ఆకాశంలో సగం….

మైలాపూర్ మార్గంలో వచ్చే 12B బస్సు అంటే నాకు ఎంత ఇష్టమో.. ఎందుకంటే వెస్ట్ మాంబళంలో ఉన్న మా ఆఫీసుకు రోజూ వచ్చేదారిలో పాండీ బజారు వరకు నన్ను తీసుకొచ్చి దింపేది ఈ బస్సే మరి. సకాలంలో నేను రోజు ఆఫీసుకు రావాలన్నా, ట్రాపిక్ రద్దీలో చిక్కుకుని ఆఫీసుకు లేటయినప్పుడు ఉన్న బీపీని మరింతగా పెంచుకోవాలన్నా అంతా ఈ బస్సు పుణ్యమే మరి. దీంట్లో ఎక్కి సీటు దొరికి కూర్చుంటే, ఒక అరగంట పైగా విశ్రాంతిగా ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే, ప్రయాణం సాఫీగా సాగితే చిన్న కునుకు తీయవచ్చు కూడా… 

ఒకరోజు.. యధాప్రకారం బస్సులో ఎక్కాను. సీట్లు ఖాళీగా లేవు. చేసేదేమీ లేక టిక్కెట్ తీసుకుని వెనుకవైపు నుంచి ముందువైపుకు చేరుకున్నా. అప్పుడే సిగ్నల్ పడింది. అప్పుడు కనిపించింది ఆ దృశ్యం..బలిష్టమైన బాడీతో దృఢంగా ఉండే ఆ తెల్లరంగు బస్సులో డ్రైవర్ సీటులో కూర్చున్నది మగాయన కాదు. మహిళా డ్రైవర్.. ఒక మహిళ ఆటో నడిపిన వార్తలు తెలిసినవే. అలాగే ఇటీవల భారతీయ రైళ్ల చోదకులుగా మహిళల ప్రవేశించిన విషయం కూడా కొత్తదేమీ కాదు.  

కాని ఒక మహిళ సిటీ బస్సును నడుపుతున్న ఘటన చూడడం ఇదే కావడంతో కాస్త ఆసక్తి కలిగింది. బతుకు కోసం పోరాటంలో భాగంగా కావచ్చు, మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే మారిన సమాజ చైతన్యంలో భాగంగా కావచ్చు, మహిళా ఉద్యమాల ప్రభావ ఫలితంగా కావచ్చు. కానీ ఇన్నాళ్లుగా అభేద్యంగా, చేరరానివిగా కనిపించిన ఒకానొక పురుషుల దుర్గమ దుర్గంలోకి ఇన్నేళ్ల తర్వాత మహిళ ప్రవేశించింది.  

నాకయితే అదే తొలిసారి కాబట్టి ఈ కుతూహలం కలిగింది కానీ బస్సులో మిగతా వాళ్లు ఈ నూతన డ్రైవర్ విన్యాసాలకు అలవాటు పడిపోయినట్లే అనిపించింది. లెక్కచేయని తత్వానికి, దుందుడుకుతనానికీ మారుపేరుగా ఉండే మగ డ్రైవర్ల స్థానంలో ఆమె అంత పెద్ద బండి ఎలా నడపగలుగుతుందో, అంతమంది మధ్య ఆమె తన నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శిస్తుందో పరిశీలించాలనిపించింది. 

వేషం, ఆకారం, నిశ్చలత్వం, సూదంటి చూపు ఈ అన్ని గుణాలను పరికించి చూస్తే, ద్రావిడజాతి స్త్రీకి సర్వసామాన్యంగా ఉండే పోత పోసిన విగ్రహ రూపం ఆమెది. పురుషాధిపత్యపు కంచుకోటలలోకి గతంలోనూ ఇప్పుడూ ఎంతో మంది స్త్రీలు ప్రవేశించి తమదైన విజయాలను అపూర్వంగా లిఖించి ఉండవచ్చు…సామాజిక నిచ్చెన పై మెట్టులో ఉండి మానవ చైతన్యపు పరిణామంలో భాగంగా అందివచ్చిన అవకాశాలను ఎందరో అగ్రవర్గాల, మేధోవర్గాల మహిళలు అందిపుచ్చుకుని నవీన మహిళాలోకపు ప్రగతికి ప్రతిబింబాలుగా మిగిలి ఉండవచ్చు.  

అలా పురుషుడి కంచుకోటలను బద్దలు కొట్టిన ఎంతమంది వృత్తి మహిళలను దైనందిన జీవితంలో, ప్రకటనలలో చూడలేదు మనం…ఎంతమంది కల్పనా చావ్లాలు, సునీతా విలయమ్స్‌లు, ఇంద్రానూయిలు, మహిళా కెప్టెన్లు, పైలెట్లు, ఎగ్జిక్యూటివ్‌లు, మిలమిలమెరిసే తారలు, మోడల్స్, సహస్ర వృత్తులలో భాగం పుచ్చుకుని తమ తమ జీవన లక్ష్యాలను తాము నెరవేర్చుకోవటంలో శ్రమిస్తున్నారో, స్వప్నాలను లిఖించుకుంటున్నారో మనం నిత్యం గమనిస్తూనే వస్తున్నాం.  

కాని చెన్నైలో దిగువ మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన ఈ బలిష్టురాలు అంతపెద్ద బస్సును, జనంతో కిక్కిరిసిన మైలాపూర్ 12B బస్సును అవలీలగా తోలుతూ కట్ చేస్తూ, సడన్ బ్రేక్ వేస్తూ, రోడ్డుకు అడ్డంగా వచ్చే పిల్లలను నిశితంగా చూస్తూ దాన్ని నియంత్రించగలిగిందంటే చూస్తున్న నాకు అబ్బురమనిపించింది. నాజూకు పనులు, నాజూకు వృత్తులలో నాజూకైన మహిళలు బాధ్యతలు స్వీకరించడం, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడం చూస్తూనే ఉన్నాం.. కాని తొలిసారిగా ఒక అతి సాధారణ మహిళ అంత భారీ బస్సును తోలుతున్న ఆక్షణాలలో నాకు ఒక నిరూపిత సత్యం కొత్త రూపంలో బోధపడింది. అదేమిటంటే డ్రైవింగ్‌కు కూడా ఆడా మగా తేడా లేదనే.. పాంట్, షర్ట్ యూనిఫారంతో సహా ప్రతి కదలికలో ఆమె మగ డ్రైవర్‌కి తీసిపోని రీతిలోనే బండిని తన పట్టులో ఉంచుకుంది.  

మగ డ్రైవర్లతో పోలిస్తే శారీరక కదలికలలో సైతం ఏదైనా తేడా ఉందేమో అని ఆ కాస్సేపూ పట్టి చూశాను. కానీ ఏ తేడా కనబడలేదు. మగ డ్రైవర్ ఎలా ప్రవర్తిస్తే అలానే ఈమె కూడా వ్యవహరించడం గమనార్హం. ప్రయాణీకులు మాట్లాడిస్తే పకపకా నవ్వుతూ (మగడ్రైవర్‌కి అలవాటే కదా) పలకరించడం….ట్రాఫిక్ సిగ్నల్ వద్ద లేటయితే విసుగ్గా వాచీ కేసి పదే పదే చూసుకోవడం….ఇతర వాహనాలతో పోటీపడుతూ బస్సును ముందుకురికించడం, టర్నింగుల్లో సడన్‌గా కట్ చేసి మరీ దూసుకు పోవడం, స్టీరింగును అలవోకగా తిప్పుతూ బండిని నియంత్రించడం, ట్రాఫిక్ సంస్కృతిని ప్లేకార్డుల్లో ప్రదర్శిస్తూ స్కూలు పిల్లలు ఎప్పుడయినా విష్ చేస్తే నవ్వుతూ పలకరించడం…  

ఇలా ఒకటేమిటి పరిసరాలకు అనుగుణంగా మనిషి శారీరక కదలికలకు సంబంధించిన ప్రతి వ్యవహారంలోనూ ఆమె సరిగ్గా మగవాడిలాగే వ్యవహరించింది. ఒకసారయితే చెమట పట్టిన తలలో నొ్వ్వపుట్టిందో ఏమో మరి, ఠకాలున తల గోక్కుంది కూడా..నవ్వాగలేదు నాకయితే… ఇవన్నీ పని విషయంలో ఆడమగకు తేడాలేదనే విషయాన్ని నిరూపించేవే.. అయితే.. ఎక్కడో ఓ మూల చిన్న సందేహం పీకింది. పనికి స్త్రీపురుష వ్యత్యాసాలు లేవు కాని మహిళలకు మాత్రమే సాధ్యమైన కొన్ని విశిష్ట గుణాలు మహిళా డ్రైవర్‌లో లేవా అని ప్రశ్నించుకుంటే ఉన్నాయనే తేలింది.  

ప్రత్యేకించి రోడ్డుకు అడ్డంగా పిల్లలు ఉన్నట్లుండి దాటే సందర్భాల్లో ఏ ప్రమాదం కలగకుండా ఆమె తన నిశిత దృక్కులతో రోడ్డును పట్టి పట్టి చూడడం పిల్లల పట్ల మాతృ మమకారాన్ని చాటి చెప్పిందనిపించింది. బస్సు ఎక్కడ దెబ్బతింటుందో అనిపించేలా అతి సున్నితంగా నడపడంలో, సంపదను భద్రంగా కాపాడే స్త్రీల సహజ గుణమే నాకు స్ఫురించింది. ఎందుకంటే ఇప్పటికీ సంసారంలో కలతలు రేపడంలో, డబ్బును, కుటుంబ సంపదను నిర్లక్ష్యంగా వాడి కుటుంబాన్ని చిక్కులకు గురి చేయడంలో సింహభాగం పురుష పుంగవులదే కదా… 

అలా ఆరోజు ఆ మహిళా డ్రైవర్ పరిచయం అయ్యాక తరచుగా ఆమె నడిపే 12B బస్సులో ప్రయాణించడం అలవాటయింది. ఎందుకంటే అదే సమయంలో నేను ఇంటినుంచి బయలుదేరుతాను మరి. రోజులు గడిచే కొద్దీ ఒక విషయం స్పష్టమైంది. ఏ రోజూ కుదుపులు అనేవే లేనంత సున్నితంగా బస్సులో ప్రయాణించే కొత్త అనుభవం కలుగుతోందిప్పుడు. మగ డ్రైవర్ల దూకుడు వేగం, సడన్ బ్రేక్‌లతో వొళ్లు హూనం కావడం వంటి అనుభవాలు ఏ రోజు కూడా ఈ ద్రావిడ డ్రైవర్ బస్సులో ప్రయాణించేటప్పుడు నాకు ఎదురవలేదు…  

ఒక్కోసారి నాకనిపించేది.. ఇప్పటి కాలానికి, వేగ జీవితానికి సంబంధం లేనట్లుగా మరీ ఇంత సున్నితంగా, నిలకడగా, నెమ్మదిగా ఈమె బస్సు నడుపుతూంటే ఆమె రోజువారీ డెడ్‌లైన్లను (ఐటి పరిభాషలో చావుగీత) ఎలా నెరవేరుస్తుంది అని. ఆమె కూడా డ్రైవరే కదా మరి. రోజుకు డ్యూటీలో ఇన్ని ట్రిప్పులు తప్పనిసరిగా నడపాలి అనే నిబంధనల మయమే కదా ఆమె జీవితం కూడా. నా అనుమానానికి తగ్గట్టే ఒకటి రెండు సార్లు ఆమె డ్రైవింగ్ సమయానికి, మగవారి డ్రైవర్ల సమయానికి కనీసం 5నుంచి 7 నిమిషాల పాటు ఆలస్యం జరిగేది. 

ఇలా ఒక ట్రిప్పుకు అయిదు నిమిషాలు లేటు అనుకుంటే కనీసం ఆమె రోజుకు 7 లేదా 8 ట్రిప్పులు నడపాలి అనుకుంటే ప్రతిరోజూ ఆమె దాదాపు ముప్పావుగంట ఎక్కువగా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఇది ఆమె ఉద్యోగ జీవితానికి ప్రమాదకరం అవుతుందేమో అనిపించింది కూడా.. స్త్రీ పురుషుల సమానత్వాన్ని ఎంతగా గౌరవించినా, గుర్తించినా పురుషుడి సహజాతాలైన దూకుడుతనం, వేగం, మొరటుదనం వంటి లక్షణాలతో ఆడవారు పోటీ పడడం కష్టమే కదా అనే రవ్వంత సానుభూతి కూడా కలిగింది….  

అయితే నా అవగాహన ఎంత  తప్పో తర్వాత తెలిసింది. ఒకరోజు యధాప్రకారంగా ఫోర్‌షోర్ ఎస్టేట్ దాటాక ఎయిర్ టెల్ టవర్‌ను దాటే వంపు బస్టాప్ వద్ద బస్సుకోసం ఆగాను. ఆరోజు రావడం కొంత ఆలస్యం కావడంతో ఆత్రుతగా బస్సుకోసం ఎదురు చూస్తున్నా.. బిపి పాయింట్ కొద్ది కొద్దిగా పెరుగుతోంది నాలో.. ఇంకా రాలేదే, ఆఫీసుకు లేటవుతుందే, వీళ్లింతే.. ఒకేసారి రెండు మూడు వదులుతారు. లేదంటే అసలు పంపించరు అంటూ నిర్వాహకులను తిట్టుకుంటూ నిల్చున్నాను…  

అదిగో ఆసమయంలోనే జిరిగిందా సంఘటన… ఈ స్టాపుకు ముందు ట్రాఫిక్ పోలీసు నిలబడి శాంథోమ్ చర్చి వైపు వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చాడు. వరుసగా బండ్లు కదులుతున్నాయి. స్టాండు వైపు చూస్తుంటే అదిగో రానే వచ్చింది నేనెక్కవలసిన బస్సు. అమ్మయ్య అనుకుని పుట్ పాత్ నుంచి దిగి బస్సు ఆగే చోటికి అడుగేశా. బస్ డిపోనుంచి చర్చి వైపు వెళ్లే బస్సులకు సిగ్నల్ పాయింట్ టైమ్ చాలా తక్కువ కాబట్టి సిగ్నల్ ఒకే అయ్యాక బండ్లు శరవేగంగా దాటుకుంటాయి. మళ్లీ సిగ్నల్ పడుతుంది కాబట్టి.. 

అప్పుడు జరిగిందో సంఘటన.. మా కళ్లలో దుమ్ము రేపిన సంఘటన… జీవితాంతమూ నేను మరవలేని సంఘటన. చర్చికి పోవలసిన బండ్లన్నీ వెళ్లిపోవడంతో ట్రాపిక్ పోలీసు ఇటువైపు బండ్లను ఆపడానికి మెల్లగా చెయ్యి ఎత్తుతున్నాడు.. ఆసమయానికే నేను బస్సెక్కుదామని రోడ్డులోకి అడుగుపెట్టడం… నాముందు మెరుపు మెరిసినంత వేగంగా 12B బస్సు దూసుకుపోవడం ఒకే సారి జరిగింది. నా కళ్లముందు ఏం జరిగిందో అర్థం కాకుండా బిత్తరపోయి చూస్తుండగానే ఆ బస్సు రోడ్డు వంపు దాటేసి పట్టినపాక్కం బస్టాండ్ వైపు దూసుకెళ్లిపోయింది. నాతో పాటు బస్సు ఎక్కడానికి వచ్చిన ఇతరుల పరిస్థితీ అదే… 

తీరా తేరిపారి చూస్తే ఆమే ఆ మహాతల్లే కూర్చుని ఉంది బస్సు డ్రైవింగ్ సీట్లో..ముఖంలో కొట్టొచ్చినంత టెన్షన్…సిగ్నల్ పడుతుందేమోనని ఆత్రుత…మాకు లాగే, ట్రిప్పుల డెడ్‌లైన్లను దాటడంలో అప్పటికే ఆలస్యమయిందేమో తనకు…ఒకవైపు ట్రాఫిక్ పోలీసు మెల్లగా చేయి చాపుతున్నాడు బండ్లు ఆగిపోవాలని సంకేతిస్తూ..అతడికి కూడా అర్థం కానంత కనురెప్పపాటులో బస్సుదాటేసింది.. వంపులో దాటిన ఆ వేగానికి అంత భారీ బండి సైతం అటూ ఇటూ ఊగిపోయిందంటే నమ్మండి.. 

అప్పుడు చూశా.. ఆమె ముఖంలో నవ్వు.. రాజసమైన నవ్వు.. విజయగర్వంతో కూడిన నవ్వు.. కాలంతో పాటు స్థలాన్ని సైతం ధిక్కరించిన నవ్వు…సిగ్నల్ పడుతున్నా ఎలా బస్సును దాటించలేనో చూస్తాననే ధీమాతో కూడిన నవ్వు…ఇదే నవ్వు… ఎవరెస్ట్ పర్వతాన్ని అధిగమించిన తొలిభారతీయ యువతి బచేంద్రీపాల్ ముఖంలో కూడా చూసి ఉంటాం చాలా ఏళ్ల క్రితం. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాను అనే చింత ఒకవైపున ఉన్నా, ముందున్న కంటకాన్ని ఎలాగైతేనేం అధిగమించేశాను గదా అనే మగధీరత్వంతో కూడిన నవ్వు…క్షమించాలి… ద్రావిడ ధీరత్వంతో కూడిన ఆ నవ్వు.. దాని గొప్పతనాన్ని మనం వర్ణించలేం…పోల్చలేం… 

ట్రాపిక్ ధర్మసూత్రాలకు అతీతంగా వెళ్లిన తర్వాత కూడా ఆమె అంతలా విజయహాసం చేసిందంటే బస్సులోపల ఉన్నవారు సైతం నోళ్లు తెరచి ఆ… అని బిత్తరపోవడం కారణం కావచ్చు..ఉయ్యాలలూపే చేతులు స్టీరింగ్ పట్టుకున్న సందర్భాల్లోనూ సాహస ప్రదర్శనకు ఏమాత్రం తగ్గవని నిరూపించినందుకు కావచ్చు…తప్పు చేసినప్పటికీ తన డ్రైవింగ్ వేగంపట్ల తనకున్న నమ్మకం చెక్కుచెదరనందుకు కావచ్చు… ఆమె నవ్వింది. దానికంటే విజయధ్వానం చేసిందంటే బాగుంటుంది.. 

పురుషుడి సహజాతాలైన దూకుడుతనం, వేగం, మొరటుదనం వంటి లక్షణాలతో ఆడవారు పోటీ పడడం కష్టమే కదా అని ఇకముందు ఎవరైనా అనగలరా…అందుకే పనికి ఆడా మగా తేడా ఉండదనేది. చెన్నైసిటీ బస్సులు నడిపే వందలాదిమంది మగ డ్రైవర్లు అలాంటి సమయాల్లో ఏం చేసేవారో సరిగ్గా అదే చేసిందామె. కాస్సేపు ఆగి తదుపరి వంతు వచ్చాక బండిని ముందుకు నడిపిస్తే కొంపలు ఏవీ అంటుకుపోవు. అంత ఆకస్మిక వేగాలముందు అనివార్యంగా ఎదురయ్యే ప్రమాదాలు (రిస్క్‌లు) కూడా తప్పుతాయి.  

కానీ నెలల తరబడి తాను సాగించిన శిక్షణ, కంటి చూపు నైశిత్యానికి, ముందున్న ఖాళీ స్థలంపై అంచనాకు మధ్య క్షణికమాత్రంలో దూసుకెళ్లే తన సామర్థ్యంపై కొండంత నమ్మకం, రోజువారీ అనుభవాల కొలిమిలో రాటుదేలిన మనోస్థైర్యంపై ఆమె ఉంచుకున్న విశ్వాసం ఎంత చక్కగా, విస్పష్టంగా, నిక్కచ్చిగా ఆ క్షణంలో రుజువయ్యాయంటే…అప్పటికే ఎదురు సిగ్నల్ నుండి బయలుదేరిన బండ్లను దాదాపు తాకుతున్నట్లుగా రాసుకుంటూ పోయిన బస్సు… పదార్థం (రోడ్డు)పై అవగాహనకు, వాహన వేగానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. తప్పు మార్గంలో అయినా సరే… తన వేగానికి, విపత్కర పరిస్థితుల్లో, ఆకస్మిక ఘడియల్లో సంభవించే ఘటనలను ఎదుర్కొనే ధీరత్వానికి పరీక్షగా లభించిన ఆ అరుదైన అవకాశాన్ని ఆ ద్రావిడ డ్రైవర్ అద్భుతంగా వినియోగించుకుంది.  

చిన్నప్పుడెప్పుడో కథల్లోనో లేదా మా అమ్మ వొడిలోనూ పడుకుని విన్నా… ఉయ్యాలలూపే చేతులు రాజ్యాలు ఏలగలవు అని. రాజ్యాలు ఏలే మాటేమో గాని అవకాశం అంటూ లభిస్తే, నాలుగ్గోడలు దాటి తన ముందున్న సవాళ్లకు ఎదురు నిలబడితే మహిళలు సాధించనిది అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు.. మానవ సమాజపు వ్యధిత అర్ధాంగం తన లక్ష్య సాధనలో ఇప్పుడేమాత్రం వెనుకబడలేదు. తన రాష్ డ్రైవింగ్‌తో, వాయువేగ మనోవేగాలతో ఆ రోజు సాధించిన వేగ ప్రదర్శనతో ఆమె ఈ సత్యాన్నే ఓ సరికొత్త రూపంలో నాముందు ఆవిష్కరించిందంతే.. 

నాజూకు మహిళల విజయాల చరిత్రే కాదు ఆ 12‌B లాంటి బస్సులను నడిపే అతి సాధారణ శ్రామిక మహిళల దైనందిన జీవితాలు కూడా ఈ సత్యాన్నే అన్ని చోట్లా నిరూపిస్తున్నాయి కదా.. అదే.. పనిలో ఆడా మగా తేడా లేదు, ఉండదు. ఈ సత్యమే రేపు, అన్ని చోట్లా, అన్ని సందర్భాల్లో నిజమవుతుంది కూడా… ఆడంగుల తెలివి మోకాటికిందే ఉంటుందిఅనే పాడుకాలం చెల్లిపోయిందిక…..

RTS Perm Link

One Response to “ఆకాశంలో సగం….”

  1. your greate.

Leave a Reply

You must be logged in to post a comment.

Packaged by Edublogs - education blogs.

RTSMirror Powered by JalleDa

css.php