Archive for November, 2012

Nov 29 2012

తెలుగు వెలుగు డిసెంబరు సంచిక .. విశేషాలు

క్రిస్మస్ శుభాకాంక్షలతో
ప్రపంచ తెలుగు మహాసభల ఔచిత్యం.. ప్రశ్నిస్తూ సాగే సంపాదకీయం
కవిత విద్యా సాంస్కృతికసేవా సంస్థ యువ రచయితల పురస్కారాల ప్రకటన, నెల్లూరు జిల్లా రచయితల సంఘం జాతీయస్థాయి కవితలపోటీ నిర్వహణ, మచిలీపట్నం “సాహితీమిత్రులు” ఆధ్వర్యం లో కవితల పోటీ ల సమాచారంతో పాటు “వినదగునెవ్వరు చెప్పిన” ఉత్తరాల స్పందన.
పేరుతెచ్చె పండగ బారసాల పై డా|| యల్లాప్రగడ మల్లికార్జున రావు
ధనుర్మాసం విశేషాలపై వేదాంతం మధుసూధన శర్మ ల వ్యాసాలు
బత్తుల ప్రసాద్ “మందుగొడ్తిమి కథ
కిట్టయ్య అలక కవిత జివియస్ నాగేశ్వరరావు
కర్లపాలెం హనుమంతరావుగారి ” మనమంతా కిష్కింద వాసులం పేర స్థల, భాషా విశేషాలు
కె నారాయణమూర్తి అందించిన కోలారు తెలుగు జానపద గేయాల కబుర్లు డా|| నారాయణ స్వామి మాటల్లో

డా||. సినారే కవిత: చూపులూ పక్షులూ
అక్కినేని అంతరంగాల్లో తన మాటలు అమ్మ ఎంతో అమ్మ భాషా అంతే! తెలుగువెలుగు బృంద సారధ్యం లో
అక్షర కళారూపాల ప్రదర్శన ఇటీవల దేశ రాజధాని లో నిర్వహించారు . కార్యక్రమానికే సొబగులద్దిన తెలుగు ” అక్షర శిల్పులు” ముచ్చట్లు ఈనాడు ఢిల్లీ రిపోర్టర్ సురేష్ సహకారం తో
హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు తెలుగు భాషా ప్రసంగం ” మన తెలుగు” ౬.౮.౧౯౩౮. న రాజమండ్రి గౌతమీ గ్రంధాలయ ౪౦ వ వార్షికోత్సవ సభలో తిరిగి మనకోసం
డా|| మన్నం గోపీ చంద్ ఆవేదన: భవిష్యత్తుపై ఏది భరోసా?
కె. కృష్ణ మోహన్ కథ ” అహంతు రావణో నామః రామాయణ కాలం లోకి కాలయంత్ర ప్రయాణం చేయించడానికి.. గొప్ప కథన శైలిలో..

దాశరథి రంగాచార్య, వెల్చెరు నారాయణ రావుల అలోచనలు ” తెలుగు మాట్లాడడమే ఆత్మగౌరవం”; “గొప్పకోసం ’పరాయి’ తిప్పలొద్దు”
గోగుమళ్ళ కవిత బైబిల్ కబుర్లు భాషపరంగా అందించిన వాక్యము దేవుడై ఉండెను.. పక్కనే .. పచ్చా పెంచలయ్య కవితకీ.. బొమ్మ ఈ కవిత గీసినదే..
అమెరికా తెలుగువాడి గుండె చప్పుడు తానా విశేషాలు డా|| జంపాల చౌదరి మాటల్లో
తేటతెలుగుకు నార్లు పోసిన నార్ల: పత్రికా రచనలో మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి జీవన ప్రస్థాన వివరాలు అందించినది డా|| ఎర్నేని వెంకటేశ్వర రావు
రావికొండల రావు రాతల్లో మనం వేసిన “ఇంగ్లీషు తల్లికి మల్లెపూదండ.. ”

ఇంకా కొత్తగూడెం బాలోత్సవ్ వినోదాల జల్లు.. కార్యక్రమం లో పాల్గొన్న ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్, ఎమ్మెన్నార్, కథా సాహితి వాసిరెడ్డి నవీన్ సందేశాలు, డా: అందెశ్రీ పాట, అందులో పాల్గొన్న బాలల కవితా సొబగులు
చుక్కా రామయ్య గారి ” తెలుగూ నలుదిక్కులలో వెలుగొందవే!
బలివాడ కాంతారావు ముంగీస కథ

రాటాల వెంకట సుబ్బయ్య క అంటే కంప్యూటర్.. సాంకేతిక లిపి వివరాలు
చిమ్మపూడి శ్రీరామమూర్తి తెలుగును కాపాడరా! పాట

బుల్లి కవితల కొన్ని ఆంగ్లరూపాల పరిచయం బుల్లికవితల్లో పడమటి గాలి ఆయుర్వేద వైద్యులు జివి పూర్ణ చందు మాటల్లో
రాజడిగితేమందును ఒక జానపదగీతం.. కవితమ్మ బొమ్మతో
పాత పత్రికల కంప్యుటీకరణ వెబ్సైట్ వివరాలతో: అదిగో.. అదిగో.. పాత బంగారం. ప్రెస్ అకాడమీ విలువైన సేవల సైటు
చెన్నూరి సుదర్శన్ గారి అడకత్తెరలో పోకచెక్క కథ
మాతృభాషా వైభవోత్సవాలకు శ్రీకారం చుట్టిన రమాదేవి పబ్లిక్ స్కూల్ కార్యక్రమ విశేషాలు “తెలుగు వాడుక.. తీపివేడుక.
ఎజీ ఆఫీసు తెలుగు సాహితీ సమితి రంజని పరిచయం.. అంకెలతో కుస్తీ.. సాహిత్యంతో దోస్తీ ఈనాడు ఆదివారం కలం: కరణం జనార్థన్ కథనం
నరాల రామిరెడ్డి అవధాని కవిత: మందార మకరంద మథుర భాష
శంకరంబాడి సుందరాచరి పై వ్యాసం నిత్యమై.. నిఖిలమై..అందించిన వారు డా|| మన్నవ భాస్కర నాయుడు
సాయి బ్రహ్మానందం గొర్తి కథ: బతుకాట
డా” సామల రమేష్ బాబు వ్యాసం: ఎందుకోసం? తెలుగు సభలు ఎవరికోసం??

దశాబ్దాల తెలుగు పాలకుల భాషా నిర్లక్ష్యం ఈనాడు జనరల్ బ్యూరో కథనం: చిత్తశుధ్ధిలేని తెలుగు పూజ

ఇంకా సాంకేతిక సదస్సులో తెలుగు జాలం.. విశాఖ గీతం కళాశాల లో జరిగిన రెండవ అంతర్జాతీయ తెలుగు సదస్సు వివరాలు బి ఎస్ రామకృష్ణ ఈనాడు మాటల్లో
అలపర్తి వెంకట సుబ్బారావి అభినవ సుగాత్రీ శాలీనులు, జ్ ఎల్ నరసింహం నానీలు, గన్నోజు శ్రీనివాసాచారి పద్యాలు, పదపంచాయితీ..
తులాభారం శీర్షికన పుస్తక సమీక్ష: సలీం.. మరణ కాంక్ష, మా శర్మ.. కొప్పరపు కవుల ప్రతిభ, పివి సునీల్ కుమార్ .. సయ్యాట, శిఖామణి .. గిజిగాడు, నటరాజారావ్ మట్టివాసన
కొండ అద్దమందు లో.. ఇంకొన్ని… క్రిస్మస్ శుభాకాంక్షల మేఘసందేశం..

అమ్మ.. నా పనై పొయింది.. ఇంక.. చదవడం.. మీ పని.. 🙂

RTS Perm Link

No responses yet

Nov 25 2012

పేపరుతో నాన్న

నాన్న అర్థమంతా.. నా చదువుల దీపావళి వెలుగులకే
తన అవగాహనైనా, సంపాదనైనా కాలుతున్న మతాబే
నాకన్నానా భవితను నిర్వచించేది తన కన్నకష్టార్జితమే;
జ్ఞానమైనా, ధనమైనా అర్థానికున్న సమస్త నానార్థాలకూ పర్యాయపదం నాన్నే

ఉద్యోగప్రకటనల కాలం కళ్ళ కింద కరిగేది తన రెక్కల లోనే
నాలుగు రుపాయల కాగితాల దొంతరైన పేపరు
ఉద్యోగ సమాచారాన్ని ప్రత్యక్షప్రసారం చేసే పావురాయిలా
ఆ నాలుగురాళ్ల మనిషి మీదే వాల్తుంది తెల్లారగానే

రెక్కల టపటపల్లా పేపరు రెపరెపల్లో ఎగిరే కళ్ళు తనవే
దాణా తిన్నట్టుగా కాక పిల్లకు పెట్టేటట్టు పుక్కిట పట్టే ప్రయత్నం
కనబడ్డ ఆశ ల మెరుపులను తెల్లారే కురిపించాలని
ఉరిమి ఉరిమీ నను తడిపేస్తాడు తడిమేస్తాడు దబాటంగా

ఆవిరైన చమట చుక్కలు ఘనీభవించిన మేఘమై నాన్న
గాలాడని వేళ లలో వర్ష పాత సూచన అమ్మ భరోసా నా తరుపున
జల్లులో జడివానో నా ప్రయత్నం..
గాలివాటు ప్రయాణం లో తీరం దాటుతూ నేను

వానకారు కోయిలై ఫలితాలకోసం రాశి-ఫలాల వేటలో.. మళ్లీ పేపరు తో నాన్న
నా కాలం కలిసొచ్చేదాకా కదలని చిత్తరువులా పేపరుతో తన మానాన నాన్నే..

RTS Perm Link

No responses yet

Nov 22 2012

కవిని చూసాక..

కవిని చూద్దామని
అతని ఊరు వెళ్ళాను

నా ఆలోచనల పునాదుల్ని కుదిపేసినవాడు
ఆవేశపు అలజడిని కన్నీటితో కరిగించినవాడు
ప్రశాంతమైన నిద్రలేని రాత్రుల్ని వరంగా అందించినవాడు
అలంకారాలు లేని అక్షరాలకు వ్యాపకశక్తి ప్రసాదించినవాడు

అతడెలా ఉన్నా..
ఆ కళ్ళల్లో వెలుగును చూద్దామని వెళ్ళాను
ఆనందం అనుభూతి ప్రదానమని
సూదిమొనకు సున్నితత్వం అద్దేవాడ్ని

ప్రేమను పదాలతో పంచేవాడ్ని
దయను అర్థంతో చేర్చేవాడ్ని
కానరాని వరాలను గుప్పిట అందించే
రూపం చూడ్డానికి ..ఇది ఈనాటి వలపా!!

కళ్ళను చూపుతో తడుముదామని
చేతిని చేతితో కలుపుదామని
ఇతనూ మనలాంటివాడే కదా అనుకున్నప్పుడు
నామీద నాకు గౌరవం పెరిగింది

కవిని కనుగొనాలని దిగంతాలలోకి దూకగలనా
వెలుగుని వెతుక్కుంటూ చీకటిబాటపట్టగలనా
అగ్గిన్ని జల్లే ఆకాశాన్ని చుట్టుకున్న వాడ్ని నేను
చల్లబరచే సమీరాన్ని చేరాలని కోరుకునేవాడ్ని

కలల భస్మంతో బాటలు పరిచేవాడ్ని
ఎప్పటికీ చేరని గమ్యపు దారని తెలిసినా
భుజం తట్టే చేతికోసం అలుపెరుగక ప్రవహిస్తున్నవాడ్ని

కవి సముద్రమో కాదో.. జట్టు కట్టిన సంతోషంలో తేలి
సాటి నదిలా కలసి..పారి.. జీవితం తో సంగమిద్దామని
అన్నిరుచుల మట్టినీ ముద్దాడుతూ కథ ముగిద్దామని.

(బివివి ప్రసాద్ గారి ’కవిని చూద్దామని’.. చదివాక.. కలసిన క్షణాలను గుర్తుచేసినందుకు..)

RTS Perm Link

2 responses so far

Nov 21 2012

ఉన్నదొక్కటే ఈ క్షణం


ముందేమున్నదో గతంఎలా గడిచిందో
మనకేం ఎరుక..!
చేతుల్లో ఉన్నదొక్కటే ఈ క్షణం

దారుల్లో తెలియని కీనీడలు పొంచిఉన్నాయి
ఊహకందని చేతల్లో
మన మంతా బందీలం

ఈ క్షణమే వెలుగులు మనలో ముందూవెనుకా చీకటే
ఈ క్షణాన్ని పొదవిపట్టుకో
ఇదొక్కటే నీ సొంతం

ఆలోచించు ఓ బతుకు కోరే నేస్తమా
నీ తలపుల్ని పండించుకో

ఈ క్షణపు మిలమిలల్లో
ఈ లోకం కదులుతోంది

ఈ క్షణపు వెచ్చదనం లో
గుండె చప్పుడు దాగుంది

ఈ క్షణం తోడుంటే
ఈ లోకం నీదేగా

తరచిచూడు నేస్తమా
ఈ ఈ క్షణం కోసమే
యుగాల నిరీక్షణ

ఆలోచించు ఓ బతుకు కోరే నేస్తమా
నీ తలపుల్ని పండించుకో

ఈ క్షణపు నీడలోనే మన జీవితాలు గడవాలి
ఈ క్షణం సాగితేనే ప్రతి కథా కదులుతుంది

నిన్నెవరు చూసారు.. రేపెవరు చూస్తారు
ఏదైనా పొందాలంటే.. ఈ క్షణం నీదవ్వాలి

ఆలోచించు ఓ బతుకు కోరే నేస్తమా
నీ తలపుల్ని పండించుకో
చేతుల్లో ఉన్నదొక్కటే ఈ క్షణం

Aage Bhi Jaane Na Tu WAQT సినిమాలోని పాట విన్నాక..
మీతో పంచుకోవాలనిపించి.

RTS Perm Link

3 responses so far

Nov 20 2012

నిను చేరాలనే…

నా తలపుల్లో నిలిచున్నది నీవైనప్పుడు
ఎడబాటుకు అర్థమేముంది
ఎదచప్పుడే ప్రతిధ్వనించెనా
అడుగు అడుగులో మెదలే సవ్వడై..

ఒంటరితనమే నా చిరునామా
పగలైనా రేయైనా నీ ఊహే
నన్ను నాకు వివరించేది
నను నిలువరించి వరించేది..

యుగాలవిరామంలో
క్షణాలు గడుస్తున్నాయి
అంతరంగాల్లో కూనిరాగాలే
జ్ఞాపకాల మనోభావాలు..

ఆకాశం చలికాగుతుంది
నా ఊపిరిలో వెచ్చదనానికి
మంచు కరుగుతుంది నీదిక్కున
నిను జీవితంలా శ్వాసించనీ..

ఈనేలపై నా అడుగుల తడబాటు
నీ ఊహల్లో నేను నేనుగా ఉండాలనే
ఆవిర్లు విరజిమ్మే గుండె చప్పుడు
ఆగేలోగా నిను చేరాలనే.

RTS Perm Link

One response so far

Nov 17 2012

ఛార్మినార్.. చెంపన..

ఈ మబ్బులు ఏ ఉత్పాతంలా కనిపిస్తున్నాయ్ చార్మినార్!
ఏ కారో మంటల్లో కాలి ఈ కసి మబ్బుల్ని కమ్మింది
కత్తులు తిట్టుకుంటున్నయ్ ఏమిటీ మరకలని
రాళ్ళగాజుల మండీల్లో పగిలేవి ఏ చేతి గాజులు?

ఎలా అంటుకుందో చెమ్కీ చుక్కై నీ చెంపన మైసమ్మ
ఆడుగుదామంటే ఇప్పుడు లేదు కుంకుమిచ్చే ఆ బామ్మ
ఈ ఊర్లో గొడవలకీ అభిమతాలకీ ఏనాడూ లంకె లేదు
గుళ్ళకీ-గోపురాలకీ ఈ లెక్కల పాఠాలు ఎక్కలేదు

ఆ పక్కనే వెలిసినట్టు రంగు పూద్దామనే ఆదుర్దా ఒకరిది
రంగు వెలిసినట్టు చూద్దామని ఎద్దేవా వేరొకరిది
రాలుపూలనగరం లో నీ బస్తీ గరం గరం
నరంతెగే నాటకాల్లో రాలేది కసుగాయలే

జెండాలో రెండు రంగులూ తెల్లదనాన్ని కుమ్ముతూ
దేవేరికి గుమ్మటాల ప్రాపు… మతంమత్తుకు మధురసాలకైపు…
ఎవరు అద్దినా అది కృతకం అమానుషుల వికృతం
తలతిక్కనాయాళ్ళకు కేవలం నువ్వో ప్లేగు బంధానివి

భాయీ భాయీ బతుకుల్లో నలిగే అలాయి-బలాయి కానుకవి

RTS Perm Link

2 responses so far

Nov 16 2012

మాటొకటి చెప్పిపోనీ

గాయాలు నాకు గేయాలై వినిపిస్తున్నప్పుడు
గేయాలు గాయాలై సలిపేస్తున్నప్పుడు
నా సాహిత్యాన్ని ఆస్వాదించనంటావా!
విషాద సంగీతమైన నిన్ను ఆలకించమంటావా!!

గాయం నేనైనప్పుడు ఎవరు గాయపడ్డట్టూ!!
కోల్పోయేది స్నేహ సౌహార్దమో కుటుంబ క్షేమమో
నా ముగింపు ప్రజావినోదమో స్వీయ విషాదమో
నాకళ్ళకు నీ కలల భయమెందుకో

ఎందుకిలా నమ్మకాల తరాజు
చీకటితో పాటు మొగ్గుతుంది!
ఎందుకో గడిచిన రోజుల జీవితం
వొంటరి అలోచనలను కుదుపుతుంది

వాలిన పొద్దు మరునాటికి వెన్ను పొడుస్తుంది
ఏ విషాదాలు మెదులుతున్నాయి తలపుల్లో
నాకెందుకు నేనంటే భయం
పలుకని నిజాలు నను బేరీజు వేస్తున్నాయా!

నేనుండనని రేపటి వెలుగులు ఈరోజే విప్పిపోనీ
నువ్వొప్పుకున్న నెప్పేగా మన అనుబంధం
ఏళ్ళు గడచినా మళ్ళీ నీతో మనసువిప్పి చెప్పుకోనీ

నిను ఎప్పటికీ ప్రేమించిన మాటొకటి ఈరోజూ చెప్పిపోనీ

RTS Perm Link

2 responses so far

Nov 12 2012

ఈ దీపావళి వేళ..

అమావాస్య రాతిరి
ఉపద్రవం ఘనీభవించిన చీకటి
ఎప్పటిలాగే

బాంబుల ఆర్భాటాలతో..
జువ్వల చెలగాటాలతో
ఎంతసేపని ఆపగలను పారి ఆరే వెలుగులను

డబ్బుల్ని కాల్చి వెలిగించిన చిచ్చుల్లో
పసి నవ్వులే వెలుగుతాయి
గతించిన నా బాల్యం లీలలు
నిముషాల్లోనే మిగులుతాయి.

ఎంత తమాయించుకున్నా
నాలో ఆరని శివకాశీ మంటలు
కాలిన బతుకుల నీలినీడల్లో
మందుగుండు ఆర్పిన దీపాలు

ఇవేంపట్టని నేను
చిన్నారి కంటి వెలుగుల కోసం
మనసూ చేయీ కాల్చుకుంటు..

ఏదైనా కాలితేనే పండగా!
జీవితాన్ని రాలిస్తేనే బతుకు పంట పండేనా?
దీపం వెలిగించి ఉంచితే చాలదా!!

RTS Perm Link

2 responses so far

Nov 09 2012

తుహినం తుడు

పేరు తలిచి నిను పిలిచి వినేలోగా
ఈ శరద్రార్తి చలై నను కరుస్తోంది

ఏదో మాట నను తడుముతోంది
నీ తలపుల్లోకి తరుముతోంది

తపన తలపులను తాకలేదా
గుండెలను కరిగించి పోసిన గంట
కాలమై కాలుస్తుందో రవమై మోగుతుందో

ఎంతదూరాన ఉన్నా నీ మేనిగంధాల పలకరింతలు
నను దాటివెళ్ళిన జాడలను
మరుగుపరచలేక నిలనీయకున్నాయి

నీ ఊహే లోపలా బయటా మంచుని కరిగిస్తుందే
నిట్టూర్పుల్లో మన ప్రేమ వెచ్చదనం

మంచుబిందువలను ఆవిరి చేసినా
గతించడాన్ని మాపలేని కాలాన్నడుగు మన సంగమాన్ని

నిరంతరతను నింపుకున్నమన స్నేహాన్ని అడుగు
నిన్ను నన్నులను దాటిన మన భావననడుగు
వేర్లు వేరైనా ఒకటైన మన జీవితాల్నడుగు

మనం లేని నాడు ఒకరికొకరిని
చూపించడం నేర్పమను కళ్ళకి

మన అందాలు నింపుకున్న లోకం లో
అనవరతం ప్రేమై శ్వాసించనీ హృదయాన్ని

ప్రేమలేని మనసుల్నీ ప్రేమించనీ
చెవులకు నిశ్సబ్ద నిలయాల్లో
పారవశ్యపు పదనిసనలను వినిపించనీ
సాయాన్ని స్పృశించనీ చేతులను

ఆర్తిగా ప్రార్థనలో
పెదవి పలుకనప్పుడూ.. నా గళాన్ని విను
కన్నీళ్ళను నీ పెదవులతో చెరిపెయ్యరాదూ..
నా ప్రమేయం లేకుండా రాలుతున్నాయి పూలై
పొదవిపట్టుకో నన్ను నీకు దూరంగా ఉన్నప్పుడూ.

RTS Perm Link

One response so far

Nov 07 2012

అలాగే.. అలాగే..

నిద్రలేచాకా నేలను కాలు తాకితే ..
పచ్చనోటు తొక్కినట్టే.. అద్దెడబ్బులు.. పెరిగాయి కదా!
అడుగులేసి అద్దం చూసేలోగా ప్రతిబింబం హెచ్చరిక
పేస్టు పొదుపుగా వాడమని

స్నానం గోరువెచ్చని నీళ్ళతోనేసరి
సబ్బు కన్నా చెయ్యే ఎక్కువ అరుగుతుందీలోపల
తువ్వాలన్నా సరిగా ఆరేసుకుందాం. ఎన్ననికొంటాం!!
లోగుడ్దలూ మేజోళ్ళూ పోనీలే .. మరుగున చిరుగులు కనిపించవు
ఏమోయ్! పెళ్ళికి కొన్న రింకిల్ ఫ్రీ పేంట్లెక్కడ.. ఈ బటనుకుట్టు.

బస్సెక్కుదామా.. బండితీద్దామా!!
ఆఫీసుకేగా ఫ్రెండు ని పిలుద్దాం
కారేజీ పెట్టరాదూ.. కాంటీన్ రేట్లు పెరిగాయీ!!
అరె! నా పెన్నేదిరా.. నీదివ్వు ఈరోజుకి

సాయంత్రం వచ్చేటప్పుడు నీకేంకావాలి! పర్లేదులే తెస్తా.
నాన్నా! బాగాచదువుకో.. లేకపోతే మీ నాన్నలానే..
కాఫీ ఎందుకూ.. ఆఫీసులో తాగేస్తాగా.

ఏమోయ్! పండక్కేంకొనుక్కుంటావ్! నాన్నా!! నీకు..
ఏంకావాలి చెప్పండి.. ఎలాగైనా కొనిస్తా సరేనా
మా ఆఫీసతను పెళ్ళుంది ఈనెల.. మంచి చీరకొనుక్కో.. పిల్లాడిక్కూడా.. ఇంద క్రెడిట్ కార్డు.

హలో.. హలో..టెలీఫోన్ బిల్లేగా .. ఇప్పుడు కట్టేస్తా..
ఆ గాస్సిలిండర్ డబ్బులిలా పట్రా.. సాయంతం డ్రాచేసిస్తా.
నీకో గుడ్ న్యూస్ .. ఈనెల డి.ఎ. పెరిగింది మూడొందలు

రాత్రి లేటవుతుంది.. మీరు భోంచేసేయ్యండి.. బాసుతో పనుంది సాయంత్రం.
నీకు మల్లెపూలూ.. వాడికి హనీకేకు.. అలాగే.. అలాగే..

RTS Perm Link

2 responses so far

Nov 06 2012

నిను చేరాలంతే..


ఎంత కష్టమో నిను చేరాలంటే..
అనుకున్నా వన్నెలాడీ! నిను చేరాలంతే..
నే వచ్చేలోగా నీ తకిట తకదిమి.. ఆగదని..
నిలకడ వదిలిన నీ మునివేళ్ళను మునిమాపు వేళ్ళల్లో

సందెపొద్దు సూరీడు ముద్దాడివెళ్ళేలోగా
అనుకున్నా కలవిడిచి .ఇలనైనా నిను చేరాలంతే..

శీతల పవనాలు ప్రేరేపించే నాదాలై
పక్షుల కువకువలు స్వరజతులై ఉత్తేజితం చేసే వేళ
నిశీధి వీధుల విషాద ఛాయల్లో నువ్వు విశ్రమించవని
అంబరవీధుల పహారా మాని నీకోసం నిలవనా!

నీర మేఘాల వీవెనలతో చెమిర్చిన మోహనాన్నే తడమనా!!
మంచుబిందువే నీ పెదవిపై వాలేలోగా నిను చేరాలంతే..

నీ నర్తనం తో తడిసి ముద్దైన నేల నాకు కోనేరే..
మువ్వరాల్చిన మెరుపు రజను నై తానాలాడనా
వలపు వాకిట నీ దరిచేరినా అది పూల పన్నీరే
దూరాన చలించే నీపై తపనే తమకమై తరించనా

నిను వారించాలని.. వరించాలని
గుండెలదిరేలా వచ్చా వడివడి గా దడదడగా

వెన్నెలకిరణాల దాడి లో నే ఓడేలోగా
వన్నెల విరిమోము ఆడి-ఆడి వాడేలోగా
నా జీవన ఉచ్వాస నను వీడే లోగా..
ఏనాటికైనా.. ఎలాగో.. నిను చేరాలంతే..

నా తీరం లా నువ్వు నర్తిస్తుంటే..
మెల్లగ నిను ముద్దాడి నే సేదతీరాలంతే.

RTS Perm Link

3 responses so far

Nov 05 2012

నా ఏడుపేదో నేనేడుస్తా..


నా ఏడుపేదో నేనేడుస్తా.. ఎలాగోలా బతుకీడుస్తా..
పలుకరించే వారు కరువయ్యారనో..
ప్రేమ చిలకరించేవారు దూరమయ్యారనో..
కనికరించేవాడు కానరాలేదనో నా ఏడుపు నాది..

ఈ రోజు మాఆవిడ నన్ను కొట్టుండొచ్చు
మాడిన దోశే నా మొహాన కొట్టుండొచ్చు
నా బాసు నన్ను తిట్టుండొచ్చు
జాక్‍పాట్ నా పక్కోడు పట్టుండొచ్చు

ఐనా ఇన్నిసార్లు నా ముందుకొచ్చావ్.
నా ఆలోచనలన్నీ పేపర్‍లా నమిలేయడమే తప్ప
పిచ్చోడా!.. ఇది బాగుందీ.. అది బాగోలేదూ..
ఏనాడైనా అన్నావా !! నాతో రెండు నిముషాలు మించి ఉన్నావా!!

ఏడుపంటే.. ఎంతలోకువ.. అది ఫ్రీగా దొరికిన పాలకోవా!!
నీ రుమాలు తీసి తుడువ్ చూద్దాం ..
తెర దుమ్మొదులుతుందేమో గానీ
నా రంగేమైనా మారుతుందా!! నా బాధ ఏమైనా తీరుతుందా!!

మరెందుకో ఆగి మరీ చూస్తావ్ తమాషా
నువ్వుండి చూపించు ఖుషీ గా హమేశా
ఎంతరాసినా నా రాత ఇంతేనా నీ..
బదులు రాకపోతే నేనైనా ఎంతెదురు చూస్తాను నేస్తమా!!

నాకేమైనా సాయం చేస్తావా
ఎదురొచ్చి నా పాత పోస్టులు తిరగేస్తావా
ఓ! నీకంత బద్దకమైతే వీలైనప్పుడే అరో-కొరో రాస్తా.
పనుల్లోపడి నా ఏడుపేదో నే ఏడుస్తా.

RTS Perm Link

9 responses so far

Nov 02 2012

కవిత్వం నా కళ్ళజోడు

అదిలేకపోతే అంతా మసక మసక
నింగి-నీరు నీలాలు కలసే చోటున సౌందర్యం బదులు
నెత్తుటిచుక్కలచారలా..బీభత్సం
నా ముందున్న మనిషి నను వెంటాడే నీడై
అభద్రతా భావనలోకి నెట్టుతాడు

అలికిన అక్షరాల్లా రెటినా నంటినట్టు
నాకంటికి నలకలై నకలై
ఎంత నలిపినా అడ్డం గానే కనిపిస్తాడు
ఎదుటి వారు సాటివారు-తోటివారు లా కాక
బోటిముద్దల్లా అగుపిస్తారు

ఒక నవ్వే నవ్వితే తిరిగి అదే అందేదేమో..
నొసలు ముడుచుకుని పెదాలు సాగితే
ఈ వ్యక్తీకరణ సభామర్యాదకు ఆమడని
నా భావంతో ఇమడక
అంతదూరమూ జారిపోతారు..

వారు మరుగయ్యాకా.. నా ముందు
ఓ జారుడు పదార్థమున్నట్టూ
అది వారిని వెనక్కి తేలేని
బర్ముడా త్రికోణం లో కూరేసినట్టూ అనుకుని
అడుగు కదపకుండా
ఆ ప్రశ్నార్థకం నవ్వుతో నిలబడి ఉంటాను

ఎవరైనా ఏదైనా చూపిస్తే అది కళ్ళ డాక్టరు
పరీక్షకోసం గలిబిలి చేసిన అక్షరాలేమోనని
ప్రహేళిక ను నింపే పిల్లాడిలా లోగుట్టును
రట్టు చేద్దామని విఫలయత్నం చేస్తాను

ఎట్టా చూసినా నా కంటికి కలకే
పుసుగు పట్టిన కళ్ళతో చూసే వాడికి
లోకం అంతా కంటకింపే
మారిన మార్పుని ఆకళించుకోలేని మనిషిని కదా

అన్నీ తెలుసనుకుని ఏమీతెలియకుండా ఉండక
అప్పుడప్పుడు కవిత్వం కళ్ళజోడుతో
లోకాన్ని చూస్తాను..

ఇప్పుడంతా.. నాకు తెల్లకాగితం..
కింద మాత్రం నా సంతకం.

RTS Perm Link

6 responses so far

RTSMirror Powered by JalleDa