అక్షయ పాత్ర – ఆత్మ విశ్వాసం!
ఇంట్లో వంట చేసుకునే ప్రతి మనిషి సమస్య – అక్షయ పాత్రలు. అక్షయ పాత్రలు అంటే ఎంచక్కా వంట చేయకుండా ఎంత మందికైనా భోజనాన్ని సప్లై చేసే పాత్ర కాదు, అసలు అలాంటిది ఏమీ లేదని నా అభిప్రాయం. ఏదో నా లాంటి వారిని మభ్య పెట్టేందుకు సృష్టింపబడిన వస్తువు. అక్షయ పాత్రలు అంటే ఎన్ని సార్లు తోమినా మళ్ళీ మళ్ళీ వచ్చే వంటింట్లోని పాత్రలు.
మామూలుగానే మనకి వంటింట్లోకి వెళ్ళడమంటే చికాకు (తినడానికి అయితే మాత్రం కాదు సుమీ!) చిన్నప్పుడు అమ్మ చిలక్కి చెప్పినట్టు చెప్పేది - వంట నేర్చుకో , పనికి అలవాటు పడు అని! మనం వింటేగా. పైగా పెద్ద పోజు కొట్టి నాకా అవసరం లెదు అమ్మా చక్కగ ఉద్యోగం చేసి సంపాదించి అన్ని పనులకి మనుషులను ఏర్పాటు చేసుకుంటాగా అని గర్వంగా డైలాగులు వదిలేదాన్ని. ఆహా! నీ పని ఇలా ఉందా అని దేవుడు ఇదిగో పని సహాయానికి మనుషులు దొరకని ఈ దేశం లో నన్ను పడేశాడు! సరే అవసరం మనది కదా – తప్పుతుందా ! ఎంతో కొంత వంట నేర్చుకున్నా. కానీ మొన్నీ మధ్య వరకు గిన్నెలని చూస్తే మాత్రం మహా చిరాకు వచ్చేది. అసలే మనకి ఏ పని అయిన కష్ట పడి చేయడం ఇష్టం లేదాయె. అలా అని ఇదేమీ ఇష్ట పడి చేసే పనా అని అదో భావన – మొన్నటి వరకు.
వంటింట్లో ఎలాగూ తప్పదు ఏదో కాస్త విశ్రాంతి కోసం అని ఇలా బ్లాగు మీద పడితే ఇక్కడా అదే గొడవా అని అనుకోకుండా కాస్త ఓపిగ్గా చదవండి.
నాకు పుస్తకాలు చదవడం బాగ అలవాటు.మొన్నీ మధ్యన ఆంగ్లంలో “Time Shifting” అని ఒక పుస్తకం చదివాను. అందులో మన ఈ అక్షయ పాత్రలకు ఆత్మ విశ్వాసంకు పెట్టిన లింకు చూసి బుర్ర తిరిగి పోయింది.మంచం మీద పడుకుని చదివా కాబట్టి సరి పొయింది గానీ లేక పోతే తప్పకుండా కింద పడి పోయేదాన్ని. హాస్యాన్ని కట్టబెట్టి మేటరు లోకి వస్తాను. ఆ పుస్తక సారాంశం నేను రాసిన “ఈ క్షణం” చదివితే అర్ధం అవుతుంది. రోజూ రాత్రి అక్షయ పాత్రలను తోమడం వలన మనము నిదానించడం కుదురుతుంది. అంతే కాకుండా, ఆ సమయంలో మనము ఈ రోజుని సమీక్ష చేసుకోవచ్చు అని రాసుంది. అంతే కాదండోయ్ మన చేతిలో ఉన్న పని, క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా అయ్యే పని కాబట్టి, ఈ అక్షయ పాత్రలను తోమడం ద్వారా మన ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది అని రాసుంది.
ఎంతో చక్కగా – చికాకు పనులను కూడా మన ధ్రుక్పధం మార్చుకుంటే ఎంత చక్కగా చేసుకోవచ్చో - అని రాసిన ఆ మహానుభావుడికి సాష్టాంగ నమస్కారం పెట్టాలనిపించింది.
నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందో లేదో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం ఇక అక్షయ పాత్రల గొడవ తగ్గింది.
sujata Said,
June 23, 2009 @ 10:31 am
….మూహూ … అర్ధం కాలే !
bharat Said,
June 23, 2009 @ 12:27 pm
hmmm.. aithe ee desam lo naa lanti vallu chala mandhi unnaru anamaata
nenu eppudoo naakokadikee ila enduku ayyindho anukuntunna..
final ga ee solution ento naaku artham kaale bahusa pani cheyatam kadaa solution anduke nachale anukunta