Archive for May, 2013

May 27 2013

|| సూరి బాబూ.. I request you..||

ఓ సూర్య నారాయణా.. ఏమిటీ కోపం మాపైన..
ఎందుకిలా నిప్పులు చెరుగుతున్నావిలా!!
పేపరు చూస్తే.. భయమేస్తుంది.
నీ తొంబై డిగ్రీల కోణపు స్పీడోమీటర్
నలభై తొమ్మిది చూపిస్తుందని..

ఏ అగ్నిదేవుడి అజీర్తి తొలగించాలని
ఖాండవదహనం చేస్తున్నావు!!

ఏ ఇంద్రుడూ నా తోడులేడన్న అలుసేగా
నను తక్షకుడిని చేసి బాధిస్తున్నావు.
నరనారాయణులిప్పుడు అవతరించక్కరలేదు
సగటు నరుడికి చంద్రధనస్సు ఇవ్వక్కరలేదు
నీ కిరణాల అక్షయ తుణీరం చాలు

మా శరీరాల్లోంచి రక్తాన్ని..
చెమటచేసి లాగడానికి

ఎన్నికల కాలం దాకా ఆగు..
ఓటు అమ్మేసుకుని
మమ్మల్ని మేమే కాల్చేసుకుటాం
మా జీవితాల బూడిదకుప్పల్ని రాజేసుకుంటాం

నాకు చిన్ననాటినుంచే తెలుసు..
మా అమ్మ తన తొలి చూలు బిడ్డకు నీ పేరే పెట్టిందని..
అరసవెల్లి దేవుడా నా మొరాలకించవా!!
అన్నవనుకుని అర్థిస్తున్నా..
రేపు కాస్త కనికరం చూపించు..

నా చిట్టితండ్రి రైలెక్కి వస్తున్నాడు
రాజమహేంద్రి నుండి భాగ్యనగరానికి
పగలు బయల్దేరాడని పగబట్టకు
ఏడు గుర్రాల వాడా!!
ఏడేళ్ళు నిండిన పసిబిడ్డ వాడు

నా జన్మభూమిని పావనం చేద్దామని
నా జన్మదాతను తరింపచేద్దామని
ఆజన్మ రుణానుబంధాన్ని
కొంతైనా తీరుద్దామని
వెళ్ళి వస్తున్నాడు జన్మభూమి రైలులో..

చైర్కారులో టికెట్టివ్వలేక
అయ్యారు సీటీసీ తత్కాలు లేవంది
ఈ తండ్రి మనసు తల్లడిల్లుతోంది..

రేపైన కరుణించు ఓ ప్రత్యక్ష సాక్షీ
పసివాడు వసివాడకుండా
వెన్నెల్లుకురిపించలేవా..
చంద్రుడ్ని నీ బదులు పంపించలేవా!!
బదులేమైనా కావాలనిపిస్తే..
ఈ తండ్రి సిధ్ధమే..తనువొదలాలన్నా.

చూసుకోనివ్వా.. తనివిదీరా..
నా కంటి చంద్రుడ్ని అందాల ఇంద్రుడ్ని
మరొక్కసారి..మరొక్కసారి..

** 25.5.2103**

friends! I am happy that I got my son..and moon back.
Hyderabadi biryani! now its your turn to make him happy.: 26.5.@9 pm

RTS Perm Link

No responses yet

May 24 2013

||కాసిన్ని కబుర్లు.. కవిత్వంతో..||

చేతిలో చెయ్యేసి నడుస్తున్నాం ఇద్దరం
వొకరినొకరం తెరమీద హత్తుకోనందుకు..
మనసుల్లోనైనా తిట్టుకోనందుకు
వివాదాస్పదం కాలేదింకా
ప్రశాంతంగా సాగిపోతున్నాం..

కవిత్వానికీ నాకు దోస్తీ కదా..
ఆ చనువుతోనే అడిగా ఈరోజు..
ఈ రోజు నిన్నెలా అలంకరించను!!
ఆధునికంగానా!.. సనాతనంగానా!!

అన్నది కదా!..’”ఎందుకీ మీమాంస
నన్ను నగ్నంగానే ఉంచు’”…

మరో అనుమానం ..’మరి రౌడీ మూకలు వెంటపడవా!’

కవిత్వం.. అంది…. నవ్వుతూ ..

” …..ఎలా కనిపిస్తున్నాను నీకు!!
నీకు లీలగానే నా రూపం తెలుసు..

నిజం నా సహచరుడవ్వాలని
నిష్టూరాలు వేధిస్తూ ఉన్నా..
నిన్నే పట్టుకుని ఉన్నా..

మధూన్మత్తతలో నన్ను మధువుననుకోకు
వేదనా భావనలో అగాధమనుకోకు

మన మధ్య దూరమెంత!!
అనుగ్రహమున్నంతవరకే శూన్యం
నేనాగ్రహిస్తే.. అనంతం

దూరమయ్యాకా..
ఎన్నిరాగాలను వినగలవ్! నా పాటకోసం!!
ఏమి వెచ్చించి కొనగలవ్! చేజారాకా!!
జీవన పతంగ సూత్రం!!

విశ్వశేయమే నీ ఆదర్శమైనప్పుడు..
నీకు నేను తోడుంటాను
ఆనాడూ మంచిని పంచమని తప్ప..
నన్నలంకరించమని అడుగను

అక్షరానివి నువ్వైతే..
నిన్నావరించుకుని నేనుంటా..
అక్షరమే నన్ననుకున్నవారంతా..
ననులోకంపైకి వెదజల్లామనుకున్న వాళ్ళంతా..
నను వదిలేస్తున్న వివరాన్ని గమనించరు..

అలంకారాలు ఏమిచేస్తావు నాకు నేనే వెలుగైనప్పుడు
భాషను, వేషాన్ని ఏమి మారుస్తావు.. నీకు నేను తెలుగై నప్పుడు
ఆధునికానంతర అవతారం నాకు లేదు..
నవ్వులు పంచుతూ, కన్నీరు తుడుస్తూ నాతో నడు.. చాలు..”

ఇంకేం మాట్లాడతాను ..!! నేను !!!

RTS Perm Link

No responses yet

May 24 2013

||హైదరాబాద్ బజారుల్లో ||

Published by under my social views


ఇక్కడ..(ఒకప్పుడు..) ఏం అమ్మేవారు నానీమా!..
అడిగాడు.. ఓ బుడతడు.. బామ్మని..

పాతరోజుల్ని పలకరించిదేమో.. నిట్టూర్పు..
పోయిన రోజుల్లోకి వలిసపోయింది.

అమ్మగలిగినంతకాలం కళ్ళముందే పరిచారు వర్తకాన్ని
తలపాగాలూ- శేర్వాణీలూ మాల్స్ లోకి వెళ్ళిపోయాయి..
అద్దాల మండువాల్లో అద్దాలెవరూ కొనరిప్పుడు
చురకత్తులా.. అమ్మకాలు నిషేదం..
ఇప్పుడసలే రోజులు బాలేవు
ఏం మోసుకొస్తారిప్పుడు.. కొనే ఇళ్ళున్నాయా.. బేటా?
గాలిమేడల్లో గార్డులు రానిస్తారా!!
కుంకుమపువ్వా! పప్పులా!! బియ్యమా!!!
గంధమా.. గోరింటాకా! గరం మసాలాలేనా!!
కొనేవన్నీ ఒక్కచోటే.ఇప్పుడు..
. చేపైనా.. చాపైనా

ఇంటింటా తిరిగే.. కాడి బుట్టలోరేరి!
చదరంగమా.. పాచికలా..

ఆటలసలు ఇంటిపట్టున ఆడేవాళ్లం ..
ఒరే చిన్నా.. నా మాట వింటున్నావా!!
జనం రిక్షాల్లో తిరిగేవారు..
బంగారంకొట్టుల్లో నగలు తయారీ ఉండేది.
పావురాళ్ళకాలికి కట్టే మువ్వలు అమ్మే వారు
తూనీగల రెక్కలాంటి సున్నిత పనితనం ఎక్కడికో ఎగిరి పోయింది..
వంకలూ.. కడియాల కాలం చెల్లింది
పళ్ళమ్మేవాళ్ళు అరిచి పిలిచేవారు కన్నా..
ద్రాక్ష, దానిమ్మ అని.. సిట్రాన్, పోమిగ్రనెత్ అని కాదు..

అక్కడక్కడ ఏక్తారా అప్పుడప్పుడు డప్పు వినిపించేవి.
పూలల్లే ఆడపిల్లలు నవ్వుతూ కనిపించేవారు..
రంగుల కుచ్చులు గుమ్మాలకు కట్టేవాళ్ళం..
పూల కిరీటాలు పెళ్ళికొడుకులకు పెట్టేవాళ్ళం
పూల గుత్తులతో..
తాత పోతే..పూల గుత్తులతో అలంకరించారు చాచాలు..
ఆ ఊరూ ఇదే.. ఈ ఊరూ అదే.. కాలం మారిందంతే..
చల్ బేటా.. ముందుకు నడుద్దాం…

RTS Perm Link

No responses yet

May 10 2013

||నీకో మాట చెప్పాలి..||

Published by under my social views

అల్లంత దూరాన.. నను చూస్తూ..
ఓ మాట చెప్పినా.. పని అప్పజెప్పినా..
గట్టిగా హత్తుకుని చెప్పినట్టే..
మరి నన్నెందుకు చదవలేకపోతున్నావు!!

గొంతెంత పెంచి విన్నవించినా..
ఆలకించడానికి
నువ్వే నిండి ఉన్నప్పుడు
నా బుర్రకెక్కడి ఖాళీ!!

ఆ రోజుల్లో.. అర్థమయ్యేవి అన్నీ
నీ మాట.. మధురం

మొహం మొత్తిన దినమన్నదే..లేదు
నీ మనసు లలితం

నాకేదీ గట్టిగా గుచ్చుకున్న గుర్తులేదు
నీ తలపు మరచిన క్షణమన్నది ఉన్నదో లేదో!!

బంధం.. ఎంత పనిచేసిందో చూసావా!!
లాలిత్యమూ.. మాధుర్యమూ తగ్గిందని
అబద్దాలు చెప్పను నేను..
పాకం గట్టిపడిందంతే..

పంచదార చిలకల్లాంటి మాటలు..
కొరుకుడు పడడంలేదు
నాకే సొంతమైపోయిన నీ మనసు
మాటల్లోంచి తొంగి చూడడం లేదు

రేపటి రోజుల ఆలోచనల్లో తప్ప
పెళ్ళి బంధానికి ..వర్తమానంతో సంబంధంలేదు..

కాలం సానపై గంధపు చెక్క జీవితాలను
అరగదీసుకుంటూ బతికేస్తున్నాం మనం
లోకానికి సువాసనలు వెదజల్లుతూ..
రోజుల తరబడి కరిగిపోతున్నాం..

అరిగిపోయి.. ఒకరికొకరికి దూరంగా
జరిగిపోతున్నాం..

చనువు ఎంత పనిచేస్తుందో చూసావా!!
ఇద్దరం ఒక్కటే అన్న మాట నిజమనుకుని..
పూర్ణంగా ఉండలేక విడివిడి గా ఒక్కటౌతున్నాం.
సాన్నిహిత్యానికి దూరంగా కలసి ఉంటున్నాం

నువు లేనప్పుడు నీకో మాట చెప్పాలి..
నువ్వంటే బోలెడు ఇష్టమని..
నువ్వొద్దన్న పని చేయడమంత ఇష్టమని
నిన్ను విసిగించడమంత ఇష్టమని..

మరి నువు నాతో లేనిదెప్పుడు!!
చనువు ఎంత పనిచేస్తుందో చూసావా!!

RTS Perm Link

No responses yet

May 07 2013

||గుండు వేసవి కాలం||

దేవుడి మొక్కుబడో..
మనకి అవసరమో..
మండే ఎండల్లో తెలుగోడికి..
కోనేటి రాయుడు గుర్తొస్తాడు..

భక్తి కారకమైనా కాకున్నా
గుండు వేసవి అవసరమౌతుంది..
నడిచొచ్చేస్తే.. బొచ్చిచ్చేస్తే..
పనులౌతాయన్న స్వార్థంలో
దేవుడికి ఉత్త చేతులు బిగించేసి
లేని గోవుని చూపించేస్తాం
పరకామణిని లంచాలతో నింపేస్తాం..

అమాయకదేవుడికి
ఇక్కడ్నుంచే ఓ దణ్ణం పెట్టి..
తిరపతికే ఎగనామం పెట్టడానికి
సవాలక్ష కారణాలు వెతుక్కుంటూ..
నేను రంగం సిద్ధం చేసుకుంటా..

కోరని కోరికలను తీర్చలేదని
తిట్టుకుంటూ వాడితో..
నీదగ్గరికి అప్పుడే రానంటా..
మాఇద్దరి మధ్యా ఉన్నచనువది మరి..

దేవుడిపై దృష్టి లేనివాడికీ చిరాకెక్కువే..
అని నన్ను తిట్టుకుంటూ
పెరిగిన జుట్టును వేళ్ళతో కొలుచుకుంటూ..
పేరూ ప్రచారం ఉన్న సౌందర్య చావిడీ గొలుసు లంకె
ఒకదానిని అదిలిస్తాను ఫోన్ లో..
కత్తుల కాంతారావు కాల్ షీట్ ని బట్టి
వెళ్ళాల్సిన సమయం తెలుస్తుంది.
తీరా వెళ్ళాకా అడిగే మాటొకటే..
ఎన్నంగుళాలు తగ్గించాలని
కొలతలు తెలియని నేను నసుగుతాను..

చైనా వాడికి
ఈశాన్య భారతం మీద ఉన్న మక్కువలా
క్షురకత్తికి నా నెత్తిమీద ఆకలి ఎక్కువౌతుంది.
నే సగం బొచ్చులేనివాడ్నవుతాను..

నాకున్న సందేహమల్లా ఒక్కటే..
ఇప్పుడెవరన్నా నాకు అప్పెడతారా!!

మా తాత నడిగితే..
జుట్టులేనోడికి దొరకదన్నాడు..
పిల్లాడేమో..
క్రెడిట్ కార్డ్ ఫొటోలో ఉందికదా అంటున్నాడు..

RTS Perm Link

No responses yet

May 03 2013

సిలికానంధ్ర ఉగాది పోటీల్లో $150 బహుమతి పొందిన నా కవిత ఇప్పుడు సుజనరంజనిలో…

Published by under my social views

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may13/kavitha-2.html
నా బ్లాగు మిత్రులందరికీ పేరు పేరునా మప్పిదాలు..

RTS Perm Link

2 responses so far

RTSMirror Powered by JalleDa