స్పందించే హృదయాలకు….

నిండు నీరాజనాలు….

తిరుపతిలో నా స్వంత అనుభవాన్ని అక్షరాలుగా మార్చి నిన్న -ఫిబ్రవరి 26- Telugu.webdunia.com లోని వెబ్‌దునియా బ్లాగులో అనాథ పిల్లలపై ప్రచురించిన ఒక కథనం ఆ నిర్భాగ్యుల తక్షణావసరాలను కొన్నింటిని సత్వరమే తీర్చగల స్పందనలను కొందరిలో కలుగజేసింది. 18 ఏళ్లనుంచి 35 ఏళ్ల వయసులో ఉన్న యువతరానికి కావలసిన అన్ని మసాలాలను అందించడానికి, వారిని ఆకర్షించడానికి పత్రికలు, టీవీలు, వెబ్‌సైట్లు వగైరాలు నానా పాట్లు పడుతున్న ఈ రోజుల్లో, అనాథ పిల్లల జీవన్మరణ సమస్యలు వంటి అనాకర్షణీయమైన, నలుపు తెలుపు జీవితాంశం గురించి ఓ కథనం రాస్తే స్పందించే హృదయాలు ఉన్నాయని, నైతికంగానూ, వీలుంటే ఆర్థికంగా, వస్తురూపంగా కూడా ఆ పిల్లలకు మద్దతు అందించేందుకు నిస్వార్థంగానే ముందుకొచ్చే మానవీయ లక్షణం ఇప్పటి తరంలోనూ ఎంతో కొంత ఉందని రుజువు చేసేలా కొందరు నిన్నా, ఈరోజు కూడా స్పందించారు. వారి ఈ తక్షణ స్పందనలకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు. వారి స్పందనలను, వాటికి నా ప్రతిస్పందనలను కింద పొందుపరుస్తున్నాను.

అలాగే… తిరుపతిలోని నా మిత్రుడు ఎం.వి ప్రసాద్ ద్వారా ఆ పిల్లలకు అత్యవసరంగా అవసరమైన మందులు, స్కూలు ఫీజులు అందనున్నాయి. వసతికేంద్రంలో పిల్లలకు దుప్పట్లను పంపిణీ చేసేందుకు వెళ్లిన ప్రసాద్ అక్కడి పరిస్థితిని స్వయంగా చూసి చలించిపోయి అప్పటికప్పుడే తను చేయగల సహాయాన్ని ప్రకటించాడు. తన స్నేహితులను కూడా ఈ పిల్లల విషయంలో ఏమైనా చేయగలరేమో అడగడానికి సిద్ధమైపోయాడు. ఈ మెయిల్ స్పందనలు, వ్యక్తులుగా ప్రసాద్ లాంటి వాళ్లు ఆ పిల్లలకు అందించిన ఈ చిన్నపాటి అవసరాలు ఇంతటితో ఆగిపోవడం కాకుండా నిరంతరం సాగే సహాయ ప్రక్రియగా మారాలి. ఆర్థికంగా సహాయం చేయలేని యూనివర్శిటీ విద్యార్థులు నైతిక మద్దతు అందించేందుకు సెలవుదినాల్లో వారి వద్దకు పోయి ధైర్యం చెప్పి వారితో గడిపే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతూ ఉంది. ఇంకా కొనసాగాలి కూడా…

మనం సమాజాన్ని మార్చలేం అనుకున్నా కొన్ని చేతనైన పనులు చేయగలం అనే స్థైర్యాన్ని ఈ స్పందనలు, సహాయాలు కలిగిస్తున్నాయి. అందుకు వారిని మనస్పూర్తిగా అభినందిస్తూ….

నా కథనానికి మిత్రుల స్పందనలు, వారికి నా ప్రతిస్పందనలను అన్నిటినీ కింద పొందుపర్చడం జరుగుతోంది.

—– Original Message —–
From: Mahesh
To: Raju
Sent: Tuesday, February 26, 2008 6:04 PM
Subject: Pls see this article… and think it…

http://raju123.mywebdunia.com/2008/02/26/1204022220000.html

మాబోంట్లకు కనువిప్పు….

రాజుగారు,
వ్యక్తిగత పని మీద తిరుపతి వెళ్లిన మీరు ప్రపంచమంతా వ్యాపించి ఉన్న బాలల దుస్థితికి నమూనాగా నిలిచి చివరకు తిరుపతిలోని శరణాలయంలో తలదాచుకుంటున్న రేపటి పౌరులను చలిమర గదుల్లో ఉదర పోషణార్థం అక్షరాలను అమ్ముకుంటున్న నా లాంటి వారికి పరిచయం చేయడం ద్వారా సమాజం పట్ల మీకున్న బాధ్యతను తెలుపుతూనే మా లాంటి వాళ్లకు కనువిప్పు కలిగించారు. నేను, నా కుటుంబం అనే స్వార్థం నుంచి నేను నా సమాజం అనే ఆలోచనా భావజాలాన్ని పెంచేటటువంటి ఎలాంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టినా మిమ్మల్ని అనుసరించడానికి నేను సైతం అంటూ వస్తాను.
భవదీయుడు,
మహేష్
———————-
—– Original Message —–
From: Rajasekhar
To: Mahesh
Sent: Tuesday, February 26, 2008 8:14 PM
Subject: Re: మా బోంట్లకు కనువిప్పు

మహేష్ గారూ..

ధన్యవాదాలు… ఈ మాట చాలు…

దయచేసి మీరు కింద ఏ వ్యాఖ్య అయితే రాశారో దాన్ని ఆ న్యూస్‌లో వ్యాఖ్యను జోడించు అనేదానిపై క్లిక్ చేసి అక్కడ మీ మెయిల్ ఐడిని జతచేసి పోస్ట్ చేయగలరు. అనాథ బాలల పట్ల మీ స్పందనను ఇతరులు ఎవరయినా మన వెబ్‌సైట్లో చూడగలిగితే ఏ ఒక్కరిలో అయినా ఏదో ఒక సహాయం చేస్తామనే భావన ఏర్పడితే, ఆ పిల్లల కనీస అవసరాల్లో కొన్ని అయినా తీరేందుకు మార్గం ఏర్పడుతుందని నా ఆశ.

తిరుపతిలో నా స్నేహితుడు ప్రసాద్‌కి డబ్బు పంపి తననే దుప్పట్లు కొని ఆ వసతి కేంద్రం వద్దకు వెళ్లి పిల్లలకు స్వయంగా ఇవ్వమని చెప్పాను. ఆ పనిమీద అక్కడికి వెళ్లిన ప్రసాద్ వాళ్ల దయనీయ స్థితి కళ్లారా చూసి అప్పటికప్పుడే స్పందించాడు. వాళ్లకయ్యే మెడికల్ అవసరాలకు అయ్యే మందులు తానే ఇస్తానని హామీ ఇచ్చాడు. తను స్వయంగా మెడికల్ ఏజెన్సీ ఒకటి నడుపుతున్నాడు. అలాగే ఆ వసతి గృహంలోని అయిదుగురి పిల్లలకు స్కూల్లో ఫీజులను కడతానని హామీ ఇచ్చాడు. తిరుపతిలోని విశ్వం స్కూల్ యజమానులు తన స్నేహితులే కాబట్టి మరి కొద్దిమంది పిల్లలకు సీట్లు ఇప్పించే విషయం వారితో మాట్లాడతానని హామీ ఇచ్చాడు. ఇంకా తన స్నేహితులకు చెప్పి ఏదో ఒక సహాయం చేసేలా వారిని కదిలిస్తానని చెప్పాడు.

మనం డబ్బురూపంలోనే వారికి సహాయం చేయపనిలేదు. మీరూ, నేనూ, ఇంకా మన స్నేహితులూ ఏ కొందరయినా కనీసం నెలకు ఒక్కొక్కరం పదిరూపాయల చొప్పున అయినా ఇవ్వగలిగితే ఓ పదిమంది చేతులు ఇలా సహాయాన్ని అందిస్తే లభించే వంద రెండువందల రూపాయలతో ఆ పిల్లలకు నిజంగా అవసరమైన స్టేషనరీని, నోట్ పుస్తకాలను, స్కెచెస్‌ను తదితరాలను పంపగలం. ఈ సమాజం చేస్తున్న పాపాలకు వాళ్లు బలవుతున్నారు. మనం కాకపోతే ఇంకెవరు స్పందించగలరు చెప్పండి… మనం రెగ్యులర్‌గా ఇవ్వలేకున్నా, మనం నిస్సహాయులకు పరిమితంగా అయినా సహాయం చేయగల స్థితిలో ఉన్నాం అని గుర్తిస్తే అది ఎంత చిన్న సహాయమైనా సరే వాళ్లకు జీవితాలపై తిరిగి విశ్వాసాన్ని ఏర్పరుస్తుందనే నా ప్రగాఢ నమ్మకం. దానికి చేయూతనిస్తారని ఆశిస్తూ..

మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలతో,

మీ
రాజు.
=========================

—– Original Message —–
From: “Ramesh Babu”
To:
Sent: Wednesday, February 27, 2008 2:05 AM
Subject: Reply For ur Article

Dear Sir

సమాజంలో జరుగుతున్న, జరిగిపోయిన, జరుగబోతున్న అన్యాయాలను, పిల్లలపట్ల ఆప్యాయతను, అనురాగాన్ని పంచాల్సిన పెద్దలే వారి శూన్య భవిష్యత్తును చేజేతులా నాశనం చేయడాన్ని మా కళ్లకు కట్టినట్లుగా… అందరినీ ఆలోచింపజేసేదిగా మీ మనోభావాలు అందరికీ చేరాయని.. చేరాలని కోరుకుంటున్నా..

అయితే మీరు గమనించాల్సింది ఒకటుంది… చిన్నవాడిగా తప్పుగా చెబుతున్నాననుకోకండి.. ఈ దేశం ఏం చేస్తోంది.. వాళ్ల వినాశనాన్ని కళ్లప్పగించి చూస్తోందని మీరు వ్రాసినదాన్ని మాత్రం నేను అంగీకరించలేను.

దౌర్భాగ్యం ఈ దేశానిది కాదండి.. మనది… అన్ని మనలోనే ఉన్నాయి. మనలా సంపాదిస్తూ కూడా ఎలాంటి సంతృప్తి లేని జీవితాలను అనుభవిస్తున్న వారందరిలోను ఉన్నాయి.. అంటే వారందరూ దేశంలోనే కదా ఉన్నారు. అప్పుడు దేశాన్నే కదా అంటే.. ఎలా అవుతుంది. తల్లి మనల్ని కంటుంది.. మన బుద్ధిని కాదన్నది నా అభిప్రాయం. కాదంటారా.. మాస్టారు..

మనలాంటి వారందరూ గనుక పూనుకుంటే.. ఇలాంటి సమస్యలను చాలా తేలికగా కాకపోయినా.. దేశంలో ఇంతటి దౌర్భగ్యాన్ని ఎదుర్కొంటున్న వారందరినీ రక్షించలేకపోయినా.. మునుముందు ఇలాంటి వారి సంఖ్యను మనం నిరోధించవచ్చని భావిస్తున్నాను.

మీరు కళ్లారా చూశానంటున్నారు.. స్వయాన (ఆయన మనసులో ఏముందో మనకు తెలీదు) కాళయ్యలాంటి వాళ్లకు నిజంగా అంతటి సామాజిక స్పృహ, మార్చాలన్న ధ్యేయమే ఉంటే మరొకరిని నిందించక్కర్లేదు. ఎవరినీ చూసి కోప్పడనక్కర్లేదు. ఈ సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయనక్కర్లేదు.

కాళయ్య లాంటి వాళ్లందరూ కలిసి చర్చించి.. ఉపాధి అవకాశాన్ని కల్పించుకుని.. పిల్లలను కూడా ప్రభుత్వ మద్ధతుతో నడిపించవచ్చు. (ఇది విమర్శకాదు… ) అలాగే అది అంత సులువు కాదనుకోండి. కాని చేయాలన్న సంకల్పం మన మనస్సులో వస్తే.. ఆ దేవుడు తప్పక దారి చూపిస్తాడు. అది ఎలాగైనా సరే..

నా ఈ లేఖ విమర్శకాదని ఎరుగవలసినది ప్రార్ధించే..

మీ రమేష్…(M. Ramesh Babu (WD))
===============

థాంక్యూ రమేష్,

ఏ మాత్రం వ్యవధిలేని పోర్టల్ వర్క్‌లో ఉండి కూడా నా కథనానికి ఇంత పెద్ద స్పందనను పంపినందుకు కృతజ్ఞతలు… దాన్ని దయచేసి వెబ్‌దునియా బ్లాగ్‌లోని నా ఆర్టికల్‌ను ఒకసారి తిరిగి ఓపెన్ చేసి నా కథనం కిందిభాగంలో ‘వ్యాఖ్యను జోడించు’ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి అందులో ఈ దిద్దిన నీ లెటర్‌ను పోస్ట్ చేయగలవు. ఇది చాలా అవసరం..

ఎందుకంటే ఆ వసతికేంద్రం పిల్లలూ, నిర్వాహకులూ, కొందరు స్నేహితులూ ఈ కథనాన్ని చూస్తున్నారు. దానిపట్ల సమాజం స్పందిస్తున్న తీరును వారు చూడాలి. వారికి నైతికంగా మద్దతు అందించే వారు ఈ సమాజంలో ఉన్నారని వారికి విశ్వాసం కలగాలి. అందుకే నీ లెటర్‌ను డైరెక్ట్‌గా వెబ్ దునియా వ్యాఖ్యను జోడించులో పోస్ట్ చేస్తే వాళ్లు నీ హృదయ స్పందనను నేరుగా చూడగలరు. నీ మంచి స్పందనను వాళ్లూ పంచుకునేందుకు అవకాశం ఇస్తావని ఆశిస్తూ..

ఇక పోతే నువ్వు ప్రస్తావించిన కాళయ్య కోపం గురించి కొంత వివరంగా….

అనాథపిల్లల సమస్యలో తలమునకలవుతూ ఏం చేయాలి అని సతమతమవుతూ తను సంపాదించే రెండు వేల రూపాయల చిన్న జీతంలో కూడా ఓ రెండు వందల వరకు స్వచ్ఛందంగా ఆ పిల్లలకోసం ఖర్చు పెడుతున్న వాచ్‌మన్ కాళయ్య లాంటి వారి ఆవేశాన్ని మనం సహృదయంతోనే అర్థం చేసుకోవాలి రమేష్.. ఇంతకుమించి వారికి తాము ఏమీ చేయలేకపోతున్నామే అనే బాధ, వాళ్లను ఈ స్థితిలో నిర్దాక్షిణ్యంగా వదలివేస్తున్న సమాజంపై కోపం ఇవన్నీ స్పందించే హృదయం ఉన్న వారి ధర్మాగ్రహం లాగే అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా…. నీ స్పందనను విమర్శిస్తూ ఇలా అనడం లేదు. న్యాయ, ధర్మాల పట్ల పక్షపాతంతో, అనురక్తితో మనం కోపగించుకునే స్వభావానికి సానుకూలాంశమే కాని వ్యతిరేకాంశం ఉండదనే నా అభిప్రాయం…

అభినందనలతో
రాజు.
==============================
Harsha నుండి ఫిబ్రవరి 27, 2008 1:32:15 PM IST

రాజుగారు, మీరు రాసిన ఈ కథనం, క్షమించాలి…. నిజం… మళ్లీ క్షమించాలి పచ్చి నిజం, నిజంగా మనస్సులో ఏదో అలజడిని సృష్టించి, నేను కూడా ఏమైనా చేయాలన్న భావాన్ని పెంచింది. అందువలన మీరు పూనుకున్న ఈ చిన్ని కార్యక్రమానికి నేను కూడా ఉడుతా భక్తిగా సహాయం చేయాలని తపిస్తూ…….

మీ హర్ష
harsha.vardhana@webdunia.net;
————–

నీ ఈ తక్షణ స్పందనకు కృతజ్ఞతలు హర్షా…
అవకాశం వస్తే, ఆ పిల్లలకు చిన్ని చిన్ని సహాయాలు అవసరమయ్యే స్థితి వస్తే ఖచ్చితంగా నీ సహాయం ఎంతో అవసరమవుతుంది. అలాంటి క్షణాల్లో నీ చేయూతను ఆశిస్తూ..

ధన్యవాదాలతో…
రాజు…

కె.రాజశేఖర రాజు.

webdunia.com

చెన్నై

మొబైల్ : +91 9884612596

Email : raju.sekar@webdunia.net

My Another blog

http://raju123.mywebdunia.com/

RTS Perm Link

Leave a Reply

You must be logged in to post a comment.

Packaged by Edublogs - education blogs.

RTSMirror Powered by JalleDa

css.php