Archive for the 'మనసు' Category

చెప్పాలి… గుర్తుండిపోయేలా..!!

పొద్దుట్నుంచీ ఒకటే ఆలోచన
ఏదో రాయాలి, చెప్పాలి
ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి
చెప్పాలన్న విషయంలో స్పష్టత ఉన్నా,
ఎలా ప్రారంభించాలో తెలియని అయోమయం

కానీ చెప్పాలి..
తానున్నంతవరకూ గుర్తుండిపోయేలా
అనుక్షణం గుర్తు చేస్తుండేలా
అసలు మరపు అనేదే ఎరుగకుండా
సూటిగా చెప్పాలి
కానీ ఎలా…?

రోజులా రేపు తెల్లారుతుంది
అదేం పెద్ద విషయం కాదు
ఆ రేపటిలోనే ఎంతో విషయం ఉంది
ఆ రేపటిలోనే ఎంతో జీవితం ఉంది
ఆ రేపటి రోజునే
మా ప్రియమైన పుత్నరత్నం
దేవకన్యలు తోడురాగా
ఈ భూమిమీద వాలిపోయాడు

మావాడి ప్రతి పుట్టినరోజునా
వచ్చే గిఫ్ట్‌లను చూస్తూ.. ఆ దేవుడికి
మనసులో థ్యాంక్స్ చెప్పేస్తుంటా
ఎందుకంటే…
ఆ దేవుడు చాలా పెద్ద గిఫ్ట్‌ను
తన రూపంలో మాకు ఇచ్చినందుకే…

విషయం పక్కదారిపట్టకముందే…
బ్యాచిలర్‌గా చివరి పుట్టినరోజు
జరుపుకుంటున్న ముద్దుల తనయుడా…
పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది అందరూ చెప్పేదే
కానీ పెళ్లంటే…
కొత్తల్లో లోకాన్నే మర్చిపోయేలా ఉండటమూ కాదు
పాతబడేకొద్దీ అనుమానాలూ, అవమానాలూ కాదు
పెళ్లంటే ఇద్దరి మధ్య ఉండే నమ్మకం

పరస్పరం నమ్మకం, ప్రేమాభిమానాలతో
మీ జీవితం నల్లేరుమీద నడకలా
మూడు పువ్వులు, ఆరు కాయలుగా
హాయిగా, ఆనందంగా సాగిపోవాలని
ఇలాంటి పుట్టినరోజులు
మరిన్ని జరుపుకోవాలని
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ…
విష్ యూ హ్యాపీ బర్త్ డే మై డియర్ సన్…!!


(డిసెంబర్ 21న పుట్టినరోజు జరుపుకోబోతున్న మా పుత్రరత్నానికి ఆశీస్సులతో…)

మనిషికి విలువా?

ఆకాశంలో నల్లటి మేఘాల్లాగా
నా మదిలోనూ దిగులు మబ్బులు

అమ్మా..
ఈ లోకంలో పచ్చనోట్లకున్నంత
విలువ మనుషులకు లేదు కదూ..?
రాకెట్‌కంటే వేగంగా మావాడి ప్రశ్న
ఇందాకటి దిగులుకి కారణం ఇదే

మనుషులకూ విలువుందని
అబద్ధం చెప్పలేని నిస్సహాయత
మనిషి సృష్టించిన ఆ నోట్లు
నేడు ఆ మనిషినే ఆడిస్తున్నది నిజం

లేదు నాన్నా…
పచ్చనోటుకంటే మనుషులకే విలువెక్కువని
గొంతు పెగుల్చుకుని చెప్పబోతున్నానా…
ఆస్తి కోసం తల్లినే నరికిన తనయులు
అంటూ… విషయం విషాదమైనదైనా
ముఖంనిండా నవ్వులతో
న్యూస్ రీడర్ వార్తా పఠనం..

ఎక్కడో పాతాళంలోంచి
మనుషులకే విలువెక్కువ నాన్నా
అంటూ నా మనసు ఘోషించినా
పచ్చనోటుముందు
రక్త సంబంధాలు బలాదూర్
వార్తా కథనం పచ్చిగా చెప్పేసింది..

మనసు మూగగా రోదిస్తుంటే..
ఇందాకటి దిగులు మేఘాలు
కన్నీటి జల్లులై…
మనుషులకే విలువుండే రోజులు
తప్పక వస్తాయంటూ…
నన్ను ఊరడించాయి…
ఆరోజులు వస్తాయా…?!

పట్టుకుంటే వదలనుగాక వదలను…!!

నన్నో అంటువ్యాధి అంటుంటారు కొందరు
పట్టుకుంటే ఫ్లూ లా వదలనంటారు మరికొందరు

అదెలాగంటే…

ఎవరి ముఖంలోనైనా నేను కనిపించానంటే చాలు
ఎదుటివారి నుంచి బదులుగా నవ్వులే నవ్వులు…

అలా ఒకరినుంచి ఇంకొకరికి, మరికొందరికి
నేను ఓ అంటువ్యాధిలా అల్లుకుపోయి
ఫ్లూ వ్యాధినై పట్టుకుంటానన్నమాట..

ఓ చిన్నపాటి చిరునవ్వునైన నేను
ఒకరినుంచి మరొకరికి అలా.. అలా…
ప్రయాణించి, ప్రయాణించి
ప్రపంచమంతటా చుట్టేస్తాను…
అంటువ్యాధిలా అల్లుకుపోతానన్నమాట…

పేరుకు అంటువ్యాధి అంటారేమోగానీ…
వ్యాధి లక్షణాలు నాలో ఏమాత్రం లేవు సుమా..
మనుషుల్ని, మనసుల్ని
ఉత్సాహంతో ఉరకలేయించటమే
నా అసలు లక్షణం, లక్ష్యం…
అందుకే.. అందరూ నన్ను
“లాంగ్ లివ్ స్మైల్ ఇన్‌ఫెక్షన్” అంటూ
పెద్ద మనసుతో దీవించేస్తుంటారు తెలుసా..?

ఫీనిక్స్‌లా మళ్లీ తిరిగొస్తానేమో…?!

handheart

వెళ్లాలని లేకున్నా
వెళ్లక తప్పకున్నా
వెళ్ళలేక వెళ్తున్నా…

నా మనసుని నీ నీడలో వదిలేసి
నా కలలను నీ దారిలో పారేసి
నా కన్నీటితో నీ హృదయంలో బొమ్మేసి
నా ఆశలను నీ గుమ్మంలో తుంచేసి
వెళ్లలేక వెళ్తున్నా….

ఒకే పెదవితో మాటలు సాగవని
ఒకే పాదంతో పరుగు సాగదని
ఒకే చేతితో చప్పట్లు మోగవని
ఒకే మనసుతో ముచ్చట్లు తీరవని
నేనే రెండుగా విడిపోయి
వెళ్లలేక వెళ్తున్నా…

అయినా,
వెళ్ళలేక వెళ్తున్నానేగానీ…
నీ మది కడలిని కలిసేందుకు
నది లాగా…
నీలోన దాగున్న నాకోసం
ఫీనిక్స్‌లాగా…
మళ్లీ మళ్లీ తిరిగొస్తానేమో….?!

 

7441 pages viewed, 22 today
2875 visits, 18 today
FireStats icon Powered by FireStats