Jan
31
2013

టంగుటూరు మిరియాలు తాటికాయలంతన్న పోలిగాడ్లా
2014 తర్వాత అనిశ్చితని
చిలక జ్యోస్యం చెబుతున్నారు చిదంబరం గారు.
మీరు సంస్కరణలకు కట్టుబడి ఉండడం వల్లేనే
విదేశీ పెట్టుబడులకు ఆస్కారం. .
ప్రపంచానికి ఆర్థిక మాంద్య విముక్తి
మంచో-చెడో మాయావతీ, మోడీల ఆకర్షక పథకాలు
అమెరికా కలల్ని మీరు పట్టుకు వచ్చేపైకాన్ని
ఆలస్యం చేసాయి
మన రాజ్యాంగ శక్తుల్ని నిర్వీర్యం చేసే
కుట్ర పన్నింది ఈ బూర్జువా వ్యవస్థే
వచ్చే ఎన్నికల్లో మీరు తప్ప ఇంకెవరు
గెలిచినా.. లోకమంతటికీ అవస్థే..
ఇదేనా మీరు చెప్పాలనుకున్నది?
పథకాలూ- సంస్కరణలూ వేరు వేరు..
చేపలు పట్టడం నుంచి
వండి, తిని చేయి కడగడం వరకూ కావాలి
ఆ పూటకు వండిపెట్టిన కూరతో
పొట్ట నిండడమేనా కావాల్సింది!!
అప్పడగడానికి ఉత్తరకుమారుడవ్వాలా!!
భవిష్యత్ అనిశ్చితంటేనే… అప్పు పుట్టాలా!!
RTS Perm Link
Jan
30
2013

చిదంబరం గారూ! మీరు గార్ ను ఎక్కడ ఎగరగొట్టారు సార్!!
మీ మాట మారిషస్ కు నచ్చలేదు
మా యువనేతలకూ అర్థం కాలేదు..
ఇప్పటికీ పన్నుఎగవేతకు విదేశీ పెట్టుబడులే వెన్నుదన్ను
ఎక్కడికేసులక్కడే ఉన్నాయి.. మా వాళ్ళ హవాలా లావాదేవీల మీద
అప్పుడే కథ కంచికెళ్ళిపోయిందా!!
మార్కెట్టుకి మీ మంత్రమెక్కి పెట్టుబడులు పరిగెత్తుకొచ్చాయా!!
మరి ద్రవ్యలోటు ఎందుకు పెరుగుతుందో..
మా బుర్రలకు మీ ఇంగ్లీషు అర్థమైనా.. ఇంగితం అర్థంకాదు.
RTS Perm Link
Jan
30
2013

ఉద్యోగాలు పుట్టించడం ఎంత కష్టం.. ఎంత కష్టం!!
మాఊళ్ళో చెత్తేరడానికి వెయ్యి మందికావాలి
ట్రాఫిక్ సరిదిద్దడానికి ఇంకావెయ్యి
సిగరెట్లు, గుట్కాలమ్మడానికి, బడ్డీ కొట్లు, పాన్ డబ్బాలూ
ఆటోలు నడపడానికి, పిజ్జాలు పంచడానికి
ప్రయివేటు పోస్టుమాన్లు, ఉమనైనా సరే కావాలి ఇంకొద్దిమంది ..
చెప్పులు కుట్టేవాళ్ళు,
సైకిల్ టైర్ పంచరేసేవాళ్ళు
కళ్ళాపి జల్లి ముగ్గుపెట్టేవాళ్ళు
మరికొంతమంది కావాలి..
వర్థమాన దేశం లో ప్రచ్చన్న నిరుద్యోగం తప్ప
అసలు అవసరాలు ఎక్కడివి
ఉన్నది అవసరానికీ అవకాశానికి మధ్య అగాధమే
RTS Perm Link
Jan
30
2013

సోనియాజీ!
పార్టీ అంతర్గత సమావేశంలో మీరు కోరిన కొత్తకు దారి
మేమూ కోరుతున్నాం రాజకీయ సమాజంలో
17 ఏళ్ళ నెహ్రూ పాలన తరువాతా కొత్తనేతనే కోరారు మా తాతలు
ఇందిరమ్మ 4 పర్యాయాల పాలన తరువాతా అదే ఆశించారు మా నాన్నలు
ఆ కొత్తదనం మా తరువాతా తరానికీ.. మీ ఇంటినుంచేనా!!
పాపం.. మేమే మిస్సయ్యాం మిమ్మల్ని అనుకుంటున్నారు మా వాళ్ళంతా.
మన్మోహన్ని మీ ఎంపిక ఎప్పుడు ఖరారైందని BBC రిపోర్టర్ ఆనాడడిగినప్పుడు
ఫలితాల వెనువెంటనే అన్న సమాధానం కాకతాళీయం కాదనీ,
మీ ప్రధాని అభ్యర్థిత్వం ప్రతిపక్షాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడని,
ఇప్పటికీ ఎందరో మీది త్యాగమనే… నమ్ముతున్నారు సోనియమ్మా!
సానుకూల రాజకీయాలు చేస్తానంటున్న మీ తనయుని మాట
యమర్జన్సీ సమయాలను, మీ మరిది అరాచకాలనూ మరుగునపరచగలదా!
మీ పేరు స్మరించి పబ్బం గడుపుకునే నేతలనుంచి
మీ సుతుని దాకా అందరూ కొత్తకి దారివ్వరాదూ..
పచ్చని దేశం ప్రజాస్వామ్యం అనుకుంటూ మేం..
తప్పొప్పులను పక్కనపెట్టి .. తప్పక మీ పాలనలో
we, silly fellows will follow.
ఒక్క మీ అల్లుడొక్కడేచాలు మా కోరికలపై మంచు చల్లడానికి..
RTS Perm Link
Jan
29
2013

పేదరికాన్ని అర్థం చేసుకోలేకపోతే పేదరికం తరిగేదా!
అర్థమంటే.. మీ అర్థం ఏమిటి దువ్వూరి వారూ?
మనీనా!! మీనింగా!!
పేదరికమే దేశాన్ని పోషిస్తుంది.
ప్రజాస్వామ్యానికి మందు మందేకదా!!
పేదోడు మందుపైసలతోనే అబ్కారీ హుండీ నిండేది.
పేదోడు పెట్టుబడే ప్రైవేటు బడి బండిని నడిపేది
పేదోడి ఓటేకదా పెద్దోడి పచ్చనోటు!!
సామ్యవాదపుముసుగేసుకున్న
కుటుంబ పాలనా కాలంలో
గరీబీహటావో ఒక నినాదం మాత్రమే..
ఎదగడానికి ఎదుటివాడి పేదరికమే పెట్టుబడి.
చావకుండా బతకకుండా కనికట్టుచేసి
పేదరికాన్ని కాపాడండి
దీనోరక్షతి రక్షితః
we Indians, adorn Poverty
RTS Perm Link
Jan
29
2013

నరనరాల్లో జీర్ణించుకుపోయిన భావన
రాతి విగ్రహాలలోనే దైవత్వాన్ని దర్శించడం.. భారతీయులం కదా!
విగ్రహారాధన వద్దన్న బుద్దన్ననూ వదల్లేదుగా మనం
ఇప్పుడిప్పుడే బద్దలుకొట్టడం నేర్చుకుంటున్నాం..
టాంక్ బండ్ తో మొదలెట్టాం.
చెట్లకింద, రోడ్డుకి దూరంగా శూన్యంలోకి చూస్తున్నవాళ్ళనీ,
బుధ్ధుడితో బాతాఖానీలో మైమరచిన వాళ్ళవీ కొట్టి మరీ విరక్కొడతాం.
అదేమంటే.. కడుపుమంటలముందు రాతిబొమ్మలెంతంటాం.
కొండెక్కిన రాజకీయ దీపాలను కూడళ్ళలో వెలిగిస్తాం
చీకట్లో గుద్దుకుంటే ఆ కాళ్ళకిందే పడిచస్తాం
మామూలు రోజుల్లో పిట్టరెట్టల్లో పడివున్నా పట్టించుకోం.
పుట్టినరోజో, పోయినరోజో ఐతే రోజాపూలతో పూజ చేస్తాం
పాలతో కడిగేసి ఫోటోలకు పోజులిస్తాం
నెగెటివ్ లన్నిటినీ పోజిటివ్ గా డవలప్ చేస్తాం.
విగ్రహాలపై మాయావతి అంత వలపుంటే..
ఈ దేశాన్నే మేడం టుస్సాడ్స్ మ్యూజియం లా చేస్తాం
ప్లారెన్స్ నైటీంగేల్ మరుజన్మ అనో
రోమ్ స్వేచ్ఛాదేవత లిబర్టాస్ భారతీయరూపమనో
కథలల్లి చరిత్రని వీధి దీపాల్చేస్తాం
విగ్రహాలుచేసి ఏడాదికి ఒకటో రెండో పండగలు చేసుకుంటాం
రోడెక్కిన గ్రహాల స్థితిగతుల్ని బట్టి పండగలాంటి జీవితాన్ని
విగ్రహాల వారసుల కోరస్ లతో పాడుకుంటాం..
మాతోమేం జారుడుబల్లాట ఆడుకుంటాం
తేడా వస్తే.. దేనికైనా ఆ కూడళ్ళలోనే నుంచుంటాం
RTS Perm Link
Jan
26
2013

ఎర్రబుగ్గంటే ముద్దులేనిదెవరికి
రాజకీయ రంగాన కేజ్రీవాల్ కి తప్ప!!
ఇంద్రజిత్ గుప్తా, విశ్వనాథ్ ప్రతాప్ సింగులు మరి మినహాయింపులే
రద్దు గురించి మాట్లాడేముందు సమీకరణాలు చూసుకోవాలేమో..
తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాంటి సంకీర్ణ ప్రభుత్వాల్లో..
బుజ్జగింపుకు బుగ్గకారు ఓ మార్గం..
పోలీసు రక్షణ లో ముఠా రాజకీయాలు ఊళ్ళేలాలిగా..
ప్రజలవద్దకు పాలనలో భాగంగానే .. దొంగలకు పోలీసుల కాపలా..
లేకపోతే దేశం బాగుపడిపోదూ!!
RTS Perm Link
Jan
26
2013

పాపాలాల్.!!. పిచ్చోడివే నువ్వు.
మతాల ముసుగుల్లో మసలలేకపోతున్నందుకు,,
మానవత్వం మిగిలున్నందుకు
దేవుని వరంగా అందిన పసిపిల్లని సాకుతున్నందుకు
రంగులేసిన ఆలయాలన్నీ.. సున్నిత భావాల నిలయాలనుకుంటున్నందుకు
లౌకికపు లోగుట్టు తెలియనందుకు
సామ్యవాద మూలాలు మనసులో నింపుకున్నందుకు
ఎవరినో సంతృప్తిపరుద్దామని మానవ హక్కుల కమీషన్‌కు తన బిడ్డ పేరు మార్చే అవకాశం ఇచ్చినందుకు..
మీడియాను అమాయకంగా ఆశ్రయించినందుకు..
ఎవరో పిచ్చోడంటే.. ఊరికే వాపోతున్నందుకు..
మనిషిగా మిగిలున్నందుకు..
ఆకాశమంత ఎత్తున నిలుచున్న నీపై
నేలమీద బురద బుడగలు డబడబలాడుతున్నందుకు
నిన్నుమించిన దైవత్వం మా ఇలాకాలో లేనందుకు..
RTS Perm Link
Jan
26
2013

గోరింట పండేది ఎండాకే..
సమయం విలువ తెలిసేది గతించాకే.. ఈ మాటలు మాకర్థం అయ్యాయి మిమ్మల్ని చూసాకే..
సంజీవ నర్సింహ అప్పడు గారూ.. మీది మాదొడ్డ తెలుగు మనసు.
తెలుగునేలన పుట్టాం కదా.. అమ్మభాష విలువ తెలియాలంటే మీతో మారిషస్ రావాలేమో
అప్పయ దీక్షితులు గారి మాట చదవాల్సిందే.. తమరి వాణి వినాల్సిందే
మీ తెలుగు సరళత, ధారాళత, యక్షగానపు ఇక్షురసాన్ని గ్రోలినంత మధురం
మల్లెపూరేకులవంటి మాటల తేటలు చాలు మహా సభా ప్రాంగణాన మా నేతలు మతులుపోగొట్టుకోవడానికి
మీ స్ఫూర్తి సచేతనంగా నిలవదని నాకేమీ అపనమ్మాకాలేంలేవు..
నేను రాజకీయ వాదిని కాదుగా.. మీరెప్పటికీ గుర్తుంటారు..
తెలుగు పునరుజ్జీవన దీక్షాపరతంత్ర ముఖ్యమంత్రీ!.. నీకేమైనా చురకంటిందా!!
RTS Perm Link
Jan
26
2013

ఏ మతం వారికైనా మనదేశ జెండా ఒక్కటే
సింధూరపు రైక.. మధ్య-వృత్తంలాతెల్ల రంగున చక్రం.. ఆకుపచ్చని కోక
జెండా ఎగిరేది.. ఫ్యాషన్ రాంప్ మీద ఏ వయ్యారి వంటిమీదో
అశోక చక్రం ధర్మ సంకేతమే..
పూసిన రాజకీయ రంగుతో తిరగలేక గాల్లోనే
నేలకిదిగిరాక రెపరెపలాడుతూ
ఏ మతం వారికైనా జాతీయగీతం ఒక్కటే
భారత భాగ్య విధాత ప్రార్థనే.. మనవారి మొరాలకించేదెవ్వరో
రాజ్యాంగమూ ఒక్కటే.. అడ్డంపెట్టుకుని పబ్బం గడుపుకోవడానికి
జన గణనంలో మనమెక్కడో అన్నదే ధ్యాస
అరె! 7 ప్రాంతాల పేర్లే ఉన్నాయేంటీ జాతీయగీతంలో.. సవరణ ఎప్పుడో!!
వాటి వివరణ ఎన్నడో.. ఉద్యమిద్దామా!! మన వాటా కోసం!!
భాయీ- భాయీ లడాయిలో లోటాలతో.. కాటాలతో మోటా నాయకులంతా..
RTS Perm Link
Jan
23
2013

అర్థరూపాయి ఆదాయానికి చటాకు ఖర్చులు ..
ఇది నిన్నటిమాట
బతుకు బండి లాగడానికి ఇంధనం డబ్బైనప్పుడు
లోటు బడ్జెట్లో సంసారాన్ని ఈదడం ఇది నేటి ఆట.
ఇంతకన్నా చెప్పడానికి ఏముందీ పూట..
ఇది సగటుమనిషి బాధల బాట
RTS Perm Link
Jan
23
2013

తారీఖ్ అన్వర్జీ!!..
నల్లధనానికి కారణాలు ఏవైనా కారకులు మీతో కలిపి ముగ్గురు
నేతలూ, సార్లూ, బడా సేఠ్లూ..
నోట్ల రవాణా నకిలీలలూ కాయకష్ఠం పనులు కావే..
కూలీవోడికి ఈ కతలెందుకు..
తప్పెక్కడుందో.. తెలిసిందంటున్నారు మీరు..
మరి అర్థక్రాంతి సూచనలు పాటించరే..
పెద్దనోట్ల చలామణి తగ్గించరే..
మీచెయ్యే.. మీ మనసు మాట వినదు..
మీ నీతులు అద్దంలో చూస్తూ చెప్పుకోండి..
మాకు మాత్రం.. అవగాహన కల్పించండి..
మీరుచెప్పే ఆరు లక్షలకోట్లూ.. మా జీవితాల్లో పరచుకున్న
చీకటి పొరల్లో మరో పైపూత..మసి అంతేగా..
RTS Perm Link
Jan
23
2013

ఇదేదో వింతగా ఉందే..
వ్యవసాయాధారిత దేశంలో రైతెప్పుడు బాగుపడ్దాడు!!
దేశం దీపం ఐతే.. పంటే చమురు
వ్యవసాయం ప్రమిదనీడ..
రైతూ, అతని కుటుంబం ఆ చమురున బడ్డ శలభాలు
పరిశ్రమలు దీపాధారాలు, రైతులానే..
భేదమేమిటంటే.. వెలుగుంటే చక్కబెట్టుకోవడం చిక్కక..
దీపంకోసం.. బక్కరైతు బతికి చద్దామని.. చచ్చి కుటుంబాన్ని.. ఓదార్పు గట్టున పడేస్తున్నాడు..
బుగ్గలు నిమిరించుకుంటూ.. జనం బతికేద్దామని..
తోడేళ్ళబారిన పడిపోతున్నారు..
సంతకాలు పెట్టీ..పెట్టీ జీవితాన్నీ చక్రవడ్డీ తప్పులలెక్కలకి.. తాకట్టులో జమకట్టేస్తున్నారు
RTS Perm Link
Jan
23
2013

మనకి తెలుగు పనికిరాదు, ఇంగ్లీష్ పాఠం అర్థంకాదు
హిందీ లోతుని ని ఎప్పుడో 20 లోపుకే కుదించేశాం
లెక్కల్లో .. సైన్, కొసైన్ లకు ఎలాగూ భాష మార్పు లేదు
జీవశాస్త్రం లో vertebrates అంటే ఎంతకష్టమో సకసేరుకమన్నా అంతే..
వెన్నెముక కలవి అనాలన్నా.. నామోషీ లేకుండాలిగా..
సాంఘీక శాస్త్ర్రం అంటే తెలీదు సోషలనే చెప్పాలి మాకు
చరిత్ర హిస్టీరియాయే గా..
అన్నిటికీ మించి మార్కులకోసం సంస్కృతమొకటి..
చెప్పేవాడు చదువుకుని ఏళ్ళయింది..
కొత్తగా చదువుకున్నోడికి ఉద్యోగం రాదు..
వచ్చినా పై కష్టాల కారణంగా చెప్పడం రాదు..
ఈ చక్ర భ్రమణమే తప్ప విద్యా సంక్రమణం మనకెవరికీ చేతకాదు..
ప్రభుత్వానికీ, ప్రజలకూ.. ఎగరడం తప్ప.. దుమకడం ఎప్పటికీ .. (ఎన్నిసార్లు చెప్పను!!..)
RTS Perm Link
Jan
23
2013

చార్జీల పెంపు కి ఎన్నికల తంతుకి లింకట
సర్వం ఊడ్చాక ఎవరికి మీ దానం..
సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పుతామంటూ
ఎందుకు మరి కాపాడుకోలేని వాగ్దానం
పాతిక రూపాయిల మనబియ్యం రూపాయి ఐనప్పుడు
ఆ లోటుభర్తీ అన్ని వంటసరుకులమీదా??
అవి చాలదన్నట్టూ కనిపించని వడ్డీంపులా
పేదల పథకం సరే..
లబ్దిదారుల్లో మీకు ఓటర్లే కనిపిస్తారు
బతికున్నందుకు మాకు మీరు ధరల్ని చుక్కల్లోనే చూపిస్తారు
RTS Perm Link
Jan
10
2013

PM గారూ! ప్రజా చైతన్యం ఉప్పొంగుతోందా!!
రాజ్ ధాకరే బిహారీలపై ఉన్న ప్రేమ చూసా..?
అక్బరుద్దీన్ ఉన్మాదపు బాకా ధ్వని వినా!!
మోహన్ భగవత్ మాటల్లో మనుధర్మ సూక్ష్మాలు కనా!!
మీ MP మంత్రి కైలాష్ తిరిగి గీసిన లక్ష్మణ రేఖ..
దాటితే రావణులు వస్తారు; రావొచ్చనే మాట ఆలకించా!!
ఇవి అన్నీ భరించిన మాలో ప్రజా చైతన్యం ఉప్పొంగుతోంది
మేమందరం బొత్స సత్తిబాబంత స్థితప్రజ్ఞులం, కాదుగా..
చిన్నో-పెద్దో సైజులు కొలవడానికి, ఎప్పుడు బయటికి వెళ్ళాలో ఆయన్నడిగి వెళ్ళడానికి
రాష్ట్రపతి పుత్రరత్నం అభిజిత్ ముఖర్జీ కాదుగా
TV లలో కన్పించాలనే ధర్నాలలో పాల్గొన్నారనడానికి
రాజస్థాన్ MP లం కాలేముగా..
స్కర్టుల్ని బడిపిల్లలకి దూరం చేయమనడానికి
దైవదూత ఆశారాం బాపూలమా!!
.. .. అలో లచ్చన్నా అని ఒగ్గేయమనడానికి
తెలివితక్కువ కుక్కలం కదా..
ఏనుగుల నోట్లో నోరెట్టలేక..
రోడ్డెక్కి లబోదిబోమంటుంటే..
మా మొరుగుడు కి మీ ప్రశంస విరుగుడా!!
అవును సర్!! మీలో ప్రజా చైతన్యానికి నిర్వచనం వెతకలేక
.. మా.. తరం నరాలు ఉప్పొంగుతున్నాయి
RTS Perm Link
Jan
09
2013

అనగా అనగా ఓ కాలం
అప్పట్లో రెండు జంట గ్రహాలు మనుషులు నివసించడానికి
ఒకటి మగోడికి మరొకటి ఆడోళ్ళకీనంట
పొరపాట్న కలిసిపోయాయి.. కాపురాలు మొదలయ్యాయి
అప్పట్నించి వారికి మానవత్వం నేలయ్యింది
కలుపుమొక్కలనేరి జీవితాన్ని పంటపండించుకున్నారు
అప్పుడప్పుడు విడిపోతున్నాయి యుద్ధాలు అవసరమయ్యాయి
ఈలోగా పంటని తెగుళ్ళు ఆశించాయి కాయలూ పూలు రాలుతున్నాయి
కాపాడుకోవడానికి మళ్ళు గట్లూ ఏర్పరచుకున్నారు
సస్యరక్షణకు పాలికాపులు పుట్టుకొచ్చారు..
పురుగు మందులు కనిపెట్టారు
ఉపయోగించడంరాక పంటని పోగొట్టుకుంటున్నారు
పురుగులెగిరిపోతున్నాయి..
పంటా రాలిపోతుంది.
నేల బీడవుతుంది..
పండించడం మానుకోవాలేమో..
RTS Perm Link
Jan
08
2013

బహిర్భూమికి వెళ్ళే ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారు కొందరు
మరుగుదొడ్ల అవసరం 65 ఏళ్ళలో సగందేశానికే తీరలేదింకా.
నిన్నటి అన్నపానీయాలే నేటి మలమూత్రాలన్న మాట
విన్నారెవరో ఈలోపు.. తిన్నది అరగక మిగిలిన దాన్నీ..
వదిలే దారిలేకుండా చేసినదీ వాళ్ళే.
ఏ క్రిములతో పోల్చాలి? వీళ్ళని!!
పల్లె భారతంలో గాల్లో తేలుతుంది వీరి పాపిష్టి కంపు
అపుడెపుడో గ్రామీణాభివృధ్థి మంత్రిత్వ శాఖ లెక్కలకీ..
జనాభా లెక్కలకీ పొంతనలేక.. టాయిలెట్లు తప్పిపోయాయి కోట్ల సంఖ్యల్లో..
ఇంకా లెక్కలేనివెన్నో.. మేసిన నోరూ గబ్బు కడుక్కోలేకపోయింది ఆ డబ్బుతో
అయినా ఉచ్చోసుకోవడానికి డబ్బులిచ్చే నగరాల మాట కాదిది.
చెంబో సీసాయో పట్టుకుని, ఒంటరిగా బయటికి వెళ్లడానికి జంకి..
గుంపులుగా తిరిగే జంతు సమూహం లో మనం..
పులిచూపుల్తో కొందరు.. శోచాలయ నిధుల్ని బొక్కే తోడేళ్ళూ.. నక్కల్లా మరికొందరు.
ఎటుపోతున్నాం మనం!
RTS Perm Link
Jan
07
2013

నాగరిక సమాజానికి ఏడు మెట్ల దూరంలో ఉన్నాం మనం
ప్రజలందరికీ రక్షణ,
రోగమొస్తే.. ఆరోగ్య పరిరక్షణ,
బతికేందుకు తిండి-నీరు సదుపాయం,
తలదాచుకునే ఆసరా,
ప్రభుత్వ- న్యాయ వ్యవస్థ ల సమన్వయం,
మానసికంగా ఎదగడానికీ, నలుగురిలో ఒదగడానికీ విద్య..
ఇంకా విభిన్నతలలో మనగలిగే స్వేచ్చ
ఒక్క సారి తరచి చూసుకుంటే మన డొల్లతనం డబడబలాడుతుంది
అవసరాలనిమిత్తం జనావాసాలలో తిరగడానికి మనిషికో న్యాయం.. ఆడమనిషికి మరీ అన్యాయం
రోగమొస్తే.. రేషన్ కార్డుకీ ప్రాణానికీ లంకె..జబ్బు ఖరీదైందా.. బతుకే గోవిందా..
తిండే కాదు, నీరూ కొనుక్కోవడమే, ప్లోరైడ్ ప్రభావ ప్రాంతాల్లో దశాబ్దాలుగా చేతులెత్తేసిన ప్రభుత్వాలు
తల్లీ కొడుకుల పేరున కట్టిన ఇళ్ళ కిందా పైనా తలకిందులైన అర్హతలు
అక్రమార్జునులకు కొమ్ము కాసే ఎన్నికల భారతం
చదువుకొనే లోకంలో చదువుకునే వారిలెక్కలెక్కడ!!
గడపదాటిన ఆడపిల్ల కడపటి వార్తలనాటికి గూటికో.. ఏ చోటికో..
దీపమై వెలగాల్సిన పిల్లకోసం కొవ్వొత్తులు వెలిగిస్తూ మనం..
ప్రశ్నించే సాలభంజికలు ఎన్నైనా నవ్వుతాయి
ఎటుపోతున్నాం??
RTS Perm Link
Jan
05
2013

दाने-दाने पर खाने वाले का नाम लिखा होता
ఇది పాత పాట
ప్రతీ గింజ మీదా పెత్తెందారు బొమ్మే..
ఇది కొత్త మాట
పండించినోడికి మద్దతు ధరైనా అందదు
ప్రజల మద్దతు కూడపెట్టుకోవడానికి కూటి మీద ప్రచారమా..
అరవలేని ధాన్యం గింజకు అవమానాల పరంపరే ఇది.
వేళ్ళు నోట్లో పెట్టే వేళ సంచులు కళ్ళముందుంటాయా!
సోనా మసూరి లా సోనియా బియ్యం..
ప్రభాత్, పూసా టి 21 లలా కిరణ్ కందిపప్పు,
శ్రీధర్ బాబు పామాయిల్
రోజులు మారాయి సగటు మనిషీ!..
నీ జీవితం ఇక రోజూ వర్తమాన వ్యవహారాల పరీక్షే
ప్రభుత్వోద్యోగాల్లో.. ఈ ప్రశ్నలే స్టాకు..
నిరంతరం మాకిదే టాకు..
మీ రాజకీయ వ్యాపారం భలే టోకు బేరం.
RTS Perm Link
Jan
04
2013


ఇది అనగా అనగా కథ కాదు..
బిడ్డకు జ్వరమొస్తే.. దవాఖానా మందుబిళ్ల తప్పదు
అది నిర్థరించినదో నీ బిడ్డపై పరీక్షో ఎవరికి ఎరుక
మనదేశంలో ఇండోరు కాని ఊరేది..
మన్యంలో విషజ్వరాల్లో.. నిజం ఎంతో
మన విస్మయం లోతూ అంతే..
పరీక్షల్లో పుట్టిన కొత్త జబ్బులెన్నున్నాయో
పోయిన వారికే ఎరుక
స్వైన్ ఫ్లూ, డెంగూలు వెనక ఎన్ని కథలు ఉన్నాయో..
ఇవన్నీ ఇప్పుడు అదిరే అధరాల రొద కాదు
పునాదులున్న ఆధారాలూ, కళ్ళముందు కుదేలవుతున్న వ్యథలే
RTS Perm Link
Jan
04
2013


నీ పేరే వెలుగురేఖని, మాఇంట చీకటి ఉండదని
పిచ్చి నమ్మకాలేం లేవు మాకు
కోతల్రోజులు పోయి వాతల్రోజులొచ్చాయి
కరెంటు ముట్టుకుంటే కాదు..
బిల్లు చూపించి షాకు కొట్టించగలవ్
ఇప్పటికే గ్యాసు బండ దెబ్బకు తల బొప్పికట్టింది
నీ పుణ్యంతో మా జీవితాల్లో చీకట్లు ముసురుకుంటున్నాయి
నీ మాటే కాదు మనసూ స్పష్టంగాలేదు
స్కాముల్లేన్ని వాడవని ఊరటపడాలో..
నీ సాము గారడీలకు నోరెళ్ళబెట్టాలో..
మట్టికరిపిస్తున్నావ్ మమ్మల్ని మలమలా మాడ్చి
ప్రజాదర్బారులో నువు నుంచున్నప్పుడు నీ నీడ మోసేది మేమే
చిమ్మచీకట్లు చెదరగొట్టాల్సిన నువ్వు
మా ఆకలి మంటలతో ఆటలాడకు..
ఒక్క ఆకలికేక చాలు నీ సందెవెలుగు జారడానికి.
RTS Perm Link
Jan
04
2013

అవసరాలు ఆకలిని పెంచేస్తున్నాయా!
సరళీకరణం సంక్లిష్టమై ముంచేస్తుందా!!
ఎటుపోతున్నాం మనం!!
నేరం నేరని చదువేమయ్యింది!
గురుకులాల్తోనే చెరిగిపోయిందా!
దొంగలబడులు చెదిరిపోయాయి
బడిదొంగలు పెరిగిపోయారు
తండ్రి రెక్కల కష్టం వాహనంగా మారేది
నువ్ కళాశాలకు వెళ్ళడానికా
మెళ్ళో గొలుసులు లాగి జైలుకెళ్ళడానికా
వాణిజ్య శాస్త్రం చదివేది
పన్ను ఎగ్గొట్టే కిటుకులకైనప్పుడు..
న్యాయశాస్త్రం.. నేరస్తుల దన్ను కాస్తున్నప్పుడు
ఆర్థిక అవసరాలు కొల్లగొట్టేది నిన్నే కదా!
ఎందుకీ చిల్లరబతుకు..
చిన్న చేపల చెరువుల్లో నీటి కొంగ బతుకేల!
బంగారు భవిత వదిలి నీకు దొంగ బతుకేల?
RTS Perm Link
Jan
03
2013


అరాచకత్వం ప్రజాస్వామ్యం బొమ్మా బొరుసులన్నట్లు
పాలకుల జవాబుదారీతనం కునారిల్లుతోంది.
ఆశామేఘాలు కంటికానక వ్యవసాయం వర్తకం నీరుకారిపోతుంది
గతిలేక శల్య సారధ్యానికి తలవంచే కర్ణులం
మన చావుకు కారణాలు తెలిసినవాటికన్నా ఒకటెక్కువే..
అదే మన అలసత్వం.
ఎన్నాళ్ళైనా ఈ పల్లకీ మోతలే మన తలరాతలు.
ఏదో ఒక రంగాన్ని ముట్టగించిన వారన్నా
మొదలపెట్టరాదూ.. దిద్దుబాటు.
కీలెరిగి వాతపెట్టరాదూ.. రాజకీయ కామందులకు
సూదిమందు వెయ్యరాదూ.. ముదిరిన రోగానికి
కొత్త సంవత్సరం లో తాళమెయ్యరారాదూ..
తప్పుల మేళానికీ ఒకలాగా.
తప్పని రాగానికి వేరొకలాగా…
RTS Perm Link