Archive for June, 2013

Jun 22 2013

||బతికుండగా వినిపించుకుంటామా?||

ఒడిలో పిల్లల్లారా!..
దైవదర్శనం కోరి వచ్చిన మిమ్మల్ని
శాశ్వత నిద్రపుచ్చానని..
మీవాళ్ళు నిందిస్తున్నారు..

ఎడబాటుని జీర్ణించుకోలేక
రోదిస్తున్నారు..
అర్థం చేసుకోలేని మూర్ఖత్వంలో
నెపాన్ని.. పాపాన్ని..
తల్లి ప్రకృతిని
నాకు అంటిస్తున్నారు..

లయకారుడి సన్నిధిలో ఈ సహయోగం
మీరుకోరని.. ఈ దైవదర్శనం తర్వాత
బతికున్నప్పుడు ఎవరూ అర్థం చేసుకోని మాటలు
మీకు.. ఇప్పుడు చెబుతున్నా

నా గుండెలు, బద్దలుకొట్టి..
గర్భాన్ని కొల్లగొట్టి..
కొండచెరియల్నీ, నేలబొరియల్నీ
వదలకుండా నన్ను తిరగబెట్టి..
పచ్చదనాల ఆఛ్ఛాదనను
కర్కశంగా చీరేసారు.

ఎంత తల్లినైనా ఇంత కుమ్ముడు
ఎలాగో తట్టుకుందామనుకున్నా..

నా తండ్రి ఆకాశరాజు కన్నీరు చూసి-చూసి
చెల్లి గంగమ్మ శివయ్యను కడిగేసి నట్టుంది..
కేదార శిఖపాయ సడలినట్టైంది

చెరబారీ సరస్సు చినుకు చుక్కలతో చిందేసింది
మిమ్మల్నిలా నా ఒళ్ళో.. పడుకోబెట్టింది.

మీ నిష్క్రమణంతోనైనా
ఈ లోకానికి కనువిప్పు కలిగేనో లేదో..

నా మాట కాస్త ..ఆలకిస్తారా!!

పాపం పండటమంటూ ఏదైనా ఉందంటే..
అది నన్ను పిండడమే.నని
బ్రతికున్న మీ వాళ్ళకు బోధ పడని ఈ మాట..
మీ మరుజన్మ లోనైన గుర్తించుకుంటారా!!

ఇట్లు.. పుత్రశోకంతో.. మీ తల్లి.; పేరుకి.. రత్న గర్భ.

(హిమాలయ సునామి.. జూన్ 15, 2013 న వేల మంది చనిపోయారని నిర్థారణకు వచ్చాక…)

RTS Perm Link

One response so far

Jun 20 2013

||బేరం- నేరం||

||బేరం- నేరం||

ఓయ్! తోటకూరా!!.. ఎలా ఇస్తున్నావ్?
‘పదికి 4 కట్టలమ్మా!’
…మరి “8 ఇవ్వవా!!”
‘కిట్టదమ్మా…..’ ‘…..ఐతే పో.’
ఇది నే చూడలేని వ్యధ

ఆటో!.. వస్తావా!!…
“….మీటరు మీద 20 eXtra ఇస్తావా?
ఎందుకివ్వాలి!! వద్దులే బాబు….”
ఇది నే రాయలేని కథ..
నాకు ఈ తంతే .. చీదర.

చిల్లర చాలక చేతుల్ని నలుపుకున్నా..
సరుకుల్ని కొనడం
ఎన్నోసార్లు విరమించుకున్నా కానీ ..
పదిపైసలు కలిసొస్తాయని
అడ్డదిడ్డంగా.. బేరానికి దిగలేను

బేరమేమంత నేరమా!!
అని అడగొద్దు నన్ను అతిశయంగా..
ఆ బేరాలు నాదగ్గర సాగవు

కోట్లు మింగిన గద్దల్ని
సంఘటితంగా గాలికి వదిలేసి..
పిచ్చుకల జీవితాలతో పరాచకాలాడాలని..
తోపుడు బండితో పావుబేరం
కూరల గంపతో సగం బేరం సబబే నని
ఏ బళ్ళో చదివాము! ఈ పాఠాల్ని!!

ఇరవై రూపాయిలు ఆశించే రిక్షావాడికి
పది రూపాయిలే చాలంటావా!!
దుమ్మెత్తిన నీబూటుని గుండెలకు హత్తుకుని
మిసమిసలద్దినోడికి సగం డబ్బులతో సరా!!
పావుకేజీ తూకానికి చటాకు కొసరు కోరతావా
ఇదెక్కడి న్యాయం?

అర్థరూపాయి రేటు పెంచి
ఐదు పైసల డిస్కౌంటులిస్తుంటే..
షాపింగ్‌మాల్ సంస్కృతికి
తలవంచి కొనుక్కునే మనకు..

బేరాలాడడానికి..
అసంఘటిత కార్మిక లోకమే ..
దొరికిందా?

పెట్టుబడిలేక వంకాయల వడ్డీ* కింద
ఉదయాన్నే తొంభై రూకలు అప్పు తెచ్చుకునే వాడు
రాత్రికి వంద తిరిగెలా ఇస్తాడు!! నీ లెక్కల్లో..

బేరగాడి రూపంలో నవ్వుని చిదిమేసుకుని
ఆరిందాగా..అన్యాయంగా.. గదమాయించకు
చేపల మార్కెట్టుని చూపి నను సముదాయించకు..

నీ వలలో ఎవరో పడ్డా పడకున్నా
నీకు రాని వల విసిరే ఒడుపుని,
కాలే కడుపుని.. గౌరవించు..

రేటుని బట్టి వస్తువుండదు సోదరా..
అవసరమే అమ్ముడవుతుంది అంగట్లో
నీ అవసరాల గాలానికి బేరం ఎరవేసి
అర్థాకలిని అమ్ముకోనివ్వకు
అపనమ్మకాన్ని నమ్ముకోనివ్వకు..

ఏ అర్థరాత్రో అవసరమొచ్చినప్పుడు..
ఆటో అన్నని ఆప్యాయంగా అడుగు
మీటరు మాటెత్తకుండా ..
భద్రంగా గమ్యం చేర్చమని..

లాభనష్టాల తరాజును తూచకుండా ..
నాలుగు మాటల్ని పంచుకుంటూ..
రోడ్డు భద్రత చూసుకుంటూ..
ప్రయాణం ముగిసేదాకా..

ఇక లెక్క తేలినట్టే అనుకున్నాకా..
కనీసం కళ్ళలో నవ్వులతో ఒక మెరుపు మెరిసినా
రెండు చేతులు ఒక్క క్షణం పెనవేసుకున్నా
బేరాలాడడం బేకార్ అని..
ఇద్దరు శాశ్వతంగా గుర్తుంచుకున్నట్తే..
నా క్లబ్ లో మరొకరికి సభ్యత్వం దొరికినట్టే..

==19.6.13==

RTS Perm Link

2 responses so far

Jun 13 2013

||నగు మోము గన లేని నా జాలిఁ దెలిసీ..||

మబ్బులెనక జాబిలమ్మలెన్నో..
ముక్కలు-ముక్కలు గా కదిలొస్తున్నట్టు..
ఆకాశంలో సగభాగాన్ని కప్పేసి
చందమామ కొంటెగా చూస్తున్నట్టు..

ఘోషా సౌందర్యానికి
జవనాశ్వాల వేగాన్ని అద్ది..
రాజధాని నగరంలో
రయ్యన దూసుకు పోతున్నాయి
రెండు చక్రాల రథాలు

మేలిముసుగుల పరదాకి
కాలుష్యం .. మిష
మరి కారణాలు
వెనక్కిపోయే పొగలో కానరావు

విషయం ఏదైనా కానీ..
దాగి ఉన్నదెప్పుడూ
మేలిమి అందమేగా!!
అలా అనుకోవడంలోనే ఉంది
హమేషానిషా

ఇదే ఒకందుకు మంచిదేమో..
నా దుశ్శాసన మనసు కేవలం
ముసుగులోన ముఖాన్ని మాత్రమే
చూడాలని కోరుతుందిప్పుడు..

సిగ్నల్ దగ్గర ఒక పరదా పరిందా*
ఆగి ఆగకుండా.. చూపులు గుచ్చి
తుర్రుమన్నప్పుడు..
గుండె మెటికలు విరుచుకున్న చప్పుడు…..

RTS Perm Link

3 responses so far

Jun 11 2013

|| U bend..||

కొండవాలు దారి మలుపు లో
ఎదురెదురు ప్రయాణాల్లో
తలతిప్పి చూసా..

బ్రతుకు బండి బయటేకదా!
నీ చూపులు నన్ను..
చివరిసారిగా.. మెలేసాయి.

విడివిడిగానైతేనేం
ఒక్కదిక్కుకే
పోతున్నామనుకున్నా..

నువ్వు పైకి.. నేకిందకీ
అని గుర్తించేలోగా
కనుమరుగయ్యావు..

చేతుల్లో మిగిలిందల్లా..
గుప్పిట నిండిన..
గుండె సలపరమే

ఇక ఆలోచనంతా
తిరుగుప్రయాణం మీదే..
ఒక్క క్షణమైనా..మళ్ళీ కలుస్తామా!!

నే పైకి.. నువ్వు కిందకీ..
కంటిచూపులకందకుండా..
ఏమిటీ రాకపోకలు..

మలుపులే తప్ప
మజిలీలు లేవు..
తట్టుకోవడమెలా!!

ఎక్కడ ఆగాలో..
ఎంతకాలం ఇలా సాగాలో!
తెలిసేదెలా!!

==11.06.2013==

RTS Perm Link

2 responses so far

Jun 07 2013

||అ-అమ్మ.. ఆ- ఆవు ||

Published by under my social views

ఇరకతరకల ఈ లోకంలో..
తిన్నగా నడిచే ఓ మనిషిని కలిసాను.

ఆడంబరాల మేడలు అంబరాన్ని తాకాలని
పునాదుల్లో గోతులు తీసుకున్న మాట మరచి
రాత్రుళ్ళు బోర్లా పడే పిచ్చోళ్ళ రాజ్యంలో..నేనూ సభ్యుడినేనని..
విడమర్చి చెప్పిన మనిషిని..మొదటిసారి కలిసాను.

పుబ్బకో..పుష్కరానికో మంచానపడ్డా..
అది ఆత్మహత్యా యత్నమేనని..
రైతు తెలిసీ.. మనం తెలియక
పురుగుమందులు తిని-తాగే
పరలోకం పయనమవుతున్నామని..
రోగాలు పైకి కనిపించే కారణాలని
విడమర్చి చెప్పినందుకు..

కొంత ముందే తెలిసినా..
ఇంతకాలం నమ్మనందుకు
నాకు తెగ సిగ్గేసింది

కొబ్బరిబొండంలో స్ట్రా లేకుండా తాగలేని నేను..
పేపర్ ప్లేట్‌లో ప్రసాదం తినే నేను..
సంప్రదాయాన్ని పాటిస్తున్నానని..
ఇంతకాలం.. భుజాలెగరేసినవాడ్ని
పళ్ళు తోమాలన్నా, ఒళ్ళురుద్దాలన్నా..
నీళ్ళు తాగాలన్నా, ఊరంతా ఊరేగాలన్నా ..
విదేశీ మోజు భుజకీర్తులై మోస్తున్నవాడ్ని

కమీషన్ల చేతివిదిలింపులే నా వాళ్ళకుతప్ప
నా కష్టార్జితమంతా
పరాయిదేశాలకే వలసపోతుందని..
తొలకరి వాన తడిపిన మట్టివాసన
నిజాల గుట్టువిప్పితే..
దిక్కులన్నీ ఒక్కసారి నాపై పడ్డట్టైంది
నాలుగురోడ్ల కూడలిలో నుంచోబెట్టిన్నట్టుంది

తన తపోఫలమే ఖర్చులేని సేద్యమైనప్పుడు..
తన ఆలోచనే..రైతుల బలవంతపు చావులను ..
ఆపే ..మంత్రమైనప్పుడు..
తన మాట లక్షల మందికి ఆచరణీయం అవుతునప్పుడు
ఓమాట పంచుకోవాలనీ అతని బాట చూపించే వేలవ్వాలని
ఈ అక్షరాలు కవిత కాకపోవనీ,
మత్తెక్కించని మాటల మూటని
చిత్తుగా తాగిన వాడికి మజ్జిగ లెక్కన తీసుకువచ్చా..

ఈ రోజే కలిసాను.. ఆ సామాన్యుడ్ని
నీరుకావి ఖద్దరు బట్టల మనిషిని..
పెద్ద దేశాలను పోషించరాక
పేస్టు-సబ్బూ వాడని వాడ్ని..
కొండ కోతల వ్యవసాయం తల్లి గుండెకోతని తలచి..
చాయ్ నీళ్ళు ముట్టని వాడ్ని..

రైతుని బలవంతపు చావునుంచి
తప్పించాలన్న సంకల్పం..
అమ్మకు ఇంటిపనుల్లో సాయం చేసే బిడ్డలా
నేలతల్లి సారాన్ని కాపాడి పెమ్చాలన్న బాధ్యత ..అతడిది
ప్రకృతి పులకరించే ఆ పేరు సుభాష్ పాలేకర్

శాస్త్రవేత్తల ముక్కున వేసుకున్న వేళ్ళు
అలానే ఉన్నాయి.. వందల్లో
ఒట్టిపోయినదైనా..ఒక్క దేశీ ఆవు వెంటుంటే..

౩౦ ఎకరాల పంట
పెట్టుబడి లేకుండానే పండించొచ్చన్న మాట..
అడవితల్లిని తడిమి చీడల్లేని పెంపకాన్ని
కొనకుండానే పంటలకు పంచాడంటే..
’పిచ్చాడు’ అనుకునేరు.. అన్నల్లారా!..అక్కల్లారా!!
40 లక్షల రైతులు పక్కరాష్ట్రాల్లో పక్కాగా నమ్మారు

ఆధునిక వ్యవసాయం అప్పులతో నలిపేస్తుంటే..
అసలు కారణాలను స్పృశించిన
మూలకణం ఇతడు..
చుక్కల్లో ఉన్న సాగుని చంకనెత్తుకుని ఆడిస్తున్నాడు.

బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు..
జీవామృత మిశ్రమాన్ని ఎరవేసి
వానపాముల్ని రప్పిస్తాడు..
ఈ కర్షకమిత్రుని రైతుమిత్ర ఆకర్షక మంత్రం..
గో మూత్రం తో సుద్ధి చేసిన దేశవాళి విత్తనం
ఇది పరిశోధనల్లో నిగ్గుతేలిన
కామధేనువు సహజాతం..

నమ్ము.. మిత్రమా ఈ మాట..
నిప్పులేని ఆలోచనలలో ఉన్నవాడి కంటికి
ఎండుటాకు ఎప్పటికీ మండదు.
పెట్టుబడి లేని వ్యవసాయం చేసేవాడి
పొయ్యి తప్ప చెయ్యి కాలదెన్నడూ..

తెలుసుకో !! తెలియజెప్పు నలుగురికీ..
ఈ పద్దతి భూసారం పెంచేదేకాదు..
ఎలా బతకాలో చెప్పే జీవనసారం..

ఇల్లు గుల్లవ్వడం నేల గుల్లవ్వడం..
ఒక్కటి కాదు నేస్తమా!!

బతుకు డొల్లవ్వడానికీ,
మొక్క మొలవడానికీ తేడా ఉంది.
అ ఆ లతో మళ్ళా మొదలెడదాం..
బ్రతికిస్తున్న దైవాలకు దణ్ణంతో మొదలుపెడదాం..

అ అమ్మ.. ఆ .. ఆవు..

(ప్రకృతి సేద్య పాలికాపు.. పాలేకరు కు పాదాభివందనాలతో..)

RTS Perm Link

One response so far

RTSMirror Powered by JalleDa