Archive for February, 2013

Feb 27 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 25

Published by under my social views

అదిగో టీవీ చూడు..
ఆ పిల్ల ఆటని
ఎంతో ఆనందం కదా చూడడం!!

కన్నీటి చారల మీద
రంగు అద్దారు.. అద్దాల బుగ్గలపైనా..

ఇదిగో.. ఈ పసివాడు..
పుస్తకాల బరువుతో
కన్నవారి పరువుని మోస్తున్నాడు..

అక్కడ ఆ మోటరు సైకిలు బాగుచేస్తూ
బండబారిన లేతచేతులు
పనిపిల్ల చేతులెలా వరుసుకుపోయాయో
తడి బట్టల పనుల్లో

పొలాల్లో గింగలేసేవాడొకడు,
కాడి పట్టే వాడొకడు..ఒళ్ళు పట్టే వాడొకడు
అడుగడుగో దూడకాడ పాలేరు పిల్లోడు
వీడేంటి వడ్రంగి తాపీ పనోడి మల్లే.. వాళ్ళయ్య వెనకే..
అదిగో చదువు మానేసిన యాయవారం పిల్లడు
పరిగలేరుకునే పిల్ల,
గోడకు కొటిన పిడకల్లా.. ఈ పిల్లల బతుకులు
ఇంకా ఏరని చితుకుల్లా.. చిల్లు కాని బతుకుల్లా ..

ఇనప్పెట్టెలైనా.. పేడతట్టలైనా పిల్లలు
పెద్దోళ్ళ బరువులు పసితనం నుంచీ మోస్తున్నారు..
పేరున్న గాడిదల్లా.. బాల్యాన్ని బండగా..

RTS Perm Link

No responses yet

Feb 27 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 24

Published by under my social views

కాపురమంటే కలసి నివసించడం
ఒక చూరుకిందో.. చెట్టుకిందో..
ఒప్పందం రద్దైతే కోర్టే రావద్దంటుంది
మధ్యవర్తిత్వమే ముద్దంటుంది.

ముద్దులకేమో రహస్యాలు గుద్దులకు పంచాయితీలు
హద్దులు కనపడని బంధాలలో మనలో ప్రేమలూ-యుధ్ధాలు

ఎప్పుడో రాసిన ఓ చిన్నారి కథనే.. మీకోసం ఇక్కడ పంచుకోనా ఇప్పుడిక..
****

~ నాతో ఆడవా..!~

రాత్రి రహస్యాలు రసవత్తరంగా వుండవ్
తెల్లారితే మాటల తూటాలు రోజుకి ఎన్నిసార్లు పేలతాయో..
రెండు వైపులా తిట్ల గుళ్ల పెట్టెలు అక్షయ పాత్రలే
ఖండాంతర క్షిపణుల్లా పెళ్ళి పెద్దల పైకి పరోక్ష ప్రయోగాలు
కళ్లలో కంఠంలో జీర.. మనో విస్ఫోట అవశేషంగా ..
మదిలో కరెంటుండదు మాటల మధ్య మనుషులుండరు
చెలగాటాల కాపురాల్లో రాగం శృతి మించితే
వస్తువులపై అరుస్తూనో కన్నీళ్లకు తడుస్తూనో..
భరించడం వల్ల కాదన్నది ఇరువైపులా సాకు..
వేర్పాటు వాదం చెయ్యెత్తితే .. గుమ్మం దాటే మంతనాలు
ఒప్పందాలన్నీ చట్టుబండలే.. మధ్యవర్తిత్వం మాటచెల్లదు.
ఎవరో ఒకరు న్యాయ దేవత నిద్రను మళ్లా చెడగొడతారు
కసి మనుషుల పంతాలు పసిమనసుల కేరింతలు..
నెలకోసారి కోర్టు హాల్లో..

అమ్మ తోడుగా ఎడబిడ్డ అన్నకు కనిపించేది అక్కడే..
రాజీ లేనమ్మా, రుషి పుంగవుడూ పొరపొచ్చాల ప్రపంచంలో
ఆటల్లో సహోదరుల కేరింతలు.. సినిమా చూసినంత సేపే
కేసుల్లో పైచేయికై అమ్మానాన్నల కుస్తీలు,
కలిపే ముసుగుల్లో విడదీసే నల్ల కోట్లు
పిల్లల జీవితాల్తో పెద్దల చెలగాటాలు
బండెడు పుస్తకాల్లో ప్రశ్నలు ఇప్పుడు పెద్దగా బాధించవ్
వెలితిని నింపే స్నేహం కోసం.. గుండె చెరువయ్యే మాట
రోజూ బడి చివరి గంట మోగాకా.. చిన్నారి గుండె ప్రకంపనలు..

ఎన్నిసార్లు అంటాడో.. ఇంకెన్నిసార్లు అనాలని అనుకుంటాడో
తమ్ముడు కూడా లేడు.. . రావా మా ఇంటికి ..నాతో.. ఆడవా!!

RTS Perm Link

No responses yet

Feb 26 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 23

Published by under my social views

ఉద్యోగం అంటే.. ప్రయత్నం అని కదా అర్థం..
నీ ఉద్యోగ ప్రయత్నంలో నీదైన జవాబుతో తలాడించగలగాలిగా..
తెలిసినది అడిగే పరీక్ష పరీక్ష కాదనీ,
జీవితంలో తెలియనివెన్నో మొదటిసారి తెలిసేవే గా అందరికీ!!

నీ చేతిలో కళ్ళాలున్నప్పుడు గుర్రాన్ని అదుపుచేయగలవో లేదో..
ప్రభుత్వం లో భాగానికి తనలో కలుపుకునే ముందు తెలియాలిగా!
నైపుణ్యంతో పాటు సానుకూల దృక్పథం అవసరమే..
అందుకే ముఖాముఖీల్లో చేపలు-కూరలూ దొర్లుతాయి..

నువ్ పట్టాల్సినది అడిగే చేతుల్ని కాదు..
వారు నీలో కనిపెట్టాల్సింది నీ సమయస్ఫూర్తి, సహనాల్ని
ఇక్కడ వరకూ వచ్చాక కూడా నీ విషయపరిజ్ఞానం మీద
ఎందుకు నీకంత మంకు! బుర్రలో గుంజూ ముఖ్యమే.. అలాగే నీళ్ళూ..

RTS Perm Link

No responses yet

Feb 22 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 22 (కన్నీటి రాతలయ్యాయి ఈరోజు)

Published by under my social views

పోయిన ప్రాణాలేమైనా!
బతుకుతీపిని మిగిల్చాయా
తెగిన భాగాలేమైనా
కొత్తగా నరకయాతనను అతికించాయా

ఎక్కడ ఉన్నావు! అన్న పిలుపుకి
పోయినోడు నోచుకోడు
ఎందుకొచ్చామిక్కడికి!! అన్న మాట
మన గాయాలకు అర్థంకాదు

బతుకిపోవడమంటే
చావు తప్పిందనీ,
నీ చావేదో నిను చావమంటే
ఎలాగోలా బతకాలనే బండోళ్ళం కదా మనం.

బతికేస్తున్నాం ఎదుటివాడి కారుణ్యంతో
నలిగిపోతున్నాం పగవాడి కార్పణ్యంలో
కొలవలేకపోతున్నాం ఎవడు మనవాడో మానవుడో
నిలవలేకపోతున్నాం జానెడు పొట్టకోసం రోడ్డెక్కి

పోయినోడు మనోడు కాదా అనుకుంటూ
మనోడుపోలేదన్న ఊరట లో కొందరం
బాంబుదాడికీ బాంబుదాడికీ మధ్య
చావుకీ బ్రతుకుకీ బందీలం అందరం

చచ్చినోళ్ళు ఏడిపించి బతికిపోయారు
ఉన్నోళ్ళం ఉండి చావు బతుకేస్తున్నాం
ఏమూలనో ఈ నేలమీద విద్వేషం పెచ్చరిల్లితే
ఈ భాగ్యనగరంలో విగతజీవులవుతున్నాం

కన్నీరుని తుడుచుకుని మన దారిన మనం నడుద్దాం
కొయ్యగుర్రపు యంత్రాంగానికి మన భుజం కాద్దాం..
మనుషుల్లా బతకడానికి అహరహం శ్రమిద్దాం..
గడ్డిపోచల్లాంటి జీవితాల్ని పగ్గంలా మెలేద్దాం

రాలినవాడిని చూస్తూ నిలుచున్నావా
రాలే మలి ఆకువి నువ్వే కావచ్చు
నూకలున్నంతకాలం తప్పదు ఈ పోరాటం
ఈ నగరం లో బతుకో యుధ్ధం

RTS Perm Link

No responses yet

Feb 22 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 21

Published by under my social views

కామెరాన్ దొర గారూ! ఒక గాధ వింటారా
ఏప్ర్రిల్ 13, 1919 న జరిగినదే..

12 ఏళ్ళ పిల్లాడొకడు ఎప్పటిలానే బడికెళ్ళాడు
విన్నాడోలేదో..
జిలియన్ వాలా బాగ్ దురంతం
వెళ్ళి చూసాడు డయ్యర్ దాష్టికాన్ని

వెయ్యిని మించిన దేశ ప్రేమికుల మరణాల్ని
నరాల్లో రక్తం సలసల కాగిందేమో..
కారే కన్నీళ్ళ మధ్య.. ఆగని వెక్కిళ్ళ మధ్య
ముద్దాడి తెచ్చుకున్నాడు వెంట ఇంటికి ఓ సీసాడు మట్టిని

అది సమరవీరుల రక్తం తో తడిసినది
చేశాడు పూజలను రోజూ..శ్రధ్ధాంజలి అర్పిస్తూ
వాడే.. తీర్చుకున్నాడు కన్నభూమి రుణం
ఉరితాడును ముద్దాడిన తరువాతా కూడా..

ఎందరినో తన స్పూర్తితో చేయించాడు పోరాటం
మీ పూర్వీకుల దుర్మార్గాలకు ఎదురునిల్చిన నిప్పుకణం
భగత్ సింగ్ వాడిపేరు ..
విన్నారా ఎపుడైనా!!

ఒకప్పుడు మీరేలినదేశం ఈరోజు మాదైనట్టు..
పంజావ్ లో నవాంశహర్ జిల్లా ఉండేది..
ఇప్పుడు శహీద్ భగత్ సింగ్ నగరయ్యింది..
ఈ రోజు మీరు ఎక్కడ కాలుపెట్టినా సారూ..
అక్కడ వందలమంది భగత్సింగులున్నారు..
అందుకే మీరు కాస్త మా ముందు వంగినట్టున్నారు..

RTS Perm Link

No responses yet

Feb 20 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 20

Published by under my social views


అధికార నాయకులారా!!
అప్పు చేసి నడుపుతారా ఈ రాష్ట్రాన్ని!
ఏమిచేసి ఆర్పుతారు ఈ రావణకాష్టాన్ని!!

మీ బారీ పూర్తవ్వగానే..
అంబారీ దిగిపోతారు..
ఎవ్వరు మొయ్యాలి ఈ కొయ్య ఏనుగును!

ఎలకతోలు లాంటి రంగుల రాజకీయం
మాకు చేసిన అన్యాయం ఇది..

లక్షలమంది కాయకష్టంతో సృష్టించిన సంపదలు
కొందరిపరమే అవుతుంటే..
మా కందిన కాళ్ళ కు రాసే కందెన పైనా సుంకమేస్తారు..
మీరు మాత్రం మా కష్టాన్ని సబ్సిడీలతో కొలిచి
అప్పుల అసళ్ళను మేస్తారు..
కష్టాలపాల్చేసి మా గోంతులు నులిమేస్తారు

మాలో మాకే రోజులు సాగక
అప్పులతో, తాకట్టులతో నెట్టుకొస్తున్నాం..
ఇక మీ తప్పుల తడకల పాలన పుణ్యమా అని..
రాష్ట్రీయ అప్పుల ఊబిలో ముంచేస్తారు..
తరువాతీ తరాలకూ వెట్టి లెక్క.. ఈ లోటుభర్తీ బొక్కల్నీ.. పంచేస్తారు..

RTS Perm Link

No responses yet

Feb 20 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 19

Published by under my social views

భూమితల్లికి జ్వరమొచ్చింది
ఇది చూడలేకో.. చల్లబరచాలనో..
ఆకాశం కన్నీరు కార్చింది
పాపం నగరాల్లో ఎయిర్ కండీషనర్ యంత్రాల్లా
పెరిగిపోతూనేవుంది.
అసహనం అమాంతంగా పేరుకుపోయి..
తిన్న ప్లాస్టిక్ సంచుల తిండిని అరగించుకోలేక..

కోరికలు తీరని జనం నాడి పడిపోతుందో లేక..
చెదిరిన కలలకు గుండె దడ పెరుగుతుందో..
చెట్లు నేలకూలాకా తయారైన తార్రోడ్లుతో
సెగతగిలి కన్నతల్లి ఒళ్ళు కాలిపోతుంది..

తడి తగిలి పొట్ట పగిలిన కంకుల్ని.. అమ్ముకోలేక..
భవిష్యత్తుని నమ్ముకోలేక..
పండించే కన్నబిడ్డలు కాటిని వాటేసుకుని
మట్టిలో కలసిపోతున్నారు..
వెచ్చని తల్లి ఒడిలో ఒదిగిపోతున్నారు.

RTS Perm Link

No responses yet

Feb 20 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 18

Published by under my social views

అన్నా హజారే.. అనకున్నా హజారే!!
మీ మాట వెయ్యిరెట్లు బలమే..
మీరు చూపించే అవినీతి రహిత సమాజం
మా మంచికో చెడుకో అనుమానమే..

మీకు చాల విషయాలు తెలియవు అన్నాజీ..
పెద్దలకెమోగానీ.. మీరంటే.. బడుగు భారతానికి బెరుకే..
మీ వలల్లో చిన్న చేపలే పడతాయని
చాలీచాలని జీతగాళ్ళకూ చిల్లర డబ్బులు అందవని..

మీ గాంధీ తత్వం మాకు బోధపడదు..
మీరు మంచిరోజులొస్తాయని భయపెట్టి..
మమ్మల్ని మీరు హింసిస్తున్నారు
(కొట్టి తాగుడు మాన్పించడంమీకలవాటేనటగా!)

మీ ఒక్క లక్ష్యానికే ఇంత వణుకొస్తుంటే..
మీరు కోరిన రాజ్యం వస్తే.. ఎలా గడిపేది..
రామరాజ్యం ఎలాగూ అవసరంలేదు..
రాబిన్ హుడ్ రాజ్యాన్ని చూపించలేరా!!.
అప్పటి వరకూ.. మా మందు మేంకొట్టి..
చిల్లరేరుకుంటూ గడిపేస్తాం..
ఒక్కమాట.. తిమింగలాల వేటకు మేమేమీ అడ్డుకాదు..
సముద్రాన్ని తీపిచేస్తానంటే.. నిజమేనేమో అని
ఉప్పునీటి రొయ్యలం మేం.. భయపడి చస్తాం..

RTS Perm Link

No responses yet

Feb 19 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 17

Published by under my social views

నాయకుడంటేనే.. విశ్వాసం కలిగించే వాడు..మూఢంగా..
మా జీవితాల్ని మారుస్తాడని.. కన్నీళ్ళని ఏమారుస్తాం..

చుక్కల్ని చూపించి లెక్కలు కట్టేవారు తగ్గారు..
చుక్కలు చూపించేవాడికి జనం తలొగ్గారు.

ధరలకు రెక్కలు తగిలించేవాడు..
మంచితనాన్ని నమ్ముకోక..
మాటల్ని అమ్మి..
అమాయకత్వాన్ని ఉదారంగా లాక్కుంటాడు..

ఇళ్ళలో పూజలు చేసేవాడు..
కెమెరాముందు నమాజు చేస్తాడు..
మైనారిటీలను మాయచేస్తాడు..

మద్యనిషేధం కావాలని అంతర్గత మందుపార్టీలో
తీర్మానం చేసి.. పార్టీనీ..
మాదకతలో మనల్ని.. పడగొడతాడు..

నాయకుడే మనల్ని కాపాడతాడనే..
మూఢనమ్మకాన్నీ నిలబెడతాడు..

నిజం కని..తేరిపార చూడరా తమ్ముడా..
నీచూపుల్లో వాడికి తడబడతాడు

RTS Perm Link

No responses yet

Feb 19 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 16

Published by under my social views


కావలివాడికి ఎన్నోపనులు

కుక్కల్ని కాపలాకాయాలి.. వాటి అక్కల్నీ..
గన్నుమోయాలి.. పెద్దోళ్ళ పరువునూ..
ఆఫీసు పనిలా ఇంటిపని చెయ్యాలి, అమ్మగార్లకు బట్టలుతకాలి, బజారుకెళ్ళాలి..
బండి తోలాలి, తుడవాలి.. బూతులు పడాలి తిట్టాలి,
పరిగెట్టాలి, తన్నాలి..
సాల్యూట్ కొట్టాలి.. కాలెగరేసిమరీ..
మేకపోతై.. నించోవాలి..
జాగారాలు చెయ్యాలి..
బందోబస్తులో ఉండాలి..
మందుపాతరలమధ్య, సిధ్ధాంతాలకింద..
పడి పేలాల్లా నలగాలి..
రోడెక్కాలి.. చెట్లెక్కాలి..
గుట్టలెక్కాలి.. ఖాకీ లెక్కల్లో ఉండాలీ..
లెక్కల్లో ఉన్నంతవరకూ.. లెక్కలేనట్లుఉండాలి..
ఎందరు చీ అన్నా.. చాచా అన్నా.. లోకంకోసం బతకాలి
పెత్తందారులు ఎందరున్నా.. జెండా బరువు మొయ్యాలి..

పేరు మరిచి బతకాలి..
హక్కుల్లేని కుక్కినపేనుల్లా కొన్నిసార్లు..
తప్పొప్పులకు నామినీల్లా చాలసార్లు..
కాపలాకుక్కై..అన్నిసార్లూ
ఈ కాల్బలం ముందుంటేనే..
ప్రజాస్వామ్యానికి గజారోహణం

RTS Perm Link

No responses yet

Feb 19 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 15

Published by under my social views

ఏంటో ఈ విమానం గొడవలు..
విజయ్ మాల్యా సుబ్రతారాయ్ ల పళ్ళు రాలినా
ప్రభుత్వానికి దేశీయయానంలో ఏంచూసి అంతనమ్మకం!!

లాభాల్లో ఉన్న రైల్వేని.. నష్టాలబాట పట్టించారు..
ఆర్టీసీ ఏనాడూ పచ్చగాలేదు..
మనుషులతో రోడ్డుకు వేలాడే సిటీబస్సుల్ని చూసీచూసీ..
మా కళ్ళపచ్చ ఇంకా తగ్గలేదు.

ఆనాడు రూసీమోడీ కి లొంగని ఆకాశగనిపై
ఈనాడు ఎవరిగురి!

తింటానికి గింజల్లేవురా మొర్రో అంటే..
ఎగరేసి తంతానన్నాడట .. ఇదీ అంతే..

చదువులపన్నులా.. ఎగిరేపన్నుకి సిద్దమవుతారా..
మమ్మల్ని ఉద్దరించడానికి.. నష్టాల్ని భరించడానికీ!!

RTS Perm Link

No responses yet

Feb 19 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 14

Published by under my social views

ప్రకృతి పురుషుడు వెలుగునీడల్లా
నవ్వుల్నీ పువ్వుల్నీ పంచుకునే రోజొకటి పుట్టింది.
ప్రేమ వ్యక్తీకరణ కన్నా ముందు ఆర్జితాన్ని
బహుమతిగా మార్చే సంప్రదాయమొకటి వచ్చింది.
కార్డు సైజును బట్టి ప్రేమను కొలుస్తారు అమ్మాయిలు.
ఖరీదును బట్టి షరాబులు పుట్టుకొస్తారు
పువ్విస్తేనే ప్రేమున్నట్టు కనిపించినా
అది విమానం దిగిన గులాబీయే అయివుండాలి
సమయాన్ని ఎంత వెచ్చించినా
షాపింగులకు మాల్ లకూ వెళ్లే వెసులుబాటుండాలి
ఖర్చును బట్టే.. ప్రేమ పుడుతుంది దేవుడా..
పరకామణి లాంటి ప్రేమలోకంలో మనసూ, పర్సూ
పడేసి..కూడా.. మిగిలిన మొక్కులు తీర్చుకోవాడానికి
మగాడికి బోల్డు బొచ్చుండాలి..
ఆడపిల్లకు .. ద్రావకానికీ ఒక సంతృప్తీకరణ స్థితి ఉండాలి
అది మగమహారాజుకు ముందే తెలిసుండాలి.

RTS Perm Link

No responses yet

Feb 19 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 13

Published by under my social views

అదో పించను స్వర్గం..
భూమిమీద నూకలు చెల్లినా
రూకలు పుచ్చుకునే చోద్యం..

చిత్రగుప్తుడి లెక్కల్తో రాజీపడలేక యముడు గారు
నరకంలో కొత్తగా తెరిచిన ప్రత్యేక విభాగం

వీరు ఉన్నారో పోయారో ఎవరికైనా తెలియడం కష్టం
వీరిపేర కొందరు పబ్బం గడుపుకుంటుంటే
పోయారని దీపం పెట్టుకునే వారసుల
వేలిముద్రలతో సర్కారు కు చమురొదులుతుంది

గ్రామీణాభివృధ్ధి శాఖ కు యముడిదగ్గర పరపతి ఉంది.
ఇప్పుడు వారికి చిత్రగుప్తుడి కంప్యూటర్ పాస్ వర్డ్ దొరికింది.

RTS Perm Link

No responses yet

Feb 19 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 12

Published by under my social views


పక్కన పడేసిన తుపాకీ,
ఓ లోంగిపోయిన తీవ్రవాది
తుప్పట్టేవరకూ నాంచి తగలెట్టేస్తారు, ఉరితీస్తారు

మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి
దొరికిన వాళ్ళను చంపేస్తారు,
దొరకని వాళ్ళను వదిలేస్తారు
పరోక్షంగా సూత్రధారుల్ని తప్పిస్తారు..

రాజకీయానికీ, మంత్రాంగానికీ గుట్టుండాలి సరే..
చట్టానికీ, న్యాయానికీ రట్టుండాలి
మీరు ఒకవర్గానికి చేరువ కావడానికి
ఎప్పుడూ ఉరికొయ్యకు పేనినతాళ్ళపట్టుండాలి
అసలు దొంగల ప్రమేయం నిశ్చయమవ్వకుండానే
రహస్యంగా కుట్రల్లో పావుల్ని ఉరితీస్తారు

(మరి.. సాక్ష్యాల జననాంగాలలో పెట్రోల్ పోసి,
షాకులిచ్చి వొప్పించలేకపోయారే.. )

కాటేసే పాముల్ని పక్కదేశం పాలుపోసి పోషిస్తుంటే..
మనదేశంలో చలిచీమలున్నాయని చంకలు గుద్దుతారు
అరకొర న్యాయాన్ని మా నుదుటిన రుద్దుతారు

RTS Perm Link

No responses yet

Feb 14 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 11

Published by under my social views

నిజాయితీయే నీ జాతీయత
నిజానికి నిండు రూపమే నీ జాతిపిత
సహనం నీ మాత
సంయమనం నీ గీత
ధర్మం నీ ఆచరణ
న్యాయం నీ నీడ
నిక్కచ్చితనం నీ జాడ ఓ తెలుగోడా..
తలకట్టులోనే రైటున్న మొనగాడా..
చూసి నేర్చుకో ఎలా ఉండాలో.. నీ అన్నను
విచారణ పర్వంలో పాండవ పక్షపాతిని
కౌరవ దమన వ్యూహ రచనా వీరుడ్ని
లక్ష్మీ నారాయణ జేడీని

RTS Perm Link

No responses yet

Feb 14 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 10

Published by under my social views

వెనకటికి ఒక సినిమా దొంగ-దొంగ..
అందులో ఓ పోలీసు సదాశివం అని..
అడుగుతాడు అందర్నీ: నాకు తెలియాలి..
దొంగ ఈరోజు వేసే కన్నం ఎవరింట్లో అని..

ఎలా చెబుతాం స్పీకరు గారూ..
చెంచులు చనిపోతే మీకు!!
అందరు చెంచుల్నీ ఒక్కచోట చేరుస్తారా..
వాళ్ళ అడవి గూళ్ళను కదిపి బతికిస్తారా!!

ఒప్పుకుంటాం.. మీ ఉద్దేశంలో తప్పులేదని..
రైతుని పొలం పక్కనుండి తప్పిస్తే బతుకుతాడా..
చెంచుల్ని వారిష్టాలకు విరుధ్ధంగా పునరావాసాలు కల్పిస్తే
మన్నుతాడా.. మన్నవుతాడా!!

అడవిదాటి రాని అమాయకులకు
కొత్త సంప్రదాయాలు నేర్పిస్తారా!
చదువు చెప్పించండి.. తిండి గింజలిప్పించండి..
మందో మాకో అందుబాటులో ఉంచండి.

ఇంతకుమించి మీనుంచి ఆశించామా!!..
అడవుల్ని మింగేసే కొడుకులకు..
అడవి బిడ్దల్ని బలిచ్చినట్టే..
ఆలోచించి అడుగెయ్యండి సభాపతీ..

నివేదికల సత్తాలకు హిడెన్ ఎజెండాల జెండాలు వేలాడతాయ్..
అటవీ సంరక్షకులకు మీ మాటల అంతరార్థం చేదు గుళికే

RTS Perm Link

No responses yet

Feb 13 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 9

Published by under my social views

స్వామీజీ! మహిళా రక్షణ శిరోధార్యమే..
మహిళల నుంచి రక్షణకై కొందరూ..
మహిళోధ్ధారక ముసుగుల్లో లొసుగులతో మరికొందరూ
స్వామీజీలయ్యారు.. లోగుట్టు జనానికెరుకే..

పురుష భావాలకు రక్షణ లేదేమో..
గణతంత్ర వ్యవస్థలో భర్త స్థానం కుటుంబపెద్ద కాదేమో

పురుషుడు పుంసత్వాన్ని వదులుకోవాలి..
ఈరోజు అధికారం కాదు ఆప్యాయత నిలుపుకోవడానికి..
అయినా స్వామీజీల మాటే కాదు
చేతలూ చెల్లే దేశం మాది..
విని చూద్దామా మీ మాటలను

మిమ్మలేమీ అనడం లేదు స్వామీజీ!..
మా ఆస్థానం లో మా స్థానం ఏమిటో తెలీక…!!

ఎక్కడ బడితే అక్కడ ఆడతనపు ఒళ్లే కనిపించే మాకు
భావాలు కుళ్ళని మార్గమేమిటో!!
మనుషుల్లో మగాళ్ళు వేరయా
విశ్వధాభిరామ..

RTS Perm Link

No responses yet

Feb 12 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 8

Published by under my social views

చిట్టితల్లులు తారాడని ఇల్లు ఇల్లేనా!
అందంగా పెంచలేక పేగుబంధాన్ని
మొగ్గగా తుంచుకునేది అసలు తల్లేనా!
గట్టుమీన నుంచొని ఎన్నైనా చెప్పొచ్చు ఇలా ఎన్నైనా

కంటికి రెప్పలా కాపాడటం చేతకావాలి
ఆడపిల్లల్ని కనగానే సరిపోదుగా
పాపిష్టిలోకంలో ఇట్లా జరుగుతుందని తెలిసుంటే..
రాజధాని నగరంలో ఆడపిల్ల పుట్టుండేదా?

పాపం మొయ్యలేక కుమిలే అమ్మలదేశంలో
ఆడపిల్లను కనడానికి దమ్ముండాలి..
కన్న పిల్లల్ని కనిపెట్టుకోవాడానికి వెయ్యి కళ్ళుండాలి
వైష్ణవిలు, సాన్విల కథలవెనక
కన్నవారి కన్నీటి చారలింకిపోలేదింకా
ఏంచెప్పి పెంచగలం పువ్వుల్ని ప్రమాద వనంలో
కారుణ్యం అడుగంటిన సమాజంలో

RTS Perm Link

No responses yet

Feb 12 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 7

Published by under my social views

చదువొక్కటే చేతిలో దీపం
బతుకొక్కటే ఎవరికైనా..
చేజారనీయకుండా పట్టుకోవాలి

120 కోట్ల జనాభాకి 1100 బళ్ళ స్వర్ణోత్సవాలు
11లక్షల పిల్లల చదువులు
కె.వి.లో చదవాలంటే మినిష్టర్ సిఫారసుండాల
ఎంతమందికి ఈ మాట తెలుసుండాలి!!
తెలిసినా ఎన్ని సీట్లు మిగిలుండాలి
కేంద్రీయ విద్యాలయాలు సానపట్టేవి మాణిక్యాలనే
మరి జాతి రాళ్ళ కేంద్రాలు మనకి ఎన్నుండాలి
చదువుకోవాలంటే ఎవరి దన్నుండాలి?

మినీ ఇండియాలే ఇవి మినిష్టర్ గారూ
మరి ఇలాంటివి ఎన్నెక్కువుంటే అంత మంచిదని,
సమైక్యతకు అవసరమని మీకు ఈపాటికి తెలుసుండాలి

RTS Perm Link

No responses yet

Feb 12 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 6

Published by under my social views

రాణింపులేని చదువులకు కర్ణుడి కష్టాలా గురువా! అంటే
బాధలూ, కష్టాలు వివక్ష అన్నీ మాయ శిష్యా.. అంటారా!!
వీటి గురించి ఆలోచిస్తేనే బాధిస్తాయి కదా!..
పాపం పిల్లలకేం తెలుసు సర్దుకుపోవాలనీ,
పటేల్ గారబ్బాయే క్లాసు లీడర్
ఎర్రి నాగన్న కొడుకేమో ఎనక బెంచీయే
పంతులుగారబ్బాయేనా మొదటిర్యాంకు!~!~
ఒరేయ్! .. ధవా!! ఊరికే డౌటడిగావా గుంజీళ్ళే
(…కూలోడి పిల్లోడ్లుకూడా చదివేసుకుంటున్నారు..హు..)
కాలం మారిపోయింది.
ముందు ముందు
చాకలి మంగళ్ళుంటారంటారా హిస్టరీ మాష్టారూ?

RTS Perm Link

No responses yet

Feb 06 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 5

Published by under my social views

ఓ ఫత్వా.. వెలుగును అణిచేస్తుందా!..
ఆట పాటలు మతపరిధిలోనివైతే..
ఏఆటలు ఆడాలో ఏపాటలు పాడాలో ముల్లాలే చెప్పాలి.
ముల్లుల్ని గుచ్చే మాటల్నించి చట్టాలదాకా.. మీ గురి అమ్మాయిలేనా!!
మహమ్మద్ ప్రవక్త అనుయాయులందరికీ అమ్మతనమంటే లోకువెందుకో..
గాంధార రాజ్యం, కాశ్మీరాల్లో.. వెచ్చదనపు వేకువెప్పుడో??

RTS Perm Link

No responses yet

Feb 06 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 4

Published by under my social views

ఏదిరా ఈ కాలపు నీతి!
సంయమనం లేని లోకరీతి!!
అడ్డుకోవడం నీ ఆనవాయితీ…

వివాదాలు పుట్టించడం..
నిప్పులేకున్నా పొగదట్టించడం
మంచో-చెడో మాటల్తో చుట్టేయడం.
.చురకంటించడం..

పొరపాట్న నోరు జారామా.. గొంతట్టుకోవడం
తెరవెనుక మంతనాల తరువాత.. జట్టుకట్టుకోవడం
పట్టుకుదరలేదా!! శంకరగిరిమాన్యాల లెక్కలు కట్టుకోవడం

సినిమా పతాక సన్నివేశాలకన్నా..
సినిమా విడుదలనే సాంఘీక సమస్యగా మలచుకోవడం ..
పావులు గా మారడం.. పాములతో కరిపించుకోవడం..
బతుకు బాగుందా.. నిచ్చెనలెక్కి.. వైకుంఠపాళీ ని జీవితానికి అన్వయించుకోవడం..
గెలుపోటముల దోబూచులాటలో వివాదాలే.. వినోద మాధ్యమాల ప్రాధాన్యాలు..
ఇదే.. ఆధునిక మీడియా భాగోతం.. భారతం.

RTS Perm Link

No responses yet

Feb 06 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి ౩

Published by under my social views

తండ్రి గరగర తల్లి పీచుపీచు బిడ్డలు మందుబాబులు
మనవల కథ మనకొద్దు
పనసకాయ కాదు ఇది పొడుపు విప్పడానికి
మందుసీసాదీ తప్పే కన్నూ-మిన్నూ మూసుకుపోవడానికి
చంపడం వల్ల చావొస్తాదని మందుకు తెల్వదేమో..

ఏమని తిట్టుకోగలను.. అమ్మ-నాన్నలను చంపినోళ్ళను
అమ్మనా బూతులు..
దేవుడా.. కొత్త తిట్లేమైనా పుట్టాయా..
ఈ పనులు చేయించే వాడికి.. చీమలేమైనా కుట్టాయా!!

RTS Perm Link

No responses yet

Feb 06 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 2

Published by under my social views

ఊరికే వస్తాయా జబ్బులు!!
ఎవడికో పుట్టిన వెధవబుద్ధికి ఎక్కువదూరం బండి నడిపిస్తడు..
మనల్ని కాలుష్యం దారుల్లో ముంచి చంప్తడు.

వీధి చివర బడ్డీకొట్టుకి సిగరెట్ కాల్చనీకి తియ్యండ్రా బళ్ళు..
అమ్మాయిలకు పోజులివ్వ తిప్పరా ఏక్సెలరేటరు..
తిరగరా నాలుగు చుట్లు.. పాడవ్వనీ రోడ్లు

పోనీ వెధవడబ్బు పాపిష్టిదీ.. పెత్రోల్ డిజిల్లెక్క పోనీ..
నాన్న నేడిపించి కొన్న బైకొకటి.. కొత్త జాబుకి పెట్టుబడిగా వచ్చినదొకటి
మీ వీరత్వం చూడ్లేక ముసుగులేసుకున్న అమ్మాయిలు,
మీకు ఎప్పటికీ పడని బొమ్మాళీలు..

ఈ నగరం లో ప్రేమ వ్యవహారాలు వాహన షికార్లూ, అన్నివిధాలా అనారోగ్యకరం
చట్టబద్దమైన హెచ్చరిక: ఇక్కడ బతకక తప్పదు వాహనం లేకుండా..
తాగండి.. పీల్చండి.. రోగాలు రావడానికీ రోడెక్కితే చాలదా!!

RTS Perm Link

No responses yet

Feb 06 2013

నా కొత్త గీతలు: ఫిబ్రవరి 1

Published by under my social views

తిండి గింజలులేక ఒకడేడిస్తే.. తిన్నదరక్క వేరొకడు ఏడ్చాడట.
మరి సగం కడుపు నిండేవాడికి ముక్కిపోయినవి చూస్తే ఏడుపురాదా!!

రేషన్ డీలర్ మీద నెపం దోసేసి గోదాంలో ఎలకలు బతకాలి.
గిడ్దంగి సంస్థలపై దోసేసి ఏ పందికొక్కులు బతకాలో

కంచంలో అన్నమొదిలితే విసుక్కునే అమ్మలారా!!
కళ్ళాలలో పాడయ్యేదానికన్నా, గొళ్ళాల్లేక పాడయ్యే ధాన్యం మెండు.

వీధి చక్కబడ్డాకే.. ఇల్లు చక్కబెట్టుకునే రోజులివి
అట్టే పిల్లల్ని విసుక్కోకండి.. పిట్టలకో కుక్కలకో పెట్టండి

ఎక్కువతింటే మనకే రోగం..
చక్కెర వ్యాధి రాని జాతి-పందికొక్కుల రాజ్యంలో
పచ్చిబియ్యం తినిపాడయ్యే జాతుల్ని పెంచే బదులు
తలో గుప్పెడు వండి పాడెయ్యండి.. నోరులేని జీవాలకోసం

కేజీ కి కేజీ ఉచితంగా కావాలనుకునే అమ్మలకు
జీవాలకు పంపకాలు నచ్చుతాయా!!
మాతలూ! నా మాటలు మీకు నప్పుతాయా!!

RTS Perm Link

No responses yet

Next »

RTSMirror Powered by JalleDa