Archive for April, 2014

Apr 25 2014

యశస్వీ సతీశ్ కవిత.. చివరిపేజీ // (తెల్లకాగితం) విశ్లేషణ..

Published by under my social views


last pg

కవిత్వం రాసేవాళ్లకు తొలిదశలో మార్గ సంబంధమైన ఇబ్బందులుంటాయి.
ఎలా రాయాలి?భాష ఎలా ఉండాలి?మంచి కవితకి ఏమైనా లక్షణాలుంటాయా?ఇలాంటివి.
ఈ ప్రాథమికావస్థ నూటికి తొంభైమందిలో ఉంటుంది.
ఇలాంటి సమయాలల్లో అధ్యయనం ఒక ఊనికనిస్తుంది.
అందుకే చాలావరకు సీనియర్ కవులు కవిత్వం చదవండని సలహాలిస్తుంటారు.

ప్రాచీన కాలనికి ఒకాయన ఇలా అన్నాడు
“గురూపదేశాదధ్యేతుం శాస్త్రం జఢ ధియోప్యలం
కావ్యంతు జాయతేజాతు కస్యచిత్ప్రతిభావతః”

మంచిగురువుదొరికితే మూర్ఖుడు పండితుడు కాగలడు కాని,స్వంత ప్రతిభ లేకుండా కవి కాలేడు-అని
తొలిదశలో కవిత్వం రాసేవారు ఒకరిప్రభావంలో పడతారు.
అధ్యయనం ఇలాచేయిస్తుంది.కొన్నాళ్లు అలా సాగాక తమకంటూ ఒక దారి ఏర్పడుతుంది.
ఆకాలానికి తన కవిత్వ మార్గం ఎలా ఉండాలనేది నిర్ణయించేస్తారు.ఈ పద్దతి చాలామంది కవుల్లో ఉంటుంది.
శ్రీశ్రీ లో ప్రభవ నాటికి కనిపించని”కవితా ఓ కవితా”స్ఫూర్తి మహాప్రస్థానం నాటికి కనిపిస్తుంది.
ఇలాంటివి రాయనికవులు ఉండరని అనలేం కాని 90శాతం ఇలాంటివి రాసేవాళ్లే.పఠాభి ఫిడేల్ రాగాల డజన్ లోఎన్ని ఉరుములున్నాయో తెలియందికాదు.
నగ్నముని కొయ్యగుర్రంలో మొదటి 3 భాగాలు ఇలాంటివే
కవిసంగమం లో పోస్ట్ చేసిన కవితల్లో యశస్వీసతీశ్కవిత్వానికి సంబంధిచే…

ప్రాచీన కాలంలో ‘అవతారిక ‘ ఒకటి కనిపిస్తుంది.ఇందులో భాష,వాక్యాలు,వస్తువు,అంకితం ఇలాంటి వాటిని గూర్చి కవులు తమ భావాలను చెప్పుకునేవారు.మహాకావ్య లక్షణాల్లో ఆముఖం కూడా ఒకటి. దండి..
“ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశేవాపి తన్ముఖం”అన్నాడు. ఆశంస,వస్తు నిర్దేశ్యం,కావ్యానికి ముఖాల్లాంటివని ఈ అభిప్రాయం.మొల్ల తన రామాయణ అవతారికలో పదాల ఉపయొగంపట్ల ఎలా స్పందించిందో తెలుసుకదా.”గూఢ శబ్దమ్ములు గూర్చిన కావ్యమ్ము మూగ చెవిటివారి ముచ్చటగును”-అని
యశస్వి సతీశ్ తెల్లకాగితం కూడా అలాంటికవితే.
ఓ రచనకు సమాయత్తమౌతూ,సృజన సమయంలో లక్షం ఎలా ఉండాలో చెబుతున్నారు.
ఇందులో అంశం తోపాటు కవితానిర్మాణం విషయం లోనూ సతీశ ఒక పద్దతిని ఏర్పాటు చేసుకున్నారు.
సుమారు సగభాగం రచనాక్రియా క్రమాన్ని చెప్పి మిగతాభాగం ప్రయోజనాన్ని పూర్తి చేసారు.
ఇందులో కొన్ని అంశాలల్లో సతీశ్ రచన ఎలా ఉండాలనే అంశంపైకొన్ని అంశాలు వ్యక్తం చేసారు.
1.న్యాయం చెప్పటంలా..
2.పూజలా..
3.జీవితాన్నివ్వటంలా..
4.భోజనంలా.
5.అనుభూతిలా
6.మొలకెత్తే విత్తనంలా..
ఈ భావనలు పైన చెప్పిన రెండురకాలైన వాక్యాల్లోనూ కనిపిస్తాయి.ఇవన్ని కవిత్వంపై ఆయనకుగల ఆత్మీయతని సూచిస్తాయి.

“మనస్సాక్షి చెప్పినట్టు/పేజీ చివర సంతకంచేసే /క్షణమొకటి వేచి ఉంటుంది”
“జీవితాన్ని ప్రసాదంలా/అందించే అవకాశం”
“ఈ సాహిత్యం మీ ఉన్నతిని కోరే /సంస్కారమని గుర్తిస్తే చాలు”
కవితా నేపథ్యం లాంటిదయినా ఈ కవిత లో కళాత్మకవాక్యాలతో పాటు ,..కొన్ని ప్రతిఫలనాలు కనిపిస్తాయి.
“క్షీణోపాంత ప్రయోజనసూత్రం,బాష్పోత్సేక(ద్రవీభవన)సిద్దాంతం గూర్చి మాట్లాడటం ఇలాంటి ప్రతి ఫలనాలని స్ఫురింపచేస్తాయి.

“అంతర్యామిగామారే అనుభూతిని/ కాగితంపై ఇంకిన /ఒక ఇంకు చుక్క ఇవ్వగలిగితే చాలు”
“కలం నాటిన విత్తులు మొలకెత్తి/సహస్ర దళాల్లో వెలుగు రేఖలనుపొదివి పట్టితే చాలు”–
సతీశ్ కవిత్వానికి కావలిసిన దార్శనికత,వ్యక్తం చేయడానికి కావలసిన కళాత్మకతా ఉన్నాయి.
మరిన్ని కొత్తవస్తువుల్ని సతీశ్ కవిత్వంచేస్తారని ఆశిద్దాం.జీవితాలని కొత్తగ కొత్త పరికరాలతో అందించదం ఇప్పటి కవుల బాధ్యతకూడా కదా!

_____________ఎం.నారాయణ శర్మ29.072013

RTS Perm Link

No responses yet

Apr 25 2014

ఎన్నికల లోగిళ్ళలో..

Published by under my social views

Vote1

ఎదురుచూపులు చాలిక
తెరతొలగించి చూపించాలి
మొదలైంది డచ్చాల యుద్ధం
రంగం సిద్ధం
చూస్తున్న వారిప్పుడూ..
మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు
ఈలలు వేసి గోల
ఆడేవారే చేస్తున్నారు
జీడిపప్పు తిని బలిసిన పందెం కోళ్ళు
బరిలో నించున్నాయ్
ప్రయాణంలో, పనివేళల్లో.. కబుర్లు బోలెడు
పేపరు నిండా కాలక్షాపం బఠాణీలే
చోద్యం పంచడానికి తోడున్నాయిగా మన ఛానళ్ళు
ప్రజలంతా ఎవరినో గెలిపించడానికి సిధ్ధమైపోయారు
లేదా తాము ఓడిపోవడానికి సిధ్ధమైపోతారు
ఏమీ అడగలేక పోతారు
అయాచితానికి ఆశపడిపోతారు
చూపున్నా దృష్టి లేక
బ్రతికున్నా స్పృహలేక
ఆకలికి తాళలేక
బరువుకీ కరువుకీ
తాయలాలకై
తొందరపడిపోతారు
ఎన్నికలలనో పోగేసిన మాటల్ని నెమరేయలేక
కలల్ని కనే అవకాశాన్ని వదిలిపోతారు
అలవాటైన చీకట్లోకి నడిచిపోతారు..
కవీ!
గోరీలు తవ్వి లేపనక్కరలేదు..
బ్రతికున్న మనుషులేగా మనవాళ్ళు!
అయోమయంలో వారి ఆనవాళ్ళు
ఎన్నిక చేసుకునేది
మనుషుల్ని కాదు
ముందురోజుల జీవితాన్నని.. మరలచెప్పు.
అమ్మ-నాన్న, ఊరూ-కులం,
భాష- ప్రాంతం పుట్టుక- చివరికి
నువ్వు మగో- ఆడో నిర్ణయించుకునే అవకాశం
కూడా లేకుండానే ప్రయాణం మొదలెట్టాముగా!
నీపరమైన వన్నీ గౌరవించే మనసున్నోడివి
బతుకు బండి నడిపే వాడిని ఎన్నుకోమని అడిగితే
తలదించుకు పోతావే?
అని కదా మనం అడగాలి!!
ఓటు కోసం వచ్చిన వాడ్ని ప్రశ్నించమని
చేప్పేవి- చేసేవి చిట్టాల తూకం వెయ్యమని
మరలచెప్పు మన మనిషికి
గొంతెత్తి పిలువ్! వెలుగు దారి తొక్కమని

RTS Perm Link

No responses yet

Apr 24 2014

|| చెత్త…గోల||

Published by under my social views

(ఒకానొక సందర్భం….)

ఆచితూచి పదాలని వాడటం వల్ల నిజంగానే రచయిత చచ్చి పోతాడా!!! అన్నిసందర్భ్హాలలోనూనా!!! హాశ్చర్యం>>

అన్నియ్యా!
చందనాల స్వామిని మోసుకొచ్చావెందుకు!!
అగ్గిచిలకరిస్తారు.. తాతాచార్యులు వారు
చిటపటలాడాలేమో
కదలకపోతే బతికున్నావా అని గద్దిస్తారు
అఘోరాలా వస్తారు
ఒక హారర్ సినిమా చూపిస్తారు
భయపడలేదని
నీకు చూడ్డం రాలే పో! అంటారు
పాప పుణ్యాలలెక్కల్లో మిన్న
ఒరిజినల్ కవుల్లో అన్న
అందని ద్రాక్షపళ్ళు
అక్కరలేదంటారు
పులిసిన ద్రాక్షరసాల్నే సేవిస్తారు
హారన్ కవిత్వానికి పట్టుకొమ్మ వారు
హారర్ వ్యక్తిత్వానికి జీవగర్ర వీరే
కవి, నట విమర్శకేంద్రులు ఒకరు
యక్షగాన ప్రారంభంలో
సూత్రధారిని అడిగారు..
“ఏమమ్మా మాధవీ!
ఆ పచ్చని చెట్టుకు చెప్పవే..
నన్నొక పాట పాడమని అనమని
పాపం అడగ్గానే వచ్చారు..ఆనాడు
అలరులు కురిపించారు
ఆభీల ఉగ్ర ఉత్తాల ఒగ్గాళ ఔగ్ర్య
కరాళ గోర ఘోర, దబ్బఱ, దారుణ,
ప్రచండ బకుర భీకరంగా
కవిత్వం చెప్పే తపనలో ఉంటారు
వితండవాదానికే ఎందుకో మనసొగ్గుతారు
తనని ఇంకా గుర్తించలేదే అని సనుక్కుంటారు
కవుల కలాల్లోపల ఇరుక్కుంటారు
వారికెంతో గౌరవమిచ్చామని ఎప్పుడు కనుక్కుంటారో!!
who the hell are we..
అరె! కాస్త మర్యాదివ్వరాదె!!
ఇంటి మధ్యలో దుమ్మోసి..
ఎందుకీ మనాది నీకు అంటరు!!
**
“..ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ!!
ఎవడ్రా ఆ చెత్త ..
నన్ను కాదన్నది!! ..”
**
ఇంతకు మించి ఏం చేస్తాం..అన్నియ్యా!!
ఎంత ఒరిజినల్ కాకపోయినా
చంటబ్బాయ్ సినిమాలో కవయిత్రి కాలేం.. కదా!!
==27.3.14==
Like · ·

RTS Perm Link

No responses yet

Apr 23 2014

|| సింధూరం||

Published by under my social views

safron

తల్లి గర్భంలో తనయులు ఇద్దరు
ఇద్దరివీ వేరు- వేరు మతాలు
‘ప్రసవానంతరం జీవితం ఉంటుందా! ’అడిగింది ఒకప్రాణం

‘నమ్ముతున్నా.. అది అందుకోవడానికే సిధ్ధమౌతుతున్నా’
వచ్చింది సమాధానం..

అదీ ఒకజీవితమేనా! అందుకుంది మాటని..

“ఏమో! అక్కడేదో ఉంది ఇక్కడికన్నా భిన్నంగా..
ఎక్కువ వెలుతురుంటుందట..
కాళ్ళతో నడిచి నోటితో తినగలం మనం.. ” మళ్ళా సమాధానం

“నడకా!.. వల్లకాని పని..
తిండా..! బొడ్డుతాడే.. పోషించు..
పుట్టాక ఈ జీవితాన్ని వదిలేయాలి మనం
పుట్టినోళ్ళెవరూ మళ్ళా తిరిగిరాలేదు..
పుట్టడమంటేనే జీవితానికి అంతం
ఆ వెలుగుల చీకటి కాటికి పంపి మళ్ళా ఇక్కడికే తెస్తుంది మనల్ని..
మొన్నెప్పుడో బొడ్డుతాడు చెప్పిందిలే”

“..ఏమోలే.. నీ మాటలు కనీసం అమ్మనైనా చూడగలం బయట తలపెడితే..
తనూజులను బాగా చూసుకోవడంలో తల్లి తరువాతే ఎవరైనానట.. తెలుసా!”

“అమ్మను నమ్ముతున్నావా!.. నీ చుట్టూ ఉన్నది అమ్మకాదా
అమ్మంటే ఉమ్మనీరు..
ఆమె కనిపించడం లేదు కాబట్టి ఆమె లేనట్టే..
అమ్మ అనేది దేవుడిలానే ఒక భావన అంతే.. ”
ప్రపంచం ‘మాయిపొర’లో ఇరుక్కున్న సహోదరుడితో
అనునయంగా ఇలా అన్నాడు అన్న.

“ఇప్పుడైనా.. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆమెను వినగలం..
అనుభూతి పొందగలం.
ఈ గర్భానికి అవతల ఒక వాస్తవం ఉందని నమ్ముతాను
పుట్టాక అమ్మ ఒక వాస్తవం.. ఆమె ప్రేమ ఒక వాస్తవం
విడిగా జీవించడం ఒక వాస్తవం
కష్టం, నష్టం, ఇష్టం.. ఇవన్నీ వాస్తవాలే అవుతాయప్పుడు
అప్పటి కన్నా ఇప్పుడే బాగుందని చీకటిలో అనుకోవద్దు.
చూడని వెలుగులోకాన్ని కాదనవద్దు
ఒక జీవితకాలపు ప్రయాణం చెయ్యాలి మనమిద్దరం
తట్టుకోలేక రోదిస్తాం.. అయినా సరే వెలుగు చూడాలి..
విడివిడిగా మరణిస్తాం.. అయినా సరే ..
ముందో-వెనకో కలిసి నడవాలి ..పద”
మంటూ బయల్దేరిందా సమాధానం
ఆ తల్లి.. కర్మభూమి
ఆ తొలిబిడ్డ సింధూరం

==17.4.2014==

RTS Perm Link

One response so far

Apr 18 2014

|| రామ.. రామ||

Published by under my social views

images (4)

‘తమీజ్’ ఎవడబ్బసొత్తు భాయీజాన్!
గాయం సలపరించినపుడల్లా
తడుముతున్నావ్ మనసును..
ఎవడ్నడ్డం పెట్టుకుని తిడుతున్నావ్?
మర్యాదాపురుషోత్తముడ్ని తడవ తడవకూ !!

నీకోరంగు నాకోరంగు అని
రక్తానికి రంగులద్దినప్పుడే
మూడురంగుల జెండాలో ధర్మచక్రం తెల్లబోయింది

ఘాతుకానికి ఒడిగట్టింది రామ సంతానమన్నప్పుడే
సహనపు పరిధుల్ని మాట దాటిపోయింది.

మనుషులు మాంసం ముద్దలైన అకృత్యానికి
జయధ్వానాల వేలంవెర్రి ఒకటి..
కళ్ళారా చూసినవాడ్ని
ఓ సందర్భ అశుధ్ధం అది.
భావోద్వేగ ప్రలాపాలను
వారసత్వమనుకునే వెర్రికి పోటీ ఏది?

దిగ్భ్రాంతి చెందిన దేశమంతా
అయ్యో! రామ!! అని నోరుతెరిచినప్పుడు
మనసు చెవిటిదయ్యిందా!!
అదే నావారసత్వమని నువ్వు నమ్మేదెలా!!

ఏ ఆహారంకోసమో
చంపేది మనిషైనప్పుడు
బలయ్యేది మూగజీవమేకదా
ఏ వ్యవహారం కోసమో
బలయ్యేది మనిషైనప్పుడు
చంపేది ఉన్మాదమేగా

దానికి మతాలతో పనుంటుదా
అభిమతాల గొడవ కత్తికి అడ్డంకా!

హింస రచన చేసేవాడెవడైనా కాఫిరే ఈ దేశంలో..
కట్టె ఏరంగులో మండినా దాన్ని మంటే అంటారు
కత్తివేటును ఈ భూమ్మీద ఎక్కడన్నా
కసాయితనమనే అంటారు

బీభత్సానల వర్ణ వివరణలు నాకు చేతకావు
రాజకీయ ఎత్తులను మతంతో మూటకట్టలేను
నీకు అలాయ్-బలాయిచ్చే నీ భాయిని నేను

విధివంచితులంతా నా తోబుట్టువులే
‘ఏదో’ సందర్భాన్ని ఎత్తుకుని కళ్ళొత్తుకోకు
ఏడ్చి- ఏడ్చి కళ్ళొరిసిపోయే ఉన్నా
నీ కళ్ళద్దాలను సర్దుకో

ఇలాంటివి ఎన్నో విన్నాం కన్నాం మోసాం
ఇప్పుడిలా నువ్వూ- నేనూ మిగిలాం
అవమానింపబడి కోల్పోయిన గతాన్ని
ఇద్దరం మర్చిపోలేదెన్నడూ

జరిగినదారుణాలెన్నో..వ్రణాలై స్రవిస్తున్నాయి
తలవాల్చి నే నుంచున్నా మంచినే తలవాలని
చిరుగుల చరిత్రను మరుగునపెట్టాలి మనం
కోతిపుండుని ఎంతకాలం కెలుక్కుందాం!
తోచిన అర్థం వెతుక్కుంటూ

నువ్వొద్దొన్న వాడేమీ నా చుట్టమూ కాదు
వాడొక్కడే నా కున్న నాలుగు దిక్కులూ కాదు
మోడును తిట్టుకుంటావో.. గోడను కట్ట్టుకుంటావో
దుష్టుల దృష్టాంతాలు చూపించి
వీళ్ళే నీవాళ్ళని…గిరిగీసి ‘
ఏ గాడిదను నాగాడిన పెట్టాలనుకుంటున్నావో!!

నేను మాత్రం నీకన్నా పరాయిదేశపు సోదరుడే
ప్రేమాస్పదుడేమోనని తలపట్టుకుంటున్నాను
అయినా సరే.. భారతదేశం నా మాతృభూమి
స్వధర్మనిరతులైన దైవనిందితులు.. నా సహోదరులు
**
(Blasphemy is a passion in India, Apostasy is a practice)
=16.4.2014=

RTS Perm Link

No responses yet

Apr 09 2014

యశస్వి|| మనవిజేసుకునేది..||

Published by under my social views

when-imagination-wins-over-intellignce-it-is-love

మాటల ఐస్ క్రీం ఎందుకు కరిగిందని
అడుగుతున్నావు..అమాయకంగా
నీ చేతుల వెచ్చదనానికి తెలుసులే ఆ వివరం

ఎగిరెందుకు పోతున్నావని నిలదీస్తున్నావా!
నువ్వెత్తిన గాలిపటాన్నేగా! నేను!!
బిగబెట్టి లాగుతున్నావేమో..
నమ్మకాల తాడు పురులువిడుతుంది చూడు

అడిగిందే అడగకు..
విన్నదే వినాల్సొస్తుంది నువ్వు
మనసు ముసురు తరమడానికి
కొత్త సుప్రభాతాన్ని ఎందుకు రాస్తాను!

అప్పుడలా ఎందుకన్నానా!
చీకటి చుట్టబెట్టుకుంది నన్ను
నిన్ను కాదు..వేకువ ఆలస్యానికి
మంచు దుప్పటిని తిట్టుకుంటున్నాను

ఎద మలుపుల్లో నీ గలగలల హోరు
నీ రూపం నిండిన కళ్ళకు లోకం కనపడదు
ఎందుకింత ఆలస్యమన్న మన తొలిపరిచయానికి
సమాధానం దొరకనేలేదు

ఓ రోజా పువ్వా!
ఇంకేమి చెయ్యగలను నీకోసం
నువ్వుకోరినట్టే ఉండాలని
గుండె గువ్వ నీముల్లుకే గుచ్చుకుని
వేలాడుతోంది చూడు

నిలబడ్డ నిజమే మన ప్రేమ కధ
నెత్తురేమైతేనేమిలే కన్నీరుని చులకన చేయకు

చిలికిన గుండెలో చిందేదేదైనా
చివరకు మిగిలేదేదో
నీకు మాత్రం తెలియదా
ఎన్నిసార్లు పలికినా
అది నిన్నేకదా!

RTS Perm Link

No responses yet

Apr 08 2014

యశస్వి|| ఫామిలీ స్టంట్||

Published by under my social views

silent-angry-couple

నీ జీవితంలోకి నేనొచ్చానో..
నా జీవితం లోకి నువ్వొచ్చావో
ఇప్పుడిక అప్రస్తుతం.
ఇది గణతంత్ర ప్రజాస్వామ్యం
ప్రస్తుతం మన అస్థిత్వాలకై
తారాడు ఆడుతున్నాం
ఎవరికి వారు బలహీన వర్గమనుకుంటేనే
ఉద్యమించగల కాలం
సంపాదించేవాడిది అభివృద్ధి మంత్రం
ఖర్చుపెట్టే చేతిది సంక్షేమ పధకం
ఏక కేంద్ర వృత్తాల్లా ఉండాలనుకున్న
పెళ్ళినాటి కల..వెన్ చిత్రమెప్పుడైందో..
ఒలింపిక్ రింగుల్లా
ఎప్పుడు దూరం జరిగామో!
ఒకరినొకరు జార్చుకుంటామేమోనని
చిన్న గగుర్పాటులో మనసు నొచ్చుకుంటుంది.
లెక్కా-పద్దూలేని జీవితంలో మిగులు కలైనప్పుడు
లోటుబాంబు మాటల తూటాలనే ఉసిగొల్పుతుంది
ఏ కోరికల ఎజెండా .. నా గుండెల్లో గుచ్చుతున్నావు
అవసరాలను
ఎవరి అసమర్ధతకు ఆపాదిస్తున్నావు
ఇదేమైనా బాగుందా.. ఇల్లాల్లా!
నిందారోపణలే..నీ ప్రచార పర్వం అయినప్పుడు
ఎవరి తోడుతో ఖండించను!
‘నోటా’ ని గుర్తించమని
ఏ న్యాయపీఠానికి నివేదించను
ఆరో ప్రాణమా!
అన్నీ నీకే అరువెట్టుకున్నాకా
ఏమిచ్చి మళ్ళా నీ ఓటు కొనుక్కోగలను!!
ఏ ఏకరువు నన్ను నీ గుండె గద్దెక్కించగలదు!!
నాతిచరామి ఏమైనా ఎన్నికల నినాదమా?
పునరాలోచించుకోవడానికి
చేతిని విడిచేదెన్నడు!!
కలసి నడవాలి గాని…
= 7.4.14=

RTS Perm Link

No responses yet

Apr 05 2014

యశస్వి ||నిశిరాతిరి మెలకువలో..||

Published by under my social views

fanimages

గాలిని తురుముతోంది రెక్కలతో
గదిలో..ప్రాణం లేని పంకా
జుయ్ – జుయ్ ల కవ్వపు చిలకరింపులు
పలకరింపేనా!! నన్నే!!
లేదాఇది దేనికైనా సమాధానమా!!

నా చెవులేమైనా అడిగాయా!!
టక టక లాడుతుందేంటి..
మది తడవ-తడవకూ!!
కిటికీలోంచి తొంగిచూస్తుంది
ఆకాశంలో చుక్క..
విసిరి నిద్రపుచ్చాలని ఆరాటంలో
జలతారు గాలితెర

తినకుండా పడుకున్నా కదా!..
పేగులు అరుస్తున్నాయి
నీళ్ళు తాగి నడుం వాల్చా..
నా చూపు
లోకప్పును చీల్చాలని చూస్తుందా!!
రోజంతా కళ్ళముందు కదుల్తోంది

కొత్తగా వచ్చిన బెంగేంకాదు
బాల్యంలా ఇప్పుడిక లేదన్నదే!!
आजा बचपन एक बार फिर ..देदे अपनी निर्मल शांति ….
అమ్మ చెప్పిన పాఠాన్ని జ్ఞప్తికి తెస్తుంది..

ఈ ఫ్యాను చేసే శబ్దమేనా!!
ఏమో! ఆలస్యమైంది..
ముద్ద కతికి పడుకోవాలి..
జోల పాటకి గాలి మర రెడీ..
అంతరంగమా!!

వెన్నెల కబుర్లకి కాలం చెల్లినా
ఈ గాలి గోల…
ఎంత బాగుందీ రాత్రి..
ఒంటరితనానికి తోడు దొరికిందిలే

ఉండుండు..
మరో పాటో.. పాఠమో..
గుర్తుకొస్తుంది…

4.4.14== 12.06 am

RTS Perm Link

No responses yet

Apr 02 2014

జయ నామ సంవత్సర ఉగాది సందర్భంగా దూరదర్శన్ కేంద్రం, హైదరాబాద్ నిర్వహించిన కవిసమ్మేళనం లో చదివిన కవిత|| || జయ ఉగాదితో.. మాటా-మంతీ||

Published by under my social views

10010088_10203331535431455_386593889_o

యశస్వి
{జయ నామ సంవత్సర ఉగాది సందర్భంగా దూరదర్శన్ కేంద్రం, హైదరాబాద్
నిర్వహించిన కవిసమ్మేళనం లో చదివిన కవిత: ప్రసారమైంది..}
|| జయ ఉగాదితో.. మాటా-మంతీ||
**
రా జయా! రా!! ఇదేనా రావడం?
ఎక్కడ్నించీ రాక?
అమెరికా నించేనా!!
అక్కడంతా కులాసాయేనా!
ఏడేళ్ళైందన్న మాటేగానీ..
సర్వధారికొట్టిన ఆర్ధికమాంద్యం దెబ్బకి
మా గూబలు.. ఇంకా గుయ్యమంటున్నాయబ్బా!
అందుకే అడుగుతున్నా!!
ఈ మధ్య తెలుగుదనమంతా
ప్రవాసంలోనే నివాసమటగా!!
మంచినీళ్లేమైనా తాగుతావా!
మినరల్ వాటరేలే!!
ఇంకా ఆ నీళ్ళ గొడవలు మొదలు కాలేదిక్కడ
ముందొచ్చిన విజయ
పాత డైరీ పట్టుకుని మాపటివేళే ప్రయాణం కట్టింది
వెళ్తూ- వెళ్తూ మా అన్నదమ్ముల మధ్య
పంపకాల పని పెట్టింది
నీకేమైనా దారిలో ఎదురై
మంచీ-చెడు చెప్పిందా ఏమిటి!!
నిరుడు కల్పించిన
ఆశలన్నీ ఇక్కడే వదిలి పెట్టింది
డబ్బున్న బిడ్డనే గెలిపించాలని
ఊరూరూ యాత్ర చేపట్టింది
కబుర్లు.. ఎవరితో పంచుకోవాలో
తెలియక ఇప్పటిదాకా ఎదురుచూసాను
జరిగినయవి కొన్ని నేను చెబుతాను
జరగాల్సినవి నువ్వే చెప్పాలి.
**
సాగి ఆగిన ఉద్యమాలన్నిటిలోనూ
కాలం కాళ్ళుచాచి ఇరుక్కుంది
ప్రజా సమస్యలు పట్టని ప్రస్థానాలు,
ఎవరికోసమో తెలియని యాత్రలతో
జన జీవితానికి తిక్కెక్కింది
ఎన్నిసార్లు బందులు జరిగాయో!
ఎన్ని బతుకులు నలిగాయో!
చెప్పేదెవరా!! అనిచూస్తే..
గట్టి లెక్కల శకుంతలక్కయ్య కాలం చేసిందని తెలిసింది
అరమరికలు అవసరమయ్యాక
తెలుగునేల నలిగింది
విజయానికి మొహం వాచి
‘పేరుగొప్ప’గా మిగిలింది
ఎక్కడైనా తన పేరు మనిషితో నిలబడాలని
‘విజయ’ తన ముద్ర కనపడాలని
‘ఆమ్ ఆద్మీ’కి చీపురిచ్చి
ఢిల్లీ దర్బారుకి పనికి పంపించింది
వాడేమో కమలాన్ని తెంపలేక,
కళ్ళాపు జల్లిన చేతి వాసన పడక
నగరవీధుల్లో లొల్లి చేసి పోయాడు
అవినీతి అన్నింటా అంటకాగిఉన్నప్పుడు ఏ ఇంట ఉండాలని
మామిడిపళ్ళ మనిషిలా అరచిపోయాడు
ఓదినం.. పేపరు చదువుతుంటే
పసిపిల్లల మరణాలలో
ప్రధమ స్థానం మనదేశానిదేనని తెలిసిందట
ఇదేమి శివా! అని కేదార్నాధుడ్ని అడగబోయింది
వసువుల్ని ముంచిన గంగమ్మకు ఉక్రోషం వచ్చినట్టుంది
అప్పట్నించి మీ అక్క
చావుల్నీ లెక్కెట్టలేకపోయింది

టీవీ చూస్తేనే తెలిసింది
తెలుగునేలలోనే కాదు.. టర్కీలోనూ
ప్రజా ఉద్యమం పతాకస్థాయికి చేరిందని
అసలు కధ వేరని
నాణెం రెండోవైపు చూపించబోయినా
విజయవిలాసం అప్పటికే ఖరారైపోయింది

అన్నట్టు టెలిగ్రాం అందిందా నీకు..
నువ్వొచ్చేదాక ఆగలేక పంపాను ముందే
ఓ పెద్ద నిజం పంచుకుందామని
ప్రపంచంలో అతిశక్తిమంతుల జాబితాలో
మన ప్రధాని కూడా ఉన్నారని.
నీ అడ్రెస్ తెలియక బట్వాడా చేయమని
రేస్ కోర్స్ రోడ్డులో ఏడో నెంబరు ఇంటికి పంపా.
తర్వాత ఆ సర్వీసే రద్దయ్యింది
అప్పుడు అర్థమయ్యింది
జాబితా నిజమే చెప్పిందని
జీవితమే అబద్దాలాడుతుందని
బయటోళ్ళకు ఉన్న గౌరవం
లోపల వారికి ఉండదని
బ్రిటన్ ప్రభుత్వం మాత్రమే
ఉమ్మడాన్ని తీవ్రనేరంగా నిర్ణయించిందని
తల్లీ!
ఈ మధ్య..లోకం చాల మారిపోయింది
అన్నదమ్ములకు అభిప్రాయ భేదాలొస్తే
ఇల్లు ముక్కలైపోయిందంటున్నారు
పంపకాలు జరగకుండానే
కుంపట్లు కొనుక్కుంటున్నారు
చెవిలో ఇల్లుకట్టుకునే పుకార్ల హోరు
దేశ మంతా వినపడుతుంది.
భూతద్దంలో దొరకలేనిదేదో
టీవీ ఛానళ్ళలో కనపడుతుంది

మొన్నీ మధ్య ప్రజా ప్రభుత్వం రద్దయినప్పుడు
పాతరోజులు గుర్తుకు తెచ్చావు
అరవై ఏళ్ళ నాటి మాట
ఆంధ్రకేసరినే ఒక్కఓటుతో ఓడించావని
రాష్ట్రపతిపాలన మొదటి సారి రుచి చూపించావని.. *

లోకమంతా ఎన్నికల కోడై కూస్తుంటే..
ఇప్పుడే లేచి ఇలా కుర్చున్నాను
ఇంతలో నువ్వొచ్చావు..
చెప్పు..
నువ్వేం కబుర్లు మోసుకొచ్చావు?
**
మన సిధ్ధాంతి గారికి తెలుసో-లేదో
ప్రజానాయకుల యోగ కరణాలు
ఏ చారుదత్తుడ్ని ఇక్కట్లపాలు చేస్తుందో
ఈ జయవసంతసేన విన్యాసాలు
యజమానుల జెండాకు లోబడే..
వార్తాఛానళ్ళ వంశోత్తర దశల ప్రసారాలు!
పంచాంగ శ్రవణాలలో
తారుమారై వినిపిస్తున్నాయి
రాజపూజ్య- అవమానాలు
సామాన్యుడ్ని అందలమెక్కిస్తానంటూ
అందరూ అబద్దాలే వినిపిస్తున్నారు
తీపి కబురు చెబుతానంటూ
ప్రతిసారీ చేదే తినిపిస్తున్నారు
ఏ సంవత్సరమైనా .. ఇంతేనా అని
అన్నిసార్లూ అనిపిస్తున్నారు
కొత్తగా వచ్చావని కోటి కోర్కెలు కోరను నేను
షడ్రుచుల వశంకాని
సుఖ సంతోషాలు కలగలిపిన
కమ్మని జీవితం కోసం
ఎదురు చూపులు చూస్తున్నాను
మీ తమ్ముడు
మన్మధుడొచ్చి* మాయ చేసేలోగా
మంచిరోజులు ఆశిస్తున్నాను
చెప్పు..
నీ సంచుల నిండా ఏం మోసుకొచ్చావు?
ఎవరికందించి వడ్డిస్తావు!!
సీలుతీయని ప్రేమలేఖలా
ఇలా ఎన్నిరోజులు ఊరిస్తావు
చెప్పు..
నీ సంచుల నిండా ఏం మోసుకొచ్చావు?
ఎవరికందించి వడ్డిస్తావు!!
=1.4.2014=

RTS Perm Link

No responses yet

Apr 02 2014

యశస్వి||పొసగని కాలంలో..||

Published by under my social views

tiger_fight

సమాధానం చెబుతాను..
అడిగింది నువ్వే..
నమ్మడం మాట దేముడెరుగు
వినిపించుకోవు..
మరి అడగడమెందుకో అర్థం కాదు..
రోదిస్తావ్!.. బాధిస్తావ్.. సాధిస్తావ్
మనోఆకాశాన్ని చిందరవందర జేస్తావ్
నే ధ్వని కాలుష్యాన్ని, పదకాలుష్యాన్ని
ఆశ్రయిస్తాను.
ఒకరికి పట్టిన దెయ్యాన్ని
వేరొకరు వదిలించాలని చూస్తాం
సమాధానపడడం సాధ్యం కాదు
పరిస్థితి విషమిస్తుంది.
కొన్ని క్షణాలు మరణిస్తాయి
మన మధ్య చీకటి పరుచుకుంటుంది.
నువ్వు అంతఃపురంలో విశ్రమిస్తావ్
నే సమాధిలోకి దారి వెతుకుతుంటాను.
కీచురాళ్ళు రొదపెడుతూనే ఉంటాయి.
కాలం అకాలంలో శమిస్తుంది
మరోనిముషానికి శపిస్తుంది
ఏదోశక్తి ఇద్దరినీ పరీక్షిస్తుందని
ఎవరో ఒక్కరికే అనిపిస్తుంది
ప్రాణం పాతరోజులకై పరితపిస్తుంది
అందని ఏకాంతం పరిహసిస్తుంది
దిండు తడుస్తుంది
రాత్రి గడుస్తుంది..
నిట్టుర్పు విడుస్తుంది
పొద్దు పొడుస్తుంది
ఇద్దరి మధ్య ప్రేమ..
మౌనం పురుడుపోసుకుంటుంది
అహం ఊపిరితీసుకుంటుంది
ఇచ్చిపుచ్చుకోవడంలో మాట..
తీరాలు దాటిస్తుంది
అంతరాలు పాటిస్తుంది
మాటల్లో ఉరితీసుకుంటుంది
చేతల్లో కసిదీర్చుకుంటుంది
రాతల్లో ఓదార్చుకుంటుంది
ప్రేమ అమరం.. కదా!
తను మాయమై..మనసుల్ని చంపేస్తుంది..
మనుషుల్ని మాత్రం కొన ప్రాణాలతో నిలిపే ఉంచుతుంది..
అదేమంటే.. కలసి జీవించడం కావాలి కదా అంటుంది.
== 26.3.14==

RTS Perm Link

No responses yet

Apr 02 2014

యశస్వి || ఈ వానే కదా!! … ||

Published by under my social views

у окна котЭ
ఈ శివరాత్రి పగటి పూట
శీతాకాలపుటెండ చిరుబురులాడుతున్నా..
దబాటంగా కురిసిందోవాన నాపైన .

చూపుడువేళ్ళకి పనిచెప్పనీయకుండా
లోనా బయటా కురుస్తోంది వాన..
నానిపోతున్నానీవేళ పరవశంగా

ఏమిటీ వాన!!
పుత్రపరిష్వంగ రోమాంచితాలను మించిన
పూలవానలు కురిసిన గురుతులేవీ నా జీవితానలేవు
కవితత్త్వాల స్పందన తడి ఇంకా స్మృతిపథాన ఆరనేలేదు

పైలా పచ్చీసు దాటి పుష్కరం ముందుకొచ్చాక
ప్రేమలేఖల వినోదానదాలలో ఈదులాడే రోజులుకావివి!!

మరెందుకీవేళ టపా అందుకున్నాక
ఎందుకింతగా మురిసిపోయాను!!
“యాభై ఏళ్ళ వాన”లో ఇలా తడిసిపోయాను!!

**
నిర్జన మైదానం లాంటి నా జీవితాన్ని
ఈ వానే కదా ఇరవై ఏళ్ళ కిందటే చుట్టేసింది!
నిసర్గ ఆకాసాన్ని చూపించి పువ్వులా నను ఏమార్చింది!!

బాధంటే కవిత్వమని,
హృదయ పరిచ్చేదన అని,
అభ్యుదయపు ఆవలితీరమని చెప్పింది నాకు! ఈ వానే!!

అల్లకల్లోల అగాధాల్లోకి దూకి శిరస్సెత్తి శివమెత్తించింది
తన రాతల్లోంచి జీవిత సారాన్ని పారించింది ఈ వానే కదా!!

చినుకుకీ చినుకుకీ తేడా లేదని
కలిపి ఉంచే తడి ప్రేమే నని..
ప్రళయంలో నైనా ప్రణయంలో నైనా
దేవుళ్ళను సైతం బతికించే మనిషివై బతకమని
అదే తన అభిమతమని..

ఈ వానే కదా మనసు తడిమి నన్నో చినుకును చేసింది!
చినుకు చినుకును చేరదిసినట్టు నన్నో చెలమని చేసింది!!

కలల్ని, కలువల్ని నాలో మొలిపించింది
ఈ వానే కదా!!
నాకీరోజు పుస్తకమై కురిసి మురిపించింది..
ఈ వానే కదా!!
ఈ వానే కదా!!
***

( కొప్పర్తి మాస్టారు కొత్త పుస్తకం.. “ యాభై ఏళ్ళ వాన పొస్ట్ లో అందుకున్న ఆనందంలో..)
=27.2.2014=

RTS Perm Link

No responses yet

Apr 01 2014

కవిసంగమం FB group లో నా పుస్తకం పై సమీక్ష

Published by under my social views

రాజారామ్ గారికి ఆత్మీయ పరిచయానికి సదా కృతజ్ఞుడ్ని.
Namaste 02

చదివిన కవిత్వ సంపుటి :-23 (కవి సంగమం)
—————————–
కవిత్వ సంపుటి పేరు :- “తెల్ల కాగితం” ( _-కవిత్వం_-)
########## ********************
సంపుటిని రాసింది :- “సతీష్ కుమార్ యశస్వీ”-
—————————-
పరిచయం చేస్తున్నది :- “రాజారామ్.టి”
————————
“తెల్ల కాగితం పై యశస్వీ కవిత్వ ఇంద్రధనువు వొంపుల చిత్రం”
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
” నా తలపుల్లో నిలిచి ఉన్నది నీవైనప్పుడు..
ఎడబాటుకు అర్థమేముంది-
పగలైనా రేయైనా నీ ఊహే
నన్ను నాకు వివరించేది”

అని ఆవిర్లు విరజిమ్మే గుండె చప్పుడు ఆగే లోగా తన ప్రేయసిని జీవితంలా శ్వాసించాలని భావిస్తున్నవాడు ఎవరంటే యశస్వీ సతీష్.

“ప్రవాహం కవితావేశంలా లాగేస్తుంది ఎటోకటు
ఉద్వేగం ముంచేస్తుంది అది కలలపై రోకటి పోటు
నైరాశ్యం నమిలేస్తుంది పంటికింది పెదవిని”
ఇలా ఓటమి అంచుల్లోంచో జారిపోతున్న మనల్ని మనమే ఎలా నిలబెట్టుకోవాలో చెబుతున్న కవి ఎవరంటే సతీష్.

“పసి పిల్లల పిప్పరమెంట్ నౌతా
తీయ తీయగ కరిగిపోతా
స్కూలు పిల్లల బ్యాగ్ నౌతా
పుస్తకాలను మోసి పెడతా
ముసలి అవ్వకు చేయూత నౌతా
అవసరమైతే కొడుకు నౌతా
నాకే గనక చేతనయితే పైనవన్నీ తానే ఔతానంటున్న కవి ఎవరంటే యశస్వే.

ఒక వైచిత్రితో కొత్తగా కవిత్వ సంపుటిని నిర్మించి,తెలుగు వర్ణమాలలో ఎన్ని అక్షరాలు వుంటే అన్ని కవితా కుసుమాలు కూర్చి తెలుగు పాఠకుల మెడలో వేసిన కవి యశస్వీ.
యశస్వీ సతీష్ కవిత్వం సంపుటి పుస్తకం తెరువగానే నాకు తెల్ల కాగితం….క్రింద ఆయన సంతకం మాత్రమే కనిపించింది.చిత్రంగా అన్పించలేదు నేను ఇట్లా అంటుంటే.అయితే కవిత్వం కళ్లజోడు ధరిస్తే మాత్రం ఆ”తెల్ల కాగితం ” మీద కవిత్వ ఇంద్ర ధనువు వొంపులోని సప్త వర్ణాల సమ్మేళనం మెరుపై నిగ నిగ లాడుతు కనిపించింది.యశస్వీ సతీష్ కీ తన కవిత్వ గురువు కొప్పర్తి లాగే తనదైన అనుభవాల్నీ కవిత్వీకరించే నేర్పుంది.ఏదీ సూటి చెప్పనితనముంది.ఆయన చుట్టువున్న సమాజాన్నీ భావించిన పద్దతి అందర్ని ఆకర్షిస్తుంది.ఒక్కోసారి సరికొత్త పోలికలతో,ఇంకోసారి వస్తువును దృశ్యీకరించే చిత్రణతో వొక కొత్త హాయిని తన కవిత్వంతో అందజేస్తాడు. అందుకేనేమో చాల మంది యిష్టపడతారు.

“నీ ప్రపంచంలోకి కవిత్వమై వస్తున్నా
నీ సాక్షిగా నన్ను నేను పోగొట్టుకోవాలి
నా పేరూ ఊరు చెరిపేసుకోవాలి
అక్షారాలను ఆవహించుకొన్న నన్ను చదివించుకొని
మనసును తెల్ల కాగితంచేసుకోవాలి
నేనే నీ సొంతమైనప్పుడు మన మధ్య
అక్షరాలు అనుభూతుల్నీ మాత్రమే మిగిల్చాలి
అక్షరాలు మనలోకి కరగి స్వచ్ఛమైన తెల్ల కాగితం మిగలాలి
కవిత్వం మన అంతరాంతరాల్లొకి వెళ్ళి ఇంకి లోకమంతా తెల్లకాగితమవ్వాలి”

ఈ కవి కవిత్వాన్ని సర్వమానవ హృదయాంతరాంతరాళ్లోకీ ప్రవహింపచేసి,ఆ కవిత్వం అక్కడే ఇంకి పోయేటట్లు చేసి ఈ ప్రపంచం వొక “తెల్ల కాగితం “అయ్యెటట్లు చేయాలనే వొక సుందర స్వప్నం వాస్తవం కావాలని తపిస్తున్నాడు.తెలుపు స్వఛ్చతకీ,నైర్మల్యానికీ సంకేతం. కుటిల,కుత్సిత,దుర్మార్గ,దురంత భరిత మానవ మనస్సుల క్షాళనకు కవిత్వం కారణం కావాలనే గాఢ ఇఛ్చను యశస్విసతీష్ తన కవిత్వంలో ప్రకటిస్తాడు.”నాది నీదైనప్పుడే నిజంగా నేను మనిషి నౌతాను”-అని అంటున్నా ఈ కవి “అలవాటైన కొద్ది నాతో చేరిపోతుంది నాకు ప్రతీకగా మారిపోతుంది”-అని చెబుతూ,అక్షరాల పలకరింపుల్ని,పులకరింపుల్ని,పగలబడే నవ్వుల్ని నచ్చనప్పుడు తనతో వాటిని పుచ్చుకొని నడువలేనని నిష్కకర్షగా చెబుతాడు.ఇలా తెల్లకాగితం పై కవిత్వ ఇంద్రధనుస్సును కలకంటాడు
తన మాస్టర్ బాటన నడుస్తూ..

“నువ్వే నా గురువంటే కోసి ఇమ్మన్నాడంటా వేలు
ఈ కాలంలో ఎవడైనా వింటాడా!!
నా వేలు నీ కిస్తాను…చేయి పట్టు అంటాడా!!
వినడం ఎందుకు!!..జివిత కాలపు వేదనకా!!
గురువంటే చెప్పొచ్చు మంచి ఎన్నైనా…
మరి అడుగొచ్చా ఎదురేదయినా..అడిగారా ఎవరైనా!!
ఏకలవ్యుడి నుండి కాస బియాంక వరకూ
విని చెడి పోయినవారే తడవ తడవకు!!”

గురువుకు గౌరవం ఇస్తూనే గురువు ఎలా వుండాలో.. నిజమైన గురువు ఎవరో నిర్వచిస్తూ “నువ్వే నా గురువంటే”-అనే కవితలో పై మాటలు అంటాడు.గొప్ప శిష్యునికీ ప్రతీక అయిన ఏకలవ్యుడు వంచలేక విరిచిన ద్రోణుని వంచనకు గురయ్యాడు.నైలు నదీ యుధ్దంలో తండ్రి అస్పష్ట మాటల కారణంగా దేశం కోసం ఓడ డెక్ మీద నిలువెత్తు మంటలమధ్యనిలువునాకాలిపోయినవాడుకాసాబియాంక.ఏకలవ్యుడు, కాసా బియాంక ఈ ఇరువురు “classical examples of devotion and sevice”కు ప్రతీకలు.ఈ పాత్రలకీ జరిగిన అన్యాయాన్ని “లోక మర్యాదకు తల వంచేవాడు ఇంతకన్నాఏంచేస్తాడు!!”త్యాగధనులజాబితాలపేరుకోసంపాకులాటతప్ప”అనేమాటతోవ్యంగ్యంగావ్యాఖ్యానిస్తాడు.
శిష్యలక్షణం అనన్య సాధ్యత్వమే కాని బొటనవేలు నరికినివ్వటం కాదు,త్యాగధనుల జాబితలో చేరటానికీ పాకులాట వుండకూడదని,గట్టి పూనిక ఉన్నవానికి ధ్యాస,శ్వాస.. విద్యమీదే వుండాలని,విద్య నేర్పేదెవరైనా ఆదరంగా అందుకోవాలని,పుస్తకాల్ని కాదు మనుషుల్ని చదవాలని ఈ కవి శిష్యుని లక్షణం కూడా చెబుతాడు.
కవి అన్ని వేళల ఆశావాదిగా మనలేడు.జీవితంలో కొన్ని క్షణాల్లో నిరాశతో కవి తన చుట్టూ వున్న మనుషుల మీద విసుగును పొంది నమ్మకం కోల్పోయి కొన్ని సందర్భాల మీద అసహ్యంతోనో,అపనమ్మకంతోనో కవిత్వపు కళ్ళజోడుతో దర్శించి వాటిని తమకు నచ్చినట్లుగా చిత్రించుకొంటారు.కవిత్వం నా కళ్లజోడు-అనే కవితలో వొకానొక భావ తీవ్రతతో సౌందర్యం వెల్లివిరియాల్సిన అదే నింగి నీరు నీలాలు కలిసేచోట సంధ్యా భీభత్సంలా నెత్తుటి చారికల విషాదాన్ని కవిత్వపు కళ్ళజోడు లేకుండా దర్శించలేనని ఈ కవి భావిస్తాడు.

‘అది నా చెంత లేకపోతే అంతా మసక మసక
నింగి నీరు నీలాలు కలసే చోటున సౌందర్యం బదులు
నెత్తుటి చుక్కల చారల… భీభత్సం
నా ముందున్న మనిషి వెంటాడే నీడై
నను అభద్రతా భావనలోకి నెట్టుతాడు
అలికిన అక్షరాలు రెటినా నంటినట్టు నా కంటికీ
నలకలై నకలై ఎంత నలిపినా అడ్డంగానే కనిపిస్తాడు
ఎదుటి వారంతా సాటివారు-తోటివారులా కాక
బోటి ముద్దల్లా కనిపిస్తారు”

ఇలా అంటూ కవి “అప్పుడప్పుడు కవిత్వ కళ్ళజోడుతో లోకాన్ని చూస్తాను/ఇప్పుడంతా..నాకు తెల్ల కాగితం..కింద తన సంతకం వుందంటాడు.ఇలా అనటంలో మారిన మార్పుని ఆకలించుకోలేని మనిషి స్థితిని కవిత్వం మారుస్తుందన్న భావనను అందిస్తాడు.
“తెల్ల కాగితం” కవితా సంపుటిలో “ఆమె నా…” అనే పద్యం అంది.ఇందులో ఇది వొక అందమైన పద్యం. “నే పుట్టినప్పుడే… ఆమెకు పాతికేళ్ళు వచ్చాయి/మేము మేమే కానీ మేమిరువురం ఒక్కరమే/నా ఏడుపు ఘోష వేరు/ఆమె లాలించే భాష వేరు”-అని ప్రారంభమయ్యే కవిత మాములు పదాలతోనే ఎంతో హృద్యంగా నడుస్తుంది.బిడ్డ ఎదిగే క్రమంలోతల్లిబిడ్డమధ్యగలబంధాన్ని,అనుబంధాన్నీ చెప్పడమే కాదు,ఆ బిడ్డ పెద్దయింతరువాత “ఊరు నాది మారింది నేను తనతో ఉండరాక”అని అనుకొనే స్థితిని ముసలిదైన తల్లి మీద అణుమాత్రం జాలి లేని తనాన్ని యశస్వీ వాస్తవికంగా కవిత్వం చేశాడు.ప్రారంభంలో “నే పుట్టినప్పుడే.. ఆమెకు పాతికేళ్లు వచ్చాయి”-అని వొక ఉత్కంఠను కలిగించి “నేనేమో కొడుకుని ..ఆమె నా కన్న తల్లి”-అని వొక దిగ్భ్రాంత ముగింపును ఇస్తాడు.ఇలా ముగింపు నివ్వటం మంచి కవిత్వ శిల్పం.
“ఙ్ఞానమైనా,ధనమైనా అర్థానికున్న సమస్థ నానార్థాలకు పర్యాయ పదం నాన్నే”-అని భావించే ఈ కవి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకొంటూ “పేపర్ తో నాన్న”-అనే కవిత రాశాడు.కన్న బిడ్డ ఆశల మెరుపులను కురిపించాలనే తండ్రి తపనను కవి ఘనీభవించిన మేఘంలా చిత్రించాడు.”ఉద్యోగ సమాచారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే పావు రాయై/ఆ నాలుగు రాళ్ళ మనిషి మీదే వాలుతుంది తెల్లారగానే”-ఈ పంక్తుల్లో కవి ప్రాణం లేని వార్త పత్రికకు ప్రాణం పోసి పావురాయిని చేశాడు.ఇట్లాంటి అద్భుత వాక్యాలకు ఈ సంపుటిలో కొదవే లేదు.”వాన కారు కోయిలై ఫలితాల కోసం/రాశి -ఫలాల వేటలో../మళ్ళి పేపర్ తో నాన్న/నా కాలం కలిసోచ్చేదాక కదలని చిత్తరువులా/పేపర్ తో/తన మా నాన తానే”-అనే ఈ మాటల్లో కవి తనకు తన తండ్రికీ,తన తండ్రికీ వార్తపత్రికకు కల బంధాన్ని ఆవిష్కరించాడు.

కవులకు చాల వరకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు జీవితం పట్ల వుంటాయి.వాటిని ఏదో ఒక సందర్భంలో తమ కవిత్వంలో పొదుగుతుంటారు.ఈ జీవితం ఇలాగే సాగిపోవాలని కూడ మనుషులు భావిస్తువుంటారు.”బతుకంటే గుదిగుచ్చిన పనులూ,చిట్టా పద్దులూ కాదు”అని అంటున్న యశస్వి “సాగిపో”అనే కవితలో “ప్రభాతపు తొలి వీక్షణం లోంచే కలలు వెలుగు రేఖల్ని ముద్దాడాలి/రాత్రైనా,పగలైనా కలల్ని వెలిగించుకోవడం..నింగికీ,నేలకు నడుమ మేఘంలా/గాలిలో తేలి నిప్పునీ.. నీరునీ కౌగలించుకోవడం/కాలంతో కరిగి పోయేవరకు కదిలిపోవడం”-ఇలా జీవితం సాగిపోవాలనే ఆలోచనను చేస్తాడు.”ఎదురీతకు సిధ్దపడితే విస్తరించిన సాగరాన్ని చీల్చుకొంటూ వడి వడిగా సాగే ఓడను తలపిస్తుంది”- అని వో విజయం తరువాత జీవితం అలా వుంటుందని కవి ఊహిస్తాడు.ఒక వ్యక్తిత్వ పాఠం కవిత్వమైంది ఈ కవితలో.
“ఏదో కారణం”-అనే కవితలో “రైలు మంటల్లో ఎందుకు కాలాలి!!/ఆయిల్ రిగ్గో,కారో ఎందుకు పేలాలి!/బాధ,హింస,అతివాదం,ప్రమాదం,/పశుత్వం,విధ్వంసం,పక్క వాడి నిర్లక్ష్యం”-మున్నగు కారణాలు బయటవైనప్పుడు అంటే సంబంధితం కానప్పుడు సహజ న్యాయం కోసం ప్రశ్నిస్తాడు.ఏదో ఒక కారణం లేకుండా ఏవీ జరుగవు అనే కార్యకారణ సంబందాన్ని కవి ఇక్కడ ప్రస్ఫుటం చేస్తాడు.

కవిని చూడ్డమంటే కవిత్వాభిమానులకీ వొక యిష్టం.తన వ్యక్తిత్వానికీ ఇష్టమైన బి.వి.వి ని చూడ్డమంటే
యశస్వీ కి ఎంతో యిష్టంలాగుంది.అందుకే “ప్రశాంతమైన్ నిద్ర లేని రాత్రుల్ని వరంగా అందించిన వాడు/అలంకారాలు లేని అక్షరాలకు వ్యాపక శక్తి ప్రసాదించినవాడు/అతడెలా ఉన్నా..అ కళ్ళల్లో వెలుగును చూద్దామని వెళ్ళాను”-అని ఈ కవి అనటంలో కవి వ్యక్తిత్వాన్ని చిత్రిక పట్టే నేర్పు వుందని చెప్పోచ్చు.”మతం మత్తుకు మధురసాల కైపు”ను పొందే హైద్రాబాద్ పాత బస్తీ నీ గూర్చి రాసిన కవితే “చార్మీనార్ …చెంపన”.పాపం, పుణ్యం ఏమి ఎరుగని చిన్నారులు సాన్వీ లాంటి పసిమొగ్గల్ని కిడ్నాప్ చేసి తుంచేస్తున్న అంశాన్నిఎంతో వేదనతో ఆ భగవంతున్ని “ఇదేం న్యాయం దేవుడా?”-అని తీవ్రంగా ప్రశ్నించిన కవిత “ఇదేం న్యాయం దేవుడా?” అనేది.ఉప్పుని ధనంగా చేస్తూ “సమన్వయం లేకపోతే జీవితం ఉప్పు లేని చప్పిడి మెతుకులు” అని చెప్పే కవిత”ఉప్ప ధనం”. “భయ్యా! Diversity ఎక్కడ!!”-అనేది జీవ వైవిధ్య సదస్సులోని డొల్ల దనాన్ని వెల్లడించే కవిత.తాలిబాన్ల పిరికితనానికి బదులిచ్చిన అసలుసిసలైన జవాబు “మలాలా”.మలాల ను “గుల్ మకాయ్” చేస్తూరాసిన కవిత ఇది.ఇలా ఎన్నో కవితలు( ఉన్న56లో) పాఠకుల తెల్లని మనసు మీద కవిత్వ రంగుల చిత్రాన్ని గీస్తాయి.

ఈ సంపుటిలో ఎన్నో కవితలు నన్ను కదిలించినా,నన్ను బాగా వెంటాడి వేటాడిన కవిత,నచ్చిన కవిత “ఓ రైలు ప్రయాణం “.ఇష్టం లేని ప్రయాణాన్ని అయిష్టంగా కష్టంగా చేయించాడానికి రైలు రావాడాన్ని వొక అంతర్లీన దుఃఖంతో కంటిని చెలమగా చేసి రాశాడు యశస్వి సతీష్.ఈ కవిత చదివినప్పుడు కొప్పర్తి గారి “విషాద మోహనం”లోని “ఎంతెంత దూరం “అనే కవిత స్ఫురణకొచ్చింది.తన కిష్టమైన వాళ్ళని వదిలి వెళ్ళి పోతున్నప్పుడు పోవడానికి ఎంత అయిష్టపడతాడో,బయలు దేరాల్సిన క్షణం దగ్గరయ్యే కొద్ది సర్దుకున్నవే మళ్లి సర్దుకొంటూ,దువ్వుకున్న తలనే మళ్లీ దువ్వుతూ వుండే మానసిక స్థితిని,ప్రయాణాన్ని ఖరారు చేస్తూ రైలు వొచ్చి ఆగి నప్పుడు…కలిగే వేదనను కొప్పర్తి అద్భుతంగా చిత్రించాడు.ఇట్లాగే యశస్వీ కూడా “ఓ రైలు ప్రయాణం” వొక మంచి కవితగా నిర్మించాడు.యశస్వి కవితని కొప్పర్తి కవితతో పోల్చటం ఆయన్ని అనుకరించాడని కాదు.”గుండెలు రెండూ లాగి వదిలిన స్ప్రింగ్ ల్లా గిలగిల లాడే” కవిత్వం యశస్వీ రాయగలడని చెప్పడానికే.
“రాయడాన్ని ఎవరూ కాలరాయలేరు”-ఇట్లా పదాలతో ఆడుకోవటం యశస్వీ కూడా చేస్తాడు.”పేపర్ తో తన మా నాన తానే”-ఇలాంటి వైచిత్రులు ఈ సంపుటిలో అనేకం.”మనస్సాక్షి చెప్పినట్టు పేజీ చివర సంతకం చేసే క్షణమొకటి వేచి వుంది కాబట్టి ఈ పరిచయాన్ని ఇంతటితో ముగిస్తూ..యశ్వస్వి మంచి యశస్సుతో వొక మంచి కవి కాగలడని విశ్వసిస్తు….వచ్చే మంగళ వారం నన్ను బాగా కలవరపెట్టి కదిలించే “జీరో డిగ్రీ”,”నీ లాగే ఒకడుండేవాడు” ఏదో ఒక సంపుటితో కలుద్దాం.

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa