Archive for February, 2016

Feb 27 2016

యశస్వి || నాదేశం.. ఓ పూల చెట్టు ||

Published by under my social views

kondagogu

పసుపుపూల చెట్టుకో ఎర్రపూవు పూచింది
అంతలోనే తన రంగు చూసి అనుమానం లేచింది
పొరపాటున నేను ఈ మట్టిలోన పుట్టానని
కలిసున్నా మీరు నన్ను విడదీసే చూస్తారని

వదిలేస్తే తనమటుకు స్వతంత్రంగా ఉంటానని
అందంగా ఊగుతూనే బింకంగా చెప్పింది
పూలు కొన్ని నవ్వాయి, తల్లివేరుని అడిగాయి
పిల్ల అనే మాటల్లో మర్మమెంత ఉందోనని

రాలుపూల పిల్లల్ని మోసి ఉన్న తల్లికదా
మాట విన్న వెంటనె ఒల్లుజలదరించింది
దుఃఖమెంత వస్తున్నా మాట తమాయించింది
ప్రేమతోనె పిల్లల్ని ఇలా పలుకరించింది

మీరు లేని రోజుల్లో మాట ఒకటి చెబుతాను
మొక్కలా నేనప్పుడు ఆకులనే కన్నాను
నేలతల్లి సారాన్ని నీళ్ళతోటి పీల్చాను
మొగ్గతొడిగాకే నన్ను నేను కనుగొన్నది

ఏరంగో ఏమిటో లోకమంత పచ్చ నాకు
పూలమొక్కని అంటారని నన్ను నేను విన్నది
తోటలోన నాలానే మొక్కలెన్నో ఉన్నవి
గాలిపలకరింపులే తప్ప నడిచినే వెళ్ళలేను

ఏ పిట్టో ఏ పురుగో వచ్చి నాపై వాలేది
పక్కమొక్క కేసరాల పుప్పొడిని రాల్చేది
బలమైన పూలని రంగు రంగు బాలల్ని
అందంగా కంటున్నా నందుకే”.. అన్నది

ఎర్రపువ్వా! ఏమయింది నీకసలా
నీచుట్టూ పసుపుంటే గొప్ప నువ్వు కాదా!
ఏదోరోజు అందరూ రాలిపోయెవారేగా
రంగు మరచి పువ్వువని మురిసిపోవేలా!

ఎవరోఒకరు ఎపుడోకపుడు దూసేస్తారు
దండకోసమో పూజకోసమో మోసేస్తారు
అయితే మాత్రం మమ్మల్నిపుడే వదిలేస్తావా!
పరోపకార పరమార్థానికి విడిపోతావా!!

నువ్వెక్కడున్నా నిన్ను పువ్వనే పిలుస్తారు
గంధాన్ని బట్టే నీ పేరు జపిస్తారు
నువ్వు పుట్టడానికో కారణముంది
అది తెలుసుకున్నాకే మాకు వీడ్కోలు తెలపాలి

నీలాంటి పువ్వుల్లో నువ్వొకత్తవే లేవు
అలా ఉండడం వల్లే నువ్వు నువ్వుకావు
నీకు నువ్వే శత్రువ్వి అవుతావ్
కలిసి ఉంటేనే నీ గొప్పని అందరం ఒప్పుకుంటారు

నీలానే నేనూ మూలాల్ని మరిస్తే
ఈ గాలి నన్ను మోసుకెళ్ళిపోయేదా
నీరు-నేల నన్ను నిలవనిచ్చేనా
వసంతమే తరలొచ్చి మన ఇంట విరిసేనా

ఓ చిన్నారి పువ్వా, చెరగని చిరునవ్వా
నీతల్లి ఇల్లూ, నీతోట ఊరు
నీరంగు ఏమైన నువు గోగుపూవు
వెన్నెల్ని కురిపించే పనిమానుకోకు

ఏ గాలి నిను మోసి ఏ కోనకెగసినా
ఏదేశమేగినా ఎందుకాలిడినా
నమ్మినదెమైన, నమ్మనివెన్నున్నా..
ఒకే మట్టి నిన్ను నన్ను కలిపి మోస్తుంది

రాలాక చేరాలి ఆ మట్టినే ఎవరైన
మూలాలు మట్టి, కాలాలు మట్టి
మట్టి కణం, చెట్టుఋణం కాదు గాని
నీలోని అణువణువున మూలరూపం మట్టి

మట్టి మాట పక్కనెట్టి
వెయ్యి నువ్వు మాట్లాడు
అయ్యన్నీ అబద్దాలు
నను కన్న మట్టితోడు

తోడపుట్టిన పూలన్నీఅవునని తలూపాయి
అంతలేసి మాటలన్నచెట్టుతో పాటుగా
వీచెగాలి సైతం పాట వంతపాడింది

పంతం పట్టిన పువ్వుకి కోపమొచ్చినట్టుంది
ఇంకాఎరుపెక్కి నన్నిలా చూస్తుంది!!
అలాంటి రంగుపువ్వులను ఇంకా కనాలనే
ఈ దేశం మొక్క ఎదురుచూస్తుంది

=27.2.2016=

RTS Perm Link

No responses yet

Feb 23 2016

యశస్వి || ఎలా పిల్లా!!.. ఇల్లాగా!!||

Published by under my social views

IMG_20150731_184415 copy

కళ్ళలో ఉన్న ఇష్టాన్ని మాటల్లో చెప్పమన్నావ్
తీరా చెప్పాక అతికష్టం మీద ప్రేమ అనడాన్ని ఒప్పుకున్నావ్
ఆ పెళ్ళికష్టాలేవో నన్నేపడమన్నావ్
ఎన్ని నిష్టూరాలు పడ్డాక మనకి ముళ్ళు పడ్డాయనుకున్నావ్!!

వోసోసి రాకాసి పిల్లా!
నువ్విల్లా గొడవాడితే ఎల్లా!!

కట్నాలగొడవలేదు వచ్చెయ్యవే అన్నానా!
తెచ్చుకోకపోతే వడ్డాణానికి అడ్డమని.. నామాట విన్నావా!
తీరా అప్పులు తీర్చే బాధ్యత నానెత్తినే మోయమన్నావ్
నిన్నకాక మొన్నే అమ్మకొంగు వదిలినోడికి అదెంత బరువనుకున్నావ్

వోసోసి రాకాసి పిల్లా!
నువ్విల్లా గొడవాడితే ఎల్లా!!

సరదాగా ఉందామే కొంతకాలమైనా అని చెప్పానాలేదా!
సంవత్సరం తిరిగేలోగా మనవడిని ఇస్తానని మాటెందుకు ఇచ్చేసావ్!!
అప్పుడిలా కొత్త పనిలో నాపై పగబట్టావ్
ప్రతిరూపం నీ ఒడి చేరాకా నన్ను పూర్తిగా పక్కనపెట్టావ్
వోసోసి రాకాసి పిల్లా!
నువ్విల్లా గొడవాడితే ఎల్లా!!

వాడప్పుడప్పుడే బళ్ళోకెళ్తునప్పుడు
ఈలోగానే కొన్న సైకిలు ఇరగ్గొట్టెసాడు
ఇప్పుడు మూడోదీ గేరు సైకిలు.. అప్పుడే రెండోది కొన్నావ్,
బుద్దులుకి నా పేరు అడ్డంపెట్టి నా జీతం మొత్తం కొట్టేస్తున్నావ్

వోసోసి రాకాసి పిల్లా!
నువ్విల్లా గొడవాడితే ఎల్లా!!

ఆఫీసులో బిజీగా ఉంటే ఆ ఫోన్లేంటి!!
శనివారం సాయంత్రాలు లేటుగ వస్తే తప్పేంటి!
హోంవర్కులూ ప్రాజెక్టు లకు ఆదివారం ఉందికదా
నేను సభలూ- సమావేశాలకు వెళ్ళొద్దా?

వోసోసి రాకాసి పిల్లా!
నువ్విల్లా గొడవాడితే ఎల్లా!!

అర్జెంటుగా ఊరెళ్ళాల్సి వస్తుంది,
నీకప్పుడే నాపై బెంగలాంటి అనుమానమొస్తుంది
అరగంటకోసారి ఎక్కడున్నానో చెప్పాలా
బోరుకొడితే గుడికెళ్ళి భజన చెయ్యాలా!

వోసోసి రాకాసి పిల్లా!
నువ్విల్లా గొడవాడితే ఎల్లా!!

నిన్ను మెచ్చుకోవాలని మందిని పిలిచి విందులు చేస్తావ్
మాటల మధ్యన మనుషుల్ని తూకం వేస్తావ్
అదిగో స్నేహితులందర్నీ ఏదో దాస్తున్నారని అనుమానంగా చూస్తావ్
ఇలా ఐతే ఎన్ని తలపోట్లని నువ్ మోస్తావ్ !

వోసోసి రాకాసి పిల్లా!
నువ్విల్లా గొడవాడితే ఎల్లా!!

షికార్లకు కారులేదు,ఉద్యోగాన తీరికలేదు,
ఆస్తి దమ్మిడీ ఐతే అప్పేమో అర్థరూపాయ్
నెలకి ఐమాక్స్ రెండుసార్లు ఎందుకమ్మా!
నువ్వు ఎంతబాగా వండుతావో; ఆ స్వాగత్ బిర్యానీ మానేద్దామా!!

వోసోసి రాకాసి పిల్లా!
నువ్విల్లా గొడవాడితే ఎల్లా!!

ఇంతకు మించి చెప్పానంటే పద్మక్కేమో తిట్టేస్తాది
అబద్దాల్ని అందంగా పేర్చానని తప్పుని నాపై మొట్టేస్తాది..
ఉన్నదాంట్లో సరదాగా ఉందామే పిల్లా
నువ్విల్లా గొడవాడితే ఎల్లా!!

నువ్విల్లా గొడవాడితే ఎల్లా!!

(అక్కా! పద్మాకుమారి .. నవ్వుకోసం…)
=23.2.2016=

RTS Perm Link

3 responses so far

Feb 22 2016

యశస్వి || అక్క.. దొరసానమ్మకు..||

Published by under my social views

11133842_1056954077653774_1879749844690564980_n

మస్త్ మల్లి.. నా వయసోడు..
బాగా చదువుకున్నోడు; ఎదిగినా
పసితనాన్ని ఎప్పుడూ పోగొట్టుకోనోడు
పదేళ్ళకిందటే అన్ని ఖండాల్లో
ఎత్తైన శిఖరాలు ఎక్కేసినోడు

నాకు తెలిసిన ఓ పిల్లాడు
ఎవరెస్ట్ ఎక్కింది మనోడేనని
పేపర్లో రాసేముందే
నాతో మాటాడించాడు

అంటార్కిటికా శిఖరాలనుంచి
మెక్సికో అగాధాల వరకూ
విజయాన్ని శ్వాసించిన
సాహసితో నా సంభాషణ

సముద్రాల నీరు ఉప్పన
పర్వతాల పైన చల్లన కన్నా
జీవదగ్నిపర్వతపు ప్రశాంతత లా ఉన్నా
నిక్కార్సైన అనుభవాల ఉప్పెనని ఆ గొంతున విన్నా

అతడు ఆశకి ఆవేశానికి మధ్య జీవితాన్ని నిలబెట్టి
ఆచరణకి చోటిచ్చే గీతను నమ్మాడు
నేల తల్లి ఆకాశాన్ని ముద్దాడే నగనగాన్నా
మన జాతీయపతాకాన్ని రెపరెపలాడించాడు

మిరిచూస్తే దీవించే ధవళకాంతుల్ని
అరిస్తే నవ్వే కొండలోయల్ని
అడుగుల్ని తుడిచేస్తున్న శీతగాలుల్ని
ప్రపంచపు పైటంచున నుంచునే ప్రేమించాడు

ఒంటరిగా స్వేఛగా ఉన్నప్పుడు
ద్యాసగా గాలిపీల్చడాన్ని ఉపాసించినోడు
వందలమందికి బ్రతుకుపాఠాన్ని ఉపదేశించినోడు
ఓ కొండమీద ఆరోజు వానపాటలో మైమరచిపోయాడు

దమవాండ్ శిఖరాగ్రాన చాక్లెట్ వదిలినంత తేలిగ్గా
ఏరుకు తెచ్చుకున్న రాళ్ళ స్మృతులను వదిలేసి
పెన్న కాలవ కంట కన్నీరై నిలిచిపోయాడు
జీవినగంగాసాగరానికి చేరుకున్నాడన్నారు

తోడబుట్టిన నీకు మాత్రమే తెలిసిన నిజం
వదిలివెళ్ళింది తనపైప్రాణమని
ఆత్మీయుడై తనలో జీవిస్తున్నాడని
అది నిరూపించేందుకే కొండబాటపట్టావని…

ఇప్పుడు తమ్ముడు నడిచినబాటనే నువ్వు ఎగరేసిన బావుటావి
(డాక్టరు వృత్తి, చలువగది జీవితం ఇవ్వని సంతృప్తి)
ప్రకృతి వొడిలో ఉన్న ఆనందాన్నిఅందుకున్నదానివి
చిలీదేశపు చిటారుకొమ్మన ఆగిన ప్రయాణాన్ని
కొనసాగించి తమ్ముడ్ని తనలో మళ్ళీ కనుక్కున్న సమాధానానివి

ఇప్పుడు ట్రెస్‌ క్యూసెస్‌ శిఖరాగ్రపు చల్లగాలి
మీ అనుబంధపు వెచ్చదన్నాన్ని అనుభవిస్తుంది
తమ్ముడే ప్రేరణగా అక్కఆచరణనే లోకమంతా గానం చేస్తుంది

అక్కా!
మస్తాన్ బాబుఎక్కిన శిఖరాలను
మరొకరు అందుకోవడమే అసలైన నివాళి అని చేసి చూపావు
కీర్తిని శిఖరాలకు వదిలేయకుండా
స్ఫూర్తిగా మలచి నిలపాలని పాఠం నేర్పావు

పర్వతారోహణ ఓ ఆటే కావచ్చు
దానికి ఆకాశమే హద్దుగావచ్చు
దిగ్దిగంతాల హద్దుల్నీ చెరిపేసి
నడకమానేసి కూర్చున్న
కోట్లాది తమ్ముళ్ళకు
వెలుగందుకునే కొత్తపుంతలు తొక్కి చూపావు

ఆగిపోయిన చోటనే
ఎవరో ఒకరు మళ్ళా మొదలెట్టాలని..
మరలిపోయిన ఓ సత్యాన్ని మళ్ళా పుట్టించి
ప్రవాహంలో కొట్టుకుపోకుండా
జీవితాల్ని గట్టున నిలబెట్టావు

= 22.2.2016=

RTS Perm Link

No responses yet

Feb 18 2016

యశస్వి||Aphorism||

Published by under my social views

A student shouts slogans even as JNU teachers and students form a human chain inside the campus in protest against arrest of JNUSU President Kanhaiya Kumar on Sunday. Express photo by Oinam Anand. 14 February 2016

దేశభక్తులారా!
తప్పులేదు, మీ రక్తం మరగాల్సిందే,
మీరంటున్న ద్రోహులను శిక్షించాల్సిందే.
జాతీయతకి, దేశభక్తికి తేడాతెలియని వారి
నోళ్ళల్లో నానుతున్నందుకు మీ మాటల్లో ఉరితీయాల్సిందే.

నాకూ అయోమయం గానే ఉంది
చిన్నప్పుడు నేర్చుకున్నవన్నీ అబద్దాలు అవుతున్నందుకు,
అయినా సరే మీ మాటలకు తలొగ్గాల్సిందే..
మా తలలు తెగాల్సిందే

ఉన్నాడనుకుని దండాలు పెట్టుకున్న దేవుడే
లేడన్నందుకు నువ్వు నన్ను దైవద్రోహి అనొచ్చు
కానీ సైన్సుని కాదనలేవు

ఎవరో విడదీస్తే విడిపోయిన భూభాగం
నాది కాదంటావు; నా నాగరికత మూలాలు
అక్కడివే అన్నప్పుడు నాలిక కొరుక్కుంటావు
దాంతో నాకు లెక్కేంటంటావు

ఓ సంకుచిత దేశభక్తా!
ఎవడురా సరిహద్దు లెక్కల్లో దేశాల్ని కొలవమన్నది
మనుషుల్ని జాతులుగా తలవమన్నది.
ఏం తెలుసని నీకు మనిషి విలువ

దేశానికి ఒత్తాసు పలుకుతున్నావ్!
ఏదేశంపైన మక్కువతో
ఉద్యోగానికై విమానం ఎక్కుతున్నావ్
అప్పుడేమైంది నీ భుక్తి ముందు దేశభక్తి!!

ఓ దూరమైనప్పుడే తెలిసిందన్నమాట
నువ్ పుట్టిన మట్టి వాసన
మనుషుల్ని వదిలేసి రాజకీయ
పటానికే కట్టావన్నమాట విలువ
ఏ నాటికి తెలుస్తుందో నీకు
ఈ నేలమీద ఎక్కడన్నా మనిషన్నవాడి బాధ ఒకటేనని
నీ కడుపు నిండి ఉన్నప్పుడు వినిపించనివన్నీ
కాలేకడుపుతో నువ్వు ఉన్నప్పుడు
నీ పేగుల అరుపుల గోలేనని
అసలు మనిషికేం కావాలో ఇప్పుడేమైనా గుర్తుందా!

వర్గపోరులో బలవంతుడి పక్షాన నిలబడే బానిసవి కదా!
నిను పరిపాలించేవాడికి పరిపూర్ణ సహకారం అందిస్తావ్
గుండెలమీద చెయ్యేసుకుని చెప్పు.. అవునో కాదో
గెలిచేపార్టీకే నువ్వెప్పుడూ కొమ్ముకాస్తావ్!

పాలకుల విధానాలతో విభేదించానని
నీకు నేను నచ్చలేదు సరే కాదనను
నిప్పులాంటి మాటల్ని ఎందుకు
బయటకి రానీయకుండా చూస్తావ్!

ఇప్పుడు చెబుతున్నా విను
మనిషిగా నేనెప్పుడూ జాతీయవాదినే
నా అనుకున్నదేదైనా నా జాతీయతే
అది దేశంలా సరిహద్దులకు బందీకాదు
విశ్వమంత పెద్దదీ కానక్కరలేదు
ప్రస్తుతానికి నాది పీడితజాతి
దోపిడికి నిరసనగా గళమెత్తేజాతి
పడ్ద కష్టానికే ప్రతిఫలం ఆశించే జాతి
నా నుంచి నువ్ లాక్కున్న స్వేచ్చను
పొందేందుకు ఏ దేశాన్నైనా ఎదిరించే
బానిసకేకలు నావి.
రాజ్యం చంపిన లెక్కల్లో రాస్తావో,
దొమ్మీదెబ్బల ఖాతాలో వేస్తావో
నా అస్థిత్వాన్ని అణచివేతలతో కాలరాస్తావా!
చరిత్ర ఎవరిని గుర్తిస్తుందో చూస్తావా!!
=18.2.2016=

RTS Perm Link

No responses yet

Feb 08 2016

యశస్వి||వీరమల్లుడా! విజయోస్తు!!||

Published by under my social views

mallula

వేడంగి కాలువ గట్టున..
గోదారమ్మ నీరు తాగించి పెంచినందుకు
నీడనిచ్చే నిఖార్సైన వేపసెట్టు మాకాడు…

పాలకొల్లు మడిసేల గట్టమ్మట
సెంగున దూకే లేగదూడా..
పొద్దుగాల మంచుసూరీడూ
అవును.. ఆ పిల్లాగాని
రెండుకళ్ళల్లా మెరుస్తునే ఉంటాయ్

ఆడెప్పుడూ మొగాన్ని అద్దంలో సూసుకోడు!
ఎండన పడొచ్చినోడి గుండె తన నీడన నిండాక
ఎదరోడి ఆనందంలో సూసుకుంటాడు.

ఆడి సెరిత్ర జంగారెడ్డిగూడెం తలుస్తానే ఉంటాది
తన సావాసగాళ్ళకి సదువు, ఆపై బువ్వ రుసీ
అమ్మ సేతి మజ్జిగలా నిత్యం.. తొలుస్తానే ఉంటాది

ఉజ్జోగాన్ని ఇప్లవంలా సేసినోడు
ఎవడి పాపాన ఆడు పోతాడనుకునేటోడు కాదీడు
అ ‘ధర్మాన’ పోయే బాగోతాన్ని
తిరగేసిన గునపం మాదిరి కొబ్బరి కాయల్ని వలిసినట్టు వలిసేసాడు

సిక్కోలు కొండల్లో కన్నెధారకు గుండెను ఒడిసిపట్టి కాపాడినోడే
రోడెక్కితే గుద్ది సంపుతా మన్న ‘కిల్లి’కూతల్ని
కలం పిడికిలి బిగి చూపించి
కలుగు దాటని ఎలుకల్ని సేసి భయపెట్టినాడోనాడు.

అదాట్నఓదినం పాత్రికేయం వదిలేస్తే
ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి మోటూరి హనుమంతరావు అవార్డీకి
ఇదేం ఆలోచన అన్నారు జనమంతా
వాడికేంలోటు!!

నే విశ్వమానవుడి గుండెసప్పుడని
అన్నం పండే నేలన ఆకలి దప్పులుండరాదని
పాలకొల్లు గుండెల్లో ఇల్లు అల్లుకున్నాడు

అవయవదానం పై అవుట్ స్టాండింగ్ నువ్వే అని అవార్డ్ అన్నప్పుడు
ముక్కున వేసుకున్న వేలు జనం నోటిమీదకి వచ్చింది
విశ్వమానవవేదిక ఆశ్చర్యాలకీ వేదికైంది.

ఓ మల్లుడా! మా పిల్లగాడా! !
తన గర్వకారణాల తోరణాలకింద
ఈనాడు నిను తలుస్తానే ఉంటాది

వార్తాపాఠాలలో తప్పక సదవాల్సిన సుక్కపజ్జానివి
నీ తరువాతి తరం ఎలా దాటాలో తెలియక
నీ లంఘనాలన్నింటినీ కొలుస్తానే ఉంటాది

ఆకలేసినోడికి
అన్నమయ్యావు, అన్నయ్యావు
కన్నవారు వదిలేస్తే ..
పెద్దమ్మ, పెద్దయ్యలపాలిట కన్నయ్యయ్యావు

నడకరానివారికి సముద్రమంత మనసయ్యావు
చదువుకున్న సిన్నోళ్ళకు పనిబాట చూపావు

జయలక్ష్మికి పుట్టినోడికి
జ్ఞానాన్ని పెళ్ళాడేవోడికి
చైతన్యం రగిలినొడికి
జనం కోసం బతికేటోడికి, వోటమిలేదంటారు;

ఎండకాసే సూరీడే గొడుగుపడతాడంటారు
నువ్ నడిస్తే నీ ఎనకాలె జనం జీవితాల్ని మొదలెడతారు

అన్నింటా నీ మార్కు బలే సూపావు.. సురేశా!!
నీమాటే నీకీయాల అప్పజెప్పాల..
నీవల్లే ఓ మార్పు రావాల!!

నీటిని పాడుసేసే నీతిలేనొళ్లకు
బుద్దిసెప్పే పనుంది ముందుగాల
అందుకు నీతో పాటు అందరం కంకణం కట్టుకోవాల

ముక్కుకింద నవ్వు తరగని మొనగాడా!
నువ్వెండగట్టిన ఏరుసేపలూ తిమింగలాలు
వాటి జాతులింకా అంతరించిపోలేదు.

వాటిలో కొన్ని నీరుని ఏరుని
నేలన నిలబడి పాడు సేత్తున్నాయి.

గోదారమ్మను వైతరిణిని
తెలుగు నేలని నరకద్వారాన్ని చేసే కుట్రలో
సామాన్యుడ్ని సమిధను చేస్తున్నాయ్.

మునుగీతలో ఉన్న చైతన్యాన్ని గట్టెకించాలని
నువ్వెత్తిన జెండా రెపరెపలకై
ఎదురుచూస్తోంది గోదారమ్మ.

ఈ పుట్టినరోజున దీవెనలతో
ఇలా అక్షరాల అక్షింతలతో
నీ లక్ష్యాన్ని సుస్థిరం చేస్తున్నా.

వీరమల్లుడా! విజయోస్తు!!
గోదారమ్మను మనమే కాపాడుకోవాల.

=*8.2.2016* =

RTS Perm Link

2 responses so far

RTSMirror Powered by JalleDa