Jan
22
2015
ఇంట్లో అల్లరిపిల్లాడ్ని
బళ్ళో బెస్ట్ స్టూడెంట్ నీ..
పీకి పందిరెయ్యడానికి ఇల్లు
బుద్దిగ నేర్చుకోవడానికి బడి అని
గిరిగీసుకుని విహారం చేసేవాడ్ని
ఏ నెత్తురు దెబ్బలతో
స్కూలు రిక్షా దిగుతానో;
ఏ గొడవ ఇంటి మీద పడుతుందో
అమ్మకు నిరంతర చింతన..
“ఆమెనా” …
నిజానికి ఒకప్పడు ఇంగ్లీషు లో చదివిన కవితకు నా భాష జోడించాను..
పేరు తెలియని ఆ కవి భావనలో మమేకమై అనువాదమైన కవిత..ఇది
RTS Perm Link
Jan
10
2015

అక్షరాలు అడుగుతున్నాయి నన్ను..
తెలుగై ఉన్నాం.. వర్ణమాలలో
వందలో సగం పైన ఆరెక్కువగా..
అందులో నువ్వు వాడేది మరీ తక్కువగా!
ఎందుకు మమ్మల్నిలా
రాసి రంపాన పెట్టడం!..
కుప్పపోసి..నూర్చినట్టు
ముందూ- వెనుకల నుంచోపెట్టి
మార్చి- మార్చి వరసలు కట్టడం!!
కాడల్లోకి సూదిని గుచ్చి
పూలను ఎక్కించినట్టు
పదాల్ని పక్క-పక్కన పేర్చి
ఏదో భావాన్ని రాగంగా
కనిపించని దారంతో
మనసుకు చుట్టడం
ఎందుకింత ప్రయాస..
నీకు!! మాకూ!!
ఎవరిని మెప్పించాలని
ఎందుకు మాతో విందులు-చిందులు నీకూ!
వినమ్రంగా విన్నవించుకున్నా!
ఒద్దికైన అక్షరాలూ!
దిక్కూ- మొక్కూ లేనప్పుడు..
నాకక్కరకొచ్చింది ..
ఆకలేసినప్పుడు ఆదరువు ఐంది
రూపం తెలియని మీ శబ్దమే
కన్నారబెట్టుకోవడనికైనా అరవాలని
తెలినప్పుడే..
జట్టు కట్టాను మీతో..
అందరిలానే
ఏమి చెప్పాలన్నా
మీ నీడనే!.. నుంచున్నా
తోడుండమని
అందుకే వేడుకుంటున్నా..
నా లోపలి భావాలను
బొమ్మ కట్టాలని
ఓ కార్యానికి
శ్రీకారం చుట్టాను.
తన తలపులనే
వరించిన విరించి నై
తను చేసిన బొమ్మనే
ప్రేమించిన
పిగ్మాలియన్ నై..
శ్రీకారం చుడుతున్నా..
ఇప్పుడు చెప్పండి. మీరు!
ఎక్కడ నుంచి
మొదలు పెట్టాలి నేను!!
పుట్టినప్పట్నించీ
రాయాలంటే..
ఇది నా చరిత్ర కాదు;
రాయడం మొదలైనప్పట్నుంచే
పుట్టాననుకుంటే..
చరిత్ర ఒప్పుకోదు..
అందుకే ఒకటనుకున్నా..
నా జీవితం లో కవిత్వమైన సందర్భాలనుంచి
ఈ కవిత్వమే నా జీవితమనుకున్న పదాలవరకూ
సందర్భాల్ని
మననం చేసుకుంటున్నా..
మీతో అక్షతలు వేయించుకుని
ఆలోచనల్లో..
వెనక్కు వెళుతున్నా..
మిమ్మల్నీ.. నాతో రమ్మంటున్నా..
ఆ భావనలే నా ఈ తెల్ల కాగితం
starting a new concept
poetic conversation about my already written poetry..
as and when gets a chance..
-10.1.15=
RTS Perm Link
Jan
09
2015


ముక్కలైన వానపాములు రెండై తలాడించినట్టు..
ముక్కిరిగిన పెన్సిళ్ళకు మొన రెండు వైపులా మొలిచింది
చిందిన నెత్తుటి సిరా ఎక్కించుకుని కలాలు
ప్రేమ చిహ్నాలనే పొటమరించాయి
పోయారనుకున్న పదిమందీ
గుండె కూడళ్ళలో స్థూపాలై
వెలుగు వైపు దారి చూపిస్తున్నారు.
పార్కులో ఒంటరిగా కూర్చున్న పిల్లవాడు..
నేనే చార్లీ నని కలవరిస్తున్నాడు
డ్రాయింగ్ పుస్తకం పెన్సిల్ ధ్వజాన
ఎప్పటికీ రెపరెపలాడుతుంది..
ప్రపంచమంతా వ్యంగ్యం ఎంత గంభీరమైన విషయమో
ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంది
తులాభారంలో తులసిదళంలా
వ్యంగ్యచిత్రం
తన బరువెంతో తెలుపు కుంటూనే ఉంది
కంటగింపైన వారంతా
కుంచె మొదల్లో రంగు చుక్క ముందర
తెల్లబోతూనే ఉన్నారు..
“ముందు పెన్సిలే కాల్చింది..”
మతం ముసుకేసుకున్న తుపాకీ మాట
బాక్-ఫైర్ లో రాలిపోయింది
తన కార్టూన్ల ప్రదర్శన కోసం..
దేవుడు స్వర్గాన్ని సిద్ధం చేస్తున్నాడు
జీవితం
తనను చూసి నవ్వుకునే లోకం పట్ల
ప్రేమను కురిపిస్తూనే ఉంది
RTS Perm Link
Jan
03
2015

“పండు పీకేస్తుంది ఆ అమ్మాయి..;
పక్కన కూర్చో(ని) వద్దని టీచర్ కి చెప్పు!..”
డగ్గుత్తిక గొంతువి ఉత్తుత్తి మాటలు కాదని
ఎర్రబడ్డ ఆయువుపట్టు అబద్ధం ఆడలేదని
తేల్చేసినప్పుడు..
ఆశ్చర్యం, భయం, బాధా ఒక్కసారి
తన్నుకొచ్చాయి
బడికెళ్ళి బెంచీ మార్చినంత మాత్రాన
తీరిపోతుందా బాధ్యత !
ఎవరు నేర్పుతున్నారు పసిపిల్లలకి..!
ఎవడో వొకడు..
ఎక్కడో ఓ రాక్షసుడు
మనలో వాడే..
వరుసకి బాబాయో! మామయ్యో!
తాతయ్యో! అన్నో!!
కాకపోతే ఆటోవాడు, పక్కింటంకుల్
బళ్లో టీచరో, డాన్స్ మాస్టరో!
ఎవరైతేనేంలే!
తినలేని కసుగాయల్ని
ముద్దాడనిదెవరు!..
ముద్దులెనక మర్మాల్ని
మర్మాంగాల సలపరింతల్నీ
కొలిచెదెవరు!!
తయారైన పళ్ళ పెద్దరికాల్ని
కళ్ళతోనో- వేళ్లతోనో
తడిమి అంచనా వెయ్యనిదెందరు!!
నన్నో- నిన్నో.
ఎవరైతేనేంలే! ..
పద్దేళ్ళన్నా నిండనప్పుడు
ఆడుకుంటానని..
తీసుకెళ్ళి..చాటుగా..
ఒళ్ళంతా తడిమి
బులబాటం తీర్చుకున్న
పక్కింటక్క ది తప్పుకాదు;
పాలుగారే పాపని
అమ్మా-నాన్నాట ఆడుదామని
చెప్పో-చెప్పకో
చెప్పలేనివేవో..
చొప్పించి చప్పరిస్తే..
తప్పుకాదు
అలవాటైన ఆ పనినే
మరో మారు మనలో ఎవరో చేస్తే..
అసలు తప్పనే అనిపించదు
అకస్మాత్తు గాలివానకి
లేతమొక్కలు కంపించిపోనీ,
జుగుప్సో- ఈప్సితమో
ఖరారైపోయేలోపు
అంతర్మధనంలో..
బిడ్డ దహించుకుపోనీ!
మాట్లాడడానికి.. మనం
మనుషుల్లో ఉండం..
మార్కుల విషయంలో తప్ప
శరీర మార్పుల విషయంలో
మనకు లెక్కలుండవ్.
చిక్కు ప్రశ్నలకు
ఇంటర్నెట్.. సమాధానాలే
ముందు తరాలకు దిక్కవుతాయి..
అవి తప్పకుండా తప్పుదారి తొక్కిస్తాయ్
అన్నీఉన్నవారే..
జాగ్రత్తల్లో దిక్కులేకుండా పోతారు..
పిల్లలేమైతేనేం! నీకేం!!
నీ ఉద్యోగానికో- వ్యాపారానికో
ఢోకా రానివ్వకు!..
కన్నంత మాత్రాన అన్నీ
కనిపెట్టుకోవాలనుందా!
ఎవరిది వారికి తెలియొద్దా!!
అమ్మా- నాన్నలు
అన్నీ పట్టించుకోగలరా!
ఎందుకంటే..
ఈలాంటి మాటల్ని
మర్యాదగల ఇళ్ళల్లో మాట్లాడొద్దు
బయటకు తెలిస్తే..
ఉందో- లేదో తెలియని పరువు
ఉంటుందో!- పోతుందో!!
అమ్మలూ! నాన్నలూ!
మనదేం కాదు తప్పు!!
క్రమశిక్షణో-కార్పణ్యమో
పుట్టినపాపానికి
కొట్టో-ముద్దులుపెట్టో
శరీరం పై మమకారం
తగ్గించేద్దాం..
ఇక ఏ చాక్లెట్ కైనా
బిడ్డ తనువుని
ఎవరికైనా..
కుదవపెట్టగలదు!!
ముద్దే కదా అనుకుంటే!..
రేగిన తేనెతుట్ట
వేడిని
ఎలా తట్టుకోగలదు!
అయినా పర్లేదు!..
అనాదిగా చేస్తున్న పనేగా!!
పిల్లల్ని పక్కలోనో- గదిలోనో పడుకో పెట్టుకుని
గుడ్డి దీపాల వెలుతురులో
మన వేడి చల్లార్చుకుందాం
ఆనక..
వంశాంకురాలు
గాడితప్పి మొలకెత్తాయనో..
పునాస కాపు పిలకలేసాయనో
తప్పు తరం మీద రుద్ది..
తలపై తుండుగుడ్డతో కూలబడదాం
లేదా..
పరువు హత్యలకు తెగబడదాం.
అప్పటి దాక..
ఉతికే పౌడర్ యాడ్ లో
పాప గౌను ఎంతెత్తెగిరిందో
చూసి నవ్వుకుందాం
పిల్లిలా మన మూతుల్ని
తడిచేసుకుని, .. ఠంచనుగా..
మిడ్ నైట్ మసాలా చూసేసాకే..
తుడిచేసుకుని.. ముడిచేసుకుందాం
మస్తుగ.. పండుకుందాం
RTS Perm Link
Jan
01
2015

ఊరు వెళ్దామని..
పట్టుబట్టి టికెట్టుకోసం
ట్రై చేద్దామనుకున్నా..
రెగ్యులర్ రైళ్ళు లాభంలేదని ఐఆర్ సిటిసీ చెప్పెసాక;
కెసిఆర్ కుమ్మరించే భరోసాల్లెక్కన
స్పెషల్ బళ్ళు ఉన్నాయని..
అరదండాల్లో ఉన్న మీడియా
తన ఫాలోవర్ ఫెలో లకి చెప్పినట్టు
పుకార్లు వినిపించాయి
ఓ ఆశ మొలిచింది..
రిజర్వేషన్ సెంటర్ దాకా
స్వచ్ఛభారత్ చేసుకుంటూ వెళ్ళి నిలుచున్నా
నీ ప్రణాళికంతా చంద్రబాబు కన్నా లేటు అంటూ..
గూడ్స్ బండంత లైను
రూల్ ఆఫ్ థంబ్ ని భుజానవేసుకుని
గార్డు పెట్టె వెనక పట్టాల్ని చూపించింది.
పూటో- అరో లైన్లో గడిపాక
తీరా నా వంతుకి కౌంటర్ లో
బుక్కింగ్ క్లర్క్ వెయిటింగ్ లిస్ట్ 365/366 టికెట్టొకటి
ఇవ్వనా- వద్దా అన్నట్టు చూసాడు
ఇహ లాభం లేదని
పార్టీకి పక్కన పెట్టుకున్న నోట్ల కట్టతో
ప్రీమియం తత్కాల్ కోటాలో టికెట్టు కొన్నుక్కుని
కాళ్లిడ్చుకుంటూ స్టేషన్ కి వచ్చేసా.
ఇంతలో..
అనౌన్స్ మెంట్ వినిపించింది
“ప్రయాణికులకు ముఖ్య గమనిక..
……..నేటి నుండి నిన్నటికి వెళ్లే నెంబరు
రెండు సున్నా ఒకటి నాలుగు
పుష్ పుల్ పాసింజరు
ఒకటవ నెంబరు ప్లాట్ ఫాం నుండి బయలుదేరుటకు సిద్దంగా ఉన్నది.
“ప్రయాణికులకు ముఖ్య గమనిక….
….. నిన్నటి నుంచి రేపటికి వెళ్ళే
నెంబరు రెండు సున్నా ఒకటి ఐదు… న్యూ ఇయర్ ఎక్స్ ప్రెస్
మరికొద్దిసేపట్లో..రెండవ నంబరు ప్లాట్ పాం మీదకు వచ్చును…”
కంగారులో అర్థం కాక వెనక్కి వెళ్ళే రైలు ఎక్కినట్టున్నాను..
నడుస్తూ వెనక్కి వెళ్తే..
బోగీల నిండా అన్నీ వింతలే!
సముద్రంలో మునిగిన విమానం లో ప్రయాణికుల్లా ఉన్నారు
నవ్వుతున్నారు..
పెషావర్ స్కూలు పిల్లలే..!!
నవ్వుతున్నారు
ఫిఫా ఫుట్బాల్ కప్ ఫైనల్ లో ఓడిపోకముందు హంగరీ అటగాళ్ళు..
నవ్వుతున్నారు!!
ఎబోలా రాకముందూ గిన్యా దేశం నవ్వుతూనే ఉంది
చనిపోక ముందు రాబిన్ విలియమ్స్ నవ్వుతూనే ఉన్నాడు
మాయా ఏంజిలౌ నవ్వుతూనే ఉంది..’
ఆఖరికి.. మనసంతా నువ్వే ఉదయ్ కిరణ్ కూడా..
నాకే ఏడుపొచ్చి..
ఆ రైలు బయల్దేరకముందే దిగిపోయా..
అదిగదిగో!..
2015 రైలు ఇప్పుడే.. ప్లాట్ ఫాం మీదకు వస్తుంది..
ఆశ్చర్యంగా..
పెట్టేలనిండా మళ్లీ వాళ్ళే..
నవ్వుతూ… పలుకరిస్తూ…
=31.12.2014=
RTS Perm Link