Archive for the 'నా భావాలు- ఆవేశాలు' Category

Sep 30 2013

నీ అస్థిత్వం ఒక వస్తువేగా!. ……………………..

pellam.jpeg

ఏమి చేద్దామనుకుంటావురా!
తాత్కాలిక శతమర్కటా!..

అన్నిరోజులూ ఒక్కలానే మొదలౌతాయి మరి..
అమ్మ నేర్పిన అలవాట్లు..
ఉన్నాడో-లేడో తెలియకపోయినా అప్రయత్నంగా చూపులు దేవుని పటం పైనే..

తన శరీరం తప్ప వేరొక ప్రాణేదైనా కనిపిస్తుందేమోనని తేరిపార చూస్తావు..
అద్దంలాంటి ఇంటిని చిందరవందర చేయలేని నీ జేబు సామాన్లు.. విడిచిన బట్టలు
పక్కకిలాగితే ఆక్రమించుకున్నంత జాగా కాదు ఈ ఏకాంతం నీ జీవితంలో
చీమ కూడా కనిపించని అంతస్తుల అద్దెకొంపలోనీ అస్థిత్వం ఒక వస్తువేగా!..

మౌనం మూర్తీభవించిన పనిపిల్ల వచ్చినట్టు తలుపు చప్పుడో..
వెళ్ళినప్పుడు ‘తలుపేసుకో సారూ’ అన్న సూచనో నిన్ను అప్రమత్తం చేసే రెండు క్షణాలు
నువు ప్రాణమున్న జీవానివని గుర్తుచేస్తాయి..

ధ్యానంలోంచి లేచినట్టు.. ఏకాంతమందిరంలోంచి జనజీవన స్రవంతిలోకి
వడివడిగా ఒక దూకు దూకుతావు.
ఇక రోజంతా.. నీదికాదు..ఇక ఇల్లుచేరే వరకూ.. నువ్వు నీలో ఉండవు.
నీవు నావనైనట్టు జనసంద్రాన్ని చీల్చుకుంటూ కనిపించని గమ్యం వైపు సాగిపోతావు

బంధాలు తోడున్నప్పటి ఆకతాయి మనసుకు,
ఆనాటి ఉడికించే మాటలకు అసలు అర్ధాలు ఇప్పుడే తేటతెల్లమవుతాయి.

ఎటుచూసినా ఒక తెలియనితనం నీదికాని పరధ్యానంలో లోకం.
అప్పుడే తెలుసుకుంటావు నీలోకం వేరోకచోటఉన్నదని..
నిన్నే కలవరిస్తున్న నీ నేస్తాలకు నువ్వు అందవు.

మాటల్లో ఒలికేవి పనుల్లో పలికేవి ఎన్నున్నా ..
నీ ధ్యానం లో నిలిచేవి జన్మ బంధాల అనుభుతులేనని..
నిముషాలు యుగాలుగా మారే రోజుల్లో నువ్వో యోగివి..
తపస్సు ఏమిటో అ మాత్రం ఎరుగవా!!

వెనక్కి వచ్చే రైలు బండి కూత కోసం..
సాగనంపిన క్షణం నుండి పడికాపులు కాస్తున్నావ్..
సహచరి ఊరెడితే.. ఏ తోడూ కావాలిరా!
తిరిగివచ్చే తనతప్ప..

రిప్వాన్ విన్కిల్ లాంటి ఎదురుచూపుల జీవితం లో
అప్పుడప్పుడు వినిపించే స్నేహపు పలకరింపులు తప్ప..
సినిమాకథల్లో తప్పులను చూసి నవ్వుకోవడం తప్ప..
ఎదురుచూస్తూ కూర్చోవడం .. తప్పు కాకపోవడం తప్ప.

==29.9.13==

RTS Perm Link

2 responses so far

Aug 15 2013

yaSaswi’s || ఇక తుమ్మను నేను..

తీవ్రమైన గాలి ఎగతన్నుకొస్తున్నట్టుంది
బయటపడదూ.. లోపలిమడలేదు
గుంఫన మంతా గుంభనైపోయింది
ఒక అర్ధ-స్వతంత్ర కంపనం.

నిన్నటి పందెరంలో
పాతనోట్ల ముక్కవాసన
ప్రకోపమేమో!
ఏం పడిశం పట్టనుందోనని
ముద్దుకి దూరం జరిగిన ప్రియురాలు..

రాత్రి కలలో రాజకీయ తారల
అమిత కాంతి సందర్శన వేదనే
ఈ వికటత్వమని
నిజం తెలుపలేను

ఒక్కటి మాత్రం నిజం..
మామూలుగా లేను

బాహ్య ప్రేరకాలు నను చేరేందుకు
ముక్కునాశ్రయించినట్టున్నాయి

నే పీల్చేగాలికి మేధోహక్కుల హామీపత్రం పై
రాజముద్ర మార్చాలంటున్నాయి

ఇప్పుడు నా నాడీ పథం కండరాలూ
క్రియాశీలంగా లేవు
ఏ గాలీ శక్తి కణాల విడుదలకు
అనుకూల ప్రేరణ కలిగించడంలేదు

నా జీవితం నా ఊపిరితో ముడిపడి ఉంటుందని
తెలిసాకా ఉక్కిరిబిక్కిరిలో ఉన్న నేను
ప్రియురాలి నిశ్వాసలను
ఎలా ఆస్వాదించగలను!!

చినుకు భాష సంకేతాలను
భేధించలేను విభేదించలేను
ముసురు తెచ్చిన పులపరింతలో
పులకరించలేను

ముక్కు నలుపుకు కూర్చోవాలిక
ప్రయాణానికి అడ్డం కాకుండా
ఎలాగైనా ఆపుకోవాలి.
ఈ తుమ్మును

==1.8.2013==

RTS Perm Link

No responses yet

Aug 15 2013

యశస్వి ||ఎందుకిలా?

ఉగ్రశ్రవసువు సౌనకాది మునులతో ఇలా చెప్తున్నాడు
వినత చిదిమిన గుడ్డులోంచి
అనూరుడు సగం దేహంతో బయటికొచ్చి ప్రశ్నించాడు

“ఎందుకమ్మా? ఇలా చేశావు??
అసూయతోనేనా
ఎందులిలా??”

ఎందుకు??
ద్విపాద పశువుని చేసినా
రెండుకాళ్ళపై నిలబెట్టినా
మనల్ని సమూహం చేసినా, ఈ ప్రశ్నే

రాక్షసబృందంలోంచి రాహువును వేరు చేసిందీ
బానిస బంధనాలనుంచి స్పార్టకస్ ను పుట్టించిందీ ఈ ప్రశ్నే
రామాయణం జరిగుంటే యుధ్ధకారకమూ ఈ ప్రశ్నే
దేశ విభజనలో చిందిన రక్తానిదీ ఈ ప్రశ్నే

అసలీ ప్రశ్నే ఓ యుధ్ధభేరీ
ఓ ఆలోచనకు తొలి అడుగు
జలస్థంబన విద్య తెలిసిన వాడికి
ఈ ప్రశ్నే అవసరానికి నీళ్ళ మడుగు

కావాలన్నా ఇదే ప్రశ్న.. వద్దన్నా ఇదే ప్రశ్న..
ఎందుకిలా!! ఎందుకిలా!!
ముందే పుడుతుంది ఈ ప్రశ్న
లాభనష్టాల బేరీజు ఇక తరువాతే..

సమస్యల కీకారణ్యంలో
పంపకాల అయోమయం
అడిగినోడికి ఏంకావాలో!
ఇచ్చినోడు ఏమాశించో..

ఒకింట్లోనే లేచాయి అడ్డుగోడలు
ఈ ప్రశ్న ఉదయించాకే
కావాలన్నోడికి పండగే..
వద్దనుకున్నోడికి ఇప్పుడు ఆవేశం దండగే..

గుమ్మాలు వేరయ్యాకా
కుంపట్లు ఒకటవుతాయా!!
కష్టాల కంటితుడుపులో
త్యాగాల వెలకట్టగలమా?

ఉగ్రశ్రవసువు సౌనకాది మునులతో కొనసాగింపుగా ఇలా చెప్తున్నాడు
వినత చిదిమిన గుడ్డులోంచి
అనూరుడు సగం దేహంతో బయటికొచ్చి ప్రశ్నించాడు
ఎందుకమ్మా? ఇలా చేశావు?? అసూయతోనేనా!!

అయితే అనుభవించు దాసరికం చేస్తూ
కనీసం తమ్ముడ్నైనా ఎదగనీ పరిపూర్ణంగా
నిను ఉద్దరించేది వాడే..అని అన్నాడో లేదో..!!

వెలుగుల రథాన్ని నడిపించడానికి
వెడలిపోయాడు అనూరుడు

==30.7.2013== (7-7.30 pm)

RTS Perm Link

No responses yet

Aug 15 2013

Yasaswi’s ||ఓ దేశభక్తి కవిత : సిపాయిల తిరుగుబాటు కాలం


Yasaswi’s ||ఓ దేశభక్తి కవిత : సిపాయిల తిరుగుబాటు కాలం

మూలం: సూరజ్ మల్ మిశ్రానా ((1815–1863)

పందులు పంటల్ని పాడుచేసినట్లు..
ఏనుగులు కొలనులో అలజడి చేసినందుకు
కేసరి సివంగిని సైతం మరచినట్టుంది
ఏ పందెంలో పణంగా పెట్టిందో పౌరుషాన్ని

ఓ ఠాకుర్! నువ్విక సింహానివి కావు
పరదేశికి కప్పం కట్టి బతుకుతున్నావు
పంజాదెబ్బకు ఏనుగు కుప్పకూలితేనే నువ్వు నువ్వు.
దయనీయం ఈ జీవితం నువ్విక మృగరాజువి కావు

పరదేశీ పాకులాటలో కష్టాల పరంపర
లోతుల్ని గమనించకున్నావు
లక్ష్యం లేక విలాసాలలో
విలువైన కాలాన్ని ముంచేసావు

ఏం మిగిలింది నీకు
గతిలేని పూరిపాకల పాటి జీవనంలో
మట్టిగోడలమీద
పెరుగుతున్న గరిక తప్ప

ఏం మిగిలింది నీకు
ఎత్తైన రాజప్రాసాదాల వెనుక
పరాయి సర్దారుల చీత్కారాలు
గులామ్ గిరీల అవమానాలు

రాజగృహాలు కొల్లగొట్టిన జీవితానికి
పూరిపాకల శాపాలు
పూరిళ్ళపై లూటీకొస్తే
అడ్డమేముంది!!చావేగతి నీకు

బ్రిటిష్ వారికి తలవంచిన రాజుల్ని ఉద్దేశించి.. (ఇంగ్లీష్ నుంచి అనువాదం)

RTS Perm Link

No responses yet

Jul 23 2013

Yasaswi’s ||First Leaf

Translation of ‘తొలాకు’

One fallen leaf
Bounced off the branch
The Mother root remembers
The rapture of sprouting into
Sunlit world

New leaves moan
The burden of old kinships
Feels like a life sentence
The separation of loved one
In the lustful wind

The tree did not sway
Yet the leaf blew away
Meloncholy of parting never dozes off
In the swing of the wind

Life has to bend before the whirlwind
it has to go on
Since the plant grows into a Tree
Gathering all under its shade

Drinking from the clouds
The Tree remains firm
In the gusty winds of the torrential rains
None sheltered her from
The Sun and the Rain

Unable to forget the first leaf’s loss
The tree patiently sprouted
New leaves in the summer heat

No branch of the tree is
Bothered with the parting
But the fallen leaf
Returns frequently
To visit the greenery

Ancient love
In eternal time
to scion
the first leaf again and again.

RTS Perm Link

One response so far

Jul 22 2013

యశస్వి ||తొలాకు (First Leaf)

రాలిన ఓఆకు
కొమ్మను తాకి ఎగిరిపోయింది.
తల్లి వేరు చివరల్లో
తొలి చిగురు నాటి పులకరింతలు

పాతచుట్టరికాల పొడగిట్టని
కొత్తాకులఆక్రోశం
ఏ గాలో గట్టిగా వీచిన మోహంలో
విడివడ్డందుకు యావజ్జీవ శిక్ష!

మొక్క కదలలేదు..
ఆకు ఆగలేదు.
గాలి ఉయ్యాలల ఊపుల్లో
ఎడబాటు విషాదం దాగలేదు

జీవితం కొనసాగాలంటే
వాలు గాలికి తలొగ్గాల్సిందే..
మొక్క మాను ఐనందుకు
అందరూ ఆ నీడ చేరేవారే

వానలకు వెరవక
ఎన్ని నీళ్ళుతాగి నించుందో చెట్టు
ఎండినా తడిచినా
గొడుగు పట్టేదెవరు

తొలిఆకు ఎడబాటును
ఎండవేడిలో దిగమింగలేక
మొక్కవోని ఓపికతో
ఎన్ని ఆకులను తొడిగిందో

పిందెకాసిన ఏ కొమ్మకూ.. ఈ కష్టం తట్టదు
రాలిన ఓ ఆకు మాత్రం
పచ్చదనాన్ని పరికిద్దామని
అప్పుడప్పుడు వచ్చిపోతూనే ఉంది

ఇంకెన్నాళ్ళో తెలియని కాలంలో
అనాదిగా ఆదిమ ప్రేమ
తుఫానులను వేడుకుంటూ
తొలి ఆకును మళ్ళీ.. తొడగాలని

==20.7.13==

RTS Perm Link

No responses yet

Jul 12 2013

||అభాగ్యనగరం లో..

ఓదార్చేకొద్దీ ఏడ్చేబిడ్డలా ఉంది ఈ ఊరు
గూరుచుట్టుపై రోకటి పోటు..
ఈ సిటీ లైట్ ఉదంతం

కుండ దుమ్మును రోకలితో దులిపినట్టు
పౌరుల పాతభవనాలపైనే మూడోకన్ను
ఆవాలు ముద్ద చేసే చేష్టలు
నగరపాలనలో ప్రస్పుటం

ఇళ్ళు పోగొట్టుకున్నవాళ్ళకు..
ఆకు ఇస్తే.. అన్నం పెట్టినంత పుణ్యం
జీవితాన్ని అందుకోవడమే కష్టం..
పాలుపొంగించుకోవడమెక్కడ..

ఉస్మానియా ఆసుపత్రి
మరో సిటీలైట్ అయ్యేదాక..
హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ
నియామకానికి..దిక్కూ-దివాణాలేదు..

కూలాకో పోయాకో చూస్తారేమో!!
రాజకీయ అండలు ఉంటే..
ఎక్స్‌గ్రేసియాలో వాటాతో..
ఎన్నిశవాలలైనా దాటొచ్చు

శిధిలం అంచున నించున్న
వివేక వర్థిని, ఇసామియా స్కూళ్ళ గోడు
ప్రభుత్వ ఎజండాకి తట్టదు..

అచ్చిగాడు.. నూతిన పడితే..
ఆ పంచ నాకన్నట్టు..
గోచీ కింద కుర్చీకోసం
పెద్దలకు తీరిక దొరకలేదంట..

ఏడ్చి- ఏడ్చి వరిసిపోయిన కళ్ళు..
కోపాన పోయిన ముక్కు నేల రాస్తే వస్తుందా
ఇస్తే.. చెడేదీ లేదూ.. చస్తే వచ్చేదీ లేదన్నది..
తాతలు తవ్విన చెర్వులాంటి మాట..

ఇప్పుడు పూడుకుపోయింది మనిషి సొంతగొంతు
విభజన జపానికి తప్ప అది పెగలదు
చేతికి బురదైతేనే.. నోటికి పెరుగన్నది నిన్నటిమాట
బురదంటినా బువ్వ చాలక..
ఉప్పువాడు ఏడ్చే.. పప్పువాడు ఏడ్చే.

హలీమ్ ల మాట అల్లాజానే..
దిల్‌సుఖ్‌నగర్ నా బస్తీ ఐనా..
ఇరానీ చాయ్ తాగుతూ
నేనింకా బతికున్నందుకు
నా కాళ్ళకు నేనే మొక్కుకుంటున్నా..

RTS Perm Link

No responses yet

Jul 08 2013

||చిన్నా!.. టైమయింది.. లే…

• చిన్నా!.. టైమయింది.. లే…
• స్కూల్ బస్సు వచ్చేస్తుంది..
• మొహం కడుక్కో..
• పళ్ళు తోముకో..
• నా మాట వినరా కన్నా!!
• టై మైపోతుందీ..
• పక్క అలాగే వదిలేసావు..
• ఇలా దా.. స్నానం చేద్దువ్ గానీ..
• లేచావా!!
• తలదువ్వనీ
• బట్టలివిగో
• బూట్లేసుకున్నావా!!
• ఏరా అలా ఉన్నావే!..
• ఒళ్ళెచ్చగా ఉందా..
• హోంవర్క్ బుక్కు పెట్టుకున్నావా!!
• చూసుకో అన్నీ ఉన్నాయో లేదో.. జాగ్రత్త..
• బాక్సు నువ్వే తింటున్నావా!! ఏదీ వదలొద్దు.. అర్థమైందా!!

• ఈవాళ గేమ్సున్నాయా!! షూస్ జాగ్రత్త
• అవిఇవీ కలపకు.. నెమ్మదిగా తినూ.. నమలాలి.. అలా అని లేట్ చేయకు.. బస్సొచ్చేసింది..
• జాగ్రత్త.. దేవుడికి దణ్ణం పెట్టుకున్నావా!!
• పుస్తకాలు అలా పడేస్తావే!!
• కాళ్ళు – చేతులూ కడుకున్నావా.. ఆగూ..
• పాలు తాగకుండా బయటకు వెళ్ళకు..
• ఈ పాలు తాగు.. తొందరగా ఎదిగిపోతావ్.. బోల్డు బలమొచ్చెస్తుంది
• మూతి తుడుచుకో.. కొద్దిగా పౌడర్ రాస్తానుండు..
• బయటాడుకోరా.. ఎవరితోనూ దెబ్బలాడకు
• మంచిగా ఉండాలి.. కిందే ఆడుకో.. రోడ్డు మీదకు వెళ్ళకు.. కుక్కలుంటాయ్ బాబోయ్
• ఆరింటికల్లా.. ఇంట్లో ఉండాలి! లేకపోతే నేనే వస్తా నీ ఇష్టం మరి..
• ఎన్నింటికి రమ్మంటే.. ఎన్నింటికి వస్తున్నావ్!!
• నీ గది సర్దుకో.. ఇల్లు పాడు చేయకు.. ఈ పక్క పరు..
• ఇప్పుడే చెయ్యాలి లేకపోతే.. టీచర్ తిడుతుంది.
• ఏరా అడివిలో పుట్టావా నువ్వేమైనా!!
• ఒక్క మాటైనా విన్నావా!! నీతో నేను మాట్లాడను..
• ఫోనెత్తు,, సరిగ్గా పెట్టు.. టీవీకి అంత దగ్గరగా కూర్చోకు..
• ఇలా తిరుగు.. ఇలా తిరగమంటుంటే….
• అన్నం వలిగిపోతుంది..
• ఆ గోడ మీద రాయకు ఓనర్ చూసాడంటే తిడతాడు..
• రాత్రికి నీకు కంప్యూటర్ గేమ్ లేదంతే..
• నా మాట వినకపోతే సెల్ ఫోన్ కూడా ఇవ్వను..
• తీసుకున్నాక థాంక్స్ చెప్పాలి..
• నువ్ పెద్దెదిగాకా కానీ నే చెప్పింది నీకర్థం కాదు..
• నీకు పిల్లలు పుట్టేదాకా ఆగు..
• అప్పుడనుకుంటావ్.. అమ్మ నిజం చెప్పిందని..
• ఇదికొరుకు.. నమిలేటప్పుడు నోరు మూసుకోవాలి
• నాతో మాట్లాడకు
• నీ ప్లేట్లో పెట్టిందంతా తినెయ్యాలి.. వదలకూడదు
• విసిగించకు.. గట్టిగా పట్టుకో
• నేను మూడు లెక్కపెట్టేలోగా రావాలి.. లేదా..
• నీ పని నువ్ చూసుకో..
• నాకెందుకు!!.. నిన్నసల పట్టించుకోను ఇలా ఐతే..
• నువ్ ఎంత పెద్దోడివైనా నా కొడుకువేరా..
• తిన్నగా నడు
• నిజం చెప్పు.. అమ్మ మీద ఒట్టేసి..
• మీ ఫ్రెండ్స్ అంతా మేడ మీంచి దూకేస్తే.. నువ్వూ దూకేస్తావా!!
• ఈ మాట నీకిప్పటికి వెయ్యి సార్లు చెప్పాను..
• నువ్వు మీ నాన్న కొడుకువిరా.. అందుకే నా మాట వినవ్..
• నీతోనే మాట్లాడుతుంది.. ఇలా చూడు..
• ఎక్కడతీసింది అక్కడ పెట్టు..
• ఊరికే ఏడవకు..పడుకో..
• మీద కాలూ చెయ్యీ వేసేస్తే ఎలా.. గాలాడదు నాకు…
• దా బొజ్జో…దణ్ణమెట్టుకున్నావా!!

>

అలసిపోయాడమ్మా..బిడ్డ..
వీడు నా బంగారు కొండ..
దిష్టి తియ్యాలి..

RTS Perm Link

No responses yet

Jun 22 2013

||బతికుండగా వినిపించుకుంటామా?||

ఒడిలో పిల్లల్లారా!..
దైవదర్శనం కోరి వచ్చిన మిమ్మల్ని
శాశ్వత నిద్రపుచ్చానని..
మీవాళ్ళు నిందిస్తున్నారు..

ఎడబాటుని జీర్ణించుకోలేక
రోదిస్తున్నారు..
అర్థం చేసుకోలేని మూర్ఖత్వంలో
నెపాన్ని.. పాపాన్ని..
తల్లి ప్రకృతిని
నాకు అంటిస్తున్నారు..

లయకారుడి సన్నిధిలో ఈ సహయోగం
మీరుకోరని.. ఈ దైవదర్శనం తర్వాత
బతికున్నప్పుడు ఎవరూ అర్థం చేసుకోని మాటలు
మీకు.. ఇప్పుడు చెబుతున్నా

నా గుండెలు, బద్దలుకొట్టి..
గర్భాన్ని కొల్లగొట్టి..
కొండచెరియల్నీ, నేలబొరియల్నీ
వదలకుండా నన్ను తిరగబెట్టి..
పచ్చదనాల ఆఛ్ఛాదనను
కర్కశంగా చీరేసారు.

ఎంత తల్లినైనా ఇంత కుమ్ముడు
ఎలాగో తట్టుకుందామనుకున్నా..

నా తండ్రి ఆకాశరాజు కన్నీరు చూసి-చూసి
చెల్లి గంగమ్మ శివయ్యను కడిగేసి నట్టుంది..
కేదార శిఖపాయ సడలినట్టైంది

చెరబారీ సరస్సు చినుకు చుక్కలతో చిందేసింది
మిమ్మల్నిలా నా ఒళ్ళో.. పడుకోబెట్టింది.

మీ నిష్క్రమణంతోనైనా
ఈ లోకానికి కనువిప్పు కలిగేనో లేదో..

నా మాట కాస్త ..ఆలకిస్తారా!!

పాపం పండటమంటూ ఏదైనా ఉందంటే..
అది నన్ను పిండడమే.నని
బ్రతికున్న మీ వాళ్ళకు బోధ పడని ఈ మాట..
మీ మరుజన్మ లోనైన గుర్తించుకుంటారా!!

ఇట్లు.. పుత్రశోకంతో.. మీ తల్లి.; పేరుకి.. రత్న గర్భ.

(హిమాలయ సునామి.. జూన్ 15, 2013 న వేల మంది చనిపోయారని నిర్థారణకు వచ్చాక…)

RTS Perm Link

One response so far

Jun 20 2013

||బేరం- నేరం||

||బేరం- నేరం||

ఓయ్! తోటకూరా!!.. ఎలా ఇస్తున్నావ్?
‘పదికి 4 కట్టలమ్మా!’
…మరి “8 ఇవ్వవా!!”
‘కిట్టదమ్మా…..’ ‘…..ఐతే పో.’
ఇది నే చూడలేని వ్యధ

ఆటో!.. వస్తావా!!…
“….మీటరు మీద 20 eXtra ఇస్తావా?
ఎందుకివ్వాలి!! వద్దులే బాబు….”
ఇది నే రాయలేని కథ..
నాకు ఈ తంతే .. చీదర.

చిల్లర చాలక చేతుల్ని నలుపుకున్నా..
సరుకుల్ని కొనడం
ఎన్నోసార్లు విరమించుకున్నా కానీ ..
పదిపైసలు కలిసొస్తాయని
అడ్డదిడ్డంగా.. బేరానికి దిగలేను

బేరమేమంత నేరమా!!
అని అడగొద్దు నన్ను అతిశయంగా..
ఆ బేరాలు నాదగ్గర సాగవు

కోట్లు మింగిన గద్దల్ని
సంఘటితంగా గాలికి వదిలేసి..
పిచ్చుకల జీవితాలతో పరాచకాలాడాలని..
తోపుడు బండితో పావుబేరం
కూరల గంపతో సగం బేరం సబబే నని
ఏ బళ్ళో చదివాము! ఈ పాఠాల్ని!!

ఇరవై రూపాయిలు ఆశించే రిక్షావాడికి
పది రూపాయిలే చాలంటావా!!
దుమ్మెత్తిన నీబూటుని గుండెలకు హత్తుకుని
మిసమిసలద్దినోడికి సగం డబ్బులతో సరా!!
పావుకేజీ తూకానికి చటాకు కొసరు కోరతావా
ఇదెక్కడి న్యాయం?

అర్థరూపాయి రేటు పెంచి
ఐదు పైసల డిస్కౌంటులిస్తుంటే..
షాపింగ్‌మాల్ సంస్కృతికి
తలవంచి కొనుక్కునే మనకు..

బేరాలాడడానికి..
అసంఘటిత కార్మిక లోకమే ..
దొరికిందా?

పెట్టుబడిలేక వంకాయల వడ్డీ* కింద
ఉదయాన్నే తొంభై రూకలు అప్పు తెచ్చుకునే వాడు
రాత్రికి వంద తిరిగెలా ఇస్తాడు!! నీ లెక్కల్లో..

బేరగాడి రూపంలో నవ్వుని చిదిమేసుకుని
ఆరిందాగా..అన్యాయంగా.. గదమాయించకు
చేపల మార్కెట్టుని చూపి నను సముదాయించకు..

నీ వలలో ఎవరో పడ్డా పడకున్నా
నీకు రాని వల విసిరే ఒడుపుని,
కాలే కడుపుని.. గౌరవించు..

రేటుని బట్టి వస్తువుండదు సోదరా..
అవసరమే అమ్ముడవుతుంది అంగట్లో
నీ అవసరాల గాలానికి బేరం ఎరవేసి
అర్థాకలిని అమ్ముకోనివ్వకు
అపనమ్మకాన్ని నమ్ముకోనివ్వకు..

ఏ అర్థరాత్రో అవసరమొచ్చినప్పుడు..
ఆటో అన్నని ఆప్యాయంగా అడుగు
మీటరు మాటెత్తకుండా ..
భద్రంగా గమ్యం చేర్చమని..

లాభనష్టాల తరాజును తూచకుండా ..
నాలుగు మాటల్ని పంచుకుంటూ..
రోడ్డు భద్రత చూసుకుంటూ..
ప్రయాణం ముగిసేదాకా..

ఇక లెక్క తేలినట్టే అనుకున్నాకా..
కనీసం కళ్ళలో నవ్వులతో ఒక మెరుపు మెరిసినా
రెండు చేతులు ఒక్క క్షణం పెనవేసుకున్నా
బేరాలాడడం బేకార్ అని..
ఇద్దరు శాశ్వతంగా గుర్తుంచుకున్నట్తే..
నా క్లబ్ లో మరొకరికి సభ్యత్వం దొరికినట్టే..

==19.6.13==

RTS Perm Link

2 responses so far

Jun 13 2013

||నగు మోము గన లేని నా జాలిఁ దెలిసీ..||

మబ్బులెనక జాబిలమ్మలెన్నో..
ముక్కలు-ముక్కలు గా కదిలొస్తున్నట్టు..
ఆకాశంలో సగభాగాన్ని కప్పేసి
చందమామ కొంటెగా చూస్తున్నట్టు..

ఘోషా సౌందర్యానికి
జవనాశ్వాల వేగాన్ని అద్ది..
రాజధాని నగరంలో
రయ్యన దూసుకు పోతున్నాయి
రెండు చక్రాల రథాలు

మేలిముసుగుల పరదాకి
కాలుష్యం .. మిష
మరి కారణాలు
వెనక్కిపోయే పొగలో కానరావు

విషయం ఏదైనా కానీ..
దాగి ఉన్నదెప్పుడూ
మేలిమి అందమేగా!!
అలా అనుకోవడంలోనే ఉంది
హమేషానిషా

ఇదే ఒకందుకు మంచిదేమో..
నా దుశ్శాసన మనసు కేవలం
ముసుగులోన ముఖాన్ని మాత్రమే
చూడాలని కోరుతుందిప్పుడు..

సిగ్నల్ దగ్గర ఒక పరదా పరిందా*
ఆగి ఆగకుండా.. చూపులు గుచ్చి
తుర్రుమన్నప్పుడు..
గుండె మెటికలు విరుచుకున్న చప్పుడు…..

RTS Perm Link

3 responses so far

Jun 11 2013

|| U bend..||

కొండవాలు దారి మలుపు లో
ఎదురెదురు ప్రయాణాల్లో
తలతిప్పి చూసా..

బ్రతుకు బండి బయటేకదా!
నీ చూపులు నన్ను..
చివరిసారిగా.. మెలేసాయి.

విడివిడిగానైతేనేం
ఒక్కదిక్కుకే
పోతున్నామనుకున్నా..

నువ్వు పైకి.. నేకిందకీ
అని గుర్తించేలోగా
కనుమరుగయ్యావు..

చేతుల్లో మిగిలిందల్లా..
గుప్పిట నిండిన..
గుండె సలపరమే

ఇక ఆలోచనంతా
తిరుగుప్రయాణం మీదే..
ఒక్క క్షణమైనా..మళ్ళీ కలుస్తామా!!

నే పైకి.. నువ్వు కిందకీ..
కంటిచూపులకందకుండా..
ఏమిటీ రాకపోకలు..

మలుపులే తప్ప
మజిలీలు లేవు..
తట్టుకోవడమెలా!!

ఎక్కడ ఆగాలో..
ఎంతకాలం ఇలా సాగాలో!
తెలిసేదెలా!!

==11.06.2013==

RTS Perm Link

2 responses so far

May 27 2013

|| సూరి బాబూ.. I request you..||

ఓ సూర్య నారాయణా.. ఏమిటీ కోపం మాపైన..
ఎందుకిలా నిప్పులు చెరుగుతున్నావిలా!!
పేపరు చూస్తే.. భయమేస్తుంది.
నీ తొంబై డిగ్రీల కోణపు స్పీడోమీటర్
నలభై తొమ్మిది చూపిస్తుందని..

ఏ అగ్నిదేవుడి అజీర్తి తొలగించాలని
ఖాండవదహనం చేస్తున్నావు!!

ఏ ఇంద్రుడూ నా తోడులేడన్న అలుసేగా
నను తక్షకుడిని చేసి బాధిస్తున్నావు.
నరనారాయణులిప్పుడు అవతరించక్కరలేదు
సగటు నరుడికి చంద్రధనస్సు ఇవ్వక్కరలేదు
నీ కిరణాల అక్షయ తుణీరం చాలు

మా శరీరాల్లోంచి రక్తాన్ని..
చెమటచేసి లాగడానికి

ఎన్నికల కాలం దాకా ఆగు..
ఓటు అమ్మేసుకుని
మమ్మల్ని మేమే కాల్చేసుకుటాం
మా జీవితాల బూడిదకుప్పల్ని రాజేసుకుంటాం

నాకు చిన్ననాటినుంచే తెలుసు..
మా అమ్మ తన తొలి చూలు బిడ్డకు నీ పేరే పెట్టిందని..
అరసవెల్లి దేవుడా నా మొరాలకించవా!!
అన్నవనుకుని అర్థిస్తున్నా..
రేపు కాస్త కనికరం చూపించు..

నా చిట్టితండ్రి రైలెక్కి వస్తున్నాడు
రాజమహేంద్రి నుండి భాగ్యనగరానికి
పగలు బయల్దేరాడని పగబట్టకు
ఏడు గుర్రాల వాడా!!
ఏడేళ్ళు నిండిన పసిబిడ్డ వాడు

నా జన్మభూమిని పావనం చేద్దామని
నా జన్మదాతను తరింపచేద్దామని
ఆజన్మ రుణానుబంధాన్ని
కొంతైనా తీరుద్దామని
వెళ్ళి వస్తున్నాడు జన్మభూమి రైలులో..

చైర్కారులో టికెట్టివ్వలేక
అయ్యారు సీటీసీ తత్కాలు లేవంది
ఈ తండ్రి మనసు తల్లడిల్లుతోంది..

రేపైన కరుణించు ఓ ప్రత్యక్ష సాక్షీ
పసివాడు వసివాడకుండా
వెన్నెల్లుకురిపించలేవా..
చంద్రుడ్ని నీ బదులు పంపించలేవా!!
బదులేమైనా కావాలనిపిస్తే..
ఈ తండ్రి సిధ్ధమే..తనువొదలాలన్నా.

చూసుకోనివ్వా.. తనివిదీరా..
నా కంటి చంద్రుడ్ని అందాల ఇంద్రుడ్ని
మరొక్కసారి..మరొక్కసారి..

** 25.5.2103**

friends! I am happy that I got my son..and moon back.
Hyderabadi biryani! now its your turn to make him happy.: 26.5.@9 pm

RTS Perm Link

No responses yet

May 24 2013

||కాసిన్ని కబుర్లు.. కవిత్వంతో..||

చేతిలో చెయ్యేసి నడుస్తున్నాం ఇద్దరం
వొకరినొకరం తెరమీద హత్తుకోనందుకు..
మనసుల్లోనైనా తిట్టుకోనందుకు
వివాదాస్పదం కాలేదింకా
ప్రశాంతంగా సాగిపోతున్నాం..

కవిత్వానికీ నాకు దోస్తీ కదా..
ఆ చనువుతోనే అడిగా ఈరోజు..
ఈ రోజు నిన్నెలా అలంకరించను!!
ఆధునికంగానా!.. సనాతనంగానా!!

అన్నది కదా!..’”ఎందుకీ మీమాంస
నన్ను నగ్నంగానే ఉంచు’”…

మరో అనుమానం ..’మరి రౌడీ మూకలు వెంటపడవా!’

కవిత్వం.. అంది…. నవ్వుతూ ..

” …..ఎలా కనిపిస్తున్నాను నీకు!!
నీకు లీలగానే నా రూపం తెలుసు..

నిజం నా సహచరుడవ్వాలని
నిష్టూరాలు వేధిస్తూ ఉన్నా..
నిన్నే పట్టుకుని ఉన్నా..

మధూన్మత్తతలో నన్ను మధువుననుకోకు
వేదనా భావనలో అగాధమనుకోకు

మన మధ్య దూరమెంత!!
అనుగ్రహమున్నంతవరకే శూన్యం
నేనాగ్రహిస్తే.. అనంతం

దూరమయ్యాకా..
ఎన్నిరాగాలను వినగలవ్! నా పాటకోసం!!
ఏమి వెచ్చించి కొనగలవ్! చేజారాకా!!
జీవన పతంగ సూత్రం!!

విశ్వశేయమే నీ ఆదర్శమైనప్పుడు..
నీకు నేను తోడుంటాను
ఆనాడూ మంచిని పంచమని తప్ప..
నన్నలంకరించమని అడుగను

అక్షరానివి నువ్వైతే..
నిన్నావరించుకుని నేనుంటా..
అక్షరమే నన్ననుకున్నవారంతా..
ననులోకంపైకి వెదజల్లామనుకున్న వాళ్ళంతా..
నను వదిలేస్తున్న వివరాన్ని గమనించరు..

అలంకారాలు ఏమిచేస్తావు నాకు నేనే వెలుగైనప్పుడు
భాషను, వేషాన్ని ఏమి మారుస్తావు.. నీకు నేను తెలుగై నప్పుడు
ఆధునికానంతర అవతారం నాకు లేదు..
నవ్వులు పంచుతూ, కన్నీరు తుడుస్తూ నాతో నడు.. చాలు..”

ఇంకేం మాట్లాడతాను ..!! నేను !!!

RTS Perm Link

No responses yet

May 07 2013

||గుండు వేసవి కాలం||

దేవుడి మొక్కుబడో..
మనకి అవసరమో..
మండే ఎండల్లో తెలుగోడికి..
కోనేటి రాయుడు గుర్తొస్తాడు..

భక్తి కారకమైనా కాకున్నా
గుండు వేసవి అవసరమౌతుంది..
నడిచొచ్చేస్తే.. బొచ్చిచ్చేస్తే..
పనులౌతాయన్న స్వార్థంలో
దేవుడికి ఉత్త చేతులు బిగించేసి
లేని గోవుని చూపించేస్తాం
పరకామణిని లంచాలతో నింపేస్తాం..

అమాయకదేవుడికి
ఇక్కడ్నుంచే ఓ దణ్ణం పెట్టి..
తిరపతికే ఎగనామం పెట్టడానికి
సవాలక్ష కారణాలు వెతుక్కుంటూ..
నేను రంగం సిద్ధం చేసుకుంటా..

కోరని కోరికలను తీర్చలేదని
తిట్టుకుంటూ వాడితో..
నీదగ్గరికి అప్పుడే రానంటా..
మాఇద్దరి మధ్యా ఉన్నచనువది మరి..

దేవుడిపై దృష్టి లేనివాడికీ చిరాకెక్కువే..
అని నన్ను తిట్టుకుంటూ
పెరిగిన జుట్టును వేళ్ళతో కొలుచుకుంటూ..
పేరూ ప్రచారం ఉన్న సౌందర్య చావిడీ గొలుసు లంకె
ఒకదానిని అదిలిస్తాను ఫోన్ లో..
కత్తుల కాంతారావు కాల్ షీట్ ని బట్టి
వెళ్ళాల్సిన సమయం తెలుస్తుంది.
తీరా వెళ్ళాకా అడిగే మాటొకటే..
ఎన్నంగుళాలు తగ్గించాలని
కొలతలు తెలియని నేను నసుగుతాను..

చైనా వాడికి
ఈశాన్య భారతం మీద ఉన్న మక్కువలా
క్షురకత్తికి నా నెత్తిమీద ఆకలి ఎక్కువౌతుంది.
నే సగం బొచ్చులేనివాడ్నవుతాను..

నాకున్న సందేహమల్లా ఒక్కటే..
ఇప్పుడెవరన్నా నాకు అప్పెడతారా!!

మా తాత నడిగితే..
జుట్టులేనోడికి దొరకదన్నాడు..
పిల్లాడేమో..
క్రెడిట్ కార్డ్ ఫొటోలో ఉందికదా అంటున్నాడు..

RTS Perm Link

No responses yet

Apr 20 2013

రెండ్రోజుల ముందుగానే..

22 ఏప్రిల్ 2004 న పెళ్ళాడినందుకు
22 ఏప్రిల్ 2005 న మా బాబు పుట్టాడు..
అన్నప్రాశన రోజున కలం పట్టాడు.. నేనాగలేక..
ఆ కలం లాగేసుకుని.. తెల్లకాగితం మీ ముందు పెట్టాను.

ఓ విధీ..♪♫ ♪ ♪♫ ♪♫
ఓ విధీ..♫ ♪ ♫♪♫ ♪♫ ♪♫ ♪ ♪♫♫ ♪ ♫ ♪♫ ♪♫ ♪♫ ♪♫ ♪♫

RTS Perm Link

3 responses so far

Apr 20 2013

ఓ పుట్టినరోజున..

ఔనను.. కాదను.. పుట్టినరోజు just a date అనూ!!
అది మళ్ళీ రావడం నిజం అనుకోకు..
అయినా ఒక్కసారి పుట్టాకా మళ్ళీ ఎలా వస్తుందది!!..
ఎవరైనా ఇది నా పుట్టినరోజంటే.. వారి పిచ్చితనానికి నవ్వుకుంటానేను.

అసలు వస్తే.. అహ.. వస్తే.. ఏంచేస్తాం!!..
ఏడుపుతో మళ్ళీ మొదలు పెట్టగలమా జీవితాన్ని!!
అందుకే.. నవ్వుతూ స్వాగతిస్తాం.. మనం చూడలేని గతాన్ని.
మనల్ని మనం పొత్తిళ్ళలో చూసుకోలేము కనుకే.. పిల్లల్లో మనల్ని చూసుకుంటాం..

వారి పుట్టినరోజు వేడుకలను కలగంటాం.
గతం లోకి వెళ్ళినట్టనుకుంటాం..
భవిష్యత్తులోకి ఒక అడుగు మనల్ని మనం నెట్టుకుంటాం..
మన జీవితంలో కొన్ని నవ్వుల్ని వెలిగించుకుని కొవ్వొత్తుల్ని ఆర్పుకుంటాం.

కేకునీ.. కోకునీ.. పంచుకుంటాం..
కొన్ని ఙ్ఞాపకాలను చప్పరిస్తూ..
కొన్ని అనుభూతుల్ని గుటకలు మింగుతూ..
కనిపించని ఆనందాన్ని నవ్వులతో తలచుకుంటాం..

అనుక్షణం అనురాగంగా జీవించడమే దైవానుగ్రహమైనప్పుడు
Happy Birthday అనుపల్లవులెందుకు!!
జీవితం అనే ఆకాశం కింద నీవింకా మొక్కవే… పుష్పించాలి
చెట్టై.. కాయలు కాయాలి..
వృక్షమై నీడనివ్వాలి..
నీ నీడకు తోడవ్వాలి.
ఈ లోకమే నీ అనుబంధాలకు వారధి అవ్వాలి..
ఆత్మీయత నీ రధమవ్వాలి
మంచితనం పంచడంలో లోకానికి నువ్వే సారధవ్వాలి..
నేస్తం..

(ఓ స్నేహితునికి రాసిఇచ్చినది…)

RTS Perm Link

One response so far

Apr 18 2013

|| నెలకోసారి నేను తప్పుచేస్తాను.. ||

అది జీతాలరోజు కాదు..
మందో మగువో నాకు అలవాటు కాలేదు
చిల్లర తడమలేక చాయ్ నీళ్ళు వద్దనుకునే నాకు..
ఆన్ లైన్ పేమెంట్ల చిట్టాలో పై రెండూ లేవు
సాకులు కుంటుకుంటూ ఆడే తప్పుని
నెలకోసారి మాత్రం తప్పకుండా చేస్తాను..

ధర్మరాజు నడిగి ఒక అబద్ధాన్ని ఆ రోజుకి అప్పుతెస్తాను
నాలో చావని శ్రోత అశ్వథ్థామై ఒక్కసాయంత్రమైనా జీవించాలని
నేనెక్కడని ప్రశ్నించే ఫోను కాల్ కు మీటింగులో హతః అని ..
కుంజరః ఏమిటంటే.. సభ కవిత్వానిదని..

రెండో శనివారం..
ఇంటికెళ్లకుండా దారి తప్పుతాను..
నా కార్యాలయానికి వర్షపాత సూచనలందకుండా ;
భార్యాలయాన్ని డబ్బింగ్ సీరియళ్ళ విధ్వంసంలో వదిలేసి
ఎల్లలు లేని ఇంటిని రెండు గంటలైనా అంటిపెట్టుకోవాలన్న కాంక్ష
ఇల్లుచేరడాన్ని ఆరోజుకి రెండుగంటలు దూరం చేస్తున్నా..
కర్కోటకుడిలా బంజారాహిల్స్ బస్సెక్కుతాను

తప్పొప్పుల కుదుపులలో ముందుకురకలేక, వెనక్కు మరలలేక మనసు
ట్రాఫిక్ జాముల్లో అంగుళ మంగుళం జరుగుతూనేఉంటుంది
మరచిన పని ఒకటి ఆలోచనల లైన్లోనికి వచ్చి.. గుర్తుకొచ్చి..
ఎండతో పాటు నన్ను చిటపటలాడిస్తుంది.

అయినా.. కెరీర్ గ్రాఫ్ సిటీబస్సుతో పోటీపడుతున్నప్పుడు
నా జీవితానికీ, జీతానికీ కొత్తగా వచ్చిన ముప్పేముంది!!
ఇలా అంటున్నానని నిరాశలో నిజాలను చూడలేననుకోకు..
జి.వి.కె మాల్ సౌధం కన్నా..లామకానే నాకు ఎక్కువ ఎత్తులో కనిపిస్తుంది.
వీలైనంత త్వరగా సిగ్నలన్నీ దాటేస్తే.. గుర్రమెక్కినట్టే అనిపిస్తుంది

తీరా తీరం చేరేలోగా
గుమ్మం బయటే.. ఏ గాలి తోనో కొట్టుకుపోతా..
కాశీ నుంచి పిలుపొస్తుంది..కాలం సమీపించిందని

గాలిపోసుకున్నాక గుమ్మం బయటే కాసేపు ఊసులు
పలకరింతలే కొత్త ..మేమంతా ఒకరికొకరం పాత చుట్టాలమే..
కవిత్వ దేవత మాకేమవుతుందో..
ఎవరో షరాబుతో వాదం పెదవుల వంపుల్లోంచి వలికిపోతుంది..
చివరకి మామధ్య సామ్యవాదం మిగిలిపోతుంది
ఎగరేసిన తెల్లకాగితంలా నేను లామకాన్ లోపల వాలతాను

మనుషుల మధ్య నిశ్శబ్దాల అస్థిత్వాన్ని పలకరింపులు ప్రశ్నించినప్పుడు
రాతలకు రూపం వచ్చినట్టు .. పులకరింతలు నా ఎదపై సంతకాలవుతాయి
తరాల మధ్య అంతరాల్ని తొలగించే వేదిక మీద ఓ బుల్బుల్ కూతకూస్తుంది
అంతరంగపు లోతుల్ని నింపడానికి గాలీబ్, మీర్, సౌదా, ఖుస్రూ, దాగ్ లు
రూపం మార్చుకుని వేదికనెక్కుతారు, నేను ఆకాసేపూ బేదర్ద్ నవుతాను

ఓ సూఫీ పాట మాటతో వేడుక మొదలౌతుంది
లామకాన్ నాపాలిట పానశాల అవుతుంది.
కాలంమారి హుక్కా స్థానాన్ని మైకు ఆక్రమించినా
కవిత్వం కైపెక్కించడం ఎన్నడూ ఆగలేదు.

కవి ఎవరైతేనేం!.. కవిత్వమొక్కటే నన్ను హత్తుకుంటుంది
అలౌకికానందాన్ని ఏకాంతంగా అనుభవించడంలో..
ఆ నెలకు సరిపడా తప్పు నాతో జరిగిపోతుంది..
నాలో చావని శ్రోత అశ్వథ్థామై మరో సాయంత్రం జీవించాలని
కేలండరు రెండో శనివారాన్ని ముందుకు దోస్తుంది.
నేను.. ముందస్తు మత్తులో తేలిపోతాను
ఇంటి కోకిల హేంగోవర్ లో మునిగిపోతుంది.

కలిసి జీవించడం అలవాటు అయ్యాకా..
తప్పుతుందా..నాతో.. కవిత్వానికైనా.. అర్థాంగికైనా

==18.4.2013==

RTS Perm Link

2 responses so far

Apr 05 2013

విజిగీషువై వస్తాడొకడు.. ఈ లోకానికి.

విజిగీషువై వస్తాడొకడు..
ఈ లోకానికి..

ఏడ్చి గెలిచే పాపడిలా..
ఆక్రందనో, ఆలాపనో
అవసరమనే చెబుతాడు
నేరుగా వచ్చినోడు.. అబద్దమెలా ఆడతాడు!!

మూగ జీవాలూ బాసలు చేస్తాయి
బుక్కమెత్తి తలాడిస్తాయి
మనిషన్నవాడు పసివాడికి పశువుకీ మధ్యే ఊగుతుంటాడు
వాడి పరిధిని ఈ లోకం దాటిపోదు..

ద్రావకంలాంటి లోకాన్ని
రకరకాల పాత్రల్లోకి ఒంపుకుంటాడు
అందుకే..అలసినవేళ ఉగ్గుపాల పాటౌతాడు
కథల్లో జంతువై, మనుషులకు నీతి చెబుతాడు

నేర్చేవేళ పద్యమో పాఠమో అవుతాడు
భుజం కాస్తాడు.. తడతాడు.. తిడతాడు

గుసగుసల వయసుల్లో కూనిరాగమౌతాడు
పలుగోపారోఎత్తినప్పుడు .. చెలియో.. చెల్లకో.. పద్య మౌతాడు
కుప్పనూర్పేటప్పుడు .. కూనలమ్మ పదాలౌతాడు
కదం తొక్కేటప్పుడు ..జెండాపాటై రెపరెపలాడతాడు

లోకం పొడారినప్పుడు
హృదయాకాశాన్ని కవిత్వం తడిపెయ్యాలంటాడు
కళ్ళు చెమిరిస్తే .. నిరాశని తుడిచెయ్యాలంటాడు
వీడి కోరికల చిట్టా అనంతం

కడుపు కాలినోడికి బువ్వ అవ్వాలి..
చిందిన చమట చుక్క నేల చిందేలోగా
అంబలో చల్లనో వాడి నోటికి అందివ్వాలని…

మనిషి బతుకే ఘాటైనప్పుడు
నంజుడు జీవితాన చద్దన్నమవ్వాలి..
తాటి ముంజవ్వాలి..కొబ్బరిగుంజవ్వాలి అని…

ఒకరికొకరం ఎదురైనప్పుడు
కలయిక కౌగిలవ్వాలి..
ఈ లోకం తన లోగిలవ్వాలి…
మనుషుల్ని గెలవాలి, మనసుల్లో నిలవాలి.. అనీ..

ఇలా ఎన్నెన్నో కోరికల మధ్య
కొన్ని తీరకపోయినా..
ఏడుస్తూనే వస్తాడు పిల్లడిలా

గెలిచీ ఏడుస్తాడు వస్తాదులా
ఎవడోడినా బాధ వీడిదన్నట్టు..
చీకట్లపై వెలుగులు చిమ్మే టట్టు
విజిగీషువై వస్తాడు కవి ఈ లోకానికి

|| విజిగీషువు: He is desirous of Victory ||
==5.4.2013==

RTS Perm Link

One response so far

Apr 04 2013

|| అడుగుగెందుకో…||

అడుగుగెందుకో బరువుగ పడుతుంది
అలోచనలు వంచుతున్నట్టు మెడని
నడకలోన చూపు నేలన దిగబడుతోంది
మనసేమో ఇంటికి పరుగిడుతోంది

వేసవిమొదల్లోనే సాయంత్రాలు చల్లబడి
జల్లులు మొదలై కాలం మారుతుంది
నా ఉరుకులు చూడాలని నగరం
చినుకై చింది నాపై తిరగబడుతోంది

RTS Perm Link

One response so far

Mar 29 2013

||ఉదాత్తం నాకు కవిత్వం||

రాళ్ళు ఏరుతుంది అమ్మ బియ్యంలో మౌనంగానే..
అన్నం వండటం ఒక పవిత్ర కార్యం

పనిచేస్తాడు నాన్న ఇల్లుగడవాలని
సాలీడు శ్రధ్ధతో గూడుకడుతున్నట్టు.

సూదిమందు గుచ్చుతుంది నర్సమ్మ
రోగం నయమవ్వాలని అందరి ప్రార్థన

నేర్చేటప్పుడు పంతులుగారు ధ్యానంలోనే ఉంటారు

అదే అమ్మ ఇంటి శుభ్రంలో బల్లుల్ని తరుముతుంది
తప్పుచేసిన పిల్లలపై ఉరుముతుంది.

అదే నాన్న విసిగిస్తే కసురుతాడు,
చెయ్యీ విసురుతాడు

కుట్లేసే వేళ డాక్టరు మత్తిచ్చి మగతలోకి నెడతాడు
మాత్ర మింగకపోతే మరి కోప్పడడూ!!..

పాఠం చెప్పేటందుకు గొంతెత్తి వినిపిస్తారు మాస్టారు
విసిగిస్తే ఆకతాయికి ఒకటో రెండో అంటిస్తారు

ఎంత పనికి అంత బలమే చూపిస్తారెవరైనా..
మరి నువ్వేంటీ!..
కవిత్వం పేరు చెప్పి ఏమైనా చేస్తానంటావ్
ఉత్తర కుమారుని వేషం వేస్తావ్..

చీత్కారాలూ, దూషణలూ nostalgia నా నీకు!!
నాకంటే పెద్దే కావచ్చు అన్నిటా.. నువ్వు..
తమ్ముడ్ని చేరదీసినట్టు చెప్పరాదూ..

పక్కింటోడ్నే తిట్టచ్చు నువ్వు, మనసు నలిగి..
కడుపు మండే తిట్లెందుకు.. నీ నోరూ పాడవదూ!!

కవిత్వం నీకు తల్లే కాదనను
నాకో, మరెవరికో రంకంటగట్టడం
ఏపాటి మానవీయత!!

రగిలిపోయి కవిత్వం రాస్తున్నావా..
ఎవరి అమ్మను అపహాస్యం చేస్తున్నావు!!

హత్తుకునే మెత్తని మనసు నీకు లేనప్పుడు
కవిత్వం పసిపాపను కలనైనా తాకకు

కోయడం నీ అవసరమైనప్పుడు అది
ప్రసవానికో, రసాస్వాదనకో అన్నట్లుండాలి
కసాయి కత్తులతో తుత్తునియలు చేయకు

రత్యానంతరానుభూతి నీకు తప్పనిసరి ఐనప్పుడు
అది శృంగార పరమావధిగాసాగాలి..
మరోలా ఉండకూడదని మాటల్లో చెప్పాలా..

నీకు తెలియనిది కాదు మిత్రమా..!
మేడిపండులోనికి కవిత్వాన్ని చొప్పించకు
ప్రియతమా..ఆస్వాదనకు దూరమైపోతాం

==29.3.2013==

RTS Perm Link

2 responses so far

Mar 28 2013

||కాలమా!!.. నువ్వు నా వెనకే..||

నీనుంచి నేను తరలిపోయినప్పుడల్లా
నిజం తలుపు తెరుచుకుంటూనేఉంది.
నే పారిపోతున్నానని గమనించిన కాలం..
రొమ్ము విరుచుకుంటూనేఉంది

పాపం జమానాకి తెలియదు
నన్ను ధిక్కరించడం ఎంత పాపమో..
నా మాటలు నేలవిడిచి సాము చేసినప్పుడల్లా
నాలో నేను తడబడుతూనే ఉన్నాను

నా అడుగుల్ని మాటలు నిర్ధరించినప్పుడల్లా
పరిగెడుతూనేఉన్నాను

నిట్టూర్పుల కుంపటి సెగ అనుకున్న వాడి పాలు
పొంగించక తప్పలేదు నాకు
చెమిర్చిన నా చెమటచుక్కలద్దుకున్న వాడి శ్రమ
ఫలితాన తేల్చాక గాని మనసొప్పలేదు

నాడి కొట్టుకోవడం ఆగే వరకూ
నా మౌనాన్ని ఎవరికీ తాకట్టుపెట్టలేను
తిట్టుకునే నుదుటిరాతను మార్చమని
ఏదేవుడికీ ఏకరువు పెట్టలేదు

ఎవడెటైనా పోనీ.. నా మాట వినిపించేంత దూరమైనా
పారాహుషార్ పాటని కట్టిపెట్టలేను..
ఓయ్.. లోకమా.. నీదారి అటుకాదు..
నా వెనుకే.. నువ్వు నడు..

నువు చూడని కొత్త పుంతలు
అందుకునేటందుకు వెళుతున్నా..
వెనుతిరిగి నన్ననుసరించు..

దిగంతాల వెలుగుపువ్వుల్ని నీ దారిన పరుస్తాను
నాతో నడుస్తావా!!.. ఎవరనుకుంటున్నావు నన్నూ..
కవిని నేను..
చీకటిలోకమా.. నీ రవిని నేను.

==28.3.2013==

RTS Perm Link

2 responses so far

Mar 23 2013

||నమ్ముతావో నమ్మవో…||

నమ్ముతావో నమ్మవో నీ ముందు జరిగేది
నమ్ముతావో నమ్మవో నీవు చూసేవి
నమ్ముతావో నమ్మవో మండే సూరీడ్ని
నమ్ముతావో నమ్మవో రాత్రి తారల్ని

నమ్ముతావా ఎగిరే పిట్టల్ని
నమ్ముతావా కదిలే మేఘాల్ని
నమ్ముతావా గాలి కెరటాల్ని
నమ్ముతావా కాంతికిరణాల్ని

నమ్ముతావో నమ్మవో అన్న మాటల్ని
నమ్ముతావో నమ్మవో నీవు విన్న వాటిల్ని
నమ్ముతావో నమ్మవో చివరి వాక్యాల్ని
నమ్ముతావో నమ్మవో తిరిగే నాట్యాన్ని

నమ్ముతావా కాంతిని దృశ్యాన్ని
నమ్ముతావా వెలుగే కాలాన్ని
నమ్ముతావా స్పర్శ ని రుచిని
నమ్ముతావా అంతా.

నమ్ముతావో నమ్మవో అంతరాత్మని
నమ్ముతావో నమ్మవో సంతోషపు తన్మయత్వాన్ని
నమ్ముతావో నమ్మవో కీర్తిని పరంధాముడ్ని
నమ్ముతావో నమ్మవో ఆ ఆలోచనల్ని

నమ్ముతావా పైనున్న ఆకాశాన్ని
నమ్ముతావా ప్రేమ పాశాన్ని
నమ్ముతావా దివిని భువినీ
నమ్ముతావా చావుపుట్టుకల్ని
నమ్ముతావా జీవితాన్ని

నిజమైన నమ్మకం తో కళ్ళు తెరిచి చూడు
ద్వారాల్నీ తెరిచివుంచు కాంతిని నింపుకో
నమ్ము నమ్మకం నిను నిలబెడుతుంది

RTS Perm Link

3 responses so far

Mar 23 2013

||ఏటిపాటనవ్వాలని…||

మనసులోతుల్లో గతుకుల దారుల్లో
ఆలోచనలన్నీగాలాడక
అల్లలాడుతున్నప్పుడు
అగాధనేత్రాల్ని చూసిందో కాగితం

ఎత్తుపల్లాలు తడిపేలా
ఆ అలజడి గుండె గదుల్ని
తడితో నింపింది

కొమ్మలు తడిభారంతో.. వంగినట్టు
అక్షరాల చుక్కల్నికలిపి
అనుభూతుల ముగ్గుల్ని పంచడానికి
ముంజేతివేళ్ళు ముడుచుకున్నాయి

మనసున వాన వెలిసాక
సిరాని ఎగపీల్చిన కాగితాన
భావాలు కాలువ కట్టాయి

మలుపుల మధ్య
బల్లకట్టు ప్రయాణం
కాగితం పై నా పలవరింత

జీవితమైనా, కవిత్వమైనా
ఏటిపాటై సాగాలనే..

==23.3.2013==

RTS Perm Link

No responses yet

Mar 07 2013

||కావలసినంత స్వేఛ్చ ఉంది.. బాధ్యత తీసుకోవా||

మార్పంటే కొత్తదనమేనా
మొహంమొత్తిన మాధుర్యం లో
నువుకోరేది చప్పదనమేనా
ఏం తెలిసింది మనకు నడకైనా
చరిత్రను ఉపేక్షించి గెలిచామా
అడుగేసి తడబడక నిలిచామా

నీ మాట నిజం మిత్రమా!
నడక మాత్రమే తెలుసు ఆధునికతకు
గమ్యాలెటో తెలియదు అడుగులకు!

పాత లోతెంతో ఇప్పుడిక లెక్కలేల!
ఆపాతమైనదేదైనా మక్కువేగా
వచ్చినదారి గుర్తుంటేనే కదా
పయనం ముందుకని భరోసా నేస్తమా!

ఇప్పుడిక స్వేచ్ఛ మాత్రమేనా.. మనిషి కోరేది!
నిర్జన నిశీధి గమనంలోనా గమ్యం చేరేది!!

నీకునువ్వైతే ఇక నువ్వేంటి..
నీవెనుక తరాల తపనల మర్మమేంటి
కన్నీరు నిన్ను కరిగించలేనప్పుడు
కవితల వెల్లువల ధర్మమేంటి!!

పాతబడినంత మాత్రాన
మంచి చెలామణి కాకపోదు
నాణాలూ, నోట్లూ చెల్లినచోట
బంగారపు వన్నె తగ్గదు

పాత రోతా కాదు, కొత్త వింతాకాదు
నీ మాట నిజం మిత్రమా!
మనోభావ సంచలనమే
మనోవిజ్ఞాన శాస్త్రమిక్కడ

దిగ్భ్రాంతుల్లేని కవనోదయాన్నే
వెలుగులీనేవి అనంతకోటి భావజాలాలు

నేనొక తృణకణాన్ని
ముంచుకొస్తున్న తుఫాన్ల తో అనాది స్నేహం నాది

నన్ను తొక్కుకుని నడిస్తే నువ్వు
మెత్తదనాల సౌకుమార్యాన్ని అనుభవిస్తావు
నాతో కలసి నిలిస్తే సహస్ర సూర్యోదయాలనూ చూస్తాము.

పాత చిగురుబోంతనూ పట్టు పీతాంబరాలనూ
వీపున మోస్తూ నీ ఇంటిముందు నిలిచిన
బసవన్న నడిచే దారిని..

నీ జెండా రెపరెపలాటకు బందీనైన ధ్వజాన్ని..
నువు నివసిస్తున్న సౌధపు ప్రాకారాలను
మోస్తున్న పునాదిని..

నేనూ నీ లానే..
నీ అస్థిత్వాన్ని.. కవిత్వాన్ని.
మరి నా పేరు నిలబెట్టే బాధ్యత తీసుకోవా!

{మిత్రులు శ్రీకాంత్ కాంటేకర్ ..|స్వేచ్ఛ.. స్వేచ్ఛ మాత్రమే కావాలి | ప్రేరణతో..}

==07.03.2013==

RTS Perm Link

No responses yet

Next »

RTSMirror Powered by JalleDa