నువ్వు లేని ఊరు.. నీ మాటల్లేని ఇల్లు…!!

 

child_hands

పొద్దుట్నుంచీ వచ్చే ప్రతి బస్సునూ
అందులో రాబోయే తన మనిషినీ
రెండు కళ్లు వెతుకుతూనే ఉన్నాయి
నిమిషాలు, గంటలు గడుస్తున్నా
రావాల్సిన మనిషి రాలేదు
రెండు కళ్ల వెతుకులాట ఆగనూ లేదు

సూర్యుడు నడినెత్తికి వచ్చినా
మనిషి రాలేదు, చూపులు ఆగలేదు
ఎట్టకేలకు…
రావాల్సిన మనిషి బస్సు దిగ్గానే..
రెండు కళ్లూ తృప్తిగా, సంతోషంగా
అటువైపు పరుగులు తీశాయి

పొద్దుట్నుంచీ ఎదురు చూస్తున్నా..
ఇప్పుడా రావటం….?
ప్రశ్నించాయి ఆ కళ్లు

అదెంటీ.. నేను ముందే చెప్పానుగా
ఈ టైంకే వస్తానని
మరెందుకలా పొద్దుట్నుంచీ చూడటం
అవతలి కళ్ల ఎదురు ప్రశ్న..?

నీకేంటి అలాగే చెబుతావ్…
మా ఆరాటం మాదీ..
నా రక్తంలో రక్తం నన్ను
చూసేందుకు వస్తుంటే
తొందరగా చూడాలని ఉండదా మరి..?

తిరిగి ఊరెళ్తుంటే…
అప్పుడే వెళ్లాలా అంటూ
అవే కళ్లు మళ్లీ వేడుకోలు
తప్పదు మరి.. మళ్లీ వస్తాగా అంటే,
భారంగా వర్షిస్తూ ఆ కళ్ల వీడ్కోలు

చాలా సంవత్సరాలు ఇలాగే…

కానీ ఈరోజు..
నా కోసం ఎదురుచూసే
ఆ రెండు కళ్ల కోసం
రోజుల తరబడీ ఎదురుచూస్తున్నా
ఆ కళ్ల జాడ కనిపించటం లేదు

ఎదురుచూపులు, వీడ్కోళ్లతోనే
అలసిపోయిన ఆ కళ్లు…
శాశ్వత విశ్రాంతి కోసం
రక్తంలో రక్తాన్ని వదిలేసి
అందరాని దూరాలకు
ఆనందంగా వెళ్లిపోయాయి

ఇప్పుడు నా కోసం
వెతుకులాడే కళ్లు
ఎదురుచూసే ఆ మనిషి
వేడుకోల్లు, వీడ్కోళ్లు
ఏవీ ఏవీ లేనే లేవు…

కనిపించకుండా పోయిన ఆ కళ్లు
ఎవ్వరికీ, ఎప్పటికీ కనిపించవు
అయినా…
కనిపించే తన ప్రతిరూపమైన నాకు
ఎప్పుడూ చూపునిస్తూనే ఉంటాయి…..!!

(నవంబర్ 7, 2009న అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మరణించిన మా “నాన్న”గారికి కన్నీటితో…..)

RTS Perm Link

10 Comments so far

 1. nelluru on November 20th, 2009

  మీరు పెట్టిన చిత్రం మాత్రం నన్ను ఏక్కడో తాకింది మరియు మీరు వ్రాసినది కూడా
  కళ్ళ నుంచి నీరు ఒక్కటే తక్కువ
  మీరు పెట్టిన ఈ చిత్రాన్ని నా బ్లాగులొకి అప్లోడ్ చెసుకుంటున్నాను
  మీకు అభ్యంతరం లేకపొతెనే సుమా
  అభ్యంతరం ఏమన్నా ఉంటే చెప్పండి నేను నా బ్లాగు నుంచి తీసివేస్తాను

 2. chinni on November 20th, 2009

  అయ్యో !ఈ లోటు తీరనిదండి..సారీ. .చాల బాగా ఎక్స్ప్రెస్స్ చేసారు

 3. nnmuralidhar on November 20th, 2009

  awesome work. ila nocho ledo teliyadu but superb expression

 4. Phani on November 20th, 2009

  హృదయాని కలిచివేసింది.
  కారుణ్య గారు ఇలా జరగడం చాలా బాధాకరం.
  మీకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

 5. kaarunya on November 20th, 2009

  @ ఫణిగారూ,
  @ మురళీధర్‌గారూ,
  @ చిన్నీగారూ,
  @ నరేష్‌గారూ…. మీ అందరి సహానుభూతికి నా ధన్యవాదాలు.

  నరేష్‌గారూ.. మీరు నిరభ్యంతరంగా ఈ కవితకు వాడిన ఫొటోను వాడుకోవచ్చు. అది నా సొంతం ఏమీ కాదు.. మనందరి సొంతమే.. ఎందుకంటే, అది నేను గూగుల్‌లో సెర్చ్ చేసి తీసుకున్నదే…!

 6. selvi on November 20th, 2009

  చాలా బాగుందండీ.. కన్నతండ్రి ప్రేమను కళ్లలో కట్టారు. తండ్రి ప్రేమ ఈ ప్రపంచంలో ఎనలేనిదని ఈ కవిత ద్వారా చెప్పేశారు.హ్యాట్సాఫ్…

 7. bonagiri on November 21st, 2009

  ఈ జీవన వలయంలో తండ్రి పాత్రలోకి మీరు, మీ పాత్రలోకి మీ బిడ్డ మారతారు.
  అంతే. అంతకంటే ఏమీ లేదు.

 8. parimalam on November 24th, 2009

  చేయిపట్టి నడిపించిన దైవం …
  సుదూరతీరాలకు పయనమైతే
  కన్నీటి వీడ్కోలు తనదారికి …అవరోధాలు కావూ
  ఆయన పంచిన అనంతమైన ప్రేమ
  మీ జ్ఞాపకాల తోటలో ఎల్లప్పుడూ
  పరిమళిస్తూనే ఉంటుంది
  మీ జ్ఞాపకాల్లో ఆయనజీవించే ఉంటారు !
  మిత్రమా!బోనగిరి గారు చెప్పింది అక్షరసత్యం !

 9. kaarunya on November 25th, 2009

  పరిమళంగారూ, బోనగిరి గారూ… మీ ఆప్త వాక్యాలకు నా ధన్యవాదాలు

 10. vijay on December 14th, 2009

  నాన్న ఎదురుచూపులు లేవని బాధపడకు. నాన్న మన ప్రతిరూపమై ఉన్నాడు.

Leave a reply

RTSMirror Powered by JalleDa