Archive for June, 2009

కల కానిది… నిజమైనది…!!

dream1

నా కల
తిరిగిరాని బాల్యం కోసం
అమ్మమ్మ చెప్పే కథల కోసం
తాతయ్య తెచ్చే మిఠాయిల కోసం
పంట కాలువల్లో… యేటినీళ్ళలో
అమ్మ కొంగుతో చేపల్ని పట్టేందుకోసం
తమ్ముళ్లతో చేసిన అల్లరి కోసం
నాన్న చెంపపై ఇచ్చిన గుర్తుల కోసం
అదే చెంపపై ఇచ్చిన ముద్దుల కోసం

***** *****

నా కల
శాంతించిన సూర్యుడి కోసం
నాట్యం చేసే చినుకుల కోసం
రైతన్నల కళ్లల్లో వెలుగు కోసం
అమ్మ ముఖంలో నవ్వు కోసం

***** *****

నా కల
తుపాకులు లేని రాజ్యం కోసం
యాసిడ్ దాడుల్లేని రోజు కోసం
నిజమైన రాజకీయాల కోసం
ప్రశాంతంగా బ్రతికే జనాల కోసం
ఎళ్లవేళలా పరితపించే శాంతి కోసం

***** *****

నా కల
స్వార్థం లేని మనుషుల కోసం
కల్మషం లేని నవ్వుల కోసం
ఎల్లలు లేని సంతోషం కోసం
బతుకంతా పెనవేసే స్నేహం కోసం
చివరిదాకా అంటిపెట్టుకునే ప్రేమ కోసం

***** *****

నా కలలన్నీ…
వెచ్చనివే… కానీ తడిగా ఉంటాయి
ఊహలే… కానీ సృజనాత్మకమైనవి
జ్ఞాపకాలే… కానీ ఉల్లాసాన్నిస్తాయి
సాధారణమైనవే… కానీ ఆలోచింపజేస్తాయి
కలలు, జ్ఞాపకాలు అన్నీ నావే… కానీ
వాస్తవ ప్రపంచం మనందరిదీ….!!

RTS Perm Link

హితుడా.. స్నేహితుడా.. స్వాప్నికుడా..!

sm3

నువ్వెప్పుడూ నా నేస్తానివే
అవును…
కొన్నిసార్లు నీతో పిచ్చిగా ప్రవర్తిస్తుంటా
నువ్వు కూడా అంతేలే…

                ***

ఎందుకలా అవుతోందో
కొన్నిసార్లు అర్థమైనట్లే ఉంటుంది
కానీ…
చాలాసార్లు అసలు అర్థమేకాదు

                ***

అయినా ఒకటి మాత్రం నిజం
ముందుగా నేనే నిన్ను క్షమించేస్తుంటా..
ఎందుకంటే….
నేనూ, నువ్వూ వేరు కాదు కదా..!
 

                ***

నువ్వు లేని రోజుల్లో…
పోనీలే పాపం అంటూ
ఒంటరితనంపై జాలిపడి
స్నేహం చేశాను గానీ
నీతో ఉన్నంత హాయి లేదు నేస్తం…!

                ***

మనవి రెండు శరీరాలేగానీ,
ప్రాణం మాత్రం ఒక్కటేనని
అన్నానే అనుకో…
అయితే మాత్రం,
నువ్వలా వెళ్తూ, వెళ్తూ
నా ఉనికిని కూడా తీసుకెళ్లటం
భావ్యమా చెప్పు…?!

                ***

నన్ను నేనే గుర్తుపట్టలేని స్థితిలో
ఎన్నాళ్లని ఉంటాను నేస్తం…?
అందుకే…
నేనూ నీ దగ్గరికే వచ్చేస్తున్నా….!!

                ***

RTS Perm Link

చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా..!!

kkd1

ీవితం అంటే.. ఛాయిస్‌ల మయం
అందుకే సరైనదాన్ని ఎంచుకో
ఇతరులతో పోలికా.. వద్దు, వద్దు..
నీ మనసే ఒక వేదం.. ఒక నిజం
అలా అనుకుంటేనే…
గెలుపు అవుతుంది శాశ్వతం

        *    *     *    *    *

నీదైన దృష్టిని, నీవైన అభిప్రాయాలను
అమాంతం మార్చేసే మాటలవైపుకి
హృదయాన్ని చేరువగా తీసుకెళ్లకు
జీవితం నేర్పిన పాఠాలను స్మరించుకో
గమ్యంవైపు నిశ్శబ్దంగా నడచిపో

        *    *     *    *    *

ఎవరి కోసమూ నువ్వు మారకు
అయితే, నీ కోసం నువ్వు మారాలి
శరీరంలోని ప్రతి అంగమూ
నీదైనప్పడు..
మనోదృష్టి, భావపరంపరలు
కూడా నీవే కదా…
వాటిల్లో పరుల జోక్యమెందుకు..?

        *    *     *    *    *

నీ దృష్టిలోనూ, అభిప్రాయాల్లోనూ
నీదైన ముద్ర ఉన్నప్పుడు
నిన్ను నిన్నుగా ప్రేమించేవారు
ఎప్పుడూ నీ వెంటే ఉంటారు
నిన్నెప్పుడూ ఒంటరిని చేయరు

ఏం…? నమ్మకం కలగటంలేదా..?

అయితే.. ఓసారి అద్దంలోకి చూడు…!! 

        *    *     *    *    *

RTS Perm Link

RTSMirror Powered by JalleDa