Archive for October, 2012

Oct 31 2012

అందమా!! నువ్వెవ్వరు?

అందం తనమీద రాయమందో కవిత
అంగరాగాలు లేని అమ్మాయి కోసం
ఆరోగ్యమైన జవరాలికోసం, చెలువ పిల్లకోసం
ఎక్కడని వెతకను ఏకొలతన కొలవను

అద్దాన్ని అడిగా తానే అందమంది
అద్దమే అందమైనప్పుడు అన్నీ అంతేగా
ఉండాలేమో మరి అద్దంలాంటి మనసు
మనల్ని మనలా చూసుకునే సొగసు

అద్దాలమేడలో ఉంటే అందమైపోతుందా
అద్దం అందమైతే రాయికెందుకు లోకువ
రాలిపోతే పాలిపోతే పగిలేనె భళ్ళున
ఆడపిల్ల అద్దమూ వద్దు నాకీ పోలిక

రెండుకూడా పెళసరే ఎంచుకుని వేసుకోవాలి పోగిక.
ఏది మంచో లెక్కలేవి ఎందుకొచ్చిన చిక్కులివి
ఊహల్లోని బొమ్మకు పోయలేనా ప్రాణము

పుట్టినప్పుడు పురుడు పోసిన మిస్సమ్మలా
బళ్ళోకెళ్లే బుజ్జోడికి టీచర్ లా
కాలేజీ కుర్రోడికి ముందుబెంచీ అమ్మాయిలా
నాకెప్పుడు కనిపిస్తావో అందమా..

స్నానమయ్యాకా అమ్మదిద్దే నుదుటి బొట్టులా
పల్లెగట్లమ్మట నీడ పంచే చెట్టులా
కొబ్బరిముక్క పగలగొట్టి పెట్టే గుడిమెట్టులా
మారుతున్నకాలం లో మళ్లీ నిను చూస్తానో లేదో అందమా!

అందమంటే నే మిస్సైన బంధమా
కలల్లో ననుతాకే భావనా గంధమా
అక్షరాల పలుకరింపులతో
ప్రపంచాన్ని పరిచయం చేసే గ్రంధమా!!
అసలు నువ్వెవ్వరు అందమా!!

నను కన్న ఆనందమా
నే కనుగొన్న స్నేహమా
నాకింకా పుట్టని పసి బంధమా
ఎన్నటికీ అంతుపట్టని అపురూపమా
అసలు నువ్వెవ్వరు అందమా!!

RTS Perm Link

One response so far

Oct 31 2012

తెలుగువెలుగు మూడో సంచిక వివరాలు-విశేషాలు

బాలల దినోత్సవ శుభాకాంక్షలతో..

దీపావళి తెలుగిళ్ళను వెలుగిళ్ళ గా మార్చాలని ఆకాంక్షిస్తూ రామోజీ ఎడిటోరియల్: ఇంటింటా తెలుగు దీపం
ఇందులో నాకు గుచ్చుకున్న మాట” తెలుగులో మాట్లాడుతుంటే అమ్మ, నాన్న, అక్క, అన్న, అమ్మమ్మ, తాతయ్య, ఇరుగుపొరుగు, మనసమాజం, సంస్కృతి గుర్తుంటాయి. లేకపోతే “మమ్మీ’లే మిగులుతాయి.
కథ: కొక్కొరో…క్కో కార్తీక్‍రాం అదిలాబాద్ యాసలో బాగ రాసిండు.
సిహెచ్ వెంకటేశ్వర్లు వేమన పద్య విశదీకరణ కొత్త శీర్షిక: నాటి మేటి తెలుగు పద్యం,ఏనాటికైనా లోకరీతి ఇదేకదా..అనేటట్టు.
పుట్టినరోజు శుభాకాంక్షల మేఘసందేశం అచ్చ తెలుగు సందేశాల వేదిక గా.. ఆకాంక్షల పూదోట గా ఈ పుట
ఇదే పేజీలో ఎత్తుకోండి హత్తుకుపోతారు.. అని వేసిన కవిత సందర్బోచితంగా ఉంది.
తెలుగు కేసరి దాసరి పేర ఆయన సినీ నేపధ్యం లో తెలుగు జీవితపు సంభాషణలు
భావ దీపావళి పుట్టుపూర్వోత్తరాలనుంచి సాహిత్యంలో భాగమెలా అయ్యిందనేది చెప్పేప్రయత్నం అనుకుంటా..శ్రీధర్ గారి బొమ్మ సత్యాకృష్ణుల గరుడవిహారం అదిరింది.. అందం గా అమరింది.
కథ: అమ్మ రాసింది సన్నిహిత్.. ఏం బొమ్మేశావ్ కవితమ్మా! భలే.
చిన్న పిల్లలు నడిపే కొన్ని పత్రికల వివరాలతో “చిట్టిచేతులు-మంచిరాతలు”
తెలుగు పై గొల్లపూడి మారుతీరావు మాట ” తల్లిదండ్రులూ.. తవసుప్రభాతం!
స్పూర్తి నందించే అపూర్వ విజయ గాధగా ” యూధులు భాషా యోధులు శైలేష్ నిమ్మగడ్డ అందించిన ఇజ్రాయిల్ విశేషాలు .. మనరాష్రంలో ఉన్న యూదు కుటుంబాల వివరాలూ.. జీవనం గుంటూరు ఈనాడు రిపోర్టర్ రమేష్ మాటల్లో
sp బాల సుబ్రహ్మణ్యం భాషాప్రేమ ” అమ్మపలుకు చల్లన”.
మన తెలుగు వాడు పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ నే దేశం యావత్తూ జాతీయ ప్రతిజ్ఞ గా శిరసాధరిస్తుందని, స్మరిస్తుందని ఇప్పటి వరకూ తెలియక పోవడం .. ఓ గర్వకారణపు తోరణం కావాలని కట్టుకోనట్తేకదా! ప్రతిజ్ఞ అందించిన ప్రజ్ఞ చదివే బాధ్యత మనందరిదీ.. అందించింది వేణుప్రసాద్ ఈనాడు, విశాఖ
పద్యాలను వేల మంది స్కూలు పిల్లలతో వల్లెవేయిస్తున్న తెన్నేరు కు చెందిన దేవినేని జయశ్రీ మధుసూదనరావు దంపతుల మాటల్లో పద్య పఠన ప్రభావం వ్యక్తిత్వ నిర్మాణం లో అన్న కోణం ఎందరికో కనువిప్పు.
సాహితీవనం లో బాల ముత్యాలు పేర ముత్యాలసరాలు రాస్తున్న పిల్లలు నిజంగా గురజాడ అడుగుజాడలు.
కథ దేవుని బిడ్లు సడ్లపల్లె చిదంబర రెడ్డి మడకశిర యాస గోస.
మనకు స్వరం సుస్వరం పేర మన భాషోద్యన సమాఖ్య తొలి అధ్యక్షుడు సి. ధర్మారావు సూచనలు.
డా. సి. మృణాళిని గారు నీ యెంకమ్మా.. ఇదేం భాష! ద్వారా మనం మరుస్తున్న భాషా సంస్కారం గుర్తుచేసే ప్రయత్నం
కాలువ మల్లయ్య తెలుగు వనం తెలంగాణం లో ఈ ప్రాంత వాసుల తెలుగు వైభవాన్ని చవిచూపించారు.
అక్షరాలూ అప్సరసలే అంటూ షేక్ బడే సాహెబ్ తెలుగు లిపి లో మార్పులు చేర్పులూ(!) సూచిస్తున్నారు.
ఇక పుస్తకం మొత్తం లో నేను మైమరిపించే పేజీ:57 కొప్పర్తి కవిత్వం : ప్రాచీన స్మృతుల్లోంచి

జోలెపాలం మంగమ్మ గారు బ్రౌన్ దొర గురించి తెలుగుకు వెలుగు తెచ్చిన ఆంగ్లేయుడు
శరత్బాబు కరుణశ్రీ అత్మీయ సాహిత్య పరిచయం: టీపాయికి పువ్వందం-పాపాయికి నవ్వందం
ఆర్టిస్ట్ జావెద్ యానిమేషన్ కబుర్లు కదిలేబొమ్మా.. కబుర్లుచెప్పమ్మా…!
పాటల రసరాజు బాధ: రక్కెసపొదల్లో రసభాష
విజయరాణి కథ : స్పందన
పద్మశ్రీ శోభానాయుడు, పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్, కాళీపట్నం రామారావు భాషాంతరంగాలు
ఆచార్య రవ్వా శ్రీహరి వాడుకలో ఒప్పులూ, వ్యాకరణం లో తప్పులూ
ఎస్.ఆర్ భల్లం ఈ గాలీ.. ఈ నేల..!
డా. పులిచెర్ల సాంబశివరావు కథ కూర్చున్న కొమ్మ.

విశ్రాంత ఉపాధ్యాయులు ఎన్నవెళ్ళి రాజమౌళి వుద్యోగ విరమణ తరువాత స్కూళ్ళల్లో కథలు పాటలు, పద్యాలు ద్వారా బాషను నీతిని నేర్పే పద్దతి చూపారు : బందీలవుతున్న భావివెలుగులు శీర్షికన.
పొత్తపు గుడి (లైబ్రరీ) విశేషాలు సన్నిధానం నరసింహశర్మ మాటల్లో
పావులూరి మల్లన్న పద్య గణితం గురించి.. ఈనాడు పి. శంకర్రావు రాసిన ” ఒకడు లెక్కల కవి.
కె. సురేష్ మంచిపుస్తకం పబ్లికేషన్స్ ట్రస్టీ మాటల్లో ఆబాలగోపాల సాహిత్యం
వింజమూరి అచ్యుతరామయ్య కవిత: మంత్రపుష్పం
మధురాంతకం రాజారాం కథ: కమ్మతెమ్మెర
పదపంచాయితీ
పుస్తక సమీక్ష , తులాభారం తెలుగులో చదివితే నేరమా..! ప్రకాశం జిల్లాలో పరభాషా లో చదువు బుర్రకెక్కక ఉసురు తీసుకున్న కథనం. . ఇది మన తప్పులకి ముగింపు కావాలని.. ఈ సంచిక ఉద్దేశమేమో..
ఈ సంచిక ముఖ చిత్రం చాల నిండుగా ఉంది కదూ.. మన పండుగ లా..
ఇది నా ఘోషేనా.. కొని చదువుతున్నారా!!

RTS Perm Link

4 responses so far

Oct 30 2012

No worries!!!

ప్రవాహం కవితావేశంలా లాగేస్తుంది ఎటోకటు
ఉద్వేగం ముంచేస్తుంది కలలపై రోకలిపోటు
నైరాశ్యం నమిలేస్తుంది పంటికింద పెదవిని..
ఊహించని పిడుగుపాటు..

పరిస్థితులు పగబట్టినా
ఇబ్బందులు చుట్టుముట్టినా.. తట్టుకోవడం
బాధ్యతల బరువుల్లోనో
ఓటమి అంచుల్లోంచో జారిపోతున్న మనల్ని
మనమే నిలబెట్టుకోవడం
ఇదికదా! అవసరం పుట్టినందుకు.

దేవుడనే వాడుంటే నువ్ మోయలేని బరువుని
నీ భుజాన మూటకట్టడు.

పరీక్షలకే పారిపోతామా..
పరిస్థితులకే మారిపోతామా
ప్రవాహానికే జారిపోతామా..
మనకి మనం అసలేంకాకుండా పోతామా!!

నిలబడటం నీవంతు.
చెయ్యివ్వడం.. చెయ్యనివ్వడం అంతా నీ హ్రస్వదృష్టి
ఎవరు చూస్తే ఇంతవారమయ్యామో..
వాడాడే చదరంగంలో ఇదో మాయ

లోతుచూసుకుని నడు ఎక్కడైనా
తప్పుకునే ఆలోచన మానుకో
నిన్ను మళ్ళీ తయారుచేసుకునేది నువ్వే..
నిన్ను నీలా పొందడం నీకే సాధ్యం

నువ్ తప్పుకుంటే జరిగేనా నీ పునః సృష్టీ !!

RTS Perm Link

No responses yet

Oct 29 2012

మనసు ’కీ’ whole

చూస్తాం.. లోకం.. ఆ క్షణమంతా మనదే..
లోకమా క్షణమా ఏమో.

నచ్చిన రంగులుంటాయ్.. మనల్ని కావాలంటాయ్
రంగవ్వాలా! నచ్చాలా!! ఏమో.

వెచ్చని ఆలోచనలుంటాయ్ లోనికి రమ్మంటాయ్
ఆలోచనలనా! వెచ్చదనాన్నా! ఏమో.

చిక్కని జవాబులుంటాయ్ కనుక్కోమంటాయ్
కనుక్కోవాలా! అడగాలా! ఏమో.

విప్పని ముడులుంటాయ్ చేయి చేసుకోమంటాయ్
ముడులనా .. వాటి జడలనా ఏమో.

కొన్ని కోరికలుంటాయ్

చూడాలని.. వినాలని .. ఆఘ్రాణించాలని.. స్పృశించాలని
రుచిచూడాలని.. ప్రేమించాలని ..
కోరాలా!! కోరపీకాలా ! ఏమో.

పుట్టినప్పుడు ప్రతీదీ అందంగానే ఉంటుంది.. పసిపాపలా.
ఆ క్షణం లో అదే లోకం..
లోకం లోకి అందమైన దాన్ని వదిలేయ్.. ఇంకేంకావాలి!

నీకు నచ్చినట్టు రంగరించు..
ఇచ్చేయ్..
నీ రంగులతో లోకం నింపు ఇంకేంకావాలి!

లోనికి వచ్చిన ఆలోచనల వెచ్చదనాన్ని పంచు
జవాబు అడుగు..
దానికదే కనుక్కుంటుంది ప్రశ్నని

జడపట్టుకో
ముడి పట్టుబడిపోతుంది
తాడో-పేడో తేలిపోతుంది

కోరికలూ.. మీ మూలాలు వేరు
లోనికి చూస్తావా.. బయటదారులు కనిపిస్తాయి.
మనసుకి మార్గాలుంటాయి.. గొళ్ళాలుంటాయ్
తెరిస్తే బయటవాటిని లోపలే చూపిస్తాయి
బయటవెతికావో నిను లోపలపెట్టి చీకటి పాల్చేస్తాయి.

చీకటిని నీ వివేకంతో కాల్చేయ్..
మనసంతా నీ ప్రపంచమౌతుంది..
ఈ ప్రపంచానికే నీమీద మనసౌతుంది.
ఇంకేంకావాలి!!!!!!!!

(తనను వెతకొద్దంటూ..అందరికీ దొరికిపోతున్న .. ఓ బ్లాగర్ కి…ప్రేమతో. )

RTS Perm Link

4 responses so far

Oct 28 2012

తెలుగు వెలుగు రెండో సంచిక online flip book

Info:
దసరా ప్రత్యేక సంచిక..

మీ కోసం eenadu.net లో

http://crm.eenadu.net/teluguvelugu/magazine.html#/0

ముచ్చటగా మూడో సంచిక రెండు రోజుల్లో market లో …

RTS Perm Link

One response so far

Oct 27 2012

ఇదేం న్యాయం దేవుడా?

 

రాసిందే రాయడానికి తలదించట్లేదు నేను
ఎప్పటి లానే.. తలవంచే రాస్తున్నా..
చేసిన తప్పు చేయడం నీకు తప్పనపుడు
రాసిన రాతే రాయడం నా తప్పెలా అవుతుంది!
అడిగిన ప్రశ్నే అడగడం నాకు తప్పదులా ఉంది.

ఆరోజు వైష్ణవి.. ఈరోజు సాన్వి.. మధ్యలో తెలియనివి ఎన్ని!!
పేర్లేమైతేనేం తలతిక్క లెక్కలు నీవి
మొన్నేగా ఏదోకారణం చెప్పమంటే..
శివశంకర్ ను తీసుకుపోయావు
నా ప్రశ్నకు జవాబు చెప్పలేక తప్పుకు పోయావు

ఒక్క బొమ్మ లా ఇంకోటి చెయ్యడం వచ్చా నీకు
ఎవరిని చూసి మైమరచాలి ఈ వెతల్ని! కడుపు కోతల్ని!!
సైదుబాబు పాపం పండాలంటే 25 ఏళ్ళు నిండాలా!!
సాన్వి పాప 10 నెలలకే నీ ఇంట కొలువుండాలా?
మా కళ్ళన్నీ.. నీళ్ళతో నిండాలా!! ఇదేం న్యాయం దేవుడా?

నీ బండబడ.. నీకు తెలియదు.. ఇది మాకో అంటురోగం
చరిత్ర కాల్చిన మచ్చల్లో పశుత్వం పాఠాలు నేరుస్తుంది.
వెధవను మించిన వెధవల బడి మా లోకం
క్రియేటివ్ గా క్రీమేషన్ చేసే పోటీల్లో ఎవడికి వాడే సాటి
కిడ్నాపర్ ఎవడైతేనేం చంపడం తోనే ముగిసేది స్టోరీ

Marzipan పిల్లల బొమ్మల్ని దాచుకునే వాళ్ళనుంచి
కేకుల్లా చేసుకుని కొరుక్కు మింగే వాళ్ళ వరకూ కన్నతండ్రివి.
ఎందరి ఇష్టాలని నువ్వు చూస్తావ్.. ఎవ్వరి మాట కాదంటావ్!!

పక్కోడూ బాగుండాలనుకున్నామా. .
రేపటి రోజు వార్తలకు ఈ రోజే రక్తపు రంగుపూస్తావ్
పసిమొగ్గల్ని తుంచేసి..తల్లితీగకు కడుపు కోస్తావ్
తలతిక్క లెక్కలు నీవి.ఇదేం న్యాయం దేవుడా?
ఎందుకు మమ్మల్ని పరీక్షిస్తావ్?

[శివశంకర్ మా ఆఫీసు కురాడి పిల్లాడు.. మానసికంగా ఎదుగుదల లేకుండానే.. నెలల వయసులో తల నిలపలేని ఇబ్బంది పడుతుంటే..ఏమీ చేయలేక కలత మనసు తో రాసుకున్నా24.8.12 న : ఏదో కారణం..  అబ్బాయి పోయి వారమైనా కాలేదు..]

RTS Perm Link

6 responses so far

Oct 25 2012

ఉప్ప’ధనం’

నా ఉద్వేగం ఎక్కడ ఎందుకు అంకురించినా
ఎర్ర మందారాల్లాంటి నెత్తురుకణాలను
తెల్లమల్లెల్లాంటి కన్నీరుగా చిలికించినా
మారని గొప్పతనం గొప్ప ధనం నాలో ఉప్పదనమే

నా స్వేదం ఎక్కడ ఎందుకు చిందించినా
నిర్వేదం నుదుటిన నాట్యం చేస్తున్నా
నీరు చల్లినట్టుగా రగిలి పొగలు కక్కించేదీ..
మారని తరాల స్వరాలని బయట తడిపి
లోన చల్లబరిచేదీ ఈ ఉప్పధనమే

మనసు కరిగించే ఉప్పు .. మంచు కరిగించే ఉప్పు
ఈ తెల్ల బంగారం ఖరీదు మనిషి నిలువెత్తు
పుణ్య పురుషులు కర్పూరాలో కాదో.. ఏమో.
నా మనుషులు ఈ రస కర్పూరాలే..
చిటపట జ్యోతుల హారతులే

మనిషి జీవించివున్నాడంటే..
కష్టాల కొలిమిలో ఉప్పు.. నిప్పుతో చిటపటలాడ్తున్నట్టే
ప్రేమ పాశంలో పడి.. నీరుగారి కరిగిపొతున్నట్టే
ప్రేమ తియ్యదనంలో కలిసి.. మనసు నిర్జలీకరణాన్ని నిరోధిస్తున్నట్టే

ప్రేమంటే ఏదో ఒక రుచి కాదు
జీవితం-రుచి తెలిసిన కమ్మని కూర
అమ్మ అప్పుడే పెట్టిన ఆవకాయ పచ్చడి

ప్రేమంటే జీవన రసధుని మధుర భావనా లాహిరి
జీవితం ఆ ప్రేమ కోరే మనసు చేసే సాగరఘోష

సాగరతీరాల అవతల జీవితాలూ ఉప్పనే నేస్తమా!
ఆకర్షణల ఉప్పెనలతో తీపిని పంచకు
చితిమంటల ప్రేమను తియ్యగా ఎంచకు
ఆకురాయి అగ్గిరవ్వలను కళ్ళతో ఒంపకు

ఉప్పదనం లేని చోట జీవితం చప్పగానే ఉంటుంది
గొప్పతనం కోరే మనసుకు నా మాట ఉప్పగానే ఉంటుంది

వడ్డించిన విస్తరిలా ఉండదు జీవితం ఎన్నడూ
అయిన కూట్లోకి అయిన కూర ఉంటే చాలదా
సమన్వయం లేకపోతే జీవితం ఉప్పులేని
చప్పిడిమెతుకుల ముప్పై.. తిప్పలు పెడుతుంది.

RTS Perm Link

2 responses so far

Oct 23 2012

పదాల తోట దడి..

పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా
పూల తావి తాకిన తుమ్మెద ఎద చేసే ఝంకారం నీ నామజపమైన వేళ
చెదిరే తూనీగల్లా నా భవభావాలు గడికోమాటు బరి దాటుతున్నా..
పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా

నిను వెతికి వెతికి వగసి తలవంచి నిలువలేక ఈ భావావేశపు గింగిర్లు
జారిపడ్డ ఆలోచనల కంపన కంటి కొలనింట.
కదిలే పిట్టలా కనుచూపు మింటివెంట..

పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా
ఎండిన ఆకులా నా మాట రాలి తేలి నిన్ను చేర ముద్దాడ..
మాట తేరుపై మనసు చేసే ఓ సంధ్యా రాగం మన ప్రణయం

పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా
ఉక్కిరిబిక్కిరిలో కదలలేని కలువనీడలా వణికిస్తున్న నీటి పొర
తడుస్తున్నకనురెప్పలను పొడుస్తున్న వెన్నెల కిరణాల తుంపర

జాలి మనసుతో వేడుతున్నా .. నీ రాక చూడని కాలాన్ని
నీ మాట వినిపించని రాగాన్ని యుగాల ఎడబాటుని
నన్నొదిలి వెళ్ళమని పెదాల పరదాలు తెరదీసి వగస్తున్నా
పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా

నా 50 వ కవిత ఇది.

మనసు బాట సాక్షిగా ..

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనం

దసరా శుభాకాంక్షలు

RTS Perm Link

2 responses so far

Oct 20 2012

కొండమల్లీ! నవ్వు.

మేం మరచిన మంత్రమేదో నీకు తెలిసినట్టుంది
రబ్బరు నవ్వుల్ని మోసే రంగుల లోకంలోకి
చలువ గదుల్లో పూయని వేసవి మల్లెల్ని
ఎలా తెచ్చావు నా ముందుకు ఓ కొండమల్లీ

నీ చెక్కిలి చేరిన మునివేళ్ళ గిలిగింతల్లో
ఏంచూస్తున్నావో! మురిసి చిన్నోడి కేరింతలలో!!
ఏం చదివితే ఏం నేర్చితే తిరిగి వచ్చేది ఈ తేజం!
తప్పిపోయిన మా పసి తనం నీ చెంతన వింతగా!!

గంజి నీళ్ళ బలమో.. తాటి ముంజల గుంజు వలనో..
బుట్ట తేనె తీపిదనమా! ఇప్పపూల గొప్పదనమా
మట్టి కుండల వన్నమా! కంద దుంపల బలమా
తప్పిపోయిన మా పసి తనం నీ చెంతన వింతగా!!

నిన్ను వెతికితేలేకా “సొచ్చం గా” నవ్వలేక
ఇచ్చిపుచ్చుకోవడానికి ఇంకేం లేక
పంచుకుంటున్నాం ఒకరికొకరం

రెండు నిలువుచుక్కల పక్క ఓ చంద్రవంక 🙂

RTS Perm Link

2 responses so far

Oct 19 2012

భయో.. దైవ అరిసీ.. Tea ఎక్కడ!!

 

జీవవైవిధ్య సదస్సు ముగిసింది.
ఇక కాగితాలపై అభయారణ్యాలు పెరుగుతాయి

ప్రపంచ ప్రతినిధులారా!
విమానాలెక్కండి.. సురక్షితం మీ ప్రయాణం
డేగల్లేవిక్కడ.. మాది డేగలేని దేశం

అంతర్జాతీయ జలచరాల్లారా!.. sea horse లూ
ఆక్వేరియం ల అద్దాల్లోంచి నేరుగా మీరు మా కడుపుల్లోకే

ఔషద మొక్కలూ ఎదగాలి మీరు
విత్తన వ్యాపారమా!
సౌందర్య వర్తకమా ! వర్థిల్లు !వర్థిల్లు !

వర్థమాన దేశాల్లారా!! ఆడగండి డబ్బుల్ని..
20 సూత్రాల పథకం అమలుకి డబ్బుల్లేవ్
ఏకథ చెప్పినా కావాల్సింది కనకమేగా!

de Souza Dias! ఈ సాయంత్రం నుండే నువ్వో అనామకుడివి
నీ ఆచరణ మంత్రం అమలు ఇక కంఠసోషే..

20 ఏళ్ళు నిండిన సదస్సుల ఆరంభానికన్నా
ఈరోజు redlist పొడుగు 400 లైన్లు ఎక్కువ
మొక్కలెక్కువా! మాకు కుక్కలెక్కువా!

 

కొరియా! తయారయ్యావా 2014 సదస్సు కి
oyester ల pancake ప్రపంచానికి తినిపించడానికి.

అమెరికా! నువ్వేనయం.. నువ్వేనయం.
చాంద్రాయణ వ్రతం నీ సంస్కారం లో లేదు
(జిరాఫీ ఏంచూస్తావ్!! అసలు రంగు చూపించు.)

RTS Perm Link

One response so far

Oct 18 2012

బేగెల్లి రావె ఓ సరకారుబస్సూ

సక్కనోడు ఎదురుసూసేయేలైంది ఓ సరుకారు బస్సూ
సరుకెట్టాను సేయి మారనీకుందీ..ఓ సరుకారు బస్సూ
సలిమల్లిన ఏలలో ఓ సరకారుబస్సూ
ఈ ఎదురుసూపు నాకేల ఓ సరకారుబస్సూ

అమ్మబోయినకాడ అడవె మేలైనాది
కుట్టు నెప్పుల ఏల్లు పుట్టు సలపరమౌతేను
మావసరసమె నాకు మెత్తననిపించేను

బెట్టు సూపినా రేతిరి పనిబాయలేక
మాపటికి వస్తడో మావ బయలెల్లినాడో
సుక్కకై పోయాడో.. సుక్కెనక పోతిడో

సూడరాకాపాయె..ఈయాల్న బస్తి పాల్పడితినే
ఉసూరంటు వచ్చినా మాయదారూరూ
బేగెల్లి రావె ఓ సరకారుబస్సూ

ఏడున్నడో నా మావ ఓ సరకారుబస్సూ
ఈయాల మావతో మరులుగొనకాపోతె
మొయ్యాల మాపైన కుట్టునెప్పుల సలుపు
ఏడున్నడో నా మావ ఓ సరకారుబస్సూ

బేగెల్లి రావె ఓ సరకారుబస్సూ
మావపై మల్లి మనసైనాది సరకారుబస్సూ
బేగెల్లి రావె ఓ సరకారుబస్సూ

RTS Perm Link

2 responses so far

Oct 16 2012

బకెట్ లిస్ట్ ఐటమ్ 4

ఒట్టేశానో లేదో .. కట్టినోడిమీద
ఎప్పుడు పగిలేనో నా ఉట్టి..
పువ్వులా రాలే కోరిక జాబితాలో మొదటిది.–
పసిపూవులు వసిమాలే వేళ వెక్కిరించేది ఈ ఇఛ్ఛే

తడియారని తపనలతో తనువును తెల్లారదీయ
వగచిన వేళ — నా కలహప్రియ మూతివిరుపు చూసాకా
ఎల్లెల్లెల్లమని అనిపించుకోలేక ఒద్దనుకున్నా రెండవది.. చెరిపేసా గీతలాగ
నోరూరే మిఠాయి సీసా పై మూసేసిన మూతలాగ

పిల్లల పై చదువు బరువు ర్యాంకులకై వగుర్పులు
చూడలేక దిద్దితీర్చు తలపోటు– మూడు నాకెందుకని అనుకున్నా
వదిలేశా తాకట్టుకు లక్ష్మిని సరస్వతి తలకట్టుకై వడ్డీ లెక్కన
నాకేమి తెలుసో (తెలియదో) తెలిస్తే పిల్లల ముందెంత అలుసు మరి

పురుషలక్షణం ఇప్పుడు పురుషులదే కానప్పుడు
వ్యాపారానికి రొక్కం నా వద్ద లేనప్పుడు
రెంటికి చెడ్డరేవడి బతుకంతా ఇంతే అనుకున్నప్పుడు
రామకోటో.. సొంతపైత్యమో రాద్దామని —

మాటవినని మనసుకోసం నెరవేర్చిన ఒక్కపని
పోయేలోగా అయ్యేవి ఎన్నున్నా లేకున్నా
కన్న కలలకు రంగులద్దుదామని నెరవేర్చుకున్నా
బకెట్ లిస్ట్ లో ఒక పని.. వీలున్నప్పుడల్లా రాద్దామని..

ఓ బ్లాగు ను నాకోసం సృష్టించుకున్నా.
ఎవరు చదివినా లేకున్నా .. కామెంటని నేస్తాలెందరున్నా
నన్ను నన్ను గా గుర్తించే ఏ ఒక్కరికోసమో రాస్తున్నా.

RTS Perm Link

6 responses so far

Oct 15 2012

గుల్ మకాయీ (మొక్కజొన్న పువ్వా!!)

మొక్కజొన్న పువ్వా!!

నువ్వెవ్వరని మాకీ ఈ తలపులు మలాలా!!
‍11 ఏళ్లకే బ్లాగర్ వయిన పిన్నవనా!
సాటికవి కన్న కూతురివనా!!
చదువులతల్లి పేరేదైనా నీకది పర్యాయపదం

నీడైరీ చదివాక తెలిసింది నీవొక నిశ్చయమని..
జనవరి 4 2009 న నువ్ బిబిసి బ్లాగులో రాసిన మాట..
రేపు స్కూలుకి వెళ్ళాలని..
ముందురోజుల భయం నీడన
చదువు పేరెత్తితేనే నీమాట.. ధైర్యమైంది ప్రతి నోటా..

అర్థమైందిలే ఈ రోజు . నీశక్తి..ఆలోచన
మురిపించే స్వాత్ అందాలలో జ్వలించే క్రాంతిరేక నీ చిరునవ్వని
రేడియో ముల్లా ” ఫజులుల్లా గాడు చూసిన 2 ఏళ్ల భయం పేరే నువ్వని

మలాలా.. మా నాగరికత నడిచొచ్చిన కైబర్ కనుమలలో సుమానివి.. నువ్వు
రాజకీయ రంగమే నుదుటి రాత మార్చగలదన్న నీ నమ్మకం
ఆధునిక విద్య అవసరమని.. నొక్కిచెప్పిన నీ జీవనం

నీ వాడిన ముఖం వికసించాలని లోకం ఎదురుచూస్తోంది.
అదే తెగువ చూపించు.. బతుకుతో పోరాడు.. బతుకుతూ పోరాడు.
తాలిబన్ల పిరికితనానికి బదులివ్వ రావాలి అసలు సిసలైన జవాబై.

నా కంటి చెమ్మ సాక్షిగా చెబుతున్నా
పాకిస్తాన్ లోగిలిలో పూచిన మానవతా ప్రియనేస్తమా
నువ్ విరబూయడం కాంతిపంచే సూరీడుకి అవసరం

రేపన్న లోకం లో నీ స్పూర్తే మేము కోరే మార్పు..
బడికెళ్ళే ప్రతిపిల్లా మలాలాలా ఉద్యమించే అవసరాలు రానీకమ్మా!!
నువ్వెత్తిన పిలుపులో మేమంతా గొంతుకలుపుతాం..

ఎందరికోసం మొదలుపెట్టావో.. అందరం నీ బాట పడతాం..
బదులివ్వరావా అసలు సిసలైన జవాబై.

RTS Perm Link

2 responses so far

Oct 13 2012

ఇదికదా జీవితం.. (క్షణికమే..కానీ..)

ఆలోచనాలోచనాలు తెరతీసిన వేళ
అనుభవాలు ఎన్నిమార్లు ముప్పిరిగొన్నాయో
మూసిన కళ్ళలో పలికే తన్మయరాగాలు
లాలి పాడే ఆలంబనలో పవళింపే ఓ భాగ్యం

ఒక్కో భావన పిల్లగాలై తాకుతూ ఉంటే
వసంతం వరించి వచ్చినట్టు తలపుల గిలి
ముందరి విందులు ఊహకందవు
రేపటి రోజు ఎరుక ఎవరికి..

నీ లోకం నీది.. వారాంతపు వాకిట నిల్చొన్నప్పుడు
నేలా నింగీ నీ నీడే..
స్నేహ తారల మిణుకులు నీ ముంగిలి చేరవ్..

బద్దకపు భాగ్యదేవత నిన్నావహించేవేళ
వినవచ్చే సన్నాయిగీతం.. తినిపడుకోరాదూ!!
అబ్బా! ఈ అవసరం లేనిలోకంలో నే ఉండలేనా!! ఏవేళైనా!!ఈవేళైనా

RTS Perm Link

No responses yet

Oct 12 2012

రాయడం అసంకల్పితం

తప్పనిసరి స్పందనలు కొన్నుంటాయ్

మెలకువ వస్తే కళ్ళు తెరచుకున్నట్టు
మెళకువ నేర్చితే నైపుణ్యం పెరిగినట్టు
చల్లదనానికి ఒళ్ళు ఝల్లుమన్నట్టు
మంచితనానికి రూపంలేనట్టూ..

చూసినేర్వాల్సినవి కొన్నుంటాయ్

తరగతిగదిలో బోర్డుమీద అక్షరాలు
వలపులమదిలో దాగలేని భావాలు
అవసరాలను తీర్చే అనుకరణలు
వాటిని నేర్చే కారణాలు వాటి కారకాలు

ఎందుకు రాస్తున్నానంటే ఏంచెప్పను!!

తల్లి కడుపున పడడం అక్కడే ఉండడానికా!
మనం పుట్టడం ఏడుపు వినిపించడానికేనా!
మన చూపులో అనుభూతులో వాటి లోతులో
అనుగుకోడిపెట్టలా పొదిగపెట్టుకోవడానికా!

ఓ మాటైనా ఉండొద్దా! మనమధ్య
జట్టుకట్టుకోవడానికైనా…

RTS Perm Link

2 responses so far

Oct 11 2012

నాకే గనక చేతనైతే..

మీ కోసం.

పసిపిల్లల పిప్పర్మెంట్ నౌతా
తీయతీయగ కరిగిపోతా

స్కూలు పిల్లల బ్యాగు నౌతా
పుస్తకాలను మోసిపెడతా

కన్నెపిల్లల కోరికౌతా
కన్నవారి కానుకౌతా

మగపిల్లల మీసమౌతా
తెలుగువాని రోషమౌతా

యుద్ధవీరుని గన్నునౌతా
భరతమాతవెన్నునౌతా

మరుమల్లెల దండనౌతా
దేశభక్తుని దండమౌతా

ఆప్తమిత్రుని దరహాసమౌతా
అనాధకు విలాసమౌతా

ఆర్తురాలికి అన్ననౌతా
నిరుపేదకు అన్నమౌతా

శ్రమజీవికి పాన్పునౌతా
నిండుచూలాలి కాన్పునౌతా

ముసలిఅవ్వకు చేయూతనౌతా
అవసరమైతే కొడుకు నౌతా.

నాకే గనక చేతనైతే..
ఓ సుబ్బారావు నా రూమ్ మేట్ (MBA కాకినాడ ఐడియల్ కాలేజీ 1996-98లో) సరదాగా ఈ పదగుత్తిని నా నెత్తినరుద్ది ఆశువుగా 10 లైన్లు చెప్పమన్నాడు. చెప్పానో, రాశానో గుర్తులేదు కానీ 24th November 96 రోజు న రాసినట్టు.. నా పాత పుస్తకాల లో దొరికింది. పాతదేదైనా అపురూపమేకదా!!

RTS Perm Link

6 responses so far

Oct 03 2012

ఏదో కాంతి నాలో..

ఏదో కాంతి నాలో ఊరెల్తున్నందుకా!!
సహచరి ఎందుకో అంత ఆనందమని ఎద్దేవా చేసేటంత
ఏ బంధం మిగిలివుంది అక్కడ అమ్మతప్ప
గతం వీధి దీపాల్లా అనుభూతుల నీడను కుదుపుతోంది ఆడుగుల్లో

ఊరుచేరిన నడకల్లో చూపు తాకి తేరువ జారిపోతున్నట్టు
పారజూసే పరిచయాలు పలుకరించాలా వద్దా అన్నట్టు
ఈల పాట కై చుట్టిన పెదాలు ప్రక్కలు పట్టించుకోనట్టు
చేరే అడుగుల్లో వయసుని దూరం తగ్గిస్తున్నట్టు

వీధి మలుపు తలపులతో మెలితిరుగుతున్నట్టు
గుమ్మం ఎదురుచూపులో అమ్మకు నా బాల్యాన్ని పంచుతున్నట్టు
ఏ పువ్వైనా తోటలో ఇంత వికసిస్తుందా
మింటివెలుగు నవ్వులతో ఆశ్శీస్సులు కురిపిస్తున్నట్టు.
నా కంటిముందు అదే కాంతి నను మళ్ళీ కన్నట్టు కనుగున్నట్టూ.

RTS Perm Link

8 responses so far

Oct 02 2012

చదివి చెప్పరూ ప్లీజ్.. నాకు

పదండి ముందుకు పదాల విందుకు సంపాదకీయం: ఈనాడు పదసంపద రాబోయే వెబ్ సైట్ పదసృష్టి కోసం ఓ విభాగాన్ని ప్రత్యేకించిన విషయాన్ని చెప్పారు. ఈ విషయ శీర్షిక “పదపంచాయితీ” లోపలి పేజీల్లో

వినదగునెవ్వరు చెప్పిన: కోరిక: జీవన సంబంధ గజళ్ళను వేయాలనీ, గ్రాంధికాన్ని మార్చొద్దనీ, సంతకం తెలుగులోనె పెట్టాలనీ సూచనలు.
మన నిఘంటువులకు మంగళారతి ఆంధ్రభారతి.కామ్

అంతా తెలుగు మయం ఐతేనే జయం.: తెలుగు భాషా సాహిత్యాల పరిశీలన, పర్యవేక్షణకు ఒక సమగ్ర అధ్యయన కేంద్రం అవసరాన్ని, భాషా పరిరక్షణకై సంసిద్ధత, సన్నాహాలను కోరే సాహితీవేత్త ఎర్రాప్రగడ రామకృష్ణ

వాడుక భాష కావలెను: వ్యాపార ప్రకటన కర్తలకు సూచనలు పి. కృష్ణాజీ

అక్షర జ్యోతులు సామెతలు: లలితానంద ప్రసాద్ 20 సామెతలతో వ్యాసం 5 సామెతలు డబ్భాలలో

తెలుగువీర లేవరా: సం.వెం రమేష్ తమిళనేలలో తెలియనివిషయాలు స్పూర్తివంతమైన మూర్తిమత్వం

ముక్కుతిమ్మన ముద్దుపలుకులు శాంతమ్మ అందించిన అచ్చతెలుగు వక్కలు
దేశవ్రత కథ ఎలక్ట్రాన్: చదవాలి
వైద్యులూ భాషను బ్రతికించండి. వైద్య శాస్త్రానికి చెందిన సాంకేతిక పదాలకు తెలుగు సమానార్థకాలు కావాలనే తలంపు

విభక్తులున్నాయి సరైన అర్థాలు రావాలంటే నేర్వాల్సింది విభక్తులూ దీర్ఘాలూ అంటూ జాగ్రత్తలు చెప్పిన రంగనాయకమ్మ
మాతృ భాషపై నే కాకుండా రచ్చ గెలిచిన రవీంద్రుని మార్గాన్ని చూపిస్తున్న చంద్రప్రతాప్

గాజుల సత్యనారయణ పెద్దబాలశిక్ష లోగుట్టు వివరాలు వారితో ముఖాముఖీ
\
జయీభవ.. విజయీ భవ దశరా కబుర్లతో పి. స్నేహలతామురళి

ఎర్రాప్రగడ రామ్మూర్తి సరదాలవరద దసరా పద్యాలు

అక్టోబరు నాల్గవ ఆదివారం అత్తలుదినోత్సవం అట.. ఆ సందర్భాన జెన్నీ-సన్నిధానాల అత్తాకోడళ్ళు సూర్యాకాంతాలూ-చంద్రకాంతాలు సరదావ్యాఖ్యానం
నందూగాడి రంగుల కళ గుర్రం ఆనంద్ తెలంగాణామాండలీకంలో కథ

పి. శ్యామాచారి అందించిన భద్రకాళి జాతరంట జానపద పదం పరిచయం

తాపీ ధర్మారావు జీవన పరిచయం సంస్కరణ ధర్మానికి కాగడా వారి జయంతి సెప్టెంబరులోనే
పారేసుకుంటున్న మాటల మూటల్ని ఏరి మనకందిస్తున్నఎం. దత్తాత్రేయశర్మ
స్త్రీ వాదపు అడుగుజాడ శకుంతలది అని సనాతనత ను అందిస్తున్న డా.పి. నాగమల్లీశ్వరరావు
డిట్రాయిట్ తెలుగుసాహితీ సమాఖ్య ప్రేరణ కల్గించే విషయాలతో మద్దిపాటి కృష్ణారావు అందిస్తున్న ఏదేశమేగినా!
చక్కిలం విజయలక్ష్మి కథ ఙ్నాననేత్రం చాలాబాగుందని మిత్రులు అన్నారు
ఫిలిప్పైన్స్ విద్యావిధానం లో మార్పులంటూ.. సాగిన ” ఆపిట్టభాష మాట్లాడకు”
తెలుగువారి నృత్య సత్యాలను వెలువరించిన నాట్యాచార్య శ్రీ సప్పా దుర్గాప్రసాద్ చెప్పిన మనకు తెలియని విషయాలు
హాయిబుజ్జి సారథి శర్మ గారు అందించిన సరదా కథ అప్పారావూ అతడి భాష పాత్రికేయ పదనిసల గిలిగింతలు
ఈ టీవి సుమన్ రసగుళికలు అందించిన సాహిత్యప్రకాశ్ నివాళి, కాపు రాజయ్య, వి వి కృష్ణ శాస్త్రి రోహిణిప్రసాదుల స్మరణ పరిచయాలు
చాసో కథ వాయులీనం కొత్తగా మనముందుకు.

పరిచయాలను చదవాలంటేనే ఉక్కిష్ఠం గాఉందినాకు.
నెలరోజుల మృష్టాన్న విందు లో నే నింకా స్మరించనివి కవితలూ, చమత్కారాలూ, న్యాయాలూ ఇంకా కొన్ని కథలూ, కబుర్లూ ఇంకొన్ని..
మన బ్లాగర్ మిత్రులు కవి బివివి ప్రసాద్ కవితకూడా ఉందండోయ్..
చారి, జావేద్, నందూ, కవితల బొమ్మలూ.. రవి అందిన హంగులూ.. కొనడానికి 20 రూపాయలు.
ఇరవయ్యేనా!
ఇంకేం మర్చిపోయానూ.. ఏం మర్చిపొయానబ్బా!! చదివి చెప్పరూ ప్లీజ్..

RTS Perm Link

No responses yet

Oct 02 2012

ఈ నేలపై నే జన్మించాలా!

ఆమ్మా నాకు గుర్తే ..
నీ మాటలు.. నా ప్రసవానికి నీ వేదన
నా ప్రయాణం లో నీ ప్రయాస చాలా పెద్దదనీ,
కాలం కరగని నెప్పులకు కారణం నా ఈ సందిగ్ధతే..
ఈ నేలపై నే జన్మించాలా!

అన్ని దారులూ దిఙ్మండలాన్ని ఛేదించినా
నేను దారి లేక ఉండిపోయా నీలో
నువ్ ప్రసవార్ధి వై పడుకున్నప్పుడు
చూపులు ఆకాశానికి గుచ్చివున్నాయని

మూసుకుంటున్న కనులు తెరుచుకున్న పెదవులతో
ఆకాశమే నాకు ఆధారం అన్నాయని!!

తరాల పేదరికం కప్పుకుని నువ్వు
తల కింద తరగని అవసరాల దిండు

రాత్రినిద్రలో పగలు పనుల్లో
మెలికలు తిరిగే జీవితం
ఖాళీ పిడికిళ్ళ తో గుండెలు కప్పుకుని
నువ్వు చెప్పాలనుకున్న మాటలు

ప్రతి మనిషి ప్రకృతి పురుష సంగమ సృష్టి అని
ఈ దారిని మార్చజాలని దైన్యులమనీ

నీ చుట్టూ తిరిగి తిరిగి నువ్ కనుగొనలేదా
భూమి గుండ్రమనీ.

ఆమ్మా
ఇది నీ నేలే. నదులు ఒరుసుకు పారే గట్లతో
అంచులు దాటే సెలయేర్లతో
ఈ నేలే నిన్ను దోసెడు నీటి కోసం
రక్తాన్ని చిందిస్తూ పోరాటం చేయించింది!
ఈ మహానాగరికతంటే నాకొక చీత్కారం

నువ్ పుట్టినందుకే ఈ నేల నీదా..! మనదా!!
నీకు పుట్టినందుకు నాదవుతుందా!!
నా నేల ఇదే అని నే పాటలు పాడాలా.. ప్రేమించాలా!!
మన్నించమ్మా..
నిజం చెప్పనా సంశయంలో ఉన్నా
ఈ నేలపై నే జన్మించాలా!

by: L S Rokade in Marathi

RTS Perm Link

5 responses so far

Oct 01 2012

నాణెం గాల్లోకి ఎగురుతుంది

కాలం కలల్ని నాణెం లా ఎగరేస్తే ఆశ కిందకొస్తుందని
ఆర్తి తో మనిషి ఆకాశం చూసేది ఓ దైవ స్పర్శని ఆశించి
గురుత్వాకర్షణ తెలీని కుర్రాడు బంతిని ఎగరేసి
దేవుడి తో ఆడుతున్నానన్నట్టు ఎగిరి కిందకొచ్చే ప్రతీదీ విధి విలాసం

మనసు ఎలా రువ్వినా ఫలితం శిరోధార్యం
బొమ్మాబొరుసులు పొందడం కోల్పోవడాలే
పుట్టుక తో పోయేవి ఊహల్లో కూడా తెలియవ్
ఏ స్మృతుల లోతుల్లోంచి బయటకు వస్తామో మనం!!

ఎదిగే కొద్దీ బాల్యం నలుగుతుంది బడి బరువుల్ని పెంచుతుంది
ఆటే జీవితమయ్యే అంకం నుండి జీవితమే ఆటయ్యే మజిలీ మొదలౌతుంది.
ఆకుల్లో పాటలు పాఠాలవ్వాల్సింది పాఠాలపుస్తకాలు ఆకుల్లా నలుగుతాయి
మొగ్గల్ని పూవులవ్వనివ్వని మొరటుతనాన్ని నాగరికత నేర్పుతుంది

బొమ్మల స్థానాన్ని వాహనాలు భర్తీ చేసినప్పుడు రోడ్డున పడ్డట్టుంటుంది
బొంగరపు జీవితాలు కొత్తపుంతలెక్కవు చేసిందే చేయడం ఇప్పుడో లెక్క
లోటు భర్తీ కార్యక్రమాలు జతకడతాయి గోప్యతకు పట్టం కడతారు పిల్లలు
గోడచాటునో సందుచివరో కళ్ళు కలుస్తాయ్ రాహుకాలం పొంచిచూస్తుంది

ఓ దుర్ముహుర్తం లో బెదిరింపులో బుజ్జగింపులో లొంగదీస్తాయి
మెత్తని మనసులు మనుషుల్ని కోల్పోతాయి నాణెం గాల్లోకి ఎగురుతుంది

RTS Perm Link

One response so far

RTSMirror Powered by JalleDa