Archive for September, 2012

Sep 29 2012

బడాయి పిల్లి కి సెలవంటా..

బడాయి పిల్లి… లడాయికెళ్ళి
ఎలుకను చంపి… ఏనుగె అంది
పులినే తానని… పొంగిన పిల్లి
కుక్కను చూసి… ఒక్కటే పరుగు
ఇది గుర్తొచ్చి…..
Happy weekend.. to all my blog visitors.
వారాంతపు.. మాసాంతపు సెలవంటా..
ఈ పిల్లి ఇంటికెళ్ళి ఆడుకుంటాదంట bye.

RTS Perm Link

One response so far

Sep 28 2012

ఉడతా!!నీకూ నాకూ తేడా…

రాములోరి వారధికి రాళ్ళెత్తిన ఉడతా
ఎందుకే నీకంత పోజు భక్తి ముసుగా! వెనకా!!
సమర్థుడు సాహసి వాడు అని నువ్వూరుకున్నావా
కోతులతో పాటూ నాకూ ఉందని తోక ఊపుతు వెళ్ళావా!!

ధర్మరాజు యాగంలోన కథలు చెప్ప వచ్చావంటా
రంతిదేవుని దాతృత్వం రంగు పూసి వల్లించావా
రాముడు నిమరిన వేళ్ళ చారలైనా వంటి మేలిమి మిసమిసైనా
నీ మూతి విరుపో, వంటి తీరునో చూపడమేలే ఆంతర్యం

పుట్టి కన్ను తెరవడానికి నీకు 40 రోజులెందుకో
నిద్రానంతర ఊర్మిళ లా రంగుతిరగడానికా!
యువరాణి లేఖ రాయలన్నా ప్రియుడు బొమ్మ గీయాలన్నా
నీ తోక పీకి వాడాలనే పితలాటకం పెట్టిందెవరో

నాజూకైన దేహం.. గుబురుబొచ్చు తోకా.. చారడీసి కళ్ళూ
ఏ సౌందర్యరాశి నీసాటి! స్వేఛ్ఛాజీవివి నీకేది పోటీ!!
నువ్వు లేని ఊరు లేదు నీ అందం చూడని కళ్ళు లేవు
చేతిలో పండో గింజో ఉంటేనే నావైపు నువ్వొస్తావా!!

ఆడపిల్లల్లా మెరిపిస్తావ్ మురిపిస్తావ్ వెక్కిరిస్తావ్
మొగపిల్లల్లా గంతులేస్తావ్ భయం వదిలి పరుగులు తీస్తావ్
ఎండకాసినా వాన వచ్చినా తోక గొడుగులో దాక్కుంటావ్
ముందు జాగ్రత్తతో ఉన్నట్టుంటావ్ పట్టుకుంటే కరుస్తావ్

ఠక్కున కనిపించి పుటుక్కున జారుకుంటావ్
మాకూ నీకూ తేడా నీ మానసిక సున్నితత్వం
పువ్వులని వాసన చూసినా తెంపకుండ వదిలేస్తావ్
నువ్ చనిపోయినా బొమ్మలానైనా పనికొస్తావ్

RTS Perm Link

3 responses so far

Sep 27 2012

తెలుగు వెలుగు మాస పత్రిక Online Flip book

ప్రవాసాంధ్ర మిత్రుల కోసం..
ఈనాడు వెబ్ సైట్ లో లభ్యం

లింక్: http://crm.eenadu.net/teluguvelugu/

తెలుగు నేల పై ఉన్న చదువరులు
బహుశా ఈపాటికే తొలి సంచిక చూసి/చదివి ఉంటారు
మలి సంచిక మార్కెట్ కి వచ్చేస్తుంది.
ఈ పుస్తకం మీరింకా కొనకపోతే ఓ చారిత్రిక మార్పు లో భాగం కానట్టే.
కావాలనుకుంటే ఈనాడు ఏజెంట్ ను అడగండి.

RTS Perm Link

2 responses so far

Sep 26 2012

పిచ్చుకా! ఓ పిచ్చుకా!!

ఎన్ని కథలు విన్నాం అన్నం ముద్దల మధ్య
వసారాలో వరికంకిలనెక్కి
ఎన్ని పెరుగన్నం ముద్దలు తినిపించావ్
కుండ మూతలో పోసిన నీళ్లు నువ్ తాగినప్పుడల్లా
కొట్టిన కేరింతల్లో పులకరింతలు

నువ్ తుర్రుమన్నప్పుడు నే కేర్ మన్నానో
నే కేర్ మన్నప్పుడు నువ్ తుర్రుమన్నావో
నువ్వెప్పుడు ఎక్కడ ఉంటావో
గాలి లేని గదుల్లో ఎలా ఎగిరావో
ఫాను కిర్రు ఆగితే కిటికీ లో నువ్వే
కుదురులేనిపిట్టా నీ పేరే తుందురు పిచ్చుక

అవసరాల వారి పొట్టిపిచ్చుకవో
ఆస్కార్‍వైల్డ్ హ్యాపీప్రిన్స్ నేస్తానివో
ఎన్నికథల్లో తిప్పావు నన్ను!! అందమైన తలపుల్లో
నువ్ కనిపించని ఆత్రానివి
ఒకటిరెండు కబుర్లు నీవి నలుగురితో చెప్పుకోనా


౧.

అనగనగా ఒక రైతిల్లు తడుస్తూ చలికాలపు రాత్రివేళ
కిటికీ లో పిచ్చుక జంటలు జడుస్తూ
జాలిగుండె రైతన్న గడ్డి పరచి మిమ్ము పిలిచి
ఎన్ని చేసినా మీరు లోపలికి రారాయే గింజలేసినా తినరాయే

ఇంతలోన వెలిగిందీ ఆలోచన తాను కూడ పక్షైతే దొరికెనా ఓ దారి అని
అర్థంకాని తనపు ఈ సందు పూడేది అయినా తెలిసింది ఓ దేవ రహస్యం
దేవుడెందుకు మానవుడై మన మధ్యకు వస్తాడో
మనిషి అర్థం మనిషిరూపంలో ఉన్నవాడికైనా తెలుస్తుందేమోయని


అనగనగా ఓ బుర్రు పిచ్చుక పడింది మనిషి ఉచ్చులో
ఏమిచేస్తాడో చేసింది వాకబు .. తిండికి సిద్ధం అన్నాడు
వేలేడు లేని పిట్టను నేను. ఆకలి తీరే తీరు లేదు
వదులితే చెబ్తా.. జీవిత సత్యాలు చేతిలో ఒకటి చెట్టున రెండు
అంటూ చెప్పింది సూత్రం ఒకటి:

మనకు నచ్చింది పోయినా
వెళ్ళిపోయినా పోనీ మర్చిపో ఏదో ఓ రోజు ప్రతీదీ పోయేదే
మరి వదలడా అంత చెప్పాకా!! మంచి మాట ఒక బ్రతుకు విలువ
ఎగిరి పిట్ట అరిచింది అసాధ్యపు పనులౌతాయన్న అసత్యాన్ని నమ్మకు..
చెట్టుమీద వాలి అంది నను చంపితే దొరికేది మణుగుడు బంగారం కడుపులో మరి
నిరాశతో అడిగాడు మూడో సూత్రం ముందు చెప్పమని..

కిచ కిచలాడిన పిచ్చుక ఇప్పుడు దెప్పింది
మొదటి రెండూ మరచినోడికి
మూడోది ఎలా ఉపయోగమని!!
పిడికెడు లేని పిట్టపొట్టలో
మణుగుడు పుత్తడి ఉండేదెలా??
చేతిలో లేని పిట్ట ఎక్కడుంటే ఏం!!
పోతే పోనీ.. మనదేదీ పోలేదుగా!!

3
మూడోదీ చదవడమెందుకు!!
యూ ట్యూబ్ లో చూస్తే పోలా!!

RTS Perm Link

6 responses so far

Sep 25 2012

నల్కిస్ నల్కిస్ నాపేరు రాందాస్

నలికిరప్ప నలికిరప్ప
నావైపు రాకు.. నా పేరు.. నాగప్ప
నల్కిస్ నల్కిస్ నాపేరు రాందాస్
నన్ను చూడమాకు నావైపు రాకు ..
నువ్ మాచే పాడించిన పాట కదా!

గుంటూరైనా.. గురజాలైనా కనిపించేవు ఆనాడు.
గుడుగుడు కుంచం లా తలపుల్లోనేమిగిలావు
నువ్వూదితే బిందెడుపాలు తాగాలనడము ఆ నాటి మాకవిత్వం కాదా!

తెలంగాణా లో పాలబిందె నడుకుడి పింజ రాయల సీమ లో నలికిరచ్చ
పల్నాడులో నల్కీస్ ఉత్తరాంధ్ర లో బిందె పాము ఎన్ని పేర్లున్నాయ్ నీకు నలికిరి పామూ
కనిపిస్తే పారిపోయే నీకు మేమేమి చేసాము? కనపడకుండా పోయావు!!

ఏ ముంగీస తినేసిందో.. మా తలపులని..
ఉడతా, పిచ్చుకలతో పాటు కనుపరుగైపోయావు..
జీవ వైవిధ్య సదస్సుల్లో కనీస బొమ్మగా గుర్తొస్తావా!
మా చిన్నారి తరానికి అందమైనా జుగుప్సగానైనా తలపిస్తావా!!

RTS Perm Link

2 responses so far

Sep 22 2012

హాయి చెయ్యి

(పాత పోస్టే.. కానీ shakehand ఎన్నిసార్లు ఇచ్చినా తప్పు కాదుగా:)

మనోడికి మంచిరోజులోచ్చినా
పొరుగువాడు పొరపాటుగా ఏదైనా పోగొట్టుకున్నా
ఇంటికొచ్చినవాడు.. ఓటు కావాలన్నా నోటు కావాలన్నా
మన పిల్లవాడు బాగుండాలని మనసనుకున్నా
గుప్పెడంత మనసు గుప్పెట్లోకి వస్తుంది.
మూసిన వేళ్లు తెరిచేటట్టు నెత్తురు పోటెత్తుతుంది.

అభిమానం అవసరం నాడిని ఆడిస్తాయి.
అసంకల్పితంగా మన చేతిని ముందుకు చాస్తాం
ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటాం
దాన్నే కరచాలనం అంటాం.

చేయి చేయి కలపడం చిన్న పనేం కాదు
ఎదుటి మనిషి ఎవరైనా ఎంతటివారైనా
హాయినవ్వు రువ్వుతూ పెదవి పేరు పలుకుతూ
కన్ను కన్ను కలుపుతూ మనసు ముందుకు ఉరకాలి

కరచాలన అంతరార్ధం సామజిక సమరసత

ఇలా అనుకున్నామని అంతా గొప్పగా ఉంటే ..మంచిదే
చేయ్యివ్వడం అంటే మాట తప్పడమన్న అర్ధమూ ఉంది
లోకం పోకడలో చెయ్యాడింపుల ఉపయోగం చిలవలు పలవలు
మంచి చెడులు రెండూ ఉంటాయి వాడుకలో వలువంత అవసరం విలువలు

నిలబడలేనప్పుడు నిలకడలేనప్పుడూ ఊరికే touch లోకి వచ్చేయకు

ఇచ్చేవాడి గౌరవాన్ని పెంచేలా ఉండాలి అందుకునే చేయి
ఆ సందర్భంలో ఇద్దరూ సమానమనే ఒప్పంద పత్రం నీ ముంజేయి
పోటీ పనుల్లో పనిపోటీల్లో క్రీడాస్పూర్తిని తెలియజేయి
విశ్వమానవ స్నేహసంకేతం ఈ కరచాలనం

చెప్పేయ్ నాకు నీ చేత్తో వెళ్ళక తప్పదని
మునుపు ఇచ్చిందే తెచ్చి బదులిచ్చానని
అద్దంలో మనిషిలా నువ్వు నేను, నేను నువ్వు అయ్యేపని
చేయిచాచి ఇవ్వజూపి మనసు కలిపే పని హాయిగొలిపే పని

పలుకరింత, పలువరింత;వీడుకోలు, వేడుకోలు
అభినందన, అభిశంసన ; సమర్ధన, సముద్ధరణ
సందర్భాలు సవాలక్ష అన్నిటికీ ఒకే లెక్క
చేయి చేయి కలుపు అదే నీ గెలుపు

నువ్వేం చెయ్యగలవో అదే చేయి నీ చెయ్యి ప్రేమగా నాకు ఇచ్చేయ్

వేయి మాటలు చెప్పలేనిది చేతి చనువు చెబుతుంది
వందమంది చూపలేనిది చేతి అరలో దాగుంది
పెదవి పెగలనివ్వనిది గుప్పెట గుడిలో ఉంది
కంటి చూపు లేకున్నా శాంతి కాంతి పంచుతుంది

ఎదురెదురు మనసులు మధ్య సందిగ్ధతలు ఎన్నున్నా
స్పర్సతో నిస్త్రాణ నడుం విరిగి, శక్తి మార్పిడి అవుతుంది
తొలకరి చినుకుల వలపులలో ఆమని చిగురించినట్టు
ఏనాడో ఇంకిన జల పైకి ఉబికి వచ్చినట్టు

చేయి చేయి కలపడమంటే ఏకత్వం ఐక్యమత్యం కావడం

కవళిక చెప్పని కథలన్నీ చేయితాకి చెబుతుంది
ఇచ్చే తీరునిబట్టీ మనిషి జోరును పట్టీ
గట్టిగా ఇస్తే బండోడని వదలకపోతే మొండోడని
వేళ్లను మాత్రం అందిస్తే భద్రతలేమి అని ‘చచ్చిన చేప‘ చేతి స్పర్శకు చేవలేదని

ఇలా పలురకాలు కరచాలనం ఇంద్రధనసు రంగుల్లా

ఆత్మీయ కరచాలనం అన్నింట్లో అదే రాజు
అందుకున్నా పొందినా పొంగిపోరలేది ఆనందం
చేయి పట్టి నొక్కగానే నాలుక సన్నాయిరాగం పలుకుతుంది
స్పర్శ విద్యుత్తై తాకి వెచ్చదనం ఒళ్ళంతా పాకుతుంది

ఎన్నేళ్ళు గడిచినా వేళ్లతడి స్మృతి సంగీతమై మోగుతుంది
తీయటి తలుపుల్లో తనువు తీగల్లె ఊగుతుంది

అందుకునే ఆప్తునికి ఆస్వాదన స్వానుభవం
తడి ఉంటేనే ఈ యోగం ఎవరికైనా సంభవం

RTS Perm Link

5 responses so far

Sep 21 2012

ఆధునిక స్వేచ్చ

నీకు నచ్చింది చేయడమంటే.. విప్పుకు తిరగడమా!
వచ్చింది చెప్పమంటే.. తలపుల్లో తప్పుల చిట్టా అప్పచెప్పడమా!!

మూలాలు మరచిన మూర్ఖత్వం ఇప్పుడో నాగరికత
కాలాలు మారినా మారని క్రౌర్యం ఈనాటి ఆధునికత

ప్రకృతి ఆరాధన ఇప్పుడో అపవిత్రం
సున్నిత మనస్థత్వం ఓ స్మృతి శకలం
ప్రతీకల్లో కవినీ, కవితలనీ వెతుక్కోవడం గగన సదృశం

అభివ్యక్తి, ఆడతనం నలిగిన రోజుల్లో
అవ్యక్తవేదనా అంతర్మధనం మొరటు శృంగారం

కట్టుబాట్లను తెంచేది కవిత్వమన్న భ్రాంతి ప్లేటో కాలానిది
భావోద్వేగ బంధనాల నుండి బయల్పడడమే ఇప్పటి వ్యక్తీకరణ

భాషను కాదు.. మనసును సంస్కరించుకోవాలి
మనిషితనాన్ని మనమధ్య మిగుల్చు కోవాలి.
తడితనం ఆవిరయ్యాకా మిగిలేది..
విశ్వమంతా.. స్వేచ్చే..
పొడారిన శూన్యమే

RTS Perm Link

2 responses so far

Sep 18 2012

హుస్సేన్ సాగర్ర్.. ఓ చెత్త కందకం ఓ పిచ్చి దండకం

శ్రీమన్మహారాజ విఘ్నేశ్వరా నిన్ను ఈరీతి పూజింప ఓ రోజు ఉంటుందనీ.. నాకెపుడు ఊహన్ కూడ ఆలోచన లేదు కానీ రేపు నీదు బర్తడే అని అందరున్ చేస్తున్న హడావిడిన్ నే చూస్తున్న.. నిన్నున్ పెద్ద పెద్ద రూపాలలో విగ్రహాలన్ ఏర్పాటు చేసి లారీలు ఆటోల కెక్కించి రోడ్డుపై తారాడు బుడతలన్ పెద్దలన్ చూసి, నీపై రాయాలని బుద్దిపుట్టి చందస్సు లేకుండా రాసేటి ఈ పిచ్చిరాతను భక్త్తితో వినమని కోరెదన్ హలో వినాయకా.. ఓ పెద్ద బొజ్జయ్యా ఓ సున్నపు ముద్దయ్య ప్రకృతిన్ పాడు సేయ నీ బొమ్మ చేశాము, గొప్ప రంగు లేశాము జై జై వినాయకా జై జై గణేశ జై జై గణపతి అని ఎంత పొగడినన్ వేడినన్ ఈ లోకంబునందు నీవు చేయ మిగిలున్న పనుల్లో ఉన్నట్టు ఉందిగా హుస్సేను సాగరును అందులో నీటిని బాగు చేయడం తీరిగ్గ నీ తలను ఆంచీ, నీ కాళ్ళను ఒళ్ళును బొజ్జనూ ముంచిఉన్న నిను గాంచితిన్ ఒక్క లడ్డును తప్ప నీవు ముల్గంగ చూసినా చేసినా పుణ్యమటుంచు పర్లేదు గానీ నీ తోటి హుస్సేను సాగరున నీటి లో పొరపాట్న కాలుగాని పెడ్తినా వచ్చుదురదలన్ పోగొట్ట నా డబ్బులున్ చాలక ఉన్న జబ్బును పోగొట్టుకోలేక నిను వేడ వచ్చితిన్ నా కాలు గోకినన్ తిక్క తీర తొక్కూడి బొబ్బొచ్చి పుండై నా కాలు నాది కానటుల అనిపించి న పరిస్థితిన్ పక్కనన్ పెడితేన్, నిన్నూహించ నవ్వొచ్చెనాకున్ చేతులేమాత్రం ఖాళీగ లేకుండ నిన్నటుల వీక్షించి నా స్థితియే బాగని భావించి నువ్వెటుల గోక్కుందువో నీ కష్టముల్ తీర్చ కైలాస వైద్యుడెవ్వడని చింతించ తలచితిన్ చూచితిన్ ధన్వంతరిన్ నీదు పూజలో నీ భక్తిలో వైద్యార్థివై నీరాకన్ కానక నీదురదన్ నేరక నీకొక్క టెంకాయనున్ కొట్టి ఉండ్రాళ్ళను పెట్టి ఊహలో సంతోషితం చేసి పరివారమున్, పిల్లలున్ బంధు మిత్రులన్ కూడియుండగా నీ వళ్ళు మండి నీ దురదన్ పెరిగి నీ చేత దంతంబు చే గోక చూడగా ఇదియేదో బాగున్నదనిపించి నువ్ చేతలున్ పెంచగా నీ పెయ్య పై పడ్డ గీతలున్ నామాలు గా మారి నీ తండ్రి సంతసాన నీ బాధ ఉపశమన మంత్రంబు బోధించి శివుడున్ నీ మొరాలకించినట్లుగా చేయ మాకేది దిక్కు మరి అని అడిగెద నిను ఓ వినాయకా దయతో మము మార్చు.. వచ్చే యేడాది కైనా మేమంతా రంగులన్ మాని అంత పెద్దగా అందునా సాగరునన్ ముంచక నువ్ మట్టివై, చిట్టివై ఆకులో చేతిలో చేరునటుల నీ సైజు తగ్గించి చేయునట్టూ దీవించవయ్యా మహానుభావా పెరటిలో నుయ్యి లో లేద మంచినీటి కుండలో నిను కలిపి నీ ఇంటికిన్ పంపెదన్ ఈ జన్మకూ ఏ జన్మకూ సాగరు జల సుద్ది నీవల్లను, నీ బాబు వల్లను, మా దొరలవల్లనూ కాదన్నదీ నిశ్చయం. ఈ మురికి గాలుల్లో ఈ కుళ్ళు నీళ్లోల్లో తిరిగేటి ఖర్మ నీకు తప్పాలనీ ఓ తండ్రీ! మాకు తప్పని పని యని అనుకుంటూ.. నీకు నమస్తే.. నమస్తే నమస్తే నమః

RTS Perm Link

4 responses so far

Sep 15 2012

ఓ కల జారిపోయింది

ఆకాశం కాన్వాస్ పై
కాలం కుంచె నేల ముంచి జార్చిన చుక్కలా
సుమనోభిరామం గా పెరిగే పచ్చదనాల చెట్టుండేది
అది ఓ రాత్రి వేళ కలల్లోంచి జారిపోయింది.

గుండె పగిలిన చప్పుళ్ళు తోటంతా..
పూలూ, పళ్లూ చివుర్లూ చెట్టు నాశ్రయించిన పక్షులూ
మొదలు కుదేలైన వేళ్లూ బొట్టు బొట్టూ రాల్చాయి.

తరలి వచ్చిన గూటి పక్షుల బిక్క చూపులు
నేల వాలి తోట గుండెను చూసేటి తోటి మొక్కలు
తవ్వి తీసినట్టు ఉబికి వచ్చే కన్నీటి చుక్కలు

ఇప్పుడిక కిలకిలలు లేవు మౌన రోదనలు తప్ప
అకాల వానకి కొమ్మారెమ్మా విలవిల లాడాయి.
పట్టపగలు చీకట్లు పరచుకున్నాయి ఆకాశం చెమ్మగిల్లింది

నింగిని నేలను కుదిపే ఓ పిడుగుపాటు
ఎప్పుడు రాలిందో ఉల్క చెట్టుని ఎందుకు తాకిందో
బెరడు లాంటి నిబ్బరంతో కాలం ఎలా ఓర్చిందో

నిలబడ్డ నేల నుండి నింగివైపు చూస్తూ
నీడనిచ్చి తోడునిచ్చే పచ్చదనం ఒకనాటి వేడుక
ఇప్పుడది మిగిలింది కన్నీటి జాడగా

జీవితాన్ని కదిలే బొమ్మల్లా అందించే కథ ముగిసింది
వెలుగునీడల తోడుగా ఆడే ఆట కలలా చెదిరింది
పోతపోసిన తెలుగు పాట పల్లవంతో ఆగింది

ఆ చెట్టే ఓ చిత్తరువై జ్ఞాపకం గా మిగిలాక
ప్రతి మొక్కా చెట్టై ఎదగటమే
ఆశయాల అంచులు దాటే పచ్చదనాన్ని
తెలుగు తోటలో పెంపొందించడమే
ఆకాశం ఆశించే అందమైన నివాళి

RTS Perm Link

8 responses so far

Sep 13 2012

మనకు కనిపించే.. వాటిలో

కొన్ని మెరుస్తుంటాయ్
కొన్ని మురిపిస్తుంటాయ్
కొన్ని మాట్లాడిస్తాయ్..
ఆడిస్తాయ్.. పోట్లాడిస్తాయ్

చూపుల్ని లాక్కుని దోచుకునేవి..
పెదాల్ని.. ముక్కుపుటాల్నీ తెరిపించి మనలో దాక్కునేవి
మెలకువలో తారాడేవి.. ధ్యానం లో వెంటాడేవి కొన్నుంటాయ్
బహుశా అన్నీ ఒకేలా పుట్టిఉంటాయ్

ఎందుకిలా అని కారణాలు కొన్నింటికి తట్టీ ఉంటాయ్
కొన్నైనా అందుకోవాలని నడుంకట్టిఉంటాయ్
ఒక్కటై వెలగాలని పట్టుబట్టిఉంటాయ్
అందుకే నలుగురితో జట్టు కట్టి ఉంటాయ్

పుట్టిన ప్రతివాడూ ప్రతీకే పై వాడికి
మనిషిని కనడానికి కాదు.. మంచిదనం కొలవడానికి
తన మానాన తాను తయారు చెయ్యడానికి యంత్రంకాదుగా వాడు
అందుకే కుంచె రంగుల్ని చిలకరించినట్టు..
అసలు బొమ్మలే రానట్టు.. వచ్చినా సరిగా దిద్దనట్టూ ..
ఏదో బెట్టు చేసినట్టూ చేస్తుంటాడు.
కొన్ని నవ్వుతున్నట్టూ,
కొన్నిటిపై నవ్వాలి మరి తప్పదని రాసి ఉన్నట్టూ
నవ్విస్తున్నట్టూ కవ్విస్తున్నట్టూ.. చేసి చూపిస్తాడు.

అసలా మాయలోడు ఏం ఆశిస్తాడు!
ఏం ఆశించి మనల్ని ఆడిస్తాడు!
కొన్ని నవ్వుల్ని రువ్వి కవ్వించి మరీ ఏడిపిస్తాడు
కొందరిపై సానపట్టి మెరిపింపజేస్తాడు!

మరికొందరిని తొందరలో ఉన్నట్టు తరిమేస్తాడు
అందరినీ కట్టగట్టినట్టు కనిపిస్తాడు
విడివిడిగా లెక్కగట్టి ఆటలన్ని కట్టిస్తాడు
అందని ఊహల్లో అందర్నీ చుట్టేస్తాడు.

RTS Perm Link

3 responses so far

Sep 11 2012

ఆమె నా …….

నే పుట్టినప్పుడే.. ఆమెకు పాతికేళ్ళు వచ్చాయి
మేము మేమే కానీ మేమిరువురమూ ఒక్కరమే
నా ఏడుపు ఘోష వేరు.. ఆమె లాలించే భాష వేరు
నేను నేర్చిందేం లేకున్నా.. నేర్పిస్తూ అలవలేదు ఆమెన్నడూ

నే నేడిచినా, పక్క తడిపినా మాయమయ్యేవి ఆ రూపాలు
అవి నా చుట్టూ నించొన్న బుగ్గల్లాగే భూతాలు
పరిగెత్తుకొచ్చి.. పొదవిపట్టే లాలన గా ఆమె
ఆ చేతుల్లో వొదినపుడు ఒప్పులకుప్పను నేనే

చీకడం నడవడం నేర్చానేనపుడు
ఆమె తో అనుబంధపు వయసు రెండేళ్ళూ
ఒకరికొకరం అర్థమవుతున్న తరుణంలో
నేనే ఆమె సర్వస్వం..
ఆమెకు ఇంకేం అక్కర్లే లోకంలో

నడవబోతూ పడిపోతున్నా మరి
తెలిసిందిగా తన నాతోనే ఉందని
తగిలేదెబ్బల భయం లేదిక
మామాటలే ఒకరిదొకరికి అలవాటు కాలేదింకా
అవసరాలు మాత్రం అవగతమౌతున్నాయ్.

ఇప్పుడేమో నేనింక పక్షిలాగ తిరగగలను
రెండు దాటి మూడొచ్చిమాటలొచ్చి ఆటలొచ్చి
బడిఅనే కొత్తలోకపు చదువుల జీవితం నన్ను మార్చి

తయారుచేసేది నన్ను పాలనురుగు తార లాగ
వచ్చాకా బడినుండి గంటైనా ఉతకాలి చాకి మురికి వదిలేలా
వళ్ళంతా తోమి నిమిరి దెబ్బ కట్టు కట్టాలి
ఆమె నాకు రేవు తీరం నేనేమో నావ చుక్కాని

నాకింకా గుర్తే నాలుగేళ్ళ వయసప్పుడు
ఎవరి చొక్కా చించానో ఇంటి మీద గొడవకొస్తే మాట ఎవరు పడ్డారో
ఆటల్లో ఆలస్యం ఇంటి బాట నడచినప్పుడు
ఎదురుచూపు గుమ్మానిది బెదురు చుపు ఆమెది.

కళ్ళారా కానరాగా చేతుల్లో చేరగా
అందించిన కౌగిలింత నేను గాల్లోకి తేలినంత

కలిసి చేసిన గైహికాల్లో, ఆటల్లో చెదిరిన ఇంటిపనిలో
చెరగని చిరునవ్వు వెనక అబద్దాల అలక వెనుక
రెట్టించిన శ్రమ తనది కొలవలేనితనం నాది

కాలంతో పాటు కౌమారం కరిగింది
ఆమేంచెప్పినా వినని అహం కలిగింది
అనుబంధాల ఉన్నతి కానని అల్పత్వం పెరిగింది

గడచిన కొద్దీ ఆమె వడిలింది నా ఈడు మరి వంగనంది
నా మంచే ఆశించి చదవమనేది చెంత చేరి
పెడచెవిన పెట్టా అప్పుడు మరెందరో ఆమెలు నాతో

అందులోన ఒకరిని కోరుకున్నా తోడుగా
మమత లేని లోకంలో నా తలపులు వలపులు
మారిపొయా మరికాస్త ఆమె నేర్పని విద్యలతో

హత్తుకోవాలని ఆమెఆశ తప్పుకుతిరగాలని నేచూశా
చూశా ఆమెను చీదరగా హేయం గా
ఎప్పటిలా ఎదురుచూపుతో ఆమె గుమ్మం లో ఆత్రంగా

ఇంటిపట్టు ఉండకుండా చిల్లరగా తిరుగుతుంటే
తిట్టాలని తనకున్నా ఒక్క మాట అనలేదు
ఎప్పటికైనా మారక పోడను ఆశ తనకు చావలేదు

నాకేమి లెక్కతనం! ఎపుడో నేనెదిగిపోయా
నాది కాని లోకంలో నేనేమో ఒదిగిపోయా
నాకూ తనకీ నడుమ ఒరుసుకునే ఓ నది ఉంది
వదిలేశా ఆమెనిపుడు ఎదిగేందుకు నాకొక పని ఉంది.

చిన్నగా నేనున్నప్పుడు తన ఆహమహమిక చంపుకుంది
పట్టింపులు లేవునాకు నా లక్ష్యం నాకుంది
ఊరు నాది మారింది నేను తనతో ఉండరాక
ముసలిదైన మనిషి మీద ఆణుమాత్రం జాలిలేదు

నా అవసరమిపుడే తనకున్నా నే దొరకనంత దూరాన
వెలకట్టే అంగడి వేలంపాటలో పడివున్న చెడ్డవాడ్ని
ఒకటో రెండో ఏళ్ళల్లో ఒకటి రెండయ్యే ఇంటివాడ్ని
అప్పుడేమీ ఉండదుగా ఈ మాత్రపు ఝంఝాటం

నేనేమో కొడుకుని ఆమె నా కన్నతల్లి

RTS Perm Link

8 responses so far

Sep 10 2012

పేపర్లో చావు వార్త చదవాలని లేదు

Published by under గజల్

గజల్..

పేపర్లో చావువార్త చదవాలని లేదు
(నిద్ర) లేస్తూనే నిట్టూర్పుల జట్టు కట్టాలని లేదు

ఉన్మాదం ఉద్రేకం నైరాశ్యం నీడలోన
రేపటి రోజుల వెలుగుని వీడాలని లేదు

చిక్కబెట్టు మనసుని, చెదిరితే చావే సాంత్వనా?
జగతి ముందు యువతని బేజారుగ చూడాలనిలేదు

పంచుకున్న ప్రేమల్లో, ఎంచుకున్న చదువుల్లో చెలికాడా!!
ఆటనాపి మడమతిప్పు తలపుల తనువులను తడమాలని లేదు

కారకాలు కోరికలు తీరనివి ఎన్నున్నా
తిరిగిరాని తీరాలకు తరలి పోవాలనిలేదు లేదు!

వొప్పుకోకు ఓటమినీ నీ బాట ఎలా అవుతుందది?
పడిన చోటే జారుకుంటూ నిలవాలని లేదు

జీవితం పాలపొంగు.. నీతో నిలచిన వారే నీ ఆస్తి
నింగితాకు జువ్వలాగ ఎగిరి నేల వాలాలని లేదు

ఎందుకు సతీశ్ నీకు ఎగసే కెరటం తీరుగ
పడిపోయినా చెడిపోయినా వీడిపోవాలని లేదు?

పేపర్లో చావువార్త చదవాలని లేదు
శోకంలో నేడువున్నా.. రేపురోజు వెలుతురును వదలాలని లేదు

పేపర్లో చావువార్త చదవాలని లేదు

RTS Perm Link

2 responses so far

Sep 07 2012

సైదుబాబూ! ప్రేమకు మచ్చ నీ ఊసు

ఏడుపొస్తుంది సైదుబాబూ!
నీ చావు తెలివితేటలకి.. బతకటం నేరవా!
బలవంతపు చావులోన నీవలపు బలిపశువా!!

ఆరు సెప్టెంబరు పేపరులో శివకాశీ చావుల హోరు.
రక్షించబోయి ఆర్తుల్ని.. చనిపోయారట పాపం తెగువచూపి కొందరు.
చావంటే అదిరా…

భగవంతుడి కొలువులోన.. ఛ ఛ.. రాలేనివాడి మాటెందుకు!!
మనుషులనే జాతిలోన దయాళువుకే విలువరా.

నిర్దయుడా! ప్రేమంటే ఏమిటో..
దారులు వేరై విడివడినా.. కలసిమోగే గుండెల సమశ్రుతి నడుగు
ఎదురీతలో తడబడినా బతుకు నావ నడిపించే విడిజంటలనడుగు

ప్రేమంటే ఏమిటో..
చితిమంటల నివురుకింద దేవులాడ దొరికిన అస్థిక
చేరినచేతిలో చిందిన కన్నీటి గంగ నడుగు

పగతోడుగా నువు చిదిమితే దీపం ఆరిన ఇంటిలో..
నువు గుచ్చిన గునపం..అది చీల్చిన కడుపున సుళ్ళుతిరిగే వేదన
కారుణ్యం నేర్పలేని నీ చదువెందుకు చావెందుకు

నువు చేసిన దారుణానికి ప్రేమకాదు కారణం
ప్రేమిస్తే.. మనసిస్తాం జీవిస్తాం .. మనిషిగ చస్తాం

ప్రేమంటే..
తనకు తానుగా జీవితానికి అర్పించే నివేదన
బతుకు బాట్ల పంచుకునే ఆవేదన
మనిషితనాన్ని ప్రోదిచేసే అత్మశోధన
బతికి బ్రతికించుకోవడానికై సాధన
పూసే పువ్వులో, విరిసే నవ్వులో
జీవన సౌందర్యాన్ని దర్శించే ఆరాధన

అనుకున్నవన్నీ జరిగితే అది జీవితమే కాదు.
ప్రేమించే మనసుంటే అలోచనలు అణ్వాయుధాలు గా ఎన్నటికీ మారవు.
ఆమాత్రం తెలుసుంటే..ఇన్ని గుండెలవిసేవి కావు
మాయదారి కసి ముసుగా! ప్రేమకు మచ్చ నీ ఊసు
అది సాటి మనిషి నమ్మకాన్ని కాల్చే కార్చిచ్చు

http://telugu.webdunia.com/newsworld/news/apnews/1209/06/1120906026_1.htm

RTS Perm Link

3 responses so far

Sep 04 2012

నువ్వే.. నాగురువంటే..

నువ్వే.. నాగురువంటే.. కోసి ఇమ్మని అన్నాడంట వేలు..
ఈ కాలం లో ఎవడైనా వింటాడా!!
నా వేలు నీకిస్తాను, చేయిపట్టు అంటాడా!!
వినడం ఎందుకు!!.. జీవితకాల వేదనకా!!

గురువంటే.. చెప్పొచ్చు మంచిగా ఎన్నైనా
మరి అడగొచ్చా ఎదురేదైనా.. అని అడిగారా ఎవరైనా!!
ఏకలవ్యుడి నుండి కాసబియాంకా వరకూ..
విని చెడిపోయిన వారే తడవ తడవకూ

శిష్య లక్షణం అనన్య సాధ్యత్వమే గానీ అంగుష్ట సమర్పయామి కాదే..
కావల్సింది పొందటం కాక వీడనిది కోసి ఇవ్వడం ఎలా ఒప్పు!!
ఆర్తి, అద్యవసాయం ఉన్నవాడెవ్వడూ తనకొమ్మ తాను నరుక్కోడు
గట్టిపూనిక ఉన్నవానికి ధ్యాస, శ్వాస విద్య మీద కాక గురువు మీదా!!

అసలు విషయం అదికాదు..నేర్చేవాడికి ఉండాలి బాగుపడే అలవాటు
విద్యనేర్పెదెవరైనా అందుకో ఆదరంగా; శత్ర్రు శిక్షకుడి పై నీకెలా గురి!!
అసూయాగ్రస్తుడి శిక్షణ అనసూయగ మారుస్తుందా!
ఉపదేశం పొందలేక వేలిస్తే.. పడిన కష్టం తిరిగి వస్తుందా!!

వంచలేక విరిచే గురువులు ఈనాడూ కొదవ కాదు
కళ్ళు తెరచి చడవడం రావాలి పుస్తకాల్ని కాదు మనుషుల్ని
బాధల్ని చూడగల్గడం ఎదురొడ్దడం కావాలి
దార్శనికతతో ఉత్తేజితం అవ్వడం తెలియాలి

నానావిధ చరాచరాల సంబంధాలను చూడగల్గాలి
హాని చేసుకోకతప్పనప్పుడు అతితక్కువ తప్పుల దారిలో నడవాలి
ప్రశ్న అడగడం రాని శిష్యుడు వేలేం ఖర్మ తలెవరిదైనా కోసేస్తాడు
లోకమర్యాదకు తలవంచేవాడు ఇంతకన్నా ఏంచేస్తాడు!!

త్యాగధనుల జాబితాలో పేరుకోసం ప్రాకులాట తప్ప
మట్టిలోన కలసిన మనస్సాక్షులు కధల్లోనే గొప్ప.

RTS Perm Link

7 responses so far

RTSMirror Powered by JalleDa