నువ్వులేవు.. నీ జ్ఞాపకాలున్నాయి..

కొందరు సుఖాల్లోనే తారసపడతారు
మరికొందరు కష్టాల్లోనూ చేయూతనిస్తారు
నువ్వు మాత్రం ఎప్పుడూ చెంతనే ఉంటావు
కళ్లు మూసినా, తెరచినా
నిద్రపోయినా, మేల్కొన్నా
నవ్వినా, ఏడ్చినా
ఎక్కడ ఉన్నా, ఏం చేసినా
నా ప్రతి కదలికలోనూ
చిరునవ్వుతో జీవిస్తుంటావు

కానీ.. నువ్వు దగ్గరున్నప్పుడు
నీకు ఏవంటే ఇష్టమో, నీకేం కావాలో
నీకంటూ ఇష్టాయిష్టాలున్నాయో, లేదో
ఏవీ.. ఏవీ..
తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు
ఇప్పుడు.. నువ్వు లేని ఈ జీవితంలో
ప్రతిరోజూ, ప్రతి పనిలోనూ
తనకు ఇదంటే ఇష్టమో కాదో
ఇవన్నీ తనకు కావాలనిపించేదో ఏంటో
ఎప్పుడూ అడిగినవన్నీ అమర్చటమేగానీ
నోరు తెరచి ఇది కావాలని అడగలేదే..?
ఆలోచనలు మది గట్లు తెంచుకుంటాయి

అంతే…
నోటిదాకా వెళ్లింది, గొంతులో అడ్డుపడుతుంది
చెంపలపై వెచ్చని కన్నీరు
చేతిలో బొట్లుగా రాలుతుంటే
ఆ కన్నీటి బొట్లను
చిరునవ్వులు చిందించే నీ పలువరుసలో
ముత్యాలుగా మార్చి
నవ్వుతూ ముందుకు నడిపిస్తావు
నువ్వో జ్ఞాపకం అనుకున్నా..
నిజమై నాకు ఊపిరి పోస్తున్నావు….

—- ఎప్పటికీ తిరిగిరాని నాన్న కోసం…


RTS Perm Link

2 Comments so far

  1. parimalam on June 24th, 2010

    మిత్రమా ! ఎవరో కవి అన్నట్టు …….జ్ఞాపకాలే ఓదార్పు !

  2. kaarunya on June 27th, 2010

    ధన్యవాదాలు పరిమళంగారు..

    చాలా లేటుగా స్పందిస్తున్నందుకు మన్నించాలి. వేరే పనుల్లో బిజీగా ఉండి బ్లాగును చూడలేకపోయా.

    అవునూ.. చాన్నాళ్లుగా మీ పలుకరింపే లేదు.. ఏమైపోయారు…

Leave a reply

RTSMirror Powered by JalleDa