Archive for April, 2015

Apr 04 2015

||బైపోలార్ డిసార్డర్||

Published by under my social views

deepika1

దీపికా క్షమించు మమ్మల్ని
వేలెత్తి చూపించే మాలో కొద్దిమందిని
నీ పనిని పనిగట్టుకుని
విమర్శించే సచ్చీలుర్ని

ఆడబిడ్డకు అననుకూలమైన
నా ఈ మాతృభూమి లో..
నీ మాటలు సార్వజనీనం కావు, కాబోవని
పాపం ఆ ఆవేశపరులకు తెలియక కాదు
నీ అభినివేశం కన్నా అంగాంగ ప్రదర్శనే
నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తున్న మా మనసుల్లో
నీ మాటల నిచ్చెన ఎక్కి నువ్వధిరోహించిన
శిఖరాలను చూపులతోనైనా తాకాలన్న తలంపులో
తప్పులు జరుగుతున్నాయి.. మన్నించు మమ్మల్ని..

అయినా నువ్వేమన్నావని మాకింత ఉలుకుపాటు
నీ ఇష్ట ప్రకారమే ఈ లోకమంతా నడవాలన్నావా!
ఇప్పటి వరకూ ఎవరో అణగదొక్కారన్న అక్కసు కక్కావా!
లేదే!
తరతరాల పురుషాధిక్యపుటాలోచనకు పుటం పెట్టావ్
అంతేకదా!
నీ ఆలోచన సక్రమ మనుకున్నా, అక్రమ మనుకున్నా
అది అమ్మాయిల ఎంపిక అని ఊరుకోమన్నావ్!

మహానగరంలోఓ అర్థరాత్రి అఘాయిత్యం పాలై
అర్థనగ్నంగారోడ్డు కడ్డంగా విసిరివేయబడ్డ
ఆడబిడ్డను కళ్ళప్పగించి చూసిన సహోదర భారతానికి
నీ మాట ఒక వ్యాపార ప్రకటన కుట్రగానో
రాంచ్ కల్చర్ పుట్రగానో మాత్రమే తోస్తుంది.

భూమి పుట్టినప్పట్నించీ చూస్తునే ఉన్నాం కద!
ఆస్తిలానో, ఆశ్రితగానో కాక కంటికి
ఆలోచనల మస్తిష్కాన్ని కలిగిఉన్న మనిషిలా
ఆడది ఏనాడు ఆనింది గనక!

నువ్వు వ్యాకులతకు లోనైతే
అయ్యో! అన్నవారెందరో
వేళ్ళలెక్కలకు అందలేదు;

నీ హృదయ పరిచ్చేదనను
విసుగెత్తిన వెంపర్లాటగా; జాణతనంగా
జమకట్టిన వారు వేల లెక్కలకు మిక్కిలైన వారయ్యారుగా!
ఇప్పుడెవర్ని నీ ఎంపికలతో మెప్పిస్తావు
ఏమి చెప్పి లేని గౌరవాన్ని తెప్పిస్తావు!

నీ ప్రయత్నం గొప్పదనే అనిపిస్తుంది నాకు
దానిని అంగీకరించే సంస్కారం ఇంకా అబ్బలేదు
అందాలబొమ్మకు ఆలోచనలుంటాయన్న నిజాన్ని తట్టుకోలేకున్నాం..
నీ ఇష్టాలకు మా అంగీకారాల్ని ముడిపెట్టుకుని పట్టుకున్నాం
ఆకాశానికి నీలి రంగుల్ని పులిమేపనిలో ఓ మెట్టు పైనేనున్నాం

దీపికా! క్షమించు మమ్మల్ని!!
ఎల్కా గోబ్లెరోల చేతలు, దీపికా పదుకోన్ మాటలూ
ఏదో ఒకనాటికి నిజమని నమ్మే రోజులూ రాకపోవు
అప్పుడుకూడా
అమ్మా, చెల్లీ, అక్కా కూతుర్లనూ,
భార్యా, ప్రియరాళ్లను
ఆకట్టుకోవడం చేతకాని మగాళ్ళందరూ
సంస్కృతీ- సంప్రదాయాల గాటి బిగువు చూసుకుని బుసలు కొడుతూనే ఉంటారు
నేను మాత్రం..
కవిత్వ మత్తులో
మై ఛాయస్ నుబల పరిచాననుకున్న
వారి అభిప్రాయాన్నీ మన్నిస్తూనే ఉంటాను.
ఎందుకంటే నేను ..
బైపోలార్ డిసార్డర్ లోకంలో
నిస్సిగ్గుగా..
బతుకుతున్నాను

RTS Perm Link

No responses yet

Apr 04 2015

|| ఆ అమ్మాయి లిఫ్ట్ ఇచ్చినప్పుడు..||

Published by under my social views

Little Girl In Car

ఓ స్కూలు పిల్లాడ్ని ..
ఓ అల్లరిపిల్ల సరదాగా కారెక్కించుకుంది.
ఇంటిదగ్గర దింపాలనే
అంతకుమించిన కధేం లేదు.
ఏమీ లేకపోతే ఇది కవితా కాదు

అసలే మనోడికి కొంచెం ఎక్కువ ధైర్యం
గుర్రం కళ్ళాలను లాగినట్టు ఆమె
ముందుకురికిస్తే కారుని
బిక్కు-బిక్కు మంటూ కూర్చున్నాడు మనవాడు

నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నట్టు అడిగాడు
“ఎన్నేళ్ళ నుంచీ ఈ చోదన!”
ఓ పుష్కరం నుంచి” నిజం చెప్పింది..
అందులోనూ కవిత్వం లేదు.

ఆ పిల్ల దారిని జయించడానికే
చక్రం పట్టినట్టుంది
కొంచం భరోసా కలిగిందోలేదోనని
అబ్బాయిని మాటల్లో పెట్టింది
ఆ నాలుగు చక్రాలూ మనిషిని
ఆలోచనల వెనక్కి తోసేసినట్టు
కాలాన్ని లుంగచుట్టి తెస్తున్నాయని
బహుశా ఆమెకు తెలియదు
పరిచయం పెద్దగాలేక పోయినా
ఒకరికొకరు
పరిచయం అక్కర్లేని వారే ఇద్దరూ!

మొన్నీ మధ్యనే కదా
ఒకరి పుట్టినరోజున
మిఠాయిలు-పళ్ళూ పంచుకున్నారు
ఓ డ్రాయింగ్ మాస్టారిచ్చిన
రెండు పెన్సిళ్ళను
బహుమానంగా అందుకున్నారు
అపురూపంగా దాచుకున్నారు!

పోట్లాడుకోవడం చేతకాక
మాట్లాడుకోవద్దనుకున్న
తీర్మానం గురించి
ఇప్పుడిద్దరూ మాట్లాడడంలేదు
కలిసి ప్రయాణిస్తున్నారు
దారి చూపుల్ని కలవనివ్వడం లేదు
అయితేనేం మాటల్ని ఎవరాపమన్నారు!!

తన తొమ్మిదో క్లాసులో
పావలా పెరిగిన పాల ఐస్ రేటు

పదోక్లాసులో
దాచుకు తిన్న జీడిగుళ్ళ మూట

ఇంటి దగ్గర అమ్మ చేసే
నేతి సున్నుండ కోటా

రోడ్డు పక్క తోపుడు బండి
మిర్చి బజ్జి రుచీ

ఆడపిల్ల ‘నీయమ్మ’ అంటే
తన్నుకొచ్చే నవ్వూ

పోలిస్తే తట్టుకోలేని
ఆడపిల్ల నైజం

చేతి గీతల్లో దాక్కున్న
జాతకాల వైనం

గమ్యం చేరే ముందు
ఐదు క్షణాల మౌనం..

కొద్దికిద్దిగా ఎదుగుతూ వస్తున్న
అలోచనల్లో
తరుగుతున్న ఇద్దరి వయసు అంతరం.

అబ్బాయి మాటల్లో మర్మం అమ్మాయి కనిపెట్టిందో లేదో
తెలియదు కానీ..
కారు దిగాక ముందుకు జరిగిన కాలంలో
పెరిగింది వయసే తప్ప
దూరం కాదని,

చిరునవ్వే దూరాన్ని-
భారాన్ని తేలిక చేస్తుందని
ఆ పిల్లలిద్దరికీ తెలిసినట్టు
ఎవ్వరికీ తెలియదు

ఒకరికొకరు ఎదురుపడని ఒకానొక కాలంలో
వారి వయసులు..
పిల్లకి పాతిక పైనా పిల్లాడికి నలభై కిందా ఉండొచ్చు
అదీ కథ.
=28.3.2015=

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa