Archive for September, 2014

Sep 19 2014

యశస్వి|| “నాన్న చంద్రులకు నమస్కారాలతో..||

Published by under my social views

10557670_542764189183900_7730835993078129204_o

అప్పుడప్పుడు పెద్దొలొస్తారింటికి
పిల్లలకు .. కథలు చెప్పలనుకుంటారు

పిల్లల్ని చెడగొడుతున్నారు.. ….!! ,,
అంటుందావిడ. టీవీ చూస్తూ..
చదవకుండా.. కథలేంటి! అంటావ్ నువ్వు
కంప్యూటార్ లో తలదూరుస్తూ..

నువ్వంటే.. నువ్వేనా!!
నీలాంటివారమేగా మేమంతా!!

ఆనాడెందుకు కథ చెప్పమన్నావ్!
అమ్మమ్మనో! తాతయ్యనో!!

ఆవు- పులి కథ విన్నప్పుడల్లా
కన్నీరై వగచావ్!
పులి నిజంగానే తినేస్తాదా!!
చెప్పలేనన్ని సార్లు అడిగావ్
గుర్తులేదా!.. పెద్దెదిగావ్ కదా!

అసలు ఏం కథలు చెప్పగలవ్
ఎవరికైనా!
ఆలస్యానికి కారణాల కథలు
అవసరానికి అబద్దాల కథలు
నమ్మారా!! ఎవరైనా!!

కొత్త కథ చెప్పమంటే
తెల్లముఖం వేస్తావ్!!
చేపెందుకు ఎండలేదంటే
గడ్డివామంటే ఏమిటో చెప్పలేనితనం

చీమ ఎందుకు కుట్టిందంటే..
పుట్టబొమ్మైనా వేసి చూపలేని నిజం

నీ పిల్లల ప్రపంచంలో నువ్వెప్పుడు ఉన్నావ్!
నీకైనా తెలుసా!!
అసలెందుకు కన్నావ్!!

వెన్నెలంటే.. నీకైనా తెలుసా!
పండుగంటే సెలవొక లెక్క

నక్షత్రాలా!! ఎక్కడ ?
దుమ్ము దొంతరలోంచి కనిపించేనా పాలపుంత!!

అనగనగా.. రాజంట..
పిల్లల ముసిముసినవ్వులు..
ఇప్పుడెవరూ.. లేరంట..

చదువే లోకం
మార్కులే కొలబద్దగా,
ర్యాంకులే జీవితాలు… 🙁

జీవిత మాధుర్యామా! అదెక్కడిది!!

ఇప్పుడు జంతువులు కబుర్లాడుకోవడం మాత్రమే అబద్దం
అస్త్రాలు, యుధ్ధాల కథలు వినడం నిషిద్ధం
రాముడొక్కడే మంచి బాలుడు
ఎందుకో తెలీదు
కర్ణుడు ‘టూ గుడ్’
మంచో-చెడో
అట్లా ఉండొద్దనీ చెప్పలేవు

అనవసరమైన నీ హాల్యూసినేషన్ లలో
పిల్లలు కొట్టేసుకుంటారు..
అప్పుడే ఎందుకీ గొడవలూ!!

అన్నట్టు..మాటినని పిచ్చోడొకడు
బడిగంట కొట్టిమరీ
కథల కనికట్టు గుట్టుని రట్టు చేస్తున్నాడు..

నింగిలోన చందమామని
సెల్ ఫోన్ కెక్కించి
అనగనగా.. అంటున్నాడు
నిన్ను నాన్న చంద్రుడ్ని చేద్దామని

కథలు వినడం…
పిల్లలతో కలిసి గాల్లో ఎగరడం
నదుల్లో ఈదడం, సముద్రాలు దాటడం,
కాలాతీతంగా విహరించడం,
కేరింతలు కొట్టడం..
తుళ్ళింతలను తట్టుకోవడం

చాల కష్టం గానీ..
నీ పని నువ్వు చేసుకో..

పొరపాట్న గానీ..
ఈ ఆదివారం సాయంత్రం.. ( 21.9.2014)
రవీంద్రభారతికి పిల్లలతో
వస్తావా!! ఏంటీ!!

= 19.9.2014=

Indus Martin ప్రయత్నాన్ని అనుసరిస్తూ.. వివరాలకు..

Anaganagaa – అనగనగా

RTS Perm Link

One response so far

Sep 09 2014

యశస్వి|| అన్న పుట్టిన రోజున… ||

Published by under my social views

19681_4607386547465_868938993_n
నాకోసం ఎదురుచూసిన మొదటి పసివాడు..
‘ఆడుకొడానికి తమ్మున్ని కొనుకొత్తానికే
అమ్మ నరసాపులం ఎల్లింద’నే తెలుసు

తనయ్యన్నీ అమ్మతో సహా పంచేసిన పెద్దమనసుతోనే
అన్నయ్యయ్యాడు నాకు

అమ్మచేతి మొదటి ముద్దను
ఒక్కముద్దుతోనే త్యాగం చేసినోడు
చివరిముద్దా నాకై వదిలేసి
పెరుగన్నం మానేసాడు
నా మొదటి చెలికాడు

కూర్చోబెట్టి తిప్పాలనేమో
మూడుచక్రాల సైకిల్ కొనిపించుకున్నాడు
మూడేళ్ళవయసప్పుడు
అన్న నా మొదటి రిక్షావాడు

రెండేళ్లే ముందరే పుట్టినోడు
రెండే కేజీల బరువు తేడా బక్కోడు
అయినా సరే అన్ననిపించుకున్నాక
నాబరువు మొయ్యడం వాడి పెద్దరికం

తప్పుతమ్ముడిదైనా
వేలు కొరికించుకున్నందుకు
తిట్లు తినడం ఇష్టమైందో
తప్పనిసరైందో చెప్పడం కష్టం

ఇంటి నుంచి తరగతి గదిదాక
తోడొచ్చే బాడీగార్డ్
నే పికిన పందిళ్ళ లెక్కలన్నీ
అమ్మకు అప్పజెప్పే బాడ్‍బోయ్

పిలకకోయబోయి మెడగాటుపెట్టి
అమ్మచూడకుండ మానిపోవాలని
మిరపకాయ రుద్ది మాడగొట్టినొడు
మంటటే ఏమిటో చూపెట్టినోడు

ఓడినప్పుడు మళ్లీ ఆడించినోడే
గెలుపురుచి చూపించినోడే
అటలో సైతం జట్టు మారనోడు
తోటలో జామచెట్టులాంటొడు

నేను పుట్టిన వారానికే అన్న పుట్టిన రోజేంటి!!
ఎప్పటికీ అర్థం కాదనుకున్నా..
టెలివిజన్ ఆన్ చేసాక.. తెలిసిందోనాడు
బొమ్మకన్నా ముందు మాటెందుకు వినపడుతుందో..

నే రాకపొతే.. వాడు అన్నెట్లా అవుతాడు..!!
నను కనిపెట్టుకుని మోగే అలారం క్లాక్ కదా వాడు!!

చల్లగుండూ.. అందామనుకున్నా..
చిన్నోడిని కదా! అట్లా అనొచ్చా..
మరి.. సూరీడు ఆడిపేరు..

ఇంకా నే ఎదగలేదని
అమ్మ పోసే కన్నీళ్ళకు
పత్రహరితం పంచాలని
ఏసీ కారులో ఊరంతా తిప్పుతూ చిరుబురలాడతాడు..
నా సారథి వాడు

భవసాగరతీరాల పరిగెత్తించే
కాలానికి గాలంవేసి నన్ను
కూర్చోబెట్టిన కవిత్వాన్ని
వాడికీ.. వినిపిస్తాను

ఇంకో వంద జన్మలతోడుని
భరోసాగా వదిలేసి
తన నవ్వుల కిరణాలతో నా చీకటిని తరిమేస్తూ
నన్ను నా గమ్యానికే వదిలేస్తాడు

వేడిసెగ తగలనివ్వని నా వెన్నెల సూరీడు
దూరంనుంచే నన్ను కాపలా కాస్తాడు

=*8.9.2014= Bhanukiran Yarramsetti

RTS Perm Link

No responses yet

Sep 08 2014

యశస్వి|| తిక్కమాటలు గురూ!!||

Published by under my social views

glosep03

 

 

రాయడానికేంలేదు.. అయినా రాస్తాను
వెకిలితనాన్ని నీకు చూపిస్తాను

వాక్యమో, శీర్షికో,
ఓ కబురో.. కధో నన్ను గొప్పోడ్ని చేయట్లేదిప్పుడు
గురువుగారి మీద సెటైరెసుకునే మూడిప్పుడు
చదువుతున్నా, చూస్తున్నా
వింటున్నా, అవగతం చేసుకుంటున్నా
రాయడమొక హక్కు
ఏంరాసినా తప్పుకాదిప్పుడు

నీహారికా సమూహాలు లక్షోపలక్షలని తేలిపోయాక
నక్షత్రం నాకు చులకనైపోయింది
సూర్యకోటి సమ ప్రభను సైతం
గ్రాఫిక్స్ లో ఊహించుకునే నాకు
దైవత్వం ఆటవస్తువైంది.

బొమ్మ కనిపిస్తే మొక్కడం తప్ప
భక్తి భావం తలకెక్కడం లేదు
ప్రసార సారమెంత మోసినా
అనురక్తి భావం మొలకెత్తట్లేదు

తీరని కోరికలింకా ఉన్నాయోలేదో తేలనందుకు
నాస్తికుడ్ని అయ్యానని రూఢీగా చెప్పలేను
అయినా అలా చెప్పుకోవడం గొప్పనుకుంటాను
లేకపోతే లోకమే తప్పనుకుంటాను
చలించేచోటో, చరించేచోటో
ఆచరించే చోటో, అనుసరించే రూటో
సెపరేటు గా కావాలిప్పుడు

గొప్పోడు పోయాడంటే నలుగురికోసమే అయ్యో అంటాను
వెనక మాటల్లో పోయే గొప్పోడయ్యాడంటాను
బతికుండగా నిజంనీడ నన్ను ముట్టదు
పక్కోడు ఉన్నాడో పోయాడో నాకు పట్టదు
రాబోయే దేదో తెలియకపోయిందని
వెరైటీకి రావణకోటి రాసుకుంటాను

గురుపూజరోజంటే
మందు బ్రాండు బొమ్మెడతాను
గురువంటే వాడు మనువు బ్రాండ్
మనవాడిపేరెత్తితే పొమ్మంటాను
పక్కోడి ఇల్లాలే గొప్ప టీచర్ అంటాను

ఎందుకంటే.. నేనన్నీ చూస్తున్నానంటాను..
నీకు తెలియని కొత్తవిషయాలె రాస్తున్నానంటాను..
అదేమంటే..
గురువులకే గురువుని
ఇన్నంటావా!

నన్నంటే.. నా దౌర్భాగ్యం నువ్వంటాను..
సెక్షన్లూ, రూళ్ళబుక్కుల్లో నువు బుక్ అంటాను
నడిరోడ్దున కరపత్రంలో నీ బొమ్మంటాను
లేకుంటే నీ దిష్టిబొమ్మకు మంటెడతాను.

RTS Perm Link

No responses yet

Sep 05 2014

యశస్వి ||ఏం జాతి.. ఇది!! ||

Published by under my social views

slide_23

అభిమతమన్నదేలేక..
నమ్మకాలపైనే పునాదులెత్తితే
ఇక జాతేంటి!

బట్టకట్టాలిగాని నేతనేయరు,
తిండి కావాలి సాగుచేయరు
మధువుకోరతారు;తోటల్ని పెంచరు
రసాల్ని వడకట్టరారు; గ్రోలతారు
ఇక జాతేంటి!

వాచాలత్వమే నాయకత్వమైనప్పుడు,
వెలిగే విజేతదే తన జాతి వెలుగనుకునేది
ఏం జాతి!

ఉత్సాహాల్నీ కలల్ని నీరుగార్చేదీ,
మెలకువలో ఉన్నట్టు భ్రమ కలిగించేది..
ఏం జాతి ఇది!!

శవయాత్రల్లో తప్ప కాడిపట్టలేనిది,
తనగొంతెప్పుడూ ఎలుగెత్తలేనిది..
కుదేలయ్యేవరకూ డాబులు గొట్టేది.,
దర్పం వెలగబెట్టేది!
ఏంజాతి!!

కత్తిఒరకూ వధ్యశిలకూ మధ్య
మెడ వేలాడేనాటికైనా
తిరగబడడం నేర్వనిదీ
ఏంజాతి!!

రాజనీతిజ్ఞులు గుంటనక్కలైనప్పుడు..
సిద్దాంతకర్తలు మాయగాళ్ళైన జాతి..
అనుకరణో.. అతుకులబొంతో..ఐన
కళాభినివేశమే గొప్పైనప్పుడు
కలిసిఉండడం తప్పైనప్పుడు
అదేమి జాతి!!

కొత్త నాయకుడ్ని అందలమెక్కించుకుని..
సాగనంపేవేళల ఎగతాళి చేసే జాతి..
మరో కొత్తనాయకుడికి తప్పెట్లు కొట్టేజాతి..
ఏమి జాతి!!

తరాలుగా కవులకు నోరేలేని జాతి
ఉద్దండులింకా ఉయ్యాలప్రాయాలలోనే
ఉండిపోయిన జాతి..
ముక్కలైన జాతి..
ప్రతిముక్కా..
తనకొక జాతీయతను ప్రకటించుకున్న జాతి..
ఇదేమి జాతి!!

( Khalil Gibran, The Garden of The Prophet
కి కాలానుసృజన) =5.9.2014=

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa