Aug
29
2012

బాల భానుని లేత కిరణం దేహానికి వెచ్చదనాన్ని ఇచ్చి
మనసును తాకక పోతే అది వేకువ కాదు.
చీకటి పరచిన దుప్పటి మెలకువ తో తొలగినంతనే
నిద్రా లోకపు విహారాలకి ముగింపు కాదు.
రోజంటే పగలూ రాత్రి కలయిక కాదు
బ్రతుకంటే గుదిగుచ్చిన రోజుల పనుల చిట్టా కారాదు.
ప్రభాతపు తొలి వీక్షణం లోంచే కలలు
వెలుగు రేకల్ని ముద్దాడాలి
రాత్రైనా, పగలైనా కలల్ని వెలిగించుకోవడం
నింగికీ, నేలకు నడుమ మేఘం లా
నిప్పునీ, నీరునీ గాలితో కౌగలించుకోవడం.
కాలం తో కరిగిపోయేవరకూ కదిలిపోవడం.
ఏదైనా ఒక రోజు మెరుపు మెరుస్తుంది.
పిడుగులు కురుస్తాయి జీవితం తడుస్తుంది
వడగాలై దెబ్బకు విసిరేస్తుంది
ఓ అవకాశం అందలమెక్కిస్తుంది.
ఒక ఆశని లోకం జారవిడుస్తుంది.
నిన్ను ఈ ప్రపంచం ఏమారుస్తుంది
ఒక్క క్షణం ఆగామా!!
నిరాశల నిట్టూర్పుల లోగిలి లో
నీ బతుకు నడి సంద్రపు లోతుని కొలిపిస్తుంది
ఎదురీతకు సిద్ధపడితే
విస్తరించిన సాగరాన్ని చీల్చుకుంటూ
వడివడిగా సాగే ఓడను తలపిస్తుంది.
RTS Perm Link
Aug
26
2012

పేగు బంధాలు ఊళ్లేలుతున్నాయి.
రెక్కలొచ్చిన పిల్లలు పల్లె వదిలారో.. ఇల్లేవదిలారో..
కొద్దిగా ఎదిగి పోయారు
ఉన్నారన్న మాటకి పడుకునే ముందు ఫోను మోగుతుంది..
అమ్మా!.. తిన్నావా అంటూ..
మాటల్లో మనుమల ముచ్చట్లు..
ఆత్రం కొద్దీ వినేది ఉండదు..
అలా పెంచమనీ, ఇలా చదివించమనీ..
ఇప్పుడు విసుక్కోవడం తన పిల్లల వంతు
పాపం.. ~అమ్మ కేమీ తెలియదు~.
ఈ వాదనకు తర్వాత మరో-సగం బలం చేకూరుతుంది
అసలు చురకలు అంటిస్తే
వడ్డీ ముద్దు మాటలు వెన్న పూస్తాయి.
ఐనా కొమ్మల్లో కోకిలల్లా వినిపించే సంగీతమేగా వంశాంకుర రాగాలు
ఊహల్లో తప్ప కంటికి దొరకరు
వసంతం వేసవి సెలవుల్లో వస్తుందని తెలుసు
తోటా- దొడ్డీ ఆ రోజుల కోసమే పూసినా.. కాసినా..
ఊసుపోని పునికింతాలు నెలల ముందే మొదలౌతాయి
ఇంతకాలం కాయలు కాచిన కళ్ళు – చేతులూ
చెట్లకు కాయిస్తాయి.. పూలు పూయిస్తాయి
అరిగిన మోకాళ్ల మధ్య – తిరగలీ తిరుగుతుంది
నలిగిన వేళ్ళ మధ్య కవ్వం చిలుకుతుంది. వెన్న కాగి నెయ్యవుతుంది
వెన్నుఅరిగితేనే సున్నుండలు చిమ్మిలి బలమౌతాయి.
అమ్మ ప్రేమని పిల్లలు పంచుకుంటారు..
ఎవరమ్మమాట వారి పిల్లలే వింటారు.
ముసలి వాసనలకు మనుమలు మాత్రం దూరంగా ఉంటారు.
కడుక్కోవడం వచ్చేసింది కదా.. బుగ్గల్ని కూడా. అవసరాలు మారాయి
కాలం కదిలినట్టుండదు. కన్నుల పండువ కరిగి పోతుంది.
బతుకు నావ లంగరు ఎత్తే వేళ తల్లితీరం పోటెత్తుతుంది
వ్యాపార పవనాలు బంధాల్ని ముందుకి లాగుతాయి. వసంతం పారి పోతుంది.
శిశిర జీవితాల్లో మిగిలేవి ఎదురు చూపులే!!
బిడ్డలు రత్న మాణిక్యాలు ఫోను పలకరింపులు మాత్రం ఉద్యోగాల్లా చేస్తారు.
చిన్నికృష్ణులతో అప్పుడప్పుడు మాట్లాడిస్తారు..
అమ్మమ్మలు యశోదల్లా, నానమ్మలు రాధికల్లా ఆరాధనలో గడిపేస్తారు
మనసు లేని బొమ్మరాళ్ళు
వారి జీవితం లోంచే ముందుకు చూస్తారు.
RTS Perm Link
Aug
24
2012

ఏదో కారణం.. పుట్టాం.
ఏనాటి రుణమో.. మనడానికీ, బాగున్నామనడానికి
ఎవరికోసమో.. ఎందుకోసమో జీవిస్తాం.. తపిస్తాం
గతుకుల బండి లాగిస్తాం. . నెట్టుకొస్తాం.
కారణం తెలుసుకోవాలనే కోరిక..
దీనివెనుక ఎవరున్నారు!!
కళ్ళు- కాళ్ళు లేని పిల్లల్ని, ఎదిగీ ఎదగని పసి మొగ్గల్నీ
ఈ జగం లోకి ఎవరు రప్పిస్తారు?
ఆట అపేసి పైకో-కిందకో ఎందుకు తోస్తారు!
ఎన్నో అవస్థలతో తెరల్ని ఎందుకు దించేస్తారు?
నేల ఈనినట్టు జనం, నిస్సత్తువతో ముప్పాతిక
రోగం రొస్టులతోమువ్వీసం ముప్పాతిక
వేగలేక ఆగలేని లెక్కలు ఉన్నన్నీ ఉండనీ
ఎన్ని మాట్లు అదరలేదు భూమి!!
కోట్ల కలలు నడినిద్దురలో కి జార్చిందెవరు!!
ఉసురు తీసిన వరద; గుండెల వెతలెన్ని!!
దారి మళ్ళింపుల్లో మలుపుల్లో రాలిందెందరు!
రైలు మంటల్లో ఎందుకు కాలాలి! ఆయిల్ రిగ్గో, కారో ఎందుకు పేలాలి!
బాధ, హింస, అతివాదం, ప్రమాదం,
పశుత్వం, విధ్వంసం , పక్కవాడి నిర్లక్ష్యం
కారణాలు బైటవైనప్పుడు కాలంచెల్లడం సహజన్యాయమా?
నిప్పుకాలుస్తుందనీ, నీరు ముంచేస్తుందనీ,
అపరిశుభ్రత , ఆదమరుపు కుంగదీస్తాయనీ
తెలిసి తరాలు మారినా తగ్గలేదు ఈతి బాధలు
కుప్పపోసిన తప్పిదాల మోపుని మోయలేక
ముందుతరాలకు అందివ్వ మనసు రాక.. వగస్తున్నా..
పుట్టించిన వాడినడగాలని పడిగాపులు కాస్తున్నా!
కన్నీళ్ళను కాటుకలో ముంచి రాస్తున్నా.
ఒక్కటి తప్పినా మరొకటి తప్పని
నాది కాని తప్పులవలయం లో చిక్కి చచ్చిపోతున్నా.
ఈ తెరమీదకు తెలియకూండా రోజూ వచ్చి పోతున్నా..
RTS Perm Link
Aug
21
2012

ఈ క్షణం ఇలా ఆగి పోనీ
రేగిన గాయాన్ని మాపే కాలం తో జతకట్టలేను
నన్ను తనలో పొదుగుకున్న రాత్రి కరిగిపొతున్న భయం
నీడ చూడాల్సిన వెలుగుజాడ లో నే కరగలేను
తెల్లవారితే జీవితం యాంత్రికం
నాలో నేను లేని రోజంతా పరిగెత్తలేను
నా నగ్నత్వాన్ని కప్పే నాగరికత ముసుగులో
కృత్రిమ శ్వాస తొ బతుకీడ్చలేను
ఈ క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలొ చూసుకునే అద్దం లాంటి రాత్రి
చీకటీ వాకిట్లోని మసక వెలుతురే
నీకై తపించిన నా నన్నును నాకు దూరం చేస్తుందన్న దిగులు
గతం లోతుల్లో నేను నా లానే ఉండిఉంటా
నేను నువ్వైయ్యాకా విచ్చిన వెలుగులో నన్నే నేను పోగొట్టుకున్నా.
నిశీధి పంచే చల్లదనం వలపుల వెచ్చదనాన్ని ఏమార్చనీ
నేనంటూ మిగిలుండాలన్న నీ వీడుకోలు వీలునామా
అనుక్షణం నీకై బతకాల్సిన బాధ్యత
ఎందుకింత కాంక్ష నీకు
జన్మ జన్మల బంధమా నువ్వే గెలవాలి కానీ
ఈ తిమిర సమరం లో ఈ ఒక్క క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలో నిలిచి పోనీ
RTS Perm Link
Aug
18
2012

ఎపుడో ఒకమాటు వస్తుందో మంచి మాట
స్వచ్చమైన తలపుల్లో..
స్మరించే మాటల్లో ఒకానోక మంచి
అయినా కాకున్నా అందరికీ ఆమోదం
వస్తుంది మది లోకి ఎపుడో ఒకమాటు
అందిన సాయం గుర్తుగా చేసిన మేలు తలిస్తే..ఎదురుగా
మెచ్చుకోలు అందుతుంది ప్రీతిగా..
ఎన్నడు మరువరు నిన్ను.
హాయిని గొలిపిన పిమ్మట
అది మంచిని పంచే ప్రేరణ.
ఉపకారి కి అభినందన
రాత పూరక మైనా
హావ భావ యుతమైనా.. ఫోను పలకరింపైనా
స్వయం మనవి చేసుకున్నా..
తిరిగి సాయం పొందేందుకు వారధి అది.
అభినందన అందనపుడు.. తిరిగి సాయం తలవకపోవడం సహజం
ఇది కోండకొచో గ్రహించే వివరం
సహజంగా మంచోళ్లే మనిషన్నవాడెవడైనా
సాయం చేస్తారు, చేతిని అందిస్తారు, సహకరిస్తారు
నడిపిస్తారు.. మంచి దారికి మళ్లిస్తారు
ఆ గుర్తింపుకే పెద్దెత్తున ఆనందిస్తారు
కృతజ్ఞతలు అందుకున్నా, ప్రశంసలు పోందినా
ప్రేమతో స్వీకరిస్తారు గుర్తింపుకి పరవశిస్తారు
స్వంత లాభపు ఊసులేని స్వార్థ పరత ఊసులేని
మంచితనమే మర్మమిందులో
మన మెచ్చుకోలే లోకహితానికి ఊతం
నడుం బిగించె అవకాశాల నిచ్చెన
ఇతరుల్ని ప్రేరేపించే కారకం
జీవితాన్ని అనంతంగా తేలిక పరచుకునే చక్కని-చిక్కని అవకాశం
RTS Perm Link
Aug
18
2012

రాత్రి రహస్యాలు రసవత్తరం గా వుండవ్
తెల్లారితే మాటల తూటాలు రోజుకి ఎన్నిసార్లు పేలతాయో..
రెండు వైపులా తిట్ల గుళ్ళ పెట్టెలు అక్షయ పాత్రలే
ఖండాంతర క్షిపణుల్లా పెళ్ళి పెద్దల పైకి పరోక్ష ప్రయోగాలు
కళ్ళ లో కంఠం లో జీర.. మనో విస్ఫోట అవశేషం గా ..
మది లో కరెంటుండదు మాటల మధ్య మనుషులుండరు
చెలగాటాల కాపురాల్లో రాగం శ్రుతి మించితే
వస్తువులపై అరుస్తూనో కన్నీళ్లకు తడుస్తూనో..
భరించడం వల్ల కాదన్నది ఇరువైపులా సాకు..
వేర్పాటు వాదం చెయ్యెత్తితే .. గుమ్మం దాటే మంతనాలు
ఒప్పందాలన్నీ చట్టు బండలే.. మధ్యవర్తిత్వం మాటచెల్లదు.
ఎవరో ఒకరు న్యాయ దేవత నిద్రను మళ్ళా చెడగొడతారు
కసి మనుషుల పంతాలు పసిమనసుల కేరింతలు..నెలకోసారి కోర్టు హాల్లో
అమ్మ తోడుగా ఎడబిడ్డ అన్నకు కనిపించేది అక్కడే..
రాజీ లేనమ్మా, రుషి పుంగవుడూ పొరపొచ్చాల ప్రపంచంలో
ఆటల్లో సహోదరుల కేరింతలు.. సినిమా చూసినంత సేపే
కేసుల్లో పైచేయి కై అమ్మానాన్నల కుస్తీలు,
కలిపే ముసుగుల్లో విడదీసే నల్ల కోట్లు
పిల్లల జీవితాల్తో పెద్దల చెలగాటాలు
బండెడు పుస్తకాల్లో ప్రశ్నలు ఇప్పుడు పెద్దగా బాధించవ్
వెలితిని నింపే స్నేహం కోసం.. గుండె చెరువయ్యే మాట
రోజూ బళ్ళో గంట మోగాకా.. చిన్నారి గుండె ప్రకంపనలు..
ఎన్నిసార్లు అంటాడో.. ఇంకెన్నిసార్లు అనాలని అనుకుంటాడో
తమ్ముడు కూడా లేడు.. . రావా మాఇంటికి ..నాతో.. ఆడవా!!
RTS Perm Link
Aug
09
2012

నిన్నా రేపు నడిమిట్టా ఎందుకొచ్చావ్ మళ్ళా?
పొలం లోని పంటబోదె నీరెత్తినట్టు..
గుండెకోతల జ్నాపకాలు తొలిపొద్దు నీరెండలా తొంగిచూస్తున్నట్టు.
మొన్నటి తొలకరి మింటిధార తీపిని కంటి చారల ఉప్పదనంలో కలిపేస్తున్నట్టు
తెలిసిన ముఖమేగా! ఎందుకు చిన్నబుచ్చుతావ్ మళ్ళీ?
అవసరమొచ్చినపుడే.. అపుడెపుడో శైశవం లో చిగురించావ్
బాధల్ని.. మోసే శక్తి నిచ్చి ~ఈ ఏడుపొకటి~ అనిపించావ్
చిన్నదైందని.. చిరగని చొక్కాని వదిలేస్తున్నప్పుడు..
జీవితం ముందుకి తోస్తున్నప్పుడు..
ఆశల తీరానికై బతుకునావ
ఆకలికడలి కడుపుని కోస్తున్నప్పుడు..
ఎదుగుతున్న గుర్తు గా కనీకనిపించని
చేతివంపు వళులలాగ అనిపించావ్.
ఆలోచనల చలనంలో చేయి కలిపే ఆగంతుకుడివి
ఒంటరి మననంలో తోడుండే అనుయాయివి.
అన్నిమార్లూ కన్నీరై కదలనంతమాత్రాన..
చిరునవ్వు లో నువు లేవన్నానా!!
RTS Perm Link
Aug
04
2012

ఉలి రాల్చిన శిలాక్షరాల రజను ను ఓ యుగాదిన పోగేస్తున్నాడొకడు.
తవ్వకాల పునాదుల్లోంచి అంతర్వాహినిని వెలికితీస్తున్నాడతడు.
ప్లవకాల ప్రవాహం లో కొట్టుకుపోతున్న ఆత్మబంధాన్ని ప్రోది చేసుకుంటున్నట్టుగా
తన దోసిలినిండా జవ జవ లాడే తెలుగుదనం జాలువారుతోంది.
నా ఉలి రాతల సమానర్థకమే మనసు బాషలోకి మారుతుంది.
సమీప గతం రాహుఛాయలా నా తలపుల్లోకి జారుతుంది.
ఆ ఉషోదయపు అన్వేషికి అందిన శకలాల కొన వెలుగుల్లో
చరిత్ర చెక్కిన శిల ముభావమై మసక బారుతోంది.
వాడి మాటల్లోని నిజం భాషను మించిన భావమై నిలుస్తోంది.
ముంగిలి రంగవల్లుల్లో ఆహ్వానాల తోరణం ఇంగ్లీషురూలైనట్టు ఆంధ్రత్వాన్ని హరించింది
రంగుల పేర్లు భాష మార్చు కున్నాయి. రంగును కలరావహించింది.
చెక్కిళ్ల పై ఎండిన చారలా చందమామ మూనై వలితిరిగాడు
అమ్మా నాన్న లకు లేని అస్థిత్వం జాబిల్లికెక్కడిది?
విద్యాలయాలు పిడిదీక్షాలయ్యాలవుతున్నప్పుడు కవితాపాఠం లాంటి చదువు కంఠోపాఠం అవ్వచ్చు గానీ హృదయగతమౌతుందా!
తినే అన్నం తాగే నీరు పీల్చే గాలి నడిపే వాహనం రాసే కలం, కాగితం మనసు భాష లోంచి రావడం ఇప్పుడో ప్రహసనం
మన మూలాల్లో మనమెంతన్నది ఒక ప్రహేళిక.
ఆసుపత్రుల్లో తువ్వాళ్లతో చిక్కులు లేవు కానీ
పోత పాల పెంపకాలలో పెట్టే పేర్లన్నీ పొల్లుపోనివే అజంతం గాఉండలేని నామం పొల్లుతో నేమవుతుంది.
సాధారణంగా జరిగే కామనే.. లోకం లో నిలవ్ నివ్వనివి ప్రేమ భావనలు
పొరపాటైనా కాకున్నా.. ప్రతి సారీ నిముష కాలమినిట్టే గడిపినట్టు
ఒకే ఒక అవగతం
జీవితం ఒక పాటైతే అది సాంగోపాంగమే
అర్థం కాని పదబంధాల గజిబిజి ని తీరికలేని తనంగా పోగెసిన వాడి కెంత గీర్వాణం!!!
వాడి దోసిలి నిండిన మల్లెల్ని మొనల్లా కన్ననాదెంత చత్వారం!!
RTS Perm Link
Aug
04
2012

ప్రశాంత సాగరం పై ఎగసిపడే అల
నీలాకాశం పై కమ్ముకొచ్చే మేఘమాల
గాలి కెరటాల పోరాటం లో ఆకాశాన్ని కమ్మాలని ..
తీరం తాకే కెరటాన్ని తట్టి లేపితే కడలి కల్లోలం
మనకు ప్రమాదం
మిన్నుమన్నునడుమ గాలి మీటే ధారా తంత్రుల సంగీతం
పుడమి కి ప్రమోదం
అలనైనా జడినైనా అలజడి చేసే గాలి
సుఖ దుఃఖాల లోగిలి లో దోబూచులాడుతుంది.
స్పందించే మనసును బంధించి బాధించే కారకం గాలివాటు కాదు.
భయం, బాధ, కోపం, సంతోషం, ప్రేమ ద్వేషం అలవాటుగా రావు.
ఉత్ప్రేరకాల సహచర్యం లో ఎగసిపడేవి మనఅనుభూతులే
అందీఅందని ఆత్మానుభవాలే.
RTS Perm Link