకినాడలో మూడోబిడ్డలా సాకిన లక్ష్మి చిన్నమ్మ, ఫణీబావక్క

పద్మక్కంటే ఎంత ఎక్కువంటే
నా జేబులో తన బొమ్మ గుండెకు నిరంతరం తగిలేంత
నిన్ను చూసే సీతారామయ్యగారి మనవరాలు
సినిమా తీసారని గొడవాడేంత,
పర్యావరణశాస్త్రంలో పిహెచ్ డీ పొందటమే తేలికంటూ
బిడ్డని కన్నాక నెలరోజులు బ్రతకటం కష్టమైన కన్నీటిచుక్క

వీరు ప్రాతఃస్మరణీయులు కాదు,
నా ప్రాణం పోయేముందు కళ్ళముందు కదలాడేవారు
*
మహారాష్ట్ర బస్మత్నగర్ లో నన్నెతుకు తిరిగిన దాదూ,
నాతో వేలు కొరికించుకున్న హుస్సేన్ అంకుల్ పాపసోనీ,
కాకూ! సతీష్ లా..దే..! అని ఎత్తుకెళ్ళే ఉప్పలప్ప దీపక్క,
ఒకే మంచం మీద నాతో ఆడుకున్న సుబ్బరాజంకుల్ పాప,
అమ్మతో కలిసి పెరిగిన రాజులమ్మ సుబ్బారాయుడు పిన్నీ
మీరంతా ఎక్కడున్నారో ఏమో! గుర్తొస్తారు నాకప్పుడప్పుడు

నా అల్లరి భరించ వల్లకావట్లేదని అమ్మ విసుక్కుంటుంటే
వీడికన్నా బుద్దిమంతుడు ఉండడని నన్ను ఎత్తుకు ముద్దిచ్చిన రాధాటీచర్
ఆమె చెయ్యట్టుకుని పద్మా కాన్వెంట్ కు నే రోజూ నడిచి వెళ్తుంటే
నాలుగో క్లాస్ వాడిపైనా ఆ కాలపు కుర్రాళ్ళంతా కుళ్ళుకునేంత
అప్పట్లో నాకు ఆరాధన బచ్చలి భానుమతి మీద;
సెకండ్ వచ్చానంటే ఆ పిల్ల వెనకాలే ఉన్న భావన

ఇంటికొచ్చాక నాతో ఆడుకునేది కప్పల తనూజ
సెలవొచ్చిందా తనతోపాటే జ్యోతి కాన్వెంట్ కే వెల్లేవాడ్ని ఎంచక్కా
ఆడపిల్లలతో కూర్చొటానికి సిగ్గేసి ఓ రోజు రాజమౌళి పక్కన నక్కా
నువ్వు చెప్పాకే తెలిసింది. నీకన్నా పద్మశ్రీ సారు ఎక్కువేం కాదక్కా!!
తణుకొచ్చాక జానీ అహ్మద్ గారి పాపలు మున్నీ సురయక్కా!
ఎన్ని హిందీ సినిమాలకి తోడొచ్చాను మీతో అంకుల్ కి తెలియకుండా

ఆకివీడు లో హైస్కూలు మొదలు; నాకిష్టం క్లాస్మేట్ ఫరాబాను
ఎక్కడున్నావో ఏమో నిన్ను ముట్టుకోవాలని ఎన్నిసార్లు కొట్టాను!!
సరే! క్లాస్ లీడర్ గా నీకు సారీ చెప్పాలి ఆ తరువాత మళ్ళీ మొట్టాలి
మీ ఆయనకీ పిల్లలకీ ఎపుడోకపుడు మన బాల్యాన్ని పరిచయం చెయ్యాలి

జ్యోతిబాలమందిర్ ఖమ్మంలో కె. అనురాధ, కె. శ్రీదేవి, మమత..
మొజాహుద్దీన్ గాడు నీతో మాట్లాడుతున్నానిని నన్ను కొట్టాడు అనురాధా!
అన్నట్టు మీ ఇంట్లో అంతా ఆడపిల్లలే కదా, ఇంటికొస్తే తమ్ముడొచ్చాడన్నారంతా
ఎక్కడున్నావో తెలిస్తే బాగుండ్ను నీతో రాఖీ కట్టించుకుందామనుకున్నా
పదోక్లాసులో సంస్కృతం మాస్టారు అమ్మాయి గాయత్రి, ఎంత చక్కగా ఉండేదో
మొన్న కనిపించినప్పుడు జుట్టంతా పండిపోయింది. మనసెంత చివుక్కుమన్నాదో!

డిగ్రీలో భారతి, యూత్ ఫెస్టివల్ లో నాతో కలిసి డాన్స్ చేసింది.
మిస్ తణుకు మాధవీ!! నీమీదే కదానే కవిత్వం రాసింది!!
అర్జునుడుపాలెం ధనలక్ష్మి, పెళ్ళిచేసుకోడానికి టైం కావాలంటే
ఎదురు చూసి- చూసి డిగ్రీ ఫెయిలయ్యి వాళ్ళ బావనే పెళ్ళిచేసుకుంది
కాకినాడ భానుగుడి సెంటర్ లో స్వీట్ షాప్ పక్కన టెలిఫోన్ పాప
నీ కళ్ళు చూసి ఎన్నిరాత్రులు నిద్ర మానేశానో కదా!

ఈ మధ్యలో కొన్ని కథలు.. అవి చర్వితచర్వాణాలు,జన్మానుగత ఋణాలు,
మరికొన్నినను విడిచి వెళ్ళిన విస్మృతికిరణాలు
అయినా ఎందుకీవేళ మీపై ఈ తలపులు!!

ముందుంది.. మహిళా దినోత్సవం అని లోకమంతా అంటున్నప్పుడు
నా స్మృతిపథం లో మీరంతా మెదులుతున్నారు
కళ్ళముందు నడయాడే ఆకాశపు సగభాగంల్లోంచి
నిత్యం నాపైన ప్రేమజల్లు కురిపిస్తూనే ఉన్నారు.
(¯`•.¸.•°*°•.★.•°*°•.¸.•´¯).
=01.03.2016=

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa