Archive for August, 2013

Aug 30 2013

యశస్వి’ || ప్రార్థించే చేతుల చిత్రం …(story behind a pen sketch)

Published by under my social views

డ్యూరర్ సోదరుల
ప్రార్థించే చేతుల అద్భుత సృష్టి వెనుక
నిండు జీవితాల కల..
ఎందరికి తెలుసు ఈ కథ..

అందుకే అల్లుతున్నా కవితలా..
నా కిది పంచుకోవడమే పండగ..
ఒక్కమాటతో వెలుగులోకి తెస్తున్నా..

450 ఏళ్ళ క్రితం గీసిన బొమ్మ..
ఆ స్ఫూర్తి ఈ లోకానికే ఓ వరమని..
చిత్రకారుడు ఆల్బెక్ట్ అయినా
ఆల్బర్ట్ సోదరప్రేమే అజరామరమయిన
కళాఖండపు రూపమని …

*****

దేశం జర్మనీ..
తండ్రిది బంగారం పని
18 మంది సంతానాన్ని సాకాలంటే..
18 గంటల కష్టం తప్పనిసరి.
ఇక చదివించడం తన వల్ల కానిదని

చిత్రకళకు పదునుపెట్టుకోవడానికి
పట్నం వెళ్ళడం ఇద్దరిలో ఒక్కరికే పరమని
అదీ వేరొకరి కష్టం పైన మాత్రమే సాధ్యమని..

నాణెం ఎగరేసి నిర్ణయించుకోవాలని..
గెలిచినవాడు ముందు విద్య నేర్వాలని..
నాలుగేళ్ళ కాలానికి శ్రమజీవిని
చదువుకు పంపడం ముందెళ్ళినోడి బాధ్యతని

కిక్కిరిసిన పడకల వద్ద
ఎన్ని చర్చల రాత్రుళ్ళు గడిచాయో..
అన్నదమ్ములిద్దరూ
ఎంత మథనపడ్డారో..

గెలిచిన ఆల్బెక్ట్ న్యూరెంబర్గ్ పట్టణానికి
పయనమై..విజయతీరాలను ముంచెత్తాడు..

నిలిచిన ఆల్బర్ట్ నాలుగాయనాలపాటు
కళోపాసనకే వెలుగురేకై
ప్రమాదకర పాతాళ కుహరాల లోకి
చీకటిని చీల్చుకుంటూ
ఆ సూర్యుడి ఉదయంకోసం
పడమటి ప్రయాణం చేసాడు

****
రానే వచ్చింది.. వేడుకలరోజు
విఖ్యాత కళాకారుడి విద్య, ముగిసింది
విశ్వకేతన రెపరెపలు చూసి
ఊరంతా మురిసి
తోట విందులో పొద్దు పొడిచింది

తారకల తళుకుల మధ్య
వంతులు మార్చుకునే సమయం..
ఒకరి జీవన సాఫల్యంలో తడిచిన
అన్నదమ్ముల బంధాలు

‘అన్నా! నీ రుణం తీర్చుకుంటా..
నువ్వెళ్ళి చదువుకో’ అన్న మాటకి
కాలు కదిలేనా! ఆల్బర్ట్ కి!!

చేయందుకోలేని అననుకూలత
పనిలో వేళ్ళెన్నిసార్లు విరిగాయో
లెక్కలేసుకోనివ్వని చీకటి గని
జీవిత కాలపు ఆలస్యం

ఉద్విగ్న క్షణాలు సృష్టించిన చరిత్ర అది..
ఆ కష్టజీవి చేతుల చిత్రాన్ని
గీసి లోకానికి అందివ్వడం
సహోదరుని కన్నీటి పని..

అందుకేనేమో.. నరాలు తేలిన
ఆ పొడారిన చేతుల్ని చూసినప్పుడల్లా..
ఆగలేక…
నా కంట తడి

==30.8.2013==

RTS Perm Link

2 responses so far

Aug 17 2013

యశస్వి|| యూరినాలిసిస్

Published by under my social views

నీళ్ళు తాగినట్టే!!
ప్రస్తుతం చరిత్రగా మారడం
మూత్రంలా రూపాంతరం.

ఎప్పటి కప్పుడు
కొత్త దాహం మనిషికి
తిన్నదాని లెక్కల్లేవు

ఒంట బట్టనిదేదో
రోగమై నిలదీస్తే..
నిర్థారణ చేయాలి

మూత్ర పరీక్ష కు అంతా సిద్దం
పోసేవాళ్ళకేం కరువు
పోయించేవాళ్లే లోకమంతా

ఛీ.. దీనమ్మ..
వానాకాలం బతుకులు..
ఎవడిదాడుతాగి
ఎంతకాలం బతకమంటారో ఇలా!!

పక్క తడిపే పసివాళ్ళను
వదిలేయ్
రేయ్! సూర్యా భాయ్!!

వేరార్ యూ!!
ముంబై నే కాదు
ఆంధ్రాని వదల్లేదా!!

ఉగ్గబెట్టుకోలేక ఊరంతా
వర్షం కురుస్తోంది
ఉత్తర దక్షిణ భారతాల మధ్య
ఉప్పు సముద్రం పొంగబోతుంది.

RTS Perm Link

No responses yet

Aug 16 2013

యశస్వి || చివరి సారి..

Published by under my social views

వాన చినుకులు బయట-లోపల పడుతున్నాయని..
తనకే తెలుసనుకుంటున్నాయి విడివిడిగా..
కలిసి నడుస్తున్న జంట అడుగులు

విడిపోవాల్సిన తరుణంలో
ఆఖరి కలయిక అని తెలిసీ
మనసు విప్పాననుకున్నాడు అతడు..

జారిపోతున్న మనసుని పొదవిపట్టుకుంటూ..
సున్నితంగా యధాస్థానంలో పెట్టాలన్న ప్రయత్నం
ఆమెది.

ఇక్కడ మాటల బరువును తూయలేము.
అసలు వాళ్ళమాటలు వాళ్ళైనా వింటున్నారా!!
విడిపోతున్న మలుపులో భావం అతకని
పదాల పలవరింతలు..

సంవత్సరాల తరబడి
ఎన్నో మాటల్లో తొంగిచూసిన తడి
ఎదకి చేరుతుందన్న ఆశల ఆవిరి
ఇవేమీ పట్టని అలజడి అతనిలో

మరలిపోక తప్పదన్న నిజాన్ని
నీకే ముందు చెప్పానన్న అర్థంలో

ఆపాదించిన పొడిమాటల
చిక్కదనపు లెక్కల్లో ఆమె..

అపోహలుండేవి ఆమెకు..

తలఎత్తి నడిచేది
తన చూపు తాకాలనేనని,

తలదించి మాట్లాడేది
తన సౌందర్యం మాటలకు అడ్డురాకూడదనీ..

గోదారి పరవళ్ళను చూడకుండా
చీకటి సముద్రంలోకి
తనను నెట్టేస్తుందని అతని బెంగని..

అపోహలుండేవి ఆమెకు..

అతడో సున్నిత భావాల బావి అని తెలిసినా
ఆమెకు తెలియని లెక్కలెన్నో..

విప్పారిన కళ్ళ వెలుగును..
గుప్పిట పట్టి అందించేందుకే
తన బిడ్డ కబుర్ల్లను మళ్ళీ-మళ్ళీ అడిగేవాడని..

వీడ్కోలు చెప్పిన ప్రతిసారీ
శాంతిమంత్రం మదిలో మెదిలేదనీ..

తను ఆడపిల్లయితే అచ్చం అలానే ఉండేవాడిననీ..
ఆమెకు చెప్పిందీ లేదూ..ఆమె వినిపించుకోదు..

కవలపిల్లలు విడిపోతున్నట్టు
ఆఖరిసారిగా కలసి నడుస్తున్నారు
వాన చినుకుల్లో….
ఎప్పటిలాగే సంఘజీవుల్లా
ఎవరి మనసును వారే దూరం జరుపుకుంటూ..

కంటి చెమ్మను ఆపలేని దేవుడు..
నుదుటి గీత దాటరని తెలిసి
నవ్వుకుంటున్నాడు..

==12.8.13==

RTS Perm Link

2 responses so far

Aug 16 2013

యశస్వి || కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని .. ( ఇంకెవరు శ్రీదేవి!)

Published by under my social views

“మిస్ ఇండియాలెందరున్నా
మిస్టర్ ఇండియా ప్రేయసి ముందు ఎంతన్నా!!
వెన్నెలమ్మలెన్నొచ్చినా
నిన్ను మించిన చాందినీయే లేదన్నా..

మేరీ నయనోంకీ సపనా!!
అని ఎవరు ఎవరినన్నా
నువ్వే గుర్తొస్తావ్ శ్రీదేవీ!

ఏక్ లంహే కాఫీ హై నాగినీ!
తుజే దేఖ్ తే హీ నశా చడ్ జాతీ లహోమే
తేరీ ముస్కురాహట్.. ఇన్షాఅల్లా..
కిసీ తోఫేసే కమ్ నహీ”

ఆపరా అన్నా!!
అపరంజి బొమ్మకు
ఐదు పదులు నిండాయంట
ఇంకా ఆమె శృంగార దేవతేనా!

పదహారేళ్ళ వయసు
వసంతకోకిల..
తోఫా నాటి
థండర్ థైస్ శిల్పం కాదామె..

చమురు ఆరిపోయిన బక్కపలచటి వేళ్ళూ
చేతులకేమీ తొమ్మిదేసి గాజుల్లేవు…

“అయితే నేం!!!…

ముఖ కవళికల్లో భావ ప్రకటన తగ్గని
ముడతల్లో నలుగుతున్న అతిలోక సౌందర్యం రా ”
*****

వానపాటల కేరాఫ్ అడ్రస్ ఎప్పుడో మారింది
ఆ అభినయ లోయల్లోకి దూకి ఈదలేక
పొడిపాటలే పాడుతున్నాయి కొత్తపావురాళ్ళు
అదిచాలదా ఆమె స్థానానికి పోటీ లేదని చెప్పడానికి

షిఫాన్ చీర ఆమెతోనే తెరమరుగైంది
చీరకట్టాల్సిన నాయకి చెడ్డీ తొడుగుతుందిప్పుడు
ఇందుకే ననుకుంటా..

పాకుడు రాళ్ళపై నిలదొక్కుకున్న వారెందరు
మాయా జలతారు వెనుక
నువ్వొక నిదర్శనం

సమ్మోహితం చేసే నటన
నిన్ను పసితనం నుంచీ చూస్తున్న తెలుగోడికి
నువ్వే ఓ కళారూపం

నీతలంపులు పలుచబడుతున్న వేళ
సినీ వినీలాకాశంలో పునరాగమనంతో..

ఆంగ్లం రాని అమ్మలలో కొందరైనా
స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల వైపు
నడిపించావన్న నిజం..

*ఏంచేస్తాం..*…
చూపులతో నాన్నల్నీ..
చేతలతో అమ్మల్నీ పట్టుకు కూర్చున్నావ్

అందానికీ, అల్లరికీ చిరునామా!!
ఈ పుట్టిన రోజున..
ఎప్పుడూ అడిగే వరమే మళ్ళీ అడగమా!!
నీవి మరిన్ని బొమ్మలు చూసే అవకాశం ప్రాప్తి రస్తు.

==13.8.2013==
(on her 50th Birthday)

RTS Perm Link

One response so far

Aug 15 2013

yaSaswi’s || ఇక తుమ్మను నేను..

తీవ్రమైన గాలి ఎగతన్నుకొస్తున్నట్టుంది
బయటపడదూ.. లోపలిమడలేదు
గుంఫన మంతా గుంభనైపోయింది
ఒక అర్ధ-స్వతంత్ర కంపనం.

నిన్నటి పందెరంలో
పాతనోట్ల ముక్కవాసన
ప్రకోపమేమో!
ఏం పడిశం పట్టనుందోనని
ముద్దుకి దూరం జరిగిన ప్రియురాలు..

రాత్రి కలలో రాజకీయ తారల
అమిత కాంతి సందర్శన వేదనే
ఈ వికటత్వమని
నిజం తెలుపలేను

ఒక్కటి మాత్రం నిజం..
మామూలుగా లేను

బాహ్య ప్రేరకాలు నను చేరేందుకు
ముక్కునాశ్రయించినట్టున్నాయి

నే పీల్చేగాలికి మేధోహక్కుల హామీపత్రం పై
రాజముద్ర మార్చాలంటున్నాయి

ఇప్పుడు నా నాడీ పథం కండరాలూ
క్రియాశీలంగా లేవు
ఏ గాలీ శక్తి కణాల విడుదలకు
అనుకూల ప్రేరణ కలిగించడంలేదు

నా జీవితం నా ఊపిరితో ముడిపడి ఉంటుందని
తెలిసాకా ఉక్కిరిబిక్కిరిలో ఉన్న నేను
ప్రియురాలి నిశ్వాసలను
ఎలా ఆస్వాదించగలను!!

చినుకు భాష సంకేతాలను
భేధించలేను విభేదించలేను
ముసురు తెచ్చిన పులపరింతలో
పులకరించలేను

ముక్కు నలుపుకు కూర్చోవాలిక
ప్రయాణానికి అడ్డం కాకుండా
ఎలాగైనా ఆపుకోవాలి.
ఈ తుమ్మును

==1.8.2013==

RTS Perm Link

No responses yet

Aug 15 2013

యశస్వి ||ఎందుకిలా?

ఉగ్రశ్రవసువు సౌనకాది మునులతో ఇలా చెప్తున్నాడు
వినత చిదిమిన గుడ్డులోంచి
అనూరుడు సగం దేహంతో బయటికొచ్చి ప్రశ్నించాడు

“ఎందుకమ్మా? ఇలా చేశావు??
అసూయతోనేనా
ఎందులిలా??”

ఎందుకు??
ద్విపాద పశువుని చేసినా
రెండుకాళ్ళపై నిలబెట్టినా
మనల్ని సమూహం చేసినా, ఈ ప్రశ్నే

రాక్షసబృందంలోంచి రాహువును వేరు చేసిందీ
బానిస బంధనాలనుంచి స్పార్టకస్ ను పుట్టించిందీ ఈ ప్రశ్నే
రామాయణం జరిగుంటే యుధ్ధకారకమూ ఈ ప్రశ్నే
దేశ విభజనలో చిందిన రక్తానిదీ ఈ ప్రశ్నే

అసలీ ప్రశ్నే ఓ యుధ్ధభేరీ
ఓ ఆలోచనకు తొలి అడుగు
జలస్థంబన విద్య తెలిసిన వాడికి
ఈ ప్రశ్నే అవసరానికి నీళ్ళ మడుగు

కావాలన్నా ఇదే ప్రశ్న.. వద్దన్నా ఇదే ప్రశ్న..
ఎందుకిలా!! ఎందుకిలా!!
ముందే పుడుతుంది ఈ ప్రశ్న
లాభనష్టాల బేరీజు ఇక తరువాతే..

సమస్యల కీకారణ్యంలో
పంపకాల అయోమయం
అడిగినోడికి ఏంకావాలో!
ఇచ్చినోడు ఏమాశించో..

ఒకింట్లోనే లేచాయి అడ్డుగోడలు
ఈ ప్రశ్న ఉదయించాకే
కావాలన్నోడికి పండగే..
వద్దనుకున్నోడికి ఇప్పుడు ఆవేశం దండగే..

గుమ్మాలు వేరయ్యాకా
కుంపట్లు ఒకటవుతాయా!!
కష్టాల కంటితుడుపులో
త్యాగాల వెలకట్టగలమా?

ఉగ్రశ్రవసువు సౌనకాది మునులతో కొనసాగింపుగా ఇలా చెప్తున్నాడు
వినత చిదిమిన గుడ్డులోంచి
అనూరుడు సగం దేహంతో బయటికొచ్చి ప్రశ్నించాడు
ఎందుకమ్మా? ఇలా చేశావు?? అసూయతోనేనా!!

అయితే అనుభవించు దాసరికం చేస్తూ
కనీసం తమ్ముడ్నైనా ఎదగనీ పరిపూర్ణంగా
నిను ఉద్దరించేది వాడే..అని అన్నాడో లేదో..!!

వెలుగుల రథాన్ని నడిపించడానికి
వెడలిపోయాడు అనూరుడు

==30.7.2013== (7-7.30 pm)

RTS Perm Link

No responses yet

Aug 15 2013

Yasaswi’s ||ఓ దేశభక్తి కవిత : సిపాయిల తిరుగుబాటు కాలం


Yasaswi’s ||ఓ దేశభక్తి కవిత : సిపాయిల తిరుగుబాటు కాలం

మూలం: సూరజ్ మల్ మిశ్రానా ((1815–1863)

పందులు పంటల్ని పాడుచేసినట్లు..
ఏనుగులు కొలనులో అలజడి చేసినందుకు
కేసరి సివంగిని సైతం మరచినట్టుంది
ఏ పందెంలో పణంగా పెట్టిందో పౌరుషాన్ని

ఓ ఠాకుర్! నువ్విక సింహానివి కావు
పరదేశికి కప్పం కట్టి బతుకుతున్నావు
పంజాదెబ్బకు ఏనుగు కుప్పకూలితేనే నువ్వు నువ్వు.
దయనీయం ఈ జీవితం నువ్విక మృగరాజువి కావు

పరదేశీ పాకులాటలో కష్టాల పరంపర
లోతుల్ని గమనించకున్నావు
లక్ష్యం లేక విలాసాలలో
విలువైన కాలాన్ని ముంచేసావు

ఏం మిగిలింది నీకు
గతిలేని పూరిపాకల పాటి జీవనంలో
మట్టిగోడలమీద
పెరుగుతున్న గరిక తప్ప

ఏం మిగిలింది నీకు
ఎత్తైన రాజప్రాసాదాల వెనుక
పరాయి సర్దారుల చీత్కారాలు
గులామ్ గిరీల అవమానాలు

రాజగృహాలు కొల్లగొట్టిన జీవితానికి
పూరిపాకల శాపాలు
పూరిళ్ళపై లూటీకొస్తే
అడ్డమేముంది!!చావేగతి నీకు

బ్రిటిష్ వారికి తలవంచిన రాజుల్ని ఉద్దేశించి.. (ఇంగ్లీష్ నుంచి అనువాదం)

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa