Archive for April, 2013

Apr 26 2013

తెల్లకాగితం పుస్తకావిష్కరణ

Published by under my social views


ఈరోజు ఈనాడు జర్నలిజం స్కూల్ లో ఆర్వీ రామారావు గారి షష్టిపూర్తి, తెల్లకాగితం పుస్తకావిష్కరణ వేడుకగా జరిగాయి.
ఫోటోలో కనిపిస్తున్నవారు..
శ్రీ ఎల్.వి ఎన్. పట్నాయిక్, అభినవ పెద్దన యరాప్రగడ రామమూర్తి, తెల్లకాగితం కవి యశస్వి సతీష్, ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపల్ శ్రీ మానుకొండ నాగేశ్వర రావు, షష్టిపూర్తి దంపతులు, పుస్తక ఆవిష్కర్త శ్రీ ఆర్వీరామారావు, శ్రీమతి శారద, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, కథా సంపాదకులు వాసిరెడ్డి నవీన్, సీనియర్ పాత్రికేయులు ఏ ఏవి ప్రసాద్.

RTS Perm Link

3 responses so far

Apr 20 2013

రెండ్రోజుల ముందుగానే..

22 ఏప్రిల్ 2004 న పెళ్ళాడినందుకు
22 ఏప్రిల్ 2005 న మా బాబు పుట్టాడు..
అన్నప్రాశన రోజున కలం పట్టాడు.. నేనాగలేక..
ఆ కలం లాగేసుకుని.. తెల్లకాగితం మీ ముందు పెట్టాను.

ఓ విధీ..♪♫ ♪ ♪♫ ♪♫
ఓ విధీ..♫ ♪ ♫♪♫ ♪♫ ♪♫ ♪ ♪♫♫ ♪ ♫ ♪♫ ♪♫ ♪♫ ♪♫ ♪♫

RTS Perm Link

3 responses so far

Apr 20 2013

ఓ పుట్టినరోజున..

ఔనను.. కాదను.. పుట్టినరోజు just a date అనూ!!
అది మళ్ళీ రావడం నిజం అనుకోకు..
అయినా ఒక్కసారి పుట్టాకా మళ్ళీ ఎలా వస్తుందది!!..
ఎవరైనా ఇది నా పుట్టినరోజంటే.. వారి పిచ్చితనానికి నవ్వుకుంటానేను.

అసలు వస్తే.. అహ.. వస్తే.. ఏంచేస్తాం!!..
ఏడుపుతో మళ్ళీ మొదలు పెట్టగలమా జీవితాన్ని!!
అందుకే.. నవ్వుతూ స్వాగతిస్తాం.. మనం చూడలేని గతాన్ని.
మనల్ని మనం పొత్తిళ్ళలో చూసుకోలేము కనుకే.. పిల్లల్లో మనల్ని చూసుకుంటాం..

వారి పుట్టినరోజు వేడుకలను కలగంటాం.
గతం లోకి వెళ్ళినట్టనుకుంటాం..
భవిష్యత్తులోకి ఒక అడుగు మనల్ని మనం నెట్టుకుంటాం..
మన జీవితంలో కొన్ని నవ్వుల్ని వెలిగించుకుని కొవ్వొత్తుల్ని ఆర్పుకుంటాం.

కేకునీ.. కోకునీ.. పంచుకుంటాం..
కొన్ని ఙ్ఞాపకాలను చప్పరిస్తూ..
కొన్ని అనుభూతుల్ని గుటకలు మింగుతూ..
కనిపించని ఆనందాన్ని నవ్వులతో తలచుకుంటాం..

అనుక్షణం అనురాగంగా జీవించడమే దైవానుగ్రహమైనప్పుడు
Happy Birthday అనుపల్లవులెందుకు!!
జీవితం అనే ఆకాశం కింద నీవింకా మొక్కవే… పుష్పించాలి
చెట్టై.. కాయలు కాయాలి..
వృక్షమై నీడనివ్వాలి..
నీ నీడకు తోడవ్వాలి.
ఈ లోకమే నీ అనుబంధాలకు వారధి అవ్వాలి..
ఆత్మీయత నీ రధమవ్వాలి
మంచితనం పంచడంలో లోకానికి నువ్వే సారధవ్వాలి..
నేస్తం..

(ఓ స్నేహితునికి రాసిఇచ్చినది…)

RTS Perm Link

One response so far

Apr 18 2013

|| నెలకోసారి నేను తప్పుచేస్తాను.. ||

అది జీతాలరోజు కాదు..
మందో మగువో నాకు అలవాటు కాలేదు
చిల్లర తడమలేక చాయ్ నీళ్ళు వద్దనుకునే నాకు..
ఆన్ లైన్ పేమెంట్ల చిట్టాలో పై రెండూ లేవు
సాకులు కుంటుకుంటూ ఆడే తప్పుని
నెలకోసారి మాత్రం తప్పకుండా చేస్తాను..

ధర్మరాజు నడిగి ఒక అబద్ధాన్ని ఆ రోజుకి అప్పుతెస్తాను
నాలో చావని శ్రోత అశ్వథ్థామై ఒక్కసాయంత్రమైనా జీవించాలని
నేనెక్కడని ప్రశ్నించే ఫోను కాల్ కు మీటింగులో హతః అని ..
కుంజరః ఏమిటంటే.. సభ కవిత్వానిదని..

రెండో శనివారం..
ఇంటికెళ్లకుండా దారి తప్పుతాను..
నా కార్యాలయానికి వర్షపాత సూచనలందకుండా ;
భార్యాలయాన్ని డబ్బింగ్ సీరియళ్ళ విధ్వంసంలో వదిలేసి
ఎల్లలు లేని ఇంటిని రెండు గంటలైనా అంటిపెట్టుకోవాలన్న కాంక్ష
ఇల్లుచేరడాన్ని ఆరోజుకి రెండుగంటలు దూరం చేస్తున్నా..
కర్కోటకుడిలా బంజారాహిల్స్ బస్సెక్కుతాను

తప్పొప్పుల కుదుపులలో ముందుకురకలేక, వెనక్కు మరలలేక మనసు
ట్రాఫిక్ జాముల్లో అంగుళ మంగుళం జరుగుతూనేఉంటుంది
మరచిన పని ఒకటి ఆలోచనల లైన్లోనికి వచ్చి.. గుర్తుకొచ్చి..
ఎండతో పాటు నన్ను చిటపటలాడిస్తుంది.

అయినా.. కెరీర్ గ్రాఫ్ సిటీబస్సుతో పోటీపడుతున్నప్పుడు
నా జీవితానికీ, జీతానికీ కొత్తగా వచ్చిన ముప్పేముంది!!
ఇలా అంటున్నానని నిరాశలో నిజాలను చూడలేననుకోకు..
జి.వి.కె మాల్ సౌధం కన్నా..లామకానే నాకు ఎక్కువ ఎత్తులో కనిపిస్తుంది.
వీలైనంత త్వరగా సిగ్నలన్నీ దాటేస్తే.. గుర్రమెక్కినట్టే అనిపిస్తుంది

తీరా తీరం చేరేలోగా
గుమ్మం బయటే.. ఏ గాలి తోనో కొట్టుకుపోతా..
కాశీ నుంచి పిలుపొస్తుంది..కాలం సమీపించిందని

గాలిపోసుకున్నాక గుమ్మం బయటే కాసేపు ఊసులు
పలకరింతలే కొత్త ..మేమంతా ఒకరికొకరం పాత చుట్టాలమే..
కవిత్వ దేవత మాకేమవుతుందో..
ఎవరో షరాబుతో వాదం పెదవుల వంపుల్లోంచి వలికిపోతుంది..
చివరకి మామధ్య సామ్యవాదం మిగిలిపోతుంది
ఎగరేసిన తెల్లకాగితంలా నేను లామకాన్ లోపల వాలతాను

మనుషుల మధ్య నిశ్శబ్దాల అస్థిత్వాన్ని పలకరింపులు ప్రశ్నించినప్పుడు
రాతలకు రూపం వచ్చినట్టు .. పులకరింతలు నా ఎదపై సంతకాలవుతాయి
తరాల మధ్య అంతరాల్ని తొలగించే వేదిక మీద ఓ బుల్బుల్ కూతకూస్తుంది
అంతరంగపు లోతుల్ని నింపడానికి గాలీబ్, మీర్, సౌదా, ఖుస్రూ, దాగ్ లు
రూపం మార్చుకుని వేదికనెక్కుతారు, నేను ఆకాసేపూ బేదర్ద్ నవుతాను

ఓ సూఫీ పాట మాటతో వేడుక మొదలౌతుంది
లామకాన్ నాపాలిట పానశాల అవుతుంది.
కాలంమారి హుక్కా స్థానాన్ని మైకు ఆక్రమించినా
కవిత్వం కైపెక్కించడం ఎన్నడూ ఆగలేదు.

కవి ఎవరైతేనేం!.. కవిత్వమొక్కటే నన్ను హత్తుకుంటుంది
అలౌకికానందాన్ని ఏకాంతంగా అనుభవించడంలో..
ఆ నెలకు సరిపడా తప్పు నాతో జరిగిపోతుంది..
నాలో చావని శ్రోత అశ్వథ్థామై మరో సాయంత్రం జీవించాలని
కేలండరు రెండో శనివారాన్ని ముందుకు దోస్తుంది.
నేను.. ముందస్తు మత్తులో తేలిపోతాను
ఇంటి కోకిల హేంగోవర్ లో మునిగిపోతుంది.

కలిసి జీవించడం అలవాటు అయ్యాకా..
తప్పుతుందా..నాతో.. కవిత్వానికైనా.. అర్థాంగికైనా

==18.4.2013==

RTS Perm Link

2 responses so far

Apr 18 2013

తెల్లకాగితం పై వచ్చిన తాజా సమీక్ష..

తెల్లకాగితం పై వచ్చిన తాజా సమీక్ష.. ప్రజాశక్తి ఆదివారం అనుబంధం లో తంగిరాల చక్రవర్తి గారికి నా ధన్యవాదాలు.

యశస్వి కలం పేరుగల సతీష్‌ కుమార్‌ వో విభిన్న రూపంలో ఈ కవితా సంకలనాన్ని తీర్చిదిద్దారు. ఒక వస్తువుని తీసుకొని బాల్యంలో ఎలా స్పందిస్తామో? అదే అంశంపై పెద్దయ్యాక ఎలా స్పందిస్తామో అనే ఇరు పార్శ్వాలను రాశారు. ఆ కవితకెదురుగా తెల్ల కాగితం… ఉంచారు… (ఆ పేజీ ప్రచురణ చేయకుండా). పాఠకులు, కవులు ఆ కవితపై తామెలా స్పందిస్తామో రాసుకునేందుకు ఉపకరిస్తుంది. పాఠకులైతే ఆ కవితపై తమ అభిప్రాయం రాసుకోవచ్చు. కవి ఉత్తమాభిరుచిని ఇలా కవితల్లో తెలియజేస్తుంది. యాభై ఆరు అక్షరాలను శీర్షిక (హెడ్డింగు)గా తీసుకుంటూ… అ నుండి క్ష వరకు రాశారు. ”ది ఫౌండేషన్‌ ఆఫ్‌ తెలుగు లిటరేచర్‌” ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రచురించింది. ”కవిత్వాభిలాషులకు చక్కటి అభ్యాస పుస్తకం”. ”కవిత్వం మన అంతరాంతరాళాల్లోకి ఇంకి/ లోకమంతా తెల్లకాగితమవ్వాలి” అంటారు కవి. శ్వేత పత్రాల్ని గుర్తుకు తెస్తుంది. కవి… తెల్లటి స్వచ్ఛత, తెల్లటి స్వేచ్ఛా… ఉండాలనుకోవడం బాగానే ఉంది.

పలికిన ప్రతీమాటా నాది మాత్రమే ఐనప్పుడు/ నీ మాట నోట రాక… నేను రాయై పోతాను….

నాది నీదైనప్పుడే / నిజంగా నేను మనిషినౌతాను./ ఇది తొలి పేజీలోని తెల్ల కాగితం కవితలోని ఇరు పార్శ్వాలు.

”ఆధునిక స్వేచ్ఛ” అన్న కవితలో కొంత అస్పష్ట భాష, భావాలు కనిపించాయి. గతం లోతుల్లో నేను నాలాగే ఉండి ఉంటా….

నేను నువ్వయ్యాక విచ్చిన వెలుగులో నన్నే నేను పోగొట్టుకున్నా! (ఈ క్షణం ఇలా ఆగిపోనీ) అంటూ కవి తన అనుభూతి కవిత్వం రాశారు. అన్ని కవితలూ బాగున్నాయి. చార్మినార్‌… చెంపన, కవిని చూశాక, గుల్‌ మకాయీ, బొమ్మ రాళ్లు… పేపర్‌ తో నాన్న, మేలు తలపు… కవితలు చాలా బాగున్నాయి. ”నా మాతృభూమి పాట వెంట లక్ష అక్షీ వాణీలపైమాటే. శాఖాగ్రంథాలయాలలో నిక్షిప్తమైన అవక్షేపాన్ని” అనే యశస్వి కలం మరింత ‘పదునైన కవిత్వంతో కరచాలనం చేయాలని ఆశిద్దాం.

ఈనాడు ఆదివారం సంచికలో సమీక్ష

ఆంధ్రభూమిలో


తెలుగు వెలుగు లో

జ్యోతిలో

RTS Perm Link

No responses yet

Apr 05 2013

విజిగీషువై వస్తాడొకడు.. ఈ లోకానికి.

విజిగీషువై వస్తాడొకడు..
ఈ లోకానికి..

ఏడ్చి గెలిచే పాపడిలా..
ఆక్రందనో, ఆలాపనో
అవసరమనే చెబుతాడు
నేరుగా వచ్చినోడు.. అబద్దమెలా ఆడతాడు!!

మూగ జీవాలూ బాసలు చేస్తాయి
బుక్కమెత్తి తలాడిస్తాయి
మనిషన్నవాడు పసివాడికి పశువుకీ మధ్యే ఊగుతుంటాడు
వాడి పరిధిని ఈ లోకం దాటిపోదు..

ద్రావకంలాంటి లోకాన్ని
రకరకాల పాత్రల్లోకి ఒంపుకుంటాడు
అందుకే..అలసినవేళ ఉగ్గుపాల పాటౌతాడు
కథల్లో జంతువై, మనుషులకు నీతి చెబుతాడు

నేర్చేవేళ పద్యమో పాఠమో అవుతాడు
భుజం కాస్తాడు.. తడతాడు.. తిడతాడు

గుసగుసల వయసుల్లో కూనిరాగమౌతాడు
పలుగోపారోఎత్తినప్పుడు .. చెలియో.. చెల్లకో.. పద్య మౌతాడు
కుప్పనూర్పేటప్పుడు .. కూనలమ్మ పదాలౌతాడు
కదం తొక్కేటప్పుడు ..జెండాపాటై రెపరెపలాడతాడు

లోకం పొడారినప్పుడు
హృదయాకాశాన్ని కవిత్వం తడిపెయ్యాలంటాడు
కళ్ళు చెమిరిస్తే .. నిరాశని తుడిచెయ్యాలంటాడు
వీడి కోరికల చిట్టా అనంతం

కడుపు కాలినోడికి బువ్వ అవ్వాలి..
చిందిన చమట చుక్క నేల చిందేలోగా
అంబలో చల్లనో వాడి నోటికి అందివ్వాలని…

మనిషి బతుకే ఘాటైనప్పుడు
నంజుడు జీవితాన చద్దన్నమవ్వాలి..
తాటి ముంజవ్వాలి..కొబ్బరిగుంజవ్వాలి అని…

ఒకరికొకరం ఎదురైనప్పుడు
కలయిక కౌగిలవ్వాలి..
ఈ లోకం తన లోగిలవ్వాలి…
మనుషుల్ని గెలవాలి, మనసుల్లో నిలవాలి.. అనీ..

ఇలా ఎన్నెన్నో కోరికల మధ్య
కొన్ని తీరకపోయినా..
ఏడుస్తూనే వస్తాడు పిల్లడిలా

గెలిచీ ఏడుస్తాడు వస్తాదులా
ఎవడోడినా బాధ వీడిదన్నట్టు..
చీకట్లపై వెలుగులు చిమ్మే టట్టు
విజిగీషువై వస్తాడు కవి ఈ లోకానికి

|| విజిగీషువు: He is desirous of Victory ||
==5.4.2013==

RTS Perm Link

One response so far

Apr 04 2013

పుస్తకం.నెట్ లో …. దేవుడ్ని మర్చిపోదామిక.. పుస్తక పరిచయం

Published by under my social views

వ్యాసకర్త: యశస్వి సతీశ్
******

దేవుడ్ని మర్చిపోదామిక : ఈ పుస్తకం పూర్తిచెయ్యగానే.. ఆలోచనలనుంచి బయటపడడం కష్టమైంది.

ఎప్పుడో చదివిన విషయం గుర్తుకువచ్చింది. డిసెంబరు 9, 1979 న అమెరికా లోని ఉత్తర ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ తల్లి కళ్ళెదుటే తన 18 ఏళ్ళ బిడ్డను ప్రమాదంలో కోల్పోయింది. రోడ్డు దాటుతుండగా 19 ఏళ్ళ డ్రైవర్ తాగిన మైకంలో కారుతో గుద్ది చావుకు కారణమయ్యాడు. ఆమె పేరు Beckie Brown. తన కడుపుకోత వేదనను క్రోధంగా, కన్నీటిగా జార్చలేదు ఆ తల్లి. తాగి వాహనం నడిపే చర్యకు వ్యతిరేకంగా ఒక సంస్థను నెలకొల్పింది. అదే MADD (Mothers Against Drunk Driving). ప్రభుత్వం మీద, వ్యవస్థలో లోపాల మీద, తాగుబోతుల మీద ఒకరకంగా యుద్ధం ప్రకటించింది. ఆమె కారణం గా చట్టాలు మారాయి. మరెన్నో విజయాలతో పాటు ఇప్పటివరకూ 3 లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఘనత సొంతం చేసుకుంది. ఎంతగొప్పవిషయం ఇది.. ఒక సాధారణ తల్లి కే ఇంత విజయం సాధ్యమైతే.. అందరం ఆశ్చర్యపోతాం. మెచ్చుకుంటాం.. వీలైతే చేయందిస్తాం.. అదేకదా జీవన సాఫల్యత! మనిషిలో మనిషిని దర్శించడం అంటే అదే..

రేగళ్ళ సంతోష్ కుమార్ అనే ఆటల సంపాదకుడు (అదేనండీ ..ఈనాడు క్రీడా విభాగపు రౌతు) తన కింత కాలం చేతి నిండా పని కల్పించిన సచిన్ టెండుల్కర్ అనే పందెపు గుర్రాన్ని పాల కడలిలో అంజనం వేసి చూపించేశాడు.

మేమంతా మీ ’ఆవు’ అని ఆటపట్టించినా.. ఆట కోసమే కదా అని ఇన్నాళూ ఊరుకొని ఈరోజు నిజంగా సచిన్ కామధేనువే కాదు, కల్పవృక్షమూ ఐరావతమూ, ఉఛ్ఛైశ్వమూ అని చూపడానికి, ఉదాహరణలతో తెలుపడానికీ సాహసం కావాల్సిందే. అదేమాట అడిగి చూడండి సంతోష్ ని..పుట్ బాల్ లో పీలే, మారడోనా కలిస్తే .. క్రికెట్లో సచిన్ అని అలెన్ డోనాల్డ్ అనగాలేనిది నా మాట ఎంత!! అని తేటతెల్లం చేస్తాడు. ఆకతాయి సచిన్నోడి కసిని అన్నయ్య అజిత్ కృషిగా మరల్చడంలో ఓ రాయేశాడని సెలవిచ్చేస్తాడు.

నిజమే ప్రవాహానికి ఆనకట్ట కట్టడంలోనే మనిషి గొప్పదనముంది. అది Beckie Brown ఐనా, సచిన్ టెండుల్కర్ ఐనా..

ఒక యోధుడి వ్యక్తిత్వ ఆవిష్కరణ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. క్రికెట్ మైదానానికి అవతలవైపునే రచయిత ఫోకస్. ముందుమాటలో వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ చెప్పినట్టు.. ఒక మనిషిని దేవుడిలా అభిమానించే స్థాయికి దోహదం చేసిన అసక్తికర అంశాల సమాహారం ఈ.. ప్రయత్నం.

మైదానంలో వేల మంది తనను చూస్తున్నా, కోట్ల ఆశలను మోస్తూ ప్రపంచాన్ని తన తన్మయత్వంలో ముంచి ఆడిన ఆట మనం ఇకముందు చూడలేకపోవచ్చు..అతడ్నెలా గుర్తించుకోవాలి! అన్న మాటకు సమాధానమే ఈ పుస్తకం.

ఎవరు సలహాలిచ్చినా సచిన్ నాలాగే వింటుంటాడట బ్రదర్!.. ఓ ఉద్యోగి తన సహచరుడితో పరాచకాలు..

కోం ముహ్ ఖరాబ్ కర్ లే తేరే.. సచిన్ అక్తర్ తో అన్నట్టు ఓ బూతులాట గాడికి క్ర్రీడాస్ఫూర్తి ఉన్నవాడి సలహా..

ఏపనికైనా సచిన్ 20 నిముషాలు ముందుంటాడట.. ఓ వ్యక్తిత్వ వికాస శిక్షకుడి ఉదాహరణ..

తన వాచ్ మెన్ కొడుకు, చిన్నప్పటి స్నేహమేనంట.. పర్సనల్ అసిస్టెంట్.. తెలుగు సినిమా పంచిన మంచిలోంచి సచిన్ ని కొలుస్తూ.. ఓ కాలేజీ కుర్రాడు..

ఇవన్నీ తెలిపేవి అతడో సెంచరీల వరద, రికార్డుల హోరు మాత్రమేకాదని, సచినంటే వినయం.. నిగ్రహం.. నిరంతర సాధన.. నిత్య విజ్ఞానార్జన, మంచితనం.. అందుకే పరుగుల దేవుణ్ని మర్చిపోయి సచిన్ ను గుర్తుంచుకుందాం అంటారు క్రీడా స్ఫూర్తి తో రచయిత.

అరే.. నీకీ విషయం తెలుసా!.. చిన్నప్పుడు సచిన్ అందర్నీ కొట్టేవాడట.. కోపిష్ఠి మెకన్రో ని ఆరాధించేవాడట..ఓ పిల్లవాడు తనలో సచిన్ ను చూసుకునే ప్రయత్నం.. తిరుగులేదు.. వీడు మనకొక ఆశాకిరణం. కావాల్సింది పట్టుదలే మనవాడికి.

“సచిన్ లా మెదటి మ్యాచ్ డకౌట్ కాదురా నేనూ..” సచిన్ ను దాటాలనే ఆశ.. వీడూ గొప్పోడవుతాడు.. చదువులోనైనా.. ఆటలోనైనా..ఉద్యోగంలోనైనా.. జీవితం లోనైనా.. ఇది నిజంగా ఛాంపియన్లను తయారుచేసే ప్రయత్నమే.. సంతోష్ ది.. ఎంత స్వార్థం.. చిన్ని పుస్తకం స్ఫూర్తి తో.. పేపర్ల నిండా విజయగాథలను చూడాలని కలగంటున్నాడు.. ఒక్క తరమైనా సచిన్ లా పరిగెడితే.. కాదు .. కనీసం ఆలోచిస్తే.. మన దేశం నిస్తేజ సాగరాన మునిగే బదులు.. ఉప్పొంగే జీవన తరంగాల వెల్లువై పులకించిపోదా!!

“నేనే కాదు..ఎవరూ పరిపూర్ణులు కారు.. కాలేరు నిరంతరం నేర్చుకోవాల్సిందే.” ఇవి సచిన్ మాటలు గా స్వీకరిస్తే.. అక్షరాలు సిక్సర్లుగా మదిలో కి దూసుకుపోతాయి.. తిరిగి మనల్ని కష్టమైన బంతుల్ని ఎదుర్కోవడానికి సన్నద్ధం చేస్తాయి.

నూతనోత్తేజం కోరే ప్రతి మనిషి తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
ఇది లోకానికి ఓ సంతోషపు ప్రేమ కానుక లా నాకనిపించింది.

పుస్తకం: దేవుణ్ని మర్చిపోదామిక… సచిన్ ను గుర్తుంచుకుందాం (forget the God… remember Sachin)
రచన: రేగళ్ళ సంతోష్ కుమార్
పేజీలు: 80
ప్రచురుణ: సహృదయ సంతోషం ఫౌండేషన్
ప్లాట్ నెం. 68, లయన్స్ టౌన్ కాలనీ, హస్మత్ పేట, ఓల్డ్ బోయినపల్లి, సికిందరాబాదు- 500009
sahrudayasanthosham@gmail.com
Kinige link here.

About the Author(s)

అతిథి
పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.

4 COMMENTS

డింగు
నేను సచిన్ అభిమాని కావడానికి ఈనాడు వ్యాసాలు కూడ ఒక కారణం. అయితే ఆ కారణం వెనుక ఉన్నది ఈ రచయిత అన్నమాట! సచిన్ గురించి తెలుగులో అందునా ఈనాడు శైలిలో అంటే ఖచ్చితంగా చదవాల్సిందే.

March 17, 2013 at 7:49 pm

KV
చాలామంది పాఠకులు ఈనాడు అభిమానులు కావడానికి కారణం – ఈనాడు ప్రతిభ కాదు. అక్కడ వివిధ శాఖల్లో ఉన్న రచయితల ప్రతిభే! వ్యక్తుల పేర్లు బయటికి రాకుండా చూసి ఆ వ్యక్తిగత ప్రతిభని సంస్థకి మలచుకోవడం మీడియాలో ఈనాడు నేర్చిన, నేర్పిన ఓ మంత్ర విద్య ! ఈనాడు ఏదీ రాయదు కదా? రచయిత ఎవరో తెలిసినా ఈనాడునే పొగుడుతున్నారే! ఇది అన్యాయం! నాటకం బాగున్నప్పుడు – ప్రతిభ చూపిన నటుల్ని మరిచిపోయి – పాలరాతి స్టేజి బాగుందనడం లాంటింది ఇది! దయచేసి ఈ ‘ బ్రాండ్ లేబర్ ‘ నించి మంచి రచయితల్ని విడిగా చూడండి.

March 31, 2013 at 8:02 pm

dastagir
అవాక్కయారా…..
దేవుణ్ని మరిచిపోదామిక…
ఈ పేరు లోనే రచన తీరు ఉంది. శీర్షిక చూడగానే విస్మయానికి గురవుతాం. (నిజం చెప్పాలంటే గగుర్పాటుకు గురవుతాం.) చివరి పేజికి రాగానే అయ్యో.. అప్పుడే అయిపోయిందా… అని ఒక్కసారిగా చెక్ చేసుకుంటాం. ఎందుకంటే కేవలం 30 నిముషాల్లోనే పుస్తకాన్ని పూర్తి చెయ్యచ్చు… అదీ ఆర్తిగా. సచిన్ అనగానే మనకు ఓ ఆటగాడు కనిపిస్తాడు. కాని ఈ పుస్తకంలో ఎవరెస్టు అంత ఎత్తు, ఫసిపిక్ అంత లోతున్న
ఓ విలక్షణ వక్తి కనిపిస్తాడు. అదీ పూర్తి కొత్తగా…
పుస్తకం మొదట్లోనే మనల్ని టైసన్ ఒక్క పంచ్ కొడ్తాడు. సచిన్ పుస్తకంలోకి టైసన్ ఎందుకు వచ్చాడు… అదీ పంచులు విసురుతూ… అదే ఈ పుస్తకం ప్రత్యేకత. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సచిన్ చెప్పిన పాముకథ. రచయిత చెప్పిన ఆవు కథ…. మొత్తానికి ఇది చదివి పక్కన పెట్టాల్సిన పుస్తకం కాదు… ఎప్పుడూ పక్కనే ఉంచుకోవాల్సిన పుస్తకం. సచిన్ తో రచయిత రేగళ్ళ సంతోష్ కుమార్ ఇంటర్ వ్యూ
ఈ పుస్తకానికి మరింత వన్నె , విలువ తెచ్చాయి.
-మొహమ్మద్ దస్తగిర్

March 16, 2013 at 4:30 pm

aditya panigrahi
వందల పేజీలు ఉండే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు.. గంటల తరబడి సాగే పర్సనాలిటీ డెవలప్ మెంట్ లెక్చర్లు చేయలేని పని ఈ చిన్న పుస్తకం చేయగలదన్న ఆశ కలుగుతుంది నాకు… చిన్న చిన్న పొరపాట్ల కారణంగా సక్సెస్ దారిలో చతికిలపడుతున్న పిల్లల్ని చూసి బాధపడుతున్న తల్లితండ్రులు కావొచ్చు.. ఉద్యోగుల పనితీరు ఆశించినంత లేదని భావించే కార్పొరేట్ సంస్థలు కావొచ్చు.. ఎవరైనా సరే… తమ పిల్లలకు లేదా ఉద్యోగులకు దీన్ని చదవమని చెప్పొచ్చు. మనిషిలో మార్పు కోసం స్వీయ అలోచన కలగనంత వరకు మార్పు రావడం అసాధ్యమన్నది నా అభిప్రాయం… అంతవరకు ఎన్ని పర్సనలిటి డెవలప్మెంట్ పుస్తకాలైనా.. క్లాస్ లైనా వ్యర్ధమే అని గట్టిగా నమ్మేవాళ్ళలో నేనొకడిని.. కానీ ఈ “దేవుణ్ణి మర్చిద్పోదామిక” చదివిన తరువాత మార్పు దిశగా తీసుకెళ్ళే ఆ స్వీయ ఆలోచన కలిగించే టూల్ గా ఈ పుస్తకం పనిచేస్తుందన్న నమ్మకం కలుగుతోంది.. ఈ శతాబ్దపు అతి గొప్ప రోల్ మోడల్ సచిన్ ని ఉదాహరణగా తీసుకుని, అతని జీవితం లోని సంఘటనలు, అనుభవాలను చూపిస్తూ సరళంగా సెలయేటి ప్రవాహం లా సాగిపోయే రచనా శైలితో స్రుష్టించిన ఈ పుస్తకం.. హస్తభూషణం అన్న మాటకు నిజమైన అర్థం. బిభూతి భూషణ్ రాసిన “వనవాసి” చదివినప్పుడు కలిగిన అనుభూతి… ఓస్ట్రోవ్స్కీ రాసిన “హౌ ద స్టీల్ వజ్ టెంపర్డ్” చదివినప్పుడు కలిగిన ప్రేరణ.. శైలి, విషయం పరంగా ఈ పుస్తకం మళ్ళీ కలిగించింది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఈ ‘ పుస్తకం కొంచెం.. విషయం ఘనం “. ఇది మంచి పుస్తకమే కాదు.. గొప్ప పుస్తకం కూడా….
ఎక్కడ దొరుకుతుంది… ఎలా తెప్పించుకోవాలి అన్న సందేహాలేమీ లేకుండా ఇంటర్నెట్ లో కినిగె.కాం వెబ్ సైట్ లోకి వెల్లి ఆన్లైన్ లో ఈ పుస్తకం హాఇగా ఓ గంటలో చదివేయొచ్చు.. దీని ప్రభావం మాత్రం గంటలో పోదు..

తెల్లకాగితం పై సమీక్షలు
http://pustakam.net/?p=14321

http://pustakam.net/?p=14255

RTS Perm Link

No responses yet

Apr 04 2013

|| అడుగుగెందుకో…||

అడుగుగెందుకో బరువుగ పడుతుంది
అలోచనలు వంచుతున్నట్టు మెడని
నడకలోన చూపు నేలన దిగబడుతోంది
మనసేమో ఇంటికి పరుగిడుతోంది

వేసవిమొదల్లోనే సాయంత్రాలు చల్లబడి
జల్లులు మొదలై కాలం మారుతుంది
నా ఉరుకులు చూడాలని నగరం
చినుకై చింది నాపై తిరగబడుతోంది

RTS Perm Link

One response so far

RTSMirror Powered by JalleDa