Archive for October, 2013

Oct 22 2013

యశస్వి ‘s || అహం సాధు సాధు .. కానేకాదు

Published by under my social views

wondering baby

ఆప్తుడా! అద్భుతమనకు.. నన్ను.
గిజాలోని పిరమిడ్ని కాను..
వస్తువునీ కాదు..ఇంకా బతికే ఉన్నాను..
షాజహాన్ ని కాను.. తాజమహల్ నే కట్టలేను..
తోకచుక్కని కాను.. నిత్యం.. నీ చుట్టూనే తిరుగుతాను..

విలయానంతర ఆలయంలా..
నిలుచుని ఆకట్టుకోలేను.. ఆ మాట చుట్టుకోలేను.
పోతన పద్యాన్ని కాను..
కరిరాజు మొఱపెట్ట పరువెత్తు కఱివేల్పుని కావాలనుకోను

ఈ రాతలు ఆ ఒక్క రసానికే పరిమితమనుకోను.
అప్రమేయంగా జరిగిన సృష్టిని నేను..
నా వెనుక రహస్యాలు లేవు..
నేను అద్భుతమై ఎందుకుండాలి..
నన్నలా ఎందుకు ఊహిస్తావు

నీ బుద్బుధ సౌందర్యారాధనలో ఓ పదం పలికేలోగా
నీపూజ ముగిసిపోతుంది.
నే అంతర్ధానమైపోతాను..
నా పునః సృష్టి నిరంతరం ఏల సాగాలి!!
అద్భుతాలకు ఆమడదూరం నేను..

ఏ పూర్వజన్మ పాపాలకూ నేను కారణం కాదు..
పండితాః సమదర్శినః ప్రవచనాల్లో అంటరానితనం నాకబ్బలేదు
దశరధుడు, శ్రీకృష్ణుడు సదాచారులన్న గీటు దాటివచ్చాను
పంచకన్యలలో పాంచాలికి చోటిచ్చాను
మనసుకు, మనిషికి తప్ప సంప్రదాయానికి తిలోదకాలిచ్చాను

అనుభూతులే నాకు ఆలంబన
అద్భుతాలెన్నో ఉన్నా
నాకు నయనానందంగా అనిపించలేదు
ఆదిత్య మూర్తిని తాకే కిరణాన్ని కాను
నక్షత్రాంతరరోదసిలో నాలాంటివాడికోసం వెతుకే వాయేజర్ ని నేను

నా మాటలు సర్వ సాధారణాలు..
నువు నిలబడ్డప్పుడు కనబడ్డ క్షితిజ రేఖను
పిడికిలి బిగించాల్సినప్పుడు నరాల్లో పరిగెత్తే నెత్తురును
కుదేలై కూలబడ్డప్పుడు ఉత్సాహాన్ని తట్టిలేపే డప్పును
అయోమయం ఆవహించినప్పుడు చెవిని మీటే మాటల కనువిప్పును

నువ్వు అలసి కనిపిస్తే నీ చేతికందించేది..
బంగారం కాదు.. మంచినీళ్ళు.
నా చేతి సంచిలో నీకోసం మోస్తున్నవి
అద్భుతాలు కాదు.. కొన్ని అనుభవాలు.
చేతిలో చెయ్యేసి మనం నాలుగు మాటలు పంచుకుంటే చాలు

==21.10.13==

RTS Perm Link

One response so far

RTSMirror Powered by JalleDa