Archive for April, 2009

Apr 24 2009

విన్నపం ..

 

monkey-and-pigeon

నేను పట్టుకునినడిచిన చేయిఎక్కడో జారిపోయింది.

బతుకు బాటలోమరో అవసరం తోడయ్యింది.

జాతి ఏదైనా అవసరాలు తోడూ నీడే ఐనప్పుడు..

కలిసినడవడం లో తప్పేముంది..

మీరంటే.. మనుషులు.. వేరు వేరు గా చూడటం మీ నైజం ..

మా స్నేహం అర్ధవంతమైతే.. అందులో వింతేముంది..

జాతి వైరం లేదు మాకేన్నడూ ..రహస్య ఎజండాల అర్ధాలు తెలియవు.

సామాజిక న్యాయం పేర మమ్మల్ని విడదీస్తారా ?

మేము కలిసి ఆడుకునే కొమ్మల్నే వంచేస్తారా?

మేమెగిరినా దుమికినా తిండి గింజలకోసమే.

మా ఆట మమ్మల్ని ఆడుకోనివ్వండి.

మాతిండి మమ్మల్ని ఏరుకోనివ్వండి.

నగదు బదిలీల నజరానాలు మాకొద్దు.

విడదీయకుండా ఉంచితే అది ముద్దు..

పధకాల పతకాలు ఊరించలేవు..

జాతి-ప్రాంత బేధాలు వారించలేవు.

మమ్మల్ని మా మానాన వదలండి.

మాలాంటి వారికీ ఉండాలి మనుగడ.

అలాంటి ఆలోచన మీకేమైనా ఉంటే .. కలిసి బతకడానికి చోటుంచండి.

మా స్నేహానికి ఓటెయ్యండి. సద్భావనా భవితకు బాటెయ్యండి.

RTS Perm Link

No responses yet

Apr 18 2009

రాజకీయ గణం –

crazy-old-man

మంచి కవిత్వం రాయాలంటే భయమేస్తుంది..

మీరంతా ఎన్నికల పుట తప్ప ఇంకేమీ చూడరన్నది నా సాకు.

పద్యం రాయలేను.. రాజనీతి నా కావ్య వస్తువు కాదు..

గణాల గుణింతాలు రావు మరి నాకు.

నాకు తెలిసినవి.. అక్షర గణాలు కావు.. జన గణాలే..

ఎన్నికల రాజ్యం లో ఎక్కడ చూసినా ఈ గణ సమీకరణాలే..

కావ్య నిర్మాణానికి వేదాంగం లో ఛందస్సు లా రాజ్యంగం లో ఎన్నికల సదస్సులు..

ఎన్నికల రాజ్యం లో సదస్సే ఓ చందస్సు.. అది అర్ధం కాని గణాల కూర్పు నా కవిత లా…

వార్తా ప్రసారాల్లో నైనా.. యాత్రా ప్రచారాల్లోనైనా గణాలను గుదిగుచ్చి ఉంచడం పైనే చర్చ..

తారా తోరణాల రోడ్ షో ల లో.. జనగణాలు కవితావేశం లా వచ్చిపడుతున్నాయి.

అధికార గణ నాధుని పద్యాల్లో సమీకరించిన మాత్రలే ..గణ విభజన చెందుతున్నాయి అవి నిరసన గళాన్నే వినిపిస్తున్నాయి ..

మొన్నీ మధ్య తెలంగాణా ఛందస్సు లో చంద్ర గణం యతి మైత్రి కట్టింది..ప్ర్రాస నియమాల్ని ఉల్లంఘించి కామ్రేడ్  గణాలు.. అదేశాలయ్యాయి .

ఇది రాక్షస గణ మన్న రాజా.. నువ్ మరుస్తున్నావ్ మనది గ(ర)ణ తంత్ర వ్యవస్థ.

ఈ గోలంతా దేనికి.. నే చెప్పాల్సింది చెప్పి పోతాను.. అడగాల్సింది అడిగి పోతాను..

అసలు గణ మంటే ఓ గొర్రెల మంద.

కొండకోచో తోడేలు అందులో ఓ గురివింద.

మూడక్షరాలు కలిస్తే గణ మౌతున్నట్టే ముగ్గురు కలిస్తే రణగుణమౌతుంది.

గణాల్లో గురు లఘువులున్నట్టే తోడేళ్ళు గొర్రెలు ఉంటాయంటా..

గొర్రెలన్ని వోటేసి గెలిపించేది ఆ గణం లో గొర్రె నే.. పులితోలు కప్పి కత్తిచ్చి కూచో బెట్టిందీ .. తోడేళ్ళుతమని తినకుండా కాపాడమనంటా ..

మరి నువ్ గొర్రె వే గా.. నీ గుణ మేమయ్యింది? తోడేళ్ళ తో పాటు నక్కల్ని ఎందుకు మేపుతున్నావ్?

RTS Perm Link

2 responses so far

Apr 13 2009

అంతర్ముఖీ .. అంతర్జాల విముఖీ .. ( మౌన… మహిళా బ్లాగర్లకు విజ్ఞప్తి )

 

birds-nestఅమ్మల్లారా ! అక్కల్లారా ! మీ రెక్కడ. మీ రాక కై ఎదురుచూస్తున్నాం అనుదినం

ఆకాశంలో చుక్కల్లారా ! కిందికి పంపండి  మా వాళ్ళని.. రోహిణీ అరుంధతులు చాల్లేదా ! ఎదురుచూస్తున్నాం చకోరాల్లా .

మీరు లేని బ్లాగ్లోకం .. మా కేమి బాగోలేదు.. ఎవరి మీద కోపం.. మాపై చూపిస్తారు !

దివ్య సుగంధానుభవం దూరం చేసి దీపనిర్వాణగంధమా ! మాకిస్తారు !!

బళ్ళో కెళ్ళిన చెల్లెల్లా రా! దేవుని మెళ్ళో మాలల్లారా! ఆటలు పాటలు మానేస్తారా! బ్లాగ్ సన్నిధి లో స్వాంతన లేదా !

సూటిగ అడుగుతున్నా: నాచు రాతలపై జారినంత మాత్రాన మనం  నడవటం మానేస్తామా..! వసంతంలో పచ్చదనం మీ కంటికి కానరాదా! తుఫానులో గడ్దిపోచ ఏ పాఠం నేర్పింది?

బండ రాయి కాదుగ ఈ గుండె అందుకే ఈ పరితాపం.. ఆడో మగో తెలియని వారికోసమా ఈ కోపం..  

 గుండెలందు మంటలను నేనెందుకుదాచాలి..?  అనుకుంటాం అందరినీ ఆప్తమిత్రులేనని..

ఎవడి గోల వాడిది.. మగతనం ఎన్నడూ ఆడగేలిచెయ్యదే ! మగ బ్లాగు నడిపేది తాటకెందుకు కారాదు

బల్ల గుద్ది చెబుతున్నా.. నా మాట తప్పైతే ఆ మాయా మారీచులు అక్కా – చెళ్లెల్లేని  అగస్యభ్రాతలు తన పేరు ను దాచువారు .. నిరుపమాన గుణశీలురా ?

అందుకే ఈ అభ్యర్ధన: ప్రతి మంచి పని ముందు.. ఇబ్బందులు ఎదురవుతాయ్ ..

కూడలిలో నించుంటే.. కుక్కలెన్నో మొరుగుతాయ్.. ఇబ్బందులు దాటుకునే చినుకు చిప్పను చేరుతుంది.

అన్నీ మంచి ముత్యాలైతే.. జల్లెడింక ఎందుకంట .. ఆదమరచి ఉన్ననాడు ఈ జగమే ఓ ప్రమాదావని.

బ్లాగట మంటే వాగటం కాదు బతకటమే.. బ్లాగటమంటే.. మంచిని పంచడం.. బాగును కోరడం..

మొదలు పెట్టి ఆపరాదు ఏ పనినీ  ఉత్తములు.  

రాక్షస మాయలో పడకండి – రాసేదాన్ని కాలరాయకండి

బ్లాగ్సాగర మధనంలో అమృతమెంతో వలకాలి. అందుకే మీరు మేధను మరింత చిలకాలి

మీ రాతలు ఉర్రూతలు: మరు మల్లెల గుభాళింపులు ఆత్మీయతా పలకరింపులు

పట్టించు కోవద్దు యే పుల్ల విరుపులు.

చెడు మాటాడిన వినకు చెడు మాటకు నోరు విప్పకు చెడు నడతల ప్రతిఘటించుఇది నాకామోదం లేదనిపలు మార్లు ప్రతిధ్వనించు..

మంచిని పంచితేవంచనా ..అంతమాత్రాన మనం తలలు వంచేనా?

తపశ్చరణీ విపత్తరిణీ .. స్థైర్యం తో ముందు నడు .. ఆత్మానందాన్ని విడువకు ఎన్నడూ ..

గేలి చెసిన వారి పైకే సమాధానమై తిరిగిరా .

ఎవరో చెప్పినట్టు .. పిచ్చుకా.. కూలిన గూటిని.. రెచ్చి మరీ కడుతూ పో.. పిడుగదే విసుక్కుని పడటం మానును పో..

RTS Perm Link

10 responses so far

Apr 11 2009

నివేదన

jnaapakaalu

 

దారులు వేరై..

యుగాలు దాటినా.. నిన్ననే కలసినట్టుగా ఉంది.

జ్ఞాపకాల సంధ్యలలోనే నా మనం  ఊసులాడుకున్నది..?

చేయి కలిపి నడిచామన్న మాటేగాని..నా మూలాల మట్టి వేరై.. దిగబడిపొయా..

నువ్ చిటారు కొమ్మల  లేచిగుళ్ళను నిమురుతూ ఉండిపొయావ్ .

ఎండల్లో ఊగిసలాడే నిను చల్లబరచే నీరవ్వాలనే కదా నే మొదల్లొనే ఇంకిపోయా ..

నువ్ తారపధం లోకి  దూసుకుపోయావ్.

రాత్రిళ్ళు నిను చూడ వస్తే గాలి కెరటాల సంగీతమై పలుకరిస్తావ్.

మనమిద్దరం వేణువు రంధ్రాల్లా విడివిడి గా ఎందుకుండిపొయాం?

నా ఒంటరితనం లో  పాటై వినిపించావే ..

కంటి పాపవై ఎప్పుడు కనిపిస్తావో..!!

RTS Perm Link

One response so far

Apr 09 2009

వరదై పారుతా..

varada

ఆఫీసర్ నాపై ఉరిమిందానికి చుట్టూ ఉన్న వాళ్ల నవ్వుల మెరపులు గుచ్చుకుని మొఖం మంగళం అయ్యింది.ఆలోచన వడగళ్ల వాన లో మంచుముక్కల్లాంటి మెమో ల భయం.. కెరీర్ గ్రాఫ్ పై కమ్ముకున్న నిరాశల మేఘమైంది.

నాకెప్పుడూ జీవితపు జారుడు బల్ల పై ఎదురు దేకుతున్న ప్రయాసే..తప్పైన ఫైళ్ల చిట్టా లెక్కల చిక్కుముళ్లు ఏనాటికైనా వీడతాయి కానీనెలవారీ ఖర్చుల తగ్గింపు సూత్రం అంతు చిక్కదు.అయినా క్రెడిట్ కార్డ్ ల వాడకం లో నా అహం తగ్గదు.

పెళ్లాం-బిడ్దల కోసమే పురుష లక్షణం లో పదిలం గా ఉన్నానని నేనూ ..ఏక్ నిరంజన్ గాడైతే ఇంతవరకూ ఆగే వాళ్లమా అని బాసూ ..ఆఫీసు లోనే మిమ్మల్ని అనవసరంగా తలచుకొంటాం.

పొడారి పోయిన మనసు లో ఆవేశపు జడి.. ఎడారో ఎండమావో తేలని మజిలీ లో నిరంతర అలజడి ..కానీ ఆఫీసు అప్రకటిత వర్ష ఛ్చాయా ప్రాంతమే ..

ఇంటికి వచ్చేటప్పుడు కొన్న సరకుల మోత ..గమ్యం చేరాకా తలుపు తట్టటం లో వినపడుతుంది.

చేయి లానే గుండె కూడా బరువు దించుకోవాలంటే మనిషి వరదై పారాల్సిందే .

ఆనందమైనా ఆవేశమైనా చెలియలికట్ట దాటాల్సిందే

 

 

RTS Perm Link

No responses yet

Apr 04 2009

జీవన యానం .. రైలు ప్రయాణం

 

train-tracks

 

ఇష్టం లేని ప్రయాణాన్ని కష్టంగా చేయించడానికి రైలోస్తుంది స్టేషన్లోకి ..

పెదాల పట్టాలను బిగబెట్టి…వేగమంత వేవిళ్ళతో.. ప్రసవార్ధమై ముక్కుతున్న పూర్ణ గర్భిణిలా .. ఇష్టం లేని …
అనుబంధం ఏ నాటిదైనా ఆగేది ఐదు క్షణాలంటూ.. రేకెత్తిన ఆలోచనలనూ.. రైలెక్కించడానికి .. ఇష్టం లేని ..


నాకు ఊరు వోదలలాలంటే.. తల్లి ని వదిలే చంటోడి కున్నంత బాధ ..
నా ఏడుపు కేక కోసం ఆనందం గా ఎదురు చూసిన తండ్రిలా .. నను పట్నం పంపే కిటికీ కరచాలనాల సంఘం ..
తెగవలసినదని తెలిసినా.. తోడొచ్చే తల్లి పేగులా ..చిన్న నాటి నుండి పెనవేసుకున్న స్నేహ బంధం ..
ముందుకు సాగే రైలు కి ఉన్న వెనక్కి తిరిగే చక్రల్లా.. నను సాగనంపుతాయి .


ఏడుపో రాగమో తెలియకుండానే.. రైలు.. నేను.. ముందుకు సాగుతాము.
కంపార్ట్ మెంట్ లైట్ల వెలుగు లో కదిలే కాలువ ఆగిన రైలనిపిస్తుంది
నాకది.. చెలియలికట్ట దాటీ – దాటని చెలి కంటి చెలమను తలపిస్తుంది.
దూరమౌతున్న ఊరులా పలచనౌతున్న సిమెంట్ బెంచీ సింహావలోకనాలు ..
ఎదురొచ్చే మరో రైలు రొద లో వులికిపాటు పడుతుంటాయి.
ఆ సమయానికి ముందు స్టేషన్ లో మైకో- గంటో అప్రమత్త మౌతుంది .,

 రైలింజను నిట్టూర్పులతో స్టేషను లో బెంచీ లన్నీ బరువు దిన్చుకున్టాయి.


ఇష్టం లేని పెనిమిటి తో కష్టం గా కాపురానికా అన్నట్లు ..
ఇష్టం లేని ప్రయాణాన్ని కష్టం గా చేయించడానికి .. రైల్లెల్తోంది .. చీకట్లోకి..

RTS Perm Link

8 responses so far

Apr 04 2009

చతుర్ధ చంద్రోదయం

print22

చిన్ననాడెప్పుడో చంద్రుడ్ని చేరువుగా చూసిన జ్ఞాపకం…

బహుశా అమ్మ చూపుడి వేలి చివర వేలాడుతూ అనుకుంటా.

అప్పట్లో ఎంత అందంగా ఉండేవాడు !

పంచదార కలిపిన పెరుగన్నం ముద్దలా.

అదేంటో నే ఏడుపు ఆపేలోపు అమ్మ గోటిపై చేరేవాడు…

చల్లగ నా కడుపులోకి జారేవాడు..

నే నిద్దరోయాక నాన్న వచ్చేవాడు..

నింగికి.. నేలకు నడి మబ్బులా ..

ఎక్కువగా గర్జించేవాడు .. అప్పుడప్పుడూ పన్నీటి మేఘమై వర్షించే వాడు ..

అమ్మ వెన్నెలంతా నాన్నకే సొంతం.

ఏ అమృత సాగర మధన ఫలితమో..

మా ఇంట శశి వదన ఉదయం ..

చిన్నప్పుడేప్పుడొ చంద్రుణ్ణి ఏడుస్తూ చూసిన జ్ఞాపకం

బహుశా అమ్మ అడ్దాల నడుమ ననుకుంటా..

అచ్చంనాలానే ఉండేవాడు .. నోట్లో పాలపీకతోనా చిన్ననాటి ఫోటోలో లా …

అల్లరి నాలానే చేసేవాడు ..

పెద్దయ్యాక నాకు తొడొచ్చేవాడు

నాన్న చేతికి అందొచ్చేవాడు

జ్ఞాపకాల దొంతరలో నలగని నిజం, తమ్ముడైనా అన్న లాంటి వాడి నైజం .

మునుపెన్నడోచంద్రుడు నను చూసి నవ్విన జ్ఞాపకం ..

నను ముస్తాబించి కూర్చోపెట్టాక ..

అదేంటో నే తలెత్తి చూసేలోగా తెరమరుగయ్యాడు..

తెలిమంచు కరిగేలోగా తలపు లెన్నో రేపాడు..

అప్పటి వరకు తెలియలేదు .. ఉదయ చంద్రిక కూడా ఉంటుందని నులివెచ్చగా

ఎన్ని జన్మలు బంధమో .. ఆ సప్తపద బంధం ..

ఆ చలువ రాయిపై అరిగే చందం .. నా జీవన గంధం .

ఇది కృష్ణ పక్షపు అష్టమి లోపు మరో చంద్రునితో నా అనుబంధం .

అష్టమి అమావాస్య తెలియకుండా రసరాజ్య యుద్ధం .. ఫలితంగా పాడ్యమి పాపడు సిద్ధం .

ఇదీ ప్రతీ స్త్రీ కోరుకునే.. చతుర్ధ చంద్రోదయం …….

RTS Perm Link

No responses yet

Apr 04 2009

కొప్పర్తి గారి “అక్షరం మనిషైనప్పుడు..”

 

అక్షరాలు అచ్చం మనుషుల్లానే ఉంటాయి.

పేజీ నిండా ఉన్న అక్షరాల్ని చూస్తే జనసందోహం శిరస్సుల్లా అనిపిస్తాయి.

బారులు తీరిన అక్షరాలు ప్రార్ధన కోసం నిలబడ్డ బడి పిల్లల్నిగుర్తుకుతెస్తాయి.

నాలుగు అక్షరాల పదం నలుగురు మనుషులు బెంచీ మీద కూర్చున్నదృశ్యమౌతుంది.

పేరాగ్రాఫ్ సభ ఐతే శీర్షిక వేదిక అవుతుంది.

ఒక మనిషి ఒక అక్షరం ఐనప్పుడు జనసమూహం తరంగంగా సాగిపోవడం పాటౌతుంది.  

అక్షరాల్లో ఒంగిపోయిన తాత నడుముల్లాంటి అరసున్నాలుంటాయి.

తుపాకి ఎక్కుపెట్టిన సైనికుల్లాంటి దీర్ఘాక్షరాలుంటాయి.

ఒక ఇంటినే అంటిపెట్టుకునే భార్య భర్తల్లా ఒక అక్షరాన్నేఆశ్రయించే ఐత్వాలుంటాయి .

తనలాంటి మనుషుల్ని తొక్కిపెట్టే మనుషుల్లాంటి ద్విత్వాలుంటాయి. 

ళి – బిడ్డ నేతుకున్న స్త్రీ మూర్తిని గుర్తుకు తెస్తుంది.

ఠ – గర్భంలో బిడ్డను మో స్తున్నచూలలౌతుంది.

కొ – మత్స్య యంత్రాన్ని కొట్టబోతున్న అర్జునుడై నిలుస్తుంది.

అః – బంతుల్లాంటి కవల పిల్లల తల్లై సాక్షాత్కరిస్తుంది.

అక్షరాలు పదాలై.. పదాలు పంక్తులై.. సరళరేఖల్లాఁ పరచుకున్నపుడు .. .

పంక్తులు చిన్న రూపాల్లో దర్సితమౌతాయి.

వాటిల్లో కొన్ని మార్చురీ లో వరుసగా పడుకోపెట్టిన శవాల్లా ఉంటాయి

అంతరంగం లోతుల్లోకి దింపుతున్న మెట్లలా ఉంటాయి

ప్రపంచాన్ని between the lines చూసే కిటికీ ఊచల్లా ఉంటాయి

సూర్య కిరణాల ముక్కల్లా ఉంటాయి.

Running tracks లా ఉంటాయి.

పరిచిన పువ్వుల మాలల్లా ఉంటాయి.

అన్ని అక్షరాలు అక్షరాలు కావు ..

పలికేవి .. పగిలేవి..అడిగేవి.. అడుగులేసేవి అక్షరాలు

ఒక మనిషి ఒక అక్షరమైనపుడు దేశం పుస్తక మౌతుంది.

పుస్తకాలలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నవి అక్షర శకలాలే కాని అక్షరాలు కావు

అక్షర రూపాలే కాని అక్షరాలు కావు.

ప్రశ్నలతో..సమస్యలతో.. అవ్యక్తాలతో తలలన్నీ పేలిపోఁతున్నాయి.

తలకట్లు లేని మొండి అక్షరాలే పుస్తకమంతా సంచరిస్తున్నాయి.

 

 

 

 

RTS Perm Link

6 responses so far

RTSMirror Powered by JalleDa