Archive for May, 2010

కోతికొమ్మచ్చి ఓడి(పారి)పోయింది…!!

కోతికొమ్మచ్చి ఓడిపోయిందా…!? ఎందుకని..? అసలు ఈ కోతికొమ్మచ్చి గొడవేంటని అనుకుంటున్నారు కదూ…? కంప్యూటర్ గేమ్‌లు, వీడియో గేములు తప్ప.. పల్లెల్లో, పంటచేలల్లోని చెట్ల కొమ్మలపై చేరి గంతులేసి ఆడుకునే కోతికొమ్మచ్చి ఆట ఈనాటి స్పీడ్ యుగపు చిన్నపిల్లలకు తెలియకపోవచ్చు.

మా చిన్నతనంలో వేసవి సెలవులొస్తున్నాయంటే ఎగిరి గంతేసేవాళ్ళం. అమ్మమ్మ, నానమ్మల ఊర్లకు ఉరుకు పరుగులతో వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ పిల్ల కాలువల్లో, పొలాల మధ్యన స్నానాలు చేయడం, ఎండిపోయిన పొలాల్లో ఆటపాటలతో గంతులేయటం, అమ్మమ్మ తాతయ్యల వద్ద గారాలు పోవడం… రాత్రి నిద్రపోయేటప్పుడు పేదరాశి పెద్దమ్మ కథలు చెబుతుంటే మెల్లగా నిద్రలోకి జారుకోవడం… లాంటి తియ్యటి జ్ఞాపకాలను మనసుల్లో ఇప్పటికీ నింపుకున్న తరం మాది.

కానీ ఈ తరానికి ప్రతినిధులైన పిల్లల వీడియో గేములతో మా తరానికి చెందిన కోతికొమ్మచ్చి ఆట ఓడిపోయింది. పిల్లలకు తీరికలేని వేసవి సెలవుల్లో పేదరాశి పెద్దమ్మ ఇంటికెళ్ళిపోయింది. ఆమె కథలన్నీ కంచికి వెళ్లిపోయాయి. ఇక చందమామ మీది నల్లమచ్చల కథ సంగతి సరేసరి. ఆ కథ చెప్పేదెవరు..? వినేదెవరు?

ఏయేటికాయేడు వేసవికాలాలు వస్తున్నప్పటికీ పిల్లలకు సెలవులు మాత్రం రావడం లేదు. వారి తల్లిదండ్రులు ప్రత్యేక శిక్షణలు, కోచింగులంటూ వారి అందమైన బాల్యాన్ని చిదిమివేస్తున్నారు. ఉరకలు వేసే ఉత్సాహం, అలసట తెలియని ఆటపాటలు, హద్దుల్లేని ఆనందం నిండిన పిల్లల సొంత సామ్రాజ్యాన్ని అవి దురాక్రమించేస్తున్నాయి.

ఒకప్పుడు వేసవి సెలవులివ్వగానే చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి సొంతవారి ఊళ్లలో వాలిపోయేవారు. బంధువుల సందడి, చుట్టుపక్కల పిల్లలతో సరదాలు, పెద్దవాళ్ళతో ముద్దు ముద్దు మాటలు, బోలెడన్ని చిరుతిళ్ళు, తిరుగుళ్ళలతో ఉత్సాహంగా కాలం అట్టే గడచిపోయేది.

కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. పిల్లలకు కాల “పరీక్షలు” ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, జీవనోపాధికి పట్టణాలకు పరుగు, అక్కడున్న పోటీ ప్రపంచం లాంటివి పసిబాల్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ విషయాన్ని మానసిక నిపుణులు స్పష్టం చేస్తూ… చదువులు, ఆటపాటలలో ముందుండాలన్న పిల్లల ఆలోచనను, ఆసక్తిని పట్టించుకోకుండా, వేసవిలోనూ లేనిపోని శిక్షణలు ఇప్పించడం వారి అందమైన బాల్యాన్ని చిదిమివేస్తోందని అంటున్నారు.

ప్రస్తుత పోటీతత్వానికి అనుగుణంగా పిల్లలను తీర్చిదిద్దుకోవాలన్న తపనతో వేసవిలో కూడా పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్యూషన్లు చెప్పిస్తున్నారు. పైగా క్లాసుకు ఫస్ట్ రావాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదని వారు చెబుతున్నారు. అలాగే… విద్య కూడా వ్యాపారం లాగా మారిపోవడం, కుప్పలు తెప్పలుగా స్కూళ్లు, కాలేజీలు రోజుకొకటి తయారవుతుండటం వల్ల కూడా ఈ పోటీతత్వం పెరిగిపోతోంది.

దీంతో తమ స్కూలు నుండి విద్యార్థి జారిపోకూడదన్న ఆలోచనతో చాలా ప్రైవేటు యాజమాన్యాలు చిత్రలేఖనం, ఆంగ్ల భాషలో తర్ఫీదు లాంటి కోర్సులను వేసవి శిక్షణ పేరుతో ముందే ఫీజులు కట్టించుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు వేసవిలో అమ్మమ్మల, తాతయ్యల దగ్గరికెళ్లే పిల్లలను దూరం చేస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితాన్ని కాస్తంత పక్కనబెట్టి పచ్చని పల్లెటూళ్ళలో సేదదీరాలనుకోవడం ఓ స్వప్నం మాత్రమే అని అనుకోవడం బాధాకరమే కాకుండా, అది అనారోగ్యకరమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాబట్టి… వేసవిలో పాఠశాలలను నడపడం సరికాదు. ఇది అత్యంత ప్రమాదకరమైన పోకడ కాగా, దీనిపై  ప్రభుత్వం స్పందించకుంటే భావితరాలు ఎంతో నష్టానికి గురవుతాయి. వేసవి సెలవుల్లో కూడా పిల్లలు కొంతకాలం హుషారుగా గడపకుంటే తరువాతి తరగతుల్లో వారు ఆసక్తిగా చదవలేరు.

ఏడాది మొత్తంమీదా చదివే చిన్నారులు క్రమంగా ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం… తద్వారా దీర్ఘకాలంలో వెనుకబడలాంటివి జరగవచ్చు. ఆ కోర్సులు, ఈ కోర్సులు అంటూ వారిపై ఒత్తిడి తెస్తే… చదువంటేనే ఏవగింపు కలిగే ప్రమాదం ఉంది. దీంతో మానసికపరమైన ఇబ్బందులు కూడా ఏర్పడతాయి, స్కూలు ఫోబియా లాంటిది పెరగవచ్చు. కాబట్టి… పిల్లలను వేసవి సెలవుల్లోనైనా స్వేచ్చగా, హాయిగా ఆడుకోనిద్దాం. వారికి మాత్రమే సొంతమైన బాల్యాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం…!