Archive for March, 2013

Mar 29 2013

||ఉదాత్తం నాకు కవిత్వం||

రాళ్ళు ఏరుతుంది అమ్మ బియ్యంలో మౌనంగానే..
అన్నం వండటం ఒక పవిత్ర కార్యం

పనిచేస్తాడు నాన్న ఇల్లుగడవాలని
సాలీడు శ్రధ్ధతో గూడుకడుతున్నట్టు.

సూదిమందు గుచ్చుతుంది నర్సమ్మ
రోగం నయమవ్వాలని అందరి ప్రార్థన

నేర్చేటప్పుడు పంతులుగారు ధ్యానంలోనే ఉంటారు

అదే అమ్మ ఇంటి శుభ్రంలో బల్లుల్ని తరుముతుంది
తప్పుచేసిన పిల్లలపై ఉరుముతుంది.

అదే నాన్న విసిగిస్తే కసురుతాడు,
చెయ్యీ విసురుతాడు

కుట్లేసే వేళ డాక్టరు మత్తిచ్చి మగతలోకి నెడతాడు
మాత్ర మింగకపోతే మరి కోప్పడడూ!!..

పాఠం చెప్పేటందుకు గొంతెత్తి వినిపిస్తారు మాస్టారు
విసిగిస్తే ఆకతాయికి ఒకటో రెండో అంటిస్తారు

ఎంత పనికి అంత బలమే చూపిస్తారెవరైనా..
మరి నువ్వేంటీ!..
కవిత్వం పేరు చెప్పి ఏమైనా చేస్తానంటావ్
ఉత్తర కుమారుని వేషం వేస్తావ్..

చీత్కారాలూ, దూషణలూ nostalgia నా నీకు!!
నాకంటే పెద్దే కావచ్చు అన్నిటా.. నువ్వు..
తమ్ముడ్ని చేరదీసినట్టు చెప్పరాదూ..

పక్కింటోడ్నే తిట్టచ్చు నువ్వు, మనసు నలిగి..
కడుపు మండే తిట్లెందుకు.. నీ నోరూ పాడవదూ!!

కవిత్వం నీకు తల్లే కాదనను
నాకో, మరెవరికో రంకంటగట్టడం
ఏపాటి మానవీయత!!

రగిలిపోయి కవిత్వం రాస్తున్నావా..
ఎవరి అమ్మను అపహాస్యం చేస్తున్నావు!!

హత్తుకునే మెత్తని మనసు నీకు లేనప్పుడు
కవిత్వం పసిపాపను కలనైనా తాకకు

కోయడం నీ అవసరమైనప్పుడు అది
ప్రసవానికో, రసాస్వాదనకో అన్నట్లుండాలి
కసాయి కత్తులతో తుత్తునియలు చేయకు

రత్యానంతరానుభూతి నీకు తప్పనిసరి ఐనప్పుడు
అది శృంగార పరమావధిగాసాగాలి..
మరోలా ఉండకూడదని మాటల్లో చెప్పాలా..

నీకు తెలియనిది కాదు మిత్రమా..!
మేడిపండులోనికి కవిత్వాన్ని చొప్పించకు
ప్రియతమా..ఆస్వాదనకు దూరమైపోతాం

==29.3.2013==

RTS Perm Link

2 responses so far

Mar 28 2013

||కాలమా!!.. నువ్వు నా వెనకే..||

నీనుంచి నేను తరలిపోయినప్పుడల్లా
నిజం తలుపు తెరుచుకుంటూనేఉంది.
నే పారిపోతున్నానని గమనించిన కాలం..
రొమ్ము విరుచుకుంటూనేఉంది

పాపం జమానాకి తెలియదు
నన్ను ధిక్కరించడం ఎంత పాపమో..
నా మాటలు నేలవిడిచి సాము చేసినప్పుడల్లా
నాలో నేను తడబడుతూనే ఉన్నాను

నా అడుగుల్ని మాటలు నిర్ధరించినప్పుడల్లా
పరిగెడుతూనేఉన్నాను

నిట్టూర్పుల కుంపటి సెగ అనుకున్న వాడి పాలు
పొంగించక తప్పలేదు నాకు
చెమిర్చిన నా చెమటచుక్కలద్దుకున్న వాడి శ్రమ
ఫలితాన తేల్చాక గాని మనసొప్పలేదు

నాడి కొట్టుకోవడం ఆగే వరకూ
నా మౌనాన్ని ఎవరికీ తాకట్టుపెట్టలేను
తిట్టుకునే నుదుటిరాతను మార్చమని
ఏదేవుడికీ ఏకరువు పెట్టలేదు

ఎవడెటైనా పోనీ.. నా మాట వినిపించేంత దూరమైనా
పారాహుషార్ పాటని కట్టిపెట్టలేను..
ఓయ్.. లోకమా.. నీదారి అటుకాదు..
నా వెనుకే.. నువ్వు నడు..

నువు చూడని కొత్త పుంతలు
అందుకునేటందుకు వెళుతున్నా..
వెనుతిరిగి నన్ననుసరించు..

దిగంతాల వెలుగుపువ్వుల్ని నీ దారిన పరుస్తాను
నాతో నడుస్తావా!!.. ఎవరనుకుంటున్నావు నన్నూ..
కవిని నేను..
చీకటిలోకమా.. నీ రవిని నేను.

==28.3.2013==

RTS Perm Link

2 responses so far

Mar 23 2013

||నమ్ముతావో నమ్మవో…||

నమ్ముతావో నమ్మవో నీ ముందు జరిగేది
నమ్ముతావో నమ్మవో నీవు చూసేవి
నమ్ముతావో నమ్మవో మండే సూరీడ్ని
నమ్ముతావో నమ్మవో రాత్రి తారల్ని

నమ్ముతావా ఎగిరే పిట్టల్ని
నమ్ముతావా కదిలే మేఘాల్ని
నమ్ముతావా గాలి కెరటాల్ని
నమ్ముతావా కాంతికిరణాల్ని

నమ్ముతావో నమ్మవో అన్న మాటల్ని
నమ్ముతావో నమ్మవో నీవు విన్న వాటిల్ని
నమ్ముతావో నమ్మవో చివరి వాక్యాల్ని
నమ్ముతావో నమ్మవో తిరిగే నాట్యాన్ని

నమ్ముతావా కాంతిని దృశ్యాన్ని
నమ్ముతావా వెలుగే కాలాన్ని
నమ్ముతావా స్పర్శ ని రుచిని
నమ్ముతావా అంతా.

నమ్ముతావో నమ్మవో అంతరాత్మని
నమ్ముతావో నమ్మవో సంతోషపు తన్మయత్వాన్ని
నమ్ముతావో నమ్మవో కీర్తిని పరంధాముడ్ని
నమ్ముతావో నమ్మవో ఆ ఆలోచనల్ని

నమ్ముతావా పైనున్న ఆకాశాన్ని
నమ్ముతావా ప్రేమ పాశాన్ని
నమ్ముతావా దివిని భువినీ
నమ్ముతావా చావుపుట్టుకల్ని
నమ్ముతావా జీవితాన్ని

నిజమైన నమ్మకం తో కళ్ళు తెరిచి చూడు
ద్వారాల్నీ తెరిచివుంచు కాంతిని నింపుకో
నమ్ము నమ్మకం నిను నిలబెడుతుంది

RTS Perm Link

3 responses so far

Mar 23 2013

||ఏటిపాటనవ్వాలని…||

మనసులోతుల్లో గతుకుల దారుల్లో
ఆలోచనలన్నీగాలాడక
అల్లలాడుతున్నప్పుడు
అగాధనేత్రాల్ని చూసిందో కాగితం

ఎత్తుపల్లాలు తడిపేలా
ఆ అలజడి గుండె గదుల్ని
తడితో నింపింది

కొమ్మలు తడిభారంతో.. వంగినట్టు
అక్షరాల చుక్కల్నికలిపి
అనుభూతుల ముగ్గుల్ని పంచడానికి
ముంజేతివేళ్ళు ముడుచుకున్నాయి

మనసున వాన వెలిసాక
సిరాని ఎగపీల్చిన కాగితాన
భావాలు కాలువ కట్టాయి

మలుపుల మధ్య
బల్లకట్టు ప్రయాణం
కాగితం పై నా పలవరింత

జీవితమైనా, కవిత్వమైనా
ఏటిపాటై సాగాలనే..

==23.3.2013==

RTS Perm Link

No responses yet

Mar 07 2013

నా కొత్తగీతలు ఫిబ్రవరి 28

Published by under my social views

ఆంధ్రులం ఐతే మాత్రం!!
అన్నిట్లోనూ ముందుంటామా
అట్టా ఎట్టా బాబయ్యా!..

ఉపాధి హామీలో ఉన్నాం కదా!
ఐన పనులు ఎన్నయ్యా!!

వృధ్ధిరేటులో 11 అంతేనా అనకు..
రెండొకట్లెంత 11 కాదా..

ఎక్కాల్ రానోళ్ళంతా వేలెత్తి చూపిస్తే
లెక్కల్లో బొక్కలే కనిపిస్తాయి.
నిరసన గళాలకు చదువుల్రావుగా..

వేలుముద్ర బతుకులన్నీ ..
తోడు దొంగల వంత పాటలో
అనంత నుంచి చిక్కాకులం కడకి..
అవినీతి నామాల్నే జపిస్తాయి.

RTS Perm Link

No responses yet

Mar 07 2013

||కావలసినంత స్వేఛ్చ ఉంది.. బాధ్యత తీసుకోవా||

మార్పంటే కొత్తదనమేనా
మొహంమొత్తిన మాధుర్యం లో
నువుకోరేది చప్పదనమేనా
ఏం తెలిసింది మనకు నడకైనా
చరిత్రను ఉపేక్షించి గెలిచామా
అడుగేసి తడబడక నిలిచామా

నీ మాట నిజం మిత్రమా!
నడక మాత్రమే తెలుసు ఆధునికతకు
గమ్యాలెటో తెలియదు అడుగులకు!

పాత లోతెంతో ఇప్పుడిక లెక్కలేల!
ఆపాతమైనదేదైనా మక్కువేగా
వచ్చినదారి గుర్తుంటేనే కదా
పయనం ముందుకని భరోసా నేస్తమా!

ఇప్పుడిక స్వేచ్ఛ మాత్రమేనా.. మనిషి కోరేది!
నిర్జన నిశీధి గమనంలోనా గమ్యం చేరేది!!

నీకునువ్వైతే ఇక నువ్వేంటి..
నీవెనుక తరాల తపనల మర్మమేంటి
కన్నీరు నిన్ను కరిగించలేనప్పుడు
కవితల వెల్లువల ధర్మమేంటి!!

పాతబడినంత మాత్రాన
మంచి చెలామణి కాకపోదు
నాణాలూ, నోట్లూ చెల్లినచోట
బంగారపు వన్నె తగ్గదు

పాత రోతా కాదు, కొత్త వింతాకాదు
నీ మాట నిజం మిత్రమా!
మనోభావ సంచలనమే
మనోవిజ్ఞాన శాస్త్రమిక్కడ

దిగ్భ్రాంతుల్లేని కవనోదయాన్నే
వెలుగులీనేవి అనంతకోటి భావజాలాలు

నేనొక తృణకణాన్ని
ముంచుకొస్తున్న తుఫాన్ల తో అనాది స్నేహం నాది

నన్ను తొక్కుకుని నడిస్తే నువ్వు
మెత్తదనాల సౌకుమార్యాన్ని అనుభవిస్తావు
నాతో కలసి నిలిస్తే సహస్ర సూర్యోదయాలనూ చూస్తాము.

పాత చిగురుబోంతనూ పట్టు పీతాంబరాలనూ
వీపున మోస్తూ నీ ఇంటిముందు నిలిచిన
బసవన్న నడిచే దారిని..

నీ జెండా రెపరెపలాటకు బందీనైన ధ్వజాన్ని..
నువు నివసిస్తున్న సౌధపు ప్రాకారాలను
మోస్తున్న పునాదిని..

నేనూ నీ లానే..
నీ అస్థిత్వాన్ని.. కవిత్వాన్ని.
మరి నా పేరు నిలబెట్టే బాధ్యత తీసుకోవా!

{మిత్రులు శ్రీకాంత్ కాంటేకర్ ..|స్వేచ్ఛ.. స్వేచ్ఛ మాత్రమే కావాలి | ప్రేరణతో..}

==07.03.2013==

RTS Perm Link

No responses yet

Mar 06 2013

రెండు గా బతకాలేమో..

రెండు గా బతకాలేమో మనమెప్పుడూ వింతగా
గతంలో నేనున్నపుడు నువు నా భవిష్యత్తులో దాక్కున్నావు
నువ్వే నా భవిష్యత్తు అనుకుంటే.. గతంలోకి తొంగిచూస్తున్నావు

రెండు గా ఉండాలేమో మనమిప్పుడు కొత్తగా
నిన్ను చూడాలని చీకట్లను దాటి వస్తే నీ ఎండ నామీద కాస్తున్నావు
నే వదిలిపెట్టిన నీడలన్నిటినీ నీ నెత్తిన బండలా మోస్తున్నావు

రెండు చోట్ల గడపాలేమో మనమెప్పుడూ రోజంతా
రూకలవేటలో బయట నేనుంటే గడపలోన పీడకలల్ని కంటున్నావు
రహదారి వెంట నా పరుగైతే అడ్డదారిలో నాకై ఎదురుచూస్తున్నావు

రెండుగా కనబడాలేమో మనమెప్పుడూ
భయాన్ని కప్పుకొని నా రక్షణలో నువ్వూ
ప్రేమని కప్పుకొని నీ నిరీక్షణలో నేనూ

నీతో నడవాలనీ, నీకై నిలిచిపోవాలనీ
రెండువైపులా ఊగుతోంది నా మనసు.
ప్రేమకీ జీవితానికీ మధ్య ఏది ఏమైనా తేడా ఏముంది?

RTS Perm Link

One response so far

Mar 06 2013

|||కవిత్వం కావాలి కవిత్వం.|||

యశస్వీ..

ఓం అస్యశ్రీ అంటూ..
మన ప్రాణ ప్రతిష్ఠాపన మహామంత్రాన్ని
మానవత్వానికి ఆపాదించాలని ఉంది

కవిసంగమం సాక్షిగా..
ఈ సున్నిత భావాల వేదిక పైన

కవిత్వమే ప్రాణం,
ప్రేమే బీజం,
స్పందనే శక్తి
ఔన్నత్యమే కీలకం
ఇక మానవతా ప్రాణ ప్రతిష్టాపనకై
మన తపనలే జపమై..

వినియోగించుకోవాలనే కాంక్ష
అంకురించిన హృదయాన్ని
అభినందించాలనుంది.

కరన్యాసానికి ఇక్కడ ఉన్నవి కేవలం వేళ్ళు కావు
మూలాల వేర్లు ఏవైనా, వెలుగురేకల్ని ముద్దాడి నీడనో, గూడునో పంచే కొమ్మలూ..

మెచ్చుకోలు సందర్శకులు రాసినా, రాశిపోసినా ఉరిమే ఉత్సాహాలు, ఎత్తే అంగుష్టాలు

లోక కళ్యాణకామితులు.. ముందుతరం కవులు
తర్జనీ స్థాన భర్తీ కై.. దిశానిర్దేశం చేస్తూ, నెలకోసారి లమకాన్ వచ్చి దీవిస్తూ..

మధ్యముడు మా యాకూబ్ అన్నే..
తను రాస్తూ.. మమ్మల్ని కాస్తూ.. సవ్యసాచిలా

అనామికాభ్యాం నమః అంటున్నా..
నాకునేను దిష్టితీసుకుంటూ..

కవన వనంలో పూసిన కనిష్ఠులు ఎందరో..
లెక్కింపుల్లో వారే ముందువరుసలో

కరతలకర పృష్ఠభాగంలా అందరం కలిసితేనే
ఈ సంగమం

మంచి కాలాన్ని అందుకునేందుకు
ఇదో పచ్చని చెట్ల రహదారి..

(ఇక అంగన్యాసం..)

ఓం.. హ్రాం స్పందించే.. హృదయాయ నమః
హ్రీం.. ఆమోదమైనా, మోదమైనా ఆడించే శిరసే స్వాహా
హ్రూo.. ఆనందాన జలదరించే.. శిఖాయై వౌషట్
హ్రైం.. అమానుషాల్ని ఖండించే కవచాయ హూO
హ్రం.. దయతో, ప్రేమతో చెమ్మగిల్లే నేత్రత్రయాయ వౌషట్
హ్రః.. పిడికిలి బిగించే పద అస్త్రాయ ఫట్
ప్రేమతో మనసుల్ని దిగ్బధించే కవితలకీ నమో నమః

అసలు ధ్యానం ఏమిటంటారా!!
“కవిత్వం కావాలి కవిత్వం”
“కవిత్వం కావాలి కవిత్వం”
“కవిత్వం కావాలి కవిత్వం”
==01.03.2013==

RTS Perm Link

No responses yet

Mar 02 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 27

Published by under my social views

పాత బస్తీ ల ఆడవారిని ఆదుకునే అండ ఈ జమీలాదీదీ
తన కవితలతో స్పృహ కలిగించేది..
సేవా కార్యక్రమాలకు “షహీన్” వెన్నెముకై నిలిచిందీ ఈ దీదీ

విదేశీయులకు ముస్లిం అమ్మాయిల నిఖానామాము ఎదిరించేది..
అమీల్ ల గుట్టు రట్టు చేసి విడిపించినదీ షహీన్ సంస్థేగా..
ఆర్తులకు.. చంకీ, ఎంబ్రాయడరీ ల పనితో ఊరట..
ఎవరి కాళ్ళ మీద వారు నిలబడడానికి బాసట

హుస్సైన్ నగర్లో కాందిసీకుల అకృత్యాలపై పిక్కటిల్లిన గళం ఈమెదే..
మహబూబియా లాంటి స్కూళ్ళులేని లోటు పూడకపోయినా..

నువే ఒక పుస్తకం..
సాయానికి అందించిన చేయి..
నీ రాతలకైనా..
చేతలకైనా..
మేం ఫిదా జమీలా దీదీ..

నీకు సలామ్.
లావా కవితలకైనా..
అర్థ శతాబ్దపు పైబడిన జీవన పోరాటానికైనా

RTS Perm Link

No responses yet

Mar 02 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 26

Published by under my social viewsపోలీసు బాసుకి, డాక్టరు గారికీ ఎంత తేడా!!
నిజానికి రక్షణ వ్యవస్థే పేపరుపులి..
శత్రువు నిద్దరోతుంటే.. మీ కాపలా శ్రమ నెరవేరినట్టే..
వేయి మందిని కాపాడినా పోతున్నది ఒక్క ప్రాణమైనా..
డాక్టరు పరువూ పోతుంది కొన్నిసార్లు..

మా జుట్టూ మీ రెండు వర్గాల గుప్పెట్లోనే అన్నిసార్లు..
అయినా పోలీసు సారూ.. మీ మాట మాకు కరుకు..
డాక్టరు గారి మాటే.. మాకు అరుకు.
మీరే.. నిజాలు నిష్టురంగా విన్నవిస్తే..
మా బతుకులేపాటి చల్లన రంగ రంగా!!

పోలీసోడు చురుగ్గా ఉంటేనేగా.. దేశానికే పారా హుషార్..
మీ మాటలు విన్నవాళ్ళం.. మాకు బయటే..బయలెల్లింది పరేషాన్

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa