Archive for August 30th, 2010

వాళ్లెవరూ వెళ్లలేదే.. నువ్వే ఎందుకెళ్లాలి…?

ఉదయంనుంచీ మా చిన్నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో గుర్తులేదుగానీ.. సాయంకాలంగా మళ్లీ ఫోన్ చేశాను..

ఇటువైపునుంచి “ఇప్పుడెలా ఉంది?” అన్నాను..

“అబ్బా.. తల్లీ నేను బాగానే ఉన్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు.. మరీ అంత తిక్క అయితే ఎలా..?” అన్నాడు అటువైపునుంచి..

“అది కాదు నాన్నా.. నీరసంగా ఉందా..? ఏమైనా తిన్నావా..? ఏవైనా పండ్లు, లేదా బిస్కెట్లు తెప్పించుకుని తింటే కొంచెం శక్తి వస్తుంది కదా..” అన్నాను

“అవేమీ అవసరం లేదు.. నేను బాగానే ఉన్నాను. నేనేమైనా పేషెంటునా, నువ్వు మరీ అంతగా ఇదైపోతున్నావు” అన్నాడు కొంచెం కోప్పడుతూ..

“సర్లే నువ్వు కోప్పడకు.. జాగ్రత్తగా ఇంటికి రా.. అది సరే బండి నడిపేందుకు ఓపిక ఉందా..?” అనగానే,

“పిన్నీ.. నేను ఆరోగ్యంగానే ఉన్నా, ఎలాంటి నీరసం లేదు ఇంటికి జాగ్రత్తగానే వస్తాను, ఇంటికి వచ్చాక వివరంగా మాట్లాడదాం..” అన్నాడు.

ఆ తరువాత వంట పని ముగించుకుని, మావాడి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నా..

చూస్తుండగానే చిన్నా వచ్చేశాడు.. రోజూ రాత్రికి ఇంటికి రాగానే తనను అంతగా పరిశీలించి చూడని నేను, ఈరోజు మాత్రం మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తున్నా.. నా చూపుల్ని చూసిన తనకి నవ్వు వచ్చేసింది. అయినా నా కోపాన్ని చూసి ఆపుకుంటూ ప్రెషప్ అయ్యి వచ్చాడు. తినడానికి వేరుశెనగ గింజలు వేయించి పెట్టాను.

గింజల్ని తింటూ ముసిముసిగా నవ్వుతున్న తనతో “నువ్వు చేసేది ఏమైనా బాగుందా చిన్నా..” అన్నాను.

“ఏంటి పిన్నీ, వేరుశెనగ గింజలు తినడం కూడా తప్పేనా, ముందే చెబితే తినకపోదును కదా..” అన్నాడు బుంగమూతి పెట్టి.

“వెధవా జోకులేశావంటే నాలుగు వడ్డిస్తాను” అంటూ చెయ్యి ఎత్తాను.

“అమ్మా తల్లీ శాంతించు.. ఇప్పుడేం కొంపలు అంటుకుపోయాయని పొద్దుట్నుంచీ అలా గాబరా పడిపోతున్నావు..” అన్నాడు సానునయంగా

“అది కాదు నాన్నా.. ఒంట్లో ఒక్క చుక్క రక్తం తయారవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో, ఎంత బాగా తినాలో కదా..!!” అన్నాను

“అయ్యో పిచ్చితల్లీ అదేమంత పెద్ద విషయం కాదు.. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు బాగా తీసుకుంటే ఎంత ఆ రక్తం తిరిగి కొన్ని రోజులకే ఒంట్లో చేరిపోతుంది” అన్నాడు

(ఇక్కడ మీకో విషయం చెప్పాలి.. ఇవ్వాళ ఉదయాన్నే మావాడు ఎవరికో “ఓ పాజిటివ్” రక్తం అవసరం అని వెళ్లి రక్తం ఇచ్చి వచ్చాడు. తను నిన్న రాత్రే నాకీ విషయం చెప్పగానే వద్దని అన్నాను. అయినా వినకుండా తను వెళ్లి రక్తం ఇచ్చేసి, ఓ సర్టిఫికెట్‌తో ఇంటికి వచ్చాడు. దానిమీదే ఇందాకటినుంచి మా ఇద్దరికీ తగవు నడుస్తోంది)

“అయినా చెన్నైలో ఇంతమంది ఉండగా, ఓ  పాజిటివ్ రక్తం నీకే ఉందా.. ఇంకెవరికీ లేదా..? వాళ్లెవరూ వెళ్లలేదే.. నువ్వే ఎందుకు వెళ్లాలి…?” అంటూ వాదనకు దిగాను.

“ఉన్నారు కాదనను.. అయితే ఓ పాజిటివ్ రక్తం ఉన్నవాళ్లందరూ రక్తదానం చేయడానికి అర్హులు కారు.. వాళ్లు పూర్తి ఆరోగ్యంతో ఉండాలి. బీపీ, షుగర్, లాంటి జబ్బులూ ఉండకూడదు. ముఖ్యంగా ఉదయాన్నే రక్తం ఇచ్చేందుకు రాత్రిపూట తాగకుండా (మద్యం) ఉండాలి… లాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి పిన్నీ అర్థం చేసుకో” ఓపికగా చెప్పసాగాడు.

“ఆరోగ్యంగా ఉండేవాళ్లే రక్తం ఇవ్వాలన్నావుగా.. మరి బక్కగా ఉండేవాళ్లు కూడా రక్తం ఇవ్వవచ్చా…?” ఎదురు ప్రశ్నించా.

(చిన్నా మాతోనే ఉంటూ, ఇక్కడే ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పుడూ కంప్యూటర్‌తో తంటాలు పడుతూ కూర్చుని ఉంటాడు. ఆఫీసులో పని ఎలాగూ తప్పదు కదా అనుకున్నా, తను ఇంటికి వచ్చాక కూడా కంప్యూటర్ ఇ-మెయిల్స్, ఛాటింగ్, గేమ్స్ అంటూ ఎప్పుడోగానీ నిద్రపోడు. ఎక్కువసేపు కూర్చుని చేసే జాబ్ కాబట్టి, కాస్త పొట్ట వచ్చింది కానీ.. తన శరీరం మాత్రం బక్కగా ఉంటుంది. దాంతో రక్తం ఇచ్చి వచ్చినందుకు నాకు కాస్త దిగులుగానే ఉంది.)

“తిక్కదానా.. ఎందుకు మరీ ఇంత అమాయకంగా తయారయ్యావు.. కొడుకుపై ప్రేమ ఉండాలేగానీ, మోతాదుకు మించి వద్దు తల్లీ..! ఆరోగ్యంగా ఉండేవాళ్లు సన్నగా ఉన్నా సరే, రక్తం ఇవ్వవచ్చమ్మా…” అన్నాడు నవ్వుతూ..

“ఆహా.. అలాగా..! రక్తం అవసరమైన దాతలకు రక్తదానం చేసి సహాయపడాలని నీలా చాలామంది రక్తం ఇస్తున్నారు సరే.. అయితే నిజంగా రక్తం అవసరమైనవారికే అది చేరుతోందా..? రోజూ పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా.. చాలామంది రక్తాన్ని కూడా అమ్ముకుంటున్నారట కదా..?” వాదనలో కొంచెమైనా తగ్గుతాడని అన్నా..

“సరే పిన్నీ.. నువ్వు చెప్పినట్లుగా రక్తదానం చేసినా, అది చేరాల్సిన వారికి చేరటం లేదని ఒప్పుకుంటున్నా.. అయితే రక్తాన్ని అమ్ముకుంటున్నవారినుంచీ కొనుక్కుంటున్నవారైనా రక్తం అవసరమయ్యే కదా కొంటారు.. అలాగైనా సరే రక్తం అవసరమయ్యే వారికే చేరుతుంది కదా..! అయినా రక్తం ఇచ్చిన వెంటనే దాన్ని అలాగే అవసరమైన వారికి ఎక్కించేయరు. దాన్ని మళ్లీ ఏవేవో ప్రాసెస్ చేస్తారు. అందుకోసం అవసరమయ్యే ఎక్విప్‌మెంట్‌కు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎంతో కొంత ఛార్జ్ చేయటం సహజమే కదా..!” అన్నాడు.

“సర్లే.. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి.. ఓ పట్టాన ఒప్పుకోవు కదా.. ఇప్పటికి ఇచ్చావుగానీ, ఇంకోసారి మాత్రం అలా రక్తం ఇచ్చేసి వస్తే ఊరుకునేది లేదు..” హెచ్చరించా…

“సరే తల్లీ.. ఇక నువ్వు వెళ్లమన్నా వెళ్లను.. ఓ మూడు నెలలు ఆగి ఆ తరువాత వెళ్తాన్లే..!!”

“ఆరి బడవా.. మళ్లీ మూడు నెలల తరువాత వెళ్తావే.. ఏం ఆటలుగా ఉందా..?” అన్నా ఆవేశంగా..

“అవును పిన్నీ.. ఒకసారి రక్తం ఇచ్చాక మళ్లీ మూడు నెలల వరకూ ఇవ్వకూడదట.. ఆ తరువాత మళ్లీ ఇవ్వవచ్చట”

“నాయనా.. ఇప్పటికి చేసింది చాలు.. మళ్లీ నన్ను కంగారు పెట్టకు” అన్నాను బ్రతిమలాడుతూ..

అప్పటిదాకా సరదాగా, ఓపికగా బదులిస్తున్న మావాడు కాస్త సీరియస్ అయ్యాడు.. “నువ్వు మరీ ఇంత సెల్ఫిష్ అయితే ఎలాగ పిన్నీ..! ఇంత పెద్ద నగరంలో ‘ఓ పాటిటివ్ రక్తం’ ఉన్నవాళ్లు ఎంతో మంది ఉండగా నేనే ఎందుకు ఇవ్వాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటే.. పాపం రక్తం అత్యవసరమైన వారి పరిస్థితి ఏంటి..?” అన్నాడు.

“నేను ఇవ్వాళ రక్తం ఇచ్చింది నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఓ మధ్య వయస్సు ఆమెకి.. పాపం వాళ్లకి ఇక్కడి భాష అర్థం కాకపోవటంతో ఎవరైనా దాతలను రక్తం కోసం అడిగేందుకు పక్క బెడ్‌లలో ఉండేవారి సాయం తీసుకుని మరీ ఫోన్ చేయించారు తెలుసా..?”

“ఆమెకి హార్ట్ ఆపరేషన్ జరగాల్సి ఉంది.. ఆమెకి అవసరమైన రక్తం ఇప్పటికే ఒకరు ఇచ్చారు. అది సరిపోక పోవటంతో నాకు కాల్ చేశారు.. ఆమెతో పాటు ఆమె భర్త, కొడుకు వచ్చారు.. హార్ట్ ఆపరేషన్ సక్రమంగా జరుగుతుందో, లేదోనని వాళ్లు ఎంత కంగారుగా ఉన్నారు తెలుసా..? ఎవరో ఒకరు రక్తం ఇస్తార్లే అని అందరూ అలాగే అనుకుంటే.. పాపం ఆమె పరిస్థితి ఏమిటి.. ఓ కొడుకికి తల్లిని, ఓ భర్తకు భార్యను లేకుండా చేసిన పాపం మూటగట్టుకోమా..”

అప్పటిదాకా ఎదురు ప్రశ్నిస్తూ ఉన్న నావైపు నుంచీ ఎలాంటి సౌండ్ రావటం లేదు… మావాడు చెప్పుకుంటూ పోతున్నాడు..

“లివర్ లేక మీ బాబు, సరయిన సమయంలో ఆక్సిజన్ అందక మా బాబు ఈ లోకం విడిచి వెళ్లిపోయిన సంగతి మర్చిపోయావా..?”

“కారణాలు ఏమైతేనేం.. మీ నాన్నను, మా నాన్నను పోగొట్టుకున్నాం, ఇప్పుడు ఆ అబ్బాయికి తల్లిని లేకుండా చేద్దామా..? ఆ పాపం మనకి వద్దు పిన్నీ.. మనలాగా వాళ్లు కష్టపడవద్దు.. అందుకే రక్తం సంతోషంగా ఇచ్చి వచ్చాను.. ఆమెకి హార్ట్ ఆపరేషన్ సక్రమంగా జరిగి, మంచి ఆరోగ్యంతో ఇంటికి తిరిగివెళ్లాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.. నువ్వు కూడా ఆ దేవుడికి మొక్కుకో..!” అన్నాడు తృప్తిగా.

“అయినా అమ్మాయిలతో తిరిగితేనే, చెడు స్నేహాలు చేస్తేనో తిట్టాలిగానీ… నీ కొడుకు ఓ మంచిపని చేసి వచ్చాడు.. దానికి సంతోషపడకుండా ఇలా సతాయిస్తావేంటి తల్లీ…?” అంటూ దగ్గరికి వచ్చాడు.

అప్పటికే నేను మరీ ఇంత స్వార్థంగా తయారయ్యానేంటబ్బా అనుకుంటూ, తల కిందికి వాల్చేసి కూర్చుని ఉన్నా…

“మా చిన్నా దగ్గరికి వచ్చి, నా తలపైకెత్తి.. ఇప్పటికైనా అర్థమయ్యిందా..? ఇంకెప్పుడూ నన్ను రక్తం ఇవ్వొద్దని అడ్డు చెప్పవుకదా..” అన్నాడు.

“వూ.. హూ..” కళ్లతోనే బదులిచ్చా..

“వెరీగుడ్.. మామంచి పిన్నివి కదూ.. అయితే నేను నీ పేరును కూడా ఆన్‌లైన్‌లో రిజిష్టర్ చేసేస్తా.. నువ్వు కూడా రక్తం అవసరమైనవారికి రక్తదానం చేస్తావు కదూ..!” అన్నాడు.

“తప్పకుండా చేస్తా నాన్నా..!! ఇంకెప్పుడూ అంత సెల్ఫిష్‌గా ఉండనుగాక ఉండను, ఇప్పటికైనా నా కళ్లు తెరిపించావు..” అంటూ మా చిన్నాని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అన్నం వడ్డిస్తానంటూ వంటింట్లోకి అడుగులేశాను.

(పైన చెప్పినదాని సారాంశం మీకందరికీ ఇప్పటికే అర్థం అయ్యే ఉంటుందనుకుంటున్నా.. నిజంగా ఈ సమాజంలో నాలాంటి చాలామంది స్వార్థంగా ఆలోచిస్తుండటం సహజమే. తాను, తనవాళ్లు బాగుంటే చాలనుకునే స్వార్థం నుంచి బయటపడి, ఆపదలో ఉన్నవారికి, సహాయం కావాల్సిన వారికి మన చేతనైనంత సాయం చేయడంలో ఉన్న తృప్తి అంతా, ఇంతా కాదని ఈరోజు మా చిన్నాని చూస్తే నాకు అర్థమైంది.. అది మీతో పంచుకుందామనే ఇలా…)

RTS Perm Link

RTSMirror Powered by JalleDa