Archive for December, 2014

Dec 30 2014

||నాన్న-సునామీ||

Published by under my social views

securedownload *******************************

ఓ తప్పిపోయిన పాపా!

నీకో నిజం

నీ అమ్మా నాన్నా బ్రతికున్నారు’

తమ్ముడు సునామీలో చనిపోయినా

నీకోసం వత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు

 

అపూర్వా! ఎక్కడున్నావు తల్లీ!.. అన్న

గుండె ఘోష..

పదేళ్లనుంచీ మారుమోగుతుంది

సాగర తీరమంతా!!

 

తన బుల్-బుల్ కోసం

నీ తండ్రి ఈ వెల్లంగని గుండెల్లోని..

ఇసుక రేణువుల్నన్నింటినీ

ఆవేదనతో తడిపేస్తున్నాడు

 

నువ్వు కొట్టుకుపోయింది కార్ నికోబార్ ద్వీపంలోనైనా..

ఇక్కడ నిను చూసినవాళ్లు

నువ్వు బ్రతికున్నావన్న భరోసాను ఇచ్చారు

ఏ కోలార్ తెగలోనో కలిసి ఉండే

నమ్మకంతో పాటు..

వెతుక్కోవడానికి మరో రాష్ట్రాన్ని

ఆ  తండ్రికి మిగిల్చారు

 

పిచ్చాడిలా తచ్చాడుతున్నాడు

నీ ఫొటోలను పంచుతూ

బ్రతికున్నావన్న ఆశతో!

కనబడ్డ వారినల్లా అడుగుతున్నాడు

 

ఓ తప్పిపోయిన పాపా!

నీకో నిజం

సంవత్సరం ముగిసే ఈ వారంలో

మీ నాన్న తప్పకుండా

నాగపట్నం వస్తూంటాడు

ఏ రోజన్నా కనిపిస్తావన్న ఆశను

తూర్పున మొలిచే తొలికిరణానికి

తగిలించి నీకై అంజనం వేస్తాడు.

 

ఎందుకంటే.. ఏమని చెప్పను!!

నిన్ను మళ్ళా అక్కున జేర్చుకుందామనుకునే

మనిషి కదా వాడు

ఏ మాటలు సరిపోతాయ్

తను ఏరికోరి పెట్టుకున్న

నీ పేరుని అడుగు చెబుతుంది

నువ్వు తన అపూర్వవని

 

ఎప్పుడో ముంచేసిందనుకున్న

సునామీ వెల్లువెత్తుతోంది..

ఇంకా అ తండ్రి గుండెల్లో

ప్రేమ పాశమై నీకోసం

 

నువ్వు పుట్టినప్పుడు

ఉప్పొంగిన ఆనందం ముంగిట

సునామీ ఎప్పటికీ

ఓడిపోతుందని..

నువ్వు చూడని నీ తమ్ముడు

అమర్త్య అరుణ్ ని అడిగినా చెబుతాడు..

 

తనపేరేమిటంటే.. ఎప్పటికీ సడలని..

నీ తండ్రి ఆశ.. అని..

 

నువ్వు తిరిగి రావడంలో అద్భుతం కన్నా’

అవసరమే ఎక్కువని..

వేలాది వేదనల  నిశీధి వెన్నలల

సాగరఘోషను విషణ్ణ వదనంతో

భరిస్తున్న రవి శంకరుడు సాగర తీరంలో

నీకై పడిగాపులు కాస్తున్నాడని,

 

ఎన్నిసార్లు కడిగిందో కెరటం

మీ నాన్న పాదాలను..

ఒక రాకాసి కెరటమై

మిము విడదీసిన పాపానికి

 

ఎన్ని మార్లు ఎగరేశిందో.. గాలి

నీ బొమ్మ ముద్రించిన కరపత్రాలని,

ఈ తీరం వెంబడి..

 

 

ఓ తప్పిపోయిన పాపా!

నిన్ను కాలం కనుగున్నా లేకున్నా

నీకో నిజం..

 

ఎందుకులే ఆడపిల్ల అనుకునే

ఈ లోకం లో

నీ నాన్న తనం ఓ పచ్చి నిజం

 

నువ్వెక్కడున్నావో ఉప్పందించమని

ఒక్క సముద్రం చుక్కనైనా చెప్పమను

కని పెంచిన మమకారం

నిన్ను చేరే క్షణం

కన్నార్పకుండా చూడగలదా

యావత్ ప్రపంచం!!

 

ఇట్లు
నీకై.. ఓ కన్నీటి కెరటం

 

=29.12.2014=

RTS Perm Link

No responses yet

Dec 27 2014

యశస్వి|| తమ్ముడూ! పారాహుషార్!! …||

Published by under my social views

DSC_0484
************************
నీ బుట్టబొమ్మ నీళ్ళోసుకుందన్నప్పుడు
తండ్రుల సంఘం లోకి వెల్ కమ్ అంటే
మూడు – మూడు సార్లు చెప్పమన్నావ్

ఆశ్చర్యం మా పరం చేసి
ఎంత తాపత్రయ పడ్డావు!!

త్రికం సార్వత్రికం కాని కాన్పని
తెలిసినా.. ముమ్మూర్తులా నీలా వుండే
ముగ్గుర్ని.. కళ్ళారా కనాలనుకున్నావు.
పారాడే క్షణాల కోసం నిరీక్షించావ్

పుట్టకుండానే బిడ్డలు..
లేరని విన్నప్పుడు
నీతోపాటు.. త్రిశంకు స్వర్గం నుండి
ఒక్కసారిగా ఊడిపడ్డట్టైంది.

కీడెంచకూడదని నీ భుజం తట్టి
చెప్పిన మాటలన్నీ తిరిగొచ్చి
నడినెత్తిన కూలబడ్డట్టు..

తలపులన్నీ.. బొప్పికట్టినట్టు..
కేరింతల్ని చాపచుట్టి అటకెక్కించినట్టు..
ఆలోచనల ముప్పిరిలో
ఉక్కిరిబిక్కిరైన వేళ అనిపించినట్టు..

తమ్ముడూ!
అసలెలా ఉంటారో తెలియని
మన పిల్లలు
లేకుండా ఎట్లా పోతారు!

ఈ గ్రహసంచారానికి
వచ్చిన దేవదూతలై ఉంటారు!
ఆట మొదలవ్వడానికి ముందు
పిచ్ ని పరిక్షించడానికి వచ్చిన ఆటగాళ్ళై ఉంటారు!!

జీవ పరిణామ క్రమంలో
ఆ మూర్తులు ఏ స్థితిలో భాగమై ఉంటారు!
పిల్లలందామంటే.. పుట్టుకొచ్చినవారు కాదు
పెద్దలందామంటే.. పేర్లేమో లేవు

వారెవరైనా..
మనకేదో నేర్పాలని వచ్చివెళ్ళారు
మన సంతోషాలకందనిదేదో..
ఇచ్చివెళ్ళారు

జీవితానికి అర్థం కాని బాధని ..
గతానికి వదిలేసి,
భవిష్యత్తు తలుపు గొళ్ళానికి
ఆశనేదేదో తగిలించి వెళ్ళారు

నాగరికత ప్రగతికి కారకులైన ఎందరినో
మనం తలవకుండానే పుట్టుకొచ్చేశాం
జీవనదీప్రవాహంలో ఆసరాలనెన్నో వదిలి
కొత్తసంవత్సరం వాకిలికి కొట్టుకొచ్చేసాం

ఇప్పుడీ కాలం
కోటిఆశలతో పాటు..
ముక్కోటి భయాల్ని మోసుకొచ్చింది.
ఎన్నెన్ని బరువుల్ని మోయలేదు మనం!!

గాజా దాడుల్లో
బీచ్ ఫుట్ బాల్ ఆడుతూ..
ప్రాణం విడిచిన ఆ నలుగురు
ఆఫ్ఘన్ లో వాలీబాల్ ఆడుతూ నేలకరిచిన అరవైలు
పాకిస్తాన్ లో చదువులబడి ఒడిలో కుప్పకూలిన ఆ 153..
వీరంతా పిల్లలేకదా!

ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీని
ఈ లోకం లోకి..
ధైర్యాన్ని ఎక్కడ కనాలి!
దైన్యాన్ని ఎక్కడ దాచాలి!!

కొనసాగింపు తరాన్ని
అబద్దపు భరోసాల మధ్య
ఈ లోకానికి
తరలిరమ్మని.. ఎలా బుజ్జగించాలి!!

వాళ్ళెవరో ముందు తరం
ప్రతినిధులల్లే ఇలావచ్చి అలావెళ్ళారు.
మనల్ని పరీక్షించాలని
వెనక్కి మళ్ళారు..

ఏదో ఒకరోజు..
దగ్గర్లోనే కనిపిస్తామని
ఉమ్మనీటి కొలనులో
తానమాడిన
బులబాటాలు తీర్చుకునేందుకు
ఇంకా సమయముందని
మురిపించి పోయారు..

అన్నింటికి సిధ్ధంగా ఉండమని
ఆనందాల ఇంటికి
గంటలు కట్టిపోయారు
All is well అన్న మాటకి
కట్టి ఉన్న గంతలు విప్పిపోయారు..

తమ్ముడూ!
పారాహుషార్!!
ఇప్పుడింక..
2015 కనికట్టు కట్టబోతుంది..
మనల్ని మళ్ళా ఓ పట్టు పట్టబోతుంది

కాలం ఒక గాలం
ఎండమావో ఒయాసిస్సో
దాటేస్తేనే కదా తెలుస్తుంది!!

ప్రేమతో జయించాలి మన కాలాన్ని
వాళ్లే.. మనవాళ్ళై మరలివస్తారన్న
నమ్మకం తోనే నీ.. నా..
కంటిపాపలు.. ఇంకా మెరుస్తునాయిలా!

RTS Perm Link

No responses yet

Dec 18 2014

యశస్వి||……..అడగకు నన్ను!!…………. ||

Published by under my social views

10360893_757569787657689_368824801560977244_n

పక్కెక్కడ తడిపేవో.. నని
నడినిద్రలో నిను నడిపించి
బిగబెట్టిన చిట్టిపొట్ట నా రెండు వేళ్ళ మధ్యనుంచీ
నీరు కారుస్తున్నప్పుడు..
ఓ భయం మాయమౌతుంది.. నాకు

మంట మీద మరిగే నీళ్ళ గిన్నెను
నే మునివేళ్ళమీదే మోసుకు పోతుంటే..
తుంటరిగా నువు అదాటున వచ్చేలోగా..
నీరు తొరుపేసుకున్నప్పుడు..
ఓ భయం మాయమౌతుంది నాకు

సరదా కుమ్ములాటల్లో
నీ పంజా కి ఎదురు నిలచిన తనువు
అదిరి; నెప్పి ఎటువైపు ఎక్కువో
పక్కమీద లెక్కగట్టలేక పోయినా
భయం పోగొట్టుకుంటుంది నిద్రలో…

చిన్ని- చిన్ని భయాలకే బెంబేలెత్తే నేను;
బాధగా నువ్వడిగే ప్రశ్నల్లో..

“అన్నల్ని-అక్కల్ని ……….
వాళ్ళెందుకు కాల్చారని అడిగితే..!!”
ఏ భయం లేకుండా ఎట్లా చెప్పను!

మనిషి ప్రాణం బొమ్మతుపాకీ బిళ్ళలెక్కని;
సిధ్ధాంతం అనే భూతం ఒకటుంటుంటుందని,

రాధ్ధాంతం చెయ్యలనుకునే బూచోళ్ళు
నీ బడి తలుపులు బద్దలుకొట్టుకు
రాకుండా ఉండాలనే స్వార్థం లో..
ఏంచెబుతానో ఏమో!

Question bank
కడుపులో పెట్టుకుతిరిగే నీకు
ఏనాటికైనా ఒక నిజం తెలియాలి
నీ నాన్నకన్నీ తెలియవని..

చనిపోవడానికి
బతికిఉన్నదానికీ మధ్య
లోలకం ఈ జీవితమని..

విద్రోహమో, ప్రమాదమో;
గంటలా మోగినప్పుడల్లా
ఏం నేర్చుకున్నామో ఎవరికి వారు
బేరీజు వేసుకోవాలని..
నీ అంత నువ్వే తెలుసుకుంటావు!

మనుషుల్లో పువ్వులూ-ముళ్ళూ
పులులూ, లేళ్ళు అన్నిగుణాలూ ఉంటాయని..

ఇంగితం మరచిన జ్ఞానంలోనే
జంతువులతో తమని తాము పోల్చుకుంటారని

వైరుధ్యాలూ-వైరాలూ
హింసలూ, హత్యలూ సహజధర్మమని

పసివాడికీ, కసాయికి సమాన స్థాయినిచ్చేది దైవత్వమని
బాణంతో లేడిని చంపడమూ.. మానవత్వమేనని..

మనిషికి కావలసింది మనిషేనని,
మానవత్వం, దైవత్వం రెండూ కాదని
ఏనాటికైనా నీ అంతట నువ్వే తెలుసుకుంటావు

నీ పుస్తకం పోయినప్పుడు
పంచుకోవడంకోసం.. ఇద్దరుండాలని

నువ్వు నడిచేది ముందో-వెనకో తెలుసుకునేందుకు
మరొకడు తోడుండాలని..

నువ్వు- నువ్వు గా ఎదుగుతూ
మరో చెట్టుండే తోటలో పండాలని..

స్వపర పక్షపాతం లేని సాంఘిక న్యాయం ఒకటుండాలని..
కాలం కలల్ని కూల్చినా.. కొనసాగించడానికి
ఒక తరం మిగిలుండాలని..

ఏనాటికైనా ఈ నిజం తెలియాలి
నీ అంత నువ్వే తెలుసుకుంటావు
అప్పటిదాక..
ఈ చిన్ని భయాలతోనే బతకనీ నన్ను

పెద్ద-పెద్ద ప్రశ్నలతో భయపెట్టకు నన్ను..
నిద్రలో ఉన్ననిన్నిలా నడిపించనీ నన్ను..

=17.12.2014= 8.pm
‪#‎IndiawithPakisthan‬

RTS Perm Link

No responses yet

Dec 16 2014

సహానుభూతి పంచే.. ప్రజా సాహిత్యం: “నేను మాత్రం ఇదరిని” పుస్తకానికి నా ముందుమాట

Published by under my social views

 

page layout copy 2

ఒక్కమాటలో చెప్పాలంటే .. ఏకకాలంలో సందర్భానికో, సంఘటనకో బయటపడే  రెండు రకాల మానవ ప్రవృత్తులూ; వాటి ఫలితాల  సారాంశాన్ని  కవి కోణంలో నిర్వచించి.. ఇంతేరా ఈ జీవితం అని విప్పి చెప్పడమే..  ఈ నేను మాత్రం ఇద్దరినీ.

అంతేనా!..

ఇది తప్పుకదా అనే అంతరాత్మనూ తట్టిలేపడమే. చుట్టూ జరుగుతున్న పరిణామాలను తటస్థంగా స్వీకరించి లోకం తీరే అంత.. ఈ మాత్రం దానికేనా!  అనుకునే వారందరూ.. ఈ పుస్తకం  పేజీలు తెరవనక్కరలేదు.

మానవ ద్వంద్వ ప్రవృత్తి అంటే.. మనందరిలో బయట ఉన్న ‘నేను’ కి లోపలి ‘మనిషి’కి మధ్య వైరుధ్యాలే.

సాంఘిక కట్టుబాట్లు-అవగాహనలు లోపలిమనిషిని అణచిపెట్టడం చేత బహిర్గతమయ్యే ఆకాంక్షలు, కోరికలూనూ. లోపలి తత్వాన్ని ఎంత అణచుకునే  ప్రయత్నం చేస్తామో.. అంతగా మనల్ని మనం ఆమోదించుకోలేం.., వ్యక్తికి, సంఘానికి పరస్పర సంబంధాన్ని నిరంతరం పునరుద్ధరించుకుంటూ ఉండాలి; ఎందుకంటే సమాజం నియమాలని ఎన్నింటినో కాలానుగుణంగా మనముందు ఉంచుతుంది కాబట్టి.

ఈ ప్రయత్నం గురించి రెండు ముక్కలు రాయడం  అంత తేలిక కాదు;  ఆ పనిని మా పెద్దన్నలకు వదిలేసి మీకు ఈ concept పూర్వాపరాలను పరిచయం చేస్తున్నానంతే..

 

 

ఈ ‘నేనుమాత్రం ఇద్దరిని’ కి Robert Louis Stevenson, రాసిన “Dr. Jekyll and Mr. Hyde” ప్రేరణకాదు, split personalityకీ ఈ ప్రక్రియకూ సంబంధం లేదు, వర్మ నేపథ్యం లో ఆ పుస్తకం ఎరుక కూడాలేదు. మేం చదువుకున్న కాలంలో మా non-detailed story ‘Alice in wonderland’లో Alice కి ఉన్న identity crisis గురించీ కాదు.. మమ్మల్ని పెంచిన గోదారి నీళ్ళు  ఆ అవసరాన్నీ రానీయలేదు. పోనీ సినిమాటిక్ గా మనలో ని అపరిచితుడ్ని కవి పరిచయం చేస్తున్నాడా అంటే.. వర్మ గుట్టువిప్పి చూపించేది   మాస్క్ తొడుకున్న మన ముఖాలనే.  కనీసం పిల్లల కామిక్ పుస్తకాల కథా నాయకులైన ఫాంటమ్, స్పైడర్ మాన్ తీరున ఈ లోకాన్ని మార్చేయాలన్న ఆశలేం లేవు వర్మకు.. విస్తృతంగా కవిత్వం రాస్తున్న క్రమంలో.. తన  మొదటి కవితా సంపుటి “మూడో వేపచెట్టు” ప్రచురణని పక్కనపెట్టి.. ఈ విషయాన్నొక్కదాన్నే ఎందుకు తలకెత్తుకున్నాడు!

వ్యక్తిగత స్వార్థం మితిమీరి పర్యావరణాన్ని, ప్రదేశాన్ని పాడుచేస్తున్నప్పుడు జరగవలసిన దానికీ జరుగుతున్న దానికి మధ్య అంతరాన్ని చూపి.. ‘ఇదిగోరా.. గొయ్యి!! పడిపొతావ్ అడుగేస్తే..’ అని హెచ్చరించడమే. . కవి పని. అందుకే వర్మ లోపలి మనిషి ఇలా అంటాడు..

 

కష్టమొచ్చినప్పుడు కవినై మేల్కొన్నదీ నేనే..

కడుపు నిండినప్పుడు సామాన్యుడై నిద్రించిందీ నేనే..

నిదురబోతున్నవాడ్ని మేల్కొలిపేది కవిత ఒక్కటే..

నేనుమాత్రం ఇద్దరినీ..

తప్పనగలరా!

కవి సమాజ ప్రేమికుని వరకూ సందేశాన్ని చేర్చగలడు; కొండకొచో సందేహాన్ని తీర్చగలడు. స్తబ్దంగా ఉండే మనిషిని ప్రశ్నించేది ఎవరు! ఇది ఎవరికి  వారు వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ పుస్తకం చదివి మెచ్చుకున్నా, నొచ్చుకున్నా వర్మ సంకల్పం నెరవేరినట్టే.  కొన్ని చదివి దాచుకోవాలి, కొన్ని పంచుకోవాలి. మన Social connectivity వల్ల ఆనందమైతే లభించొచ్చు; మరి మన వల్ల జరిగే లోకోపకారం ఏమిటి!

ఇవి ఈ పుస్తకం చదివినతరువాత నన్ను తొలిచే ప్రశ్నలు. మరి మిమ్మల్ని??

మీ యశస్వి.

 

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa