అక్షరాలు అచ్చం మనుషుల్లానే ఉంటాయి.
పేజీ నిండా ఉన్న అక్షరాల్ని చూస్తే జనసందోహం శిరస్సుల్లా అనిపిస్తాయి.
బారులు తీరిన అక్షరాలు ప్రార్ధన కోసం నిలబడ్డ బడి పిల్లల్నిగుర్తుకుతెస్తాయి.
నాలుగు అక్షరాల పదం నలుగురు మనుషులు బెంచీ మీద కూర్చున్నదృశ్యమౌతుంది.
పేరాగ్రాఫ్ సభ ఐతే శీర్షిక వేదిక అవుతుంది.
ఒక మనిషి ఒక అక్షరం ఐనప్పుడు జనసమూహం తరంగంగా సాగిపోవడం పాటౌతుంది.
అక్షరాల్లో ఒంగిపోయిన తాత నడుముల్లాంటి అరసున్నాలుంటాయి.
తుపాకి ఎక్కుపెట్టిన సైనికుల్లాంటి దీర్ఘాక్షరాలుంటాయి.
ఒక ఇంటినే అంటిపెట్టుకునే భార్య భర్తల్లా ఒక అక్షరాన్నేఆశ్రయించే ఐత్వాలుంటాయి .
తనలాంటి మనుషుల్ని తొక్కిపెట్టే మనుషుల్లాంటి ద్విత్వాలుంటాయి.
ళి – బిడ్డ నేతుకున్న స్త్రీ మూర్తిని గుర్తుకు తెస్తుంది.
ఠ – గర్భంలో బిడ్డను మో స్తున్నచూలలౌతుంది.
కొ – మత్స్య యంత్రాన్ని కొట్టబోతున్న అర్జునుడై నిలుస్తుంది.
అః – బంతుల్లాంటి కవల పిల్లల తల్లై సాక్షాత్కరిస్తుంది.
అక్షరాలు పదాలై.. పదాలు పంక్తులై.. సరళరేఖల్లాఁ పరచుకున్నపుడు .. .
పంక్తులు చిన్న రూపాల్లో దర్సితమౌతాయి.
వాటిల్లో కొన్ని మార్చురీ లో వరుసగా పడుకోపెట్టిన శవాల్లా ఉంటాయి
అంతరంగం లోతుల్లోకి దింపుతున్న మెట్లలా ఉంటాయి
ప్రపంచాన్ని between the lines చూసే కిటికీ ఊచల్లా ఉంటాయి
సూర్య కిరణాల ముక్కల్లా ఉంటాయి.
Running tracks లా ఉంటాయి.
పరిచిన పువ్వుల మాలల్లా ఉంటాయి.
అన్ని అక్షరాలు అక్షరాలు కావు ..
పలికేవి .. పగిలేవి..అడిగేవి.. అడుగులేసేవి అక్షరాలు
ఒక మనిషి ఒక అక్షరమైనపుడు దేశం పుస్తక మౌతుంది.
పుస్తకాలలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నవి అక్షర శకలాలే కాని అక్షరాలు కావు
అక్షర రూపాలే కాని అక్షరాలు కావు.
ప్రశ్నలతో..సమస్యలతో.. అవ్యక్తాలతో తలలన్నీ పేలిపోఁతున్నాయి.
తలకట్లు లేని మొండి అక్షరాలే పుస్తకమంతా సంచరిస్తున్నాయి.










