Archive for the 'నా భావాలు- ఆవేశాలు' Category

Mar 06 2013

రెండు గా బతకాలేమో..

రెండు గా బతకాలేమో మనమెప్పుడూ వింతగా
గతంలో నేనున్నపుడు నువు నా భవిష్యత్తులో దాక్కున్నావు
నువ్వే నా భవిష్యత్తు అనుకుంటే.. గతంలోకి తొంగిచూస్తున్నావు

రెండు గా ఉండాలేమో మనమిప్పుడు కొత్తగా
నిన్ను చూడాలని చీకట్లను దాటి వస్తే నీ ఎండ నామీద కాస్తున్నావు
నే వదిలిపెట్టిన నీడలన్నిటినీ నీ నెత్తిన బండలా మోస్తున్నావు

రెండు చోట్ల గడపాలేమో మనమెప్పుడూ రోజంతా
రూకలవేటలో బయట నేనుంటే గడపలోన పీడకలల్ని కంటున్నావు
రహదారి వెంట నా పరుగైతే అడ్డదారిలో నాకై ఎదురుచూస్తున్నావు

రెండుగా కనబడాలేమో మనమెప్పుడూ
భయాన్ని కప్పుకొని నా రక్షణలో నువ్వూ
ప్రేమని కప్పుకొని నీ నిరీక్షణలో నేనూ

నీతో నడవాలనీ, నీకై నిలిచిపోవాలనీ
రెండువైపులా ఊగుతోంది నా మనసు.
ప్రేమకీ జీవితానికీ మధ్య ఏది ఏమైనా తేడా ఏముంది?

RTS Perm Link

One response so far

Mar 06 2013

|||కవిత్వం కావాలి కవిత్వం.|||

యశస్వీ..

ఓం అస్యశ్రీ అంటూ..
మన ప్రాణ ప్రతిష్ఠాపన మహామంత్రాన్ని
మానవత్వానికి ఆపాదించాలని ఉంది

కవిసంగమం సాక్షిగా..
ఈ సున్నిత భావాల వేదిక పైన

కవిత్వమే ప్రాణం,
ప్రేమే బీజం,
స్పందనే శక్తి
ఔన్నత్యమే కీలకం
ఇక మానవతా ప్రాణ ప్రతిష్టాపనకై
మన తపనలే జపమై..

వినియోగించుకోవాలనే కాంక్ష
అంకురించిన హృదయాన్ని
అభినందించాలనుంది.

కరన్యాసానికి ఇక్కడ ఉన్నవి కేవలం వేళ్ళు కావు
మూలాల వేర్లు ఏవైనా, వెలుగురేకల్ని ముద్దాడి నీడనో, గూడునో పంచే కొమ్మలూ..

మెచ్చుకోలు సందర్శకులు రాసినా, రాశిపోసినా ఉరిమే ఉత్సాహాలు, ఎత్తే అంగుష్టాలు

లోక కళ్యాణకామితులు.. ముందుతరం కవులు
తర్జనీ స్థాన భర్తీ కై.. దిశానిర్దేశం చేస్తూ, నెలకోసారి లమకాన్ వచ్చి దీవిస్తూ..

మధ్యముడు మా యాకూబ్ అన్నే..
తను రాస్తూ.. మమ్మల్ని కాస్తూ.. సవ్యసాచిలా

అనామికాభ్యాం నమః అంటున్నా..
నాకునేను దిష్టితీసుకుంటూ..

కవన వనంలో పూసిన కనిష్ఠులు ఎందరో..
లెక్కింపుల్లో వారే ముందువరుసలో

కరతలకర పృష్ఠభాగంలా అందరం కలిసితేనే
ఈ సంగమం

మంచి కాలాన్ని అందుకునేందుకు
ఇదో పచ్చని చెట్ల రహదారి..

(ఇక అంగన్యాసం..)

ఓం.. హ్రాం స్పందించే.. హృదయాయ నమః
హ్రీం.. ఆమోదమైనా, మోదమైనా ఆడించే శిరసే స్వాహా
హ్రూo.. ఆనందాన జలదరించే.. శిఖాయై వౌషట్
హ్రైం.. అమానుషాల్ని ఖండించే కవచాయ హూO
హ్రం.. దయతో, ప్రేమతో చెమ్మగిల్లే నేత్రత్రయాయ వౌషట్
హ్రః.. పిడికిలి బిగించే పద అస్త్రాయ ఫట్
ప్రేమతో మనసుల్ని దిగ్బధించే కవితలకీ నమో నమః

అసలు ధ్యానం ఏమిటంటారా!!
“కవిత్వం కావాలి కవిత్వం”
“కవిత్వం కావాలి కవిత్వం”
“కవిత్వం కావాలి కవిత్వం”
==01.03.2013==

RTS Perm Link

No responses yet

Dec 27 2012

నా కవితలకు;నాకూ.. ఆయొచ్చింది

కాగితాలు పోగేసుకున్న వేళ పాత కవితల వసంతగోల
కాగితం ఎక్కించే నాడు అక్షరాల అచ్చుహల్లుల మేళా
పని పాటల్లో అలసటకు పైరెండు తోడు
అందుకే నా కవితలకు; నాకు ఆయొచ్చింది.

జ్ఞాపకాల తంపర నన్నొదిలి ముంచింది ఇంటినే
ఉప్పుగెడ్డ అడ్డొచ్చిన వరదనీరైనది కలకంఠి కంటినే
పని పాటల్లో అలసటకు పైరెండు తోడు
అందుకే నా కవితలకు; నాకు ఆయొచ్చింది

ఊహల్లో నేస్తాలకు పేర్లుంటాయా
నీ ఆలోచనలకు ఆవేదనకూ వేరు వేర్లుంటాయా
నువ్వూ-నేను ఒకటయ్యాక మనకు వేరు పేర్లుంటాయా
నిన్ను వదిలి నేను నడిచే వేరు దార్లుంటాయా

పని పాటల్లో అలసటకు పైవన్నీ తోడు
అందుకే నా కవితలకు; నాకు ఆయొచ్చింది

ఓ తెల్లకాగితం నానుంఛి విడివడి పడవైన వేళ;
రాని వానను కోరానన్న లోకంపై కోపమొచ్చి..
ఇన్నాళ్లూ… నా కవితలకు; నాకు ఆయొచ్చింది

RTS Perm Link

2 responses so far

Dec 18 2012

నా మొదటి కవిత్వ సంపుటి.. తెల్లకాగితం

On Hand made paper with a window cut for tittle.

Multi color first page.


ఎలాఉంది.. పుస్తకం రూపం.. చెప్పండి..

RTS Perm Link

3 responses so far

Dec 09 2012

చివరి పేజీ

మనస్సాక్షి చెప్పినట్టు వీలునామా పై సంతకం చేసే
క్షణమొకటి వేచి ఉంటుంది.

పూజానంతరం నైవేద్యం సమర్పించేటందుకైనా
దాయిల్ని చల్లార్చే ఘడియొకటి ఉంటుంది

భక్తి ప్రపత్తుల ఘాడత ఎంతున్నా.. పూజ ముగించే
పర్వమొకటి ఉంటుంది

అప్పుడు బాధ్యతల నుండి విముక్తి చెందినట్టుగా
జీవితాన్ని ప్రసాదంలా అందించే అవకాశం
తెల్లకాగితపు విస్తరిలో అక్షరాల వడ్దనతో పూర్తవుతుంది
ఏ కవితైనా ప్రారంభం కన్నా ముగింపే బాగుంటుంది.

ధ్వజానికి అవతల అంచునే జెండా రెపరెపలాడుతున్నట్టు
క్రమ క్షీణోపాంత ప్రయోజనసిధ్ధాంతం వర్తించని
ఏమాటైనా కవితే అవుతుంది

తాడొదిలిన బొంగరంలా నా అక్షరాలు
నీ మనో ఫలకం పై రింగులు తిరుగుతాయి
ఈ పాటికే నచ్చినవి పాలపొంగై అగ్నికి
స్వాహాయమానమై ఉండిఉంటాయి

అనుభవాల ఆవిరి చాలక అతకని అక్షరాలు
భాష్పోత్సేక మవ్వలేక నీరుగారిపోయుంటాయి.
అయినా పర్వాలేదు.. అక్షరాలు అంతర్ధానమై..
అంతర్యామిగా మారిన అనుభూతిని
ఒక్క ఇంకుచుక్క ఇవ్వగలిగితే చాలు

ఈ సాహిత్యం నీ ఉన్నతిని కోరే సంస్కారమని గుర్తిస్తే చాలు
ఆశ నిరాశల వెలుగునీడల్లో.. చిన్నదైనా పెద్దదైనా
ఎప్పటికీ నిలచిఉండే ఓ తారలా ఉత్సాహాంతో
ఒక్క మాట పునరుత్పన్నం అయితే చాలు

పేజీలు పూర్తైన తర్వాతైనా కలం నాటిన విత్తులు మొలకెత్తి
సహస్రదళాలతో వెలుగురేఖలను పొదివిపట్టితే చాలు
అక్షరాల మధ్య తెల్లకాగితం తొంగిచూసినప్పుడల్లా
నా ప్రయత్నాన్ని కొనసాగించే మరో యశస్వి
మిణుగురై వెలిగి మనల్ని ఎగిరేస్తే చాలు

జీవితాలను ఇగిర్చి ఘుమఘుమలాడిస్తే మేలు

RTS Perm Link

3 responses so far

Dec 04 2012

అడ్డాలబ్బాయ్!! నేనూ..


ఒకే దీపస్థంభం
వెలుగులీనుతుంది మనమధ్య
తీరం నావల బంధం మనది
నువ్వెకడున్నా.. నే తెరచాపెత్తి సాగిపోతా

తారానగరంలో అంతరిక్ష యానంలో
దిక్సూచివై నువ్వున్నప్పుడు
నీ పౌరహిత్యాన్ని వీక్షించాలని
ఉవ్విళ్ళూరుతూ నేను వస్తాను

ఎవరివో అనుమానాల చీకట్లను
చెరిపేస్తూ దారి చూపిస్తుంటావు.
యుద్ధ ప్రాతిపదికన ఆటలాడిస్తుంటావు
మాటలాడిస్తుంటావ్ పోట్లాడిస్తుంటావ్..

నా స్నేహగంధం నిను చేరినట్టు
ఓ సంకేతం నువ్ తలపరికిస్తావ్
నీ కళ్లతో నను తడిమేలోగా
పొద్దురేఖలు నాలో విచ్చుకుంటాయి

నేల మీది తారలు ఆరోజుకి మరుగవ్వగానే
రెండు చంద్రవంకలు మన పెదాలపైన వాలతాయి
అప్పుడప్పుడొచ్చే నీలిపున్నమి ఐనా
నా స్కూటరు నీతో కలిసి నేల మీదే సాగిపోతుంది
నే గాల్లో తేలిపోతాను.

(కాలేజీ నేస్తం.. శ్రీకాంత్ అడ్డాల filmcity వచ్చినప్పుడల్లా..)

RTS Perm Link

One response so far

Dec 04 2012

తెల్లకాగితం కవిత్వం ఆట్ట; మొదటిపేజీ

అట్ట కేవలం ఓ నమూనా మాత్రమే.. ఏ రంగో.. ఇప్పటి మాట కాదు..

RTS Perm Link

One response so far

Dec 01 2012

తెల్లకాగితం..

మనిషన్నాకా  ఏవో కొన్ని అక్షరాలు

తనవై ఉంటాయి

పేరో.. ఊరో.. తనవారో..కానివారో

 

అక్షరాలే..

పలుకుతాయ్, పలకరిస్తాయ్,

పులకరిస్తాయ్, పలవరిస్తాయ్,

పగులుతాయ్, పగలబడీ నవ్వుతాయ్..

 

అలవాటైనకొద్దీ ప్రతీదీ

నాతో చేరిపోతుంది

నాకు ప్రతీకగా మారిపోతుంది.

నాకు నచ్చని ’నా’ని గుచ్చుకుని నడవలేను

పచ్చ పొడిపించుకు తిరగలేను

 

పలికిన ప్రతీమాటా నాది మాత్రమే ఐనప్పుడు

నీ మాట నోటరాక నేను రాయైపోతాను

నాకు నేను పరాయై పోతాను

నాది నీదై నప్పుడే నిజంగా నేను మనిషినౌతాను

 

నాని వదిలించుకోవాలనో

నన్ను నీలో నిలుపుకోవాలనో

నావైనవన్నీ నీకు పంచేస్తున్నా

నా మెడలు వంచి నీవి చేస్తున్నా

నాది నీదైనప్పుడు నేను నీవైనట్లే

 

అందుకో.. నన్ను..  నీ ప్రపంచంలోకి వస్తున్నా

నీ సాక్షిగా నన్ను నేను పోగొట్టుకోవాలి

నా పేరూ, ఊరూ చెరిపేసుకోవాలి

 

నన్ను చదివించుకుని,

అక్షరాలను ఆవహించుకుని

మనసు తెల్లకాగితం చేసుకోవాలి

 

నేనే నీ సొంతమైనప్పుడు అక్షరాలు అనుభూతుల్ని మాత్రమే మిగల్చాలి

మనలోని అక్షరాలు కరిగి తెల్లకాగితంలాంటి కవితలవ్వాలి

అక్షరాలు మనలోనికి  కరిగి కరిగి

తెల్లకాగితం మాత్రమే  మిగలాలి

కవిత్వం మనలోకి ఇంకి

లోకమంతా తెల్లకాగితమవ్వాలి


(కవిత్వం సంపుటి ఈ పేరున ప్రచురించాలన్న సంకల్పానికి అంకురార్పణ గా..)
కొప్పర్తి మాష్టారూ.. మీ బాటన..నడుస్తోంది నా మనసు.


RTS Perm Link

2 responses so far

Nov 29 2012

తెలుగు వెలుగు డిసెంబరు సంచిక .. విశేషాలు

క్రిస్మస్ శుభాకాంక్షలతో
ప్రపంచ తెలుగు మహాసభల ఔచిత్యం.. ప్రశ్నిస్తూ సాగే సంపాదకీయం
కవిత విద్యా సాంస్కృతికసేవా సంస్థ యువ రచయితల పురస్కారాల ప్రకటన, నెల్లూరు జిల్లా రచయితల సంఘం జాతీయస్థాయి కవితలపోటీ నిర్వహణ, మచిలీపట్నం “సాహితీమిత్రులు” ఆధ్వర్యం లో కవితల పోటీ ల సమాచారంతో పాటు “వినదగునెవ్వరు చెప్పిన” ఉత్తరాల స్పందన.
పేరుతెచ్చె పండగ బారసాల పై డా|| యల్లాప్రగడ మల్లికార్జున రావు
ధనుర్మాసం విశేషాలపై వేదాంతం మధుసూధన శర్మ ల వ్యాసాలు
బత్తుల ప్రసాద్ “మందుగొడ్తిమి కథ
కిట్టయ్య అలక కవిత జివియస్ నాగేశ్వరరావు
కర్లపాలెం హనుమంతరావుగారి ” మనమంతా కిష్కింద వాసులం పేర స్థల, భాషా విశేషాలు
కె నారాయణమూర్తి అందించిన కోలారు తెలుగు జానపద గేయాల కబుర్లు డా|| నారాయణ స్వామి మాటల్లో

డా||. సినారే కవిత: చూపులూ పక్షులూ
అక్కినేని అంతరంగాల్లో తన మాటలు అమ్మ ఎంతో అమ్మ భాషా అంతే! తెలుగువెలుగు బృంద సారధ్యం లో
అక్షర కళారూపాల ప్రదర్శన ఇటీవల దేశ రాజధాని లో నిర్వహించారు . కార్యక్రమానికే సొబగులద్దిన తెలుగు ” అక్షర శిల్పులు” ముచ్చట్లు ఈనాడు ఢిల్లీ రిపోర్టర్ సురేష్ సహకారం తో
హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు తెలుగు భాషా ప్రసంగం ” మన తెలుగు” ౬.౮.౧౯౩౮. న రాజమండ్రి గౌతమీ గ్రంధాలయ ౪౦ వ వార్షికోత్సవ సభలో తిరిగి మనకోసం
డా|| మన్నం గోపీ చంద్ ఆవేదన: భవిష్యత్తుపై ఏది భరోసా?
కె. కృష్ణ మోహన్ కథ ” అహంతు రావణో నామః రామాయణ కాలం లోకి కాలయంత్ర ప్రయాణం చేయించడానికి.. గొప్ప కథన శైలిలో..

దాశరథి రంగాచార్య, వెల్చెరు నారాయణ రావుల అలోచనలు ” తెలుగు మాట్లాడడమే ఆత్మగౌరవం”; “గొప్పకోసం ’పరాయి’ తిప్పలొద్దు”
గోగుమళ్ళ కవిత బైబిల్ కబుర్లు భాషపరంగా అందించిన వాక్యము దేవుడై ఉండెను.. పక్కనే .. పచ్చా పెంచలయ్య కవితకీ.. బొమ్మ ఈ కవిత గీసినదే..
అమెరికా తెలుగువాడి గుండె చప్పుడు తానా విశేషాలు డా|| జంపాల చౌదరి మాటల్లో
తేటతెలుగుకు నార్లు పోసిన నార్ల: పత్రికా రచనలో మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి జీవన ప్రస్థాన వివరాలు అందించినది డా|| ఎర్నేని వెంకటేశ్వర రావు
రావికొండల రావు రాతల్లో మనం వేసిన “ఇంగ్లీషు తల్లికి మల్లెపూదండ.. ”

ఇంకా కొత్తగూడెం బాలోత్సవ్ వినోదాల జల్లు.. కార్యక్రమం లో పాల్గొన్న ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్, ఎమ్మెన్నార్, కథా సాహితి వాసిరెడ్డి నవీన్ సందేశాలు, డా: అందెశ్రీ పాట, అందులో పాల్గొన్న బాలల కవితా సొబగులు
చుక్కా రామయ్య గారి ” తెలుగూ నలుదిక్కులలో వెలుగొందవే!
బలివాడ కాంతారావు ముంగీస కథ

రాటాల వెంకట సుబ్బయ్య క అంటే కంప్యూటర్.. సాంకేతిక లిపి వివరాలు
చిమ్మపూడి శ్రీరామమూర్తి తెలుగును కాపాడరా! పాట

బుల్లి కవితల కొన్ని ఆంగ్లరూపాల పరిచయం బుల్లికవితల్లో పడమటి గాలి ఆయుర్వేద వైద్యులు జివి పూర్ణ చందు మాటల్లో
రాజడిగితేమందును ఒక జానపదగీతం.. కవితమ్మ బొమ్మతో
పాత పత్రికల కంప్యుటీకరణ వెబ్సైట్ వివరాలతో: అదిగో.. అదిగో.. పాత బంగారం. ప్రెస్ అకాడమీ విలువైన సేవల సైటు
చెన్నూరి సుదర్శన్ గారి అడకత్తెరలో పోకచెక్క కథ
మాతృభాషా వైభవోత్సవాలకు శ్రీకారం చుట్టిన రమాదేవి పబ్లిక్ స్కూల్ కార్యక్రమ విశేషాలు “తెలుగు వాడుక.. తీపివేడుక.
ఎజీ ఆఫీసు తెలుగు సాహితీ సమితి రంజని పరిచయం.. అంకెలతో కుస్తీ.. సాహిత్యంతో దోస్తీ ఈనాడు ఆదివారం కలం: కరణం జనార్థన్ కథనం
నరాల రామిరెడ్డి అవధాని కవిత: మందార మకరంద మథుర భాష
శంకరంబాడి సుందరాచరి పై వ్యాసం నిత్యమై.. నిఖిలమై..అందించిన వారు డా|| మన్నవ భాస్కర నాయుడు
సాయి బ్రహ్మానందం గొర్తి కథ: బతుకాట
డా” సామల రమేష్ బాబు వ్యాసం: ఎందుకోసం? తెలుగు సభలు ఎవరికోసం??

దశాబ్దాల తెలుగు పాలకుల భాషా నిర్లక్ష్యం ఈనాడు జనరల్ బ్యూరో కథనం: చిత్తశుధ్ధిలేని తెలుగు పూజ

ఇంకా సాంకేతిక సదస్సులో తెలుగు జాలం.. విశాఖ గీతం కళాశాల లో జరిగిన రెండవ అంతర్జాతీయ తెలుగు సదస్సు వివరాలు బి ఎస్ రామకృష్ణ ఈనాడు మాటల్లో
అలపర్తి వెంకట సుబ్బారావి అభినవ సుగాత్రీ శాలీనులు, జ్ ఎల్ నరసింహం నానీలు, గన్నోజు శ్రీనివాసాచారి పద్యాలు, పదపంచాయితీ..
తులాభారం శీర్షికన పుస్తక సమీక్ష: సలీం.. మరణ కాంక్ష, మా శర్మ.. కొప్పరపు కవుల ప్రతిభ, పివి సునీల్ కుమార్ .. సయ్యాట, శిఖామణి .. గిజిగాడు, నటరాజారావ్ మట్టివాసన
కొండ అద్దమందు లో.. ఇంకొన్ని… క్రిస్మస్ శుభాకాంక్షల మేఘసందేశం..

అమ్మ.. నా పనై పొయింది.. ఇంక.. చదవడం.. మీ పని.. 🙂

RTS Perm Link

No responses yet

Nov 25 2012

పేపరుతో నాన్న

నాన్న అర్థమంతా.. నా చదువుల దీపావళి వెలుగులకే
తన అవగాహనైనా, సంపాదనైనా కాలుతున్న మతాబే
నాకన్నానా భవితను నిర్వచించేది తన కన్నకష్టార్జితమే;
జ్ఞానమైనా, ధనమైనా అర్థానికున్న సమస్త నానార్థాలకూ పర్యాయపదం నాన్నే

ఉద్యోగప్రకటనల కాలం కళ్ళ కింద కరిగేది తన రెక్కల లోనే
నాలుగు రుపాయల కాగితాల దొంతరైన పేపరు
ఉద్యోగ సమాచారాన్ని ప్రత్యక్షప్రసారం చేసే పావురాయిలా
ఆ నాలుగురాళ్ల మనిషి మీదే వాల్తుంది తెల్లారగానే

రెక్కల టపటపల్లా పేపరు రెపరెపల్లో ఎగిరే కళ్ళు తనవే
దాణా తిన్నట్టుగా కాక పిల్లకు పెట్టేటట్టు పుక్కిట పట్టే ప్రయత్నం
కనబడ్డ ఆశ ల మెరుపులను తెల్లారే కురిపించాలని
ఉరిమి ఉరిమీ నను తడిపేస్తాడు తడిమేస్తాడు దబాటంగా

ఆవిరైన చమట చుక్కలు ఘనీభవించిన మేఘమై నాన్న
గాలాడని వేళ లలో వర్ష పాత సూచన అమ్మ భరోసా నా తరుపున
జల్లులో జడివానో నా ప్రయత్నం..
గాలివాటు ప్రయాణం లో తీరం దాటుతూ నేను

వానకారు కోయిలై ఫలితాలకోసం రాశి-ఫలాల వేటలో.. మళ్లీ పేపరు తో నాన్న
నా కాలం కలిసొచ్చేదాకా కదలని చిత్తరువులా పేపరుతో తన మానాన నాన్నే..

RTS Perm Link

No responses yet

Nov 22 2012

కవిని చూసాక..

కవిని చూద్దామని
అతని ఊరు వెళ్ళాను

నా ఆలోచనల పునాదుల్ని కుదిపేసినవాడు
ఆవేశపు అలజడిని కన్నీటితో కరిగించినవాడు
ప్రశాంతమైన నిద్రలేని రాత్రుల్ని వరంగా అందించినవాడు
అలంకారాలు లేని అక్షరాలకు వ్యాపకశక్తి ప్రసాదించినవాడు

అతడెలా ఉన్నా..
ఆ కళ్ళల్లో వెలుగును చూద్దామని వెళ్ళాను
ఆనందం అనుభూతి ప్రదానమని
సూదిమొనకు సున్నితత్వం అద్దేవాడ్ని

ప్రేమను పదాలతో పంచేవాడ్ని
దయను అర్థంతో చేర్చేవాడ్ని
కానరాని వరాలను గుప్పిట అందించే
రూపం చూడ్డానికి ..ఇది ఈనాటి వలపా!!

కళ్ళను చూపుతో తడుముదామని
చేతిని చేతితో కలుపుదామని
ఇతనూ మనలాంటివాడే కదా అనుకున్నప్పుడు
నామీద నాకు గౌరవం పెరిగింది

కవిని కనుగొనాలని దిగంతాలలోకి దూకగలనా
వెలుగుని వెతుక్కుంటూ చీకటిబాటపట్టగలనా
అగ్గిన్ని జల్లే ఆకాశాన్ని చుట్టుకున్న వాడ్ని నేను
చల్లబరచే సమీరాన్ని చేరాలని కోరుకునేవాడ్ని

కలల భస్మంతో బాటలు పరిచేవాడ్ని
ఎప్పటికీ చేరని గమ్యపు దారని తెలిసినా
భుజం తట్టే చేతికోసం అలుపెరుగక ప్రవహిస్తున్నవాడ్ని

కవి సముద్రమో కాదో.. జట్టు కట్టిన సంతోషంలో తేలి
సాటి నదిలా కలసి..పారి.. జీవితం తో సంగమిద్దామని
అన్నిరుచుల మట్టినీ ముద్దాడుతూ కథ ముగిద్దామని.

(బివివి ప్రసాద్ గారి ’కవిని చూద్దామని’.. చదివాక.. కలసిన క్షణాలను గుర్తుచేసినందుకు..)

RTS Perm Link

2 responses so far

Nov 21 2012

ఉన్నదొక్కటే ఈ క్షణం


ముందేమున్నదో గతంఎలా గడిచిందో
మనకేం ఎరుక..!
చేతుల్లో ఉన్నదొక్కటే ఈ క్షణం

దారుల్లో తెలియని కీనీడలు పొంచిఉన్నాయి
ఊహకందని చేతల్లో
మన మంతా బందీలం

ఈ క్షణమే వెలుగులు మనలో ముందూవెనుకా చీకటే
ఈ క్షణాన్ని పొదవిపట్టుకో
ఇదొక్కటే నీ సొంతం

ఆలోచించు ఓ బతుకు కోరే నేస్తమా
నీ తలపుల్ని పండించుకో

ఈ క్షణపు మిలమిలల్లో
ఈ లోకం కదులుతోంది

ఈ క్షణపు వెచ్చదనం లో
గుండె చప్పుడు దాగుంది

ఈ క్షణం తోడుంటే
ఈ లోకం నీదేగా

తరచిచూడు నేస్తమా
ఈ ఈ క్షణం కోసమే
యుగాల నిరీక్షణ

ఆలోచించు ఓ బతుకు కోరే నేస్తమా
నీ తలపుల్ని పండించుకో

ఈ క్షణపు నీడలోనే మన జీవితాలు గడవాలి
ఈ క్షణం సాగితేనే ప్రతి కథా కదులుతుంది

నిన్నెవరు చూసారు.. రేపెవరు చూస్తారు
ఏదైనా పొందాలంటే.. ఈ క్షణం నీదవ్వాలి

ఆలోచించు ఓ బతుకు కోరే నేస్తమా
నీ తలపుల్ని పండించుకో
చేతుల్లో ఉన్నదొక్కటే ఈ క్షణం

Aage Bhi Jaane Na Tu WAQT సినిమాలోని పాట విన్నాక..
మీతో పంచుకోవాలనిపించి.

RTS Perm Link

3 responses so far

Nov 20 2012

నిను చేరాలనే…

నా తలపుల్లో నిలిచున్నది నీవైనప్పుడు
ఎడబాటుకు అర్థమేముంది
ఎదచప్పుడే ప్రతిధ్వనించెనా
అడుగు అడుగులో మెదలే సవ్వడై..

ఒంటరితనమే నా చిరునామా
పగలైనా రేయైనా నీ ఊహే
నన్ను నాకు వివరించేది
నను నిలువరించి వరించేది..

యుగాలవిరామంలో
క్షణాలు గడుస్తున్నాయి
అంతరంగాల్లో కూనిరాగాలే
జ్ఞాపకాల మనోభావాలు..

ఆకాశం చలికాగుతుంది
నా ఊపిరిలో వెచ్చదనానికి
మంచు కరుగుతుంది నీదిక్కున
నిను జీవితంలా శ్వాసించనీ..

ఈనేలపై నా అడుగుల తడబాటు
నీ ఊహల్లో నేను నేనుగా ఉండాలనే
ఆవిర్లు విరజిమ్మే గుండె చప్పుడు
ఆగేలోగా నిను చేరాలనే.

RTS Perm Link

One response so far

Nov 17 2012

ఛార్మినార్.. చెంపన..

ఈ మబ్బులు ఏ ఉత్పాతంలా కనిపిస్తున్నాయ్ చార్మినార్!
ఏ కారో మంటల్లో కాలి ఈ కసి మబ్బుల్ని కమ్మింది
కత్తులు తిట్టుకుంటున్నయ్ ఏమిటీ మరకలని
రాళ్ళగాజుల మండీల్లో పగిలేవి ఏ చేతి గాజులు?

ఎలా అంటుకుందో చెమ్కీ చుక్కై నీ చెంపన మైసమ్మ
ఆడుగుదామంటే ఇప్పుడు లేదు కుంకుమిచ్చే ఆ బామ్మ
ఈ ఊర్లో గొడవలకీ అభిమతాలకీ ఏనాడూ లంకె లేదు
గుళ్ళకీ-గోపురాలకీ ఈ లెక్కల పాఠాలు ఎక్కలేదు

ఆ పక్కనే వెలిసినట్టు రంగు పూద్దామనే ఆదుర్దా ఒకరిది
రంగు వెలిసినట్టు చూద్దామని ఎద్దేవా వేరొకరిది
రాలుపూలనగరం లో నీ బస్తీ గరం గరం
నరంతెగే నాటకాల్లో రాలేది కసుగాయలే

జెండాలో రెండు రంగులూ తెల్లదనాన్ని కుమ్ముతూ
దేవేరికి గుమ్మటాల ప్రాపు… మతంమత్తుకు మధురసాలకైపు…
ఎవరు అద్దినా అది కృతకం అమానుషుల వికృతం
తలతిక్కనాయాళ్ళకు కేవలం నువ్వో ప్లేగు బంధానివి

భాయీ భాయీ బతుకుల్లో నలిగే అలాయి-బలాయి కానుకవి

RTS Perm Link

2 responses so far

Nov 16 2012

మాటొకటి చెప్పిపోనీ

గాయాలు నాకు గేయాలై వినిపిస్తున్నప్పుడు
గేయాలు గాయాలై సలిపేస్తున్నప్పుడు
నా సాహిత్యాన్ని ఆస్వాదించనంటావా!
విషాద సంగీతమైన నిన్ను ఆలకించమంటావా!!

గాయం నేనైనప్పుడు ఎవరు గాయపడ్డట్టూ!!
కోల్పోయేది స్నేహ సౌహార్దమో కుటుంబ క్షేమమో
నా ముగింపు ప్రజావినోదమో స్వీయ విషాదమో
నాకళ్ళకు నీ కలల భయమెందుకో

ఎందుకిలా నమ్మకాల తరాజు
చీకటితో పాటు మొగ్గుతుంది!
ఎందుకో గడిచిన రోజుల జీవితం
వొంటరి అలోచనలను కుదుపుతుంది

వాలిన పొద్దు మరునాటికి వెన్ను పొడుస్తుంది
ఏ విషాదాలు మెదులుతున్నాయి తలపుల్లో
నాకెందుకు నేనంటే భయం
పలుకని నిజాలు నను బేరీజు వేస్తున్నాయా!

నేనుండనని రేపటి వెలుగులు ఈరోజే విప్పిపోనీ
నువ్వొప్పుకున్న నెప్పేగా మన అనుబంధం
ఏళ్ళు గడచినా మళ్ళీ నీతో మనసువిప్పి చెప్పుకోనీ

నిను ఎప్పటికీ ప్రేమించిన మాటొకటి ఈరోజూ చెప్పిపోనీ

RTS Perm Link

2 responses so far

Nov 12 2012

ఈ దీపావళి వేళ..

అమావాస్య రాతిరి
ఉపద్రవం ఘనీభవించిన చీకటి
ఎప్పటిలాగే

బాంబుల ఆర్భాటాలతో..
జువ్వల చెలగాటాలతో
ఎంతసేపని ఆపగలను పారి ఆరే వెలుగులను

డబ్బుల్ని కాల్చి వెలిగించిన చిచ్చుల్లో
పసి నవ్వులే వెలుగుతాయి
గతించిన నా బాల్యం లీలలు
నిముషాల్లోనే మిగులుతాయి.

ఎంత తమాయించుకున్నా
నాలో ఆరని శివకాశీ మంటలు
కాలిన బతుకుల నీలినీడల్లో
మందుగుండు ఆర్పిన దీపాలు

ఇవేంపట్టని నేను
చిన్నారి కంటి వెలుగుల కోసం
మనసూ చేయీ కాల్చుకుంటు..

ఏదైనా కాలితేనే పండగా!
జీవితాన్ని రాలిస్తేనే బతుకు పంట పండేనా?
దీపం వెలిగించి ఉంచితే చాలదా!!

RTS Perm Link

2 responses so far

Nov 09 2012

తుహినం తుడు

పేరు తలిచి నిను పిలిచి వినేలోగా
ఈ శరద్రార్తి చలై నను కరుస్తోంది

ఏదో మాట నను తడుముతోంది
నీ తలపుల్లోకి తరుముతోంది

తపన తలపులను తాకలేదా
గుండెలను కరిగించి పోసిన గంట
కాలమై కాలుస్తుందో రవమై మోగుతుందో

ఎంతదూరాన ఉన్నా నీ మేనిగంధాల పలకరింతలు
నను దాటివెళ్ళిన జాడలను
మరుగుపరచలేక నిలనీయకున్నాయి

నీ ఊహే లోపలా బయటా మంచుని కరిగిస్తుందే
నిట్టూర్పుల్లో మన ప్రేమ వెచ్చదనం

మంచుబిందువలను ఆవిరి చేసినా
గతించడాన్ని మాపలేని కాలాన్నడుగు మన సంగమాన్ని

నిరంతరతను నింపుకున్నమన స్నేహాన్ని అడుగు
నిన్ను నన్నులను దాటిన మన భావననడుగు
వేర్లు వేరైనా ఒకటైన మన జీవితాల్నడుగు

మనం లేని నాడు ఒకరికొకరిని
చూపించడం నేర్పమను కళ్ళకి

మన అందాలు నింపుకున్న లోకం లో
అనవరతం ప్రేమై శ్వాసించనీ హృదయాన్ని

ప్రేమలేని మనసుల్నీ ప్రేమించనీ
చెవులకు నిశ్సబ్ద నిలయాల్లో
పారవశ్యపు పదనిసనలను వినిపించనీ
సాయాన్ని స్పృశించనీ చేతులను

ఆర్తిగా ప్రార్థనలో
పెదవి పలుకనప్పుడూ.. నా గళాన్ని విను
కన్నీళ్ళను నీ పెదవులతో చెరిపెయ్యరాదూ..
నా ప్రమేయం లేకుండా రాలుతున్నాయి పూలై
పొదవిపట్టుకో నన్ను నీకు దూరంగా ఉన్నప్పుడూ.

RTS Perm Link

One response so far

Nov 07 2012

అలాగే.. అలాగే..

నిద్రలేచాకా నేలను కాలు తాకితే ..
పచ్చనోటు తొక్కినట్టే.. అద్దెడబ్బులు.. పెరిగాయి కదా!
అడుగులేసి అద్దం చూసేలోగా ప్రతిబింబం హెచ్చరిక
పేస్టు పొదుపుగా వాడమని

స్నానం గోరువెచ్చని నీళ్ళతోనేసరి
సబ్బు కన్నా చెయ్యే ఎక్కువ అరుగుతుందీలోపల
తువ్వాలన్నా సరిగా ఆరేసుకుందాం. ఎన్ననికొంటాం!!
లోగుడ్దలూ మేజోళ్ళూ పోనీలే .. మరుగున చిరుగులు కనిపించవు
ఏమోయ్! పెళ్ళికి కొన్న రింకిల్ ఫ్రీ పేంట్లెక్కడ.. ఈ బటనుకుట్టు.

బస్సెక్కుదామా.. బండితీద్దామా!!
ఆఫీసుకేగా ఫ్రెండు ని పిలుద్దాం
కారేజీ పెట్టరాదూ.. కాంటీన్ రేట్లు పెరిగాయీ!!
అరె! నా పెన్నేదిరా.. నీదివ్వు ఈరోజుకి

సాయంత్రం వచ్చేటప్పుడు నీకేంకావాలి! పర్లేదులే తెస్తా.
నాన్నా! బాగాచదువుకో.. లేకపోతే మీ నాన్నలానే..
కాఫీ ఎందుకూ.. ఆఫీసులో తాగేస్తాగా.

ఏమోయ్! పండక్కేంకొనుక్కుంటావ్! నాన్నా!! నీకు..
ఏంకావాలి చెప్పండి.. ఎలాగైనా కొనిస్తా సరేనా
మా ఆఫీసతను పెళ్ళుంది ఈనెల.. మంచి చీరకొనుక్కో.. పిల్లాడిక్కూడా.. ఇంద క్రెడిట్ కార్డు.

హలో.. హలో..టెలీఫోన్ బిల్లేగా .. ఇప్పుడు కట్టేస్తా..
ఆ గాస్సిలిండర్ డబ్బులిలా పట్రా.. సాయంతం డ్రాచేసిస్తా.
నీకో గుడ్ న్యూస్ .. ఈనెల డి.ఎ. పెరిగింది మూడొందలు

రాత్రి లేటవుతుంది.. మీరు భోంచేసేయ్యండి.. బాసుతో పనుంది సాయంత్రం.
నీకు మల్లెపూలూ.. వాడికి హనీకేకు.. అలాగే.. అలాగే..

RTS Perm Link

2 responses so far

Nov 06 2012

నిను చేరాలంతే..


ఎంత కష్టమో నిను చేరాలంటే..
అనుకున్నా వన్నెలాడీ! నిను చేరాలంతే..
నే వచ్చేలోగా నీ తకిట తకదిమి.. ఆగదని..
నిలకడ వదిలిన నీ మునివేళ్ళను మునిమాపు వేళ్ళల్లో

సందెపొద్దు సూరీడు ముద్దాడివెళ్ళేలోగా
అనుకున్నా కలవిడిచి .ఇలనైనా నిను చేరాలంతే..

శీతల పవనాలు ప్రేరేపించే నాదాలై
పక్షుల కువకువలు స్వరజతులై ఉత్తేజితం చేసే వేళ
నిశీధి వీధుల విషాద ఛాయల్లో నువ్వు విశ్రమించవని
అంబరవీధుల పహారా మాని నీకోసం నిలవనా!

నీర మేఘాల వీవెనలతో చెమిర్చిన మోహనాన్నే తడమనా!!
మంచుబిందువే నీ పెదవిపై వాలేలోగా నిను చేరాలంతే..

నీ నర్తనం తో తడిసి ముద్దైన నేల నాకు కోనేరే..
మువ్వరాల్చిన మెరుపు రజను నై తానాలాడనా
వలపు వాకిట నీ దరిచేరినా అది పూల పన్నీరే
దూరాన చలించే నీపై తపనే తమకమై తరించనా

నిను వారించాలని.. వరించాలని
గుండెలదిరేలా వచ్చా వడివడి గా దడదడగా

వెన్నెలకిరణాల దాడి లో నే ఓడేలోగా
వన్నెల విరిమోము ఆడి-ఆడి వాడేలోగా
నా జీవన ఉచ్వాస నను వీడే లోగా..
ఏనాటికైనా.. ఎలాగో.. నిను చేరాలంతే..

నా తీరం లా నువ్వు నర్తిస్తుంటే..
మెల్లగ నిను ముద్దాడి నే సేదతీరాలంతే.

RTS Perm Link

3 responses so far

Nov 05 2012

నా ఏడుపేదో నేనేడుస్తా..


నా ఏడుపేదో నేనేడుస్తా.. ఎలాగోలా బతుకీడుస్తా..
పలుకరించే వారు కరువయ్యారనో..
ప్రేమ చిలకరించేవారు దూరమయ్యారనో..
కనికరించేవాడు కానరాలేదనో నా ఏడుపు నాది..

ఈ రోజు మాఆవిడ నన్ను కొట్టుండొచ్చు
మాడిన దోశే నా మొహాన కొట్టుండొచ్చు
నా బాసు నన్ను తిట్టుండొచ్చు
జాక్‍పాట్ నా పక్కోడు పట్టుండొచ్చు

ఐనా ఇన్నిసార్లు నా ముందుకొచ్చావ్.
నా ఆలోచనలన్నీ పేపర్‍లా నమిలేయడమే తప్ప
పిచ్చోడా!.. ఇది బాగుందీ.. అది బాగోలేదూ..
ఏనాడైనా అన్నావా !! నాతో రెండు నిముషాలు మించి ఉన్నావా!!

ఏడుపంటే.. ఎంతలోకువ.. అది ఫ్రీగా దొరికిన పాలకోవా!!
నీ రుమాలు తీసి తుడువ్ చూద్దాం ..
తెర దుమ్మొదులుతుందేమో గానీ
నా రంగేమైనా మారుతుందా!! నా బాధ ఏమైనా తీరుతుందా!!

మరెందుకో ఆగి మరీ చూస్తావ్ తమాషా
నువ్వుండి చూపించు ఖుషీ గా హమేశా
ఎంతరాసినా నా రాత ఇంతేనా నీ..
బదులు రాకపోతే నేనైనా ఎంతెదురు చూస్తాను నేస్తమా!!

నాకేమైనా సాయం చేస్తావా
ఎదురొచ్చి నా పాత పోస్టులు తిరగేస్తావా
ఓ! నీకంత బద్దకమైతే వీలైనప్పుడే అరో-కొరో రాస్తా.
పనుల్లోపడి నా ఏడుపేదో నే ఏడుస్తా.

RTS Perm Link

9 responses so far

Nov 02 2012

కవిత్వం నా కళ్ళజోడు

అదిలేకపోతే అంతా మసక మసక
నింగి-నీరు నీలాలు కలసే చోటున సౌందర్యం బదులు
నెత్తుటిచుక్కలచారలా..బీభత్సం
నా ముందున్న మనిషి నను వెంటాడే నీడై
అభద్రతా భావనలోకి నెట్టుతాడు

అలికిన అక్షరాల్లా రెటినా నంటినట్టు
నాకంటికి నలకలై నకలై
ఎంత నలిపినా అడ్డం గానే కనిపిస్తాడు
ఎదుటి వారు సాటివారు-తోటివారు లా కాక
బోటిముద్దల్లా అగుపిస్తారు

ఒక నవ్వే నవ్వితే తిరిగి అదే అందేదేమో..
నొసలు ముడుచుకుని పెదాలు సాగితే
ఈ వ్యక్తీకరణ సభామర్యాదకు ఆమడని
నా భావంతో ఇమడక
అంతదూరమూ జారిపోతారు..

వారు మరుగయ్యాకా.. నా ముందు
ఓ జారుడు పదార్థమున్నట్టూ
అది వారిని వెనక్కి తేలేని
బర్ముడా త్రికోణం లో కూరేసినట్టూ అనుకుని
అడుగు కదపకుండా
ఆ ప్రశ్నార్థకం నవ్వుతో నిలబడి ఉంటాను

ఎవరైనా ఏదైనా చూపిస్తే అది కళ్ళ డాక్టరు
పరీక్షకోసం గలిబిలి చేసిన అక్షరాలేమోనని
ప్రహేళిక ను నింపే పిల్లాడిలా లోగుట్టును
రట్టు చేద్దామని విఫలయత్నం చేస్తాను

ఎట్టా చూసినా నా కంటికి కలకే
పుసుగు పట్టిన కళ్ళతో చూసే వాడికి
లోకం అంతా కంటకింపే
మారిన మార్పుని ఆకళించుకోలేని మనిషిని కదా

అన్నీ తెలుసనుకుని ఏమీతెలియకుండా ఉండక
అప్పుడప్పుడు కవిత్వం కళ్ళజోడుతో
లోకాన్ని చూస్తాను..

ఇప్పుడంతా.. నాకు తెల్లకాగితం..
కింద మాత్రం నా సంతకం.

RTS Perm Link

6 responses so far

Oct 31 2012

అందమా!! నువ్వెవ్వరు?

అందం తనమీద రాయమందో కవిత
అంగరాగాలు లేని అమ్మాయి కోసం
ఆరోగ్యమైన జవరాలికోసం, చెలువ పిల్లకోసం
ఎక్కడని వెతకను ఏకొలతన కొలవను

అద్దాన్ని అడిగా తానే అందమంది
అద్దమే అందమైనప్పుడు అన్నీ అంతేగా
ఉండాలేమో మరి అద్దంలాంటి మనసు
మనల్ని మనలా చూసుకునే సొగసు

అద్దాలమేడలో ఉంటే అందమైపోతుందా
అద్దం అందమైతే రాయికెందుకు లోకువ
రాలిపోతే పాలిపోతే పగిలేనె భళ్ళున
ఆడపిల్ల అద్దమూ వద్దు నాకీ పోలిక

రెండుకూడా పెళసరే ఎంచుకుని వేసుకోవాలి పోగిక.
ఏది మంచో లెక్కలేవి ఎందుకొచ్చిన చిక్కులివి
ఊహల్లోని బొమ్మకు పోయలేనా ప్రాణము

పుట్టినప్పుడు పురుడు పోసిన మిస్సమ్మలా
బళ్ళోకెళ్లే బుజ్జోడికి టీచర్ లా
కాలేజీ కుర్రోడికి ముందుబెంచీ అమ్మాయిలా
నాకెప్పుడు కనిపిస్తావో అందమా..

స్నానమయ్యాకా అమ్మదిద్దే నుదుటి బొట్టులా
పల్లెగట్లమ్మట నీడ పంచే చెట్టులా
కొబ్బరిముక్క పగలగొట్టి పెట్టే గుడిమెట్టులా
మారుతున్నకాలం లో మళ్లీ నిను చూస్తానో లేదో అందమా!

అందమంటే నే మిస్సైన బంధమా
కలల్లో ననుతాకే భావనా గంధమా
అక్షరాల పలుకరింపులతో
ప్రపంచాన్ని పరిచయం చేసే గ్రంధమా!!
అసలు నువ్వెవ్వరు అందమా!!

నను కన్న ఆనందమా
నే కనుగొన్న స్నేహమా
నాకింకా పుట్టని పసి బంధమా
ఎన్నటికీ అంతుపట్టని అపురూపమా
అసలు నువ్వెవ్వరు అందమా!!

RTS Perm Link

One response so far

Oct 31 2012

తెలుగువెలుగు మూడో సంచిక వివరాలు-విశేషాలు

బాలల దినోత్సవ శుభాకాంక్షలతో..

దీపావళి తెలుగిళ్ళను వెలుగిళ్ళ గా మార్చాలని ఆకాంక్షిస్తూ రామోజీ ఎడిటోరియల్: ఇంటింటా తెలుగు దీపం
ఇందులో నాకు గుచ్చుకున్న మాట” తెలుగులో మాట్లాడుతుంటే అమ్మ, నాన్న, అక్క, అన్న, అమ్మమ్మ, తాతయ్య, ఇరుగుపొరుగు, మనసమాజం, సంస్కృతి గుర్తుంటాయి. లేకపోతే “మమ్మీ’లే మిగులుతాయి.
కథ: కొక్కొరో…క్కో కార్తీక్‍రాం అదిలాబాద్ యాసలో బాగ రాసిండు.
సిహెచ్ వెంకటేశ్వర్లు వేమన పద్య విశదీకరణ కొత్త శీర్షిక: నాటి మేటి తెలుగు పద్యం,ఏనాటికైనా లోకరీతి ఇదేకదా..అనేటట్టు.
పుట్టినరోజు శుభాకాంక్షల మేఘసందేశం అచ్చ తెలుగు సందేశాల వేదిక గా.. ఆకాంక్షల పూదోట గా ఈ పుట
ఇదే పేజీలో ఎత్తుకోండి హత్తుకుపోతారు.. అని వేసిన కవిత సందర్బోచితంగా ఉంది.
తెలుగు కేసరి దాసరి పేర ఆయన సినీ నేపధ్యం లో తెలుగు జీవితపు సంభాషణలు
భావ దీపావళి పుట్టుపూర్వోత్తరాలనుంచి సాహిత్యంలో భాగమెలా అయ్యిందనేది చెప్పేప్రయత్నం అనుకుంటా..శ్రీధర్ గారి బొమ్మ సత్యాకృష్ణుల గరుడవిహారం అదిరింది.. అందం గా అమరింది.
కథ: అమ్మ రాసింది సన్నిహిత్.. ఏం బొమ్మేశావ్ కవితమ్మా! భలే.
చిన్న పిల్లలు నడిపే కొన్ని పత్రికల వివరాలతో “చిట్టిచేతులు-మంచిరాతలు”
తెలుగు పై గొల్లపూడి మారుతీరావు మాట ” తల్లిదండ్రులూ.. తవసుప్రభాతం!
స్పూర్తి నందించే అపూర్వ విజయ గాధగా ” యూధులు భాషా యోధులు శైలేష్ నిమ్మగడ్డ అందించిన ఇజ్రాయిల్ విశేషాలు .. మనరాష్రంలో ఉన్న యూదు కుటుంబాల వివరాలూ.. జీవనం గుంటూరు ఈనాడు రిపోర్టర్ రమేష్ మాటల్లో
sp బాల సుబ్రహ్మణ్యం భాషాప్రేమ ” అమ్మపలుకు చల్లన”.
మన తెలుగు వాడు పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ నే దేశం యావత్తూ జాతీయ ప్రతిజ్ఞ గా శిరసాధరిస్తుందని, స్మరిస్తుందని ఇప్పటి వరకూ తెలియక పోవడం .. ఓ గర్వకారణపు తోరణం కావాలని కట్టుకోనట్తేకదా! ప్రతిజ్ఞ అందించిన ప్రజ్ఞ చదివే బాధ్యత మనందరిదీ.. అందించింది వేణుప్రసాద్ ఈనాడు, విశాఖ
పద్యాలను వేల మంది స్కూలు పిల్లలతో వల్లెవేయిస్తున్న తెన్నేరు కు చెందిన దేవినేని జయశ్రీ మధుసూదనరావు దంపతుల మాటల్లో పద్య పఠన ప్రభావం వ్యక్తిత్వ నిర్మాణం లో అన్న కోణం ఎందరికో కనువిప్పు.
సాహితీవనం లో బాల ముత్యాలు పేర ముత్యాలసరాలు రాస్తున్న పిల్లలు నిజంగా గురజాడ అడుగుజాడలు.
కథ దేవుని బిడ్లు సడ్లపల్లె చిదంబర రెడ్డి మడకశిర యాస గోస.
మనకు స్వరం సుస్వరం పేర మన భాషోద్యన సమాఖ్య తొలి అధ్యక్షుడు సి. ధర్మారావు సూచనలు.
డా. సి. మృణాళిని గారు నీ యెంకమ్మా.. ఇదేం భాష! ద్వారా మనం మరుస్తున్న భాషా సంస్కారం గుర్తుచేసే ప్రయత్నం
కాలువ మల్లయ్య తెలుగు వనం తెలంగాణం లో ఈ ప్రాంత వాసుల తెలుగు వైభవాన్ని చవిచూపించారు.
అక్షరాలూ అప్సరసలే అంటూ షేక్ బడే సాహెబ్ తెలుగు లిపి లో మార్పులు చేర్పులూ(!) సూచిస్తున్నారు.
ఇక పుస్తకం మొత్తం లో నేను మైమరిపించే పేజీ:57 కొప్పర్తి కవిత్వం : ప్రాచీన స్మృతుల్లోంచి

జోలెపాలం మంగమ్మ గారు బ్రౌన్ దొర గురించి తెలుగుకు వెలుగు తెచ్చిన ఆంగ్లేయుడు
శరత్బాబు కరుణశ్రీ అత్మీయ సాహిత్య పరిచయం: టీపాయికి పువ్వందం-పాపాయికి నవ్వందం
ఆర్టిస్ట్ జావెద్ యానిమేషన్ కబుర్లు కదిలేబొమ్మా.. కబుర్లుచెప్పమ్మా…!
పాటల రసరాజు బాధ: రక్కెసపొదల్లో రసభాష
విజయరాణి కథ : స్పందన
పద్మశ్రీ శోభానాయుడు, పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్, కాళీపట్నం రామారావు భాషాంతరంగాలు
ఆచార్య రవ్వా శ్రీహరి వాడుకలో ఒప్పులూ, వ్యాకరణం లో తప్పులూ
ఎస్.ఆర్ భల్లం ఈ గాలీ.. ఈ నేల..!
డా. పులిచెర్ల సాంబశివరావు కథ కూర్చున్న కొమ్మ.

విశ్రాంత ఉపాధ్యాయులు ఎన్నవెళ్ళి రాజమౌళి వుద్యోగ విరమణ తరువాత స్కూళ్ళల్లో కథలు పాటలు, పద్యాలు ద్వారా బాషను నీతిని నేర్పే పద్దతి చూపారు : బందీలవుతున్న భావివెలుగులు శీర్షికన.
పొత్తపు గుడి (లైబ్రరీ) విశేషాలు సన్నిధానం నరసింహశర్మ మాటల్లో
పావులూరి మల్లన్న పద్య గణితం గురించి.. ఈనాడు పి. శంకర్రావు రాసిన ” ఒకడు లెక్కల కవి.
కె. సురేష్ మంచిపుస్తకం పబ్లికేషన్స్ ట్రస్టీ మాటల్లో ఆబాలగోపాల సాహిత్యం
వింజమూరి అచ్యుతరామయ్య కవిత: మంత్రపుష్పం
మధురాంతకం రాజారాం కథ: కమ్మతెమ్మెర
పదపంచాయితీ
పుస్తక సమీక్ష , తులాభారం తెలుగులో చదివితే నేరమా..! ప్రకాశం జిల్లాలో పరభాషా లో చదువు బుర్రకెక్కక ఉసురు తీసుకున్న కథనం. . ఇది మన తప్పులకి ముగింపు కావాలని.. ఈ సంచిక ఉద్దేశమేమో..
ఈ సంచిక ముఖ చిత్రం చాల నిండుగా ఉంది కదూ.. మన పండుగ లా..
ఇది నా ఘోషేనా.. కొని చదువుతున్నారా!!

RTS Perm Link

4 responses so far

Oct 30 2012

No worries!!!

ప్రవాహం కవితావేశంలా లాగేస్తుంది ఎటోకటు
ఉద్వేగం ముంచేస్తుంది కలలపై రోకలిపోటు
నైరాశ్యం నమిలేస్తుంది పంటికింద పెదవిని..
ఊహించని పిడుగుపాటు..

పరిస్థితులు పగబట్టినా
ఇబ్బందులు చుట్టుముట్టినా.. తట్టుకోవడం
బాధ్యతల బరువుల్లోనో
ఓటమి అంచుల్లోంచో జారిపోతున్న మనల్ని
మనమే నిలబెట్టుకోవడం
ఇదికదా! అవసరం పుట్టినందుకు.

దేవుడనే వాడుంటే నువ్ మోయలేని బరువుని
నీ భుజాన మూటకట్టడు.

పరీక్షలకే పారిపోతామా..
పరిస్థితులకే మారిపోతామా
ప్రవాహానికే జారిపోతామా..
మనకి మనం అసలేంకాకుండా పోతామా!!

నిలబడటం నీవంతు.
చెయ్యివ్వడం.. చెయ్యనివ్వడం అంతా నీ హ్రస్వదృష్టి
ఎవరు చూస్తే ఇంతవారమయ్యామో..
వాడాడే చదరంగంలో ఇదో మాయ

లోతుచూసుకుని నడు ఎక్కడైనా
తప్పుకునే ఆలోచన మానుకో
నిన్ను మళ్ళీ తయారుచేసుకునేది నువ్వే..
నిన్ను నీలా పొందడం నీకే సాధ్యం

నువ్ తప్పుకుంటే జరిగేనా నీ పునః సృష్టీ !!

RTS Perm Link

No responses yet

Oct 29 2012

మనసు ’కీ’ whole

చూస్తాం.. లోకం.. ఆ క్షణమంతా మనదే..
లోకమా క్షణమా ఏమో.

నచ్చిన రంగులుంటాయ్.. మనల్ని కావాలంటాయ్
రంగవ్వాలా! నచ్చాలా!! ఏమో.

వెచ్చని ఆలోచనలుంటాయ్ లోనికి రమ్మంటాయ్
ఆలోచనలనా! వెచ్చదనాన్నా! ఏమో.

చిక్కని జవాబులుంటాయ్ కనుక్కోమంటాయ్
కనుక్కోవాలా! అడగాలా! ఏమో.

విప్పని ముడులుంటాయ్ చేయి చేసుకోమంటాయ్
ముడులనా .. వాటి జడలనా ఏమో.

కొన్ని కోరికలుంటాయ్

చూడాలని.. వినాలని .. ఆఘ్రాణించాలని.. స్పృశించాలని
రుచిచూడాలని.. ప్రేమించాలని ..
కోరాలా!! కోరపీకాలా ! ఏమో.

పుట్టినప్పుడు ప్రతీదీ అందంగానే ఉంటుంది.. పసిపాపలా.
ఆ క్షణం లో అదే లోకం..
లోకం లోకి అందమైన దాన్ని వదిలేయ్.. ఇంకేంకావాలి!

నీకు నచ్చినట్టు రంగరించు..
ఇచ్చేయ్..
నీ రంగులతో లోకం నింపు ఇంకేంకావాలి!

లోనికి వచ్చిన ఆలోచనల వెచ్చదనాన్ని పంచు
జవాబు అడుగు..
దానికదే కనుక్కుంటుంది ప్రశ్నని

జడపట్టుకో
ముడి పట్టుబడిపోతుంది
తాడో-పేడో తేలిపోతుంది

కోరికలూ.. మీ మూలాలు వేరు
లోనికి చూస్తావా.. బయటదారులు కనిపిస్తాయి.
మనసుకి మార్గాలుంటాయి.. గొళ్ళాలుంటాయ్
తెరిస్తే బయటవాటిని లోపలే చూపిస్తాయి
బయటవెతికావో నిను లోపలపెట్టి చీకటి పాల్చేస్తాయి.

చీకటిని నీ వివేకంతో కాల్చేయ్..
మనసంతా నీ ప్రపంచమౌతుంది..
ఈ ప్రపంచానికే నీమీద మనసౌతుంది.
ఇంకేంకావాలి!!!!!!!!

(తనను వెతకొద్దంటూ..అందరికీ దొరికిపోతున్న .. ఓ బ్లాగర్ కి…ప్రేమతో. )

RTS Perm Link

4 responses so far

« Prev - Next »

RTSMirror Powered by JalleDa