జిరాక్సు కాపీ!
కొన్ని రోజుల కిందట ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాటవరసకు మా శ్రీ వారిని అడిగారు “వారాంతంలో ఏమిటి చేస్తూ ఉంటారు” అని. మా వారు వెంటనే తడుముకోకుండా చెప్పారు “జిరాక్సు కాపీ” అని. వాళ్ళు తెల్లబోయి నా వంక, మా వారి వంక వెర్రి చూపులు చూసారు.పాపం వారిని ఇబ్బంది పెట్టడము ఎందుకని అనుకున్నారో ఏమిటో , మా వారు వారికి దాని తాత్పర్యము ఇలా చెప్పారు. పొద్దున లేచిన దగ్గరనుండీ పిల్లల వెంట పడుతూ వాళ్ళకి కావల్సినవి ఏర్పాటు చేయడం , మధ్యలో కాస్త ఖాళీ దొరికితే ఒక చిన్న కునుకు తీయడం ఇదీ మా దినచర్య. వారాంతంలో కూడా ఇది సాగుతుంది. ఆఫీసుకి వెళ్ళము కాబట్టి ఆ దిన చర్య ఇంట్లోనో, లేక పోతే బయటనో జరుగుతుంది , చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే. ఒక రోజుని తీసుకుని దానిని ప్రతి రోజూ జిరాక్సు కాపీ తీయడమే మా పని అని మా వారు సెలవిచ్చారు. వింటున్న వాళ్ళు ఆహా! ఎంత క్లుప్తంగా చెప్పారు సార్! అని మెచ్చుకోలుగా ఈయన వంక చూస్తుంటే, నాకు మాత్రం మా వారు గీతోపదేశం చేస్తున్న శ్రీ కృష్న పరమాత్ముని వలే తొచారు. ముసిముసి నవ్వులు చిందుస్తున్న నా వంక చూసి “ఏమిటీ నవ్వుతున్నావు” అని ఎవరూ అడగక ముందరే నేను అక్కడ నుండి పలాయనం చిత్తగించాను.
అన్నట్టు రోజూ బ్లాగడం చేయాలంటే మా జిరాక్సు కాపీ లో బ్లాగడం అని ఒక లైను జొప్పించాలి అనుకుంటా