అనాథ పిల్లలే…
కాని ఎవరు బాధ్యులు?
నాలుగు నెలల తర్వాత ఈ ఆదివారం ఒక ముఖ్యమైన పనిపై తిరుపతికి వెళ్లాను. దాదాపు 16 ఏళ్ల తర్వాత నా ఒకప్పటి స్నేహితుడు కాళయ్యను (గోపీ అని మరోపేరు) కలుసుకోవడానికి వెళ్లాను. నా సహచరి అనారోగ్యాన్ని డాక్టర్‌కు చూపించాలని చేసిన ప్రయత్నం విఫలం కావటంతో – మేము వెళ్లిన సమయానికే ఆ డాక్టర్ వాళ్లమ్మ కాలం చేశారు – దాంతో దొరికిన ఆ సెలవు రోజు ఖాళీ సమయాన్ని నా చిరకాల మిత్రుడిని కలుసుకోడానికి వాడుకున్నాను.
కాళహస్తిలో ఇతర స్నేహితులను కలుసుకుని తిరుపతికి వెళ్లేసరికి మధ్యాహ్నం దాటింది. జీవకోనలో ఉండే గోపీ ఇంటిని వెతుక్కుని పోయాం. మాకోసం అంతవరకూ ఎదురుచూస్తూ అప్పుడే నిద్రపోయాడట. లేపితే నిద్రలేమి కళ్లతో లేచాడు. పదహారేళ్ల తర్వాత మనిషి ఎలా ఉన్నాడని చూస్తే నెరసిన తల, పీక్కుపోయిన ముఖం, గుంటలుపడ్డ కళ్లు మనిషి వాడిపోయినా ఆ చూపుల్లో అప్పటికీ ఇప్పటికీ తగ్గని చురుకుతనం, ఒకప్పటి ఆశయాలను, ఆచరణలను ఏమాత్రం వదులుకోని దృఢత్వం. ఇదీ ఆ అలుపెరుగని బాటసారి నడివయసు రూపం.
బతుకుకోసం సాగించిన అలుపెరగని ప్రయాణంలో 16 సంవత్సరాల క్రితం విడిపోయాం.. తిరిగి కలుసుకోలేక పోయాం. ఈ మధ్యనే ఫోన్ కాంటాక్టు దొరికి మాట్లాడటం జరిగాక వీలైనంత త్వరలో ఈ ఆదివారం కలవడం… ఏం చేస్తున్నావు గోపీ అని ఫోన్‌లో అడిగితే…. చెయ్యవలసిన పనే చేస్తున్నా.. ఒకసారి తప్పక రా… స్వయంగా చూద్దువు గాని అన్నాడు. చివరికిలా కలిశాం.
తన దళిత నేపధ్యానికి సాహిత్య అధ్యయనం జత కావడంతో మట్టిమనుషుల బతుకుల్లో మౌలిక మార్పుకోసం ఆశయంతోనూ, ఆచరణతోనూ జీవితాన్ని ఫణంగా బెట్టిన తరం కాళయ్యది. అంటరానితనం… అవమానాలు, అగ్రకుల అభిజాత్యాలకు వ్యతిరేకంగా తిరగబడిన తరంలోంచి పుట్టుకొచ్చిన తిరుగుబాటు పొలికేక కాళయ్యది. జీవితంలో ఏమైనా మార్పుందా గోపీ…. అని అడిగితే జీవితం మాటేమో కాని తనలో ఏ మార్పూ లేదని నొక్కి చెప్పాడు. పెద్దగా చదువుకోకున్నా పుస్తకాలు అంటే ప్రాణం…
ఆశయాలకు అనుగుణంగా సాగిన జీవితం మధ్యలో అవాంతరాలతో వేరుబాట పట్టినా, గుండెనిండా నింపుకున్న ఆ ఆచరణను మరవలేని కాళయ్య… ఎక్కడున్నా తాను తానే అని నిరూపించిన కాళయ్య… 16 ఏళ్ల తర్వాత కూడా అన్యాయాలకు, అక్రమాలకు, దౌర్జన్యాలకు, సామాజిక దౌష్ట్యానికి వ్యతిరేకంగా గొంతు సడలించని ధిక్కారస్వరం కాళయ్య… ఇన్నేళ్ల తర్వాత సైతం ఎందుకు ఇంత పట్టుదల… రాజీపడి స్వంత బతుకును కూడా కాస్త చూసుకోరాదా అని స్నేహితులు, చుట్టాలు పక్కాలు ఎన్ని సార్లు చెప్పినా, తాను తప్పు చేయనంతవరకూ రాజీపడే ప్రశ్నేలేదని తేల్చి చెప్పిన కాళయ్య…
ఏమాత్రం మారలేదు. ‘అంబేద్కర్ రచనల సెట్ మొత్తం నా దగ్గర లేదు, కొన్ని సంపుటాలు కొనలేదు ఎక్కడైనా ఉంటే చూసిపెట్టవా’ అని మొదలెట్టాడు. అలా అని అంబేద్కరిస్టా అంటే పూర్తిగా అవునని చెప్పేందుకూ వీల్లేదు. కళ్ల ముందు అన్యాయం జరగొద్దు.. జరిగితే చూసి సహించవద్దు.. ఎవరో ఏదో అంటారని భయపడవద్దు. అన్యాయాన్ని ఏదో ఒకలా ఎదుర్కో.. నిస్సహాయులకు చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నించు అనే ఫిలాసఫీ తనది.
అందుకు ప్రేరణనిచ్చే సాహిత్యం ఏదైనా వదలడు. తాను పస్తులున్నా సరే… మంచి పుస్తకం కనబడితే వదలడు. పత్రికలో కనబడిన ఏ వ్యాసాన్ని అయినా ఓపికగా నోట్సులో రాసి భద్రపర్చుకునే అలవాటును మాత్రం అప్పటికీ ఇప్పటికీ వదల్లేదు. పత్రిక ఇవ్వాళ ఉంటుంది రేపు పోతుంది కాని నోట్సు అలా కాదుగా అనే ధీమా…
ఈ మనిషితో వేగలేం బాబూ.. ఇంత మొండితనం పనికిరాదు… మనకెందుకు తనతో తంటా అని నమ్మిన స్నేహితులు, పరిచయస్తులు, బంధువులు సైతం దూరం తొలిగినా, ఎవరూ తన బాధను పట్టించుకోకపోయినా నమ్మనదాన్ని వదలని తత్వం.. మరి తన బాధ వ్యక్తిగతం కాదు.. శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి చలం పేర్కొన్నట్లుగా ప్రపంచం బాధను తనదిగా చేసుకున్నాడు మరి.
అందుకే ఉద్యమాల్లో కొనసాగినా, కొనసాగలేకపోయినా… వ్యక్తిగత జీవితం అనివార్యంగా గడపాల్సి వచ్చినా తాను మాత్రం తన జీవితానికి ఏనాడో విధించుకున్న లక్ష్యంనుంచి వైదొలగలేదు. దాంట్లో భాగంగానే గత పదేళ్లుగా తిరుపతిలోనే మాతమ్మల సంక్షేమ కేంద్రంలో పనిచేశాడు. రైస్ అనే స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో నడిచే సంస్థ అది.. బాలకార్మిక నిర్మూలనా లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టు కింద నడుస్తున్న బాలకార్మికుల నిర్మూలనా వసతి కేంద్రంలో వాచ్‌మన్‌గా ఈ మధ్యే చేరాడు. జీవకోనలోని స్త్రీ శక్తి సంఘటన ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి కేంద్రమిది. జీవకోనలో విశ్వం స్కూల్ ఎదురుగా ఉంటుంది.
ఎవరైతే అణగారిన ప్రజలపట్ల చెరగని ప్రేమ, నిబద్ధతలతో పనిచేస్తారో వారినే ఈ పనిలో నియమించుకోవాలన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ రావత్ సలహా మేరకు, అనాథ పిల్లల సంరక్షణకోసం ఏర్పడిన ఈ వసతి కేంద్రంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ మద్దతుతో చేరాడు కాళయ్య. జీతం రెండువేల రూపాయలు. పని గంటల మాట కొస్తే 24 గంటలూ ఆ పిల్లలను అంటిపెట్టుకుని ఉండాలి.
స్త్రీ శక్తి సంఘటన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టు డైరెక్టర్ సుశీల, కన్వీనర్ నాగిరెడ్డి, కౌన్సెలింగ్, వార్డెన్ సునీత, అకౌంటెంట్ శివ, కల్చరల్ ఆర్గనైజర్ సుబ్రమణ్యం, వాలంటీర్లు వెంకటముని, శేఖర్, పరశురామ్, (తిరుపతి పట్టణంలో అనాథ పిల్లలను గుర్తించి వసతికేంద్రానికి తీసుకువచ్చే బాధ్యతలు), వాచ్‌మన్ కాళయ్య, పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఒక ఆయాగా, వంటమనిషిగా ఇద్దరు మహిళలు, వెరసి అనాథ పిల్లల సంరక్షణ….
ఇదీ ఇప్పుడు నేను చేస్తున్న పని అని మొదలెట్టాడు. నిజంగానే అది అనాథ పిల్లల మహాభారతం… అనాథ పిల్లల సంరక్షణకోసం చక్కటి భవంతిని సమకూర్చిన ప్రభుత్వం పిల్లల తిండి ఏర్పాట్లతోటే ప్రస్తుతం సరిపెడుతోందిట. వారికి కావలసిన ఇతర అవసరాలు అంటే మంచాలు, దుప్పట్లు, పుస్తకాలు, చదువుకు సంబంధించిన ఇతర అవసరాలు వంటివి ఎవరినుంచయినా విరాళాలుగా తీసుకుని నెరవేర్చాలని ఆ వసతి కేంద్ర నిర్వాహకులు ప్రస్తుతం తంటాలు పడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ పిల్లల భారతకథ వింటావా అంటూ కథ ప్రారంభించాడు కాళయ్య.
రాష్ట్రాల సరిహద్దుల దాటుకుని తిరుపతిలో వచ్చిపడిన వీధి పిల్లలు వీరంతా. తల్లిదండ్రుల పంచన బతికే పరిస్థితి తలక్రిందులై కుటుంబానికి, సమాజానికి, దూరంగా దిక్కులేని బతుకు బతికే వీధిపిల్లలు వీరు. కన్నవారి… ముఖ్యంగా తండ్రి ధాష్టీకం, బాదుడు తట్టుకోలేక ఇంటినుంచి పారిపోయి వచ్చేవారు కొందరు. కనడం మాత్రమే తెలిసి పెంచడానికి అవకాశాలు లేని, నిస్సహాయ కుటుంబాల నుంచి విసిరివేయబడిన వారు కొందరు…
బతుకుయాత్రలో భాగంగా ఊళ్లు తిరుగుతూ దురదృష్టవశాత్తూ కన్నకుటుంబం నుంచి తప్పిపోయి వీధులపాలైన వారు కొందరు. ఊరిపేరు తప్ప మరే వివరాలూ తెలీని వారు కొందరు. అన్నిటికంటే మించి ఎయిడ్స్ రోగం పాలై తల్లిదండ్రులు సమాజంచే వెలివేయబడగా, దిక్కూదివాణంలేక, మరో దారి లేక తొలుత వీధుల్లోకి, తర్వాత ఇలాంటి అనాథ పిల్లల వసతి కేంద్రాల్లోకి వచ్చి పడుతున్న దౌర్భాగ్యులు కొందరు.
కనీసం ఈ పరిస్థితుల్లో అయినా వీరు ఇలాగే ఎక్కడో ఒకచోట ఇబ్బందులతో అయినా బతికే పరిస్థితి ఉంటే బాగుండేది. కాని ఇంటినుంచి బయటపడిన తర్వాత వీరు వేసే ప్రతి అడుగూ మానవసమాజంపై పెద్ద నేరారోపణ పత్రంలా తయారవుతోంది. మూడేళ్లు, అయిదేళ్లనుంచి 10 లేక 12 సంవత్సరాల మధ్య వయసుతో ఉన్న వీరంతా ఈ సమాజపు దుష్టత్వానికి బలవుతున్నారు. ఈ మూలా, ఆ మూలా అని కాదు భారతదేశమంతటా వీధిపిల్లల జీవితాలు మొత్తంగా రోగపూరిత క్రమంలోకి నెట్టబడుతున్నాయంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు.
మనం నమ్మగలమా… అయిదేళ్ల వయసునుంచే వీధిపిల్లలు గంజాయి, బ్రౌన్‌సుగర్ తదితర భయానక మత్తుమందుల పాలవుతున్నారంటే నమ్మగలమా? పాలుగారే పసిపాపలు వీధిపాలబడిన నేరానికి, మానవ మృగాలచేత చిక్కి అత్యాచారాలకు గురిఅవుతున్నారంటే నమ్మగలమా? పదేళ్లలోపు వయసు పిల్లలు హోమోసెక్సువల్ అలవాట్లకు బానిసలవుతూ నిర్వీర్యమైపోతున్నారంటే నమ్మగలమా… అనాథలుగా మారిన ఈ వీధిపిల్లలలో మొగ్గతొడుగుతున్న కొందరి ప్రతిభాపాటవాలు ఈ దేశ చరిత్రలో ఎందుకూ కొరగాకుండా మగ్గిపోతున్నాయంటే మనం నమ్మగలమా?
అలా అయితే తిరుపతి పట్టణంలోని జీవకోనలో ఉన్న ఆ బాలకార్మికుల నిర్మూలనా వసతి కేంద్రాన్ని ఒకసారి సందర్శించండి. వాళ్లు మనుషులే. కాని ఈ సమాజదౌష్ట్యం వారి శరీరాలపై పెట్టిన రక్కసి గాట్లను ఒకసారి చూసిరండి.. మీరు మనుషులేనా అంటూ తుపుక్కున ఉమ్మేసే విధంగా చూసే వారి చూపుల్లోని కసిని, కారుణ్యాన్ని ఒకసారి చూసి రండి. తాము చేయని నేరానికి, తమ పెద్దలు పెట్టే హింసకు తట్టుకోలేక పారిపోయినవారిని, కాసింత పొట్టకు ముద్దపెట్టలేక తరిమేసిన కుటుంబాల నిస్సహాయతకు, కాదు కాదు… ఈ దేశపు చేతకానితనానికి పసిప్రాయంలోనే బలయిపోయిన ఆ పిల్లల చూపుల్లో వేదనను ఓ సారి చూసిరండి…
వీళ్లను మనం మార్చగలమా… మార్చలేమన్నదే మా కాళయ్య అభిప్రాయం.. భూమ్మీద బాలకార్మికులు అనబడే వ్యవస్థ ఉన్నంతవరకూ వీరిని మార్చడం సాధ్యం కాదన్నదే తన నిశ్చితాభిప్రాయం… మార్చగలమో లేదో తర్వాతి మాట. వీళ్లు ఇంతకుమించి దిగజారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలన్నదే తన సమస్య. ఆ కేంద్రం సమస్య…. ఆ పిల్లలతోడిదే జీవితంగా లెక్కించుకుంటూ వారు మళ్లీ ఆ భవంతి గేటు దాటిపోకుండా కాపలా కాస్తూ.. వీళ్లనేం చేయాలి అంటూ తల పట్టుకుని కూచునే కాళయ్యకు, గట్లు తెంచుకుని ఎగదన్నుకుంటూ వచ్చే కోపం…. వారిలా తయారైనందుకు కారకులైనవాళ్లను చూపుల్తోనే మాడ్చి భస్మం చేసే కోపం. కానీ ఏం చెయ్యగలడు?
ఏ వ్యవస్థ వారిని అట్లా చేసిందో, ఏ వ్యవస్థ మన గడ్డపై పిల్లలకు కనీస హక్కులు లేకుండా చేసి కన్నవారికి, సమాజానికి అధికారాలు కట్టబెట్టి వాళ్ల జీవితాలను ఇలా మలమలా మాడ్చివేసిందో ఆ వ్యవస్థను నడిపే ప్రభుత్వ అధ్వర్యంలోనే నడుస్తున్న వసతి కేంద్రంలో, పిల్లలను బయటకు పోకుండా కాపలా కాసే కాళయ్య ఏం చేయగలడు?
వీధి బతుకు తప్ప ప్రపంచం మీదే నమ్మకం పోయిన, తమ మీద తమకు నమ్మకంపోయిన ఈ పిల్లల వద్ద సంరక్షకులుగా ఉంటూ వారికి ఎలా నమ్మకం కలిగించాలి? వారి జీవితాలలో తాము మార్పును తీసుకువస్తామన్న నమ్మకం తాము ఎలా కలిగించాలి? జైలుగోడల్లాగా వాళ్లను నాలుగ్గోడల మధ్య బంధించి ఉంచుతున్న తాము, పిల్లల్లో తమ స్వంత బ్రతుకును తాము గడుపగలగమనే నమ్మకం ఎలా కలిగించాలి?
సమాజానికి తాను చేయగల సేవ అంటూ ఇంకా ఏదైనా ఉందంటే ఇక్కడే చేయాలంటాడు కాళయ్య. ఇంత చిన్నవయసులో గంజాయి, భంగు వంటి మత్తుపదార్ధాలకు లోనయిన వీరిని ఎలా బాగుచేయడం. తిండి తప్ప మరో సౌకర్యాన్ని ప్రస్తుతానికి కల్పించలేని ఈ వసతి గృహంలో వీళ్లకు ఏ దారి చూపించాలి? రైళ్లలో చెత్త తోస్తూ, ప్రయాణీకులు ఇచ్చింది తీసుకుంటూ దాంతో తిండి, భంగు కొనుక్కుని బతికేవారు కొందరు, రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ సంచులు, ఖాలీ డబ్బాలు సేకరించి వాటిని కేజీల లెక్కన అమ్మి, వచ్చిందాంతో గంజాయి కొనుక్కునేందుకు పరుగెత్తేవారు కొందరు…
న్యాయంగా తమకు రావలిసింది కూడా ఇవ్వకుండా దోపిడి చేసే యజమానులపై కోపంతో పనివదిలి పారిపోయేవారు కొందరు… తల్లిదండ్రీ పెత్తనం, యజమానుల పెత్తనం, సమాజ పెత్తనం వంటివాటికి దూరమై ఇదే నిజమైన స్వేచ్ఛగా భ్రమిస్తూ సకల వ్యసనాల బారిన పడుతున్న వారు కొందరు… – స్వేచ్ఛకు, విశృంఖలత్వానికి మధ్య వార ఏమిటో పెద్దలం… మనలోనే చాలామందికి తెలీదు.. వారికేం తెలుస్తుంది మరి -
జీవితం అంటే రైల్లో చెత్త తోసి అడుక్కోవడం, ప్లాస్టిక్ సంచులు ఏరుకుని డబ్బులకు అమ్ముకుని జల్సా చేయడం అంటే తినడం, తాగడం, మత్తు పీల్చడం, సినిమా చూడడం, పిల్లాళ్లు ఒకరినొకరు కరుచుకుని ఆనందపడే భయంకర స్థితిని అనుభవించడం తప్ప ఇంకో జీవితం లేనంతగా, తెలియనంతగా వాళ్లు కురచబారిపోయారు. సాధారణ మానవ జీవితానికి ఇంతగా దూరమైన, పరాయితనానికి గురైన వీరికి బయటనుంచి మనం నీతులు చెబితే తలకెక్కుతాయా? అసలు వీళ్లకు నీతులు చెప్పేటంత అర్హత, స్థాయి మన సమాజానికి ఉన్నాయా? ఉంటే, ఇది నీతిమంతమైన సమాజమే అయితే, వీళ్లకు ఇలాంటి జీవితం ఎలా ప్రాప్తిస్తుంది?
ఈ వసతి కేంద్రం సైతం ఇలాంటి అనాథ పిల్లలకు తిండి పెట్టి వసతి కల్పించడంతోనే సరిపెట్టుకుంది కాని ఈ చలికాలాన్ని వాళ్లు ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన జోలికి పోలేదు. ఇందుకు ఈ కేంద్రం నిర్వాహకులను నిందించి ప్రయోజనం లేదు.. ఈ ప్రాజెక్టు తలపెట్టిన కేంద్ర ప్రభుత్వం కనీస వనరులను కల్పించలేకపోతోంది కాబట్టి తిండి, వసతి తప్ప ఇతర సౌకర్యాలను ఎలా సమకూర్చి పెట్టాలి అని ఈ కేంద్రం నిర్వాహకులు అందరూ తపన పడుతున్నారు. కాళయ్య కడుపు మంట ఇక్కడే బద్దలవుతుంది. తిండి, వసతి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి వారి ఇతర అవసరాలు చలికాలంలో కప్పుకోడానికి దుప్పటిలాంటివి అందించకపోతే ఎలా? మూడు నెలలుగా వీళ్లు చలిలోనే కప్పుకోవడానికి గుడ్డ లేక వణుకుతూ నేలమీదే పడుకుంటున్నారు అని విరుచుకుపడతాడు.
అయితే ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో సహా అందరి మీదా వత్తిడి తీసుకువస్తున్నాడు కాళయ్య. చలిబారినుంచి వారిని కాపాడలేనప్పుడు గోడలు కట్టి వారిని బంధించగలమా, వారిని ఈ కేంద్రంలో నిలుపుకోగలమా? చదువులో అద్భుత ప్రతిభా పాటవాలను ప్రదర్శించేవారు ఈ పిల్లల్లో కొందరున్నారు. కనీసం వారికి రాసుకోవడానికి కాగితం, కలం, కార్టూన్‌లు గీయగలవారికి స్కెచ్‌లు, బోర్డులు, పేపర్‌లు వంటివి కూడా కేంద్రం సజావుగా సమకూర్చలేకపోతోంది.
ఏ రకంగానూ చదువురాని, చదువుకోవాలనే ఆసక్తి లేని కొందరు పిల్లలను తప్పక కేంద్రం బయటకు పనికోసం పంపాలి. బాలకార్మికుల నిర్మూలన అంటూనే వాళ్లకు కూడా పనికల్పించాల్సిన పరిస్థితి. పనికల్పించాలంటే వాళ్లను నమ్మి బయటకు పంపాలి. అలా బయటకు పంపిన వాళ్లు నమ్మించి మరీ ఒక రోజు పనిముగిసిన తర్వాత కేంద్రానికి రాకుండా పోయారు. ఇక ఎవరిని నమ్మాలి. ఇంతమంది కాపలా కాస్తూ, సంరక్షణా బాధ్యతలు నిర్వహిస్తూ కూడా పిల్లలు పారిపోతున్నారంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడిని ఎవరు భరించాలి?
ప్రశ్నలు.. అన్నీ ప్రశ్నలే.. పరిష్కారం కనుచూపుమేరలో కనబడని ప్రశ్నలు. ఇదే సిసలైన మానవసేవగా భావిస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయతతో తలపట్టుకోవలసిన స్థితి. కాళయ్య ఇదే అడిగాడు… 16 ఏళ్ల తర్వాత ఇద్దరం కలుసుకున్న ఆనందం కంటే తన కళ్లముందు ఎదురవుతున్న తీవ్ర సమస్యకు పరిష్కారం వైపే తను దృష్టి పెట్టాడు. ఇంటికి రావడం కంటే ఆ వసతి కేంద్రానికి వచ్చి పిల్లలను ఒకసారి చూస్తే బాగుంటుందని ప్రతిపాదించాడు. పై అధికారుల అనుమతి లేకుండా ఎలా రావడం అని నేను సందేహిస్తే, ‘నేనున్నాగా వాళ్లకు చెప్పే కలుద్దువుగాని’ అని పిలుచుకుపోయాడు.
ఆ విధంగా ఆదివారం సాయంత్రం 3 గంటలనుంచి 5 గంటల దాకా ఆ కేంద్రంలో గడిపాం… అక్కడి పరిస్థితిపై ముందే కాళయ్య ఒక అవగాహన కలిగించాడు కాబట్టి, పోతూ పోతూ అక్కడున్న 60 మంది పిల్లలకూ అరటిపళ్లు పట్టుకుపోయాం. అక్కడి పిల్లలను, మనిషిని నమ్మలేని భయానక భీభత్స దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశాక కాళయ్య వాళ్ల గురించి చెప్పింది తక్కువే అనిపించింది. బాలకార్మికులపై, వీధిపిల్లలపై ఈ సమాజం సాగిస్తున్న పాప ఫలితం అంతా అక్కడే పుట్టగా దాల్చిందా అనిపించింది వారిని చూస్తే….
కాళయ్య, సుబ్రమణ్యం, వెంకటముని అక్కడి పిల్లలను పరిచయం చేశారు. వారిలో కొందరితో నేరుగా మాట్లాడించారు. అనంతపురం లోని యాడికి గ్రామం నుంచి, ఖమ్మం నుంచి, ముంబైనుంచి, ఢిల్లీదాకా, ఇంకా చెప్పాల్సి వస్తే నేపాల్ దాకా మానవ సమాజం సాగించిన, సాగిస్తున్న అమానుషత్వానికి ప్రతిరూపాలుగా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన పిల్లలు అక్కడ చేరారు.
వీళ్లకు అరటిపండు ఇచ్చి కాసింత కడుపు నింపడం సమస్యకు పరిష్కారం కాదని తెలుసు. నాలుగు మంచి మాటలు చెప్పి వారిని ఏమార్చవచ్చనుకుంటే అంతకు మించిన నయవంచన మరొకటి లేదని కూడా తెలుసు. వాళ్లకు కావలసింది నీతులు కాదు, మాటలు అసలే కాదు. వాళ్ల తక్షణావసరాలు తీరాలి… ఈ క్షణమే వారికి అందాల్సినవి… చలికి కాచుకోవడానికి దుప్పట్లు, వారిలో చదువుపట్ల ఆసక్తి ఉన్నవారికి తక్షణం అందించాల్సిన పుస్తకాలు. డ్రాయింగ్ షీట్లు, స్కెచెస్ లాంటివి.
తమ తల్లితండ్రులు ఉన్నారో లేరో… ఉన్నా తమను తిరిగి దగ్గరకు తీసుకుంటారో… తీసుకోరో, తమ ఊర్లను తిరిగి తాము చూస్తామో లేమో… బతకడం అంటే ఏమిటో కూడా తెలీని స్థితిలో ఈ అనాథ పిల్లల వసతి కేంద్రంలోకి వచ్చిపడిన వారిని వేధిస్తున్న యక్షప్రశ్నలు ఇవే… అన్నిటికీ మించి ప్రపంచం మీదే వీరు కోల్పోయిన నమ్మకాన్ని ఎలా మళ్లీ వీరిలో కల్పించాలి?
ఎవరో ఎక్కడో పాడిన పాటను విని ఆ బాణీ ఆధారంగా చదువుకు దూరమైన తమ విషాద స్థితిని గురించి హృదయం కరిగేలా పాడేవారు, తాము తిరిగి చదువు కొనసాగిస్తామో లేదో తలుచుకుని విలపించేవారు, సంవత్సరాలుగా బంధాలు తెగిన తర్వాత ఇక్కడ ఈ కేంద్రంలో నిర్వాహకులు కాస్త మనసుకు సన్నిహితం అయ్యేసరికి అకస్మాత్తుగా తల్లిదండ్రులు గుర్తుకొచ్చి వెళ్లిపోతామనేవారు కొందరు… ఇది ఆ వసతి కేంద్రంలో పిల్లల పరిస్థితి.
హుస్సేన్ అనే అబ్బాయి సేలం నుంచి వచ్చాడు. తల్లిదండ్రులు లేరట. అన్న ఉన్నాడు కాని తన గురించి తెలిసినా రాడని బాధ. కిషోర్ అనే ఒక మూగ అబ్బాయి ఢిల్లీనుంచి వచ్చాడు. 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఈ నిర్వాహకులు స్కెచ్ మరియు షీట్ ఇస్తే పర్యావరణంపై నాలుగైదు చిత్రాలు గీశాడు. కాలుష్యం బారినపడిన భూమాత ఏడుస్తోంది అనే అర్థం వచ్చేలా చిత్రం గీసి దానికి ఎర్త్ క్రైయింగ్ (Earth Crying) అనే పేరు పెట్టాడు.
ఆ బొమ్మ చూస్తూనే నాకు కడుపులో ఎక్కడో దేవినట్లయింది. ఎవరి పాపఫలితంగా ఇలాంటి పిల్లలు కుటుంబాలకు, చదువుకు, కళకు, చిత్రలేఖనానికి దూరమైపోయారు? ఎందుకిలా జరుగుతోంది. చివరకు ఇలాంటి వారిని ప్రోత్సహించడానికి తగిన కనీస నిధులు లేని పరిస్థితి. సంస్థాగతంగా వీరికి అందుతున్న మద్దతుకు తోడుగా వ్యక్తులు కనీసం తమ తమ ఖర్చుల్లో కొంత మినహాయించుకుని వీరికి అందించగలిగితే ఈ కేంద్రం పిల్లలకు కనీసపాటి అవసరాలు కొంతలో అయినా నెరవేరతాయి. స్వయంగా ఆ కేంద్రానికి వెళ్లి చూస్తే తప్ప సమాజం ఇలాంటి వారి పట్ల స్పందించలేదేమో…
ముంబై నుంచి ఇక్కడికి వచ్చిన నేపాల్ రమేష్, ఖమ్మంనుంచి ఎల్లయ్య, హైదరాబాద్ నుంచి వచ్చిన పాటల రమేష్… ఇంకా దాదాపు 60 మంది బాలబాలికలు… నిస్సహాయంగా ఎదురుచూస్తూ…. కుటుంబాలకోసం, ఆదరణ కోసం, చదువుకోసం, స్వేచ్ఛకోసం, అందరు మనుషులుగా జీవించేందుకోసం…. ప్రపంచాన్ని నమ్మీ నమ్మని భయానక స్థితిలో ఉంటూ…. ఎదురుచూస్తున్నారు….
ఒక రెండుగంటల వ్యవధిలో ఈ వసతి కేంద్రానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడంలో లోపాలు ఉండవచ్చు…. కాని సంస్థాగతంగా జరిగే కృషితో పాటు వ్యక్తులుగా తలుచుకుంటే, మనం చేసే ఏ పాటి సహాయం అయినా వీళ్ల జీవితాల్లో కాసింత మార్పును తీసుకువస్తుందేమో.. కాళయ్యే స్వయంగా చెప్పినట్లుగా వీళ్లను మార్చడం అలా ఉంచి మళ్లీ ఆ పాతజీవితానికి, ఆ వీధి జీవితానికి, ఆ గంజాయి జీవితానికి పోకుండా చేస్తే చాలు.. అదే పెద్ద మార్పు.
దీనికి మాత్రమే కట్టుబడిపోయిన స్థితిలో, ఆ పిల్లలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన స్థితిలో అప్పటికప్పుడే వాళ్లకు చైతనైన సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. వాళ్లకు తక్షణం కావల్సిన పుస్తకాలు, స్కెచెస్, డ్రాయింగ్ షీట్లకు, అలాగే సగం మందికి సరిపడా దుప్పట్లకు గాను ఒక రూ.1500-00 లను ఈ రెండురోజుల్లో పంపించగలిగాను. తిరుపతిలోనే ఒక మహిళా లెక్చరర్ మిగతా సగంమందికి అవసరమైన దుప్పట్లను ఇస్తామని హామీ ఇచ్చారట. ఇలా ఈ రెండు రోజులలోపే ఆ పసిపిల్లలకు దుప్పట్లు అందనున్నాయి.
సంస్థాగతంగా స్త్రీశక్తి సంఘటన చేస్తున్న కృషి, సేకరిస్తున్న నిధులకు వ్యక్తుల సహాయం కూడా చాలా అవసరం. ఇది వ్యక్తులు తమకు తాముగా పూనుకుంటే తప్ప, హృదయ స్పందనలతో ముందుకు కదలితే తప్ప వ్యక్తుల సహాయం అనేది ఆచరణలోకి రాదు. ఏ అమానవీయ సమాజం ఆ పసిపిల్లలను దేశవ్యాప్తంగా ఇలా తయారుచేస్తుందో, వారి బాల్యాన్ని బలిపెడుతూందో ఆ సమాజంలోని వ్యక్తులే ఆ పిల్లల గురించి కాస్సేపు ఆలోచిస్తే తప్ప ఇది జరగదు.
స్కెచెస్, పుస్తకాలు, డ్రాయింగ్ షీట్లు, తర్వాత ఇప్పుడు దుప్పట్లు ఇవి మాత్రమే కాదు. తమపై తమకు నమ్మకం కుదిరేంతవరకూ, తిరిగి పాతబాటలోకి కొట్టుకుపోకుండా వారు మనుషులను, సమాజాన్ని పూర్తిగా నమ్మేంతవరకు వారికి నిరంతర సహాయం అందాలి. ఒక రోజు, నెల, సంవత్సరం కాలవ్యవధితో ఈ సహాయాన్ని ముడిపెట్టలేం. అన్నిటికంటే మించి వాళ్లకు మేమున్నాం మీకు తోడు నిలుస్తాం, జీవితం పట్ల భయం వద్దు, సమాజంపై అనుమానం వద్దు అని పలకరించే వారి తోడు కావాలి.
మన విలువైన సమయంలో కాసింత వ్యవధిని వీరికి కేటాయించి ధైర్యం చెప్పే మనుషులు కావాలి. వాళ్లు స్కూలు పిల్లలా, యూనివర్శిటీ విద్యార్థులా, లేక ఉద్యోగులా, అధికారులా అని కాదు సమాజంలోని అన్ని రంగాలలోంచి ఇలాంటి పతితులకు, భ్రష్టులకు, బాధాసర్ప ద్రష్టులకు ఆపన్న హస్తం అందించే మానవ హృదయాల అండ కావాలి. ఆ పిల్లలు మనసా వాచా ఇదే కోరుకుంటున్నారు.
మనకున్న కుటుంబ బాధ్యతల్లో, ఇతర జీవన రంగాల్లో కొట్టుమిట్టులాడుతున్నప్పటికీ ఆ పిల్లలకు ఏదో ఒకరకమైన సాయం అందించగలం. వందలు, వేలు అంటూ విరాళాలు మనం ఇవ్వలేకపోవచ్చు… కాని విధివంచితులుగా, సమాజ వంచితులుగా మిగిలివున్న ఆ పసిమొగ్గలకు మనం సహాయపడగలం. మనం పెట్టే రకరకాల ఖర్చులో కనీసం పది రూపాయలను మిగిల్చి వారికి అందించగలిగితే…. వారంలో ఏదో ఒక రోజు జీవకోనలో ఆ స్త్రీ శక్తి సంఘటన ఆధ్వర్యంలోని వసతి కేంద్రానికి పోయి వారికి ధైర్యం చెప్పగలిగితే… కొన్ని నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు లాంటి స్టేషనరీ సామగ్రిని మనకున్నంతలో తీసుకుపోయి వారికి అందించగలిగితే….
మిత్రులారా! ఇలాంటి అనాథలు భారతదేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోటా విస్తరించి ఉన్నారు. అయిదు పదేళ్ల వయసులోనే వారు జీవచ్ఛవాలైపోయారు. మాదకద్రవ్యాల బారినపడి సగం చచ్చిన స్థితిలో ఉన్నారు. వాళ్లను మార్చే ప్రయత్నం అంటూ ఒకటి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. మా కాళయ్య నొక్కి చెప్పినట్లుగా వాళ్లు పూర్తిగా మారకపోయినా ఫరవాలేదు. వాళ్లు మనుషులను, ఈ సమాజాన్ని నమ్మకపోయినా పరవాలేదు. కాని మళ్లీ వాళ్లు ఆ పాత దారిని పట్టకపోతే చాలు… వేయి రూపాలలో విరుచుకుపడుతున్న ఈ సమాజ దౌష్ట్యం బారిన వాళ్లు మళ్లీ పడకపోతే చాలు. దీనికి మనమేం చేయగలం… ఆలోచించండి.
మాకిది కావాలి అని అడగేటంత పరిపక్వత కూడా లేని ఆ పిల్లలు మానవ సమాజం సృష్టించిన భీభత్సానికి ప్రతిరూపాలు… వారిని మీకు తోచిన రూపంలో పలుకరించదలిస్తే… ప్లీజ్… ఈ క్రింది చిరునామాను సంప్రదించండి…
సుశీల
ప్రాజెక్ట్ డైరెక్టర్
స్త్రీ శక్తి సంఘటన
బాలకార్మికుల నిర్మూలన వసతి కేంద్రం
జీవకోన
తిరుపతి.
(లీలామహల్ సమీపంలో)
మొబైల్ – 9394029038 (కాళయ్య, వాచ్‌మెన్. సంస్థకే కాదు పిల్లల జీవితానికి కూడా..)
Nagireddy, Convener : 9959789458
NB: ప్రస్తుతానికి అయితే సంస్థ డైరెక్టర్, తదితర బాధ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు ఈ వ్యాసం రాసే సమయానికి నాకు లభ్యం కాలేదు.
కె.రాజశేఖర రాజు.
webdunia.com
చెన్నై
మొబైల్ : +91 9884612596
Email : raju.sekar@webdunia.net
My Another blog
http://raju123.mywebdunia.com/
Filed under: Uncategorized | No Comments »